Christmas Special
-
కెవ్వు కేకు.. రుచికరమైన జోవార్ క్యారట్ కేక్ తయారీ ఇలా!
క్రిస్మస్ వస్తోంది. కేక్ చేద్దామంటే అమ్మో మైదాతోనా... అని భయం. హెల్త్ కోసం అందరూ మిల్లెట్లు తింటున్నారు. మిల్లెట్లతో అన్నాలు, బిరియానీలు, బ్రేక్‌ఫాస్ట్‌లు, స్నాక్‌లు...ఎన్నో చేస్తున్నారు. మరి... కేక్‌లు చేయలేమా? ఎందుకు చేయలేం! ఇదిలో ఇలా చేయండి. కావలసినవి: జొన్న పిండి– కప్పు; బాదం పొడి– కప్పు; బనానా ప్యూరీ– కప్పు; క్యారట్ తురుము– కప్పు; బెల్లం పొడి– కప్పు; పాలు లేదా నీరు – అర కప్పు; వెన్న – 3 టేబుల్ స్పూన్లు; అవిసె గింజల పొడి – 3 టేబుల్ స్పూన్లు (రెండింతల నీరు వేసి కలపాలి); ఉప్పు, బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా, దాల్చిన చెక్క పొడి – ఒక్కొక్కటి అర స్పూన్; బాదం పలుకులు– 10 (సన్నగా తరగాలి) తయారీ విధానం: ⇒ మందపాటి పెనంలో జొన్నపిండి వేసి సన్న మంట మీద దోరగా వేయించాలి. ⇒ మరొక పాత్రలో అవిసె గింజల పొడిని నీటితో కలిపి ఐదు నిమిషాల సేపు పక్కన ఉంచాలి. ⇒ ఆ తర్వాత జొన్నపిండిలో వెన్న, బనానా ప్యూరీ, అవిసె గింజల పేస్ట్ వేసి బాగా కలపాలి. ⇒ ఇందులో ఉప్పు, బేకింగ్ సోడా, బేకింగ్ పౌడర్, దాల్చిన చెక్క పొడి వేసి మళ్లీ కలపాలి. ⇒ ఇప్పుడు మిగిలిన పొడులు, క్యారట్ తురుము వేసి తగినంత నీరు లేదా పాలు వేస్తూ బాగా కలపాలి. ⇒ కేక్ మౌల్డ్‌కు వెన్న రాసి పైన కొద్దిగా జొన్న పిండిని చల్లాలి. ఇప్పుడు పై మిశ్రమాన్ని సమంగా సర్దాలి. పైన బాదం పలుకులు చల్లాలి. ⇒ ఇప్పుడు ఒవెన్‌ను 180 డిగ్రీలు వేడి చేసి మౌల్డ్‌ను లోపల పెట్టి 50 లేదా 60 నిమిషాల పాటు బేక్ చేయాలి. చల్లారిన తర్వాత కేక్‌ను ముక్కలుగా కట్ చేయాలి. -
దివ్యలోకపు ప్రేమధార
మనుషుల్ని చూడండి. మీద ఏదో ఒక బరువు. చదువుల బరువు. ఉద్యోగాల బరువు. ఇంటి పోషణ బరువు. బంధువుల మాటపట్టింపు బరువు. స్నేహితుల ముఖంచాటు బరువు. దగ్గరివాళ్లెవరి మనసునో నొప్పించిన బరువు. అంత బరువులోనూ సాటి మనిషి తల మీది బరువును రెండు చేతులతో చేపల గంపను కిందికి దింపినట్లుగా.. ‘కష్టాన్ని పంచుకునే బరువు’నూ పైకెత్తుకుంటారు! మనిషి ఎంత బరువును మోస్తున్నా.. మనిషి లోపల పంచుకోవడం అనే ఆ ‘ప్రేమ నక్షత్రం’ వెలుగుతున్నంత కాలం లోకం ప్రేమమయమే. కాంతిమయమే. మాధవ్ శింగరాజు మంచిని మోసుకొచ్చేవాళ్లు కనిపిస్తే మనసుకు భారం దిగినట్లుగా అనిపిస్తుంది. భుజాన అరటి గెలతో వచ్చేవాళ్లు, వడ్ల బస్తాల బండితో దిగేవాళ్లు, అమ్మాయికి పెళ్లి సంబంధం తెచ్చేవాళ్లు.. ఇవనే కాదు, ఊరికే చూసిపోదామని ఎంతోదూరం నుంచి ఒక పలకరింపునైనా మూట కట్టుకుని వచ్చేవాళ్లు.. వాళ్లు ఎండన పడి వచ్చినా.. మనకు నీడనిచ్చేందుకు వేర్లు పెకిలించుకుని కదలి వచ్చిన మనిషంత మహావృక్షంలా కనిపిస్తారు. మన నీరసాన్ని, నిస్సత్తువను పోగొడతారు. వాళ్లు తెచ్చిన చక్కెరకేళీలు, వాళ్లు దించిన ధాన్యం గింజలు, వాళ్లు చెప్పిన వరుడి విశేషాలు.. ఇవి కాదు మనసుకు సంతోషం. ఆ మోసుకురావడం.. అదీ! మనిషంటే అలానే ఉండాలి. నక్షత్రంలా! క్రీస్తు జన్మించారన్న కబురును ఇలాగే ఒక నక్షత్రం భూమి మీదకు మోసుకొచ్చింది. ఆ నక్షత్రం ప్రసవించిన వెలుగులో క్రీస్తు జనన ఘడియలు కాంతిపుంజాలై ప్రసరించి లోకమంతటా మంచిని విత్తనాల్లా విరజిమ్మాయి. ఆ విత్తన సంతతే కావచ్చు ఈ మంచిని ప్రయాసపడి మోసుకొచ్చే మనుషులు! విరజిమ్మినప్పుడు మంచి అక్కడక్కడా పడింది కనుకనేనా మంచి మనుషులు అక్కడక్కడ మాత్రమే కనిపిస్తుంటారు?! కాదు. కనిపించకపోవడానికి కారణం మనం చూడకపోవడం, చూడాలని మనకు లేకపోవడం! ప్రకృతిని చూసి పరవశిస్తాం. ప్రకృతిలో భాగమైన మూగజీవుల్ని చేరదీసి సేదతీరుతాం. పక్షులు పాడుతుంటే వింటాం. మరి సాటి మనిషినెందుకు దగ్గరకు రానివ్వం? ఎన్ని యుగాల పరిచయం ఉన్నా మనిషికి దగ్గరగా ఎందుకు వెళ్లలేం? చూడదలచుకుంటే దిగ్మండలంలోనే కాదు, ఈ భూమండలంలోనూ నక్షత్రాల్లాంటి మనుషులు ప్రత్యక్షమవుతారు. క్రీస్తు జననం వంటి ఒక మంచిని వాళ్లు సాక్షాత్కరింపజేస్తారు. మనలో ప్రతి ఒక్కరం చూడగలం. అయితే చూడదలచుకోం! చూసేందుకు లోకంలో మంచే లేదనుకుంటాం. నిజంగానే లోకంలో మంచికి చోటు లేదా, మంచిని చూసేందుకు మనలో చోటు లేదా? ఉంటుంది. మంచిని చూడాలన్న ఆలోచన.. అది రాదు. వచ్చిందా.. మరుక్షణమే మన పక్కనే ఉన్న మనిషిలోనూ ఒక నక్షత్రం కనిపిస్తుంది! మనిషిలో నక్షత్రం కాదు, మనిషే నక్షత్రంలా కనిపిస్తారు. ఆ నక్షత్రపు వెలుగులో లోకంలోని మంచి కనిపిస్తుంది. వెలుగులో మంచొక్కటే కనిపిస్తుందా! వెలుగులో కనిపించేది మంచైనా, కానిదైనా.. మనసులోని వెలుగు మంచిని మాత్రమే చూస్తుంది. ఆ చూపును కాపాడుకోవాలి మనం. అప్పుడు లోకం దివ్యమైన నక్షత్ర కూటమిలా వెలుగుతూ కనిపిస్తుంది. శోకమయపు సముద్రాల ఈతకు నీటిపై సురక్షితంగా తేలియాడే ఆకులాంటి ఒక మంచి చూపు చాలదా.. సముద్రాన్ని, సుడిగుండాల్ని, తిమింగలాలను లక్ష్యపెట్టక ప్రశాంతంగా జీవనయానం సాగించడానికి! కొన్ని సంగతులు విన్నప్పుడు భూమి మీద ఉన్నదంతా ప్రేమ సందేశాలను మోసుకొచ్చే నక్షత్రాలే కానీ మానవమాత్రులు కారేమో అనిపిస్తుంది. కాకపోతే కొన్ని వెలిగే నక్షత్రాలు. కొన్ని వెలుగులో మాత్రమే కనిపించే నక్షత్రాలు. వెలుగులో నక్షత్రాలు కనిపించడం ఏమిటి! నక్షత్రమంటేనే వెలుగు కదా?! మనిషెంత వెలిగినా మంచితో వెలగడం ఒకటి ఉంటుందిగా. అలాంటిదే. ఒక యువకుడు ఉన్నాడు. హోటల్లో వెయిటర్. రూపాయి రూపాయి కూడ»ñ ట్టుకుని సైకిల్ కొనుక్కోవడం కోసం రోజూ పదకొండు కిలోమీటర్లు కాలి నడకన పనికి వచ్చి పోతున్నాడు.ఆ హోటల్‌కు వస్తుండే దంపతులొకరికి ఈ సంగతి తెలిసింది. మర్నాడే ఒక సైకిల్ని కొని అతడికి కానుకగా ఇచ్చారు! కష్టపడటం అతడి వెలుగైతే, అతడి కష్టాన్ని ఆ దంపతులు గమనించడం అతడిపై ప్రసరించిన వెలుగు. ఒక పోలీస్ అధికారి బంద్ డ్యూటీలో ఉన్నాడు. మధ్యాహ్నం అయింది. డ్యూటీలో ఉన్న చోటే ఒక అరుగు మీద భోజనానికి కూర్చోబోతుండగా ఒక వ్యక్తి దగ్గరగా వచ్చి నిలుచున్నాడు. అతడికి ఆకలిగా ఉన్నట్లు గ్రహించాడు ఆ పోలీస్ అధికారి. ‘తింటావా?’ అని అడిగాడు. ‘తింటాను’ అన్నట్లు తలూపాడు ఇల్లూ వాకిలీ లేని ఆ వ్యక్తి. పోలీస్ అధికారి తెప్పించుకున్న అన్నం పొట్లంలోనే ఇద్దరూ కలిసి చేతులు పెట్టి భోజనం చేశారు! పంచే బుద్ధి పోలీస్ ఆఫీసర్లోని వెలుగైతే, దాన్ని బయటికి కనిపించేలా చేసిన వెలుగు ఆ ఆకలిగొన్న వ్యక్తి. ఇలాంటివి జరక్కపోతే పోలీసు చొక్కాపై నక్షత్రాలను తప్ప పోలీసు మనసు లోపలి నక్షత్రాలను చూడగలమా?! మనుషుల్లోపల్లోపల సాటి మనుషులంటే ఇంతింత ప్రేమ ఉంటుందే.. మరి అదంతా కనిపించకుండా ఎక్కడికి పోతుంది? ఎక్కడీ పోదు. ఎక్కడి నుంచో, ఏ రూపంలోనో ఓ కాంతి ధార వచ్చి పడితేనే కానీ ఆ మానవ నక్షత్రాల్లోని ప్రేమ వెలుగు పైకి కనిపించదు. మనుషులు ధరించే నిర్దయ, నిరాదరణ అనే కవచాలు మనుషుల మీద అనుమానంతోనే కానీ అవేవీ సహజ కవచాలు, కుండలాలు కావు. సాటి మనిషి అవసరానికి అవి తునాతునకలైపోయి హృదయకాంతి బయపడినప్పుడు గానీ అప్పటి వరకు వారు పండ్ల గెలలు, ధాన్యపు బస్తాలు, పెళ్లి సంబంధాలు మోస్తున్నట్లు తెలియదు. జ్ఞానులు సైతం క్రీస్తు జననాన్ని నక్షత్రం ద్వారానే గుర్తించగలిగారు. మనిషిలోని దైవత్వాన్ని గుర్తించడానికి ప్రతి మనిషీ అంతటి నక్షత్రం అయి ఆ కాంతిని లోకానికి బాటగా వేయాలి. తాతకు తోడుగా..! క్రిస్మస్ తాత నివాసం దక్షిణధ్రువంలో ఉంటుందని ప్రపంచం అంతా భావిస్తుంటే.. నెదర్లాండ్స్ ప్రజలు మాత్రం ఆయన స్పెయిన్ దేశంలో ఉంటాడని నమ్ముతారు. క్రిస్మస్ తాతను ఇంగ్లిషులో శాంటాక్లాస్ అంటాం కదా. శాంటాక్లాస్ అన్నది నెదర్లాండ్స్ వాళ్లు మాట్లాడే డచ్ భాషా పదం. వాళ్ల దేశం నుంచి శాంటాక్లాస్ అనే మాట వచ్చింది కాబట్టి, శాంటాక్లాస్ది స్పెయిన్ అని చెబుతున్న డచ్‌వాళ్ల మాటను మనం పూర్తిగా కాదనేందుకు లేదు. డచ్వాళ్లకు ఇంకో నమ్మకం కూడా ఉంది. క్రిస్మస్ గిఫ్టులు ఇవ్వడానికి శాంటాక్లాజ్ ఒక్కడే వస్తాడని మనం అనుకుంటాం. కానీ కాదట. ఆయన పక్కన ఆయనకు సహాయకులుగా కొన్ని ‘పిల్ల శాంటాలు’ ఉంటారట. వాళ్లేం చేస్తారంటే.. గిఫ్టులు ఇవ్వడానికి క్రిస్మస్‌తాతతో పాటు ఇళ్లకు వెళ్లినప్పుడు అక్కడ పిల్లలెవరైనా తుంటరి పనులు చేస్తే వాళ్లను అమాంతం ఎత్తుకుని తెచ్చేసి స్పెయిన్‌లో వదిలేస్తారట! అంతకుమించిన శిక్ష ఉండదని నెదర్లాండ్స్ వాళ్లు అంటారు! బాల యేసుకు దుప్పటి రాత్రి పెట్టిన క్రిస్మస్ చెట్టు మీద తెల్లారే సాలెగూడు కనిపిస్తే ఏదో అదృష్టం వరించబోతోందని జర్మనీ, పోలండ్, ఉక్రెయిన్ దేశాలలో ఒక విశ్వాసం ఉంది. బేబీ జీసెస్ కోసం ఆ సాలె పురుగు దుప్పటి నేస్తూ ఉంటుందని కొందరి నమ్మకం. ఆ సాలెగూడు ఉదయాన్నే సూర్య కిరణాలు సోకి బంగారు, వెండి సాలెగూడుగా మారిపోతుందని మరికొందరి నమ్మకం. మన దగ్గర మార్కెట్ నుంచి కొని తెచ్చుకున్న రెడీమేడ్ క్రిస్మస్ ట్రీలో ఏ మూలో సాలెగూడు కూడా ఉండటానికి ఇదే కారణం అయి ఉండొచ్చు. ఈ నమ్మకం గురించి తెలిసినవాళ్లు క్రిస్మస్ చెట్టుకు తప్పని సరిగా ఒక ప్లాస్టిక్ సాలెగూడును సంపాదించి తగిలిస్తారు. అలా కూడా అదృష్టం కలసి వస్తుందని కొందరు విశ్వసిస్తారు. పసి మనసులు కొన్ని పాశ్చాత్య దేశాలలో.. ముఖ్యంగా జర్మనీలో ఒక అందమైన విశ్వాసం ఉంది. క్రిస్మస్కు కొద్ది గంటల ముందు.. కల్లాకపటం తెలియని స్వచ్ఛమైన పసి హృదయాలు జంతువుల మాటల్ని వినగలుగుతాయట! అంతేకాదు, నదులు ద్రాక్ష సారాయిగా మారడాన్ని ఆ పసివాళ్ల కళ్లు చూడగలుగుతాయి. క్రిస్మస్ ట్రీకి వాళ్ల కళ్లముందే తియ్యటి బేరీ పండ్లు కాస్తాయి. పర్వతాలు తెరుచుకుని వాటి గర్భంలోని మణులు మాణిక్యాలు బయటపడతాయి. సముద్రపు అడుగునుంచి దేవుని గంటలు ధ్వనిస్తాయి. నిజంగా ఇలా జరిగితే ఎంతమందిమి చూడగలుగుతాం? మనలో ఎన్ని పవిత్రమైన హృదయాలు ఉంటాయి అని ప్రశ్న?! గంటకు 60 లక్షల మైళ్లు! క్రిస్మస్తాత తెచ్చే గిఫ్టుల కోసం ఎదురు చూసే పిల్లలు ప్రపంచవ్యాప్తంగా 70 కోట్ల మంది వరకు ఉంటారని అంచనా. మరి వారందరికీ గిఫ్టులు చేరవెయ్యాలంటే క్రిస్మస్ తాతకు టైమ్ సరిపోతుందా? సరిపోతుంది. గంటకు అరవై లక్షల మైళ్ల వేగంతో ప్రయాణిస్తే చాలు. అన్ని దేశాల్లోని అందరి పిల్లలకు గిఫ్టులు అందినట్లే. యు.ఎస్.లోని యూనివర్శిటీ ప్రొఫెసర్ ఒకరు వేసిన లెక్క ఇది. ఎక్స్‌మస్ క్రిస్మస్ని ఎక్స్‌మస్ అని కూడా అంటుంటాం. ఎందుకిలా? ఎప్పుడైనా మీకు డౌట్ వచ్చిందా? మీకు వచ్చినా రాకున్నా ఎక్స్‌మస్ అన్నది మాత్రం క్రిస్మస్ నుంచే వచ్చింది. అబ్రివేషన్‌గా వాడుతున్నాం. ఇలా ఇష్టమొచ్చినట్లు వాడితే సరిపోయిందా? లాజిక్ ఉండొద్దా? ఉంది! గ్రీకు భాషలో ఛిజిజీ ని గీ తో సంకేతపరుస్తారు. అందుకే క్రైస్ట్, క్రిస్టోస్ అనే మాటలకు ముందు వాళ్లు గీ అని రాస్తారు. అలా క్రిస్మస్.. ఎక్స్‌మస్ అయింది. బాతు చెట్లు మొదట్లో క్రిస్మస్ చెట్టును బాతు ఈకలతో చేసేవాళ్లు. ఆ ఈకలకు పచ్చరంగు వేసేవారు. 19వ శతాబ్దంలో జర్మనీలో ఇలా చేయడం మొదలైంది. అప్పట్లో అక్కడ అడవుల నరికివేత విపరీతంగా ఉండటంతో చెట్లకు కరువొచ్చింది. దాంతో బాతు ఈకల ఆలోచన వచ్చింది వాళ్లకు. తర్వాత్తర్వాత బాతు ఈకలతో క్రిస్మస్ చెట్లను తయారు చేయడమన్నది అమెరికాకు, ఇతర దేశాలకూ వ్యాపించింది. కెంటకీ ఫర్ క్రిస్మస్ జపాన్‌లో క్రిస్మస్ రోజు కె.ఎఫ్.సి.లు కిటకిటలాడిపోతుంటాయి. అక్కడ క్రైస్తవుల సంఖ్య పెద్దగా ఉండదు కానీ, క్రిస్మస్ రోజు అంతా కె.ఎఫ్.సి.ల దారి పడతారు. కె.ఎఫ్.సి. అంటే కెంటకీ ఫ్రైడ్ చికెన్. అయితే 1947లో కె.ఎఫ్.సి. తన సేల్స్ పెంచుకోవడం కోసం ‘కెంటకీ ఫర్ క్రిస్మస్’ అనే మార్కెటింగ్ వ్యూహం పన్ని సక్సెస్ అయ్యింది. అప్పట్నుంచీ క్రిస్మస్ సీజన్లో జపాన్వారికి పండగే పండుగ. కె.ఎఫ్.సి. వారి నోరూరించే ఆఫర్లు కడుపునిండా ఉంటాయి. -
సఖ్యతకు తరుణం
తెగిపోయిన అనుబంధాల్ని ఈ ‘క్రిస్మస్’ రోజు పునరుద్ధరించుకోవడమే ప్రధాన ధ్యేయంగా పెట్టుకోండి. లోకంలో చాలా తేలికైన పని బయట పరిచర్య సాగించడం. చాలా కష్టమైన పని తల్లిదండ్రులు, తోబుట్టువులతో సఖ్యత కలిగి ఉండటం. యేసు స్థాపించబూనిన దైవికరాజ్యంలో మీరు భాగం కావాలంటే తొలి అడుగుగా మీ అనుబంధాల్ని పునరుద్ధరించుకొని పటిష్టం చేసుకోండి. హ్యాపీ క్రిస్మస్!! దేవుడు తన అద్వితీయ కుమారుడైన, తనకు మానవ రూపమైన యేసుక్రీస్తు సారథ్యంలో నిర్మించి, ప్రపంచవ్యాప్తంగా విస్తరించ తలపెట్టిన ‘దైవిక రాజ్యం’ ఆవిష్కరణకు అలనాటి యూదా దేశం (నేటి ఇజ్రాయేలు దేశంలోని దక్షిణ భూభాగం) లోని బేత్లెహేము వేదికగా రంగమంతా సిద్ధమయ్యింది. అంతటి మహత్తరమైన పరిణామానికి రెండువేల ఏళ్ల క్రితం, యూదయ అనే ఒక ఎడారి ప్రాంతాన్ని, తరుచు క్షామాలకు లోనయ్యే అక్కడి బెత్లేహేము అనే పేద గ్రామాన్ని, యేసుక్రీస్తుకు ఇహలోకపు తల్లిదండ్రులుగా యూదా వంశీయుడైన యోసేపు, లెవీ వంశీయురాలైన మరియ అనే నిరుపేదలను, యేసు ఆవిర్భావ సువార్త ప్రచారకులుగా బేత్లెహేముకే చెందిన కొందరు నిరుపేద గొర్రెల కాపరులను, దేవుడు తన అనాది సంకల్పంలో భాగంగా ఏర్పర్చుకున్నాడు. పెను విషాదమేమిటంటే, పుడమినేలేందుకు వచ్చిన పరలోకపు రాజైన యేసుకు ఎక్కడ చూసినా పేదరికం, దారిద్య్రమే తాండవించే యూదయ దేశపు బెత్లేహేములో, అక్కడి సత్రంలోనైనా కనీసం కాసింత చోటు దొరకలేదు. అందువల్ల అక్కడి పశువుల కొట్టంలోనే ప్రభువు జన్మించాడు, పశువులు దాణా తాగేందుకు వాడే ఒక పశువుల తొట్టి ఆయనకు మెత్తటి పూలపాన్పుగా పనికొచ్చింది. మునుపటి రాజ్యానికి భిన్నంగా.. నిరుపేదలు, నిర్భాగ్యులు, నిరాశ్రయులే ప్రధాన పౌరులుగా ఏర్పాటుచేయ తలపెట్టిన దైవిక రాజ్యాన్ని.. ఇలా పేదరికంలోనే దేవుడు నిర్మించ తలపెట్టాడు. దైవిక రాజ్యస్థాపన కోసం యేసుక్రీస్తు ప్రధాన సైన్యాధికారిగా, పేదలు, బలహీనులే ఆయనకు విధేయులైన సైన్యంగా గత రెండువేల ఏళ్లుగా సాగుతున్న సమరంలో రక్తపుటేరులు కాదు.. ప్రేమ, క్షమాపణ అనే జీవనదులు పొంగి పారుతున్నాయి. చరిత్రలో దుర్నీతి, దౌర్జన్యం, దుష్టన్యాయమే ఇతివృత్తంగా సాగి నిరుపేదల దోపిడీ కి పెద్దపీట వేసిన సామ్రాజ్యాలకు ప్రత్యామ్నాయంగా ప్రభువు తన దైవిక రాజ్య స్థాపన కోసం ‘్రౖకైస్తవాన్ని’ తన సాత్విక ఆయుధంగా ఎంచుకున్నాడు. క్రీస్తు సారథ్యంలోని ‘క్రైస్తవం’ దేవుని రాజ్యానికి ప్రతీక. అందువల్ల అవినీతికి, ఆశ్రితపక్షపాతానికి, ఆడంబరాలకు, ధనాపేక్షకు అతీతంగా క్రీస్తును పోలి జీవించే వారే క్రైస్తవం లో పౌరులు. మరి దీనికంతటికీ భిన్నంగా బోధిస్తూ, జీవిస్తూ ఉన్నవాళ్లు ఎవరు? యేసుప్రభువు పరిభాషలో చెప్పాలంటే, వాళ్లు గోధుమల మధ్య ‘శత్రువు’ కుట్రతో పెరుగుతున్న ‘గురుగులు’ (మత్తయి 13:27)!! శత్రువులు రెండు రకాలు. ఎదురుగా నిలబడి మనతో యుద్ధం చేసే శత్రువు ఒకరైతే, దొంగచాటు దెబ్బలతో మనిషిని పడగొట్టే శత్రువు మరొకరు. చెట్లతో కిక్కిరిసి ఉన్న కీకారణ్యంలో నడిచే బాటసారులను, వేటగాళ్లను కింద గడ్డిలో దాక్కొని అకస్మాత్తుగా మడిమె మీద కాటేసి చంపే విషసర్పం లాంటి వాడు ‘సైతాను’ అని పిలిచే ఈ శత్రువు. గోధుమల మధ్య గురుగులు విత్తే అలవాటున్న శత్రువు.. కుటుంబాల్లో, చర్చిల్లో, చివరికి క్రైస్తవ సమాజంలో, మానవ సంబంధాల్ని కలుషితం చేసి చిచ్చు పెట్టడంలో దిట్ట. అందుకే ఈ ‘క్రిస్మస్’ లో తెగిపోయిన అనుబంధాల్ని పునరుద్ధరించుకోవడమే ప్రధాన ధ్యేయంగా పెట్టుకోండి. లోకంలో చాలా తేలికైన పని బయట పరిచర్య సాగించడం. చాలా కష్టమైన పని తల్లిదండ్రులు, తోబుట్టువు లతో సఖ్యత కలిగి ఉండటం. యేసు స్థాపించబూనిన దైవికరాజ్యంలో మీరు భాగం కావాలాంటి తొలి అడుగుగా మీ అనుబంధాల్ని పునరుద్ధరించుకొని పటిష్టం చేసుకోండి. హ్యాపీ క్రిస్మస్!! – రెవ.డా.టి.ఎ.ప్రభుకిరణ్ -
అందుకే క్రిస్మస్ ట్రీకి వీటిని వేలాడదీస్తారు!
