ప్రతీకాత్మక చిత్రం
క్రిస్మస్ అంటే ముందుగా గుర్తొచ్చేవి మనసు దోచే కానుకలు.. చల్లటి సాయంత్రాలు.. రంగుల రాత్రులు. పండుగ నాడు తమకిష్టమైన వారికి ఏదైనా ప్రత్యేకమైన బహుమతి ఇవ్వాలని తహతహలాడే వారు కొందరైతే. అందరిలా మామూలుగా కాకుండా పండుగను కొంత ప్రత్యేకంగా.. మరికొంత ‘ప్రేమ’గా జరుపుకోవాలని ఆలోచించే వారు మరికొందరు. అలాంటి వారు, ముఖ్యంగా పర్యటనలంటే ఇష్టపడేవారు తమ ప్రియమైన వారికి ఏదైనా కానుక ఇవ్వాలనుకుంటే పండుగను తమదైన రీతిలో కన్నుల పండుగగా జరుపుకునే ప్రదేశాలకు తీసుకెళ్లండి. మీ మనసుకు దగ్గరైన వారితో ఈ క్రిస్మస్ పండుగ రోజును మరింత అందంగా, గుర్తుండిపోయే మధుర జ్ఞాపకంగా మార్చుకోండి.
1) గోవా
ఈ క్రిస్మస్ మరింత అందంగా సెలబ్రేట్ చేసుకోవటానికి గోవా ఓ అద్భుతమైన ప్రదేశం. క్రిస్మస్ రోజున గోవాలోని దాదాపు 400 చర్చిలు సప్తవర్ణశోభితంగా వెలుగిపోతాయి. రాత్రి వేళల్లో గోవా ఓ నూతన స్వర్గంలా అనిపిస్తుంది. వయస్సుతో సంబంధంలేకుండా అన్ని వయస్సుల వారు రాత్రి వేళ పెద్ద సంఖ్యలో చర్చిల వద్దకు చేరి ప్రార్థనలు నిర్వహిస్తారు. పండుగను మరింత అందంగా జరుపుకోవటానికి ప్రపంచం నలుమూలలనుంచి పర్యాటకులు గోవా చేరుకుంటారు. ఇక ఇక్కడి బీచ్‌ల వద్ద ఉండే సందడి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
2) పాండిచ్చేరి
‘లిటిల్ ఫ్రాన్స్’ అని పిలువబడే పాండిచ్చేరి అద్భుతమైన కట్టడాలతో, సుందరమైన సముద్ర తీరాలతో మనల్ని కట్టిపడేస్తుంది. ఫ్రాన్స్ మూలాలు ఉన్న చాలామంది క్రిస్టియన్లు క్రిస్మస్‌ను తమదైన సాంప్రదాయాలు పాటిస్తూ కన్నులపండువగా జరుపుకుంటారు. పండుగనాడు అక్కడి చర్చిలు, బీచ్‌లు ఓ ప్రత్యేక ఆకర్షణ నిలుస్తాయి.
3) మనాలి
చల్లని శీతాకాలం నాడు తెల్లటి మంచుతో మనాలి ఓ వెండి పర్వతంలా అందంగా మెరిసిపోతుంది. అందుకే మనాలిలో జరుపుకునే క్రిస్మస్‌కు వైట్ క్రిస్మస్ అని పేరు కూడా ఉంది. కేవలం క్రిస్మస్‌తోనే కాకుండా న్యూ ఇయర్‌తో మొదలయ్యే పండుగలన్నింటికి మంచుతో కప్పబడిన మనాలి స్వాగతం పలుకుతుంది. అందంగా అలంకరించబడిన హోటళ్లు పండుగ వాతావరణాన్ని పరిమళించేలా కులు ఫోక్ మ్యూజిక్ మనల్ని మైమరిపింపజేస్తుంది. ప్రతి ఏటా వచ్చే పర్యాటకుల సంఖ్య పెరుగుతూ వస్తోందంటే మనాలి ప్రకృతి అందచందాలు వారిని ఎంతగా ఆకర్షిస్తున్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
4) కేరళ
దైవ భూమిగా పిలువబడే కేరళ పచ్చటి పకృతి అందాలతో, సముద్రపు తీరాలతో, బ్యాక్ వాటర్‌తో ఎంతో రమణీయంగా ఉంటుంది. క్రిస్మస్ రోజున కేరళ పర్యటన మీ జీవితంలో ఓ మధుర జ్ఞాపకంగా మిగిలిపోతుంది. జనాభాలో అధిక భాగం ఉన్న క్రిస్టియన్లు పండుగను అత్యంత అద్భుతంగా సెలబ్రేట్ చేస్తారు. చిన్నా పెద్దా అని తేడా లేకుండా క్రిస్మస్ రోజు రాత్రి అందరూ చర్చిల వద్దకు చేరి ప్రార్థనలు చేస్తారు. ప్రకృతి ఒడిలో క్రిస్మస్ జరుపుకోవాలనుకునే వారికి కేరళ ఓ బెస్ట్ ఛాయిస్.
