600 ఏళ్ల నాటి చర్చి.. కుప్పకూలింది
600 ఏళ్ల నాటి చర్చి.. కుప్పకూలింది
Published Mon, Oct 31 2016 8:19 AM | Last Updated on Mon, Sep 4 2017 6:48 PM
ఇటలీలో కనీవినీ ఎరుగని స్థాయిలో వచ్చిన భూకంపం.. అక్కడ పెను విలయాన్ని సృష్టించింది. ఈ భూకంప ప్రభావానికి 600 సంవత్సరాల నాటి సుప్రసిద్ధ బాసిలికా చర్చి కూడా నేలమట్టం అయ్యింది. దాదాపు మూడు వేల మందికి పైగా ప్రజలు నిరాశ్రయులయ్యారని జాతీయ పౌర సంరక్షణ సంస్థ తెలిపింది. అయితే అదృష్టవశాత్తు ఇంత పెద్ద ఎత్తున భూకంపం వచ్చి, భవనాలు కూలిపోయినా ప్రాణనష్టం మాత్రం మరీ అంత తీవ్రంగా లేదు. అయితే చాలా భవనాలు శిథిలం అయిపోయాయని, చారిత్రక కేంద్రాలు కూడా పాడయ్యాయని, ప్రస్తుతం అక్కడ విద్యుత్తు, నీటిసరఫరాలకు తీవ్ర ఇబ్బందిగా ఉందని పౌర సంరక్షణ సంస్థ అధినేత ఫాబ్రిజియో కర్షియో తెలిపారు. మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో (భారత కాలమానం ప్రకారం) భూకంపం రావడంతో.. చాలామంది ప్రాణాలు రక్షించుకోగలిగారు. ఉంబ్రియా ప్రాంతంలో తొలుత ప్రారంభమైన భూకంపం.. ఆ తర్వాత అక్కడకు దాదాపు 300 కిలోమీటర్ల దూరంలో ఉన్న రోమ్, వెనిస్‌లలోకూడా కనిపించింది.
ఇంతకుముందు 1980 సంవత్సరంలో ఇటలీలో 6.9 తీవ్రతతో వచ్చిన భూకంపం కారణంగా 3వేల మంది మరణించారు. దాని తర్వాత ఇదే అత్యంత తీవ్రమైన భూకంపంగా నమోదైంది. మొదటి భూకంపం వచ్చిన తర్వాత పగలంతా చిన్న చిన్న ఆఫ్టర్ షాక్స్ కనిపిస్తూనే ఉన్నాయి. వీటి తీవ్రత రిక్టర్ స్కేలుపై 4 -5 పాయింట్ల మధ్య నమోదైంది. ఇది దేశానికి చాలా కష్టకాలమని ఇటలీ ప్రధానమంత్రి మాటెయో రెంజి అన్నారు. పాడైన ప్రతి ఒక్క ఇంటినీ ప్రభుత్వమే పునర్నిర్మిస్తుందని చెప్పారు. 14వ శతాబ్దం నాటి సెయింట్ బెనెడిక్ట్ బాసిలికా కూడా కూలిపోవడం దారుణమన్నారు. ఇన్ని శతాబ్దాలలో వచ్చిన చాలా భూకంపాలను తట్టుకుని నిలబడిన ఈ మహా నిర్మాణం.. తాజా భూకంపానికి మాత్రం పూర్తిగా కూలిపోయింది. ఇక్కడకు ప్రతియేటా ప్రపంచం నలుమూలల నుంచి దాదాపు 50వేల మంది వరకు పర్యాటకులు వస్తుంటారు.
Advertisement