ప్రపంచ వ్యాప్తంగా జరిగే ముఖ్యమైన పండుగలలో ముందు వరుసలో నిలిచేది క్రిస్మస్. ప్రపంచంలోని పలు దేశాల్లో పలు క్రిస్మస్ ఆచారాలు ఉన్నాయి. అందులో కొన్ని ఎప్పుడో పురతాన కాలంలో ప్రారంభం కాగా, మరికొన్ని నూతనంగా ప్రవేశించాయి. ఈ క్రిస్మస్కు వారు ఎలాంటి ఆచారాలు పాటిస్తారో అవి ఎలా పుట్టుకొచ్చాయో తెలుసుకుందాం రండి. క్రిస్మస్ ట్రీకి ఎందుకు ‘షూ’ బోమ్మలను ఉంచుతారో తెలుసా.. క్రిస్మస్ చెట్టుకు క్రిస్మస్ తాత ‘షూ’ను వేలాడదీసి కట్టడం మీరు చూసే ఉంటారు. కొన్ని ప్రాంతాల్లో క్రిస్మస్ పండుగకు టపాసులు కాలుస్తారు. కానీ కేవలం పిల్లలు మాత్రమే ఈ టపాసులను కాలుస్తారు. ఓ నిరుపే దవ్యక్తికి ముగ్గురు కూతుళ్లు ఉన్నారు. అయితే క్రిస్మస్ రాగానే వారు తమ తండ్రి టపాసులు కావాలని అడిగారు. అయితే ఆ తండ్రి ఇప్పడు వద్దమ్మా తరువాత కొనిస్తాను అని చెప్పాడు. చుట్టుపక్కల పిల్లలు టపాసులు కాల్చడం చూసి తమకూ కావాలని వారు పట్టుబట్టారు. కానీ తండ్రి వద్ద కొనడానికి డబ్బులే లేవు. ఎలాగైనా సరే అవి మాకు తెచ్చి పెట్టు అంటూ పిల్లులు మారాం చేశారు. అలా ఏడుస్తున్న పిల్లలు టపాసుల శబ్థం వచ్చి బయటికి వచ్చి చుశారు. అక్కడ వారి ఇంటి ముందు ‘షూ’లో బోలేడన్ని బహుమతులు, టపాసులు పెట్టి ఉండటం వారు గమనించారు. ఇవి ఎవరు తెచ్చారా అని చుట్టూ చూసిన వారు ఎరుపు రంగు ఉలను టోపి, అదే రంగులో ఉన్ని కోటును ధరించి చేతి కర్రతో వెలుతున్న ఓ ముసలి వ్యక్తిని చూశారు. అలా చూస్తూ ఉండగానే ఆయన మంచులో మాయమైపోయాడు. ఆ తర్వాత వారు ఇంటి లోపలికి వెళ్లి వాళ్ల నాన్నతో క్రిస్మస్ తాత వచ్చి మాకు టపాసులు ఇచ్చాడంటూ సంబర పడిపోయారు. అలా అప్పటీ నుంచి ప్రతి క్రిస్మస్కు పిల్లలందరూ క్రిస్మస్ చెట్లకు, ఇంటి ముందు ‘షూ’ను వెలాదీసీ ఉంచడం మొదలు పెట్టారు. ఎందుకంటే క్రిస్మస్ తాత వచ్చి వాటిలో క్రిస్మస్ బహుమతులు, టపాసులు పెట్టి వెడతాడని వారి నమ్మకం. రాను రానూ క్రిస్మస్ ట్రీకి ‘షూ’ను వేలాడదీయడం ఆనవాయితీగా మారింది. జర్మనీ రాజు తెచ్చిన గ్రీటింగ్ కార్డులు: 1843లో ఇంగ్లాండు దేశానికి చెందిన సర్ హెన్నీ కోల్ తన బంధు మిత్రులకు క్రిస్మస్ శుభాకాంక్షలు వినూత్న రీతిలో తెలపాలని అనుకున్నాడు. వెంటనే కొన్ని కార్డులను తయారు చేసి దాని మీద క్రిస్మస్, నూతన సంవత్సర శుభాకాంక్షలు అని రాయించాడు. వాటిని తన మిత్రులకు పంపడంతో ఈ ఆచారం పుట్టుకొచ్చింది. కార్డులు ఒక్కసారి ఇస్తే అవి జీవితాంతం దాచుకుంటారు. అనుకోని సంఘటనలు ఎదురైతే తప్ప వాటిని కోల్పోరు కదా. అందుకే ఈ గ్రీటింగ్ కార్డులు ఇస్తే అవి ఎప్పటికీ తీపి గుర్తులుగా ఉండిపోతాయి.. ఇది మంచి ఆలోచన. ఎప్పటికీ ఎండిపోని ఫిర్ చెట్టు(క్రిస్మస్ ట్రీ).. క్రిస్మస్ చెట్టు ఆచారం జర్మనీ నుంచి పుట్టుకొచ్చింది. సాధారణంగా ఫిర్ చెట్టును క్రిస్మస్ చెట్టుగా అలంకరిస్తారు. ఈ చెట్టుకు ఒక ప్రత్యేకత ఉంది. ఇది అన్ని కాలాల్లోనూ ఎండిపోకుండా పచ్చగా ఉంటుంది.అలాగే మన జీవితాల్లో కూడా దేవుని దీవెనలను అలాగే ఉండాలన్న ఆలోచనలతో ఈ ఆచారం పుట్టుకొచ్చింది. 1846లో విక్టోరియా రాణి, జర్మనీ రాకుమారుడు అల్బర్ట్‌ను కలసి అలంకరించిన క్రిస్మస్ ట్రీ పక్కన నిలుచుని ఫొటో దిగారు. అతి అన్ని వార్తాపత్రికలలో ప్రచురితం కావడంతో క్రిస్మస్ ట్రీ డిమాండ్ పెరిగింది. అనంతరం జర్మన్ ప్రజలు అమెరికాలో స్థిరపడటం వల్ల అమెరికాలో కూడా ఈ ఆచారం వాడుకలోకి వచ్చింది. చైనాలో అతిపెద్ద క్రిస్మస్ సిజన్ షాపింగ్ : క్రిస్మస్ సీజన్లో చైనాలో అత్యధిక కొనుగోళ్లు జరుగుతాయి. ఆ దేశంలో జరిగే అతి పెద్ద షాపింగ్ సీజన్ క్రిస్మస్ ముందు రోజే. క్రిస్మస్ ఆచారాల్లో అక్కడక్కడా కనిపించే యాపిల్ పండ్ల ఆచారం చైనా నుంచే వచ్చింది. మండారిన్ భాషలో యాపిల్ పండు ఉపయోగించే పదరం క్రిస్మస్ ఈవ్‌కు దగ్గరగా ఉంటుంది. అందుకే అక్కడ యాపిల్‌తో చేసిన అలంకరణలకు ప్రాధాన్యం ఎక్కువగా ఉంటుంది. ముందు రోజు ఉపవాసం: క్రిస్మస్ ముందు రోజైన డిసెంబర్ 24న రష్యన్ ప్రజలు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉపవాసం చేస్తారు. సాధారణంగా సూర్యుడు వెళ్లిపోయి చుక్కలు కనిపించినప్పుడు మాత్రమే ఆహారాన్ని భుజిస్తారు. అయితే మాంసం మాత్రం ముట్టుకోరు. కుత్యా అనే వంటకం అక్కడ ఫేమస్. ఆ వంటకంలో వివిధ రకాలైన ధాన్యాలు, తెనె, వంటి విత్తనాలు వేసి తయారు చేస్తారు. అయితే ఉపవాసం విరమించేటప్పుడు బోధకులు వారి ఇళ్లకు వెళ్లి వాటిపై పవిత్ర జలం చల్లి ప్రార్థనలు చేసిన తర్వాతే దానిని స్వీకరిస్తారు. - స్నేహలత (వెబ్ డెస్క్) -
క్రిస్మస్: దారి చూపిన స్టార్
సాక్షి, నాగార్జునసాగర్(నల్గొండ) : క్రిస్మస్ పండుగను పురస్కరించుకొని క్రైస్తవులు ఇంటింటికీ పైభాగాన క్రిస్మస్ స్టార్‌ను అమర్చుతారు. సెమి క్రిస్మస్ నుంచి ఈ స్టార్స్‌ను ఏర్పాటు చేస్తారు. బుధవారం క్రిస్మస్ పండుగ ఉండటంతో నందికొండ మున్సిపాలిటీ కాలనీల్లో ఉన్న అన్ని ప్రముఖ ఫ్యాన్సీ షాపుల్లో క్రిస్మస్ స్టార్స్ విక్రయించేందుకు సిద్ధంగా ఉంచారు. క్రీస్తు జన్మించిన స్థలానికి మార్గం చూపిన తారగా దీనిని భావిస్తారు. క్రిస్మస్ సార్స్ ప్రాధాన్యత... క్రిస్మస్ స్టార్స్ గురించి పూర్వీకులు ఈ విధంగా చెప్పారు. ఏసుక్రీస్తు జన్మించిన వెంటనే ఆకాశంలో ఒక కొత్త నక్షత్రం పుట్టింది. మిగతా నక్షత్రాలకంటే అత్యంత ప్రకాశవంతంగా వెలుగుతున్న ఆ నక్షత్రం వైపే అందరి దృష్టిపడింది. ఆకాశంలో ఏదైన కొత్తగా ప్రకాశవంతంగా పుట్టిందని జగతిని కాపాడేందుకు గొప్పవారు జన్మించినట్టే అనే నమ్మకంతో ఆ తార వైపు పయనించసాగారు. తూర్పుదేశ జ్ఞానులు ఆకాశంలో ప్రకాశిస్తున్న తార ఎటు కదిలితే అటు పయనించారు. ఈ నక్షత్రం జెరుసలెంలోని బెత్లహంలో పశువులకొట్టం వద్ద తనప్రయాణాన్ని ఆపింది. పశువుల కొట్టం వద్ద తూర్పుదేశ జ్ఞానులు అప్పుడే జన్మించిన ఏసును కనుగొన్నారు. ఈ విధంగా పలుప్రాంతాలకు చెందిన వారు జగతి మేలుకోసం జన్మించిన ఏసుకు కానుకలుగా బంగారం, సాంబ్రాణి, సుగంధ పరిమళాలతో కూడిన బోళమును సమర్పించారు. అప్పటినుంచి క్రైస్తవుల్లో నక్షత్రానికి ప్రాధాన్యత ఏర్పడింది. క్రీస్తు జన్మించిన ప్రదేశానికి దారి చూపిన నక్షత్రానికి గుర్తుగా అందరూ తమ ఇళ్లల్లో క్రిస్మస్ స్టార్స్ ఏర్పాటు చేస్తారు. క్రిస్మస్కు నెలరోజుల ముందుగానే ఈ స్టార్‌ను ఉంచుతారు. క్రిస్మస్ను తెలియజేస్తుంది క్రిస్మస్ పండుగకు ముందు క్రైస్తవులందరూ తమ ఇళ్లల్లో స్టార్స్‌ను ఉంచుతారు. అర్థమవుతుంది. చాలా సంతోషంగా ఈ క్రిస్మస్ పండుగను జరుపుకుంటాం. – డి.కోటేశ్వర్రావు, సాగర్ అధిక సంఖ్యలో ఆరాధించే దేవుడు క్రీస్తు అధికసంఖ్యలో ఆరాధించే దైవం ఏసు క్రీస్తు. ప్రతి క్రైస్తవుడు ఘనంగా జరుపుకునే ఈ పండుగలో క్రిస్మస్ స్టార్‌కు అధిక ప్రాధాన్యత ఇస్తాం. ఇంటి ఎదుట క్రిస్మస్స్టార్ను అలంకరించగానే ఇంట్లో పండుగ వాతావరణం వచ్చేస్తుంది. – విజయప్రభావతి, హిల్‌కాలనీ -
ఒక్కో చర్చి ఎంతో ఘన కీర్తి
రాష్ట్రంలోనే రెండో పెద్దది సీఎస్ఐ కొత్తగూడెంటౌన్: కొత్తగూడెం పట్టణంలోని సెయింట్ ఆండ్రూస్ సీఎస్ఐ చర్చి రాష్ట్రంలోనే రెండో పెద్ద చర్చిగా గుర్తింపు పొందింది. డోర్నకల్ డయాసిస్‌లో అతిపెద్దది. 1943లో బ్రిటిష్ కాలంలో కొత్తగూడెంలో 15 కుటుంబాలతో ఏర్పడిన సంఘం ఆధ్వర్యంలో పోస్టాఫీస్ సెంటర్లో నిర్మించారు. 2005లో రూ.1.60కోట్ల విరాళాలతో ఆధునిక పద్ధతిలో తిరిగి నిర్మించి పునఃప్రారంభించారు. జిల్లా కేంద్రంలో ప్రధానమైన కట్టడంగా గుర్తింపును సంతరించుకుంది. ఒకేసారి మూడువేల మంది ప్రార్థనలు చేయొచ్చు. ప్రతి ఆదివారం జన సందోహంగా మారుతుంది. రాష్ట్రంలోని వివిధ జిల్లాలు, విదేశాల నుంచి కూడా వచ్చి సందర్శిస్తుంటారు. వేడుకలకు సిద్ధం చేశాం.. ప్రతి ఏడాది ఇక్కడ క్రిస్మస్ పండుగను ఎంతో ఘనంగా జరుపుకుంటాం. ఏసు జీవిత చరిత్రను భక్తులకు వివరించేందకు ప్రత్యేకంగా ఏర్పాట్లను చేశాం. ఈ చర్చికి ప్రతి ఆదివారం రాష్ట్ర నలుమూలల నుంచి క్రైస్తవ భక్తులు వస్తుంటారు. – టి.జాన్సన్, సీఎస్ఐ చర్చి చైర్మన్ కరుణగిరి.. ఖమ్మంరూరల్: మండలంలోని నాయుడపేట నుంచి మొదలై..అటు బైపాస్ రోడ్డుకు ఆనుకుని ఉన్న కరుణగిరి చర్చి ఎంతో ప్రఖ్యాతిగాంచింది. ఇక్కడ గత 20 ఏళ్ల నుంచి క్రైస్తవులు విశేష ప్రార్థనలు చేస్తున్నారు. ఆధునిక నిర్మాణ పద్ధతి ఆకట్టుకుంటుంది. ప్రతి ఆదివారం వందలాదిగా క్రైస్తవులు ఇక్కడికి వస్తుంటారు. విశాల ఆహ్లాద ప్రాంగణం దీని మరో ప్రత్యేకత. ఖమ్మంనగరంతో పాటు కూసుమంచి, తిరుమలాయపాలెం, ఖమ్మంరూరల్, మరిపెడ మండలాల నుంచి ఇక్కడికి తరలివస్తుండడం విశేషం. లివింగ్ గాస్పెల్ చర్చి.. పాల్వంచ: పట్టణంలోని కాంట్రాక్టర్స్ కాలనీలో ఉన్న లివింగ్ గాస్పెల్ చర్చ్ (ఎల్జీఎం) ఇండిపెండెంట్ చర్చిల్లోనే అతి పెద్దదిగా గుర్తింపుపొందింది. 1984లో సింగరేణి సంస్థలో ఉద్యోగాన్ని వదిలి పాస్టర్ లిటిల్ దేవసహాయం నలుగురైదుగురు భక్తులతో లివింగ్ గాస్పెల్ చర్చిని బాపూజీ నగర్లో ప్రారంభించారు. నేడు వేలాది మంది భక్తులు ఇక్కడికి వస్తున్నారు. లిటిల్ దేవసహాయం కుమారుడు సాధు టైటస్ లివింగ్ వాటర్ వివాహం చేసుకోకుండా దైవ సేవ చేయాలనే తలంపుతో పాస్టర్‌గా మారారు. ఆయన కాంట్రాక్టర్స్ కాలనీలో అధునిక పద్ధతుల్లో చర్చిని నిర్మింపజేసి 2016 జనవరి7వ తేదీన ప్రారంభించారు. ఉభయ జిల్లాల నుంచి ఇక్కడికి వేలాదిమంది వస్తుంటారు. ప్రతి మంగళ, శుక్ర, ఆదివారాల్లో ప్రత్యేక ప్రార్థనలు జరుగుతుంటాయి. టైటస్ లివింగ్ వాటర్ పేదలు, అనారోగ్యంతో ఉన్న వారికి, అనాథలకు తన వంతు సహకారం అందిస్తున్నారు. యేసు ప్రేమను చాటడమే లక్ష్యం యేసు క్రీస్తు చూపిన ప్రేమను చాటడమే నా లక్ష్యంగా భావిస్తున్నా. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా తమ వంతు కృషి చేస్తున్నాం. అనుబంధంగా జిల్లాలో ఐదు చర్చిలు, చత్తీస్‌గఢ్ రాష్ట్రంలో నాలుగు చర్చిలు ఉన్నాయి. మాకు ఇతర ఏ సంస్థల నుంచి ఎలాంటి ప్రొత్సాహం లేదు. స్వతహాగా ఇక్కడి భక్తుల సహకారంతో ముందుకు సాగుతున్నాం. – సాధు టైటస్ లివింగ్ వాటర్, పాస్టర్ అద్భుతం..లూర్థుమాత ఆలయం తల్లాడ: రాష్ట్రీయ రహదారి పక్కనే తల్లాడలో ఉన్న జిల్లాలోనే అతి పెద్ద చర్చిల్లో ఒకటిగా లూర్థుమాత ఆలయం పేరెన్నికగన్నది. 21 సంవత్సరాల క్రితం రోమన్ కేథలిక్ మిషన్ ఆధ్వర్యంలో నిర్మించారు. ఒకేసారి మూడువేల మంది ప్రార్థనలు చేయొచ్చు. అద్భుతమైన కల్వరి కొండలు, ఏసుక్రీస్తు జీవితానికి సంబంధించిన విశేషాలు, లూర్థమాతా చిత్రపటాలు ఎంతో ఆకర్షణీయంగా ఉంటాయి. చర్చిగోపురం 150 అడుగుల ఎత్తులో ఉంటుంది. ఆలయం గంట మోగినప్పుడు కిలోమీటరుకుపైగా వినిపిస్తుంది. ప్రాంగణం ప్రశాంతంగా ఉంటుంది. క్రిస్మస్ అంటే క్రీస్తు ఆరాధనే.. బాల యేసు పశువుల పాకలో జన్మించడం ఒక అద్భుత కార్యం. అలాంటి రోజును అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకోవడమే కిస్మస్. క్రైస్తవులకు ఇదే పెద్ద పండుగ. కులమత బేధాలకు తావులేకుండా ఎంతో ఆనందంగా, సంతోషంగా జరుపుకోవాలి. – పుట్టి రాజేంద్రప్రసాద్, లూర్థుమాత ఆలయం విచారణ గురువు, తల్లాడ ఆకట్టుకునే ఆర్సీఎం పాల్వంచ: స్థానిక ఆర్సీఎం చర్చిని కేరళకు చెందిన గోర్తిక్ ఆర్ట్ విధానంలో కట్టారు. కేరళ రాష్ట్రానికి చెదిన ఆగస్టీన్ అనే ఆర్కిటెక్ట్ దీనికి రూపకల్పన చేయగా అప్పటి ఫాదర్ బెనడిక్ట్ ఆధ్వర్యంలో 2013 జూన్ 8న చర్చిని పునఃప్రారంభించారు. దేవ దూతల విగ్రహాలు, ఏసు ప్రతిమలు, ఆయన శిష్యుల విగ్రహాలు ఎంతో ఆకట్టుకుంటాయి. తెల్లవారేదాకా ప్రార్థనలు 24వ తేదీ రాత్రి 11 గంటల నుంచి 25వ తేదీ తె ల్లవారుజాముదాకా..క్రిస్మస్ ప్రార్థనలు ఉంటాయి. మళ్లీ 31వ తేదీ రాత్రి నుంచి ప్రేయర్ చేయిస్తాం. భక్తులకు సౌకర్యాలు ఏర్పాటు చేశాం. ఇంకా ప్రత్యేక సందర్భాలను కూడా నిర్వహిస్తుంటాం. – ఆంథోని కడే పరంబిల్, చర్చి ఓసీడీ -
ఏసు ప్రాణత్యాగానికి ప్రతీకగా..
ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రైస్తవులు ఎంతో సంబరంగా జరుపుకునే పండుగ క్రిస్మస్. ఏసుక్రీస్తు జన్మదినం (డిసెంబర్ 25) సందర్భంగా జరుపుకునే పండుగ ఇది. ఏసుక్రీస్తు పుట్టిన రోజు కాబట్టి క్రైస్తవులంతా చర్చిలకి వెళ్లి ఆయన జన్మదినాన్ని అంగరంగ వైభవంగా జరుపుకుంటారు. ఈ క్రమంలో క్రైస్తవుల పవిత్ర ప్రార్థనా మందిరాలైన చర్చిలను ఆ రోజు రంగు రంగు లైట్లతో, క్రిస్మస్ ట్రీతో అలంకరిస్తారు. అలాగే ప్రముఖ దేశాలైన లండన్, యురప్లలోని చర్చిలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. భిన్నమైన రూపశైలిలో అద్బుత కట్టడాలుగా పేరున్న ఈ చర్చిలకు ఓ విశేషమైన ప్రత్యేకత ఉంది. వాటి నిర్మాణాల వెనుక ఎన్నో విషయాలు ఉన్నాయి. ఈ సుప్రసిద్ధ ప్రార్థనా మందిరాలు ప్రపంచ వ్యాప్తంగా పర్యటకులను ఆకట్టుకుంటున్నాయి. ఇందులోని కొన్ని చర్చిలు చాలా సినిమాలలో కూడా కనిపించాయి. బైబిల్లో పేర్కొన్న రాజుల పేర్లను, ఏసుక్రీస్తు తల్లి మరియా పవిత్రకు, ఏసు ప్రాణత్యాగానికి ప్రతీకగా బెత్లెహాంలో నిర్మించిన చర్చిలకు ప్రపంచ మందిరాలలో పవిత్రంగా చూస్తారు. అలాంటి చరిత్ర కలిగిన ఈ అద్బుత కట్టడాల గురించి ఓ సారి తెలుసుకుందాం రండి! సాగ్రడా ఫ్యామిలియా, బార్సిలోనా, స్పెయిన్ ఇది ప్రపంచ ప్రముఖ చర్చిల్లో ఒకటి. స్పెయిన్‌లోని బార్సినాలోని యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంలోని నిర్మించిన రోమన్ కాథలిక్ ప్రార్థన మందిరం. దీనిని 1882లో ప్రముఖ అర్కిటెక్చర్ ఆంటోని గౌడే నిర్మించారు. ఈ చర్చి నిర్మాణం 1882 లో ప్రారంభమైనప్పటికి దీనిని నిర్మాణం ఇప్పటికీ పూర్తి కాలేదు. అసంపూర్తిగా ఉన్నప్పటికీ ప్రపంచంలోని ప్రముఖ చర్చిలలో ఇది ఒకటిగా ఉంది. ఓ అద్భుత కళాఖండంతో నిర్మించిన ఈ మందిరానికి పర్యాటకులు ఫిదా అవుతున్నారు. ఏటా ఈ చర్చిని సందర్శించే వారి సంఖ్య లక్షల్లో ఉంటుంది. ఈ చర్చిపై నిర్మించిన 18 స్తంభాలు మందిరానికి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. అప్పటి అర్కిటెక్ గౌడే రూపొందించిన ఈ చర్చి ప్రకృతిని తలపించేలా ఉంటుంది. చర్చి లోపల నిర్మించిన స్తంభాలు మెలితిప్పినట్లుగా ఉండి కొమ్మల్లాంటి చెట్ల ఆకృతిలో ఉంటాయి. ఇవి పర్యటకులను విపరీతంతగా ఆకట్టుకుంటాయి. అలాగే చర్చి ముందు భాగంలో బేస్ వద్ద పాలరాతితో చెక్కిన రెండు తాబేళ్లు మందిరానికి ప్రత్యేక ఆకర్షణ. అవి భూమి, సముద్రాన్ని సమతుల్యం చేస్తున్నాయని చెప్పడానికి ఉదాహరణగా వాటిని అక్కడ చెక్కారు. ఇక చర్చి పైకప్పుపై చెక్కిన మొజాయిక్ నుంచి రాత్రి వేళ చర్చి లోపలికి చంద్రకాంతి పడటం వల్ల ఆ దృశ్యాన్ని చూడటానికి పర్యాటకులు ఆసక్తి చూపుతారు. చంద్రుడి కాంతితోవచ్చే వెలుగు వల్ల చర్చి బయట నుంచి చూసే వారికి ఓ లైట్ హౌజ్లా మెరిసిపోతూ ఉంటుంది. అందువల్ల దీనిని ‘లైట్ హౌజ్’ అని కూడా పిలుస్తుంటారు. అలాగే మందిరంపై నిర్మించిన 18 టవర్లకు ఒక ప్రత్యేకత ఉంది. అందులో ఒక స్తంభం కన్య మరియ మేరి మాతకు చిహ్నంగా నిర్మించగా.. 12 టవర్లను బైబిల్లో పేర్కొన్న అపొస్తులులకు ప్రాతినిధ్యం వహిస్తాయి. మరో నాలుగు స్థంభాలు వారిలోని నలుగురు సువార్తికులకు ప్రాతినిధ్యం వహిస్తాయి. ఇక మందిరంపై మధ్యలో నిర్మించిన అతిపెద్ద టవర్ ఏసుక్రీస్తును సూచిస్తుంది. 170 మీటర్ల ఎత్తులో ఉండి బార్సిలోనాలోని మౌంట్‌జ్యూక్ పర్వతం కంటే ఒక మీటర్ తక్కువగా ఉంటుంది. ఈ మౌంట్‌జ్యూక్ పర్వతం స్పెయిన్‌లో ఎత్తైనా పర్వతం. ఇప్పటికీ అసంపూర్ణంగా ఉండిపోయిన ఈ చర్చిని పర్యటించడానికి కనీసం వారం రోజులైన పడుతుంది. అయితే దీనికి ఇప్పటికీ మర్మత్తులు చేస్తూనే ఉన్నారు. అక్కడికి వచ్చే పర్యాటకులు ఈ చర్చి నిర్మాణం కోసం విరాళాలు కూడా ఇస్తుంటారు. ఎప్పుడు మరమ్మత్తులు చేస్తూ ఉన్న ఈ మందిరం 2026 నాటికి పూర్తికావచ్చు. సెయింట్ బాసిల్ కేథడ్రల్ చర్చి అత్యంత ప్రసిద్ధ చర్చిలలో ఒకటైనా ఈ సెయింట్ బాసిల్ కేథడ్రల్ చర్చిని ఒకే పునాదిపై తొమ్మిది ప్రార్థనా మందిరాలుగా నిర్మించారు. రష్యా రాజధాని మాస్కో నగరంలో ఉన్న ఈ చర్చి నిర్మాణం క్రీ.శ. 1561లో ఇవాన్ ది టెర్రిబుల్ పాలనలో పూర్తయింది. ఈ చర్చి అసాధారణమైన వివిధ రంగుల నిర్మాణాన్ని కలిగి ఉంటుంది. సాగ్రడా ఫ్యామిలియా మాదిరిగా, ఇది యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశం. ఇది పలు సినిమాల్లో కూడా కనిపిస్తుండం విశేషం. దీని లోపలి భాగంలో చాపెల్ నుంచి ఇరుకైన మెట్లు ఉండి, తక్కువ తోరణాలు, గజిబీజీ చాపెల్లతో నిర్మించబడిన ఉండటమే ఈ మందిరం ప్రత్యేకత. ఒకదానిని ఒకటి అనుకుని ఉండే ఈ చాపెల్లలోని ఒక్కోదానికి ఒక్కో ప్రత్యేకత ఉంది. అవి.. పైకప్పు మధ్యలో ఉన్న టవర్ ఏసుక్రీస్తు తల్లి మేరిమాతకు చిహ్నంగా నిర్మించి.. దీనికి చర్చి ఆప్ ది ఇంటర్సేషన్ అని పేరు పట్టారు. ఇక కనిపించే నాలుగు పెద్ద గోపురాలు అష్టభుజి ప్రార్థన మందిరాలు(చర్చ్ ఆఫ్ ది హోలీ ట్రినిటీ, చర్చ్ ఆఫ్ స్టీస్ సిప్రీయన్& జస్టీనా, చర్చ్ ఆఫ్ ది ఐకాన్ ఆఫ్ సెయింట్ నికోలాస్ ది మిరాకిల్ వర్కర్, చర్చ్ ఆఫ్ ది ఎంట్రీ ఆఫ్ ది లార్డ్ జెరుసలేం) అనే బైబిల్లోని కొన్ని పవిత్ర స్థలాలకు ప్రతికగా ఈ పేర్లన పెట్టారు. బయటి నుంచి చూస్తే చిక్కుముడిగా కనింపిచే ఈ టవర్ల మధ్యలో నాలుగు చిన్నప్రార్థన మందిరాలు ఉన్నాయి. ప్రతి ప్రార్థనా మందిరం కజాన్‌కు వ్యతిరేకంగా చేసిన పోరాటంలోని సంఘటనకు, యుద్ధానికి గౌరవసూచికగా నిర్మించారు. ఈ సెయింట్ బాసిల్ కేథడ్రల్ రంగుల నిర్మాణం నిజంగా ఓ అద్బుతంలా ఉంటుంది. ఈ చర్చి రూపకర్త సెయింట్ బాసిల్ బ్లెస్డ్ను చర్చి లోపలి ప్రార్థనా మందిరంలో సందర్శించవచ్చు. అక్కడ ఆయన విగ్రాహన్ని వెండి పేటికలో ఉంచారు. అయితే ఇలాంటి అద్బుత కట్టడం మరెక్కడా ఉండకూడదనే ఉద్దేశంతో కూలీల కళ్లు తీయించి వారిని అంధులుగా మార్చాడట. నోట్రే డామ్ డి పారిస్- ఫ్రాన్స్: నోట్రే-డామ్ డి పారిస్ అనగా ‘అవర్ లేడీ ఆఫ్ పారిస్. దీనిని సింపుల్‌గా నోట్రే-డామ్ అని కూడా పిలుస్తారు. పారిస్‌లోని అరోండిస్మెంట్లో ఓలే డి లా సిటిలో తూర్పు చివరలో ఈ చర్చిని నిర్మించారు. కన్య మరియ మేరి మాతకు పవిత్రమైన పత్రికగా దీన్ని ప్రకటించారు. ఈ కేథడ్రల్ చర్చి లోపలి విస్తీర్ణం 427-157 అడుగులు(130 నుంచి 48మీటర్లు) దీని పైకప్పు 115 అడుగుల(35 మీటర్ల) ఎత్తులో ఉంటుంది. రెండు పెద్ద గోతిక్ టవర్లు 50 అడుగు వెడల్పు, 1210 పొడవును కలిగి ఈ మందిరానికి పశ్చిమ ముఖానికి కిరీటంగా ఉంటాయి. ఇక చర్చి ముఖ ద్వారం ప్రవేశ ద్వారం తలుపులు గోతిక్ శిల్పాలతో చెక్కబడిన రాజుల విగ్రహాలు వరుసగా ఉంటాయి. ముందు భాగంలో ఉన్న రెండు పెద్ద టవర్లు 68 మీటర్ల ఎత్తులో కలిగి 223 అడుగులు పొడవు ఉంటాయి. రంగులతో మెరిసేటి అద్దాల కిటికిలు 1235-70 పొడవు- వెడల్పులో ఉంటాయి. ముందు భాగంలో ఉండే పొడవైన రెండు స్తంభాలు లేక్కలేనన్ని గంటలను కలిగి ఉంటాయి. ఫ్రెంచ్ గోతిక్ రూపశైలిలో ఉండే నోట్రే-డామ్ చర్చి ప్రపంచ ప్రముఖ చర్చిలలో ఒకటిగా ప్రసిద్ది పొందింది. 