5) సిమ్లా
మీకిష్టమైన వారితో ఈ క్రిస్మస్‌ను ప్రశాంతంగా, గుర్తుండిపోయేలా జరుపుకోవాలంటే తప్పకుండా సిమ్లా వెళ్లి తీరాల్సిందే. పర్యాటకుల రద్దీ తక్కువగా ఉండే కొండ ప్రాంతాలు మనసుకు ఎంతో ప్రశాంతతనిస్తాయి. అక్కడి ఇళ్లు, వీధులు, చర్చిలు రంగురంగుల లైట్లతో అందంగా అలంకరించబడి కొత్త శోభను సంతరించుకుంటాయి. నోరూరించే సాంప్రదాయ వంటకాలు మనల్ని లొట్టలేసుకునేలా చేస్తాయి. చల్లటి సాయంత్రాలు క్రిస్మస్ వాతారణాన్ని మరింత అందంగా చేస్తూ వినసొంపైన పాటలతో మనల్ని అలరిస్తాయి.
6) లాన్స్ డౌన్
ఈ క్రిస్మస్‌ను కొండ ప్రాంతంలో జరుపుకోవాలనుకుంటే లాన్స్ డౌన్ అద్బుతమైన ప్రదేశం. యాంత్రికమైన జీవితంలో కొద్దిగా ప్రశాంతత లభిస్తుంది. వెండికొండల్లో.. మంచులోయల్లో.. చల్లటి సాయంత్రాలు.. వెన్నెల రాత్రులు మనకో గొప్ప అనుభూతిగా మిగిపోతాయి. భాగస్వామితో మాత్రమే కాదు, కుటుంబసభ్యులు, స్నేహితులతో గడపటానికి ఇదో అద్భుతమైన ప్రదేశం అని చెప్పొచ్చు.
7) దాద్రా నగర్ హవేలీ
అన్ని క్రిస్మస్ డెస్టినేషన్‌లకంటే దాద్రా నగర్ హవేలీ కొంచెం ప్రత్యేకమైనది. ఎందుకంటే ఇక్కడ పండుగ మొత్తం గిరిజన పద్దతిలో జరుగుతుంది. రాత్రి వేళ చర్చిల వద్ద నిండుగా గుమిగూడే జనంతో పండుగ ఎంతో వైభవంగా జరుగుతుంది. పండుగ నాడు మీ ప్రియమైన వారితో ఇక్కడ క్రిస్మస్ జరుపుకోవటం నిజంగా ఓ మరిచిపోలేని జ్ఞాపకం అవుతుంది.
8) షిల్లాంగ్
చలికాలంలో ఇక్కడ పర్యాటకుల రద్దీ చాలా తక్కువగా ఉంటుంది. మరెక్కడా రాని అనుభూతి మనకిక్కడ దొరుకుతుంది. పర్యాటకుల్లా కాకుండా స్థానికుల్లా క్రిస్మస్ పండుగను ఆస్వాదించవచ్చు. తక్కువ సంఖ్యలో ఉన్న క్రిస్టియన్లు ఎంతో వైభవంగా క్రిస్మస్ వేడుకలను నిర్వహిస్తారు. మిరుమిట్లు గొలిపే రంగుల లైట్లతో.. వినసొంపైన గాస్పెల్ పాటలతో రేయి ఇట్టే గడిచిపోతుంది. అక్కడి ప్రజలతో పాటు కలిసి స్థానిక వంటకాలను రుచి చూడవచ్చు.
9) డామన్ అండ్ డయ్యూ
గోవాకు ప్రత్యామ్నాయంగా దీనిని చెప్పుకోవచ్చు. పోర్చుగీసు వారి ప్రభావం ఎక్కువగా ఉన్న ప్రదేశం ఇది. సంప్రదాయ నృత్యాలతో పాటు కారిడినో వంటి పోర్చుగీసు నృత్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. పెద్ద సంఖ్యలో చర్చిల వద్ద గుమిగూడే జనం ఎంతో భక్తి శ్రద్ధలతో ప్రార్థనలు నిర్వహిస్తారు.
10) నార్త్ ఈస్ట్
క్రిస్మస్ పండుగను వైభవంగా నిర్వహించే ప్రదేశాల్లో నార్త్ ఈస్ట్ ఒకటి. ఇక్కడి గిరిజనులు పండుగ కోసం సంవత్సరం మొత్తం ఎదురుచూస్తూ ఉంటారు. కొండ ప్రాంతాల్లోని పట్టణాలలో క్రిస్మస్ వేడుకలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. రాత్రి వేళ వీధుల్లో ఎక్కడ చూసినా కనపించే జనంతో వాతావరణం ఎంతో సందడిగా ఉంటుంది. మన కిష్టమైన వారితో పండుగను మరింత సరదాగా జరుపుకోవటానికి ఇదో చక్కటి ప్రదేశం.
Comments
Please login to add a commentAdd a comment