Christmas 2019
-
క్రిస్మస్ టు క్రిస్మస్: చిన్న షేర్లు చిరుతలు
ముంబై, సాక్షి: గతేడాది(2019) క్రిస్మస్ నుంచి ఈ క్రిస్మస్ వరకూ మార్కెట్లు పలు ఎత్తుపల్లాలను చవిచూశాయి. అంతక్రితం ఏడాది మార్కెట్లు పెద్దగా ర్యాలీ చేయకపోవడంతో నెమ్మదిగా బలపడుతూ వచ్చాయి. అయితే 2020 మార్చికల్లా కోవిడ్-19 దెబ్బకు ఉన్నట్టుండి పతనమయ్యాయి. తిరిగి వెనువెంటనే కోలుకుని బుల్ ధోరణిలో సాగిపోయాయి. ఫలితంగా మార్కెట్లు సరికొత్త రికార్డులను సాధిస్తూ వచ్చాయి. తాజాగా సెన్సెక్స్ మార్కెట్ చరిత్రలో తొలిసారి 47,000 పాయింట్ల మైలురానికి అధిగమించగా.. నిఫ్టీ 14,000 పాయింట్లవైపు సాగుతోంది. వెరసి సెన్సెక్స్, నిఫ్టీ ఏడాది కాలంలో 13 శాతం చొప్పున బలపడగా.. మధ్య, చిన్నతరహా కౌంటర్లకు డిమాండ్ పెరగడంతో బీఎస్ఈలో మిడ్, స్మాల్ క్యాప్ ఇండెక్సులు 19 శాతం, 32 శాతం చొప్పున ఎగశాయి. ఇతర వివరాలు చూద్దాం.. (14,000 పాయింట్లవైపు నిఫ్టీ పరుగు!) కారణాలేవిటంటే? ప్రపంచవ్యాప్తంగా కోవిడ్-19 పడగ విప్పడంతో పలు దేశాల ప్రభుత్వాలు, కేంద్ర బ్యాంకులు సహాయక ప్యాకేజీలకు తెరతీశాయి. తద్వారా భారీ స్థాయిలో నిధులను వ్యవస్థలోకి విడుదల చేయడంతో అటు బంగారం, ఇటు స్టాక్ మార్కెట్లు ర్యాలీ బాటలో సాగాయి. సంక్షోభ పరిస్థితుల భయాలతో పసిడి జోరందుకోగా.. లిక్విడిటీ కారణంగా మార్కెట్లు బలపడినట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. దీనికితోడు ఫైజర్, మోడర్నా, ఆస్ట్రాజెనెకా తదితర దిగ్గజాలు వేగంగా వ్యాక్సిన్లను రూపొందించడంతో సెంటిమెంటు పుంజుకున్నట్లు తెలియజేశారు. దేశీయంగా విదేశీ ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) రూ. 1.5 లక్షల కోట్లను ఇన్వెస్ట్ చేయడం ప్రభావం చూపింది. (మార్కెట్లు భళా- ఈ మూడు కంపెనీలూ స్పీడ్) షేర్లు మరింత స్పీడ్ బీఎస్ఈ-500 ఇండెక్సులో 65 శాతం షేర్లు లాభాలతో నిలిచాయి. వీటిలో 50 శాతం రెండంకెల వృద్ధిని చూపాయి. ప్రధానంగా 36 స్టాక్స్ 100-900 శాతం మధ్య దూసుకెళ్లడం ద్వారా మల్టీబ్యాగర్లుగా నిలిచాయి. వీటిలో మిడ్, స్మాల్ క్యాప్స్ అధికంగా చోటు సాధించడం విశేషం! ప్రధాన కంపెనీలలో అదానీ గ్రీన్, ఆర్తి డ్రగ్స్, లారస్ లేబ్స్, ఐవోఎల్ కెమికల్స్, ఆల్కిల్ అమైన్స్, బిర్లాసాఫ్ట్, డిక్సన్ టెక్నాలజీస్, ఇండియామార్ట్ ఇంటర్మెష్, గ్రాన్యూల్స్, వైభవ్ గ్లోబల్, టాటా కమ్యూనికేషన్స్, నవీన్ ఫ్లోరిన్, పాలీ మెడిక్యూర్, దీపక్ నైట్రైట్, అఫ్లే ఇండియా, సీక్వెంట్ సైంటిఫిక్, జేబీ కెమికల్స్, అదానీ గ్యాస్, స్ట్రైడ్స్ ఫార్మా, ఫస్ట్‌సోర్స్, అదానీ ఎంటర్, యాంబర్ ఎంటర్, ఏపీఎల్ అపోలో, పెర్సిస్టెంట్ సిస్టమ్స్, జిందాల్ స్టెయిన్, టాటా ఎలక్సీ, దివీస్ లేబ్స్, మైండ్‌ట్రీ, ఇండియా సిమెంట్స్, ఎల్అండ్టీ ఇన్ఫోటెక్, ఎస్కార్ట్స్, రెస్సాన్సివ్, వొకార్డ్ 600-100 శాతం మధ్య జంప్ చేయడం విశేషం! ఇతర కౌంటర్లలో తాన్లా సొల్యూషన్స్ 900 శాతం పురోగమించింది. నేలచూపులో గతేడాది కాలంలో ప్రభుత్వ రంగ కంపెనీలు కొన్ని నేలచూపులకే పరిమితమయ్యాయి. ఈ జాబితాలో బ్యాంకులు, ఎన్బీఎఫ్సీలు, హోటళ్లు, రిటైల్ రంగ కౌంటర్లు సైతం చోటు చేసుకున్నాయి. ఫ్యూచర్ రిటైల్, జీఈ పవర్, పీఎన్బీ, యూనియన్ బ్యాంక్, రేమండ్, కెనరా బ్యాంక్, చాలెట్ హోటల్స్, ఇండస్ఇండ్, బీవోబీ, లెమన్ ట్రీ, షాపర్స్‌స్టాప్, ఎడిల్వీజ్ ఫైనాన్స్, ఆర్బీఎల్ బ్యాంక్, ఐబీ హౌసింగ్, జాగరణ్ ప్రకాశన్, డీసీబీ బ్యాంక్, కోల్ ఇండియా, ఉజ్జీవన్ స్మాల్ బ్యాంక్ తదితరాలు 30 శాతం స్థాయిలో నీరసించినట్లు మార్కెట్ విశ్లేషకులు పేర్కొన్నారు. -
ఎంచుకున్న రాగమేంటి, చేస్తున్న స్టెప్పేంటి?
-
అదా శర్మ డ్యాన్స్ వీడియో వైరల్
కోలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్లో క్రేజ్ సంపాదించుకున్న అందాల నటి అదా శర్మ. అప్పుడెప్పుడో ‘హార్ట్ఎటాక్’తో కుర్రకారు గుండెల్లో రైళ్లు పరిగెట్టించిన ఈ భామ తెలుగులో హీరోయిన్గా నిలదొక్కుకోలేకపోయింది. సుబ్రహ్మణ్యం ఫర్ సేల్, సన్ ఆఫ్ సత్యమూర్తి, క్షణం వంటి హిట్ చిత్రాల్లో అదాశర్మ పరిమిత పాత్రల్లోనే నటించింది. అయితే స్కిన్‌షోకు ఏమాత్రం వెనుకాడని ఈ ముద్దుగుమ్మ హాట్ ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఉంటుంది. తాజాగా క్రిస్మస్ వేడుకల్లో ఆమె చేసిన హంగామాతో మరోసారి వార్తల్లో నిలిచింది. సాధారణంగా క్రిస్మస్ పండగకు అందరూ కేకులు కట్ చేస్తూ, గిఫ్ట్‌లు ఇచ్చుకుంటూ పార్టీలు చేసుకుంటారు. కానీ అదాశర్మ మాత్రం జింగిల్ బెల్ పాటకు కాళ్లకు గజ్జె కట్టి తన్మయత్వంతో నృత్యం చేసింది. అది కూడా క్లాసికల్ డ్యాన్స్ కావడంతో అందరూ కాసేపు ఆశ్చర్యపోయినా తర్వాత అదా పర్ఫార్మెన్స్ చూసి ముగ్ధులైపోయారు. ఈ వీడియోను అదాశర్మ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. ఈ వీడియోను చూసిన కొందరు నెటిజన్లు అదా డ్యాన్స్‌కు ఫిదా అవుతుంటే మరికొందరు మాత్రం ఫన్నీ సెటైర్లు వేస్తున్నారు. ‘మీరు ఎంచుకున్న రాగం ఏంటి చేస్తున్న డ్యాన్సు ఏంటి?’ అంటూ అదాపై చమత్కార కామెంట్లు విసురుతున్నారు. -
కరుణామయుని కోవెలలో..