1163లో పోప్ అలెగ్జాండర్-3 ఈ చర్చికి పునాది రాళ్లు వేయగా 1250 నాటికి ఈ చర్చి పురైంది. చర్చి నిర్మించిన 100 సంవత్సరాలకు మందిరం ముందు భాగంలోని రెండు ఎత్తైనా చాపెల్‌లను, ఇతర స్థంభాలను, విగ్రహాలను నిర్మించి ఈ ప్రార్థన మందిరాన్ని పూర్తి చేశారు. అయితే ఈ మందిరాన్ని 19వ శతాబ్థంలో పూర్వపు రెండు పవిత్ర ప్రార్థన మందిరాల నిర్మించినట్లు సమాచారం. సెయింట్ పీటర్స్ బసిలికా: వాటికన్ సిటి ఇది వాటికన్ సిటిలో ఉంది. దీనిని న్యూ సెయింట్ పీటర్స్ బసిలికా అని కూడా పిలుస్తారు. ఇటలీలో రోమ్‌లోని వాటికన్ నగరంలోనే ఇది పెద్దది. దీన్ని క్రైస్తవుల మతపరమైన చర్చిలన్నింటీ కంటే గొప్ప మందిరం. వాటికన్ నగరంలో సెయింట్ పీటర్ ప్రస్తుత బాసిలికా నగరంలో(రోమ్‌లోని ఒక ఎన్క్లేవ్), 2వ జూలియస్1506 లో ఈ మందిరం నిర్మాణాన్ని ప్రారంభించాడు. అయితే అది 1615 పాల్.వీ రాజు కాలంలో పూర్తైంది. సెయింట్ పీటర్ అపొస్తల రాజు నిర్మించిన మూడు ఎత్తైన బలిపీఠాలపై నుంచి నేరుగా క్రాసింగ్ వద్ద ఉన్న పెద్ద గోపురాన్ని కలుపుతూ నిర్మించారు. ఈ మందిరం అక్కడి పోప్‌ల చర్చే కాకుండా వారి ప్రధాన తీర్థయాత్ర కూడా. కాథలిక్ సంప్రదాయంలో, యేసు పన్నెండు అపొస్తలులలో ఒకడైన సెయింట్ పీటర్ శ్మశానవాటికగా భావిస్తారు. ఆయన సెయింట్ పీటర్ రోమ్ యొక్క మొదటి బిషప్ అని, బైబిల్ ప్రకారం.. క్రీ.శ. 1వ శతాబ్దంలోని రోమన్ క్రైస్తవులు అపొస్తలుడైన పేతురు(సెయింట్ పీటర్) రోమ్కు వెళ్లాడని బైబిల్లో పేర్కొన్నారు. పీటర్ చనిపోయిన తరువాత ఆయన మృతదేహాన్ని బాసిలికాలోని స్మశానవాటికలో ఖననం చేశారని అక్కడి వారి నమ్మకం. వెస్ట్ మినిస్టర్ అబ్బే యూరప్ దేశాలలోని అత్యంత ప్రసిద్ద మత భవనాలలో ఇది ప్రముఖమైనది. ప్రపంచంలోనే అత్యంత ప్రాముఖ్యత కలిగిన ప్రార్థన మందిరంగా దీన్ని పిలుస్తారు. లండన్ బరలిలోని పార్లమెంటు భవనానికి పశ్చిమాన ఈ మందిరాన్ని నిర్మించారు. మాజీ బెనెడక్టిన్ ఆశ్రమంగా ఉన్న ఈ మందిరాన్ని క్వీన్ ఎలిబెత్2, 1560లో సెయింట్ పీటర్ కాలేజీయేట్ చర్చిగా మార్చారు. ఆ తర్వాత 1987లో దీనిని సెయింట్ మార్గరేట్ చర్చి, పార్లమెంటు గృహాల సమిష్టి యునెస్కోగా నియమించారు. ఇది కూడా ప్రపంచ వారసత్వ స్థలం. ఈ ప్రార్థన మందిరాన్ని 1300 లో హెన్రీ యెవెల్ అనే రాజు ఆధ్వర్యంలో నార్మన్-శైలిలో నిర్మించారు. ఇంగ్లీష్ గోతిక్ డిజైన్ శైలిలో దీనిని నిర్మించారు. ఈ మందిరానికి పశ్చిమాన ఉన్న రెండు పెద్ద టవర్లు ప్రత్యేక ఆకర్షణగా ఉంటాయి. వీటిని సర్ క్రిస్టోఫర్ రెన్ రూపొందించినట్లు చెబుతారు. కాని అవి వాస్తవానికి నికోలస్ హాక్స్మూర్, జాన్ జేమ్స్‌లు నిర్మించినట్లుగా సమాచారం. ఈ చాపెల్‌లను వారు 1745 లో పూర్తిచేశారు. 1847 లోపలి గాయక స్టాల్స్, ఎత్తైన బలిపీఠం, రేడోలను పునర్నిర్మించి 1867లో సర్ జార్జ్ గిల్బర్ట్ స్కాట్ పూర్తిచేశారంటా. స్కాట్, జెఎల్ పియర్సన్ కూడా 1880 లలో ఉత్తర ట్రాన్సప్ట్ ముఖభాగాన్ని పుననిర్మించారు. అయితే రెండవ ప్రపంచ యుద్ధంలో బాంబు దాడుల్లో అబ్బే భారీగా దెబ్బతింది, యుద్దం అనంతరం ఈ మందిరాన్ని వెంటనే పునర్మించారు. లండన్‌లోని సెయింట్ పాల్స్ కేథడ్రాల్ ప్రపంచ ప్రముఖ చర్చిలలో ఒకటి. దీన్ని లండన్ బిషప్, డయోసెస్ తల్లి చర్చిగా పిలుస్తుంటారు. ఈ ప్రార్థనా మందిరాన్ని లండన్‌లోని ఎత్తైన లుడ్గేట్ కోండపై నిర్మించారు. అత్యంత ప్రముఖ, చరిత్రాత్మకంగా పేరున్న మందిరం ఇది. దీనిని పాల్ అపోస్తులు రాజు క్రీ.శ. 604లో దీన్ని నిర్మించడం జరిగింది. ఈ కేథడ్రల్‌ను 17వ శతాబ్ధపు రాజైన సర్ క్రిస్టోఫర్ రెన్ చేత ఇంగ్లీష్ బరోక్ శైలిలో నిర్మించారు. సర్ రెన్ కాలంలోనే ఈ చర్చి నిర్మాణం పూర్తిగా జరిగింది. ఈ చర్చిలో పాల్ అపోస్తుల రాజు గుర్తులు ఉండటం వల్ల దీనిని ఒల్డ్ సెయింట్ పాల్ చర్చి అని కూడా పిలుస్తుంటారు. ఈ మందిరంలో విక్టోరియా రాణి జూబ్లీ వేడుకలను, రెండవ ప్రపంచ యుద్ధాల ముగింపును సూచించే శాంతి సేవలు ప్రిన్స్ చార్లెస్, లేడీ డయానా స్పెన్సర్ వివాహం ఫెస్టివల్ ఆఫ్ బ్రిటన్ ప్రారంభంతో పాటు సిల్వర్, గోల్డెన్, డైమండ్ జూబ్లీలకు క్వీన్ ఎలిజబెత్-2 80, 90వ పుట్టినరోజు వేడుకలు, థాంక్స్ గివింగ్ సేవలు ఈ చర్చిలోనే జరిపారు. సెయింట్ పాల్స్ కేథడ్రల్‌కు సంబంధించిన గుర్తులు ఈ చర్చిలోనే భద్రపరిచారు. చర్చ్ ఆఫ్ ది నేటివిటీ: బెత్లెహాం బసిలికా ఆఫ్ ది నేటివిటీ ఇది బెత్లెహాంలోని వెస్ట్ బ్యాంక్‌లో ఉన్న బాసిలికా. యేసు జన్మస్థలంగా చెప్పుకునే ప్రదేశంలోనే ఈ చర్చిని నిర్మించారు. ఈ ప్రదేశం క్రైస్తవులకు పవిత్రమైన స్థలం, పవిత్ర ప్రార్థనా మందిరం. ఏసుక్రీస్తు ఇక్కడే నిరంతరం ప్రార్థనలు చేసుకునేవారని, అది గ్రోట్టో స్థలమని బైబిల్లో పేర్కొన్నారు. దీంతో క్రైస్తవులు ఈ స్థలాన్ని పవిత్రం స్థలంగా భావిస్తారు. 325-326లో బసిలికా అతని తల్లి హెలెనా జెరూసలేం, బెత్లెహాములను సందర్శించిన కొద్దిరోజులకే ఈ చర్చిని కాన్స్టాంటైన్ ది గ్రేట్‌గా నిర్మించారు. సాంప్రదాయకంగా ఏసు జన్మస్థలం అని భావించి ఇక్కడ బాసిలికా 330-333 కాలంలో నిర్మించినట్లు చెప్పుకుంటారు. 6వ శతాబ్ధంలో సమారిటన్ తిరుగుబాటు సమయంలో 529లో ఈ చర్చిని చాలా భాగాన్ని మంటలతో కాల్చేశారు. అయితే చాలా ఏళ్లకు మళ్లీ దీనిని బైజాంటైన్ చక్రవర్తి క్రీ.శ. 527-565 కాలంలో బాసిలికాను పునర్మించారు. 12వ శతాబ్దంలో క్రూసేడర్స్ చిత్రీకరించిన సెయింట్స్, ఫ్రెస్కోలతో అలంకరించారు. చర్చిలోకి చిన్న ఒట్టోమన్ యుగం నాటి తలుపు ద్వారం ఉంటుంది. దీనికి డోర్ ఆఫ్ రెస్పెక్ట్ అని పేరు పిలుస్తారు. అయితే వాస్తవానికి ఈ ప్రవేశ ద్వారం చాలా పెద్దది, కాని క్రూసేడర్లు దాని పరిమాణాన్ని తగ్గించి గుర్రంపై దాడి చేసేందుకు లోనికి ప్రవేశించకుండా చేశారు. ఆ తరువాత క్రమంగా దానిని అతిచిన్న ముఖ ద్వారంగా మార్చేశారు. 6వ శతాబ్దం నాటి అసలైన ద్వారానికి సంబంధించిన గుర్తులు ఇప్పటికీ అక్కడ కనిపిస్తాయి. క్రూసేడర్ల యుగంనాటి నిర్మాణ శైలిలో ఈ మందిరాన్ని నిర్మించారు. కాగా ఈ మందిరంలోని ఓ రహష్య చికటి గది లాంతర్లు వెలిగించి, 14 వెండి లైట్లతో అలంకరించి ఉంటుంది. ఏసుక్రీస్తు జన్మించిన స్థలం అదే అని చెప్పడానికి గుర్తుగా దానిని వెండి దీపాలతో అలంకరించారు. గ్రోట్టోలోని ఈ మందిరానికి పై మధ్య భాగంలో ఒక చాపెల్‌ను నిర్మించారు. దానిని ‘చాపెల్ ఆఫ్ ది మాంగెర్ (ది క్రిబ్) అని కూడా పిలుస్తారు. ఈ మందిరానికి, అదే ప్రత్యేక ఆకర్షణ. చర్చ్ ఆఫ్ ది హోలీ సెపల్చర్ దీనిని హోలీ సెపల్చర్ అని కూడా పిలుస్తారు, ఇది ఏసుక్రీస్తు సిలువ, ఖననం చేసిన పవిత్ర స్థలంలో నిర్మించిన ప్రార్థనా మందిరం. బైబిల్ ప్రకారం, ఏసుక్రీస్తు సమాధికి, సిలువ వేయబడిన ప్రదేశానికి దగ్గరగా ఉంది (జాన్ 19: 41:42). సిలువ, సమాధులను రెండింటి చూట్టు ఈ ప్రార్థన మందిరాన్నినిర్మించారు. ఓల్డ్ సిటీ ఆఫ్ జెరూసలేలోని వాయువ్యంలో హోలీ సెపల్చర్ చర్చి ఉంది. చక్రవర్తి కాన్స్టాంటైన్ ది గ్రేట్ అనే రాజు క్రీ.శ. 336లో సైట్లో అనే ప్రదేశంలో మొదటగా నిర్మించాడు. ఆ తరువాత 614లో పర్షియన్లు దీనిని కుల్చివేసి మోడెస్టస్ (థియోడోసియస్ ఆశ్రమ మఠాధిపతి, 616-626) పునరుద్ధరించారు. ఖలీఫ్ అల్-అకిమ్ బా-అమర్ అల్లాహ్ 1009లో దీనిని కుల్చివేయడంతో మళ్లీ 12వ శతాబ్దంలో క్రూసేడర్లు పునర్నిర్మాణాన్ని చేపట్టి ప్రార్థనలు చేసుకునేవారు. అలా తరుచూ మరమ్మత్తులు చేపడుతూ 1810 నాటికి పూర్తి చేశారు.. సెయింట్ మార్క్స్ బసిలికా వాస్తవానికి ఇది డోగే ప్రార్థనా మందిరం. సెయింట్ మార్క్స్ బసిలికా (బసిలికా డి శాన్ మార్కో) 829లో ముఖ్యమైన చర్చి. సెయింట్ మార్క్ యొక్క అవశేషాలు అలెగ్జాండ్రియా నుంచి వెనిస్కు వచ్చి ఇక్కడ ఖననం చేసినట్లుగా చెబుతారు. 1063 నాటి కాన్స్టాంట్ నోబెల్ చర్చ్ ఆఫ్ అపోస్టల్స్ చర్చి నమునాలను తీసుకుని ఇప్పటి గౌడే-ప్లాన్ శైలిలో నిర్మించారు. ఈ చర్చి నిర్మాణానికి 1075లో, డోజ్ ఒక చట్టాన్ని ఆమోదించి మరియు టింటోరెట్టితో సహా కళాకారులు రూపొందించిన ‘ఆధునిక’ మొజాయిక్లతో భర్తీ చేశారు. మొజాయిక్లు, బంగారు బలిపీఠం, అందమైన ప్రార్థనా మందిరాలు మరియు ఖజానా ఇటలీకి బాగా నచ్చిన పర్యాటక ఆకర్షణలలో ఒకటిగా నిలిచాయి. క్రీ.శ.1075 లోడోజ్ ఒక చట్టాన్ని ఆమోదించాడు, ఈ చర్చిని బాసిలికాను అలంకరించడానికి విలువైన వస్తువులను, తూర్పు నుంచి అరుదైన పాలరాయి, పోర్ఫిరీ, అలబాస్టర్ మరియు జాస్పర్ 500లకు పైగా స్తంభాలను తెప్పించి నిర్మించాడు. దీని లోపలి భాగాన్ని 12, 13 శతాబ్ధాల కాలం నాటి 4,240 చదరపు మీటర్ల బంగారు మొజాయికులతో నిర్మించాడు. 1500, 1750 మధ్య,కొన్ని పాత విభాగాలను టిటియన్, టింటోరెట్టోతో సహా కళాకారులు రూపొందించిన ఆధునిక మొజాయికన్లతో నిర్మించారు. అలాగే దీని ముఖభాగం ముందు రెండు పాలరాయి పైలాస్టర్లు, పిలాస్త్రీ అక్రితాని, ఆరవ శతాబ్దపు అద్భుతమైన శిల్పాలతో కప్పబడి ఉంటాయి. సెయింట్ మార్క్ మాదిరిగానే, ఈజిప్టు 4వ శతాబ్దంలోని మూలలోని టెట్రార్చ్స్ శిల్పం పోర్ఫిరీ నుంచి తీసుకుని ఈ శిల్పాలను రూపొందించారు. మొజాయిన్ల, బంగారు బలిపీఠం, అందమైన ప్రార్థనా మందిరాలు, ఖజానాలు ఉండటంతో ఇది ఇటలీలో అందమైన పర్యాటక ఆకర్షణలలో ఒకటిగా నిలిచింది. హగియా సోఫియా, ఇస్తాంబుల్, టర్కీ.. హగియా సోఫియా అనగా ‘పవిత్ర జ్ఞానం’ అని అర్ధం. ఇది మాజీ గ్రీకు ఆర్థోడాక్స్ పితృస్వామ్య ప్రార్థన మందరం. క్రీ.శ. 537లో నిర్మిచిన ఈ మందిరం క్రీ.శ.1453 వరకు మ్యుజియంగా ఉండేది. లాటిన్ సామ్రాజ్యంలో ఈ మందిరాన్ని రోమన్ కాథలిక్ కేథడ్రాల్ మందిరంగా మార్చారు. రెండు అంతస్తులుగా నిర్మించిన ఈ మందిరాన్ని క్రీ.శ. 537లో పూర్తిచేశారు. దీనిని 6 సంత్సరాలలో పూర్తి చేశారు. 6వ శతాబ్దంలో కాన్స్టాంటినోపుల్ (ఇప్పుడు ఇస్తాంబుల్, టర్కీ)లోని కేథడ్రల్ స్మారక చిహ్నంగా నిర్మించారు. దీనిపై నిర్మించిన గోపురం కేథడ్రల్‌కు చిహ్నం. హెలెన్ గార్డనర్, ఫ్రెడ్ క్లీనర్లు రూపొందించిన ఈ కట్టడాడంలో అసలు ఉక్కు పరికరాలను వాడకపోవడం ఈ మందిరానికి ఉన్న ప్రత్యేకత. ఈ మందిరాన్ని 270 అడుగుల (82 మీటర్లు) పొడవు మరియు 240 అడుగుల (73 మీటర్లు) వెడల్పులో నిర్మించారు. అలాగే దీనిపైన నిర్మించిన ప్రధాన గోపురం 108 అడుగుల (33 మీటర్లు) చర్చికి కిరీటంగా వ్యవహరిస్తుంది. ఈ గోపురం 180 అడుగుల (55 మీటర్లు) పెండెంటివ్స్ రెండు సెమిడోమ్లకు ప్రాతినిధ్యం వహిస్తుంది. మందిరంపైన నిలువుగా నిర్మించిన గ్యాలరీలతో వేరు చేసి ఉంటుంది. అలాగే మూడు అంతస్తుల మేట్లకు, గోపురానికి మద్దుతుగా ఓ పాలరాయి పైర్లను నిర్మించారు. గ్యాలరీలకు పైన ఉన్న గోడలు,గోపురం బేస్‌లు వివిధ డిజైన్ల కిటికీలచే అమర్చబడి ఉంటుంది. ఈ కిటికీల నుంచి వచ్చే గాలికి ఆకాశంలో తేలుతున్నట్లుగా అనిపిస్తుందని అక్కడ పర్యటించినవారు అంటుంటారు. 1,400 సంవత్సరాల కేథడ్రల్, మసీదుగా ఉండేది ఆ తర్వాత దీనిని ఈ చర్చిగా మార్చారు. ప్రస్తుతం ఇది పర్యటకానికి వీలుగా పురాతన వస్తువులను ఉంచే మ్యూజియంగా మార్చారు. దీనిని మొదటిసారి నిర్మించినప్పుడు, కాన్స్టాంట్నోబుల్లో ఇని బైజాంటైన్ సామ్రాజ్యానికి రాజధానిగా ఉండేది. ఇది అధికారికంగా క్రిస్టియన్, రోమన్ సామ్రాజ్యం తూర్పు భాగంలో ఉంది. - స్నేహలత (వెబ్ డెస్క్) -
క్రిస్మస్ సంబరాలకు చారిత్రక చర్చిలు
డిసెంబర్ నెల అంటే టక్కున గుర్తొచ్చేది క్రిస్మస్ పండుగ. ప్రపంచవ్యాప్తంగా క్రిస్టియన్లు ఈ పండుగను తమదైన శైలిలో అంగరంగవైభవంగా పండుగను జరుపుకుంటారు. దాదాపు డిసెంబర్ నెల మొత్తం చర్చిలు ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంటాయి. హైదరాబాద్ నగరంలో క్రిస్మస్ వేడుకలు కొంత ప్రత్యేకమేనని చెప్పొచ్చు. ఎందుకంటే కులమతాలతో సంబంధం లేకుండా అన్ని వర్గాల ప్రజలు క్రిస్మస్ వేడుకలను జరుపుకుంటారు. అంతేకాకుండా ఈ వేడుకల్లో వందేళ్లకుపైగా చరిత్ర కలిగిన చర్చిలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. నగరం నలుమూలలనుంచి ప్రజలు ఇక్కడకు చేరుకుని ప్రార్థనలు నిర్వహిస్తారు. ఆంగ్లేయుల ప్రార్థనల కోసం.. నిజాం పాలకులు బ్రిటిషర్లకు అప్పగించిన సికింద్రాబాద్‌ను ఆంగ్లేయులు మిలిటరీ స్థావరంతో (కంటోన్మెంట్) పాటు హైదరాబాద్‌కు సమాంతర నగరంగా తీర్చిదిద్దారు. ఓ వైపు మిలిటరీ శిక్షణ కేంద్రాలు, మిలిటరీ ఆంక్షల నడుమ వ్యాపార, వాణిజ్య కేంద్రాలు, సామాన్యుల జనావాసాలు అభివృద్ధి చెందుతూ వచ్చాయి. ఈ క్రమంలోనే బ్రిటిష్ పాలకులు తాము ప్రార్థనలు చేసుకునేందుకు వీలుగా నగరమంతటా చర్చిల నిర్మాణం ప్రారంభించారు. ప్రస్తుతం నగరంలో ఉన్న వందకుపైగా చర్చిలలో కొన్ని వందేళ్లకుపైగా చరిత్ర కలిగినవి ఉన్నాయి. సెయింట్ జాన్ ది బాప్టిస్ట్ చర్చి ఈ చర్చి సికింద్రాబాద్‌లోని ఈస్ట్ మారేడ్‌పల్లిలోని ప్రముఖమైన చర్చి. 1813లో నిర్మితమైన ఈ చర్చి జంటనగరాల్లోనే అత్యంత పురాతనమైంది. లాన్సర్స్ లైన్‌లోని బ్రిటిష్ కుటుంబాలు ప్రార్థన చేసుకునేందుకు వీలుగా దీనిని నిర్మించారు. 1998లో ఇండియన్ నేషనల్ ట్రస్ట్ ఫర్ ఆర్ట్ అండ్ కల్చరల్ హెరిటేజ్ అవార్డును దక్కించుకుంది. 111 ఏళ్ల నాటి ‘పైప్ ఆర్గాన్’ నేటికీ వినియోగంలో ఉండటం దీని ప్రత్యేకత. చర్చి ప్రారంభించిన మొదట్లో ఆంగ్లేయులే మాత్రమే వెళ్లేవారు. కానీ ప్రస్తుతం నగరంలోని క్రైస్తవులు పెద్ద సంఖ్యలో హాజరవుతున్నారు సెయింట్ మేరీస్ చర్చి నగరంలోని అత్యంత ప్రముఖమైన చర్చిగా సెయింట్ మేరీస్ చర్చి ప్రాముఖ్యత సంతరించుకుంది. ఈ చర్చిని గోతిక్ శైలిలో నిర్మించారు. అత్యంత పురాతనమైన రోమన్ క్యాథలిక్ చర్చి ఇది. ఐరిష్ క్యాథలిక్స్‌తో కలిసి ఫాదర్ డేనియల్ మర్ఫీ 1840లో ఈ చర్చి నిర్మాణాన్ని ప్రారంభించగా, 1850లో పూర్తయింది. 1886 వరకు హైదరాబాద్ ఆర్చ్ డయాసిస్ ప్రధాన చర్చి (క్యాథెడ్రల్)గా కొనసాగింది. చాలాకాలం ఆర్చ్ డయోసిస్ ఆఫ్ హైదరాబాద్ ప్రధాన చర్చిగా కొనసాగింది. రోమన్ క్యాథలిక్ చర్చిలలో ప్రముఖమైన వాటికి దక్కే ‘బాసిలికా’ గుర్తింపును ఈ చర్చికి 2008లో ఇచ్చారు. ‘బాసిలికా ఆఫ్ అవర్ లేడీ ఆఫ్ ది అసెంప్షన్’గా కూడా వ్యవహరిస్తారు. కన్య మేరీ యేసు క్రీస్తును చేతుల్లో పట్టుకున్న దృష్యం భావోద్వేగ పూరితంగా ఉంటుంది. క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహిస్తారు. సెయింట్ థామస్ ఎస్పీజీ చర్చి సికింద్రాబాద్‌లోని పురాతన చర్చిలలో అత్యంత ముఖ్యమైన చర్చ. ఒకటి. ఈ చర్చికి సంబంధించిన స్థలాల్లో చాలావరకు అప్పటి బ్రిటిష్ ప్రభుత్వం తీసుకుంది. ప్రస్తుత సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ స్థలం ఒకప్పుడు ఈ చర్చి ఆధ్వర్యంలోనిదే. 1852లో నిర్మితమైంది. సెంటినరీ బాప్టిస్ట్ చర్చి ఈ చర్చి సికింద్రాబాద్‌లో అత్యంత ప్రాముఖ్యమైన చర్చి. బాప్టిస్ట్ చర్చిగా రెవరెండ్ డబ్ల్యూ.డబ్ల్యూ. క్యాంప్‌బెల్ ఆధ్వర్యంలో 1875లో ఏర్పాటైంది. 1975లో పునర్నిర్మాణం చేపట్టగా 1991లో పూర్తయింది. ఈ చర్చి ఆధ్వర్యంలో జంటనగరాల్లోని 35 చర్చిలు కొనసాగుతున్నాయి. నగరంలోని ప్రముఖ చర్చిలలో చాలా ముఖ్యమైనది. ఆల్ సెయింట్స్ చర్చి చర్చి ఆఫ్ ఇంగ్లండ్ ఆధ్వర్యంలో 1860లో తిరుమలగిరిలో నిర్మితమైన ఈ చర్చి నిర్వహణ ఆర్మీ ఆధ్వర్యంలోనే ఉండేది. స్వాతంత్య్రానంతరం ఆంగ్లికన్, ప్రొటెస్టెంట్ల సమ్మేళనంతో ఏర్పాటైన ‘చర్చి ఆఫ్ సౌత్ ఇండియా’ (సీఎస్ఐ) పరిధిలోకి వచ్చింది. క్వీన్ ఎలిజిబెత్– 2 భర్త ఫిలిప్‌తో పాటు 1983లో నగరాన్ని సందర్శించారు. వారి 36వ వివాహ వార్షికోత్సవాన్ని ఈ చర్చిలోనే జరుపుకొన్నారు. ప్రతి వారం ఇంగ్లీష్, తమిళ భాషలలో నిర్వాహకులు తమ సేవలను అందిస్తున్నారు. పెద్ద సంఖ్యలో ప్రజలు క్రిస్మస్ వేడుకలను జరుపుకుంటారు. హోలీ ట్రినిటీ చర్చి ఈ చర్చి సికింద్రాబాద్‌లో అత్యంత ప్రసిద్డి గాంచిన చర్చి. చర్చి ఆఫ్ సౌత్ ఇండియా (సీఎస్ఐ) ఆధ్వర్యంలో కొనసాగుతోంది. ఈ చర్చి విక్టోరియన్ గోతిక్ శైలిలో నిర్మించారు. 1847లో అప్పటి బ్రిటిష్ రాణి క్వీన్ విక్టోరియా తన సొంత డబ్బులతో బొల్లారంలో నిర్మించారు. ఈ చర్చిని క్వీన్ చర్చిగా పిలుస్తారు. క్రిస్మస్ వేడుకలకు ప్రజలు పెద్ద యెత్తున పాల్గొంటారు. గారిసన్ వెస్లీ చర్చి సికింద్రాబాద్‌లోని తిరుమలగిరిలో ఈ చర్చి ప్రాముఖ్యతను సంతరించుకుంది. 1853లో నిర్మాణం ప్రారంభించగా, 1883 నుంచి వినియోగంలోకి వచ్చింది. స్వాతంత్య్రానికి పూర్వం కేవలం ఆర్మీ అధికారుల కుటుంబాలు మాత్రమే ఈ చర్చిలో ప్రార్థనలు చేసేవారు. క్రిస్మస్, గుడ్ఫ్రైడ్డే వేడుకలు ఈ చర్చిలో ఘనంగా నిర్వహిస్తారు. మిలీనియం మెథడిస్ట్ చర్చి ఈ చర్చి సరోజిని దేవి రోడ్, సికింద్రాబాద్‌లోని చాలా ముఖ్యమైన చర్చి. మెథడిస్ట్ ఎపిస్కోపల్ చర్చికి చెందిన మిషనరీస్ ఆధ్వర్యంలో 1882లో నిర్మితమైంది. మెథడిస్ట్ చర్చిగా ప్రారంభమైన ఈ చర్చిని 2001లో పునర్నిర్మించాక మిలినియం మెథడిస్ట్ చర్చిగా నామకరణం చేశారు. ఈ చర్చిలో పెద్ద యెత్తున ప్రజలు క్రిస్మస్ పండుగను జరుపుకుంటారు. సెయింట్ జోసెఫ్ చర్చి ఇది నగరంలోని అత్యంత ప్రముఖమైన చర్చి. అబిడ్స్‌లోని ఈ చర్చిలో ప్రార్థనలు చేయడానికి అధిక సంఖ్యలో ప్రజలు పాల్గొంటారు. ప్రజలు పెద్ద సంఖ్యలో క్రిస్మస్ వేడుకలను జరుపుకుంటారు. సంవత్సరం పొడువున పర్యాటకులు ఈ చర్చిని సందర్శిస్తుంటారు. సెయింట్ జార్జ్ చర్చి-కింగ్ కోఠి హైదరాబాద్- ఇది చాలా పురాతనమైన చర్చి, హైదరాబాద్ వారసత్వ సంపదలో ఈ చర్చికి చోటు కల్పించారు. చర్చ ఆఫ్ సౌత్ ఇండియా ఆధ్వర్యంలో ఈ చర్చి కొనసాగుతుంది. క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహిస్తారు. నగరంలోని ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొంటారు. గ్రాండ్ క్రిస్మస్ కార్నివాల్ నగరంలో క్రిస్మస్ వేడుకలలో కార్నివాల్ వేడుకలను ఉత్సాహంగా జరుపుకుంటారు. ఈ కార్యక్రమంలో సంగీతం, ఆహారం & షాపింగ్ సదుపాయం కల్పిస్తారు. లైవ్ బ్యాండ్ ప్రదర్శనలు, క్రిస్మస్ కరోల్స్, మీట్ అండ్ గ్రీట్ శాంతా క్లాజ్ వంటి కార్యకలాపాలతో ప్రత్యేక ఆకర్శనగా నిలుస్తాయి. ఓపెన్ మైక్, రాప్ ఛాలెంజ్, హిప్ హాప్ ఛాలెంజ్, కాస్ ప్లే పోటీలు, డ్రాయింగ్ పోటీలు, ఫ్యాన్సీ దుస్తులు, లిటిల్ శాంటా పోటీలు యువత ఉత్సాహంగా పాల్గొంటారు. వైవిధ్యమైన ఆటలతో కుటుంబాలకు వినోదం లభిస్తుంది. డిసెంబర్ 15 న ప్రారంభమైన కరోల్స్ ఆదివారం వివిధ చర్చిలలో ముగిసింది. క్రిస్మస్ రోజున మెథడిస్ట్ చర్చిలో పేదలు, వితంతువులకు ప్రత్యేక బహుమతులు, విద్యార్థులకు ఆర్థిక సహాయం అందజేస్తారు. క్రిస్మస్ వేడుకలకు తెలంగాణ ప్రభుత్వం 15కోట్లు విడుదల చేసింది. మైనారిటీ సంక్షేమ శాఖ ఈ నిధులను కేటాయించింది. ఇప్పటికే తెలంగాణలోని అన్ని జిల్లాలకు నిధులు పంపిణి జరిగిందని సంబంధిత అధికారులు తెలిపారు. - రవికాంత్ (వెబ్ డెస్క్) -
హైదరాబాద్‌లో క్రిస్మస్ వేడుకలు..
