భూకంప తీవ్రత తక్కువ.. నష్టం ఎక్కువ.. ఎందుకిలా? | shallow earthquake damaged italy a lot, say experts | Sakshi
Sakshi News home page

భూకంప తీవ్రత తక్కువ.. నష్టం ఎక్కువ.. ఎందుకిలా?

Published Thu, Aug 25 2016 8:24 AM | Last Updated on Mon, Sep 4 2017 10:52 AM

భూకంప తీవ్రత తక్కువ.. నష్టం ఎక్కువ.. ఎందుకిలా?

భూకంప తీవ్రత తక్కువ.. నష్టం ఎక్కువ.. ఎందుకిలా?

ఇటలీలో వచ్చిన భూకంపం కారణంగా ఇప్పటివరకు దాదాపు 159 మంది మరణించినట్లు అధికారిక సమాచారం ద్వారా వెల్లడవుతోంది. ఏకంగా ఒక పట్టణమే పూర్తిగా నేలమట్టం అయిపోయింది. శిథిలాల కింద ఇంకా ఎంతమంది ఉన్నారో తెలియట్లేదు. అదువల్ల మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది. అయితే ఇక్కడ సంభవించిన భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.2గా మాత్రమే నమోదైంది. అయినా నష్టం మాత్రం ఎక్కువగా కనిపిస్తోంది. సాధారణంగా రిక్టర్ స్కేలుపై తీవ్రత 7 పాయింట్లు దాటినప్పుడు ఇంత ఎక్కువ నష్టం కనిపిస్తుంది. కానీ ఈ సందర్భంలో మాత్రం ఇటలీలో సంభవించిన నష్టం చాలా ఎక్కువగా ఉంది.

దానికి ప్రధాన కారణం.. భూకంప కేంద్రం భూమి ఉపరితలానికి కేవలం 10 కిలోమీటర్ల లోతులోనే ఉండటం. మామూలుగా అయితే భూమికి 30 నుంచి 700 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉంటుంది. దానివల్ల ప్రకంపనలు భూమి ఉపరితలం వరకు వచ్చి.. వాటి ప్రభావం పైన ఉన్న కట్టడాల మీద పడటానికి కొంత ఎక్కువ సమయం తీసుకుంటుంది. ఆలోపే దాని తీవ్రత కూడా చాలావరకు తగ్గుతుంది. ఒక బంతిని ఒకే వేగంతో ఎక్కువ దూరం నుంచి విసిరినప్పుడు, తక్కువ దూరం నుంచి విసిరినప్పుడు దాని దెబ్బ తీవ్రత ఎలా ఉంటుందో.. ఇప్పుడు భూకంప తీవ్రత కూడా అలాగే ఉంటుంది. అలా భూకంప కేంద్రం భూమి ఉపరితలానికి దగ్గరగా ఉండటం వల్లే దాని ప్రభావం ఎక్కువగా ఉండి నష్టం కూడా భారీగా సంభవించింది. ఇలా భూమికి దగ్గరగా వచ్చేవాటిని షాలో ఎర్త్‌క్వేక్స్ అంటారు. వీటివల్లే నష్టం ఎక్కువగా ఉంటుంది. మధ్య ఇటలీలో ఉన్న అపైనైన్ పర్వతాల వల్ల పశ్చిమ యూరప్ దేశాల్లో భూకంపం ముప్పు ఎక్కువగా ఉంటుందని, ఈ తీవ్రతతో భూకంపాలు రావడం బ్రిటన్‌లోని డర్హమ్ యూనివర్సిటీ ఎర్త్ సైన్సెస్ లెక్చరర్ డాక్టర్ రిచర్డ్ వాల్టర్స్ తెలిపారు.

అందులోనూ తెల్లవారుజామున 3.30 గంటల ప్రాంతంలో భూకంపం సంభవించడంతో ప్రజలు ఇళ్లలోంచి బయటకు రావడానికి కూడా పెద్దగా సమయం దొరకలేదు. భూకంప కేంద్రం ఉన్న ప్రాంతం నుంచి 150 కిలోమీటర్ల దూరం వరకు కూడా భవనాలు బాగా కదిలాయి, బీటలు వారాయంటే దాని తీవ్రత ఎంత ఎక్కువగా ఉందో తెలుసుకోవచ్చు. పెద్దపెద్ద భవనాలు కూడా అతి తక్కువ సమయంలోనే రాళ్ల కుప్పలుగా మారిపోయాయి.

అమాట్రిస్ నగరం మీద భూకంపం ప్రభావం చాలా ఎక్కువగా కనిపించింది. దాదాపు సగం నగరం నేలమట్టమైందని సాక్షాత్తు నగర మేయరే ప్రకటించారు. శిథిలాల కింద ఇరుక్కుపోయిన వారిని బయటకు తీసేందుకు సహాయ బృందాలు పగలు, రాత్రి అని తేడా లేకుండా కష్టపడుతున్నాయి. ఒక భూకంపం వచ్చిన తర్వాత తదుపరి 48 నుంచి 72 గంటల వరకు వచ్చే చిన్నచిన్న భూకంపాలను ఆఫ్టర్ షాక్స్ అంటారు. ఇలాంటివి ఈ ప్రాంతంలో 200 వరకు వచ్చాయి. వాటి తీవ్రత కూడా రిక్టర్ స్కేలుపై 5.1గా నమోదైంది. ఇది కూడా నగరం శిథిలం కావడానికి ప్రధాన కారణమైందని అంటున్నారు.

Advertisement
Advertisement