సాక్షి, మెదక్: క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన మెదక్ సీఎస్ఐ చర్చికి భారీ ఎత్తున భక్త జనం తరలివచ్చారు. ఎప్పుడూ నిర్మానుష్యంగా ఉండే రహదారులు బుధవారం వాహనాలు, భక్తుల రద్దీతో కిటకిటలాడాయి. మంగళవారం అర్ధరాత్రి నుంచే భక్తు ల రాక ప్రారంభమైంది. ఉదయం 4.30 గంటలకు జరిగిన మొదటి ఆరాధనలో సీఎస్ఐ చర్చి బిషప్ సాల్మన్‌రాజ్ దైవసందేశం ఇచ్చారు. చర్చిలో జరిగిన క్రిస్మస్ వేడుకలకు క్రైస్తవులతోపాటు హిందువులు, ముస్లింలు కూడా రాగా.. మతసామరస్యం వెల్లివిరిసింది. కాగా, క్రిస్మస్ సందర్భంగా చర్చి ప్రాంగణం జాతరను తలపించింది. పోలీసులు అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పటిష్ట బందోబస్తు నిర్వహించారు. అధికారులతోసహా మొత్తం 450 మంది సిబ్బంది బందోబస్తులో పాల్గొన్నారు. అయితే.. పట్టణంలో కేటాయించిన మూడు పార్కింగ్ స్థలాలు కిక్కిరిసి పోగా.. రహదారుల వెంటే వాహనాలను పార్కింగ్ చేయడంతో పలుచోట్ల ట్రాఫిక్ సమస్య నెలకొంది. దేవుడి ఆశీస్సులతో అభివృద్ధి: హరీశ్‌రావు ఏసయ్య జీవితాంతం ప్రజల కోసమే బతికారని మం త్రి హరీశ్‌రావు అన్నారు. దయ, కరుణ, ప్రేమ గుణాల ను ప్రతీ మనిషి కలిగి ఉండాలన్నారు. సీఎం కేసీఆర్ దేవుడి ఆశీస్సులతో రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్నారన్నారు. అంతకు ముందు మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి క్రిస్మస్ కేక్‌ను కట్ చేసి సంబరాల్లో పాల్గొన్నారు. సీఎస్ఐ చర్చి ముందు భక్తుల రద్దీ -
క్రిస్మస్ వేడుకల్లో సీఎం
పులివెందుల/సాక్షి,అమరావతి: సీఎం వైఎస్ జగన్ బుధవారం ఉదయం కుటుంబ సభ్యులతో కలిసి వైఎస్సార్ జిల్లా పులివెందుల సీఎస్ఐ చర్చిలో నిర్వహించిన క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్నారు. పాస్టర్ బెనహర్‌బాబు ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం క్రిస్మస్ ఆరాధనలో పాల్గొన్నారు. సీఎస్ఐ చర్చికి సంబంధించిన క్యాలెండర్‌ను ఆవిష్కరించారు. వైఎస్ విజయమ్మ క్రిస్మస్ సందేశాన్ని వినిపించారు. వైఎస్ జగన్, వైఎస్ విజయమ్మలతోపాటు ఇతర కుటుంబ సభ్యులు క్రిస్మస్ కేక్‌ను కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో దివంగత వైఎస్ జార్జిరెడ్డి సతీమణి వైఎస్ భారతమ్మ, వైఎస్ జగన్ సతీమణి వైఎస్ భారతిరెడ్డి, ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి, జార్జిరెడ్డి కుమారులు అనిల్‌రెడ్డి, సునీల్‌రెడ్డి.. వైఎస్ ప్రకాష్‌రెడ్డి, వైఎస్ భాస్కర్‌రెడ్డి, వైఎస్ ప్రతాప్‌రెడ్డి, వైఎస్ మనోహర్‌రెడ్డి, వైఎస్ జోసఫ్‌రెడ్డి, వైఎస్ మధురెడ్డి, డాక్టర్ ఈసీ గంగిరెడ్డి, ఎన్.శివప్రకాష్‌రెడ్డి, మంత్రులు సురేష్, అవంతి, అంజాద్ బాషా, ఆళ్ల నాని, కడప, రాజంపేట పార్లమెంటరీ అధ్యక్షులు సురేష్‌బాబు, అమరనాథ్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. తాడేపల్లి చేరుకున్న సీఎం వైఎస్ జగన్..: సీఎం వైఎస్ జగన్ మూడు రోజుల వైఎస్సార్ జిల్లా పర్యటన ముగించుకుని బుధవారం సాయంత్రం తాడేపల్లి చేరుకున్నారు. ఈ నెల 23వ తేదీ ఉదయం ఆయన తాడేపల్లి నుంచి వైఎస్సార్ జిల్లా పర్యటనకు బయలుదేరిన విషయం తెలిసిందే. అదే రోజు ఆయన జమ్మలమడుగు మండలం సున్నపురాళ్లపల్లెలో ఏపీ హైగ్రేడ్ స్టీల్స్‌కు, కడపలో పలు అభివృద్ధి పనులకు.. 24న రాయచోటి, 25న పులివెందుల నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. -
క్రిస్మస్ విషెస్ తెలిపిన టాలీవుడ్ స్టార్స్
సెలబ్రిటీలు ఏది చేసినా సెన్సేషనే.. అలాంటిది పండగ వచ్చిందంటే మన సెలబ్రిటీలు చేసే హంగామా మామూలుగా ఉండదు. పండగ సందర్భంగా పలువురు సినీనటులు ఫొటోలు షేర్ చేస్తూ అభిమానులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు. ‘ఈ పండగకు ఇచ్చిపుచ్చుకోవడంలో ఉన్న ప్రేమను, అనుభూతిని ఆస్వాదించండి, నచ్చినవారితో కలిసి పండగను ఎంజాయ్ చేయండి. వీలైనన్ని జ్ఞాపకాలను కూడగట్టుకోండి’ అని టాలీవుడ్ సూపర్‌స్టార్ మహేశ్‌బాబు అభిమానులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపాడు. ఇక మెగాస్టార్ చిరంజీవి తన మనవరాళ్లతో కలిసి విషెస్ క్రిస్మస్‌తోపాటు నూతన సంవత్సర విషెస్ తెలిపాడు. హీరో రామ్‌చరణ్ కూడా తన తండ్రి చిరుతో కలిసి పండగ వేడుకల్లో పాల్గొన్నాడు. హీరోయిన్ సమంత ప్రత్యుష ఫౌండేషన్ పిల్లలతో కలిసి క్రిస్మస్ వేడుకలు జరుపుకుంది. ‘ఎవరైతే తమ జీవితాల్లో వెలుగు కోసం ఎదురుచూస్తారో వారితో కలిసి క్రిస్మస్ను సెలబ్రేట్ చేసుకున్నప్పుడే ఆ పండగకు పూర్తి అర్థం ఉంటుంద’ని ఆమె పేర్కొంది. మరో నటి కేథరిన్ పిజ్జాతో క్రిస్మస్ను సెలబ్రేట్ చేసుకుంది. సాంటాక్లాజ్‌లా రెడీ అయిన హీరోయిన్ రెజీనా.. తనకు డిసెంబర్ నెల ఎంతో ప్రత్యేకమని చెప్పుకొచ్చింది. తన పుట్టినరోజు(డిసెంబర్ 13), క్రిస్మస్, రానున్న కొత్తసంవత్సరం కోసం ప్రారంభమయ్యే వేడుకలు అన్నీ ఈ నెలలోనే జరుగుతాయని, అందుకే ఈ నెల తనకెంతో ఇష్టమని పేర్కొంది. అయితే ఈ సంవత్సరం ఎంతో బిజీగా ఉన్నా పండగ జరుపుకోవడం మాననంటోంది. ‘ఈ క్రిస్మస్ మీకు, మీ కుటుంబ సభ్యులకు ఎన్నో సంతోషాలను, ప్రేమను, అదృష్టాలను అందించాలని కోరుకుంటున్నాను’ అని మంచు మనోజ్ విషెస్ తెలిపాడు. నిర్మాత, నటి మంచు లక్ష్మీ అభిమానులకు క్రిస్మస్ పండగ శుభాకాంక్షలు తెలిపారు. కుటుంబంతో కలిసి ఈ పండగను ఆస్వాదించండన్నారు. ఇక జూ. ఎన్టీఆర్, ఎనర్జిటిక్ స్టార్ రామ్, కాజల్ అగర్వాల్ పలువురు నటీనటులు క్రిస్మస్ పండగ శుభాకాంక్షలు తెలియజేశారు. -
ముస్తాబైన ఆంధ్ర రోమ్
గుంటూరు ఈస్ట్: మానవాళి ప్రేమ, శాంతి మార్గంలో పయనించాలని క్రీస్తు బోధిస్తే.. వాటిని ఆచరిస్తూ, ఆచరింపజేస్తూ గుంటూరు నగరంలోని అనేక క్రైస్తవ మందిరాలు సేవలందిస్తున్నాయి. ఏఈఎల్సీ ఆధ్వర్యంలో పలు చర్చిలు, విద్యాలయాలు, వైద్యశాలలు మానవ సేవలో వెలుగొందుతున్నాయి. గుంటూరు, నల్లగొండ, ప్రకాశం, కృష్ణా జిల్లాల పరిధిలోని చర్చిలన్నీ సెంట్రల్ సినడు పరిధిలోకి వస్తాయి. సీహెచ్ ఏలియా సెంట్రల్ సినడు బిషప్‌గా వ్యవహరిస్తున్నారు. 150 ఏళ్లకు పైగా చరిత్ర.. రెవరెండ్ డాక్టర్ జాన్క్రిస్టియన్ ఫెడరిక్ హయ్యర్ ఏఈఎల్సీ సంఘాన్ని స్థాపించి క్రీస్తు బోధనల ప్రచార వ్యాప్తికి కృషి చేశారు. గుంటూరు పాత బస్టాండ్ సెంటర్లో 1842వ సంవత్సరం జులై 31వ తేదీ సెయింట్ మ్యాథ్యూస్ ఈస్ట్ ప్యారిస్ చర్చిని నిర్మించారు. 150 ఏళ్లకు పైగా చరిత్ర ఉన్న ఈ చర్చి జిల్లాలోనే అతి పురాతనమైన చర్చిల్లో ఒకటి. వెస్ట్ప్యారిస్ చర్చికు దాదాపు వందేళ్ల చరిత్ర ఉంది. 