డిసెంబర్ నెల ముదలైందంటే చాలు నగరం అంతా క్రిస్మస్, న్యూయర్ వేడుకల సెలబ్రేషన్స్‌తో హడావుడిగా ఉంటుంది. హిందూ, ముస్లిం పండుగలు, ప్రముఖుల పుట్టినరోజు వేడుకలతో గడిచే ఏడాది.. చివరగా క్రిస్మస్ పండుగతో పూర్తవుతుంది. అందుకే ఈ పండగకు పట్టణప్రజలు అత్యంత ప్రాముఖ్యత నిస్తారు. ఏసుక్రిస్తు జన్మదినం సందర్భంగా జరుపుకునే ఈ పండుగను ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్రైస్తవులు ఎంతో ఉత్సాహంతో జరుపుకుంటారు. ఇక మన హైదరాబాద్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. డిసెంబర్ నెల మొదలైందంటే చాలు నగరాల్లో ఎక్కడా చూసినా క్రిస్మస్ ట్రీ, స్టార్స్, క్రిస్మస్ తాతలు దర్శనమిస్తాయి. క్రైస్తవులు తమ ఇంటి ముందు, పైన స్టార్స్‌ను వ్రేలాడిస్తారు. ఇంటి లోపల క్రిస్మస్ ట్రీని రంగు రంగు లైట్లతో అలంకరించి పెట్టుకుంటారు. క్రిస్మస్ అంటే ముందుగా గుర్తుకు వచ్చేది కేకు. ఈ కేకును ప్రత్యేకంగా తయారు చేసి క్రిస్మస్ పండుగ రోజున విక్రయిస్తారు. అలాగే ఈ పండుగలో బహుమతులు ఒక భాగమే. మరి ఇంతటి ప్రాముఖ్యత ఉన్న క్రిస్మస్ పండగను మన హైదరాబాద్‌లో ఏలా జరుపుకుంటారో, నగరంలో ఉండే హడావుడి గురించి బహుమతులు, కేకుల తయారి గురించి తెలుసుకుందాం రండి. క్రిస్మస్కి నగరం ఇలా ముస్తాబవుతుంది: డిసెంబర్ రాగానే నగరంలో క్రిస్మస్ సంబరాలు అంబరాన్ని అంటుతాయి. ఎక్కడ చూసిన స్టార్స్, వివిధ రంగుల లైట్లతో హైదరాబాద్ నగరమంతా తారలే కిందకు వచ్చేయేమో అనేలా విరజిల్లుతుంది. క్రైస్తవులు తమ ఇంటినంతా రంగుల రంగుల లైట్లతో, ఓ పెద్ద స్టార్, క్రిస్మస్ ట్రీలతో అలంకరించుకుంటారు. ఇక షాపింగ్ మాల్స్ గురించి పెద్దగా చెప్పనక్కేర్లేదు. హైదరాబాద్ నగరంలోని ప్రముఖ ఏరియాలలో ఉండే ఏ షాపింగ్ మాల్‌కు వెళ్లినా అక్కడ క్రిస్మస్ ట్రీ, క్రిస్మస్ తాత దర్శనమిస్తారు. బిల్డింగ్ అంత ఎత్తు ఉండే.. ఆకాశాన్ని తాకుతుందేమో అనేంత ఎత్తుగా క్రిస్మస్ ట్రీని పెట్టి దానికి బహుమతుల బొమ్మలు, చాక్లేట్స్ బొమ్మలు, క్రిస్మస్ తాత బొమ్మలు వంటి వివిధ రకాల మెరిసే బొమ్మలతో ఆకర్షణీయంగా అలంకరిస్తారు. కోన్ ఆకారంలో ఉండే క్రిస్మస్ ట్రీకి చివరి అంచున పెద్ద స్టార్‌ను బొమ్మను ఉంచుతారు. ఇది ఏసుక్రిస్తు జననానికి సూచిక. ఈ క్రిస్మస్ ట్రీ అలంకరణకను సంబంధించిన డేకరేషన్ వస్తువులు అన్ని చోట్ల దొరకవు. వాటికి సంబంధించి హైదరాబాద్‌లో ప్రత్యేకమైన బజార్లు ఉంటాయి. కోఠి, సికింద్రాబాద్ బజార్, ఒల్డ్ సీటి బేగం బజారు వంటి ప్రత్యేకంగా వాటి కోసం బజార్లు ఉన్నాయి. అక్కడ క్రిస్మస్ సంబంధించిన వస్తువులు, బహుమతులు అన్ని కూడా దొరుకుతాయి. క్రిస్మస్ కేకు ప్రాముఖ్యత: క్రిస్మస్ అంటే ముఖ్యంగా గుర్తుకు వచ్చేది ప్లమ్ కేకు. అన్ని కేకుల్లా కాకుండా క్రిస్మస్ కేకు ప్రత్యేకంగా తయారు చేస్తారు. ఇందుకోసం కేకు తయారీని రెండు నెలల ముందు నుంచే మొదలు పెడతారు. కేకు కోసం ఏ ఒక్క డ్రై ఫ్రూట్స్ వదలరు అన్నీరకాల డ్రై ఫ్రూట్స్‌ను వాడుతారు. డ్రై ఫ్రూట్స్‌తో తయారు చేసే ఈ కేకును ‘ప్లమ్ కేక్’ అంటారు. దీని కోసం రెండు నెలల ముందే వివిధ రకాల డ్రై ఫ్రూట్స్ అన్నింటిని వైన్‌తో బాగా కలిపి నానబెట్టి తయారు చేస్తారు. వైన్‌లో డ్రై ఫ్రూట్స్‌ను కలిపేందుకు తాజా ద్రాక్ష పండ్ల రసాన్ని వాడతారు. ఇందుకోసం గ్రేప్ వైన్ ప్రక్రియ విధానాన్ని వాడతారు. అంటే తాజా ద్రాక్ష పండ్లను తొక్కుతూ రసాన్ని తీస్తారు. ఈ క్రమంలో దేవుడి పాటలు పాడుతూ.. డ్రమ్స్ వాయిస్తూ.. క్రైస్తవులు ఉల్లసంగా డ్యాన్స్ చేస్తూ ప్రతిఒక్కరు ఈ ‘గ్రేప్ స్టంపింగ్’లో పాల్గొంటారు. ఈ కేకు మిక్సింగ్ వేడుకతోనే సెమీ క్రిస్మస్ సెలబ్రేషన్స్ మొదలవుతాయి. ఓ వేడుకలా జరుపుకునే కేకు మిక్సింగ్ ప్రక్రియ విదేశాలల్లో క్రిస్మస్ పండుగలో ఆచారంగా ఉంది. అలాగే క్రిస్మస్ సంబరాలలో ఇది ఒక భాగం కూడా. ఈ ఆచారం మొదట విదేశాలలో మాత్రమే ఉండేది. ఆ తరువాత క్రమ క్రమంగా మన భారతదేశంలో కూడా జరుపుతున్నారు. మన హైదరాబాద్‌లో కూడా పెద్ద పెద్ద స్టార్ హోటల్స్ రెండు నెలల ముందే సెమీ క్రిస్మస్ సెలబ్రేషన్స్ జరుపుతున్నారు. శంషాబాద్ నోవాటేల్ స్టార్ హోటల్స్, హైదరాబాద్ గోల్కొండ హోటల్, తాజ్ బంజారా, తాజ్ క్రిష్ణా హోటల్స్‌తో పాటు పలు ప్రముఖ హోటల్స్ సెమీ క్రిస్మస్ సెలబ్రేషన్స్‌లో భాగంగా కేకు మిక్సింగ్ వేడుకను జరుపుతున్నాయి. దీని కోసం సినీ ప్రముఖులను, ప్రముఖలను ప్రత్యేక అతిథులుగా ఆహ్వానిస్తారు. కేకు తయారీ కోసం చేసే డ్రై ఫ్రూట్స్ మిక్సింగ్‌లో వారు పాల్గొని అక్కడి వారిలో ఉత్సాహాన్ని నింపుతారు. ఇలా తయారు చేసే క్రిస్మస్ కేకు రుచికరంగా ఉండటమే కాదు.. దాని ధర కూడా ఎక్కువగానే. అరకిలో కేకు రూ.500 నుంచి రూ.800 వరకు ఉంటుంది. హైదరాబాద్‌లో క్రైస్తవులు ఇలా క్రిస్మస్ సంబరాలను జరుపుకుంటారు: మతబేధం చూపకుండా ఈ పండుగను ప్రతి ఒక్కరు ఉత్సాహంగా జరుపుకుంటారు. అంతటి ప్రాముఖ్యత ఉన్న క్రిస్మస్ సీజన్ మొత్తం క్రైస్తవులంతా ఆనందోత్సాహాలతో ఉంటారు. డిసెంబర్ నెల మొదలైనప్పటి నుంచే ఆయా చర్చి సంఘ పెద్దలు, చర్చి సభ్యుల ఇళ్లకు వెళ్లి పాటలు పాడుతూ ఏసుక్రీస్తు జన్మదిన వేడుకలకు ఆహ్వానం ఇస్తారు. దీనినే ‘క్యారెల్స్’ అని పిలుస్తారు. ఈ క్యారెల్స్ను ప్రతి రోజు సాయంత్రం నుంచి రాత్రంతా నిర్వహిస్తారు. చర్చి సంఘ పెద్దలు, చర్చి సభ్యులతో కలసి గుంపులుగా చేరి.. ఎవరెవరి ఇళ్లకు వెళ్లాలో ముందుగానే ప్రణాళిక వేసుకుంటారు. ఆ విధంగా సాయంత్రం నుంచి రాత్రివరకు ప్రతి సంఘ సభ్యుడి ఇంటికి వెళ్లి వారిని క్రిస్మస్ పండుగ వేడుకలో భాగస్వాములను చేస్తూ పండుగ వేడుకలకు ఆహ్వానిస్తారు. ఈ క్రమంలో వారంతా గిటారు, డ్రమ్స్ వాయిస్తూ ఆనందోత్సాహాలతో డ్యాన్స్‌లు వేస్తూ ఆ ఇంట్లో కాసేపు సందడి చేసి క్రిస్మస్ పండుగకు వారికి ఆహ్వానం తెలుపుతారు. ఇలా ప్రతిరోజు క్రిస్మస్ వరకు చర్చి పెద్దలు, ఇతర సంఘ సభ్యులంతా బీజీగా ఉంటారు. ఈ క్యారెల్స్లో ప్రతి సంఘ సభ్యులు పాల్గొనాల్సిందే. అలాగే క్రిస్మస్ డిసెంబర్ 25 తేదికి 10 రోజుల ముందు చర్చిలో సేమీ క్రిస్మస్ వేడుకలను నిర్వహిస్తారు. ఈ సందర్భంగా చర్చిలోని సభ్యులందరికి విందు భోజనాలు ఏర్పాటు చేస్తారు. ఈ విందులో స్వీట్స్, కేకు, వివిధ రకాలు భోజన పదార్థాలు ఉంటాయి. ఈ కార్యక్రమంలో అందరూ డ్యాన్స్ ప్రోగ్రామ్స్, పాటలు పాడటం, ఆటల పోటీలను నిర్వహిస్తారు. పోటీల్లో గెలిచిన వారికి, పాటలు బాగా పాడిన వారికి, డ్యాన్స్ బాగా చేసే వారికి బహుమతులు ఇస్తారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు జరుపుకునే ఈ ప్రీ క్రిస్మస్ వేడుకలు ఆట, పాటలతో చిందలేస్తూ రోజంతా ఆనందోత్సహాలతో సందడిగా గడుపుతారు. ఇలా సందడి చేస్తూ గ్రాండ్ క్రిస్మస్ పండుగకు స్వాగతం పలుకుతారు. ఇలా హైదరాబాద్‌లో కొన్ని చర్చిలలో ప్రీ క్రిస్మస్ ఈవేంట్స్ను ఘనంగా క్రిస్మస్ నిర్వహిస్తారు. అవి సికింద్రాబాద్ వెస్టీ చర్చి, సెయింట్ మార్టిన్స్, కల్వరి టెంపుల్, ది కింగ్స్ టెంపుల్, బాప్తిస్ట్ చర్చిలు మొదలైనవి. క్రిస్మస్ బహుమతులు: క్రిస్మస్ అనగానే ముఖ్యంగా గుర్తొచ్చేది కేకు ఆ తరువాత బహుమతులు. అవును క్రిస్మస్ అంటేనే బహుమతులు ఇవ్వడం. ఈ బహుమతులను ఇచ్చేది శాంటా క్లాజ్(క్రిస్మస్ తాత). ప్రతి ఒక్కరు సంతోషంగా ఉండటం, ఇతరులను ఆనందపరచడమే ఈ క్రిస్మస్ ముఖ్య ఉద్దేశం. అందుకే కుటుంబ పెద్దలు తమ పిల్లలకు ఏమి ఇష్టమో వాటిని ఈ పండుగ రోజున బహుమతిగా ఇస్తారు. ఇందుకోసం వారు బహుమతిని కొని సీక్రేట్‌గా ఓ ప్లేస్ ఉంచి వారు చూసేలా చేసి సర్ప్రైజ్ చేస్తారు. నిజంగానే క్రిస్మస్ తాత వచ్చి తనకు నచ్చిన వస్తువు ఇచ్చి వెళ్లాడనుకుని పిల్లలు నమ్ముతారు. ఈ పండుగకు కానుకలను ఇవ్వడం అనేది విదేశాల్లో ఓ ఆచారంగా ఉంది. క్రిస్మస్ వస్తే చాలు విదేశాల్లో పిల్లలకు తమకు కావాలసిన బహుమతుల జాబితా తయారు చేసి వారి తల్లిదండ్రులకు ఇస్తారు. అందులో పేర్కొన్న కానుకలను వారు తప్పక ఇవ్వాల్సిందే మరి. చోట్ల, విదేశాలలో లేనివారికి ఏదో ఒక విధంగా సాయం చేసి వారి అవసరాలను తీరుస్తారు కూడా. అలా ఇదే పద్దతిని క్రమ క్రమంగా మన ఇండియాకి కూడ వచ్చేసింది. బహుమతులు తెచ్చే క్రిస్మస్ తాత ఇలా వచ్చాడు.. అసలు క్రిస్మస్కి ఈ బహుమతుల ఆచారం ఎలా వచ్చిందో తెలుసుకుందాం. ఓ ధనికుడైన వృద్దుడు ఒంటరిగా జీవించేవాడు. అతడు కాలక్షేపం కోసం రోజూ సాయంత్రం అలా బయట నడుస్తూ ఉండేవాడు. రోజూలాగే ఓ రోజు సాయంత్రం బయటకు వెళ్లిన అతనికి వీధిలో ఓ పేద కుటుంబం రోడ్డు పక్కన నివసిస్తున్నట్లు గమనించాడు. అది క్రిస్మస్ సీజన్ కాబట్టి చలి కూడా ఎక్కువగా ఉంటుంది వారు దుప్పట్లు లేక చలికి వణుకుతూ ఉండేవారు. పిల్లలకు సరైన బట్టలు లేకుండా ఇబ్బందులు పడుతున్న వారిని రోజు చూస్తుండేవాడు. అలా రోజు వారిని చూసి వారికి ఏ విధంగానైనా సాయం చేయాలని అనుకున్నాడు. ఓ రాత్రి పూట సిక్రేట్‌గా వెళ్లి వారికి దుప్పట్లు, దుస్తులు, ఆట బొమ్మలు, కొన్ని డబ్బులు వారి ఇంటి ముందు పెట్టి వెళ్లాడు. అప్పుడు ఆయన తలకు చలి చోపి, కోటును ధరించి చేతి కర్రతో ఉన్న ఆయనను వారు గమనించారు. అయితే తెల్లవారు జామున అది చూసి వారు. దేవుడే శాంటాక్లాస్(క్రిస్మస్ తాత)ను పంపించాడని. అతడే వారికి సాయం చేశాడని అనుకుంటారు. అలా ఈ క్రిస్మస్ తాత పుట్టుకొచ్చాడు. దీంతో ప్రజలు సీక్రేట్ శాంటా క్లాజా అంటూ పిలుచుకుంటారు. ఇలా క్రిస్మస్ తాత కథలను ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా చెప్పుకుంటారు. అయితే దీనికి సంబంధించిన అసలు కథ బైబిల్లో కూడా ఉంది. దీనిని చర్చిలోని సండే స్కూల్స్‌లో పిల్లలకు కథగా చెబుతారు. -
ఈ క్రిస్మస్ మీ ప్రియమైన వారితో..
క్రిస్మస్ అంటే ముందుగా గుర్తొచ్చేవి మనసు దోచే కానుకలు.. చల్లటి సాయంత్రాలు.. రంగుల రాత్రులు. పండుగ నాడు తమకిష్టమైన వారికి ఏదైనా ప్రత్యేకమైన బహుమతి ఇవ్వాలని తహతహలాడే వారు కొందరైతే. అందరిలా మామూలుగా కాకుండా పండుగను కొంత ప్రత్యేకంగా.. మరికొంత ‘ప్రేమ’గా జరుపుకోవాలని ఆలోచించే వారు మరికొందరు. అలాంటి వారు, ముఖ్యంగా పర్యటనలంటే ఇష్టపడేవారు తమ ప్రియమైన వారికి ఏదైనా కానుక ఇవ్వాలనుకుంటే పండుగను తమదైన రీతిలో కన్నుల పండుగగా జరుపుకునే ప్రదేశాలకు తీసుకెళ్లండి. మీ మనసుకు దగ్గరైన వారితో ఈ క్రిస్మస్ పండుగ రోజును మరింత అందంగా, గుర్తుండిపోయే మధుర జ్ఞాపకంగా మార్చుకోండి. 1) గోవా ఈ క్రిస్మస్ మరింత అందంగా సెలబ్రేట్ చేసుకోవటానికి గోవా ఓ అద్భుతమైన ప్రదేశం. క్రిస్మస్ రోజున గోవాలోని దాదాపు 400 చర్చిలు సప్తవర్ణశోభితంగా వెలుగిపోతాయి. రాత్రి వేళల్లో గోవా ఓ నూతన స్వర్గంలా అనిపిస్తుంది. వయస్సుతో సంబంధంలేకుండా అన్ని వయస్సుల వారు రాత్రి వేళ పెద్ద సంఖ్యలో చర్చిల వద్దకు చేరి ప్రార్థనలు నిర్వహిస్తారు. పండుగను మరింత అందంగా జరుపుకోవటానికి ప్రపంచం నలుమూలలనుంచి పర్యాటకులు గోవా చేరుకుంటారు. ఇక ఇక్కడి బీచ్‌ల వద్ద ఉండే సందడి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. 2) పాండిచ్చేరి ‘లిటిల్ ఫ్రాన్స్’ అని పిలువబడే పాండిచ్చేరి అద్భుతమైన కట్టడాలతో, సుందరమైన సముద్ర తీరాలతో మనల్ని కట్టిపడేస్తుంది. ఫ్రాన్స్ మూలాలు ఉన్న చాలామంది క్రిస్టియన్లు క్రిస్మస్ను తమదైన సాంప్రదాయాలు పాటిస్తూ కన్నులపండువగా జరుపుకుంటారు. పండుగనాడు అక్కడి చర్చిలు, బీచ్‌లు ఓ ప్రత్యేక ఆకర్షణ నిలుస్తాయి. 3) మనాలి చల్లని శీతాకాలం నాడు తెల్లటి మంచుతో మనాలి ఓ వెండి పర్వతంలా అందంగా మెరిసిపోతుంది. అందుకే మనాలిలో జరుపుకునే క్రిస్మస్కు వైట్ క్రిస్మస్ అని పేరు కూడా ఉంది. కేవలం క్రిస్మస్తోనే కాకుండా న్యూ ఇయర్‌తో మొదలయ్యే పండుగలన్నింటికి మంచుతో కప్పబడిన మనాలి స్వాగతం పలుకుతుంది. అందంగా అలంకరించబడిన హోటళ్లు పండుగ వాతావరణాన్ని పరిమళించేలా కులు ఫోక్ మ్యూజిక్ మనల్ని మైమరిపింపజేస్తుంది. ప్రతి ఏటా వచ్చే పర్యాటకుల సంఖ్య పెరుగుతూ వస్తోందంటే మనాలి ప్రకృతి అందచందాలు వారిని ఎంతగా ఆకర్షిస్తున్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. 4) కేరళ దైవ భూమిగా పిలువబడే కేరళ పచ్చటి పకృతి అందాలతో, సముద్రపు తీరాలతో, బ్యాక్ వాటర్‌తో ఎంతో రమణీయంగా ఉంటుంది. క్రిస్మస్ రోజున కేరళ పర్యటన మీ జీవితంలో ఓ మధుర జ్ఞాపకంగా మిగిలిపోతుంది. జనాభాలో అధిక భాగం ఉన్న క్రిస్టియన్లు పండుగను అత్యంత అద్భుతంగా సెలబ్రేట్ చేస్తారు. చిన్నా పెద్దా అని తేడా లేకుండా క్రిస్మస్ రోజు రాత్రి అందరూ చర్చిల వద్దకు చేరి ప్రార్థనలు చేస్తారు. ప్రకృతి ఒడిలో క్రిస్మస్ జరుపుకోవాలనుకునే వారికి కేరళ ఓ బెస్ట్ ఛాయిస్. 5) సిమ్లా మీకిష్టమైన వారితో ఈ క్రిస్మస్ను ప్రశాంతంగా, గుర్తుండిపోయేలా జరుపుకోవాలంటే తప్పకుండా సిమ్లా వెళ్లి తీరాల్సిందే. పర్యాటకుల రద్దీ తక్కువగా ఉండే కొండ ప్రాంతాలు మనసుకు ఎంతో ప్రశాంతతనిస్తాయి. అక్కడి ఇళ్లు, వీధులు, చర్చిలు రంగురంగుల లైట్లతో అందంగా అలంకరించబడి కొత్త శోభను సంతరించుకుంటాయి. నోరూరించే సాంప్రదాయ వంటకాలు మనల్ని లొట్టలేసుకునేలా చేస్తాయి. చల్లటి సాయంత్రాలు క్రిస్మస్ వాతారణాన్ని మరింత అందంగా చేస్తూ వినసొంపైన పాటలతో మనల్ని అలరిస్తాయి. 6) లాన్స్ డౌన్ ఈ క్రిస్మస్ను కొండ ప్రాంతంలో జరుపుకోవాలనుకుంటే లాన్స్ డౌన్ అద్బుతమైన ప్రదేశం. యాంత్రికమైన జీవితంలో కొద్దిగా ప్రశాంతత లభిస్తుంది. వెండికొండల్లో.. మంచులోయల్లో.. చల్లటి సాయంత్రాలు.. వెన్నెల రాత్రులు మనకో గొప్ప అనుభూతిగా మిగిపోతాయి. భాగస్వామితో మాత్రమే కాదు, కుటుంబసభ్యులు, స్నేహితులతో గడపటానికి ఇదో అద్భుతమైన ప్రదేశం అని చెప్పొచ్చు. 7) దాద్రా నగర్ హవేలీ అన్ని క్రిస్మస్ డెస్టినేషన్లకంటే దాద్రా నగర్ హవేలీ కొంచెం ప్రత్యేకమైనది. ఎందుకంటే ఇక్కడ పండుగ మొత్తం గిరిజన పద్దతిలో జరుగుతుంది. రాత్రి వేళ చర్చిల వద్ద నిండుగా గుమిగూడే జనంతో పండుగ ఎంతో వైభవంగా జరుగుతుంది. పండుగ నాడు మీ ప్రియమైన వారితో ఇక్కడ క్రిస్మస్ జరుపుకోవటం నిజంగా ఓ మరిచిపోలేని జ్ఞాపకం అవుతుంది. 8) షిల్లాంగ్ చలికాలంలో ఇక్కడ పర్యాటకుల రద్దీ చాలా తక్కువగా ఉంటుంది. మరెక్కడా రాని అనుభూతి మనకిక్కడ దొరుకుతుంది. పర్యాటకుల్లా కాకుండా స్థానికుల్లా క్రిస్మస్ పండుగను ఆస్వాదించవచ్చు. తక్కువ సంఖ్యలో ఉన్న క్రిస్టియన్లు ఎంతో వైభవంగా క్రిస్మస్ వేడుకలను నిర్వహిస్తారు. మిరుమిట్లు గొలిపే రంగుల లైట్లతో.. వినసొంపైన గాస్పెల్ పాటలతో రేయి ఇట్టే గడిచిపోతుంది. అక్కడి ప్రజలతో పాటు కలిసి స్థానిక వంటకాలను రుచి చూడవచ్చు. 9) డామన్ అండ్ డయ్యూ గోవాకు ప్రత్యామ్నాయంగా దీనిని చెప్పుకోవచ్చు. పోర్చుగీసు వారి ప్రభావం ఎక్కువగా ఉన్న ప్రదేశం ఇది. సంప్రదాయ నృత్యాలతో పాటు కారిడినో వంటి పోర్చుగీసు నృత్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. పెద్ద సంఖ్యలో చర్చిల వద్ద గుమిగూడే జనం ఎంతో భక్తి శ్రద్ధలతో ప్రార్థనలు నిర్వహిస్తారు. 10) నార్త్ ఈస్ట్ క్రిస్మస్ పండుగను వైభవంగా నిర్వహించే ప్రదేశాల్లో నార్త్ ఈస్ట్ ఒకటి. ఇక్కడి గిరిజనులు పండుగ కోసం సంవత్సరం మొత్తం ఎదురుచూస్తూ ఉంటారు. కొండ ప్రాంతాల్లోని పట్టణాలలో క్రిస్మస్ వేడుకలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. రాత్రి వేళ వీధుల్లో ఎక్కడ చూసినా కనపించే జనంతో వాతావరణం ఎంతో సందడిగా ఉంటుంది. మన కిష్టమైన వారితో పండుగను మరింత సరదాగా జరుపుకోవటానికి ఇదో చక్కటి ప్రదేశం. -
భక్తితో వణికిన గుండె
ఇజ్రాయెల్ దేశంలోని ఎరికో పట్టణంలో జక్కయ్య అనే ధనికుడు ఉన్నాడు. పన్ను వసూళ్ల అధికారిగా తన ధనాన్ని రెట్టింపు చేసుకున్నాడనే కోపంతో ‘పాపి’ అనే ముద్ర కూడా అతనికి వేశారు స్థానికంగా ఉన్న యాజకులు, పరిసయ్యలు. ఆ రోజు తన పట్టణానికి యేసుప్రభువు వస్తున్నాడని విన్న జక్కయ్య ఆనంద తరంగమయ్యాడు. ఎందుకంటే యేసు గురించి అతడు ఎన్నో అద్భుతాలు విని ఉన్నాడు. యేసుక్రీస్తు పుట్టినప్పుడు ఆకాశంలో ఓ అరుదైన నక్షత్రం ఉదయించిందని, దేవదూతలు గాన ప్రతిగానాలతో ఆయన జననాన్ని ప్రజలందరికీ మహా సంతోషకరమైన వర్తమానంగా ప్రకటించారని విన్నాడు. ఆయన తన యవ్వన ప్రారంభం నుండే గొప్పæఆచరణీయ విషయాలు బోధించడమేగాక, ప్రజల వ్యాధి బాధల్ని నయం చేస్తున్నాడని, దురాత్ములను గద్దించి, ఆయా వ్యక్తుల్ని విడుదల చేస్తున్నాడని, చనిపోయిన వాళ్లకు సైతం పునరుజ్జీవం చేస్తున్నాడని, గాలిని, తుఫానులను, సముద్రాన్ని గద్దించి, నిమ్మళపరిచి, ప్రకృతిని శాసించాడనీ.. ఇలాంటి ఎన్నో సంగతులు విన్నప్పుడు జక్కయ్య గుండె వణికింది. అప్పటినుండి యేసును చూడాలనే కోరిక రోజురోజుకు ఎక్కువవుతుండగా, ఆ రోజు వాళ్ల ఊరికే ఆయన వస్తున్నాడని విని, ఆయన రాబోయే బాటకు పరుగుపెట్టాడు. తనేమో పొట్టివాడు. క్రీస్తుప్రభువు చుట్టూ పెద్ద జన సందోహముంటుంది. ఆయన్ని ఎలా చూడగలడు? ఆ బాట పక్కనే ఓ చెట్టును చూశాడు. వెంటనే చెట్టెక్కి, ఆయన్ని చూడగలిగిన చోటులో కూర్చున్నాడు. తన ధనం అధికార హోదా, వయసు.. ఏవీ అడ్డురాలేదు. అంతలోనే పెద్ద జన సమూహం వచ్చేసింది. జక్కయ్య లేచి నిలబడి, ఆందోళనగా క్రీస్తు కోసం వెదుకుతున్నాడు. చెట్టుకింది నుండి ఎవరో తనని పిలుస్తున్నారు. ‘‘జక్కయ్యా, త్వరగా దిగు, నేడు నేను నీ ఇంటికి వస్తున్నాను’’ అని వినిపించింది. ‘ఆయనే యేసయ్య’ అని ఎవరో అన్నారు. గడగడలాడుతూ బిరబిరా చెట్టు దిగాడు జక్కయ్య. ప్రశాంతమైన, వాత్సల్యపూరితమైన ఆయన మోము చూశాడు. కళ్లలో కదలాడుతున్న కరుణను చూశాడు. అంతే! యేసయ్య పాదాజీపై పడ్డాడు. ‘‘ప్రభూ! నా ఆస్తిలో సగం పేదలకిస్తాను, నేనెవరి వద్ద అన్యాయంగా తీసుకున్నానో, వాళ్లకు అంతకు నాలుగింతలు ఇచ్చేస్తాను. నా తప్పులన్నింటినీ మన్నించండి స్వామీ’’ అంటూ ప్రభువు పాదాలను కన్నీటితో కడిగాడు. ఆ పూట తన ఇంటిలో పెద్ద విందు చేశాడు జక్కయ్య. ‘‘ఈయన పాపులతో కలిసి తింటున్నాడు’’ అన్న పరిసయ్యలకు ప్రభువిచ్చిన జవాబు.. ‘రోగికే కదా వైద్యుడు కావాలి, నశించిన దానిని వెదికి, రక్షించేందుకే నేను వచ్చాను’ అని! – ఝాన్సీ కేవీకుమారి -
ప్రసారం సమాప్తం
ఒక ఆడపిల్ల కదలికలను ప్రేమతోనైనా సరే నియంత్రించడం అత్యాచారం కన్నా ఏం తక్కువ? అది సాహిత్యం అయినా, సన్నివేశం అయినా.. ఇట్సే ‘రేపీ’. మీటూ ఉద్యమం పుణ్యమా అని కొత్తగా కలిగిన ఈ స్పృహతో యు.ఎస్. రేడియో స్టేషన్లు.. డెబ్బై నాలుగేళ్లుగా క్రిస్మస్ సీజన్లో తాము ప్రసారం చేస్తున్న ‘బేబీ, ఇట్స్ కోల్డ్ అవుట్‌సైడ్’ అనే ఆస్కార్ అవార్డు సాంగ్‌ను తమ ప్లే లిస్ట్‌లోంచి ఒకదాని వెంట ఒకటిగా తొలగిస్తున్నాయి. కొన్ని పాటలు, కొన్ని పువ్వులు సీజన్ వచ్చేసిందని ముందే చెప్పేస్తాయి. యు.ఎస్. రేడియో స్టేషన్ల నుంచి ‘బేబీ, ఇట్స్ కోల్డ్ అవుట్‌సైడ్’ అనే హాలీడే సాంగ్ వినిపించిందంటే క్రిస్మస్ సీజన్ మొదలైనట్లే. అయితే ఈ ఏడాది క్రిస్మస్ సీజన్ మొదలైనా.. ఆ పాట ఏ రేడియో స్టేషన్ నుంచీ వినిపించడం లేదు! యు.ఎస్.ను చూసి కెనడా కూడా స్టాప్ చేసింది. ఇంకా మరికొన్ని దేశాల్లోని రేడియో స్టేషన్లు 1944 నాటి ఆ క్లాసిక్ డ్యూయట్‌ను ఈ ‘మీటూ’ టైమ్‌లో ప్లే చెయ్యకపోవడమే క్షేమకరమన్న అభిప్రాయానికి వచ్చేస్తున్నాయి. బ్రాడ్వే (రంగస్థలి) ఆస్థాన గీత రచయిత ఫ్రాంక్ లోస్సర్ రాసిన ‘బేబీ, ఇట్స్ కోల్డ్ అవుట్‌సైడ్’ ను 1949 హాలీవుడ్ మూవీ ‘నెప్ట్యూన్స్ డాటర్’లోకి తీసుకున్నారు. సినిమాలో ఎస్తర్ విలియమ్స్, రికార్డో మాంటల్బేన్ మధ్య పాటను చిత్రీకరించారు. ‘బెస్ట్ ఒరిజినల్ సాంగ్’గా ఆస్కార్ అవార్డు’ కూడా పొందిన ఆ పాటకు ఇన్నేళ్లలో అనేక వెర్షన్లు వచ్చాయి. మొన్న మొన్న ఆమెరికన్ గాయని లేడీ గాగా.. రివర్స్ వెర్షన్లో ఆ పాటను తీసుకున్నారు. అసలుపాటలో అతడు ఆమెను వెళ్లకుండా ఆపుతుంటే.. గాగా వీడియోలో ‘బేబీ, ఇట్స్ కోల్డ్ అవుట్‌సైడ్’ (బేబీ, బయట చలిగా ఉంది) అంటూ ఆమె అతడిని వెళ్లకుండా ఆపుతుంటుంది. ఒరిజినల్ పాటను రాసినవారు కానీ, పాటకు యాక్ట్ చేసివారు గానీ ఇప్పుడు లేరు. పాటొక్కటే బతికి ఉంది. ఇప్పుడా పాట కూడా ‘మీటూ’ పెనుగాలులకు రెపరెపలాడుతోంది. ‘మీటూ’కు, ఈ పాటను ఆపేయడానికి సంబంధం ఏంటి? ఏంటంటే.. పాటపై ఎప్పటి నుంచో బలహీనమైన కొన్ని అభ్యంతరాలు ఉన్నాయి. మీటూ ఉద్యమం చురుగ్గా ఉన్న ఈ టైమ్‌లో అవి బలమైన అభ్యంతరాలుగా రూపాంతరం చెందే ప్రమాదం ఉండొచ్చని స్టేషన్ డైరెక్టర్ల అనుమానం. పాటలోని సాహిత్యం, పాట సన్నివేశం.. ‘స్త్రీపై అత్యాచారం జరుపుతున్నట్లుగా’ ఉన్నాయన్నది ఎప్పటి నుంచో ఉన్న ఆరోపణ. ‘సాంగ్ కాదు.. ఇట్సే రేపీ’ అని అప్పట్లోనే ముఖం చిట్లించిన వారున్నారు. పాట ‘కాల్ అండ్ రెస్పాన్స్’ స్టెయిల్లో సాగుతుంది. ఒకరు పాడుతుండగనే, దానికి లింక్‌గా రెండో వారు అందుకోవడం! ఎలాగంటే.. ‘లాయర్ సుహాసిని’ సినిమాలో సుహాసినికి, భానుచందర్‌కి మధ్య ఒక డ్యూయెట్ ఉంటుంది. ‘దివిని తిరుగు మెరుపు లలన’ అంటాడు అతడు. వెంటనే ‘సామజ వరగమనా’ అంటుంది ఆమె. ‘కరుణ కరిగి భువికి దిగిన’ అంటాడు అతడు. ‘సామజ వరగమనా..’ అంటుంది మళ్లీ ఆమె. పాటంతా అంతే.. ఆమె సామజ వరగమనా అనే మాటొక్కటే అంటుంటుంది. ఇలాంటిదే ‘పెళ్లాం ఊరెళితే’ సినిమాలో శ్రీకాంత్, సంగీతల మధ్య డ్యూయెట్. ‘దొండపండు లాంటి పెదవే నీది’ అంటాడు శ్రీకాంత్. ‘అబద్ధం.. అంతా అబద్ధం’ అంటుంటుంది సంగీత. ‘కాల్ అండ్ రెస్పాన్స్’ ఫార్మాట్. ఇప్పుడీ క్రిస్మస్ సాంగ్‌లో.. ‘బేబీ, ఇట్స్ కోల్డ్ అవుట్‌సైడ్’ అని అంటుంటాడు అతడు, ‘నేను వెళ్తాను’ అని ఆమె ఎంత మొత్తుకుంటున్నా వదలకుండా. ‘ఐ రియల్లీ కాంట్ సే’ అని మొదలు పెడుతుంది ఆమె. వెంటనే అతడంటాడు ‘బేబీ ఇట్స్ కోల్డ్ ఔట్‌సైడ్’ అని. విషయం ఏంటంటే.. ఆ సాయంత్రం ఆమె అతడి గదిలో ఉంటుంది. ఇంటికి వెళ్లాలని లేస్తుంటుంది. అతడు లేవనివ్వడు! ఆమెతో ‘గడపాలని’ ఉంటుంది. అందుకే బయట చల్లగా ఉందనీ, ఆ టైమ్‌లో క్యాబ్‌లు దొరకవని, గడ్డకట్టుకుని పోతావనీ, న్యూమోనియా వచ్చి ఛస్తావనీ.. ఏదో ఒకటి చెప్పి అడ్డుకుంటుంటాడు. వెళ్లేందుకు ఆమె హ్యాట్ పెట్టుకుంటుంటే దాన్ని తీసేస్తూ ఉంటాడు. ‘వెళ్లనివ్వు ప్లీజ్..’ అని బతిమాలుకుంటుంటే.. కాలు, చెయ్యి అడ్డుపెడుతుంటాడు. ఇదంతా పాటలా, మాటలా సాగుతుంటుంది కానీ.. సూక్ష్మంగా ఆలోచించేవారికి.. నిజమే, ‘రేపీ’లానే అనిపిస్తుంది. ఒక ఆడపిల్ల కదలికలను ప్రేమతోనైనా సరే నియంత్రించడం అత్యాచారం కన్నా ఏం తక్కువ? ఇంకా.. అతడు ఆమెకు డ్రింక్ ఇస్తుంటాడు. ఆ డ్రింక్ గ్లాస్ అందుకుని ‘ఇందులో ఏం కలిపావు? అని అడుగుతుంది. మాట మార్చి ఏదో చెప్తాడు. ఇంకో చోట.. ‘నో.. నో.. నో..’ అంటుంది. వినకుండా.. ‘దగ్గరికి వస్తే ఏమైనా అనుకుంటావా’ అని ఒంటి మీద చెయ్యి వెయ్యబోతాడు. అతడు పట్టుకోబోవడం, అమె వదిలించుకోబోవడం.. ఇలా ఉంటుంది. ఇప్పటి అతిసున్నిత సమాజానికి సెక్సువల్ అసాల్టే అది. అందుకే యు.ఎస్. రేడియో స్టేషన్లు ‘ఇంతటితో ఈ పాట ప్రసారం సమాప్తం’ అంటున్నాయి. రచయిత ఎంత మంచి ఉద్దేశంతోనైనా రాయొచ్చు. అందులో చెడు ఉద్దేశం ‘పాప్–అప్’ అయి (పైకి లేచి) కనిపిస్తే మాత్రం ఉద్దేశాన్ని అర్థం చేసుకోలేకపోయిన వాళ్లని నిందించడానికి లేదు. పాటనైనా, పుస్తకాన్నైనా తీసుకెళ్లి పొయ్యిలో పడేయాల్సిందే. ఫ్రాంక్ లోస్సర్ మొదట ఈ పాటను తనను, తన భార్యను ఉద్దేశించి రాసుకున్నారు. స్టేజ్ షోలలో ఇద్దరూ కలిసి పాడేవారు. ఆ పాటను ఎం.జి.ఎం. కొనుక్కుని సినిమాలో పెట్టుకుంది. పాటగా విన్నా, పాత్రలతో చూసినా ఆ యుగళగీతాన్ని అప్పుడంతా ఇష్టపడ్డారు. వింటర్ థీమ్‌తో వచ్చింది కాబట్టి క్రమేణా అది ‘క్రిస్మస్ సాంగ్’ అయింది. పాట రచయిత ఫ్రాంక్ లోస్సర్ మాధవ్ శింగరాజు -
ఆ భావనే నన్ను నడిపిస్తోంది!
