italy earthquake
-
600 ఏళ్ల నాటి చర్చి.. కుప్పకూలింది
ఇటలీలో కనీవినీ ఎరుగని స్థాయిలో వచ్చిన భూకంపం.. అక్కడ పెను విలయాన్ని సృష్టించింది. ఈ భూకంప ప్రభావానికి 600 సంవత్సరాల నాటి సుప్రసిద్ధ బాసిలికా చర్చి కూడా నేలమట్టం అయ్యింది. దాదాపు మూడు వేల మందికి పైగా ప్రజలు నిరాశ్రయులయ్యారని జాతీయ పౌర సంరక్షణ సంస్థ తెలిపింది. అయితే అదృష్టవశాత్తు ఇంత పెద్ద ఎత్తున భూకంపం వచ్చి, భవనాలు కూలిపోయినా ప్రాణనష్టం మాత్రం మరీ అంత తీవ్రంగా లేదు. అయితే చాలా భవనాలు శిథిలం అయిపోయాయని, చారిత్రక కేంద్రాలు కూడా పాడయ్యాయని, ప్రస్తుతం అక్కడ విద్యుత్తు, నీటిసరఫరాలకు తీవ్ర ఇబ్బందిగా ఉందని పౌర సంరక్షణ సంస్థ అధినేత ఫాబ్రిజియో కర్షియో తెలిపారు. మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో (భారత కాలమానం ప్రకారం) భూకంపం రావడంతో.. చాలామంది ప్రాణాలు రక్షించుకోగలిగారు. ఉంబ్రియా ప్రాంతంలో తొలుత ప్రారంభమైన భూకంపం.. ఆ తర్వాత అక్కడకు దాదాపు 300 కిలోమీటర్ల దూరంలో ఉన్న రోమ్, వెనిస్లలోకూడా కనిపించింది. ఇంతకుముందు 1980 సంవత్సరంలో ఇటలీలో 6.9 తీవ్రతతో వచ్చిన భూకంపం కారణంగా 3వేల మంది మరణించారు. దాని తర్వాత ఇదే అత్యంత తీవ్రమైన భూకంపంగా నమోదైంది. మొదటి భూకంపం వచ్చిన తర్వాత పగలంతా చిన్న చిన్న ఆఫ్టర్ షాక్స్ కనిపిస్తూనే ఉన్నాయి. వీటి తీవ్రత రిక్టర్ స్కేలుపై 4 -5 పాయింట్ల మధ్య నమోదైంది. ఇది దేశానికి చాలా కష్టకాలమని ఇటలీ ప్రధానమంత్రి మాటెయో రెంజి అన్నారు. పాడైన ప్రతి ఒక్క ఇంటినీ ప్రభుత్వమే పునర్నిర్మిస్తుందని చెప్పారు. 14వ శతాబ్దం నాటి సెయింట్ బెనెడిక్ట్ బాసిలికా కూడా కూలిపోవడం దారుణమన్నారు. ఇన్ని శతాబ్దాలలో వచ్చిన చాలా భూకంపాలను తట్టుకుని నిలబడిన ఈ మహా నిర్మాణం.. తాజా భూకంపానికి మాత్రం పూర్తిగా కూలిపోయింది. ఇక్కడకు ప్రతియేటా ప్రపంచం నలుమూలల నుంచి దాదాపు 50వేల మంది వరకు పర్యాటకులు వస్తుంటారు. -
భూకంప తీవ్రత తక్కువ.. నష్టం ఎక్కువ.. ఎందుకిలా?