1905లో స్థాపించిన ఈ చర్చికు రాక్ మెమోరియల్ చర్చి అనే మరో పేరు ఉంది. నార్త్ ప్యారిష్ చర్చి ఆధ్వర్యంలో 60 ఏళ్లుగా దైవ సందేశాన్ని అందించడంతో పాటు, సామాజిక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. గుంటూరు మేత్రాసనం 1940లో గుంటూరు మేత్రాసనం స్థాపించారు. గుంటూరు రింగ్‌రోడ్డులోని బిషప్బంగ్లా కేంద్రంగా ప్రస్తుతం బిషప్ చిన్నాబత్తుని భాగ్యయ్య పరిరక్షణలో ప్రొక్రెటర్ ఫాదర్ ఏరువ బాలశౌరెడ్డి నిర్వహణలో పలు దేవాలయాలు, పాఠశాలలు, కళాశాలలు, వైద్యశాలలు నిర్వహిస్తున్నారు. జిల్లాలో 90 విచారణలు, వాటికింద మిషన్స్ స్టేషన్లు ఉన్నాయి. ముస్తాబైన ఆంధ్ర రోమ్ పేరేచర్ల(ఫిరంగిపురం): తెలుగు రాష్ట్రాల్లోనే అద్భుత కట్టడంగా, లక్షలాది మంది భక్తులు వచ్చే ప్రాంతంగా పిలవబడే ఫిరంగిపురం బాలయేసు కథెడ్రల్ దేవాలయం క్రిస్మస్ మహోత్సవానికి ముస్తాబయ్యింది. వేడుకల్లో భాగంగా ఆలయాన్ని కనులు మిరుమిట్లు గొలిపేలా విద్యుత్ దీపాలతో ఆలంకరించారు. గతంలో కంటే భక్తుల రద్దీ ఎక్కువగా ఉన్న దృష్ట్యా వారికి ఆలయంలో విశ్రాంతి భవనాలు, దర్శనం ప్రశాంతంగా సాగేలా ఏర్పాట్లు చేశారు. రాష్ట్రం నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి దేశ విదేశాల నుంచి రెండు లక్షల మందికిపైగా భక్తులు వస్తారని అంచనా. మహిళా భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. క్రీస్తువిశ్వాసులు ఎక్కువగా తరలివచ్చే మహిమాన్విత ఆలయంగా, ఆంధ్రా రోమ్‌గా కీర్తి పొందిన ఈ ఆలయానికి 128 సంవత్సరాల చరిత్ర ఉంది. లండన్‌లోని మిల్‌హిల్ సభకు చెందిన మతగురువు థియోడర్ డిక్మన్ స్వామి 1875లో బాలయేసు కథెడ్రల్ ఆలయానికి విచారణ గురువుగా వచ్చారు. ఆలయం శిథిలావస్థలో ఉండటం చూసిన ఆయన నిర్మాణానికి పూనుకున్నారు. 1888 డిసెంబర్ 15వ తేదీ బాలయేసు ఆలయం పునాది నిర్మాణం చేపట్టారు. పునాదులకు రెండేళ్ల కాలం పట్టింది. బుధవారం జరిగే క్రిస్మస్ వేడుకలకు శాంతి భద్రతలకు ఎటువంటి విఘాతం కలగకుండా 170 మందితో పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇందులో డీఎస్పీ, సీఐ, ఏడుగురు ఎస్ఐలు పర్యవేక్షించనున్నారు. సర్వ మతాల సంగమం విజయపురిసౌత్: సర్వ మతాల సంగమంగా ఆధ్యాత్మిక భావనకు ప్రతీకగా వెలుగొందుతున్న సాగర్మాత దేవాలయంలో క్రిస్మస్ వేడుకలకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. రాష్ట్రంలోనే విశిష్టత కలిగిన ఆలయంగా, ప్రముఖ పుణ్యక్షేత్రంగా దీనికి పేరుంది. భక్తుల కోర్కెలు తీర్చే తల్లి సాగర్మాత ఆలయానికి నిత్యం రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వేలాది మంది భక్తులు వస్తుంటారు. భారతీయ సంప్రదాయాలకు అనుగుణంగా మందిర నిర్మాణం, గోపురంపై విగ్రహ సంపద రూపుదిద్దుకున్నాయి. భారతీయ చిత్ర కళానైపుణ్యం వీటిలో కనిపిస్తోంది. సాగర్ ఒడ్డున వెలిసిన మేరీమాత సాగర్మాత పేరుతో క్రైస్తవులతో పాటు హిందువులు, ముస్లింలు ఇలా అన్ని మతాల ప్రజల నీరాజనాలను అందుకుంటోంది. శతాబ్దాల చరిత్ర రెంటచింతల: రాష్ట్రంలో రెంటచింతల అనగానే అందరికీ రోళ్లుసైతం పగిలే ఎండలు గుర్తొస్తాయి. కానీ, ప్రేమను వర్షించే ఆధ్యాత్మిక కేంద్రం కూడా ఇక్కడే ఉంది. శతాబ్దంన్నరకు పైగా చరిత్ర కాలిగిన కానుకమాత దేవాలయం ప్రముఖ పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతోంది. ఈ ఆలయంలోకి అడుగుపెట్టగానే చలువురాతి చల్లదనమే కాదు.. కానుకమాత కృపా కటాక్షాలు కూడా దక్కుతాయి. రెవరెండ్ ఫాదర్ జోసఫ్ గ్రాండ్, కెనడీల ఆధ్వర్యంలో 1850లో అద్భుతమైన ఆర్కిటెక్ పరిజ్ఞానంతో కానుకమాత దేవాలయాన్ని నిర్మించారు. ఈ ఆలయం క్రిస్మస్ వేడుకలకు ముస్తాబైంది. ఈ చర్చిలో ప్రతి ఏడాది క్రీస్తు జన్మదినోత్సవాన్ని వేడుకగా నిర్వహిస్తున్నారు. మంగళవారం అర్ధరాత్రి 11 గంటలకు చర్చి ఆవరణలో విచారణ గురువులు రెవరెండ్ ఫాదర్ గోపు రాయపరెడ్డి నేతృత్వంలో ప్రత్యేక సమష్టి దివ్యపూజాబలిని సమర్పించనున్నారు. మండలంలోని సుమారు మూడు వేల మందికి పైగా క్రైస్తవులు పాల్గొంటారు. రాత్రి 12 గంటలకు బాలయేసు జననాన్ని పురష్కరించుకుని ఆనందంతో భారీగా బాణసంచా కాలుస్తారు. -
దేవుడు దిగి వచ్చిన వేళ
ఒక ధ్రువతార నింగిలో నిండుగా ప్రకాశించింది. చీకట్లు నిండిన బతుకుల్లో వెలుగులు నింపుతూ, కన్నీరు నిండిన కళ్లకు ఆనందాన్ని పంచుతూ, ద్వేషం నిండిన లోకానికి శాంతి సందేశాన్ని అందిస్తూ ఇలకు చేరింది. ఆ తార రాకతో కాలంతో పాటు లోకం కూడా మారింది. శాంతి కోసం ఆ మహా పురుషుడు ఇచ్చిన పిలుపు శతాబ్దాలుగా అందరి గుండెల్లో ప్రతిధ్వనిస్తూనే ఉంది. ప్రేమ కోసం క్రీస్తు చిందించిన రుధిరం వెచ్చటి అశ్రువుల రూపాల్లో ప్రతి చెంపను తడుముతూనే ఉంది. సిక్కోలులోనూ క్రైస్తవం అంతర్వాహినిగా నిశ్శబ్దంగా ప్రవహిస్తోంది. అందుకు ఈ మందిరాలే సాక్ష్యం. వందేళ్లకు పైబడి ఈ మందిరాల్లో ప్రార్థనలు జరుగుతున్నాయి. క్రిస్మస్ పర్వదినానికి ఈ ప్రార్థనాలయాలు సర్వాంగసుందరంగా ముస్తాబవుతున్నాయి. 123 ఏళ్లుగా.. టెక్కలి: టెక్కలిలో అంబేడ్కర్ కూడలిలో ఉన్న ఆంధ్రా బాప్టిస్టు చర్చిలో 123 ఏళ్లుగా ఏటా క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. 1905లో కెనడాకు చెందిన క్రిష్టియన్ మిషనరీష్ ఆధ్వర్యంలో సంఘ ప్రతినిధి ఆర్చి బాలుడు ఆధ్వర్యంలో ఫాస్టర్ డబ్ల్యూ.హేగెన్స్ పర్యవేక్షణలో ఈ చర్చిని నిర్మించారు. అప్పటి నుంచి ఏటా క్రిస్మస్ వేడుకలు నిర్వహిస్తున్నారు. 2015 సంవత్సరానికి 120 ఏళ్లు పూర్తి కావడంతో ఈ చర్చిని పునర్నిర్మించారు. చర్చి సంఘం ప్రతినిధులు సుభాష్, సురేష్, వినోద్, జయకుమార్, నాగరాజు, భక్త విజయం ఆధ్వర్యంలో పునర్నిర్మాణం పనులు చేపట్టారు. విద్యుత్ కాంతులతో మెరిసిపోతున్న టెక్కలిలోని ఆంధ్రా బాప్టిస్టు చర్చి క్రైస్తవులకు ఆరాధ్య కేంద్రంగా.. గార: బ్రిటిష్ పరిపాలన సమయంలో కళింగపట్నంలో పోర్టు నిర్వహణ జరుగుతున్న సమయంలో పోర్టు కళింగపట్నంలో తెలుగు బాప్టిస్టు చర్చిని నిర్మించారు. 1934 సంవత్సరంలో అప్పటి మతపెద్దలు మైలపల్లి రామన్న, మీసాల సుమన్ మిషన్ ఆధ్వర్యంలో పులిపాక జగన్, గోర్డన్ దంపతులు ఈ ప్రార్థనా మందిరాన్ని స్థాపించారు. స్వాతంత్య్రం రావడానికి కొద్ది సంవత్సరాలు ముందు ఈ చర్చిలో సీబీఎం గర్ల్స్ స్కూల్ పేరుతో పాఠశాలను నడిపేవారు. వారానికి ఐదు రోజులు తరగతులు, ఆదివారం ప్రత్యేక ప్రార్థనలు జరిగేవని చర్చి ఫాస్టర్ రామారావు తెలిపారు. ప్రస్తుతం చర్చిలో నిర్వహణ కమిటీ పేరిట ప్రత్యేక ఆరాధనలు, అనాథలకు సేవా కార్యక్రమాలు జరుగుతున్నాయని చర్చి ప్రతినిధి దేవదాసు మాస్టారు తెలిపారు. ఈస్ట్ ఇండియా కంపెనీ ఆనవాలు శ్రీకాకుళం కల్చరల్: జిల్లా కేంద్రంలో చిన్నబజారులో ఉన్న తెలుగు బాప్టిస్టు చర్చి క్రిస్మస్ వేడుకలకు సిద్ధమవుతోంది. ఈ మందిర నిర్మాణం 1846 సెప్టెంబర్ 12వ తేదీన జరిగింది. 