Catholic
-
సామాన్యునికి సెయింట్హుడ్
వాటికన్ సిటీ: మూడు శతాబ్దాల క్రితం క్రైస్తవాన్ని స్వీకరించి, చిత్రహింసలకు గురైన తమిళనాడుకు చెందిన సాధారణ పౌరుడు దేవసహాయం పిళ్లైకి సెయింట్హుడ్ (మహిమాన్విత హోదా) లభించింది. వాటికన్ నగరంలో ఆదివారం జరిగిన కార్యక్రమంలో పోప్ ఫ్రాన్సిస్ ఆయనకు మహిమాన్విత హోదా ప్రకటించారు. భారత్కు చెందిన ఒక సాధారణ పౌరుడికి కేథలిక్కు మతంలో అత్యున్నత గౌరవం దక్కడం ఇదే మొదటిసాది. దేవసహాయంతో పాటు పలు దేశాలకు చెందిన మరో తొమ్మిది మందికి సెయింట్ హోదా ఇచ్చారు. వారిలో నలుగురు మహిళలున్నారు. 1712 ఏప్రిల్ 23న కేరళలోని ట్రావెంకోర్ రాజ్యంలో హిందూ నాయర్ కుటుంబంలో దేవసహాయం జన్మించారు. ట్రావెంకోర్ రాజు మార్తాండ వర్మ సంస్థానంలో అధికారిగా పని చేశారు. క్రైస్తవం పట్ల ఆకర్షితుడై ఆ మతాన్ని స్వీకరించి ప్రబోధాలు చేయసాగారు. కోపోద్రిక్తుడైన రాజు దేవసహాయాన్ని ఊరూరా తిప్పుతూ చిత్రహింసలు పెట్టారు. అయినా ప్రజల సమానత్వంపైనే ప్రసంగాలు చేయడంతో 1752 జనవరి 14న కన్యాకుమారిలో కాల్చిచంపారు. దేవసహాయాన్ని చిత్రహింసలకు గురి చేసిన అన్ని ప్రాంతాల్లోనూ అద్భుతమైన మహిమలు జరిగాయని భారత్కు చెందిన కేథలిక్ బిషప్స్ సమాఖ్య పోప్ ఫ్రాన్సిస్ దృష్టికి తీసుకెళ్లింది. ఆ మహిమలను 2014లో పోప్ గుర్తించినట్టు వెల్లడించారు. -
నవ్వు విరిసింది
కరోనా కాదు ఇప్పుడొచ్చిన కష్టం.. మనిషికి మనిషి దూరం అవడం! కరోనా ఉన్నా.. లేకున్నా.. ‘లెప్పర్’లకు ఇది ఎప్పుడూ ఉండే కష్టమే. వాళ్లనెవ్వరూ దగ్గరికి రానివ్వరు. మనుషుల మధ్యకు చేరనివ్వరు. ఇప్పుడింకా కష్టం అయింది బతుకు. చెయ్యి చాచడానికైనా మనిషుంటేనా! ఉన్నాను.. అని వచ్చారు ఇన్నయ్య. కళ్లు మెరిశాయి. నవ్వు విరిసింది. అయినవాళ్లు ఎందరున్నా, అనుకోని పరిస్థితుల్లో కొన్నిసార్లు ఎవరూ లేనివాళ్లంగా మిగిలిపోవలసి ఉంటుంది. కరోనా వచ్చి ఇప్పుడంటే మనుషులకు మనుషులు దూరం అవుతున్నారు. ‘సెయింట్ ఆంటోని లెప్పర్ కాలనీ’ లోని యాభై మూడు కుటుంబాల వాళ్లు ఏనాడో సొంతవాళ్లకు దూరమై ఏకాకులుగా