ఇటలీలో వచ్చిన భూకంపం కారణంగా ఇప్పటివరకు దాదాపు 159 మంది మరణించినట్లు అధికారిక సమాచారం ద్వారా వెల్లడవుతోంది. ఏకంగా ఒక పట్టణమే పూర్తిగా నేలమట్టం అయిపోయింది. శిథిలాల కింద ఇంకా ఎంతమంది ఉన్నారో తెలియట్లేదు. అదువల్ల మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది. అయితే ఇక్కడ సంభవించిన భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.2గా మాత్రమే నమోదైంది. అయినా నష్టం మాత్రం ఎక్కువగా కనిపిస్తోంది. సాధారణంగా రిక్టర్ స్కేలుపై తీవ్రత 7 పాయింట్లు దాటినప్పుడు ఇంత ఎక్కువ నష్టం కనిపిస్తుంది. కానీ ఈ సందర్భంలో మాత్రం ఇటలీలో సంభవించిన నష్టం చాలా ఎక్కువగా ఉంది. దానికి ప్రధాన కారణం.. భూకంప కేంద్రం భూమి ఉపరితలానికి కేవలం 10 కిలోమీటర్ల లోతులోనే ఉండటం. మామూలుగా అయితే భూమికి 30 నుంచి 700 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉంటుంది. దానివల్ల ప్రకంపనలు భూమి ఉపరితలం వరకు వచ్చి.. వాటి ప్రభావం పైన ఉన్న కట్టడాల మీద పడటానికి కొంత ఎక్కువ సమయం తీసుకుంటుంది. ఆలోపే దాని తీవ్రత కూడా చాలావరకు తగ్గుతుంది. ఒక బంతిని ఒకే వేగంతో ఎక్కువ దూరం నుంచి విసిరినప్పుడు, తక్కువ దూరం నుంచి విసిరినప్పుడు దాని దెబ్బ తీవ్రత ఎలా ఉంటుందో.. ఇప్పుడు భూకంప తీవ్రత కూడా అలాగే ఉంటుంది. అలా భూకంప కేంద్రం భూమి ఉపరితలానికి దగ్గరగా ఉండటం వల్లే దాని ప్రభావం ఎక్కువగా ఉండి నష్టం కూడా భారీగా సంభవించింది. ఇలా భూమికి దగ్గరగా వచ్చేవాటిని షాలో ఎర్త్క్వేక్స్ అంటారు. వీటివల్లే నష్టం ఎక్కువగా ఉంటుంది. మధ్య ఇటలీలో ఉన్న అపైనైన్ పర్వతాల వల్ల పశ్చిమ యూరప్ దేశాల్లో భూకంపం ముప్పు ఎక్కువగా ఉంటుందని, ఈ తీవ్రతతో భూకంపాలు రావడం బ్రిటన్లోని డర్హమ్ యూనివర్సిటీ ఎర్త్ సైన్సెస్ లెక్చరర్ డాక్టర్ రిచర్డ్ వాల్టర్స్ తెలిపారు. అందులోనూ తెల్లవారుజామున 3.30 గంటల ప్రాంతంలో భూకంపం సంభవించడంతో ప్రజలు ఇళ్లలోంచి బయటకు రావడానికి కూడా పెద్దగా సమయం దొరకలేదు. భూకంప కేంద్రం ఉన్న ప్రాంతం నుంచి 150 కిలోమీటర్ల దూరం వరకు కూడా భవనాలు బాగా కదిలాయి, బీటలు వారాయంటే దాని తీవ్రత ఎంత ఎక్కువగా ఉందో తెలుసుకోవచ్చు. పెద్దపెద్ద భవనాలు కూడా అతి తక్కువ సమయంలోనే రాళ్ల కుప్పలుగా మారిపోయాయి. అమాట్రిస్ నగరం మీద భూకంపం ప్రభావం చాలా ఎక్కువగా కనిపించింది. దాదాపు సగం నగరం నేలమట్టమైందని సాక్షాత్తు నగర మేయరే ప్రకటించారు. శిథిలాల కింద ఇరుక్కుపోయిన వారిని బయటకు తీసేందుకు సహాయ బృందాలు పగలు, రాత్రి అని తేడా లేకుండా కష్టపడుతున్నాయి. ఒక భూకంపం వచ్చిన తర్వాత తదుపరి 48 నుంచి 72 గంటల వరకు వచ్చే చిన్నచిన్న భూకంపాలను ఆఫ్టర్ షాక్స్ అంటారు. ఇలాంటివి ఈ ప్రాంతంలో 200 వరకు వచ్చాయి. వాటి తీవ్రత కూడా రిక్టర్ స్కేలుపై 5.1గా నమోదైంది. ఇది కూడా నగరం శిథిలం కావడానికి ప్రధాన కారణమైందని అంటున్నారు.