1996వ సంవత్సరంలో 150 ఏళ్ల వేడుక ఘనంగా జరిగింది. 2003లో నూతన భవనాన్ని నిర్మించారు. 17వ శతాబ్దంలో జరిగిన కర్నాటక యుద్ధ సంధి ప్రకారం ఈ ప్రాంతం నార్తరన్ సర్కారు (ఇంగ్లీషు)వారికి అప్పగించినట్లు చరిత్ర చెబుతోంది. ఈస్ట్ ఇండియా కంపెనీ ఆధ్వర్యంలో 41వ బెటాలియన్ ఇక్కడ ఉండేది. సైనికుల్లో చాలా మంది లండన్ మిషన్‌కు చెందిన భక్తి గల క్రైస్తవులు ఉండటం వల్ల మేజర్ బ్రెట్, కెప్టెన్ హెలెన్నాట్ అనేవారు జెమ్స్ డాసన్ వారి సహకారంతో ఈ ప్రాంతంలో సంఘాన్ని ప్రారంభించారు. ప్రార్థనల వేదిక రాజాం: రాజాంలో బొబ్బిలి రోడ్డులోని 90 ఏళ్ల చరిత్ర కలిగిన ఆర్సీఎం చర్చి క్రిస్మస్ వేడుకలకు సిద్ధమైంది. ఈ చర్చిని 1925–30 మధ్య కాలంలో ఇక్కడ ఏర్పాటు చేసినట్లు రాజాం ప్రాంత ప్రజలు చెబుతున్నారు. ఏటా క్రిస్మస్కు ఇక్కడకు 1500 మందికిపైగా భక్తులు వస్తుంటారు. రెవరెండ్ పాధర్ నున్నం ప్రసాద్, రెవరెండ్ పాధర్ జాన్ పీటర్లు ఇక్కడ ప్రార్థనలు నిర్వహిస్తున్నారు. ఇక్కడ నిత్యం విద్యుత్ దీపాలంకరణ ఉంటుంది. ఈ చర్చి ఆధ్వర్యంలో స్కూల్ కూడా నడుస్తోంది. వేడుకలకు వేదిక సిద్ధం పాలకొండ రూరల్: నూట యాభై రెండేళ్లకు పైబడి చరి త్ర కలిగిన పాలకొండ లూర్దుమాత ఆలయం క్రిస్మస్ వేడుకలకు సిద్ధమవుతోంది. బ్రిటిష్ కాలం నాటి రాతి కట్టడంతో ఉన్న ఈ ఆలయం కాలక్రమేణా కొత్త సొబ గులు సంతరించుకుని ఈ ఏడాది క్రిస్మస్ వేడుకలకు సన్నద్ధమవుతోంది. బ్రిటిష్ పాలనలో అప్పట్లో విచారణకర్తలు పాలకొండ ప్రాంతంలో ఉన్న సైనికులకు సేవలందించే క్రమంలో ఇక్కడ లూర్దుమాత ఆలయం స్థాపించినట్టు చరిత్ర చెబుతోంది. నాడు వచ్చిన సేవకులు గుర్రాలపై పార్వతీపురం, బొబ్బిలి, సాలూరు, బత్తిలి ప్రాంతాల్లో సంచరిస్తూ సువార్త విస్తరింపజేసినట్టు విచారణకర్తలు పేర్కొంటున్నారు. పురాతన చర్చి సీతంపేట: సీతంపేట ఏజెన్సీలోని పత్తికగూడ సమిపంలో కొండపైన ఉన్న ఫాతిమా మాత పుణ్యక్షేత్రంగా పిలిచే చర్చి నిర్మించి 120 ఏళ్లు కావస్తోంది. 1900వ సంవత్సరంలో నిర్మించిన చర్చిని అగస్టన్, వర్గీస్, బాలస్వామి వంటి ఫాదర్లు అభివృద్ధి చేశారు. వారి తర్వాత దీన్ని ప్రస్తుతం అమర్‌రావు ఫాదర్ నిర్వహిస్తున్నారు. పురాతన చర్చి వేడుకకు సిద్ధం సోంపేట: సోంపేట పట్టణంలోని 109 ఏళ్ల చర్చి క్రిస్మస్కు సిద్ధమైంది. 1910వ సంవత్సరంలో కెనడా బా ప్టిస్టు చర్చి ఆధ్వర్యంలో ఈ చర్చిని ప్రారంభించారు. ఈ చర్చికి మొట్ట మొదటి పాస్టర్‌గా కర్మికోటి అబ్రహం వ్యవహరించారు. ప్రస్తుతం 18వ పాస్టర్‌గా కొత్తపల్లి అబ్రహం విధులు నిర్వహిస్తున్నారు. -
చర్చిలకు క్రిస్మస్ శోభ
-
దేశవ్యాప్తంగా క్రిస్మస్ సందడి
-
సీఎం జగన్, కేసీఆర్ క్రిస్మస్ శుభాకాంక్షలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ప్రజలకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. ఏసు ప్రభువు జన్మదినాన్ని ఆనందం తో జరుపుకోవాల్సిన సందర్భమిదని, జీసస్ బోధనల అనుసారం కరుణ, ప్రేమకు పునరంకితం కావాలని తన సందేశంలో పేర్కొన్నారు. సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రజలకు సీఎం కె.చంద్రశేఖర్‌రావు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. ప్రేమ, కరుణను ప్రబోధించిన ఏసుక్రీస్తు జన్మదినాన్ని ప్రపంచవ్యాప్తంగా ఆనందోత్సాహాలతో జరుపుకుంటారని తన సందేశంలో తెలిపారు. ప్రజలు సుఖసంతోషాలతో క్రిస్మస్ పర్వదినాన్ని జరుపుకోవాలని ఆకాంక్షించారు. సాక్షి, అమరావతి: క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకుని క్రైస్తవులందరికీ ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో శుభాకాంక్షలు తెలిపారు. సాటి మను షుల పట్ల ప్రేమ, నిస్సహాయుల పట్ల కరుణ, ఆకాశమంతటి సహనం, అవధుల్లేని త్యాగం, శాంతియుత సహజీవనం, శత్రువుల పట్ల సైతం క్షమాగుణం.. ఇవన్నీ తన జీవితం ద్వారా మానవాళికి క్రీస్తు ఇచ్చిన మహోన్నత సందేశాలని, క్రీస్తు బోధనలు ఎప్పటికీ మనుషులందరినీ సన్మార్గంలో నడిపిస్తాయని ఆయనీ సందర్భంగా పేర్కొన్నారు. సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రజలు, క్రైస్తవ సోదరులకు టీపీసీసీ అధ్యక్షుడు, ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. ఏసు బోధనలు, సందేశాలు ఆచరణీయమైనవని, ప్రేమ, శాంతి సందేశాలు, ఆదర్శాలు ఎంతో ఉన్నతమైనవని పేర్కొన్నారు. ప్రస్తుతం దేశంలో ఉన్న పరిస్థితుల్లో ఏసు సందేశాలను ఆచరించాలని, ఆయన ఆశయాలను పాటించడమే నిజమైన భక్తి అని చెప్పారు. -
దివ్యలోకపు ప్రేమధార
మనుషుల్ని చూడండి. మీద ఏదో ఒక బరువు. చదువుల బరువు. ఉద్యోగాల బరువు. ఇంటి పోషణ బరువు. బంధువుల మాటపట్టింపు బరువు. స్నేహితుల ముఖంచాటు బరువు. దగ్గరివాళ్లెవరి మనసునో నొప్పించిన బరువు. అంత బరువులోనూ సాటి మనిషి తల మీది బరువును రెండు చేతులతో చేపల గంపను కిందికి దింపినట్లుగా.. ‘కష్టాన్ని పంచుకునే బరువు’నూ పైకెత్తుకుంటారు! మనిషి ఎంత బరువును మోస్తున్నా.. మనిషి లోపల పంచుకోవడం అనే ఆ ‘ప్రేమ నక్షత్రం’ వెలుగుతున్నంత కాలం లోకం ప్రేమమయమే. కాంతిమయమే. మాధవ్ శింగరాజు మంచిని మోసుకొచ్చేవాళ్లు కనిపిస్తే మనసుకు భారం దిగినట్లుగా అనిపిస్తుంది. భుజాన అరటి గెలతో వచ్చేవాళ్లు, వడ్ల బస్తాల బండితో దిగేవాళ్లు, అమ్మాయికి పెళ్లి సంబంధం తెచ్చేవాళ్లు.. ఇవనే కాదు, ఊరికే చూసిపోదామని ఎంతోదూరం నుంచి ఒక పలకరింపునైనా మూట కట్టుకుని వచ్చేవాళ్లు.. వాళ్లు ఎండన పడి వచ్చినా.. మనకు నీడనిచ్చేందుకు వేర్లు పెకిలించుకుని కదలి వచ్చిన మనిషంత మహావృక్షంలా కనిపిస్తారు. మన నీరసాన్ని, నిస్సత్తువను పోగొడతారు. వాళ్లు తెచ్చిన చక్కెరకేళీలు, వాళ్లు దించిన ధాన్యం గింజలు, వాళ్లు చెప్పిన వరుడి విశేషాలు.. ఇవి కాదు మనసుకు సంతోషం. ఆ మోసుకురావడం.. అదీ! మనిషంటే అలానే ఉండాలి. నక్షత్రంలా! క్రీస్తు జన్మించారన్న కబురును ఇలాగే ఒక నక్షత్రం భూమి మీదకు మోసుకొచ్చింది. ఆ నక్షత్రం ప్రసవించిన వెలుగులో క్రీస్తు జనన ఘడియలు కాంతిపుంజాలై ప్రసరించి లోకమంతటా మంచిని విత్తనాల్లా విరజిమ్మాయి. ఆ విత్తన సంతతే కావచ్చు ఈ మంచిని ప్రయాసపడి మోసుకొచ్చే మనుషులు! విరజిమ్మినప్పుడు మంచి అక్కడక్కడా పడింది కనుకనేనా మంచి మనుషులు అక్కడక్కడ మాత్రమే కనిపిస్తుంటారు?! కాదు. కనిపించకపోవడానికి కారణం మనం చూడకపోవడం, చూడాలని మనకు లేకపోవడం! ప్రకృతిని చూసి పరవశిస్తాం. ప్రకృతిలో భాగమైన మూగజీవుల్ని చేరదీసి సేదతీరుతాం. పక్షులు పాడుతుంటే వింటాం. మరి సాటి మనిషినెందుకు దగ్గరకు రానివ్వం? ఎన్ని యుగాల పరిచయం ఉన్నా మనిషికి దగ్గరగా ఎందుకు వెళ్లలేం? చూడదలచుకుంటే దిగ్మండలంలోనే కాదు, ఈ భూమండలంలోనూ నక్షత్రాల్లాంటి మనుషులు ప్రత్యక్షమవుతారు. క్రీస్తు జననం