- అనూప్ రూబెన్స్ క్రిస్మస్ నాకు చాలా ఇష్టమైన పండగ. ఇంట్లో వాళ్లతో హ్యాపీగా టైమ్ స్పెండ్ చేయడం అంటే చాలా ఇష్టం. కొత్త బట్టలు, కేక్ కట్ చేయడం ఇవన్నీ మామూలే. పండగ అంటే కేవలం సెలబ్రేషన్స్ అని మాత్రమే కాదు. మనమేం చేస్తున్నామనేది కూడా మనం గమనించుకోవాలి. క్రిస్మస్ అంటే గివింగ్ అని నా ఉద్దేశం. అందుకే ప్రతి ఏడాదీ క్రమం తప్పకుండా అనాథ శరణాలయంలో పిల్లల మధ్య కేక్ కట్ చేస్తాను. నాకు సంగీతమంటే ప్రాణం. మతం, భాష అనే తేడా దానికి లేదు. అందుకే ‘మ్యూజిక్ ఈజ్ డివైన్’ అంటారు. నేను ఎన్ని పాటలు చేసినా, దేవుడి కోసం ఒక్క పాట చేస్తే చాలు, అప్పటివరకూ ఉన్న మానసిక ఒత్తిడి దూరమవుతుంది. చాలా ప్రశాంతంగా ఉంటుంది. డివోషనల్ సాంగ్స్‌ను స్వరపరచడంలో ఉండే ఆనందమే వేరు. ‘యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు’ అని బైబిల్లో ఓ వాక్యం ఉంటుంది. ఆ దైవం నాతో ఉన్నాడన్న భావనే నన్ను ప్రతి నిమిషం ముందుకు నడిపిస్తోంది. -
అదే క్రిస్మస్కు నిజమైన అర్థం!
‘నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు’... ప్రతి క్షణం నేను గుర్తుంచుకునే వాక్యమిది. ఎదుటి వారిని మనస్ఫూర్తిగా ప్రేమిస్తే ఈర్ష్యాద్వేషాలకు చోటుండదు. ప్రేమతో ఏదైనా సాధించవచ్చు. నా దృష్టిలో క్రిస్మస్ అనేది అందరికీ సంబంధించిన పండగ. కానీ సెలబ్రేషన్స్‌తో పాటు షేరింగ్ కూడా ఉండాలని నా ఉద్దేశం. అందుకే యేటా ఈ రోజున కొన్ని సామాజిక కార్యక్రమాలు చేస్తూంటా. మనకున్న దానిలో కొంత పేదలకు ఇస్తే అందులో ఉండే తృప్తి, ఆనందం వేరు. అదే క్రిస్మస్కి నిజమైన అర్థం. మాది బ్రహ్మసమాజం కమ్యూనిటీకి చెందిన కుటుంబం. నేను 2001లో క్రైస్తవ మతాన్ని ఆచరించడం మొదలుపెట్టాక ఎవరూ అడ్డు చెప్పలేదు. యూకేజీ వయసులోనే నేను చర్చకు వెళ్లేదాన్ని. అప్పటి నుంచే జీసస్‌తో కొంత అనుబంధం ఏర్పడింది. అప్పట్లో అంత సీరియస్‌గా తీసుకోలేదు. కానీ 1985లో జరిగిన ఓ ప్రమాదం నన్ను పూర్తిగా మార్చేసింది. మరణం అంచుల దాకా వె ళ్తున్న నన్ను జీసస్ రక్షించాడని నా నమ్మకం. అందుకే ఆయన మార్గంలో వెళ్లడం మొదలుపెట్టా. క్రైస్తవ మార్గంలో వెళ్లడమంటే జీసస్‌లా అందరితో ప్రేమగా ఉండటమే! - జయసుధ -
తండ్రీ... వారిని క్షమించు!
క్రీస్తు మనకు అనుగ్రహించిన మహావాక్యం అతను సిలువ ఎక్కబోతూ, తనను అసూయకొద్దీ చంపజూసిన వాళ్ల గురించి అన్న వాక్యం: ‘తండ్రీ! వాళ్లను క్షమించు! ఏం చేస్తున్నారో వాళ్లకు తెలియటం లేదు’ అని. చరిత్ర చాలా గడ్డు సమయంలో ఉన్నప్పుడు ప్రపంచం మొత్తమూ ఆధ్యాత్మికంగా పూర్తిగా కుంగిపోయి ఉన్నప్పుడు దాన్ని పునరుజ్జీవింప జేయడానికి క్రీస్తు జన్మించాడు. ఆ మహాత్ముడి సందేశం- ‘మీరందరూ భగవదంశలే’ గొప్ప సందేశం. సెయింట్ జాన్ ఆ క్రీస్తు వచనాన్ని విపులీకరించాడు: ‘ఎంతమంది అతన్ని (అంటే, యేసులోనూ సృష్టి మొత్తంలోనూ ప్రకటమైన కూటస్థ చైతన్యాన్ని) అర్థం చేసుకొని గ్రహించగలుగుతారో వాళ్లందరికీ భగవంతుడి పుత్రుడిలాగా కావడానికి కావలసిన శక్తినిచ్చాడు ఆయన’ (జాన్ 1-12) అని. ఇదో మహావాక్యం. గుండెలో నిర్మలత్వం ఉండి మనసా వాచా కర్మణా శ్రద్ధాభక్తుల్ని పూర్తిగా కనబరచగలిగితే చాలు ఆ మనిషి జాతి ఏదైనాసరే అతని చర్మం రంగు ఏదైనా సరే అతను భగవంతుణ్ణి తనలోకి పిలిచి పరిపూర్ణ తృప్తిని పొందగలుగుతారు. ‘అన్నిదేశాల ప్రజల్నీ (భగవంతుడు) ఒకే రక్తం ఉన్నవాళ్లుగా తయారు చేశాడు’ (అపొ.కా. 17-26) అనేదే క్రీస్తుకు ఉత్తేజాన్నిచ్చిన సంగతి. చర్మాల రంగుల్నిబట్టి మనుషుల్ని విభజించుకొని అసహ్యించుకోవడంగానీ ప్రేమించడం గానీ మనుషుల అజ్ఞానానికి పరాకాష్ఠగానే చెప్పాలి. రంగు చర్మానికే పరిమితం; అంతకన్నా లోతుకు అది వెళ్లదు. రంగును బట్టి ఎవరూ ఎవర్నీ వేరుచేయాల్సిన మూర్ఖత్వంగానీ రాగద్వేషాల్ని చూపించే వెర్రితనాన్ని గానీ బహిర్గతం చేయగూడదు. అదీగాక, నువ్వు ఎవర్ని ద్వేషిస్తావో ఏ జాతిని అసహ్యించుకుంటావో ఏ మతాన్ని ఏవగించుకుంటావో, తిరిగి ఆ జాతిలోనూ ఆ మతంలోనూ ఆ తీరులోనూ పుట్టవలసి వస్తుంది. అది తప్పనిసరి. ఎందుకంటే, చిట్టచివరికి మనకు అన్నిరకాల పక్షపాతాలూ పోయి, మనమందరమూ నిర్మలులమై, భగవంతుడి రెక్కలమాటున ఉండవలసినవాళ్లమే అని గుర్తు పెట్టుకోవాలి. క్రీస్తు మనకు అనుగ్రహించిన మహావాక్యం అతను సిలువ ఎక్కబోతూ, తనను అసూయకొద్దీ చంపజూసిన వాళ్ల గురించి అన్న వాక్యం: ‘తండ్రీ! వాళ్లను క్షమించు! ఏం చేస్తున్నారో వాళ్లకు తెలియటం లేదు’ అని. తనను చంపడానికి ప్రయత్నిస్తున్న వాళ్లపట్ల మనకుండవలసిన భావమేమిటో ఏది ఎదుటివాళ్ల క్రూరహృదయాన్ని కూడా మెత్తబరిచి వాళ్లకే తప్పు జేశామన్న పశ్చాత్తాపాన్ని కలిగిస్తుందో ఈ మహావాక్యం చెబుతుంది. మనం చిన్నప్పుడు నీతిపద్యాల్లో ఈ గొప్ప క్షమాగుణం గురించే చదువుకున్నాం. అందుచేతనే యేసుక్రీస్తు మన స్వధర్మాన్ని, శ్రీకృష్ణుడు భగవద్గీతలో చెప్పినట్టే నిర్వచించాడు: ‘మనుషులందరూ ఈ డబ్బూదస్కాలకోసమే వెంపర్లాడుతూ ఉంటారు. ఆ తండ్రికి ఇవి మీకు అవసరమని తెలుసు. ఏం తినాలి? ఏం తాగాలి? ఎలాగ ఈ శరీరాన్ని బట్టలతో చుట్టుబెట్టుకోవాలి? అనేవన్నీ అవసరమైన ఆలోచనలా అసలు? నేలను గడ్డి అనే పచ్చటిగుడ్డలతో భగవంతుడు కప్పుతూనే ఉన్నాడు. ఇవాళ ఉన్న ఆ గడ్డిని ఎండగానే కుంపట్లో వేస్తూనే ఉంటాం. నేలనే ఇంత పట్టించుకొన్నవాడు, మనిషిని మాత్రం ఎందకు పట్టించుకోడు? అంచేత వీటికన్నా మీరు దేవుని రాజ్యాన్ని ముందుగా కోరుకోండి. చేరడానికి ఉపక్రమించండి. అప్పుడు ఇవన్నీ మీకు (వాటికవే) వచ్చి చేరతాయి’ (మత్తయి 6-33). ‘డబ్బునీ దేవుణ్ణీ నువ్వు (ఒకేవేళ) సేవించలేవు’ (మత్తయి 6-24) అని ఎప్పుడూ గుర్తుపెట్టుకో! క్రీస్తు ప్రవచనం- ‘నిన్ను నువ్వెలాగ ప్రేమించుకుంటావో నీ పొరుగువాణ్ణి అలాగే ప్రేమించాలి’ అనేది గుర్తు పెట్టుకోవాలి. దాని అర్థం బహుదృశ్యరూపాల్లో ఎదురుగా అగుపిస్తున్న దేవుణ్ణి ప్రేమించమనే. క్రీస్తు చెప్పిన దానిని మనమంద రమూ నేర్చుకోవాలి. గాలిలో ఎగిరే పక్షులకు తిండిని పెట్టేవాడు మనకూ పెట్టకమానడన్న దృఢమైన విశ్వాసం ఉండాలి. ఆవగింజంతైనా విశ్వాసం లేకుండా, వట్టి కబుర్లు చెబితే క్రీస్తు సంతోషిస్తాడనుకోవడం మనను మనం మోసగించుకోవడమే. - డా॥ముంజులూరి నరసింహారావు -
పోప్ ఒక వ్యవస్థ!
క్యాథలిక్ తెగకు చెందినప్పటికీ, పోప్ వ్యవస్థకు నేటికీ ప్రపంచంలో ఎంతో ఖ్యాతి ఉంది. క్యాథలిక్ చర్చిలో ఈ వ్యవస్థ పరమ పవిత్రమైనది, అత్యున్నతమైనది. పీటర్ కాలం నుంచి ఈ వ్యవస్థ ఉంది. ఆయనను జీసస్ స్వయంగా నియమించా డని (క్రీ.శ. 493) ప్రతీతి. పోప్ మతపర మైన బిరుదు కాదు. అదొక వ్యవస్థ. ఒక పీఠం. దీనికి రోమ్ ప్రధాన కేంద్రం. పాపల్ కాన్క్లేవ్ వీరిని ప్రత్యేక పద్ధతితో ఎంపిక చేస్తుంది. లాటిన్లోని పాపా (తండ్రి) అనే పదం నుంచే పోప్ పదం వచ్చింది. క్రీస్తు శకం మొదటి మూడు దశాబ్దాల నుంచి ఈ వ్యవస్థ ప్రాధాన్యం సంతరించుకుంటూ వచ్చింది. పోప్ పదవికి వచ్చిన వారికి కొన్ని కీలక చారిత్రక సందర్భాలలో ‘సమస్ పాంటిఫిక్స్’, ‘పాంటిఫిక్స్ మ్యాక్జిమస్’, ‘సెర్వస్ సెర్వోరమ్ డి’ వంటి బిరుదులను ప్రదానం చేయడం కనిపిస్తుంది. ఇన్నివేల సంవత్సరాల కాలంలో ఎందరు పోప్ పదవికి వచ్చా రన్న అంశం మీద చరిత్రకారులలో ఏకాభి ప్రాయం లేదు. కానీ పోప్‌ల సంఖ్యను సేకరించిన తొలి చరిత్రకారునిగా హెర్మానస్ కాంట్రాక్టస్కు పేరు ఉంది. ఆయన జాబితాలో మొత్తం 154 మంది పోప్లు ఉన్నారు. ఆఖరి పేరు సెయింట్ పదిహేనో లియో. తరువాత 20వ శతాబ్దం వరకు పోప్‌ల చరిత్ర, జాబితాలను పునర్ లిఖించుకుంటూనే ఉన్నారు. కేవలం 12 రోజుల నుంచి (ఏడో అర్బన్, క్రీ.శ.1590), మూడున్నర దశాబ్దాల పాటు క్రైస్తవ ప్రపంచానికి దిశానిర్దేశం చేస్తూ ఆ పదవిలో ఉన్నవారు కనిపిస్తారు (క్రీ.శ. 752లో సెయింట్ రెండో స్టీఫెన్ ఆ పదవికి ఎంపికైన మూడో రోజునే కన్నుమూశారు. దీనితో కొందరు చరిత్ర కారులు ఆయన పేరును ఈ జాబితాలో చేర్చరు). సెయింట్ థియోడర్ (క్రీ.శ.897) 20 రోజులు, సెయింట్ వేలంటైన్ (క్రీ.శ. 827) 40 రోజులు మాత్రమే ఆ పదవిలో ఉన్నారు. ప్రస్తుతం సెయింట్ జోర్గ్ మేరియో బెర్గోగిలియో (పోప్ ఫ్రాన్సిస్) ఉన్నారు. పోప్లంతా కేవలం ఆధ్యాత్మిక కార్య కలాపాలకే పరిమితం కాలేదు. ఆయా సంక్షోభాల సమయంలో, సమరాల సమయంలో శాంతిని నెలకొల్పడానికి కృషి చేసిన వారున్నారు. కొన్ని విప్లవాత్మక నిర్ణయాలు తీసుకున్నవారూ ఉన్నారు. రెండో జాన్‌పాల్ (1978-2005) ఇస్లాం, జూడాయిజంలతో, ప్రాచ్య సంప్రదాయ క్రైస్తవంతోను కేథలిక్ తెగ సంబంధాలు మెరుగు పరచడానికి కృషి చేశారు. అలాగే పోలెండ్ దేశస్థుడైన ఈ పోప్ అక్కడ కమ్యూనిజానికి వ్యతిరేకంగా వచ్చిన ఆందోళనకు మద్దతు ఇచ్చినట్టు కూడా గాథలు ఉన్నాయి. 129 దేశాలు తిరిగిన మొదటి పోప్ కూడా ఆయనే. అమెరికాలో పర్యటించిన తొలి పోప్ ఆరో పాల్, సెయింట్ జాన్ అణ్వాయుధాల తగ్గింపు కోసం తన వంతు కృషి చేశారు. సెయింట్ సైయస్ (1922-1939) నాజీజం, కమ్యూనిజాలను వ్యతిరేకించేవారని చెబుతారు. -
సమరం సంబరమైన వేళ...