బతుకులీడుస్తున్నారు. ‘లెప్రసీ’ వారిని వేరు చేసింది. ప్రకాశం జిల్లా చీరాలకు సమీపంలో, వేటపాలెం మండలంలోని రామన్నపేటలో ఉంది ఈ కాలనీ. నెల్లూరు క్యాథలిక్ డైకోసిస్ ఈ కుటుంబాలకు నీడను ఇస్తుంటే.. వాళ్లతోనే కలిసి ఉంటున్న గుంటూరు ఇన్నయ్య.. అన్నమూ నీళ్లు ఇస్తున్నారు! ఒంట్లో బాగోలేనివాళ్లకు మందులు కూడా. ఇన్నయ్య.. రెవరెండ్ ఫాదర్ ఇన్నయ్యగా అందరికీ తెలుసు. లెప్పర్ కుటుంబాలకైతే ఆయన మానవతామూర్తే. గుంటూరు జిల్లా చేబ్రోలు దగ్గర ముట్లూరు గ్రామం ఇన్నయ్యది. చిన్నప్పుడే బాప్టిజం తీసుకున్నారు. పెద్దయ్యాక వ్యాధిగ్రస్తుల్ని గుండెల్లోకి తీసుకున్నారు. కొన్నేళ్లు ఇటలీలో ఉన్నారు. అక్కడి భాషల్ని, బాధల్ని ఇక్కడికి మోసుకొచ్చారు. ‘‘బాధ (పెయిన్) విశ్వవ్యాప్త భాష. చెప్పకుండానే అర్థమైపోతుంది’’ అంటారు ఇన్నయ్య. కరోనా వచ్చాక.. లెప్పర్ కాలనీలో ప్రతి ఒక్కరి యోగక్షేమాలను కనుక్కుంటున్నారు ఆయన. వాళ్ల భోజనానికి ఏర్పాట్లు చేయిస్తున్నారు. ‘‘వీళ్లకు సేవ చేయడం ఓ గౌరవం’’ అంటారు ఇన్నయ్య. ‘‘కష్టాలకు ఎవ్వరూ అతీతులు కాదు. కూడూ, గూడు, వనరులు, ‘నా’ అనేవాళ్లు లేని వారు ఈ సమాజంలో చాలామంది ఉన్నారు. వారికి చేదోడుగా ఉండడం మనుషులుగా మనందరి విధి’’ అని ఆయన అంటున్నారు. ‘‘టౌన్లో (చీరాల, వేటపాలెం) పరిస్థితులు బాగుంటే మాలో కొందరం ఏదో విధంగా బయటకు వెళ్లి మాకు కావాల్సిన సరకులో, డబ్బులో తెచ్చుకునే వాళ్లం. ఇప్పుడా పరిస్థితి లేదు. ఏది చేసినా మా ఫాదర్ చేయాల్సిందే. ఎలా తిప్పలు పడుతున్నారో, ఎలా చేస్తున్నారో వేళకు మాకింత తిండిపెడుతున్నారు మహానుభావుడు’’ అంటున్నారు కాలనీలో ఉండే కోటమ్మ, దుర్గయ్య, ఏసోబు తదితరులు.. ఇన్నయ్య గురించి. రాష్ట్రంలో ఎక్కడెక్కడి నుంచో వచ్చారు. రైళ్లలో భిక్షమెత్తే వాళ్లు మొదలు వీధుల్లో తోపుడుబండ్లపై తిరుగుతూ అర్థించే వారు, అనా«థలు, అభాగ్యులు, కుటుంబ సభ్యులు వదిలేసిన వారు... ఇలా ఎందరెందరో ఉన్న ఈ ప్రాంగణానికి ఇప్పుడీ కరోనా కాలంలో ఇన్నయ్యే అన్నీ అయ్యారు. – ఎ. అమరయ్య, సాక్షి, అమరావతి -
పోప్ ఒక వ్యవస్థ!