వంటి ఒక మంచిని వాళ్లు సాక్షాత్కరింపజేస్తారు. మనలో ప్రతి ఒక్కరం చూడగలం. అయితే చూడదలచుకోం! చూసేందుకు లోకంలో మంచే లేదనుకుంటాం. నిజంగానే లోకంలో మంచికి చోటు లేదా, మంచిని చూసేందుకు మనలో చోటు లేదా? ఉంటుంది. మంచిని చూడాలన్న ఆలోచన.. అది రాదు. వచ్చిందా.. మరుక్షణమే మన పక్కనే ఉన్న మనిషిలోనూ ఒక నక్షత్రం కనిపిస్తుంది! మనిషిలో నక్షత్రం కాదు, మనిషే నక్షత్రంలా కనిపిస్తారు. ఆ నక్షత్రపు వెలుగులో లోకంలోని మంచి కనిపిస్తుంది. వెలుగులో మంచొక్కటే కనిపిస్తుందా! వెలుగులో కనిపించేది మంచైనా, కానిదైనా.. మనసులోని వెలుగు మంచిని మాత్రమే చూస్తుంది. ఆ చూపును కాపాడుకోవాలి మనం. అప్పుడు లోకం దివ్యమైన నక్షత్ర కూటమిలా వెలుగుతూ కనిపిస్తుంది. శోకమయపు సముద్రాల ఈతకు నీటిపై సురక్షితంగా తేలియాడే ఆకులాంటి ఒక మంచి చూపు చాలదా.. సముద్రాన్ని, సుడిగుండాల్ని, తిమింగలాలను లక్ష్యపెట్టక ప్రశాంతంగా జీవనయానం సాగించడానికి! కొన్ని సంగతులు విన్నప్పుడు భూమి మీద ఉన్నదంతా ప్రేమ సందేశాలను మోసుకొచ్చే నక్షత్రాలే కానీ మానవమాత్రులు కారేమో అనిపిస్తుంది. కాకపోతే కొన్ని వెలిగే నక్షత్రాలు. కొన్ని వెలుగులో మాత్రమే కనిపించే నక్షత్రాలు. వెలుగులో నక్షత్రాలు కనిపించడం ఏమిటి! నక్షత్రమంటేనే వెలుగు కదా?! మనిషెంత వెలిగినా మంచితో వెలగడం ఒకటి ఉంటుందిగా. అలాంటిదే. ఒక యువకుడు ఉన్నాడు. హోటల్లో వెయిటర్. రూపాయి రూపాయి కూడ»ñ ట్టుకుని సైకిల్ కొనుక్కోవడం కోసం రోజూ పదకొండు కిలోమీటర్లు కాలి నడకన పనికి వచ్చి పోతున్నాడు.ఆ హోటల్‌కు వస్తుండే దంపతులొకరికి ఈ సంగతి తెలిసింది. మర్నాడే ఒక సైకిల్ని కొని అతడికి కానుకగా ఇచ్చారు! కష్టపడటం అతడి వెలుగైతే, అతడి కష్టాన్ని ఆ దంపతులు గమనించడం అతడిపై ప్రసరించిన వెలుగు. ఒక పోలీస్ అధికారి బంద్ డ్యూటీలో ఉన్నాడు. మధ్యాహ్నం అయింది. డ్యూటీలో ఉన్న చోటే ఒక అరుగు మీద భోజనానికి కూర్చోబోతుండగా ఒక వ్యక్తి దగ్గరగా వచ్చి నిలుచున్నాడు. అతడికి ఆకలిగా ఉన్నట్లు గ్రహించాడు ఆ పోలీస్ అధికారి. ‘తింటావా?’ అని అడిగాడు. ‘తింటాను’ అన్నట్లు తలూపాడు ఇల్లూ వాకిలీ లేని ఆ వ్యక్తి. పోలీస్ అధికారి తెప్పించుకున్న అన్నం పొట్లంలోనే ఇద్దరూ కలిసి చేతులు పెట్టి భోజనం చేశారు! పంచే బుద్ధి పోలీస్ ఆఫీసర్లోని వెలుగైతే, దాన్ని బయటికి కనిపించేలా చేసిన వెలుగు ఆ ఆకలిగొన్న వ్యక్తి. ఇలాంటివి జరక్కపోతే పోలీసు చొక్కాపై నక్షత్రాలను తప్ప పోలీసు మనసు లోపలి నక్షత్రాలను చూడగలమా?! మనుషుల్లోపల్లోపల సాటి మనుషులంటే ఇంతింత ప్రేమ ఉంటుందే.. మరి అదంతా కనిపించకుండా ఎక్కడికి పోతుంది? ఎక్కడీ పోదు. ఎక్కడి నుంచో, ఏ రూపంలోనో ఓ కాంతి ధార వచ్చి పడితేనే కానీ ఆ మానవ నక్షత్రాల్లోని ప్రేమ వెలుగు పైకి కనిపించదు. మనుషులు ధరించే నిర్దయ, నిరాదరణ అనే కవచాలు మనుషుల మీద అనుమానంతోనే కానీ అవేవీ సహజ కవచాలు, కుండలాలు కావు. సాటి మనిషి అవసరానికి అవి తునాతునకలైపోయి హృదయకాంతి బయపడినప్పుడు గానీ అప్పటి వరకు వారు పండ్ల గెలలు, ధాన్యపు బస్తాలు, పెళ్లి సంబంధాలు మోస్తున్నట్లు తెలియదు. జ్ఞానులు సైతం క్రీస్తు జననాన్ని నక్షత్రం ద్వారానే గుర్తించగలిగారు. మనిషిలోని దైవత్వాన్ని గుర్తించడానికి ప్రతి మనిషీ అంతటి నక్షత్రం అయి ఆ కాంతిని లోకానికి బాటగా వేయాలి. తాతకు తోడుగా..! క్రిస్మస్ తాత నివాసం దక్షిణధ్రువంలో ఉంటుందని ప్రపంచం అంతా భావిస్తుంటే.. నెదర్లాండ్స్ ప్రజలు మాత్రం ఆయన స్పెయిన్ దేశంలో ఉంటాడని నమ్ముతారు. క్రిస్మస్ తాతను ఇంగ్లిషులో శాంటాక్లాస్ అంటాం కదా. శాంటాక్లాస్ అన్నది నెదర్లాండ్స్ వాళ్లు మాట్లాడే డచ్ భాషా పదం. వాళ్ల దేశం నుంచి శాంటాక్లాస్ అనే మాట వచ్చింది కాబట్టి, శాంటాక్లాస్ది స్పెయిన్ అని చెబుతున్న డచ్‌వాళ్ల మాటను మనం పూర్తిగా కాదనేందుకు లేదు. డచ్వాళ్లకు ఇంకో నమ్మకం కూడా ఉంది. క్రిస్మస్ గిఫ్టులు ఇవ్వడానికి శాంటాక్లాజ్ ఒక్కడే వస్తాడని మనం అనుకుంటాం. కానీ కాదట. ఆయన పక్కన ఆయనకు సహాయకులుగా కొన్ని ‘పిల్ల శాంటాలు’ ఉంటారట. వాళ్లేం చేస్తారంటే.. గిఫ్టులు ఇవ్వడానికి క్రిస్మస్‌తాతతో పాటు ఇళ్లకు వెళ్లినప్పుడు అక్కడ పిల్లలెవరైనా తుంటరి పనులు చేస్తే వాళ్లను అమాంతం ఎత్తుకుని తెచ్చేసి స్పెయిన్‌లో వదిలేస్తారట! అంతకుమించిన శిక్ష ఉండదని నెదర్లాండ్స్ వాళ్లు అంటారు! బాల యేసుకు దుప్పటి రాత్రి పెట్టిన క్రిస్మస్ చెట్టు మీద తెల్లారే సాలెగూడు కనిపిస్తే ఏదో అదృష్టం వరించబోతోందని జర్మనీ, పోలండ్, ఉక్రెయిన్ దేశాలలో ఒక విశ్వాసం ఉంది. బేబీ జీసెస్ కోసం ఆ సాలె పురుగు దుప్పటి నేస్తూ ఉంటుందని కొందరి నమ్మకం. ఆ సాలెగూడు ఉదయాన్నే సూర్య కిరణాలు సోకి బంగారు, వెండి సాలెగూడుగా మారిపోతుందని మరికొందరి నమ్మకం. మన దగ్గర మార్కెట్ నుంచి కొని తెచ్చుకున్న రెడీమేడ్ క్రిస్మస్ ట్రీలో ఏ మూలో సాలెగూడు కూడా ఉండటానికి ఇదే కారణం అయి ఉండొచ్చు. ఈ నమ్మకం గురించి తెలిసినవాళ్లు క్రిస్మస్ చెట్టుకు తప్పని సరిగా ఒక ప్లాస్టిక్ సాలెగూడును సంపాదించి తగిలిస్తారు. అలా కూడా అదృష్టం కలసి వస్తుందని కొందరు విశ్వసిస్తారు. పసి మనసులు కొన్ని పాశ్చాత్య దేశాలలో.. ముఖ్యంగా జర్మనీలో ఒక అందమైన విశ్వాసం ఉంది. క్రిస్మస్కు కొద్ది గంటల ముందు.. కల్లాకపటం తెలియని స్వచ్ఛమైన పసి హృదయాలు జంతువుల మాటల్ని వినగలుగుతాయట! అంతేకాదు, నదులు ద్రాక్ష సారాయిగా మారడాన్ని ఆ పసివాళ్ల కళ్లు చూడగలుగుతాయి. క్రిస్మస్ ట్రీకి వాళ్ల కళ్లముందే తియ్యటి బేరీ పండ్లు కాస్తాయి. పర్వతాలు తెరుచుకుని వాటి గర్భంలోని మణులు మాణిక్యాలు బయటపడతాయి. సముద్రపు అడుగునుంచి దేవుని గంటలు ధ్వనిస్తాయి. నిజంగా ఇలా జరిగితే ఎంతమందిమి చూడగలుగుతాం? మనలో ఎన్ని పవిత్రమైన హృదయాలు ఉంటాయి అని ప్రశ్న?! గంటకు 60 లక్షల మైళ్లు! క్రిస్మస్తాత తెచ్చే గిఫ్టుల కోసం ఎదురు చూసే పిల్లలు ప్రపంచవ్యాప్తంగా 70 కోట్ల మంది వరకు ఉంటారని అంచనా. మరి వారందరికీ గిఫ్టులు చేరవెయ్యాలంటే క్రిస్మస్ తాతకు టైమ్ సరిపోతుందా? సరిపోతుంది. గంటకు అరవై లక్షల మైళ్ల వేగంతో ప్రయాణిస్తే చాలు. అన్ని దేశాల్లోని అందరి పిల్లలకు గిఫ్టులు అందినట్లే. యు.ఎస్.లోని యూనివర్శిటీ ప్రొఫెసర్ ఒకరు వేసిన లెక్క ఇది. ఎక్స్‌మస్ క్రిస్మస్ని ఎక్స్‌మస్ అని కూడా అంటుంటాం. ఎందుకిలా? ఎప్పుడైనా మీకు డౌట్ వచ్చిందా? మీకు వచ్చినా రాకున్నా ఎక్స్‌మస్ అన్నది మాత్రం క్రిస్మస్ నుంచే వచ్చింది. అబ్రివేషన్‌గా వాడుతున్నాం. ఇలా ఇష్టమొచ్చినట్లు వాడితే సరిపోయిందా? లాజిక్ ఉండొద్దా? ఉంది! గ్రీకు భాషలో ఛిజిజీ ని గీ తో సంకేతపరుస్తారు. అందుకే క్రైస్ట్, క్రిస్టోస్ అనే మాటలకు ముందు వాళ్లు గీ అని రాస్తారు. అలా క్రిస్మస్.. ఎక్స్‌మస్ అయింది. బాతు చెట్లు మొదట్లో క్రిస్మస్ చెట్టును బాతు ఈకలతో చేసేవాళ్లు. ఆ ఈకలకు పచ్చరంగు వేసేవారు. 