‘దేవతల గానం వినడానికైనా ఆ రాత్రి తుపాకులు మౌనం వహిస్తాయని ఆశిస్తున్నాను’ అంటూ డిసెంబర్ 7, 1914న నాటి పోప్ పదిహేనో బెనడిక్ట్ ఒక సందేశం పంపారు. ఇంతకీ ఆ రాత్రి ఏదీ అంటే, క్రిస్మస్ రాత్రి. యుద్ధం పేరుతో ఈ పుడమి గతంలో ఎన్నడూ లేనంతగా నెత్తుటిలో తడిసి ముద్దవుతున్న కాలంలో పోప్ ఈ సందేశం పంపారు. అప్పటికి మొదటి ప్రపంచ యుద్ధం ఆరంభమై ఐదు మాసాలు గడిచిపోయింది. రోజూ వేల మంది ప్రాణాలు వదులుతున్నారు. ఇంగ్లండ్, బ్రిటిష్ వలస రాజ్యాలు, ఫ్రాన్స్, రష్యా, ఇటలీ, సెర్బియా ఒకవైపు మిత్రపక్షాల పేరుతోనూ; జర్మనీ, ఆస్ట్రియా, జపాన్, టర్కీ వంటి దేశాలు అగ్రరాజ్యాల కూటమి పేరుతోనూ ఘోర యుద్ధం చేశాయి. ఈ యుద్ధం ఆ సంవ త్సరం క్రిస్మస్ నాటికి పూర్తయిపోతుందని అంతా ఆశించారు. కానీ ‘ఈ భూగోళం మీద మనిషి మిగులుతాడా?’ అన్నంత బీభత్సంగా మారి, ప్రపంచ యుద్ధంగా పరిణమించింది. చివరికి 15 లక్షల ప్రాణా లను బలి తీసుకుని ఎలాంటి ఫలితం లేకుండానే ముగిసింది. మధ్యయుగాలకు మించిన అంధత్వంతో సాగిన ఈ సమరానికి కొద్దిగా అయినా విరామం కల్పించాలని పోప్ ప్రయత్నించడం ఒక అద్భుతం. కానీ పోప్ పిలుపునకు బ్రిటిష్ యుద్ధమంత్రి లార్డ్ కిష్నర్, ఆ దేశ సర్వసైన్యాధ్యక్షుడు సర్ జాన్ ఫ్రెంచ్, ఇంగ్లండ్ రాజు ఐదో జార్జి, జర్మనీ నియంత విల్హెల్మ్, ఆస్ట్రియా చక్రవర్తి ఫ్రాంజ్ జోసెఫ్, రష్యా చక్రవర్తి రెండో నికోలస్-ఎవరూ స్పందించలేదు. కానీ, ఒకరినొకరు ఘోరంగా చంపుకుంటున్న రెండు శిబిరాల సైనికులూ కలసిపోయి యుద్ధభూమిలో క్రిస్మస్ పండుగ జరుపు కున్నారు. ‘అక్కడ ఆ రాత్రి జరిగినదాన్ని తెర మీద చూస్తే అదో అభూత కల్పన అని నేను కూడా అనుకునేవాడిని’ అంటాడు కెప్టెన్ ఎడ్వర్డ్ హూల్సే (ఇంగ్లండ్ సెకెండ్ స్కాట్స్‌కు చెందిన సైనికాధికారి). హూల్సే ఆ గాథకు ప్రత్యక్ష సాక్షి. నిజంగా అదొక కథలా, స్వప్నంలా అనిపిస్తుంది. మొదటి ప్రపంచ యుద్ధం ఆరంభ మైన తరువాత జరిగిన తొలి క్రిస్మస్ పండుగలో దాదాపు లక్షమంది సైనికులు పాల్గొన్నారని అంచనా(తరువాత వైరి శిబిరాల మధ్య ఇలాంటి ‘అవాంఛనీయ సంఘటనలు’ చోటు చేసుకోకుండా జాగ్రత్త పడ్డారు). బెల్జియం, ఫ్రాన్స్ దేశాల సరిహద్దులలో ఫ్లాండర్స్ అనే చోట, ఫ్రీలింఘీన్ అండ్ హూప్లైన్స్ సెక్టర్లో శత్రుదేశాల సైనికుల మధ్య జరిగిన వేడుక చరిత్రలో ఎంతో ఖ్యాతి గాంచింది. ఏది ఏమైనా ఫ్రాన్స్‌ను స్వాధీనం చేసుకోవా లన్న నిర్ణయంతో జర్మనీ సేనలు ఆ దేశ సరి హద్దులకు నలభై మైళ్ల దూరంలోనే కాపు వేసి ఉండిపోయాయి. దానితో ట్రెంచ్‌లు (కందకాలు) అవసరమైనాయి. ఫ్రాన్స్ వైపు మిత్రరాజ్యాల సేనల కందకాలు, బెల్జియం సరిహద్దులలో అక్షరాజ్యాల సేనలు మాటు వేసి ఉన్నాయి. నిత్యం వేకువనే మొదలయ్యేది కవ్వింపు చర్య. ఏదో ఒకవైపు నుంచి కాల్పులు మొద లయ్యేవి. కొన్నిగంటల సేపు సాగి, ఆగేవి. స్నైపర్ గన్నులు, గ్రెనేడ్లు, ట్యాంకులు పేలుళ్లతో ఆ ప్రాంతం పొగతో నిండేది. డిసెంబర్ 23 రాత్రి జర్మన్ సేనలు మాటు వేసి ఉన్న కందకం గోడ (పేరాపెట్ వాల్) మీద ఏవో చిన్న చిన్న దిమ్మలు కనిపించాయి. అవేవో కొత్తరకం మందుగుండు అనుకున్నారు ఇంగ్లిష్ సైన్యం. త్రికోణాకారంలో, అడుగు ఎత్తు ఉన్న ఆ దిమ్మల మీద వెలుగులు నక్షత్రాల్లా కనిపిస్తున్నాయి. నిజానికి అవి క్రిస్మస్ చెట్లు. ఆ వెలుగులు చిన్న చిన్న కొవ్వొత్తులు. కానీ అప్పటికి క్రిస్మస్ చెట్టు సంప్రదాయం ఇంగ్లండ్ సామాన్య జనానికి చేరువ కాకపోవడంతో ఆ దేశ సైన్యంలో అలాంటి అపోహ తలెత్తింది. అయితే రెండు శిబిరాల సైన్యం మధ్య క్రిస్మస్ పండుగ జరుపుకోవాలన్న కోరిక బలంగా ఉంది. అప్పుడే బ్రిటిష్ యువ రాణి నుంచి, కుటుంబాల నుంచి క్రిస్మస్ కానుకలు వెల్లువెత్తడం మొదలైంది. సైనికాధికారుల మాట ఎలా ఉన్నా సరిగ్గా మూడు రోజుల ముందు జర్మనీకి చెందిన లెఫ్టినెంట్ జోహెన్నెస్ నిమానీ హూల్సే వంటి కింది స్థాయి అధికారులతో రహస్య చర్చలు మొదలుపెట్టాడు. అంటే జర్మనీ వైపు నుంచి ఈ ప్రయత్నం ఆరంభమైంది. క్రిస్మస్ రోజున తాము పై అధికారుల కోసం తుపాకులు పేల్చడం కంటే, ప్రభువును భక్తితో ప్రార్థించడానికే ప్రాధాన్యం ఇస్తామని వారు కరాఖండీగా చెప్పేశారు. అంతా కొంత మెత్తబడ్డారు. కానీ ఇలాంటిదేదో జరుగుతుందన్న అనుమానం మిలటరీ పెద్దలలో రానే వచ్చింది. శత్రుపక్షంతో చేతులు కలపడం వంటి పని చేయవద్దని, అదే జరిగితే తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరికలు కూడా వచ్చేశాయి. పోప్ క్రిస్మస్ రాత్రి తుపాకులు పేల కుండా ఉంటే చాలునని కోరుకున్నారు. కానీ, 24 వేకువ నుంచే మందుగుండు మూగబోయింది. అయినా ఎవరి అను మానాలు వారివి. 25వ తేదీ వేకువన, గడగడలాడించే చలిలో, ఎడతెరిపి లేకుండా కురుస్తున్న మంచులో ‘నో మ్యాన్స్ల్యాండ్’కు అవతల జర్మన్ భాషలో ‘సిల్లేనాట్.. హి వజ్ నాట్...’ అంటూ కీర్తన లీలగా వినిపించింది. ఆ పాట విన్న కందకాలలోని ఇంగ్లిష్ సైనికులకు తమ దేశంలో పాడుకునే ఒక గీతం బాణీ గుర్తుకు వచ్చింది - ‘సెలైంట్ నైట్...’ అన్న గీతమే అది. క్రిస్మస్ రోజు వేకువన పాడే పాట. శాంటాక్లాజ్ వేషధారి అయిన ఒక జర్మన్ సైనికుడు ఇంగ్లిష్ వాళ్ల కందకం దగ్గరకు వచ్చి, ముళ్ల కంచె వెనక నుంచి గట్టిగా ‘మెర్రీ క్రిస్మస్’ అని అరిచాడు. ఒక్కొక్కరే లేచి, నోమ్యాన్స్ ల్యాండ్ లోకి వెళ్లి శుభాకాంక్షలు చెప్పుకున్నారు. మనిషిలో చచ్చిపోయిందనుకున్న మానవత్వం క్రిస్మస్ పేరుతో అయినా అందరికీ గుర్తుకు వచ్చినందుకు మురిసి పోయారు. బద్ధశత్రువులు ఆలింగనం చేసుకున్నారు. పెద్ద మంట వేసి దాని చుట్టూ తిరుగుతూ సైనిక వాద్యాలు మోగించారు. నాటి ప్రఖ్యాత ప్యారిస్ ఒపేరా గాయకుడు విక్టర్ గ్రానరీ ఒడలు మరచి పాడాడు. అంతా కలసి చుట్టూ ఉన్న రెండు పక్షాల సేనల శవాలనూ సేకరించి తెచ్చి ఉమ్మడిగా అంత్యక్రియలు చేశారు. శిరస్త్రాణాలు, పొగాకు, కత్తులు, కోటు గుండీలు వంటివి కానుకలుగా ఇచ్చి పుచ్చుకున్నారు. తరువాత రెండు పక్షాల నుంచి ఎంపిక చేసిన క్రీడాకారులతో ఆ యుద్ధభూమిలో జరిగిన ఫుట్‌బాల్ మ్యాచ్ చరిత్రలోనే ఓ అద్భుతం. చిత్రంగా ఇందులో ఇంగ్లండ్ నెగ్గింది. ఆ కొద్ది గంటలలో జరిగిన వింతలూ విశేషాలూ ఎన్నో! నిజానికి యుద్ధంలో ఉన్న సైనికుడు నిబంధనను అతిక్రమిస్తే దారుణమైన శిక్షను ఎదుర్కోవాలి. శత్రువుతో చేయి కలిపితే కాల్చి చంపేవారు. అయినా తెగించి ఇరు పక్షాల సైనికులూ ఈ సాహసానికి ఒడిగట్టారు. అందుకే ఇదొక చారిత్రక అద్భుతం. - డా॥గోపరాజు నారాయణరావు -
నేలకు దిగిన నక్షత్రాలు
యేసుక్రీస్తు ఈ లోకంలో జన్మించినప్పుడు భూమి మీద ఉన్న చెట్లన్నీ ఫలాలతో నిండి, యేసు చుట్టూ తిరుగుతూ నృత్యం చేశాయట. పక్షులు, పువ్వులు కూడా ఈ ఆనందలో పాలు పంచుకున్నాయట. ఆ సందడి చూసి ఆకాశం లోని చుక్కలు నేలకు దిగి వచ్చి వెలుగులు విరజిమ్మాయట. కానీ ‘ఫర్ ట్రీ’ (క్రిస్మస్ ట్రీ) అనే చెట్టు దిగులుగా కనిపించిందట. ఇది గమనించిన చుక్కలు ఆ చెట్టుని ‘ఎందుకు దిగులుగా ఉన్నావు?’ అని ప్రశ్నించాయి. ‘‘ఆ చెట్లకేమో ఫలాలున్నాయి. ఈ మొక్కలకేమో పువ్వులు ఉన్నాయి. అందుకే అవి అందంగా ఉన్నాయి. ఫలాలు, పువ్వులు లేని నేను ఎలా సంబరాలు జరుపుకుంటాను?’’ అందట దిగులుగా. నక్షత్రాలు జాలి పడి తమ అందం, తేజస్సుతో ఆ చెట్టును నింపి ఆ సంబరంలో దాన్నో ప్రత్యేక ఆకర్షణగా నిలిపాయట. ఇది చాలా ప్రాంతాల్లో చెప్పుకునే కథ. అయితే క్రీస్తు పుట్టిన సమయంలో ఆకాశంలో ఓ కొత్త తార పుట్టి, అది గొర్రెల కాపరులకు, ముగ్గురు జ్ఞానులకు ఆయన దగ్గరకు వెళ్లే దారి చూపించిందని బైబిల్ చెబుతోంది. దానికి గుర్తుగానే ఇంటి వద్ద స్టార్ పెట్టడం, క్రిస్మస్ ట్రీకి కూడా స్టార్స్ తగిలించడం జరుగు తోందనేది అందరి నమ్మకం. -
క్రీస్తును చూసిన పరమహంస
దేవుడొక్కడే! సత్యం ఒక్కటే! కానీ, అక్కడకు చేరుకోవడానికి అనేక మార్గాలు. ‘ప్రపంచంలో మతాలెన్నో మార్గాలన్ని!’ అని శ్రీరామకృష్ణ పరమహంస అన్నది అందుకే. ఆయన అన్ని రకాల మార్గాలలో ఆధ్యాత్మిక సాధన చేశారు. హిందూ, మహమ్మదీయ, క్రైస్తవ, జైన, సిక్కు మత సంప్రదాయాలన్నిటి పట్ల విశ్వాసం చూపారు. ఆ క్రమంలో ఆయన జరిపిన క్రైస్తవ మత సాధన చాలా ప్రత్యేకమైనది. సంవత్సరం, సమయం, సందర్భంతో సహా శ్రీరామకృష్ణుల ప్రత్యక్ష శిష్యులు రికార్డు చేసి, రాసిన జీవితచరిత్రలో ఆ సంఘటన నమోదైంది. ఆ అరుదైన ఆధ్యాత్మిక అనుభూతి పూర్వాపరాలలోకి వెళితే... అప్పటికే, తంత్రశాస్త్రాలు నిర్దేశించిన 64 సాధనలు, వైష్ణవ సంప్రదాయంలోని శాంత - దాస్యాది పంచభావాల ఆధారంగా భక్తిసాధనలు, మహమ్మదీయ మత సాధన - ఇలా అన్నిటినీ శ్రీరామకృష్ణులు అనుష్ఠించారు. 1873 మే 25న సాక్షాత్తూ శారదాదేవినే అమ్మవారిగా భావిస్తూ జరిపిన షోడశీ పూజతో ఆయన సాధన వ్రతం పూర్తి అయింది. షోడశీ పూజ జరిగిన ఏడాది తరువాత 1874లో... శ్రీరామకృష్ణుల్లో మరో సాధనామార్గం ద్వారా దైవాన్ని దర్శించుకోవాలనే ఆకాంక్ష కలిగింది. అప్పటికి, ఆయనకు శంభుచరణ్ మల్లిక్ అనే వ్యక్తి పరిచయమయ్యాడు. అతను శ్రీరామకృష్ణులకు బైబిల్ చదివి వినిపించేవాడు. అలా ఆయనకు ఏసుక్రీస్తు పావన జీవితం, క్రీస్తు స్థాపించిన మతం గురించి తెలిసింది. క్రైస్తవ సంప్రదాయ మార్గంలో సాధనలు చేయాలనే కోరిక ఆయన మనస్సులో మెదిలింది. దక్షిణేశ్వరంలోని కాళికాలయానికి దక్షిణ దిక్కులో యదుమల్లిక్ ఉద్యానగృహం ఉంది. శ్రీరామకృష్ణులు అప్పుడప్పుడు అక్కడ వ్యాహ్యాళికి వెళుతుండేవారు. యదుమల్లిక్కూ, అతని తల్లికీ శ్రీరామకృష్ణులంటే చాలా భక్తి. కాబట్టి, వాళ్ళు ఉద్యానగృహంలో లేని సమయంలో కూడా శ్రీరామకృష్ణులు అక్కడికి వెళితే, సిబ్బంది తలుపులు తెరిచి, అక్కడ కూర్చొని విశ్రమించమని కోరేవారు. ఆ గదిలో గోడలకు చక్కని చిత్రపటాలు ఉండేవి. తల్లి ఒడిలో ఉన్న బాలక్రీస్తు చిత్రపటం అందులో ఒకటి. ఒకరోజు శ్రీరామకృష్ణులు ఆ గదిలో కూర్చొని, ఆ పటాన్నే తదేక దృష్టితో చూడసాగారు. ఏసుక్రీస్తు జీవిత చరిత్ర గురించి ఆలోచిస్తూ కూర్చున్నారు. అప్పుడు ఒక అద్భుతం జరిగింది. ఆ చిత్రం సజీవమై, దివ్యకాంతితో ప్రకాశించసాగింది. పటంలోని ఆ తల్లి, బాల ఏసు దేహాల నుంచి కాంతిపుంజాలు వెలువడ్డాయి. అవి శ్రీరామకృష్ణుల హృదయంలో ప్రవేశించాయి. అంతే! ఆయన మానసిక భావనలన్నీ పరివర్తన చెందాయి. జన్మసిద్ధమైన హైందవ సంస్కారాలన్నీ మారుమూల ఒదిగిపోయాయి. పూర్తిగా భిన్నమైన సంస్కారాలు ఉదయించాయి. తనను తాను నియంత్రించుకోవడానికి శతవిధాల ప్రయత్నించారు. ‘అమ్మా! నాలో ఏ వింత మార్పులు తీసుకువస్తున్నావు?’ అంటూ జగజ్జననిని హృదయపూర్వకంగా ఆయన ప్రార్థించారు. కానీ, ఉపయోగం లేకపోయింది. ఏసుక్రీస్తు పట్ల, క్రైస్తవ సంప్రదాయం పట్ల భక్తి విశ్వాసాలు శ్రీరామకృష్ణుల హృదయంలో పాతుకున్నాయి. క్రైస్తవ ప్రార్థనా మందిరంలో ఏసుక్రీస్తు మూర్తి ఎదుట ఫాదిరీలు ధూపదీపాదులు అర్పించిన దృశ్యాలు ఆయనకు దర్శనమయ్యాయి. తరువాత శ్రీరామకృష్ణులు కాళికాలయానికి తిరిగి వచ్చారు. మనసులోని ఆ భావాలు, కదలాడిన దృశ్యాల చింతనలో లీనమైపోయారు. కాళికాలయానికి వెళ్ళి, జగజ్జననిని దర్శించుకోవాలనే విషయం కూడా మర్చిపోయారు. అలా మూడు రోజుల పాటు ఆ భావతరంగాలు ఆయన మనస్సును ఆక్రమించేశాయి. అది మూడో రోజు... చీకటి పడింది. శ్రీరామకృష్ణులు ‘పంచవటి’ గుండా నడుచుకుంటూ వెళుతున్నారు. అప్పుడు ఒక అద్భుత దృశ్యం కనిపించింది. ఉజ్జ్వలమైన గౌరవర్ణుడైన అద్భుత దివ్య మానవుడు ఒకరు తదేకదృష్టితో ఆయనను చూస్తూ, ఆయన వైపు రాసాగారు. ఆ వ్యక్తి విదేశీయుడనీ, విజాతీయుడనీ చూసిన క్షణంలోనే శ్రీరామకృష్ణులకు అర్థమైంది. ఆతని కళ్ళు విశాలంగా ఉన్నాయి. ఆతని ముఖారవిందానికి వింత శోభను సంతరిస్తున్నాయి. ఆతని ముక్కు ఒకింత చప్పిడిగా ఉంది. కానీ, ఆతని అందానికి అదేమీ కొరత కాలేదు. ఆతని ముఖంలో అద్భుతమైన దివ్య భావప్రకటన తొణికిసలాడుతోంది. అదంతా చూసి, శ్రీరామకృష్ణులు ‘ఇతనెవరా?’ అని అబ్బురపడ్డారు. ఆ దివ్యమూర్తి దగ్గరకు వచ్చాడు. ఆ క్షణంలో శ్రీరామకృష్ణుల హృదయం లోలోపల నుంచి ‘‘ఏసుప్రభువు! దుఃఖయాతనల నుంచి జీవులను ఉద్ధరించడానికి ఎవరు తన హృదయ రక్తాన్ని సమర్పించారో... ఆ ఏసుప్రభువు!’’ అన్న మాటలు వెలువడ్డాయి. అంతర్వాణి అలా పలుకుతూ ఉన్న సమయంలో ఏసుక్రీస్తు, శ్రీరామకృష్ణులను ఆలింగనం చేసుకున్నాడు. ఆయన దేహంలో లీనమైపోయాడు. వెంటనే శ్రీరామకృష్ణులు భావసమాధి మగ్నులై, బాహ్యచైతన్యాన్ని కోల్పోయారు. అలా శ్రీరామకృష్ణులు సాక్షాత్తూ ఏసుక్రీస్తు దర్శనం పొందారు. కనిపించిన రూపమే...! ఇది జరిగిన చాలాకాలం తరువాత ఒకరోజు స్వామి శారదానంద సహా పలువురు ప్రత్యక్ష శిష్యులతో శ్రీరామకృష్ణులు ఏసుక్రీస్తు ప్రస్తావన తెచ్చారు. ‘‘నాయనలారా! మీరు బైబిల్ చదివారు కదా! ఏసుక్రీస్తు భౌతిక లక్షణాల గురించి దానిలో ఏం రాసి ఉంది? ఆయన ఎలా కనిపించేవాడు?’’ అని అడిగారు. దానికి శిష్యులు, బైబిల్లో ఎక్కడా ఆయన భౌతిక వర్ణన తాము చూడలేదనీ, కానీ యూదుడుగా జన్మించడం వల్ల క్రీస్తు మేనిఛాయ ఉజ్జ్వల గౌరవర్ణంలో ఉంటుందనీ, విశాలనేత్రాలు, చిలుక లాంటి కొక్కెపు ముక్కు ఉండడం ఖాయమనీ జవాబిచ్చారు. కానీ, శ్రీరామకృష్ణులు మాత్రం ‘‘ఆయన ముక్కు ఒకింత చప్పిడిదై ఉండడం చూశాను. ఆయనను ఎందుకలా చూశానో తెలియడం లేదు’’ అన్నారు. విచిత్రం ఏమిటంటే, భావసమాధిలో శ్రీరామకృష్ణులు చూసిన స్వరూపం, ఏసుక్రీస్తు వాస్తవమూర్తితో సరిపోలింది. శ్రీరామకృష్ణుల మహాసమాధి అనంతరం ఏసుక్రీస్తు శరీర నిర్మాణం గురించి మూడు విభిన్న వర్ణనలు ఉన్నాయనీ, ఆయన ముక్కు ఒకింత చప్పిడిగా ఉండేదనే వర్ణన వాటిలో ఒకటి ఉందనీ శ్రీరామకృష్ణుల శిష్యులు తెలుసుకొని అబ్బురపడ్డారు. శ్రీరామకృష్ణులకు దర్శనమైంది స్వయంగా క్రీస్తే అని చెప్పడానికి ఇదొక నిదర్శనం. ఇవాళ్టికీ రామకృష్ణ మఠంలో... క్రిస్మస్! దేశవిదేశాల్లో వ్యాపించిన శ్రీరామకృష్ణ మఠాలన్నిటిలో, బుద్ధ భగవానుడు, శ్రీరామ, శ్రీకృష్ణ, శ్రీచైతన్య, శ్రీశంకరుల జన్మదినోత్సవాలు ప్రతి ఏటా చేస్తారు. అది శ్రీరామకృష్ణ మఠ సంప్రదాయం. విశేషం ఏమిటంటే, శ్రీరామకృష్ణుల క్రైస్తవ ఆధ్యాత్మిక సాధన, పైన చెప్పిన సంఘటనను పురస్కరించుకొని - క్రిస్మస్ సందర్భంగా ‘క్రిస్మస్ ఈవ్’ (డిసెంబర్ 24) నాడు ఏసుక్రీస్తు జన్మదినోత్సవాన్ని కూడా మఠంలో శ్రద్ధాభక్తులతో చేస్తారు. ముఖ్యంగా మఠ కేంద్రస్థానమైన కోల్‌కతాలోని బేలూరు రామకృష్ణ మఠంలో క్రీస్తు పూజ, బైబిల్ పారాయణ, భక్తి సంగీత గానం మొదలైనవి జరుపుతారు. రామకృష్ణ మఠం, మిషన్ సెంటర్లలో జరిపే పండుగల్లో హైందవేతర ఉత్సవం ఇదొక్కటే! ఇప్పటికీ ఈ సంప్రదాయం అవిచ్ఛిన్నంగా సాగుతోంది. - రెంటాల జయదేవ -
క్రిస్మస్ కానుక
క్లాసిక్ కథ మనిషంటే ప్రకృతికి కోపమేమో, శీతాకాలం తన వెంట శిశిరాన్ని కూడా తీసుకుని మరీ వచ్చింది మమ్మల్ని వణికించటానికి... మంచు వర్షం, నల్లటి మబ్బులతో చీకటిగా మారిన పట్టపగలు. కిటికీకి ఎక్కడన్నా రంధ్రముంటే రివ్వుమంటూ లోపలికి దూసుకువచ్చే గాలి, ఇళ్ల కప్పులు ఎగిరిపోతాయేమో నన్నంత బలంగా వీచిన తుఫాను. పైపు గొట్టాల్లో నిరంతరంగా వినిపించే రొద. ఎక్కడి వాళ్లను అక్కడ కట్టిపడేసే చెప్పలేని బాధ. ప్రళయం ఇంతకన్న భయంకరంగా ఉంటుందేమో తెలియదు. 1882. తెల్లారితే క్రిస్మస్. అప్పటికి నాకింకా శిక్ష పడలేదు. వస్తువులు తాకట్టు పెట్టుకునే టుపాయెవ్ వద్ద నౌకరీ. తాకట్టుకు వచ్చే వస్తువుల వెల కట్టి దేనికెంత ఇవ్వాలో చెప్పటం నా పని. నడిరాత్రి వస్తువులకు కాపలా ఉండమని పురమాయించాడు యజమాని. ఊదారంగు మంటతో వెలుగుతోంది కొవ్వొత్తి. విశాలమైన గది నిండా కుప్పలు తెప్పలుగా వస్తువులు... ట్రంకు పెట్టెల్లో, షెల్ఫుల నిండా. కుందేలు వెంట్రుకలతో తయారుచేసిన కోట్లు. మగాళ్ల లాంగ్ కోట్లు, రైఫిళ్లు, చిత్రపటాలు, అలంకరణ వస్తువులు, పెచ్చులూడిన గోడకు వేలాడుతున్న గిటారు. వీటికి నేను నిఘా. నగల షో కేసును చూస్తూ ఎర్ర ట్రంకుపెట్టె మీద పడుకున్నాను. కొవ్వొత్తి మీదే ఉంది నా దృష్టి. ఎందుకో భయమేసింది. ప్రేతాల్లాంటి తాకట్టు వస్తువులు... రాత్రివేళ వాటికి ప్రాణం వచ్చి మసక వెలుగులో స్వైర విహారం చేస్తున్నట్టుగా, కిటికీ తలుపుల మీద చినుకుల చప్పుడు, రోదిస్తున్న గాలి. సమోవార్ (రష్యన్ స్టవ్) లోంచి, చూరులోంచి దాడి చేస్తున్న చలి. వస్తువులు ఎలుగెత్తి ఏడుస్తున్నాయి. అన్నీ నేను విలువ గట్టినవే. ఒక్కొక్క దాని చరిత్ర నాకు తెలుసు. ఆ గిటారు డబ్బుల్తో రోగికి మందులు కొన్నారు. ఈ రైఫిల్‌తో ఒక తాగుబోతు ఆత్మహత్య చేసుకున్నాడు. అతడి భార్య పోలీసుల కంటపడకుండా దాన్ని దాచిపెట్టింది. తరువాత ఇక్కడ తాకట్టు పెట్టి, వచ్చిన డబ్బుల్తో శవపేటిక చేయించింది. ఈ బ్రేస్లెట్ ఎవరిదో, దొంగిలించినవాడు మాకమ్మాడు. ‘178’ నంబరున్న రెండు డ్రెస్సులు ఓ పిల్ల అత్యవసర స్థితిలో ఇక్కడికి తెచ్చింది. ఒక్కొక్క వస్తువు వెనకా ఒక విషాద గాథ, రోగాలు, రొష్టులు, పూటకు గతిలేని రోజులు. పోలీసులు నమోదు చెయ్యని నేరాలు. క్రిస్మస్ వాతావరణంలో ఇవన్నీ తమ కథలు చెప్పుకుంటున్నాయి. ‘పండగ పూట కొట్టులో ఎందుకు, ఇళ్లకు పోదాం’ అంటున్నాయి. అయితే నన్ను భయ పెట్టింది ప్రాణం లేని వస్తువులు మాత్రమే కాదు. అట్టలు అట్టలుగా పేరుకుపోయిన గాజు కిటికీల గుండా ఆశగా లోపలికి చూస్తున్న మొహాలు కూడా. ‘నాన్సెన్స్’ అంటూ తల విదిలించాను. అంతా నా భ్రమ. అసలు విషయమేమిటంటే వస్తువులకు వెలకట్టే నాలాంటి వాడికి, క్రిస్మస్ వచ్చిందంటే పీకుతుంటుంది. అంతరాత్మ ఘోషిస్తుంది. నిష్కృతిలేని పాపం, తాకట్టు కొట్టులో పని చేయటం! అంతరాత్మను తాకట్టు పెట్టుకునే చోటు కూడా ఇదే. బోర్డు రాసి పెట్టుకోవచ్చు. ‘అంతరాత్మలు అమ్మబడును, కొనబడును’. అది నిరాకారమైంది కాదిక్కడ. ఒక వస్తువు రూపంలో ఉంటుంది. దానికున్న మిగతా లక్షణాలతో మాకు సంబంధం లేదు. ఇంతకూ నాకు అంతరాత్మ ఉందనే భ్రమ ఎందుకు కలిగింది? ఇలాంటి ఆలోచనల చిక్కుముడి నా గొంతుకెందుకు బిగుసుకుంటోంది? విదిలించుకోవటానికి ప్రయత్నించాను. బహుశా ఇది రోజంతా పనిచేసి అలసి నిద్రపోవడం వల్ల కలిగిన మనో విభ్రమం. క్రిస్మస్ వచ్చిందంటే చాలు పేదవాళ్లు మాకొట్టు ముందర బారులు తీరి నిలబడతారు. ఇలాంటి చలిలో పేదరికం కేవలం దురదృష్టం మాత్రమే కాదు... ప్రత్యక్ష నరకాన్ని అనుభవంలోకి తెస్తుంది. కనీసం పండగ నాడన్నా కాస్త సంతోషంగా గడపాలంటే మునుగుతున్న వాడికి గడ్డిపోచలా కనిపిస్తుంది తాకట్టుకొట్టు. కానీ నిజానికది బండరాయిలా మెడకు తగులుకుంటుంది. గుంపులు గుంపులుగా వచ్చారు జనం. వస్తువులతో గదంతా నిండి పోయింది. కొన్ని వెనకాల వరండాలో పెట్టాం. తెల్లారి నుండి అర్ధరాత్రి దాకా క్షణం విరామం లేదు. ఎందుకంటే అది ఇవ్వటం ఎంతిస్తే అంత పట్టుకుపోవడం. వాళ్లను పీల్చి పిప్పి చెయ్యటానికి ఇంతకన్నా మంచి రోజు మరొకటుండదు. తాకట్టు పెట్టటానికే వచ్చారు. కానీ, వాళ్ల పరిస్థితి ముష్ఠి వాళ్లకన్నా అధ్వాన్నం. పనితో ఎంత అలసిపోయానంటే నిద్ర కూడా రావటం లేదు. ఎవరో తలుపు తట్టారు. యజమాని గొంతు వినిపించింది. ‘‘నిద్రపోతున్నావా?’’ ‘‘లేదు... ఏం కావాలి?’’ ‘‘రేపు కాస్త పెందలాడే తెరవాలి కొట్టు. తేనె మీద ఈగల్లా వచ్చి వాలతారు జనం. చర్చికి తరువాత వెళ్లొచ్చు. కౌంటర్ దగ్గర కూర్చో. గుడ్‌నైట్.’’ కొవ్వొత్తి మంట వణుకుతోంది. భయంగా ఉంది. ఆర్పేసి పడుకోవాలి. దీపం దగ్గరగా వెళ్లాను. మసక వెలుతురు. గాజు తలుపుల్లోంచి రెండు మొహాలు నా వేపే చూస్తున్నాయి. ‘‘ఎవరూ లేరు. అంతా నా ఊహ’’ అని ధైర్యం చెప్పుకున్నాను. దీపం ఆర్పి తిరిగి వస్తుంటే అనుకోనిదొకటి జరిగింది. నా గొంతుకతో మరెవరో అరుస్తున్నారు. ఎక్కడో ఏదో విరిగిన, పగిలిన శబ్దం. గిటారు తీగ తెగింది. భరించలేని బాధ. బిగ్గరగా అరిచాను. ఒళ్లంతా చెమట పట్టింది. కళ్లు మూసుకుని పరిగెత్తాను. ఎదురుగా ఫర్నిచర్ డబ్బాలు. ఊపిరి బిగపట్టి, బిక్కచచ్చి వింత గొంతుకల నాలకించాను. ‘పద’ అంటూ తొందర పెట్టింది ఈదురు గాలి. ‘‘ఇది క్రిస్మస్ పర్వదినం. నువ్వూ పేదవాడివే. గడ్డ కట్టే చలిలో, ఆకలితో నకనకలాడే పేదవాళ్ల కష్టాలేమిటో నీకూ తెలుసు. ఈ వస్తువులన్నీ వాళ్లవే గదా?’’ అవును. నేను కూడా నిరుపేదనే. ఇక్కట్లు నాకు కొత్త కాదు. చలికి గజగజ వణికిన రోజులింకా జ్ఞాపకమే. దుర్భర దారిద్య్రమే నేనీ వడ్డీ వ్యాపారి వద్ద పనిచెయ్యక తప్పని పరిస్థితి కల్పించింది. రోజూ నాలాంటి ఇతర్లను పీల్చి పిప్పి చేస్తే తప్ప నా కడుపు నిండదు మరి. ఆకలిని తట్టుకోగలిగిన సత్తా నాకుంటే ఎదుటి మనుషుల జీవితాల్ని, ఆప్యాయతల్ని, అవసరాల్ని అణా పైసల్తో లెక్కగట్టగలిగేవాడినా? మరి, ఈ గాలికి నా మీదెందుకు కోపం? అంతరాత్మ నన్ను ప్రశ్నిస్తోందా? ఒకవైపు బాధ, పశ్చాత్తాపం, నామీద నాకు కోపం. మరోవైపు అలసట. నిద్ర ముంచుకొచ్చింది. మళ్లీ యజమాని తలుపు తట్టిన చప్పుడు. అర్ధరాత్రి చర్చి గంటలతో క్రిస్మస్కు స్వాగతం. ఇంటి కప్పు మీద వాన చప్పుడు. సుడిగాలి రొద. గది నిండా షోకేసుల్లో, వస్తువులు. కిటికీ తలుపునకు యేసు ప్రభువు బొమ్మ. తాకట్టుకు వచ్చిన వస్తువులన్నీ తమ తమ ఇళ్లకు వెళ్లనివ్వమని అర్థిస్తున్నాయి. గిటారు తీగలు క్రమం తప్పక తెగిపోతున్నాయి. ముష్టివాళ్లు, వృద్ధ స్త్రీలు ముడతలు పడిన మొహాలతో కిటికీలోంచి నన్నే చూస్తున్నారు. తలుపులు తీసి తమ వస్తువులు వాపసు చెయ్యమంటున్నారు. కలలో ఎలుకలు కిచకిచ మంటున్నట్టుగా వినిపించింది. తలుపును కొరుకుతున్నది. చలికి బ్లాంకెట్ కప్పుకుని లేచాను. అర్థం కావటం లేదు గానీ, ఏవో మాటలు వినిపిస్తున్నాయి. పీడకలలాగ ఉంది. మెలకువ వచ్చినా బాగుండును. గాజు పగిలింది. షోకేస్ మీద లైట్ పడింది. ‘‘మాట్లాడొద్దు, నిశ్శబ్దం, యముడు లేస్తాడు, బూట్లు కూడా విప్పి నడువు.’’ షోకేస్ వద్దకు వచ్చి తాళం లాగి చూశాడు. మొహం పాలిపోయి ఉంది. గడ్డం పెరిగింది. చిరిగిన కోటూ, రంధ్రాలు పడ్డ బూట్లూ, పొడుగ్గా ఉన్న మరొకడు వాడి వెనకే వచ్చాడు. ఇద్దరూ గుసగుసలాడుకున్నారు. ‘‘దొంగలు’’ అనుకున్నాను. నిద్రలో ఉన్నాను. అయినా జ్ఞాపకం వచ్చింది. నా దిండు కింద ఎప్పుడూ ఒక పిస్తోలుంటుంది. ‘‘వాడు లేస్తాడు జాగ్రత్త’’ అనుకుంటున్నారు వాళ్లు. ‘‘హ్యాండ్సప్’’ అంటూ అరిచాను. భయంతో గోడకంటుకు పోయారిద్దరూ. కన్నీళ్ల పర్యంతమై, వదిలెయ్యమని ప్రాధేయపడ్డారు. పగిలిన కిటికీ అద్దం గుండా వచ్చిన శీతగాలికి చేతులు వణుకుతున్నాయి. దొంగలు వెలిగించిన కొవ్వొత్తి దీనంగా వెలుగుతోంది. ‘‘నువ్వే దిక్కు రక్షించు’’ అంటూ కాళ్ల మీద పడ్డారు. కిటికీలో, వర్షంలో తడిసిన ముసిల్దాని మొహం. ‘‘వాళ్లనేం చెయ్యక వదిలెయ్. దరిద్రం మమ్మల్ని శాసిస్తోంది’’ అని అంది. ‘‘అవును... దరిద్రం’’ అన్నాడు ముసలాడు. ‘‘దరిద్రమే... దరిద్రమే’’ వంత పాడింది ఈదురుగాలి. గుండెలో బాకులు దించే దరిద్రం. నిద్రా? నిద్రలో కలా? లేచి, షోకేస్లోంచి నగలు తీసి దొంగల జేబుల్లో కుక్కాను. ‘‘తీసికెళ్లండి. రేపు క్రిస్మస్. సరదాగా గడపండి.’’ మిగతా నగలు మూటగట్టి ముసల్దానికిచ్చాను. ఫర్ కోట్, మరో బ్లాక్ సూట్, లేసులల్లిన డ్రెస్సులు, గిటారు. అన్నీ అందరికీ. ఇలాంటి వింత కలలు కూడా వస్తాయి మరి. ఆ తరువాత తలుపు తెరుచుకుంది. పోలీసువాళ్లను వెంటపెట్టుకుని యజమాని ప్రవేశించాడు. ఇంత అకస్మాత్తుగా వీళ్లు ఎక్కణ్నుంచి ఊడిపడ్డారు? యజమాని చూస్తుండగానే వస్తువులు అందరికీ పంచిపెట్టాను. ‘‘దుర్మార్గుడా... ఏం చేస్తున్నావురా?’’ ‘‘రేపు క్రిస్మస్. అందరూ ఆనందంగా గడపాలి.’’ ఈ అంకానికి ఇక్కడితో ముగింపు. కొత్త అంకం ప్రారంభం. ఇప్పుడు నేను కొట్టులో లేను. సంకెళ్లతో నడుస్తున్నాను. వెంట పోలీసులు. ‘‘ఎందుకిలా చేశావు?’’ మెలకువ వచ్చేసరికి తెల్లవారింది. వర్షం ఆగింది. వాతావరణం ప్రశాంతంగా ఉంది. వెచ్చగా నీరెండ. పోలీసులే క్రిస్మస్ శుభాకాంక్షలు చెప్పారు. నెల తర్వాత విచారణ ప్రారంభమైంది. ‘‘జరిగిందంతా కల’’ అని చెప్పాను జడ్జిగారికి. కలలో చేసిన పనులకు శిక్షలు వెయ్యటం అన్యాయం. వాళ్లకు చెందని వస్తువులు దొంగకెందుకిస్తానసలు? పైగా, డబ్బులు తీసుకోక ఎందుకు దానం చేస్తాను? కానీ నాకు వచ్చిన కల వాస్తవమని ధ్రువీకరించింది న్యాయ స్థానం. శిక్ష కూడా వేసింది. నా తరఫున వాదిస్తారా మీరు? అయాం నాట్ గిల్టీ. అనువాదం: ముక్తవరం పార్థసారథి చెహోవ్ : మూల రచయిత -
క్రిస్మస్ ట్రీ: జగానికి జర్మనీ కానుక
క్రిస్మస్ వేడుకలో చెట్టు అలంకరణ ఎంతో ముచ్చటగా ఉంటుంది. రకరకాల పరిమాణాలలో ఉండే క్రిస్మస్ చెట్టు, రకరకాల బొమ్మలతో, పూలతో, మెరుపుల అలంకరణతో ఆకర్షణీయంగా ఉంటుంది. ఒక వేడుకలో కనిపించే కళాత్మక దృష్టికి ఈ చెట్టు నిదర్శనంగా ఉంటుంది. నిజానికి ఇప్పుడు క్రైస్తవ దేశాలన్నీ క్రిస్మస్ చెట్టు అలంకరణను వేడుకలో భాగం చేసినప్పటికీ, మొదట్లో దీనికి అంత ఆమోదం లభించలేదు. నిజానికి పాత నిబంధనలోనే క్రిస్మస్ చెట్టు ప్రస్తావన ఉంటుందని చెబుతారు. కానీ రకరకాల ఒడిదుడుకులను ఎదుర్కొని 19వ శతాబ్దానికి గానీ ఈ చెట్టు ప్రపంచమంతా విస్తరించలేదు. ఒక పచ్చని చెట్టును నరికి తెచ్చి ఇంటిలో అలంకరించుకోవడం ఇష్టం లేక, ఇది దేవతారాధన సంప్రదాయం కలిగిన మత చిహ్నం కావడం (పాగన్ రెలిజియన్) వల్ల మొదటి దశలో క్రిస్మస్ చెట్టు పెట్టే సంప్రదాయానికి వ్యతిరేకత ఉండేది. ఇప్పటికీ కొన్ని క్రైస్తవ రాజ్యాలలో మాత్రమే క్రిస్మస్ చెట్టును అలంకరించే అలవాటు కనిపిస్తుంది. చెట్టును కొట్టడం, కొంతవరకు పాగన్ మతాల లక్షణాలు కనిపించడ మే ఇందుకు కారణం. ప్రాచీన రోమన్లు క్రిస్మస్ చెట్టు ఏర్పాటు చేసి, దానిని 12 కొవ్వొత్తులతో అలం కరించే సంప్రదాయాన్ని పాటించేవారు. ఆ అంకె వారి ఇష్టదైవం. సూర్యునికి ప్రతీక. ఇంకా చెట్టు నిండా పలు రకాల దేవతా మూర్తులను అలంకరించేవారు. అందులో ‘బాచుస్ దేవత’ కచ్చితంగా ఉండేది. అంటే భూమిని సారవంతం చేసే దేవత. ఇంతకీ అసలు ఈ చెట్టు మొదట ఎక్కడ ఏర్పాటైంది? వేయి సంవత్సరాల క్రితం జర్మనీలోనే ఈ సంప్రదాయం మొదలైందని చెబుతుంటారు. సెయింట్ బోనిఫేస్ అనే ప్రచారకుడు దీనిని ఆరంభించాడు. జర్మనీకి క్రైస్తవాన్ని పరిచయం చేసింది కూడా ఆయనే. అయితే ఆ తర్వాత ఈ సంప్రదాయం కొంతకాలం మరుగున పడినప్పటికీ తిరిగి జర్మనీలోనే మళ్లీ ఆదరణ పొందింది. ఆధునిక చరిత్ర ప్రకారం 16 శతాబ్దం నుంచి జర్మనీలో ఈ సంప్రదాయం బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది. అక్కడ దీనిని పారా డెయిస్ బామ్ (ప్యారడైజ్ ట్రీ) అని పిలుచుకునేవారు. డిసెంబర్ 24న ఒక ఓక్ చెట్టు శాఖను తెచ్చి అలంకరిస్తారు. అదే క్రిస్మస్ చెట్టు. మొదటి ప్రపంచ యుద్ధ సమయానికి ఇంగ్లండ్‌లో కూడా ఈ సంప్రదాయానికి అంతగా ప్రాచుర్యం లేదు. ప్రిన్స్ అల్బర్ట్, ఆయన భార్య విక్టోరియా మహారాణిల కాలంలో, అంటే 1840లో మాత్రమే అక్కడ క్రిస్మస్ చెట్టు ప్రత్యక్షమైంది. ఇందుకు కారణం- అల్బర్ట్ జర్మన్ జాతీయుడు. ఆ యుద్ధకాలంలో తమ ట్రెంచ్‌లలో జర్మన్ సైనికులు క్రిస్మస్ చెట్లు అలంకరిస్తే, అవేమిటో ఇంగ్లిష్ సైనికులకు అర్థం కాలేదు. ఆఖరికి అమెరికాలో కూడా 1850 వరకు ఈ చెట్టుకు అంత ప్రాధాన్యత కలగలేదు. అమెరికా అధ్యక్షుడు ఫ్రాంక్లిన్ పియర్స్ (1804-1869) మొదటిసారి శ్వేత సౌధంలో క్రిస్మస్ చెట్టును అనుమతిం చాడు. తర్వాత మెల్లగా ఈ సంప్రదాయం ప్రపంచమంతా పాకింది. -
గ్రీష్మంలో వసంతం క్రిస్మస్ సంబరం
రాక్షసత్వానికి మారుపేరుగా ప్రసిద్ధి చెందిన సీజర్ ఆగస్టస్ రోమా సామ్రాజ్యాన్ని పరిపాలిస్తున్న రోజులవి. రోమా సామ్రాజ్యం నాటి సామ్రాజ్యా లన్నిటిలోకల్లా అతి విశాలమైనది మాత్రమే కాదు... ఎంతో బలమైనది, సంపన్నమైనది కూడా. అలాంటి రోమా సామ్రాజ్యంలో ఒక మూలన ఉన్న యూదా రాజ్యంలోని బెత్లెహేము పురంలో... ఒక పశువుల పాకలో... ఒక నాటి రాత్రి యోసేపు, మరియల తనయుడుగా దైవకుమారుడు యేసుక్రీస్తు జన్మించాడు. క్రీస్తు పూర్వం, క్రీస్తు శకంగా చరిత్రను రెండు ప్రధాన విభాగాలుగా విడదీసిన ‘యేసుక్రీస్తు జననం’ అలా రెండు వేల ఏళ్ల క్రితం జరిగింది. కొత్త పన్నులు విధించి ప్రజల్ని మరింత పీడించడానికి సీజర్ ఆగస్టస్ జనసంఖ్య తీయాలని ఆదేశిస్తే, యోసేపు మరియలు తాముంటున్న గలిలయ ప్రాంతపు గ్రామమైన నజరేతును వదలి రెండొందల కిలోమీటర్ల దూరంలోని బెత్లెహేము పురానికి జనాభా లెక్కల్లో తమ పేర్లు నమోదు చేయించుకోవడానికి వచ్చారు. ఎందుకంటే యోసేపు దావీదు వంశానికి చెందినవాడు. దావీదు వంశీయులు బెత్లెహేము పురానికి చెందిన వారు. ప్రపంచ చరిత్రలోనే అది మొట్ట మొదటి ప్రజాసంఖ్య కాగా, అందులో యోసేపు మరియలే కాదు వారికి కుమారుడుగా జన్మించిన యేసుక్రీస్తు పేరు కూడా నమోదయింది. ఆ జనసంఖ్య తాలూకు ప్రతులు రోమా సామ్రాజ్య పతనం తరువాత కూడా రోమ్‌లో తొమ్మిదవ దశాబ్దం దాకా భద్రంగా ఉంచారు. కాని ఆ తరువాత సంభవించిన భూకంపం తాలూకు ఒక పెద్ద అగ్ని ప్రమాదంలో ఆ ప్రతులు కాలిపోయాయి. మానవుణ్ని దేవుడిగా మార్చి, ఆయన స్థాయికి ఎదిగేలా చేసిన ఎన్నో మతాలు చరిత్రలో ఉన్నాయి. కాని దేవుడే మానవ శరీరధారిగా ఈ లోకానికి వచ్చిన అపూర్వమైన సంఘటన ఇది. దేవుడు మానవుడుగా మారాలనుకొని పరలోకాన్ని వదిలి ఈ లోకానికి రావాలనుకోవడం, జనన మరణాలకు అతీతుడైన దేవుడు భూలోకంలోని ఇద్దరు నిరుపేద భార్యా భర్తలకు కుమారుడుగా జన్మించి, కేవలం ముప్ఫై మూడున్నర సంవత్సరాల పాటు ఈ లోకంలో జీవించి, సిలువలో మరణించాలనుకోవడం అపూర్వమే కాదు, అనూహ్యం కూడా! యేసుక్రీస్తు రాకతో ఈ లోకానికి నవోదయమైంది, కాని పరలోకం చిన్నబోయింది. పరలోక సౌఖ్యం, వైభవం వదలి క్రీస్తు నరలోకానికి ఎందుకు వెళ్లా లనుకున్నాడో అక్కడి దేవదూతలకు కూడా అర్థం కాలేదు. వాళ్లంతా ఎంతో విస్మయం చెందారు. కానీ క్రీస్తు భూమిపై జన్మించడానికి కారణం ఉంది. అది తండ్రి నిర్ణయం. తన కుమారుడి ద్వారా ఈ లోకంలో వెలుగును, ప్రేమను నింపాలన్నది ఆయన కాంక్ష. అలా క్రిస్మస్తో ఈ లోకంలోనే నవశకం ఆరంభమైంది. యేసుక్రీస్తు జీవితం, పరిచర్య సందేశాల పరిమళం, ఆయన పునరుత్థానం, పరలోకారోహణం, తరువాత ఆయన శిష్యుల ద్వారా లోకం నలుమూలలకూ వ్యాపించింది. అలా క్రూరత్వానికి ప్రతీక అయిన సీజర్ ఆగస్టస్ పాలనా కాలమే కరుణామయుడు, క్షమాపణాధీశుడైన యేసుక్రీస్తు జననానికి అనువైన సమయంగా దేవుడు ఎంపిక చేసుకోవడం గమనార్హం. అప్పటికే సీజర్ పాలనా దౌర్జన్యంతో కకావికలమైపోయిన సామాన్యులు, బీదలు, నిరాశ్రయుల జీవితాల్లో యేసుక్రీస్తు ప్రేమ సందేశాలు తొలకరి జల్లుల్లా ఆనందాన్ని నింపాయి. ‘నిన్ను వలె నీ పొరుగువాణ్ని ప్రేమించు’ అన్న క్రీస్తు సందేశం, ఆ మేరకు ఆయన జీవించిన జీవితం... ‘పీడించు’, ‘దండించు’, ‘దోచుకో’ అన్న నాటి పరిస్థితులను ప్రతిబింబించే పదాలకు ప్రత్యామ్నాయమై ప్రతిధ్వనించింది. అయితే జలపాతంలా, ఉధృత ప్రవాహంలా పట్టరాని శక్తితో విజృం భిస్తున్న క్రూరత్వం, దోపిడీ, నియంతృ త్వాన్ని పరమ సాత్వికుడు, మితభాషి, సరళస్వభావి, అహింసావాది, శత్రువు ఒక చెంపన కొడితే మరో చెంప చూపించ మన్న క్షమాపణా తాత్వికుడైన, నిరా యుధుడైన యేసుక్రీస్తు ఎదుర్కొని నిలబడగలడా అన్న ప్రశ్న ఆనాడే ఉత్పన్నమైంది. అయితే హింసను ఎదుర్కొనే అత్యంత ప్రతిభా వంతమైన ఆయుధం ప్రేమ మాత్రమేనని యేసుక్రీస్తు నిరూపించాడు. చీకటి ఎంత గాఢంగా, శక్తివంతంగా ప్రబలి వున్నా ఒక చిరుదీపం చాలు దాన్ని పారదోలడానికి. ఒక్కోసారి వరద ప్రవాహం ఉధృతిలో మహా భవనాలు, మహా వృక్షాలు కొట్టుకుపోతాయి. కాని తలవంచడమే స్వభావంగా ఉన్న గడ్డిపరకలు నిలదొక్కుకుంటాయి. రెండువేల ఏళ్లుగా ‘క్రిస్మస్’ ద్వారా యేసుక్రీస్తు అందిస్తున్న సందేశం అదే. ఒక ఉదంతం పండగగా పరిణ మించడంలోని ఒక ప్రమాదం ఏమిటంటే కాలక్రమంలో సందేశం మూలన పడి ‘సెలబ్రేషన్’ మాత్రమే మిగులుతుంది. పండుగలన్నింటిలాగే క్రిస్మస్లో కూడా వాణిజ్య విషసంస్కృతి తాలూకు దుష్ర్పభావం కనిపిస్తోంది. ప్రేమ సందేశాన్ని ఎలా పాటించాలి, ఎలా దాని చేత ప్రభావితం కావాలి అన్నదానికన్నా, క్రిస్మస్ అలంకరణలైన ట్రీ, స్టార్, క్రిస్మస్ ఖర్చులు, ఆడంబరాలు, వేడుకలకే అధిక ప్రాధాన్యతనిస్తున్నామేమో అనిపిస్తోంది. ద్రవ్యోల్బణం, మతపరమైన ఉగ్రవాదం, దోపిడీయే ఇతివృత్తంగా విస్తరిస్తున్న వాణిజ్య సంస్కృతి, పలచబడుతున్న మానవ సంబంధాలు, అడుగంటుతున్న మానవీయ విలువలు నేటి సమాజానికి పెను సవాళ్లుగా మారిన నేపధ్యంలో, క్రిస్మస్ ప్రేమసందేశాన్ని మళ్లీ మళ్లీ మరింతగా చెప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. రోమా సామాజ్య్రమంతా విస్తరించిన క్రీస్తుప్రేమ సందేశం చివరికి కాన్స్టాంటిన్, థియోడాసియస్ వంటి రోమా చక్రవర్తులనే క్రైస్తవులుగా మార్చింది. వారి పాలన కూడా క్రీస్తు ప్రేమసందేశంతో, దాని పరిమళంతో ప్రభావితమై సంస్కరించబడింది. క్షమాపణ, పరస్పర ప్రేమ ప్రధాన ఇతివృత్తాలుగా సాగే యేసు క్రీస్తు బోధలు, సందేశాలు కరడుకట్టిన నేరస్తులు, అత్యంత క్రూరమైన పాలకులు, ప్రధానులను సైతం ఎంతో సాత్వికులుగా మార్చేశాయన్నది చరిత్ర చెప్పే సత్యం. కాబట్టి క్రిస్మస్ను మాత్రమే గుర్తుంచు కుని, క్రిస్మస్ వెనుక ఉన్న కారణాన్ని మర్చిపోకండి. క్రీస్తు జన్మ దినాన వేడుక చేసుకుంటూ, ఆ జన్మ ఎత్తి ఆయన ఇచ్చిన ప్రేమ సందేశాన్ని వదిలి వేయకండి. క్యారల్స్, కేక్స్, అలంకరణలు, బంధువుల హడావుడి, కుటుంబ కలయికలు, క్రిస్మస్ సంబరాలు, బహుమతులు ఇచ్చి పుచ్చు కోవడాలు, వేలల్లో ఖర్చులు... ఇవన్నీ క్రిస్మస్ పండుగలో భాగం అనుకున్నా ఫర్వాలేదు. కానీ వాటిలో తలమునకలై యేసుక్రీస్తు ప్రేమ సందేశాన్ని, క్రిస్మస్ ముఖ్యోద్దేశ్యాన్ని మర్చిపోవద్దని ప్రార్థన! - రెవ టి.ఎ. ప్రభుకిరణ్ -
మా పల్లెలో క్రిస్మస్
‘చింతలేదిక యేసు పుట్టెను వింతగను బెత్లేహమందున చెంత చేరగ రండి వేగమె దీనులై, సర్వమాన్యులై...’ పాదిరిగారితో భక్తజనులు ఈ పాటనీ, ఇటువంటి పాటల్నీ పాడుతూ చలిలో తెల్లవారుజామున పల్లెంతా తిరుగుతుంటే ఇళ్లన్నీ మేల్కొనేవి. ఆరోజు క్రిస్మస్ పండగ. క్రైస్తవులకు పర్వదినం. క్రీస్తు జన్మించిన రోజు. క్రీస్తు పుట్టుకే నూతన ప్రేమ యుగోదయం అంటారు భక్తులు. గుడ్ ఫ్రైడే అంటే క్రీస్తును సిలువ వేసిన రోజు. ఆ శుక్రవారం మంచి శుక్రవారం ఎందుకయిందంటే జనం కోసం దేవుడి పుత్రుడు సిలువ మరణం పొందటం వల్ల. ఇంకా కొన్ని పండగలున్నాయంటారు. ఉన్నవాళ్లకు అన్ని రోజులూ పండగ రోజులే! పేద పల్లెవాసులకు కాదు! క్రిస్మస్ ఉదయం నిద్రలేచిన తల్లిదండ్రులు పిల్లల ముఖం కడిగి, తుడిచి, గవదకట్టు కట్టి గుడికి పంపేవాళ్లు. గవదల దాకా దుప్పటి లాగి కట్టి వదిలితే అది పాదాల దాకా జీరాడుతుంది. పిల్లలు చిన్న పాదిరిల్లాగా ఉండేవాళ్లు. నడుస్తున్న పెంగ్విన్ పక్షుల్లాగా ఉండేవాళ్లు. గుడిలో తెల్లవారిందాకా పాటల పుస్తకంలోని భక్తి గీతాలు పాడుతూ దశమ భాగములెల్ల దేవునివీ అనీ, ప్రథమ ఫలములెల్ల దేవునివీ అని పాడుతూ ఉండేవాళ్లు. నూత్న దంపతుల తమ ప్రథమ ఫలాన్ని గుడికి సమర్పించి, మళ్లీ ఖరీదు కట్టి కొని తెచ్చుకొనేవాళ్లు. అది ఆరు రోజుల బడి. ఆదివారాలు, క్రిస్మస్, ఈస్టర్రోజుల్లో గుడి. ఆరు రోజులు బడిలో పిల్లలకు పాఠాలు చెప్పిన మాస్టరుగారే ఆదివారం పాదిరి. అది అప్పుడు లేకపోతే చాలామంది పల్లెల పిల్లలు, ఊళ్లో పిల్లల్లాగా చదువుకో గలిగేవాళ్లు కారు. ఊరి బడిలోకి పల్లె పిల్లల్ని రానిచ్చేవాళ్లు కారు గదా! క్రిస్మస్ ముందు రోజు మాస్టరుగారు రంగు రంగుల కాగితాలు దస్తాలు దస్తాలు తెచ్చి అందమైన ఆకారాలుగా కత్తిరించి నిట్రాళ్లకు, బొంగులకు, కిటికీలకు, పంచలకు, వాకిళ్లకు అంటింపజేసేవాడు. ఎన్ని రంగులో! ఎన్ని బొమ్మలో! ఎంత అందమో! పరమానందంగా ఉండేది. క్రిస్మస్ తెల్లవారుజామున కిరసనాయిలు లాంతర్ల వెలుగులో కనిపించీ, కనిపించని రంగులు చూస్తుంటే ఎంత బాగుండేదో! సూర్యుడి రాక కోసం రాత్రంతా నిరీక్షించిన లాంతర్లు సూర్యోదయంతో వెలవెలపోయేవి. వొత్తి తగ్గిస్తే వెలుతురంతా కొండెక్కేది. సూర్యుడికి ఆహ్వానం పలకటానికి చేతులెత్తేది... యేసుక్రీస్తు జననం కోసం నలభై మంది ప్రవక్తలు నిరీక్షించి, ఆహ్వానించినట్లు. చిత్రమేమిటంటే గుడికి వచ్చిన పిల్లలు తెల్లవారుజామున నిద్రపోయేవాళ్లు కారు. అల్లరి చేసేవాళ్లు కారు. శ్రద్ధగా పాటలు పాడేవాళ్లు. పాదిరిగారి ప్రసంగం వినేవాళ్లు. క్రీస్తు పుట్టినప్పుడు గొర్రెల కాపరులు, జ్ఞానులతో పాటు దేవదూతలు కూడా వచ్చారని, నక్షత్ర కాంతి ప్రకాశించిందని చెప్పి, చిన్న పిల్లల చిట్టి చిట్టి చేతులతో బుల్లి బుల్లి కొవ్వొత్తులు వెలిగింపజేసేవాడు పాదిరిగారు. వేపకొమ్మను తెచ్చి పాతి క్రిస్మస్ ట్రీ అన్నారు. దాని కింద వెలిగించిన కొవ్వొత్తులు పెట్టారు. సూర్యకాంతితో పైన, కొవ్వొత్తుల కాంతితో కింద వెలుతురు. ఏ చెట్టుకైనా నీడ ఉంటుంది, క్రిస్మస్ ట్రీకి లేదు. వేజండ్ల పల్లె ఇళ్లన్నీ పూరిళ్లే! కొందరు ఇళ్లు కప్పించారు. గోడలు అలికించారు. సున్నం కొట్టించారు. ఇళ్లముందు కల్లాపి జల్లి ముగ్గులు వేశారు. ముగ్గులేని, అలికించని ఇల్లు లేదు. ముసలోళ్లు చలికాగుతుంటే పిల్లోళ్లు వాళ్ల వొళ్లల్లో చేరి చలి కాగేవారు. ఈ రోజుల్లో అంత చలీ లేదు. చలి మంటలూ లేవు. తాతల దగ్గర చేరే మనవళ్లూ లేరు. తాతలకు దగ్గులు నేర్పేవాళ్లూ లేరు. ఈ రోజుల్లోలాగా ఆ రోజుల్లో జనాభా నియంత్రణ లేదు. అప్పుడు భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చింది. ఈ పిల్లవాడు బంతినారు తెచ్చి, నాటి, నీరు పోసి, పెంచి, పూలు పూయించాడు. అవి పసుపు కుంకాల రంగుల్లో ఉన్నాయి. అంతదాకా ఒక్కటీ ఎవరినీ కోయనివ్వనివాడు అన్నీ కోసి, పదింట ఒక్కటి తీసి, మాల కట్టి తీసుకుపోయి గుడికి కట్టి, తిరిగి వచ్చి, పూలన్నీ అమ్మకు, అక్కకు, అమ్మలక్కలకు పంచిపెట్టి ముద్దులు పెట్టించుకొన్నాడు. పల్లె అమ్మలక్కల తలలో తన పూలుంటే చూచి పొంగిపోయాడు. పరిమళ ప్రవాహంలో పల్లెంతా పడవై తేలిపోతుంటే ఊగిపోయాడు. పంట చేతికి రాగానే పదోవంతు తీసి పక్కన పెట్టిన రైతుకూలీలు క్రిస్మస్ నాడు గుడికి సమర్పించేవారు. వడ్లు, బుడమొడ్లు, కందులు, మినుములు, పెసలు, వేరుశనగకాయలు ఎన్నో! కూరగాయలు ఆక్కూరలు - చాలా. కొత్త బియ్యం, కొత్త కందిపప్పు, కొత్త నేయి - క్రిస్మస్ రోజు ఎంత రుచో! అందరి ఇళ్లలో అరిసెలు వండుతున్న వాసన పల్లెంతా ప్రయాణం చేసేది. ఏడాది పొడుగునా ఆకలికి అల్లాడిన పొట్టలు క్రిస్మస్ రోజున పిక్కటి బీర్లుగా నిండిపోయేవి. నీళ్లు పోసుకొని, బువ్వదిని పది గంటలకు గుడికి పోతే ఎంత ఆనందం! ఎంత లేనివాళ్లయినా కొత్త బట్టలు కట్టుకొని వచ్చేవాళ్లు. కొత్త బట్టలతో, కొత్త రంగులతో పల్లెంతా తళతళలాడుతూ సూర్యుడికి మెరవటం ఎట్లాగో నేర్పేది! రోజంతా ప్రసంగాలు, పాటలు, బైబిలు చదవటాలు, వివరించటాలు విసుగు విరామం లేకుండా ఉండేది. డబ్బు రూపంలో వచ్చిన కానుకలు కాక వస్తు రూపంలో తెచ్చిన కానుకలు చూస్తే సంబరంగా ఉండేది. కోడిపుంజుల్ని, మేక పిల్లల్ని గుడికి సమర్పించినవారే తిరిగి వేలంపాటలో కొనుక్కొనేవాళ్లు. అరటి పళ్లు, నారింజకాయలు, జామకాయలు, కొబ్బరి ముక్కలు, మరమరాలు పిల్లలందరికీ పంచిపెట్టేవాళ్లు. అప్పుడు 77 ఏళ్ల పూర్వం వేజండ్ల పల్లెలో 300 గడప ఉండేది. ఇప్పుడు 1200 గడప ఉంది. అప్పుడన్నీ పూరిళ్లు. ఇప్పుడు ముప్పాతిక స్లాబు ఇళ్లు. అప్పుడు సైకిళ్లు ఒకటో రెండో. ఇప్పుడు మోటారు సైకిళ్లు, ఆటో రిక్షాలు, వేన్లు చాలా ఇళ్లముందున్నాయి. అప్పుడందరూ రైతు కూలీలు. ఇప్పుడు చాలామంది సొంత వృత్తులవాళ్లు. చేలుదార్లు ఎక్కువ. పొగాకు కంపెనీ పనులు, చాలా పనులకు గుంటూరు ఆధారం. వీళ్లిప్పుడు చాలా పెద్ద చదువులు చదివారు. చదు వులకు తగ్గ ఉద్యోగాలు వెదుకుతూ ఉన్నారు. అప్పుడు క్రిస్మస్ రాత్రి క్రీస్తు పుట్టుక నాటకం వేసేవాళ్లు. బల్లలు పరిచి స్టేజీ అనేవాళ్లు. పెట్రోమాక్సు లైటు అమర్చే వాళ్లు. అప్పుడు కరెంటు లేదు. ఇప్పు డుంది. అప్పుడు మైకులు లేవు. ఇప్పు డున్నాయి. అప్పుడు నక్షత్రాలు లేవు. ఇప్పుడున్నాయి. ఎంత పెద్ద నక్షత్రం. ఎంత పెద్ద ఎత్తు! ఎంత వెలుతురు! పల్లె రాత్రంతా వెలుతురులో స్నానం చేస్తూ ఉంటుంది. క్రీస్తు పుట్టినప్పుడు పుట్టిన నక్షత్రం ఒకటి ఆకాశంలో పుడితే ఇప్పుడు భూమిమీద ప్రతి పల్లెలో నక్షత్రాలు ప్రభవిస్తున్నాయి. రాత్రంతా పల్లె నిండా వెలుతురు. చర్చీల నిండా మందిరాల నిండా మైకులు, పాటలు. సంగీతంలో, కాంతితో వేజండ్ల పల్లె నిర్విరామ భక్తిగా పరిఢవిల్లుతూ ఉంటుంది. అప్పటి క్రిస్మస్కి ఇప్పటి క్రిస్మస్కి ఎంత తేడా! అది అణగారిన పేదల క్రిస్మస్. ఇది వికాస మానవ క్రిస్మస్. ఈ డెబ్భై ఏడేళ్లలో - ఒక జీవిత కాలంలో - వేజండ్ల పల్లెలో క్రిస్మస్ తెచ్చిన మార్పు చూస్తుంటే ఆశ్చర్యంగా, ఆనందంగా ఉంటుంది. ‘చింత లేదిక యేసు పుట్టెను వింతగను బెత్లేహమందున చెంత చేరగ రండి వేగమె దీనులై, సర్వమాన్యులై...’ ఎంత సంతోషం! ఎంత సంబరం! - ఆచార్య కొలకలూరి ఇనాక్ -
నేను చూసిన క్రైస్తవత్వం...
