పోప్ ఒక వ్యవస్థ!
క్యాథలిక్ తెగకు చెందినప్పటికీ, పోప్ వ్యవస్థకు నేటికీ ప్రపంచంలో ఎంతో ఖ్యాతి ఉంది. క్యాథలిక్ చర్చిలో ఈ వ్యవస్థ పరమ పవిత్రమైనది, అత్యున్నతమైనది. పీటర్ కాలం నుంచి ఈ వ్యవస్థ ఉంది. ఆయనను జీసస్ స్వయంగా నియమించా డని (క్రీ.శ. 493) ప్రతీతి. పోప్ మతపర మైన బిరుదు కాదు. అదొక వ్యవస్థ. ఒక పీఠం. దీనికి రోమ్ ప్రధాన కేంద్రం. పాపల్ కాన్‌క్లేవ్ వీరిని ప్రత్యేక పద్ధతితో ఎంపిక చేస్తుంది. లాటిన్‌లోని పాపా (తండ్రి) అనే పదం నుంచే పోప్ పదం వచ్చింది.
క్రీస్తు శకం మొదటి మూడు దశాబ్దాల నుంచి ఈ వ్యవస్థ ప్రాధాన్యం సంతరించుకుంటూ వచ్చింది. పోప్ పదవికి వచ్చిన వారికి కొన్ని కీలక చారిత్రక సందర్భాలలో ‘సమస్ పాంటిఫిక్స్’, ‘పాంటిఫిక్స్ మ్యాక్జిమస్’, ‘సెర్వస్ సెర్వోరమ్ డి’ వంటి బిరుదులను ప్రదానం చేయడం కనిపిస్తుంది. ఇన్నివేల సంవత్సరాల కాలంలో ఎందరు పోప్ పదవికి వచ్చా రన్న అంశం మీద చరిత్రకారులలో ఏకాభి ప్రాయం లేదు.
కానీ పోప్‌ల సంఖ్యను సేకరించిన తొలి చరిత్రకారునిగా హెర్మానస్ కాంట్రాక్టస్‌కు పేరు ఉంది. ఆయన జాబితాలో మొత్తం 154 మంది పోప్‌లు ఉన్నారు. ఆఖరి పేరు సెయింట్ పదిహేనో లియో. తరువాత 20వ శతాబ్దం వరకు పోప్‌ల చరిత్ర, జాబితాలను పునర్ లిఖించుకుంటూనే ఉన్నారు. కేవలం 12 రోజుల నుంచి (ఏడో అర్బన్, క్రీ.శ.1590), మూడున్నర దశాబ్దాల పాటు క్రైస్తవ ప్రపంచానికి దిశానిర్దేశం చేస్తూ ఆ పదవిలో ఉన్నవారు కనిపిస్తారు (క్రీ.శ. 752లో సెయింట్ రెండో స్టీఫెన్ ఆ పదవికి ఎంపికైన మూడో రోజునే కన్నుమూశారు.
దీనితో కొందరు చరిత్ర కారులు ఆయన పేరును ఈ జాబితాలో చేర్చరు). సెయింట్ థియోడర్ (క్రీ.శ.897) 20 రోజులు, సెయింట్ వేలంటైన్ (క్రీ.శ. 827) 40 రోజులు మాత్రమే ఆ పదవిలో ఉన్నారు. ప్రస్తుతం సెయింట్ జోర్గ్ మేరియో బెర్గోగిలియో (పోప్ ఫ్రాన్సిస్) ఉన్నారు.
పోప్‌లంతా కేవలం ఆధ్యాత్మిక కార్య కలాపాలకే పరిమితం కాలేదు. ఆయా సంక్షోభాల సమయంలో, సమరాల సమయంలో శాంతిని నెలకొల్పడానికి కృషి చేసిన వారున్నారు.
కొన్ని విప్లవాత్మక నిర్ణయాలు తీసుకున్నవారూ ఉన్నారు. రెండో జాన్‌పాల్ (1978-2005) ఇస్లాం, జూడాయిజంలతో, ప్రాచ్య సంప్రదాయ క్రైస్తవంతోను కేథలిక్ తెగ సంబంధాలు మెరుగు పరచడానికి కృషి చేశారు. అలాగే పోలెండ్ దేశస్థుడైన ఈ పోప్ అక్కడ కమ్యూనిజానికి వ్యతిరేకంగా వచ్చిన ఆందోళనకు మద్దతు ఇచ్చినట్టు కూడా గాథలు ఉన్నాయి. 129 దేశాలు తిరిగిన మొదటి పోప్ కూడా ఆయనే. అమెరికాలో పర్యటించిన తొలి పోప్ ఆరో పాల్, సెయింట్ జాన్ అణ్వాయుధాల తగ్గింపు కోసం తన వంతు కృషి చేశారు. సెయింట్ సైయస్ (1922-1939) నాజీజం, కమ్యూనిజాలను వ్యతిరేకించేవారని చెబుతారు.