19వ శతాబ్దంలో జర్మనీలో ఇలా చేయడం మొదలైంది. అప్పట్లో అక్కడ అడవుల నరికివేత విపరీతంగా ఉండటంతో చెట్లకు కరువొచ్చింది. దాంతో బాతు ఈకల ఆలోచన వచ్చింది వాళ్లకు. తర్వాత్తర్వాత బాతు ఈకలతో క్రిస్మస్ చెట్లను తయారు చేయడమన్నది అమెరికాకు, ఇతర దేశాలకూ వ్యాపించింది. కెంటకీ ఫర్ క్రిస్మస్ జపాన్‌లో క్రిస్మస్ రోజు కె.ఎఫ్.సి.లు కిటకిటలాడిపోతుంటాయి. అక్కడ క్రైస్తవుల సంఖ్య పెద్దగా ఉండదు కానీ, క్రిస్మస్ రోజు అంతా కె.ఎఫ్.సి.ల దారి పడతారు. కె.ఎఫ్.సి. అంటే కెంటకీ ఫ్రైడ్ చికెన్. అయితే 1947లో కె.ఎఫ్.సి. తన సేల్స్ పెంచుకోవడం కోసం ‘కెంటకీ ఫర్ క్రిస్మస్’ అనే మార్కెటింగ్ వ్యూహం పన్ని సక్సెస్ అయ్యింది. అప్పట్నుంచీ క్రిస్మస్ సీజన్లో జపాన్వారికి పండగే పండుగ. కె.ఎఫ్.సి. వారి నోరూరించే ఆఫర్లు కడుపునిండా ఉంటాయి. -
సఖ్యతకు తరుణం
తెగిపోయిన అనుబంధాల్ని ఈ ‘క్రిస్మస్’ రోజు పునరుద్ధరించుకోవడమే ప్రధాన ధ్యేయంగా పెట్టుకోండి. లోకంలో చాలా తేలికైన పని బయట పరిచర్య సాగించడం. చాలా కష్టమైన పని తల్లిదండ్రులు, తోబుట్టువులతో సఖ్యత కలిగి ఉండటం. యేసు స్థాపించబూనిన దైవికరాజ్యంలో మీరు భాగం కావాలంటే తొలి అడుగుగా మీ అనుబంధాల్ని పునరుద్ధరించుకొని పటిష్టం చేసుకోండి. హ్యాపీ క్రిస్మస్!! దేవుడు తన అద్వితీయ కుమారుడైన, తనకు మానవ రూపమైన యేసుక్రీస్తు సారథ్యంలో నిర్మించి, ప్రపంచవ్యాప్తంగా విస్తరించ తలపెట్టిన ‘దైవిక రాజ్యం’ ఆవిష్కరణకు అలనాటి యూదా దేశం (నేటి ఇజ్రాయేలు దేశంలోని దక్షిణ భూభాగం) లోని బేత్లెహేము వేదికగా రంగమంతా సిద్ధమయ్యింది. అంతటి మహత్తరమైన పరిణామానికి రెండువేల ఏళ్ల క్రితం, యూదయ అనే ఒక ఎడారి ప్రాంతాన్ని, తరుచు క్షామాలకు లోనయ్యే అక్కడి బెత్లేహేము అనే పేద గ్రామాన్ని, యేసుక్రీస్తుకు ఇహలోకపు తల్లిదండ్రులుగా యూదా వంశీయుడైన యోసేపు, లెవీ వంశీయురాలైన మరియ అనే నిరుపేదలను, యేసు ఆవిర్భావ సువార్త ప్రచారకులుగా బేత్లెహేముకే చెందిన కొందరు నిరుపేద గొర్రెల కాపరులను, దేవుడు తన అనాది సంకల్పంలో భాగంగా ఏర్పర్చుకున్నాడు. పెను విషాదమేమిటంటే, పుడమినేలేందుకు వచ్చిన పరలోకపు రాజైన యేసుకు ఎక్కడ చూసినా పేదరికం, దారిద్య్రమే తాండవించే యూదయ దేశపు బెత్లేహేములో, అక్కడి సత్రంలోనైనా కనీసం కాసింత చోటు దొరకలేదు. అందువల్ల అక్కడి పశువుల కొట్టంలోనే ప్రభువు జన్మించాడు, పశువులు దాణా తాగేందుకు వాడే ఒక పశువుల తొట్టి ఆయనకు మెత్తటి పూలపాన్పుగా పనికొచ్చింది. మునుపటి రాజ్యానికి భిన్నంగా.. నిరుపేదలు, నిర్భాగ్యులు, నిరాశ్రయులే ప్రధాన పౌరులుగా ఏర్పాటుచేయ తలపెట్టిన దైవిక రాజ్యాన్ని.. ఇలా పేదరికంలోనే దేవుడు నిర్మించ తలపెట్టాడు. దైవిక రాజ్యస్థాపన కోసం యేసుక్రీస్తు ప్రధాన సైన్యాధికారిగా, పేదలు, బలహీనులే ఆయనకు విధేయులైన సైన్యంగా గత రెండువేల ఏళ్లుగా సాగుతున్న సమరంలో రక్తపుటేరులు కాదు.. ప్రేమ, క్షమాపణ అనే జీవనదులు పొంగి పారుతున్నాయి. చరిత్రలో దుర్నీతి, దౌర్జన్యం, దుష్టన్యాయమే ఇతివృత్తంగా సాగి నిరుపేదల దోపిడీ కి పెద్దపీట వేసిన సామ్రాజ్యాలకు ప్రత్యామ్నాయంగా ప్రభువు తన దైవిక రాజ్య స్థాపన కోసం ‘్రౖకైస్తవాన్ని’ తన సాత్విక ఆయుధంగా ఎంచుకున్నాడు. క్రీస్తు సారథ్యంలోని ‘క్రైస్తవం’ దేవుని రాజ్యానికి ప్రతీక. అందువల్ల అవినీతికి, ఆశ్రితపక్షపాతానికి, ఆడంబరాలకు, ధనాపేక్షకు అతీతంగా క్రీస్తును పోలి జీవించే వారే క్రైస్తవం లో పౌరులు. మరి దీనికంతటికీ భిన్నంగా బోధిస్తూ, జీవిస్తూ ఉన్నవాళ్లు ఎవరు? యేసుప్రభువు పరిభాషలో చెప్పాలంటే, వాళ్లు గోధుమల మధ్య ‘శత్రువు’ కుట్రతో పెరుగుతున్న ‘గురుగులు’ (మత్తయి 13:27)!! శత్రువులు రెండు రకాలు. ఎదురుగా నిలబడి మనతో యుద్ధం చేసే శత్రువు ఒకరైతే, దొంగచాటు దెబ్బలతో మనిషిని పడగొట్టే శత్రువు మరొకరు. చెట్లతో కిక్కిరిసి ఉన్న కీకారణ్యంలో నడిచే బాటసారులను, వేటగాళ్లను కింద గడ్డిలో దాక్కొని అకస్మాత్తుగా మడిమె మీద కాటేసి చంపే విషసర్పం లాంటి వాడు ‘సైతాను’ అని పిలిచే ఈ శత్రువు. గోధుమల మధ్య గురుగులు విత్తే అలవాటున్న శత్రువు.. కుటుంబాల్లో, చర్చిల్లో, చివరికి క్రైస్తవ సమాజంలో, మానవ సంబంధాల్ని కలుషితం చేసి చిచ్చు పెట్టడంలో దిట్ట. అందుకే ఈ ‘క్రిస్మస్’ లో తెగిపోయిన అనుబంధాల్ని పునరుద్ధరించుకోవడమే ప్రధాన ధ్యేయంగా పెట్టుకోండి. లోకంలో చాలా తేలికైన పని బయట పరిచర్య సాగించడం. చాలా కష్టమైన పని తల్లిదండ్రులు, తోబుట్టువు లతో సఖ్యత కలిగి ఉండటం. యేసు స్థాపించబూనిన దైవికరాజ్యంలో మీరు భాగం కావాలాంటి తొలి అడుగుగా మీ అనుబంధాల్ని పునరుద్ధరించుకొని పటిష్టం చేసుకోండి. హ్యాపీ క్రిస్మస్!! – రెవ.డా.టి.ఎ.ప్రభుకిరణ్ -
క్రిస్మస్ సందడి
-
అందుకే క్రిస్మస్ ట్రీకి వీటిని వేలాడదీస్తారు!
ప్రపంచ వ్యాప్తంగా జరిగే ముఖ్యమైన పండుగలలో ముందు వరుసలో నిలిచేది క్రిస్మస్. ప్రపంచంలోని పలు దేశాల్లో పలు క్రిస్మస్ ఆచారాలు ఉన్నాయి. అందులో కొన్ని ఎప్పుడో పురతాన కాలంలో ప్రారంభం కాగా, మరికొన్ని నూతనంగా ప్రవేశించాయి. ఈ క్రిస్మస్కు వారు ఎలాంటి ఆచారాలు పాటిస్తారో అవి ఎలా పుట్టుకొచ్చాయో తెలుసుకుందాం రండి. క్రిస్మస్ ట్రీకి ఎందుకు ‘షూ’ బోమ్మలను ఉంచుతారో తెలుసా.. క్రిస్మస్ చెట్టుకు క్రిస్మస్ తాత ‘షూ’ను వేలాడదీసి కట్టడం మీరు చూసే ఉంటారు. కొన్ని ప్రాంతాల్లో క్రిస్మస్ పండుగకు టపాసులు కాలుస్తారు. కానీ కేవలం పిల్లలు మాత్రమే ఈ టపాసులను కాలుస్తారు. ఓ నిరుపే దవ్యక్తికి ముగ్గురు కూతుళ్లు ఉన్నారు. అయితే క్రిస్మస్ రాగానే వారు తమ తండ్రి టపాసులు కావాలని అడిగారు. అయితే ఆ తండ్రి ఇప్పడు వద్దమ్మా తరువాత కొనిస్తాను అని చెప్పాడు. చుట్టుపక్కల పిల్లలు టపాసులు కాల్చడం చూసి తమకూ కావాలని వారు పట్టుబట్టారు. కానీ తండ్రి వద్ద కొనడానికి డబ్బులే లేవు. ఎలాగైనా సరే అవి మాకు తెచ్చి పెట్టు అంటూ పిల్లులు మారాం చేశారు. అలా ఏడుస్తున్న పిల్లలు టపాసుల శబ్థం వచ్చి బయటికి వచ్చి చుశారు. అక్కడ వారి ఇంటి ముందు ‘షూ’లో బోలేడన్ని బహుమతులు, టపాసులు పెట్టి ఉండటం వారు గమనించారు. ఇవి ఎవరు తెచ్చారా అని చుట్టూ చూసిన వారు ఎరుపు రంగు ఉలను టోపి, అదే రంగులో ఉన్ని కోటును ధరించి చేతి కర్రతో వెలుతున్న ఓ ముసలి వ్యక్తిని చూశారు. అలా చూస్తూ ఉండగానే ఆయన మంచులో మాయమైపోయాడు. ఆ తర్వాత వారు ఇంటి లోపలికి వెళ్లి వాళ్ల నాన్నతో క్రిస్మస్ తాత వచ్చి మాకు టపాసులు ఇచ్చాడంటూ సంబర పడిపోయారు. అలా అప్పటీ నుంచి ప్రతి క్రిస్మస్కు పిల్లలందరూ క్రిస్మస్ చెట్లకు, ఇంటి