ప్రపంచంలోని ప్రతి మతం పవిత్రమైనదే. అవి బోధించే అంశాలు మానవులకి ఉపయోగపడేవే. మతం పేరిట కొందరి ప్రవర్తనా తీరు వలన మతాన్నే ద్వేషించే పరిస్థితి ప్రపంచంలో ఉంది. ఒక్కో ‘మది’ది ఒక్కోతీరు. హిందూమతం దైవ భక్తికి పెద్దపీట వేసింది. దృష్టిని ప్రపంచం మీద కాక, పరమాత్మ మీద నిలిపి ఉంచాలని హిందూమతం బోధించే భక్తి మార్గం. క్రైస్తవ మతమేమో సాటివారికి సాయం చేయాలని బోధిస్తూ, త్యాగానికి, సేవకి పెద్ద ప్రాముఖ్యతని ఇచ్చింది. కొందరు క్రిస్టియన్సలోని త్యాగశీలులకి చెందిన ఉదంతాలు తెలుసుకుంటే నాకు ఒళ్లు పులకరిస్తుంది. క్రీ.శ. 1202లో ఇటలీలోని అస్సీ అనే చిన్న ఊరిలో ఓ ధనవంతుడుండేవాడు. అతని ఇరవై ఏళ్ల కొడుకు ఫ్రాన్సిస్ తన మిత్రుడి ఇంటికి భోజనానికి వెళ్తున్నాడు. అకస్మాత్తుగా అతనికి గంట మోగుతున్న చప్పుడు వినిపించింది. ఆరోజుల్లో కుష్టువ్యాధికి మందులేదు. వాళ్లని ఊళ్లోకి అనుమతించేవారు కాదు. ఊరికి దూరంగా కాలనీలో ఆ వ్యాధిగ్రస్తులు ఉండేవారు. ఒకవేళ వారు ఊళ్లోకి రావాల్సి వస్తే, ఊరి బయట ఉన్న గంట మోగించి వస్తారు. అప్పుడంతా తప్పుకుంటారు. ఆ గంట విని ఆయన పక్కకి తప్పుకునేలోగా ఓ కుష్ఠు వ్యాధిగ్రస్థుడు అతనికి ఎదురు పడ్డాడు. వ్యాధితో శరీరం, మొహం వికారంగా అయిపోయి ఆ రోగిని ఎవరు చూసినా అసహ్యించు కుంటారు. ఐతే ఫ్రాన్సిస్‌కి ఆ రోగి పరిస్థితి చూడగానే హృదయం ద్రవించింది. అతని దగ్గరకు వెళ్లి అతనిని చూడగానే రెండడుగులు వెనక్కి వేసినందుకు క్షమాపణ చెప్పి, తన జేబులోని డబ్బంతా ఇచ్చి, ఆ రోగిని ఆలింగనం చేసుకున్నాడు. అతని ఔదార్యానికి కళ్లల్లో నీళ్లు తిరిగిన ఆ రోగి... ‘‘మనిషి స్పర్శ ఎలా ఉంటుందో మరిచిపోయాను. నాకది మీరు గుర్తు చేశారు’’ అన్నాడు. ఆ యువకుడే నేటికీ క్రిస్టియన్స్ అంతా కొలిచే మహాత్ముడు ‘సెయింట్ ఫ్రాన్సిస్ ఆఫ్ అస్సీ’. మరో సంఘటన. అది జనవరి 1945. రెండో ప్రపంచ యుద్ధం జరుగుతోంది. పోలెండ్‌లోని జడోర్జూ అనే చిన్ని గ్రామంలోని రైల్వేస్టేషన్‌లోకి ఓ యువకుడు ప్రవేశించాడు. అక్కడ పొడుగు చారల ఖైదీ దుస్తులు ధరించిన పదమూడేళ్ల అమ్మాయి కూర్చుని ఉంది. సరైన భోజనం లేని అమె మరణానికి దగ్గరగా ఉంది. ‘‘ఎవరు నువ్వు? ఇక్కడ ఏం చేస్తున్నావు?’’ క్రిస్టియన్ ఫాదర్ అయిన ఆ యువకుడు ఆమెను అడిగాడు. ‘‘నా పేరు ఎడిట్ జైరర్. నాలుగేళ్లుగా నాజీ కాన్సన్ట్రేషన్ క్యాంప్స్ నుంచి తప్పించుకున్నాను. నా స్వగ్రామానికి వెళ్లి నా తల్లిదండ్రులను, సోదరినిని కలుసు కోవాలని బయలుదేరాను’’ చెప్పిందామె. అతను వెళ్లి బ్రెడ్, టీకప్పుతో వచ్చి వాటిని ఆమెకు ఇచ్చి ఆకలిని తీర్చాడు. క్రాకోకి వెళ్లే రైలు రాగానే ఆ యువకుడు బల హీనంగా ఉన్న ఆమెని ఎత్తుకుని, పెట్టెలోకి మోసుకెళ్లాడు. జంతువులను రవాణా చేసే ఆ పెట్టెలో ఆమెకి చలి నించి రక్షణగా తన ఒంటి మీది కోటుని కప్పాడు. భగవంతుని ఆశీస్సులు ఆమెకి లభించాలని ప్రార్థన చేస్తానని చెప్పాడు. తన దగ్గర ఉన్న డబ్బులు ఆమెకు ఇచ్చేశాడు. ‘‘మీ పేరు? ఆమె అడిగింది. ‘‘కరోల్ ఓటైలా’’ జవాబు చెప్పాడు. 1994లో ఇజ్రాయెల్‌లోని ఐఫా అనే ఊరిలో నివసిస్తున్న ఎడిట్ ఓ రోజు దిన పత్రిక చదువుతూంటే ‘కరోల్ ఓటైలా’ అనే పేరు కనిపించింది. ఆమె జీవితంలో మరిచిపోలేని పేరు అది. తనని కాపాడినది వారే అయితే అతన్ని ఓసారి కలుసుకుని కృతజ్ఞతలు చెప్పుకోవాలని ఉందని ఓ ఉత్తరం రాసి పోస్టు చేసింది. అయితే ఉత్తరానికి కొద్ది జాప్యం తర్వాత జవాబు వచ్చింది. అది అందుకున్నాక ఎడిట్ 1995లో ఇజ్రాయిల్ నించి యూరప్‌కు వెళ్లినప్పుడు రోమ్‌లోని వాటికన్ సిటీ వెళ్లి పోప్ జాన్‌పాల్-2ని కలుసుకుంది. త్యాగానికి ప్రతీక అయిన ఆ యువకుడే అత్యున్నత క్రిస్టియన్ మతాధికారి ‘పోప్’ అయ్యాడు. ఆ ఖైదీకి అతను సహాయం చేయడం నాజీ సైనికులు చూసి ఉంటే, అతన్ని అక్కడికక్కడే కాల్చి చంపేవారు. అలాగే ఇంగ్లండ్‌లోని మాంచెస్టర్ నుంచి మత ప్రచారానికి ఓ ఫాదర్‌ని 1932లో పంజాబ్‌కి పంపించారు. అతని పేరు జాన్ లియోపోర్న్. జాన్ ఉత్తర పంజాబ్‌లోని ఓ గ్రామంలో తను నమ్మిన సిద్ధాంతాలని ప్రచారం చేయసాగాడు. ఓ రోజు కొందరు గ్రామ పెద్దలు జాన్ని రచ్చబండ దగ్గరకి పిలిపించారు. అతనితో ఎవరూ ఏమీ మాట్లాడలేదు. రచ్చబండ చుట్టూ మనుషులు అతనికి అడ్డుగా నిలబడి అక్కడినించి కదలనివ్వలేదు. గంట... పది గంటలు... రోజు... మూడు రోజులు అలా గడిచాయి. అతనికి తాగడానికి నీళ్లు ఇచ్చారు తప్ప ఎవరూ భోజనం పెట్టలేదు. ఐదో రోజు అతను నీరసంతో వాలిపోయాడు. ఆరో రోజు గ్రామపెద్ద అతని తలని తన ఒళ్లో ఉంచుకుని, నిమ్మరసం తాగించి తర్వాత భోజనం పెట్టి చెప్పాడు. ‘‘మేమంతా మిమ్మల్ని ఇన్ని రోజులు పరీక్షించాం. ఆహారం ఇవ్వకుండా, కదలనివ్వకుండా చేసినందుకు మీరు మమ్మల్ని తిడతారని, ద్వేషిస్తారని ఎదురుచూశాం. అదే జరిగితే మిమ్మల్ని గ్రామం నించి బహిష్కరించాలనుకున్నాం. మీరు ఇన్ని రోజులు బోధించిన ‘క్షమ’ మీలో నిజంగా ఉందో లేదో ఇలా పరీక్షించినందుకు క్షమించండి. ఇప్పుడు మీ మతం గురించి, జీసస్ గురించి చెప్పండి.’’ ఒకటా? రెండా? ఇలాంటి ఎన్నో ఉదంతాలు చదివిన నాకు క్రిస్టియానిటీకి దగ్గరయ్యే కొన్ని అదృష్టాలు కలిగాయి. నా ప్రమేయం లేకుండానే క్రిస్టియన్స్‌కి, పవిత్రమైన కొన్ని ప్రదేశాలని నా విదేశీ పర్యటనల్లో సందర్శించడం జరిగింది. టర్కీలోని కుశదాసి ద్వీపానికి ఆగస్ట్ 2010లో వెళ్లాను. క్రీస్తును శిలువ వేశాక, ఆయన ప్రధాన శిష్యులలో ఒకరైన సెయింట్ జాన్ జెరూసలేం నించి ఈ కుశదాసి ద్వీపానికి వచ్చారు. స్థానికుల కథనం ప్రకారం, రోమన్స్ తనని హింసించడం మొదలయ్యాక, జీసస్ తన శిష్యుడు సెయింట్ జాన్ని తన తల్లి మేరీ మాతని సురక్షిత ప్రాంతానికి తీసుకెళ్లమని కోరారు. ఈ ద్వీపంలోని ఓ ఇంట్లో మేరీమాత తన ఆఖరి సంవత్సరాలు, తుదిశ్వాస వదిలేదాక గడిపింది. ఈ విషయం కుడా ప్రపంచానికి దైవికంగా తెలియడం విశేషం. 1774-1824 మధ్య జర్మనీలో జీవించిన క్రిస్టియన్ నన్ క్యాథరీనా ఎమెరిష్కి వర్జిన్ మేరీ చివరి దశలో జీవించిన కుశదాసి ద్వీపంలోని ఈ ఇంటి తాలూకు దర్శనాలు కలిగాయి. ఈ ఇల్లు సముద్రానికి ఎంత దూరంలో ఉన్నది, అక్కడ ఉన్న వృక్షజాతి, ఎన్నడూ జర్మనీ దేశాన్ని వదలని క్యాథరీనాకి కలలో కనిపించాయి. ఆమె అవన్నీ ఒక పుస్తకంలో రాసింది. కుశదాసికి 395 కిలోమీటర్ల దూరంలోని స్మిర్ణా (ఇజ్మిత్) అనే ఊరికి చెందిన లాజరస్ ఆ పుస్తకాన్ని చదవడం జరిగింది. 1891లో అతను ఇక్కడికి వచ్చి, ఆ పుస్తకంలోని గుర్తుల ప్రకారం ఆ ఇంటి కోసం అన్వేషించాడు. ఈ ద్వీపంలోని ఓ మోనాస్ట్రీకి చెందిన శిథిలమైన చర్చ్‌ని కనుగొన్నాడు. ఆ చర్చ్ మేరీ మాత తన చివరి దశలో నివసించిన ఇల్లుగా గుర్తించాడు. దీని పునాదులు క్రీస్తుశకం ఒకటో శతాబ్దానికి చెందినవని శాస్త్రజ్ఞులు నిర్ధారించాక, ఆ పునాదుల మీదే మళ్లీ ఇంటిని నిర్మించారు. వేల మంది పర్యాటకులు ఈ ఇంటిని సందర్శిస్తున్నారు. మా బస్సులో ఆస్ట్రేలియా, అమెరికా, రష్యా, సెర్బియా, ఇంగ్లండ్, టర్కీ, గ్రీస్ మొదలైన దేశాలకి చెందినవారు కూడా ఉన్నారు. క్యూలో ఈ ఇంట్లోకి వెళ్తే, లోపల మేరీమాత విగ్రహం ఉంది. ఆధ్యాత్మిక ప్రదేశాలలో ఉండే పాజిటివ్ వైబ్రేషన్స్‌ని ఫీలయ్యే గుణం నాలో నాకు తెలీకుండానే ఏర్పడింది. కాశీ విశ్వేశ్వరుడి ఆలయంలో, మరికొన్ని ప్రధాన ఆలయాల్లో నేను ఫీలైన వైబ్రేషన్స్‌ని ఇక్కడ స్పష్టంగా ఫీలయ్యాను. అలాంటి చోట్ల నాకు తెలియకుండానే కన్నీళ్లూ, ఆనందంతో కూడిన దుఃఖం కలుగుతాయి. ఈ ఇంట్లో కూడా నాకు ఆ అనుభవం కలిగింది. క్రిస్టియన్స్లోని ఓ తెగవారు జీసస్‌ని కాక, మేరీమాతని కొలుస్తారు. ఓ ఆస్ట్రేలియన్ ఆలయం బయట నాతో చెప్పాడు. ‘‘మేరీ ఈజ్ ద ల్యాడర్ ఆఫ్ హెవెన్’’ (స్వర్గానికి మేరీ మాత నిచ్చెన). ఫర్ మదర్ మేరీ హాజ్ డిసెండెడ్ ఫ్రమ్ హెవెన్ ఇన్ టు దిస్ వరల్డ్ (ఎందుకంటే మేరీ మాత స్వర్గం నుంచి ఈ ప్రపంచంలోకి దిగి వచ్చింది) దట్స్‌వై హర్ మెన్ మైట్ ఎసెండ్ ఫ్రమ్ ద ఎర్త్ టు హెవెన్ (మేరీ మాత ద్వారా మనుషులు భూమి నుంచి స్వర్గానికి వెళ్లగలరు). ఆగస్ట్ 2011లో పోలెండ్‌లోని క్రాకోని సందర్శించాను. మా గైడ్ అక్కడి ఓ చర్చిని చూపింది. పోప్ జాన్ పాల్-2 క్రిస్టియన్ ఫాదర్ అయిన కొత్తల్లో ఆ చర్చ్‌లోనే పనిచేసేవాడని చెప్పింది. ఆ సమయంలో ఆయన కరీల్ ఓ టైలా (మొదట్లో చెప్పిన ఉదంతంలోని వ్యక్తి) మాత్రమే. పోప్ జాన్‌పాల్-2 నివసించిన ఇంటిని కూడా (హాస్టల్ లాంటిది) చూశాను. బేలూరులోని రామకృష్ణ పరమహంస నివసించిన గదిని చూసిన సంతోషం లాంటిది ఈ ఇంటిని చూస్తే కలిగింది. అలాగే క్రాకో నగరానికి దక్షిణాన గల ఓటైలా పుట్టిన వడోవైజ్ అనే ఊళ్లోని ఆయన ఇంటిని కూడా మా గైడ్ స్మార్తా చూపించింది. ఆయన ఇంటిని మ్యూజియంగా మార్చారు. ఆయన తిరిగిన నేలని బస్‌లోంచి చెప్పులు లేకుండా దిగి స్పర్శించాను. ఆది శంకరాచార్య పుట్టిన కాలడిని సందర్శిస్తే కలిగిన ఆనందం కలిగింది. క్రాకోలో ఆయన చదివిన సెమినరీ (క్రిస్టియన్ మతాచార్యుల కాలేజ్)ని కూడా మా గైడ్ బస్సులోంచి చూపించింది. వడోవైజ్తో ఆయన్ని బాప్టైజ్ చేసిన చర్చిలో, ఆయన మరణానికి మునుపు వైద్యులు చిన్న సీసాల్లో తీసుకున్న రక్తాన్ని ఉంచారని గైడ్ చెప్పింది. సెప్టెంబర్ 2014లోని సాలమాంకా నుంచి పోర్చుగల్‌లోని లిస్బన్‌కి బస్సులో వెళుతూ ఉన్నప్పుడు ‘అవర్ లేడీ ఆఫ్ ఫాతిమా (పోర్చుగీస్ భాషలో నోసా సెన్హోరాడి ఫాతిమా) క్షేత్రాన్ని చూశాను. 1916లో 9 ఏళ్ల లూషియ శాంటోస్, ఆ పాప కజిన్స్ జెసింటా మార్డో(6), ఫ్రాన్స్స్పో మార్డో(9)లకి బ్లెస్డ్ వర్జిన్ మేరీ దర్శనం లభించింది. గొర్రెలు కాచుకునే ఈ పిల్లలు ఫాతిమా అనే ఊరుకి సమీపంలోని అల్జేస్ ట్రీవ్ అనే గ్రామానికి చెందినవారు. గొర్రెలతో వెళితే మేరీమాత ఈ ముగ్గురికి దర్శనం ఇచ్చింది. ఆ పిల్లలకి చదువు రాదు. ఇంటికి వచ్చాక ఆ సంగతి పెద్దలకి చెబితే వాళ్లు కొట్టిపారేశారు. ఆ తర్వాత అనేక సార్లు మేరీమాత దర్శనం వారికి లభించింది. ఓసారి నరకంలోని అగ్నిలో పాపపు ఆత్మలు కాలడం కూడా వారు చూశారు. ఇది చూసిన జెసింతా మనసులో గట్టి ముద్ర పడింది. పిల్లల వర్ణన ప్రకారం ఆమె చేతిలో రోజరీ (జపమాల) ఉండటంతో ఆమెకి ‘అవర్ లేడీ ఆఫ్ రోజరీ’ అనే పేరు, అవర్ లేడీ ఆఫ్ ద మోస్ట్ హోలీ రోజరీ అనే పేరు, ఫాతిమా గ్రామం దగ్గర జరగడంతో ‘అవర్ లేడీ ఆఫ్ ఫాతిమా’ అనే పేర్లు వచ్చాయి. మేరీ పిల్లలకి చెప్పిన భవిష్యత్తులో రెండో ప్రపంచ యుద్ధం, మరికొన్ని దేశాల మధ్య యుద్ధాలు లాంటివి కూడా ఉన్నాయి. ఆమె దైవాన్ని ఎలా ప్రార్థించాలి, ఆరాధించాలి, త్యాగాలు ఎలా చేయాలి మొదలైనవి పిల్లలకి చెప్పింది. 13మే 1917న జెసింటా సూర్యుడుకన్నా కాంతివంతమైన మేరీమాత నుంచి అత్యంత శక్తివంతమైన కాంతికిరణాలు వెలువడుతుండగా చూసింది. ఆ విషయం తల్లికి చెబితే ఇరుగు, పొరుగు దాన్ని జోక్‌గా కొట్టేశారు. తరువాత 13, జూన్‌లో, 13 జూలైలో కూడా పిల్లలకి మేరీమాత దర్శనం ఇచ్చి మూడు రహస్యాలని చెప్పింది. వీటిని త్రీ సీక్రెట్స్ ఆఫ్ ఫాతిమాగా పిలుస్తారు. (ఇవన్నీ భవిష్యత్తులో జరగబోయే అంశాలే). 1941కల్లా వీటిలోని రెండు నిజంగా జరగడంతో 1943లో బిషప్ మూడో రహస్యం చెప్పమంటే నిరాకరించింది. అది రాసిన కాగితాన్ని కవర్లో ఉంచి, సీల్ చేసి 1960 దాకా తెరవకూడదని కోరింది. 2000లో పోప్ జాన్ పాల్ ॥దీన్ని చదివి అధికారికంగా ప్రకటించగా దాన్ని కాన్సెక్రీషన్ ఆఫ్ రష్యా అని పిలుస్తారు. తర్వాత పెద్దలు కూడా దీన్ని నమ్మి 13 ఆగస్టు 1917న మదర్ మేరీ దర్శనం అవుతుందని అక్కడికి వెళ్లారు. కానీ కాలేదు. ఫ్రాన్సిస్కో 1919లో జెసింటో మార్చి 1920లో చిన్నతనంలోనే మరణించారు. లుసింటా 13 ఫిబ్రవరి 2005న 97వ ఏట మరణించింది. పిల్లలు ఇద్దరి సమాధుల్ని, అవర్ లేడీ ఫాతిమాకి కట్టిన చర్చిని సందర్శించాను. సమీపంలో ఉన్న ఫౌంటెన్లోని నీరు పవిత్రమైనదని చెప్తారు. ఇది తాగితే వ్యాధులు పోతాయట! ఓ సీసాలో ఈ నీటిని తెచ్చి హెబ్సిబారాణి అనే క్రిస్టియన్ ఫ్రెండ్‌కి ఇచ్చాను. కాళ్లు పడిపోయిన వాళ్లు చర్చికి ముందే మోకాళ్ల మీద లోపలికి నడిచి వెళ్తే కాళ్లు బాగవుతాయని స్థానికులు చెప్పారు. ఇక్కడ అనేక మంది మానసిక రోగులు కూడా కనిపించారు. వారికి కూడా స్వస్థత చేకూరుతుందట! 13 మే 1946న పోప్ పయాస్-2 ఇక్కడికి అవర్ లేడీ ఫాతిమా విగ్రహానికి కిరీటాన్ని అమర్చారు. ఎందుకో మేరీ మాత మరణించిందని చెప్పిన కుశదాసిలోని వైబ్రేషన్ నాకు ఈ చర్చిలో కలగలేదు. నేను చూసిన మరో క్రిస్టియన్ విశేషం - అక్టోబర్ 2015లో జర్మన్‌లోని లేడీ ముసా అరబిక్ భాషలో దీని ఆర్థం ‘వ్యాలీ ఆఫ్ మోజెస్ ’. జుడాయిజమ్‌లో, ఇస్లామ్‌లో, క్రిస్టియానిటీలో, బహాయిజమ్లో మోజెస్ ముఖ్యమైన ప్రవక్త. జర్మన్ రాజధాని అమ్మన్ నుంచి ప్రాచీన నగరం పెట్రాకి వెళ్లే దారిలో లేడీ మూసా దగ్గర 240 కిలోమీటర్ల దూరంలో బస్ ఆగింది. మోజెస్ ప్రవక్త ఈ ఎడారి నుంచి వెళ్తూ దానిని అనుసరించేవారి దాహాన్ని తీర్చడానికి ఓ రాతిని కొడితే అది పగిలి నీరు వెలువడిందని బైబిల్ కథనం. ఆ రోజుల్లో పెట్రాని పాలించిన నబాటియన్స్ ఈ నీటి బుగ్గకి అనేక చిన్న కాలువలను తవ్వి పెట్రా నగరానికి దీన్ని తరలించారు. దీనికి గార్డియన్ ఆఫ్ పెట్రా, మోజెస్ వెల్, మోజెస్ వాటర్ స్ప్రింగ్, టోంచ్ ఆరన్ అని పేర్లు. మోజెస్ సోదరులైన అహరోను సమాధి ఈ ప్రాంతంలోనే ఉందని నమ్మకం. ఎక్కడుందో ఎవరికీ తెలియదు. మోజెస్ వెంట ఉండే వారు ఈ ఎడారిలో తప్పిపోయామని పరమాత్మ నిజంగా ఉంటే తమకు నీరు ఇవ్వాలని కోరితే మోజెస్ దైవాన్ని ప్రార్థించి ఈ నీటి బుగ్గని సృష్టించాడని గైడ్ చెప్పింది. బైబిల్లో పేర్కొన్న ఈ ప్రదేశాన్ని 1931లో కనుగొన్నారు. పోప్ జాన్ పాల్-2 కూడా ఈ ప్రదేశాన్ని సందర్శించారు. మోజెస్ సమాధి కూడా ఇక్కడే ఎక్కడో కొండమీద ఉందట. కానీ ఎక్కడ ఉందో ఎవరికీ తెలియదు. ఆయన జ్ఞాపకార్థం మౌంట్ నెబూ మీద ఉంచిన ఆ విగ్రహాన్ని కూడా దర్శించాను. సమీపంలోని మదాబా అనే గ్రామంలోని పురాతన చర్చిలో ఓ పురాతన మొజాయిక్ మ్యాప్ ఉంది. ఆ రోజుల్లో జెరూసలేం భూమికి మధ్యలో ఉందని నమ్మేవారు. క్రీ.శ. 542కి చెందిన ఈ మ్యాప్‌లో మెడిటేరియన్ సీ, ఈస్ట్రన్ డిజర్ట్స, డెడ్‌సీ జెరికో, బెత్లెహేమ్, జోర్డన్, లెబనాన్ లాంటి క్రిస్టియన్ పవిత్ర ప్రదేశాలు ఉన్నాయి. మోజెస్ స్ప్రింగ్ నుంచి కూడా నీటిని పట్టి తెచ్చి కొందరు క్రిస్టియన్ మిత్రులకి ఇచ్చాను. అవకాశం ఉంటే జెరూసలేం, బెత్లెహేమ్ దర్శించాలని, క్రీస్తు శిలువతో నడిచిన దారిలోని మట్టిని స్పృశించాలని నా ఆశ. అలాగే మెక్సికో సిటీ ప్రాంతం లోని టెపియాక్ కూడా చూడాలని ఉంది. అక్కడకు కూడా మేరీమాత గొర్రెలు కాచుకునే ఓ కుర్రాడికి దర్శనాన్ని ఇచ్చింది! 9 డిసెంబర్ 1531న గొర్రెలు కాచుకునే జువాన్ డియాగో అనే పదిహేనేళ్ల కుర్రాడికి చుట్టూ కాంతితో ఉన్న పదహారేళ్ల యువతి దర్శనమిచ్చి, చర్చిని కట్టమని స్థానిక భాషలో కోరింది. అతను బిషప్‌కి ఈ విషయం చెపితే రుజువు కోరాడు. సాధారణ ప్రజలు ఉపయోగించే బట్ట (తిల్మా) మీద వర్జిన్ మేరీ ముఖం ప్రత్యక్షమైంది! నేటికీ ఆ బట్ట మీద మేరీ మాత బొమ్మని చూడొచ్చు. ప్రకృతి ధర్మాన్ని అనుసరించి ఆ బట్ట ఈ పాటికి నశించిపోవాలి. అయినా అది చెక్కు చెదరకుండా ఉండడం అద్భుతం అని శాస్త్రజ్ఞులు చెబుతున్నారు. ప్రతి మతంలోనూ నేనున్నానని పరమాత్మ ఇలా గుర్తు చేస్తూనే ఉంటాడు. మనం చేయాల్సింది ఆయన బోధనలను పాటిస్తూ ఆయన్ని మరచిపోకపోవడం. ఓ రోజు లండన్‌లోని అతి పెద్ద చర్చి సెయింట్ పాల్ క్యాథడ్రిల్‌లో ఓ పేదరాలు నేలమీద మోకాళ్ల మీద కూర్చొని దైవ ప్రార్థన చేస్తూ, పక్కన ఎవరో కూర్చోవడం గమనించింది. చూస్తే ఆవిడ బ్రిటిష్ రాణి విక్టోరియా! దాంతో వెంటనే ఆ పేదరాలు లేచి మరో చోటికి వెళ్లి కూర్చుని ప్రార్థించ సాగింది. విక్టోరియా మహారాణి కూడా లేచి ఆ పేదరాలి పక్కన, దైవ ప్రార్థనకి మోకాళ్ల మీద కూర్చొని ఆమె చెవిలో చెప్పింది. ‘‘నేను సింహాసనం మీద ఉన్నప్పుడే రాణిని. దేవుని సన్నిధిలో మనమంతా సమానమే. లేచి వెళ్లకు.’’ ప్రతి మతం వారు గుర్తుంచుకోదగ్గ, ఆచరించదగ్గ గొప్ప విషయాన్ని ఆ మహారాణి అంత అందంగా చెప్పింది. - మల్లాది వెంకటకృష్ణమూర్తి -
క్రీస్తు నడయాడిన ముఖ్య ప్రదేశాలు...
1. బెత్లెహేమ్ ఇది క్రీస్తు పుట్టిన ఊరు. ‘హోలీల్యాండ్’గా, ‘బైబిల్ల్యాండ్’గా ప్రసిద్ధి పొందింది. ఇజ్రాయెల్‌లో ఉంది. ప్రపంచంలోని చిన్న దేశాలలో ఒకటైన ఇజ్రాయెల్ ముస్లింలకు, యూదులకు కూడా పవిత్ర దేశమే. ఇది 1948లో స్వాతంత్య్రం పొందింది. అంతకు ముందు పాలస్తీనాలో అంతర్భాగంగా ఉండేది. బెత్లెహేమ్‌లో క్రీస్తు పుట్టిన ప్రదేశం పాలస్తీనా భూభాగంలో ఉంది. ఆ ప్రదేశంలో నిర్మించిన ‘చర్చ్ ఆఫ్ నేటివిటీ’ అత్యంత పురాతనమైన చర్చిలలో ఒకటి. ఇక్కడే ఉన్న ‘సెయింట్ క్యాథరీన్ చర్చ్’లో ఏటా డిసెంబర్ 24 అర్ధరాత్రి జరిగే క్రిస్మస్ ఆరాధనను ప్రముఖ టీవీ చానళ్లన్నీ ప్రత్యక్ష ప్రసారం చేస్తాయి. ఇక్కడకు కొద్ది దూరంలోనే ‘షెపర్డ్స్ ఫీల్డ్’ ఉంది. క్రీస్తు జనన వార్తను దేవదూత గొర్రెల కాపరులకు వెల్లడించిన పవిత్ర స్థలం ఇదే. 2. నజరేత్ యేసు పుట్టిన తర్వాత తల్లి మరియ, తండ్రి యోసేపు బిడ్డను తీసుకుని ఈజిప్టు వెళ్లిపోయారు. అక్కడి నుంచి ఇజ్రాయెల్‌కు ఉత్తరాన ఉన్న ‘గలిలయ’ ప్రాంతం లోని తమ పూర్వీకుల ప్రాంతమైన నజరేత్‌కు చేరుకున్నారు. యేసు బాల్యం గడిచింది ఇక్కడే. నజరేత్‌లో యేసు తల్లి మరియ, తండ్రి యోసేపుల ఇళ్లు ఉన్నాయి. 3. కానా నజరేత్‌కు చేరువలోనే కానా పట్టణం ఉంది. ఇక్కడే ‘గలిలయ’ సరస్సు ఉంది. ఇది జోర్డాన్ నదికి చెందిన జలాశయం. ఈ సరస్సు దగ్గరే యేసుక్రీస్తు నీళ్లను ద్రాక్షరసంగా మార్చాడు. యేసు ఎక్కువగా ఈ ప్రాంతాల్లోనే సంచరించేవాడు. ఆయన శిష్యులు కూడా ఈ పరిసరాలకు చెందినవారే. 4. జోర్డాన్ నది యేసు తన ముప్ఫయ్యవ ఏట జోర్డాన్ నదిలోనే బాప్టిజం పొందాడని, తర్వాత అక్కడి అరణ్యంలోనే నలభై రోజులు ఉపవాస దీక్ష చేశాడని చెబుతారు. అందుకే, చాలామంది జోర్డాను నదిలో బాప్టిజం తీసుకోవాలనుకుంటారు. ఈ నది కలిసే మృతసముద్రం ప్రపంచం లోనే అత్యంత లోతైనది. దీనిలోని నీరు చర్మరోగాలను నయం చేయగలదనే నమ్మకం కూడా ఉంది. 5. తక్బా గలిలయ ప్రాంతం లోని కపెర్నామ్ వద్ద ఉంది‘తక్బా’. ఇది యేసుక్రీస్తు ఐదు రొట్టెలు, రెండు చేపలతో ఐదువేల మంది ఆకలి తీర్చిన స్థలంగా ప్రసిద్ధి పొందింది. ఇక్కడే ఉన్న ‘మౌంట్ టాబర్’ను క్రీస్తు పునరుత్థానం చెందిన ప్రదేశంగా చెబుతారు. 6. జెరికో జెరికో పట్టణం పాలస్తీనాలో ఉంది. ఇది క్రీస్తు నడయాడిన ప్రదేశాల్లో ఒకటి. ఈ పట్టణంలోనే ఒక అంధునికి యేసు తన స్పర్శ ద్వారా చూపు నిచ్చినట్లు చెబుతారు. ఈ పట్టణాన్ని ప్రపంచంలోనే అత్యంత ప్రాచీన పట్టణంగా భావిస్తారు. దాదాపు క్రీస్తుపూర్వం 10 వేల సంవత్సరాల కిందటే ఇక్కడ జనావాసాలు ఉన్నట్లు పురాతత్వ ఆధారాలు దొరికాయి. 7. జెరూసలెం బెత్లెహేమ్ పట్టణానికి ఐదు కిలోమీటర్ల దూరంలోనే ఉందిది. ఇక్కడే యేసును శిలువ వేసిన గొల్గొతా కొండ, ఆయనను సమాధి చేసిన స్థలం ఉన్నాయి. యేసు క్రీస్తు ప్రార్థన చేసిన ఒలీవల కొండ, శిష్యులతో కలసి ఆయన చివరి విందు ఆరగించిన మేడ గది, దావీదు సమాధి, రాచభటులు ఆయనను బంధించిన గెత్సెమనె తోట, మరియమ్మ సమాధి వంటి పలు పవిత్ర స్థలాలు జెరూసలెంలోనే ఉన్నాయి. ఇక్కడ సొలొమోను రాజు నిర్మించిన ఆలయ ప్రహరీగోడ క్రైస్తవులకు, యూదులకు కూడా పవిత్ర స్థలం. దీనినే ‘ప్రలాపాల ప్రాకారం’ అంటారు. అక్కడ చేసే ప్రార్థనలను దేవుడు తప్పక ఆలకించి, అనుగ్రహిస్తాడని భక్తులు విశ్వసిస్తారు.