క్యాథలిక్ తెగకు చెందినప్పటికీ, పోప్ వ్యవస్థకు నేటికీ ప్రపంచంలో ఎంతో ఖ్యాతి ఉంది. క్యాథలిక్ చర్చిలో ఈ వ్యవస్థ పరమ పవిత్రమైనది, అత్యున్నతమైనది. పీటర్ కాలం నుంచి ఈ వ్యవస్థ ఉంది. ఆయనను జీసస్ స్వయంగా నియమించా డని (క్రీ.శ. 493) ప్రతీతి. పోప్ మతపర మైన బిరుదు కాదు. అదొక వ్యవస్థ. ఒక పీఠం. దీనికి రోమ్ ప్రధాన కేంద్రం. పాపల్ కాన్క్లేవ్ వీరిని ప్రత్యేక పద్ధతితో ఎంపిక చేస్తుంది. లాటిన్లోని పాపా (తండ్రి) అనే పదం నుంచే పోప్ పదం వచ్చింది. క్రీస్తు శకం మొదటి మూడు దశాబ్దాల నుంచి ఈ వ్యవస్థ ప్రాధాన్యం సంతరించుకుంటూ వచ్చింది. పోప్ పదవికి వచ్చిన వారికి కొన్ని కీలక చారిత్రక సందర్భాలలో ‘సమస్ పాంటిఫిక్స్’, ‘పాంటిఫిక్స్ మ్యాక్జిమస్’, ‘సెర్వస్ సెర్వోరమ్ డి’ వంటి బిరుదులను ప్రదానం చేయడం కనిపిస్తుంది. ఇన్నివేల సంవత్సరాల కాలంలో ఎందరు పోప్ పదవికి వచ్చా రన్న అంశం మీద చరిత్రకారులలో ఏకాభి ప్రాయం లేదు. కానీ పోప్ల సంఖ్యను సేకరించిన తొలి చరిత్రకారునిగా హెర్మానస్ కాంట్రాక్టస్కు పేరు ఉంది. ఆయన జాబితాలో మొత్తం 154 మంది పోప్లు ఉన్నారు. ఆఖరి పేరు సెయింట్ పదిహేనో లియో. తరువాత 20వ శతాబ్దం వరకు పోప్ల చరిత్ర, జాబితాలను పునర్ లిఖించుకుంటూనే ఉన్నారు. కేవలం 12 రోజుల నుంచి (ఏడో అర్బన్, క్రీ.శ.1590), మూడున్నర దశాబ్దాల పాటు క్రైస్తవ ప్రపంచానికి దిశానిర్దేశం చేస్తూ ఆ పదవిలో ఉన్నవారు కనిపిస్తారు (క్రీ.శ. 752లో సెయింట్ రెండో స్టీఫెన్ ఆ పదవికి ఎంపికైన మూడో రోజునే కన్నుమూశారు. దీనితో కొందరు చరిత్ర కారులు ఆయన పేరును ఈ జాబితాలో చేర్చరు). సెయింట్ థియోడర్ (క్రీ.శ.897) 20 రోజులు, సెయింట్ వేలంటైన్ (క్రీ.శ. 827) 40 రోజులు మాత్రమే ఆ పదవిలో ఉన్నారు. ప్రస్తుతం సెయింట్ జోర్గ్ మేరియో బెర్గోగిలియో (పోప్ ఫ్రాన్సిస్) ఉన్నారు. పోప్లంతా కేవలం ఆధ్యాత్మిక కార్య కలాపాలకే పరిమితం కాలేదు. ఆయా సంక్షోభాల సమయంలో, సమరాల సమయంలో శాంతిని నెలకొల్పడానికి కృషి చేసిన వారున్నారు. కొన్ని విప్లవాత్మక నిర్ణయాలు తీసుకున్నవారూ ఉన్నారు. రెండో జాన్పాల్ (1978-2005) ఇస్లాం, జూడాయిజంలతో, ప్రాచ్య సంప్రదాయ క్రైస్తవంతోను కేథలిక్ తెగ సంబంధాలు మెరుగు పరచడానికి కృషి చేశారు. అలాగే పోలెండ్ దేశస్థుడైన ఈ పోప్ అక్కడ కమ్యూనిజానికి వ్యతిరేకంగా వచ్చిన ఆందోళనకు మద్దతు ఇచ్చినట్టు కూడా గాథలు ఉన్నాయి. 129 దేశాలు తిరిగిన మొదటి పోప్ కూడా ఆయనే. అమెరికాలో పర్యటించిన తొలి పోప్ ఆరో పాల్, సెయింట్ జాన్ అణ్వాయుధాల తగ్గింపు కోసం తన వంతు కృషి చేశారు. సెయింట్ సైయస్ (1922-1939) నాజీజం, కమ్యూనిజాలను వ్యతిరేకించేవారని చెబుతారు.