ముందు ‘షూ’ను వెలాదీసీ ఉంచడం మొదలు పెట్టారు. ఎందుకంటే క్రిస్మస్ తాత వచ్చి వాటిలో క్రిస్మస్ బహుమతులు, టపాసులు పెట్టి వెడతాడని వారి నమ్మకం. రాను రానూ క్రిస్మస్ ట్రీకి ‘షూ’ను వేలాడదీయడం ఆనవాయితీగా మారింది. జర్మనీ రాజు తెచ్చిన గ్రీటింగ్ కార్డులు: 1843లో ఇంగ్లాండు దేశానికి చెందిన సర్ హెన్నీ కోల్ తన బంధు మిత్రులకు క్రిస్మస్ శుభాకాంక్షలు వినూత్న రీతిలో తెలపాలని అనుకున్నాడు. వెంటనే కొన్ని కార్డులను తయారు చేసి దాని మీద క్రిస్మస్, నూతన సంవత్సర శుభాకాంక్షలు అని రాయించాడు. వాటిని తన మిత్రులకు పంపడంతో ఈ ఆచారం పుట్టుకొచ్చింది. కార్డులు ఒక్కసారి ఇస్తే అవి జీవితాంతం దాచుకుంటారు. అనుకోని సంఘటనలు ఎదురైతే తప్ప వాటిని కోల్పోరు కదా. అందుకే ఈ గ్రీటింగ్ కార్డులు ఇస్తే అవి ఎప్పటికీ తీపి గుర్తులుగా ఉండిపోతాయి.. ఇది మంచి ఆలోచన. ఎప్పటికీ ఎండిపోని ఫిర్ చెట్టు(క్రిస్మస్ ట్రీ).. క్రిస్మస్ చెట్టు ఆచారం జర్మనీ నుంచి పుట్టుకొచ్చింది. సాధారణంగా ఫిర్ చెట్టును క్రిస్మస్ చెట్టుగా అలంకరిస్తారు. ఈ చెట్టుకు ఒక ప్రత్యేకత ఉంది. ఇది అన్ని కాలాల్లోనూ ఎండిపోకుండా పచ్చగా ఉంటుంది.అలాగే మన జీవితాల్లో కూడా దేవుని దీవెనలను అలాగే ఉండాలన్న ఆలోచనలతో ఈ ఆచారం పుట్టుకొచ్చింది. 1846లో విక్టోరియా రాణి, జర్మనీ రాకుమారుడు అల్బర్ట్‌ను కలసి అలంకరించిన క్రిస్మస్ ట్రీ పక్కన నిలుచుని ఫొటో దిగారు. అతి అన్ని వార్తాపత్రికలలో ప్రచురితం కావడంతో క్రిస్మస్ ట్రీ డిమాండ్ పెరిగింది. అనంతరం జర్మన్ ప్రజలు అమెరికాలో స్థిరపడటం వల్ల అమెరికాలో కూడా ఈ ఆచారం వాడుకలోకి వచ్చింది. చైనాలో అతిపెద్ద క్రిస్మస్ సిజన్ షాపింగ్ : క్రిస్మస్ సీజన్లో చైనాలో అత్యధిక కొనుగోళ్లు జరుగుతాయి. ఆ దేశంలో జరిగే అతి పెద్ద షాపింగ్ సీజన్ క్రిస్మస్ ముందు రోజే. క్రిస్మస్ ఆచారాల్లో అక్కడక్కడా కనిపించే యాపిల్ పండ్ల ఆచారం చైనా నుంచే వచ్చింది. మండారిన్ భాషలో యాపిల్ పండు ఉపయోగించే పదరం క్రిస్మస్ ఈవ్‌కు దగ్గరగా ఉంటుంది. అందుకే అక్కడ యాపిల్‌తో చేసిన అలంకరణలకు ప్రాధాన్యం ఎక్కువగా ఉంటుంది. ముందు రోజు ఉపవాసం: క్రిస్మస్ ముందు రోజైన డిసెంబర్ 24న రష్యన్ ప్రజలు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉపవాసం చేస్తారు. సాధారణంగా సూర్యుడు వెళ్లిపోయి చుక్కలు కనిపించినప్పుడు మాత్రమే ఆహారాన్ని భుజిస్తారు. అయితే మాంసం మాత్రం ముట్టుకోరు. కుత్యా అనే వంటకం అక్కడ ఫేమస్. ఆ వంటకంలో వివిధ రకాలైన ధాన్యాలు, తెనె, వంటి విత్తనాలు వేసి తయారు చేస్తారు. అయితే ఉపవాసం విరమించేటప్పుడు బోధకులు వారి ఇళ్లకు వెళ్లి వాటిపై పవిత్ర జలం చల్లి ప్రార్థనలు చేసిన తర్వాతే దానిని స్వీకరిస్తారు. - స్నేహలత (వెబ్ డెస్క్) -
క్రిస్మస్: దారి చూపిన స్టార్
సాక్షి, నాగార్జునసాగర్(నల్గొండ) : క్రిస్మస్ పండుగను పురస్కరించుకొని క్రైస్తవులు ఇంటింటికీ పైభాగాన క్రిస్మస్ స్టార్‌ను అమర్చుతారు. సెమి క్రిస్మస్ నుంచి ఈ స్టార్స్‌ను ఏర్పాటు చేస్తారు. బుధవారం క్రిస్మస్ పండుగ ఉండటంతో నందికొండ మున్సిపాలిటీ కాలనీల్లో ఉన్న అన్ని ప్రముఖ ఫ్యాన్సీ షాపుల్లో క్రిస్మస్ స్టార్స్ విక్రయించేందుకు సిద్ధంగా ఉంచారు. క్రీస్తు జన్మించిన స్థలానికి మార్గం చూపిన తారగా దీనిని భావిస్తారు. క్రిస్మస్ సార్స్ ప్రాధాన్యత... క్రిస్మస్ స్టార్స్ గురించి పూర్వీకులు ఈ విధంగా చెప్పారు. ఏసుక్రీస్తు జన్మించిన వెంటనే ఆకాశంలో ఒక కొత్త నక్షత్రం పుట్టింది. మిగతా నక్షత్రాలకంటే అత్యంత ప్రకాశవంతంగా వెలుగుతున్న ఆ నక్షత్రం వైపే అందరి దృష్టిపడింది. ఆకాశంలో ఏదైన కొత్తగా ప్రకాశవంతంగా పుట్టిందని జగతిని కాపాడేందుకు గొప్పవారు జన్మించినట్టే అనే నమ్మకంతో ఆ తార వైపు పయనించసాగారు. తూర్పుదేశ జ్ఞానులు ఆకాశంలో ప్రకాశిస్తున్న తార ఎటు కదిలితే అటు పయనించారు. ఈ నక్షత్రం జెరుసలెంలోని బెత్లహంలో పశువులకొట్టం వద్ద తనప్రయాణాన్ని ఆపింది. పశువుల కొట్టం వద్ద తూర్పుదేశ జ్ఞానులు అప్పుడే జన్మించిన ఏసును కనుగొన్నారు. ఈ విధంగా పలుప్రాంతాలకు చెందిన వారు జగతి మేలుకోసం జన్మించిన ఏసుకు కానుకలుగా బంగారం, సాంబ్రాణి, సుగంధ పరిమళాలతో కూడిన బోళమును సమర్పించారు. అప్పటినుంచి క్రైస్తవుల్లో నక్షత్రానికి ప్రాధాన్యత ఏర్పడింది. క్రీస్తు జన్మించిన ప్రదేశానికి దారి చూపిన నక్షత్రానికి గుర్తుగా అందరూ తమ ఇళ్లల్లో క్రిస్మస్ స్టార్స్ ఏర్పాటు చేస్తారు. క్రిస్మస్కు నెలరోజుల ముందుగానే ఈ స్టార్‌ను ఉంచుతారు. క్రిస్మస్ను తెలియజేస్తుంది క్రిస్మస్ పండుగకు ముందు క్రైస్తవులందరూ తమ ఇళ్లల్లో స్టార్స్‌ను ఉంచుతారు. అర్థమవుతుంది. చాలా సంతోషంగా ఈ క్రిస్మస్ పండుగను జరుపుకుంటాం. – డి.కోటేశ్వర్రావు, సాగర్ అధిక సంఖ్యలో ఆరాధించే దేవుడు క్రీస్తు అధికసంఖ్యలో ఆరాధించే దైవం ఏసు క్రీస్తు. ప్రతి క్రైస్తవుడు ఘనంగా జరుపుకునే ఈ పండుగలో క్రిస్మస్ స్టార్‌కు అధిక ప్రాధాన్యత ఇస్తాం. ఇంటి ఎదుట క్రిస్మస్స్టార్ను అలంకరించగానే ఇంట్లో పండుగ వాతావరణం వచ్చేస్తుంది. – విజయప్రభావతి, హిల్‌కాలనీ -
ఒక్కో చర్చి ఎంతో ఘన కీర్తి
రాష్ట్రంలోనే రెండో పెద్దది సీఎస్ఐ కొత్తగూడెంటౌన్: కొత్తగూడెం పట్టణంలోని సెయింట్ ఆండ్రూస్ సీఎస్ఐ చర్చి రాష్ట్రంలోనే రెండో పెద్ద చర్చిగా గుర్తింపు పొందింది. డోర్నకల్ డయాసిస్‌లో అతిపెద్దది. 1943లో బ్రిటిష్ కాలంలో కొత్తగూడెంలో 15 కుటుంబాలతో ఏర్పడిన సంఘం ఆధ్వర్యంలో పోస్టాఫీస్ సెంటర్లో నిర్మించారు. 2005లో రూ.1.60కోట్ల విరాళాలతో ఆధునిక పద్ధతిలో తిరిగి నిర్మించి పునఃప్రారంభించారు. జిల్లా కేంద్రంలో ప్రధానమైన కట్టడంగా గుర్తింపును సంతరించుకుంది. ఒకేసారి మూడువేల మంది ప్రార్థనలు చేయొచ్చు. ప్రతి ఆదివారం జన సందోహంగా మారుతుంది. రాష్ట్రంలోని వివిధ జిల్లాలు, విదేశాల నుంచి కూడా వచ్చి సందర్శిస్తుంటారు. వేడుకలకు సిద్ధం చేశాం.. ప్రతి ఏడాది ఇక్కడ క్రిస్మస్ పండుగను ఎంతో ఘనంగా జరుపుకుంటాం. ఏసు జీవిత చరిత్రను భక్తులకు వివరించేందకు ప్రత్యేకంగా ఏర్పాట్లను చేశాం. ఈ చర్చికి ప్రతి ఆదివారం రాష్ట్ర నలుమూలల నుంచి క్రైస్తవ భక్తులు వస్తుంటారు. – టి.జాన్సన్, సీఎస్ఐ చర్చి చైర్మన్ కరుణగిరి.. ఖమ్మంరూరల్: మండలంలోని నాయుడపేట నుంచి మొదలై..అటు బైపాస్ రోడ్డుకు ఆనుకుని ఉన్న కరుణగిరి చర్చి ఎంతో ప్రఖ్యాతిగాంచింది. ఇక్కడ గత 20 ఏళ్ల నుంచి క్రైస్తవులు విశేష ప్రార్థనలు చేస్తున్నారు. ఆధునిక నిర్మాణ పద్ధతి ఆకట్టుకుంటుంది. ప్రతి ఆదివారం వందలాదిగా క్రైస్తవులు ఇక్కడికి వస్తుంటారు. విశాల ఆహ్లాద ప్రాంగణం దీని మరో ప్రత్యేకత. ఖమ్మంనగరంతో పాటు కూసుమంచి, తిరుమలాయపాలెం, ఖమ్మంరూరల్, మరిపెడ మండలాల నుంచి ఇక్కడికి తరలివస్తుండడం విశేషం. లివింగ్ గాస్పెల్ చర్చి.. పాల్వంచ: పట్టణంలోని కాంట్రాక్టర్స్ కాలనీలో ఉన్న లివింగ్ గాస్పెల్ చర్చ్ (ఎల్జీఎం) ఇండిపెండెంట్ చర్చిల్లోనే అతి పెద్దదిగా గుర్తింపుపొందింది. 1984లో సింగరేణి సంస్థలో ఉద్యోగాన్ని వదిలి పాస్టర్ లిటిల్ దేవసహాయం నలుగురైదుగురు భక్తులతో లివింగ్ గాస్పెల్ చర్చిని బాపూజీ నగర్లో ప్రారంభించారు. నేడు వేలాది మంది భక్తులు ఇక్కడికి వస్తున్నారు. లిటిల్ దేవసహాయం కుమారుడు సాధు టైటస్ లివింగ్ వాటర్ వివాహం చేసుకోకుండా దైవ సేవ చేయాలనే తలంపుతో పాస్టర్‌గా మారారు. ఆయన కాంట్రాక్టర్స్ కాలనీలో అధునిక పద్ధతుల్లో చర్చిని నిర్మింపజేసి 2016 జనవరి7వ తేదీన ప్రారంభించారు. ఉభయ జిల్లాల నుంచి ఇక్కడికి వేలాదిమంది వస్తుంటారు. ప్రతి మంగళ, శుక్ర, ఆదివారాల్లో ప్రత్యేక ప్రార్థనలు జరుగుతుంటాయి. టైటస్ లివింగ్ వాటర్ పేదలు, అనారోగ్యంతో ఉన్న వారికి, అనాథలకు తన వంతు సహకారం అందిస్తున్నారు. యేసు ప్రేమను చాటడమే లక్ష్యం యేసు క్రీస్తు చూపిన ప్రేమను చాటడమే నా లక్ష్యంగా భావిస్తున్నా. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా తమ వంతు కృషి చేస్తున్నాం. అనుబంధంగా జిల్లాలో ఐదు చర్చిలు, చత్తీస్‌గఢ్ రాష్ట్రంలో నాలుగు చర్చిలు ఉన్నాయి. మాకు ఇతర ఏ సంస్థల నుంచి ఎలాంటి ప్రొత్సాహం లేదు. స్వతహాగా ఇక్కడి భక్తుల సహకారంతో ముందుకు సాగుతున్నాం. – సాధు టైటస్ లివింగ్ వాటర్, పాస్టర్ అద్భుతం..లూర్థుమాత ఆలయం తల్లాడ: రాష్ట్రీయ రహదారి పక్కనే తల్లాడలో ఉన్న జిల్లాలోనే అతి పెద్ద చర్చిల్లో ఒకటిగా లూర్థుమాత ఆలయం పేరెన్నికగన్నది. 21 సంవత్సరాల క్రితం రోమన్ కేథలిక్ మిషన్ ఆధ్వర్యంలో నిర్మించారు. ఒకేసారి మూడువేల మంది ప్రార్థనలు చేయొచ్చు. అద్భుతమైన కల్వరి కొండలు, ఏసుక్రీస్తు జీవితానికి సంబంధించిన విశేషాలు, లూర్థమాతా చిత్రపటాలు ఎంతో ఆకర్షణీయంగా ఉంటాయి. చర్చిగోపురం 150 అడుగుల ఎత్తులో ఉంటుంది. ఆలయం గంట మోగినప్పుడు కిలోమీటరుకుపైగా వినిపిస్తుంది. ప్రాంగణం ప్రశాంతంగా ఉంటుంది. క్రిస్మస్ అంటే క్రీస్తు ఆరాధనే.. బాల యేసు పశువుల పాకలో జన్మించడం ఒక అద్భుత కార్యం. అలాంటి రోజును అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకోవడమే కిస్మస్. క్రైస్తవులకు ఇదే పెద్ద పండుగ. కులమత బేధాలకు తావులేకుండా ఎంతో ఆనందంగా, సంతోషంగా జరుపుకోవాలి. – పుట్టి రాజేంద్రప్రసాద్, లూర్థుమాత ఆలయం విచారణ గురువు, తల్లాడ ఆకట్టుకునే ఆర్సీఎం పాల్వంచ: స్థానిక ఆర్సీఎం చర్చిని కేరళకు చెందిన గోర్తిక్ ఆర్ట్ విధానంలో కట్టారు. కేరళ రాష్ట్రానికి చెదిన ఆగస్టీన్ అనే ఆర్కిటెక్ట్ దీనికి రూపకల్పన చేయగా అప్పటి ఫాదర్ బెనడిక్ట్ ఆధ్వర్యంలో 2013 జూన్ 8న చర్చిని పునఃప్రారంభించారు. దేవ దూతల విగ్రహాలు, ఏసు ప్రతిమలు, ఆయన శిష్యుల విగ్రహాలు ఎంతో ఆకట్టుకుంటాయి. తెల్లవారేదాకా ప్రార్థనలు 24వ తేదీ రాత్రి 11 గంటల నుంచి 25వ తేదీ తె ల్లవారుజాముదాకా..క్రిస్మస్ ప్రార్థనలు ఉంటాయి. మళ్లీ 31వ తేదీ రాత్రి నుంచి ప్రేయర్ చేయిస్తాం. భక్తులకు సౌకర్యాలు ఏర్పాటు చేశాం. ఇంకా ప్రత్యేక సందర్భాలను కూడా నిర్వహిస్తుంటాం. – ఆంథోని కడే పరంబిల్, చర్చి ఓసీడీ -
ఏసు ప్రాణత్యాగానికి ప్రతీకగా..
ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రైస్తవులు ఎంతో సంబరంగా జరుపుకునే పండుగ క్రిస్మస్. ఏసుక్రీస్తు జన్మదినం (డిసెంబర్ 25) సందర్భంగా జరుపుకునే పండుగ ఇది. ఏసుక్రీస్తు పుట్టిన రోజు కాబట్టి క్రైస్తవులంతా చర్చిలకి వెళ్లి ఆయన జన్మదినాన్ని అంగరంగ వైభవంగా జరుపుకుంటారు. ఈ క్రమంలో క్రైస్తవుల పవిత్ర ప్రార్థనా మందిరాలైన చర్చిలను ఆ రోజు రంగు రంగు లైట్లతో, క్రిస్మస్ ట్రీతో అలంకరిస్తారు. అలాగే ప్రముఖ దేశాలైన లండన్, యురప్లలోని చర్చిలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. భిన్నమైన రూపశైలిలో అద్బుత కట్టడాలుగా పేరున్న ఈ చర్చిలకు ఓ విశేషమైన ప్రత్యేకత ఉంది. వాటి నిర్మాణాల వెనుక ఎన్నో విషయాలు ఉన్నాయి. ఈ సుప్రసిద్ధ ప్రార్థనా మందిరాలు ప్రపంచ వ్యాప్తంగా పర్యటకులను ఆకట్టుకుంటున్నాయి. ఇందులోని కొన్ని చర్చిలు చాలా సినిమాలలో కూడా కనిపించాయి. బైబిల్లో పేర్కొన్న రాజుల పేర్లను, ఏసుక్రీస్తు తల్లి మరియా పవిత్రకు, ఏసు ప్రాణత్యాగానికి ప్రతీకగా బెత్లెహాంలో నిర్మించిన చర్చిలకు ప్రపంచ మందిరాలలో పవిత్రంగా చూస్తారు. అలాంటి చరిత్ర కలిగిన ఈ అద్బుత కట్టడాల గురించి ఓ సారి తెలుసుకుందాం రండి! సాగ్రడా ఫ్యామిలియా, బార్సిలోనా, స్పెయిన్ ఇది ప్రపంచ ప్రముఖ చర్చిల్లో ఒకటి. స్పెయిన్‌లోని బార్సినాలోని యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంలోని నిర్మించిన రోమన్ కాథలిక్ ప్రార్థన మందిరం. దీనిని 1882లో ప్రముఖ అర్కిటెక్చర్ ఆంటోని గౌడే నిర్మించారు. ఈ చర్చి నిర్మాణం 1882 లో ప్రారంభమైనప్పటికి దీనిని నిర్మాణం ఇప్పటికీ పూర్తి కాలేదు. అసంపూర్తిగా ఉన్నప్పటికీ ప్రపంచంలోని ప్రముఖ చర్చిలలో ఇది ఒకటిగా ఉంది. ఓ అద్భుత కళాఖండంతో నిర్మించిన ఈ మందిరానికి పర్యాటకులు ఫిదా అవుతున్నారు. ఏటా ఈ చర్చిని సందర్శించే వారి సంఖ్య లక్షల్లో ఉంటుంది. ఈ చర్చిపై నిర్మించిన 18 స్తంభాలు మందిరానికి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. అప్పటి అర్కిటెక్ గౌడే రూపొందించిన ఈ చర్చి ప్రకృతిని తలపించేలా ఉంటుంది. చర్చి లోపల నిర్మించిన స్తంభాలు మెలితిప్పినట్లుగా ఉండి కొమ్మల్లాంటి చెట్ల ఆకృతిలో ఉంటాయి. ఇవి పర్యటకులను విపరీతంతగా ఆకట్టుకుంటాయి. అలాగే చర్చి ముందు భాగంలో బేస్ వద్ద పాలరాతితో చెక్కిన రెండు తాబేళ్లు మందిరానికి ప్రత్యేక ఆకర్షణ. అవి భూమి, సముద్రాన్ని సమతుల్యం చేస్తున్నాయని చెప్పడానికి ఉదాహరణగా వాటిని అక్కడ చెక్కారు. ఇక చర్చి పైకప్పుపై చెక్కిన మొజాయిక్ నుంచి రాత్రి వేళ చర్చి లోపలికి చంద్రకాంతి పడటం వల్ల ఆ దృశ్యాన్ని చూడటానికి పర్యాటకులు ఆసక్తి చూపుతారు. చంద్రుడి కాంతితోవచ్చే వెలుగు వల్ల చర్చి బయట నుంచి చూసే వారికి ఓ లైట్ హౌజ్లా మెరిసిపోతూ ఉంటుంది. అందువల్ల దీనిని ‘లైట్ హౌజ్’ అని కూడా పిలుస్తుంటారు. అలాగే మందిరంపై నిర్మించిన 18 టవర్లకు ఒక ప్రత్యేకత ఉంది. అందులో ఒక స్తంభం కన్య మరియ మేరి మాతకు చిహ్నంగా నిర్మించగా.. 12 టవర్లను బైబిల్లో పేర్కొన్న అపొస్తులులకు ప్రాతినిధ్యం వహిస్తాయి. మరో నాలుగు స్థంభాలు వారిలోని నలుగురు సువార్తికులకు ప్రాతినిధ్యం వహిస్తాయి. ఇక మందిరంపై మధ్యలో నిర్మించిన అతిపెద్ద టవర్ ఏసుక్రీస్తును సూచిస్తుంది. 170 మీటర్ల ఎత్తులో ఉండి బార్సిలోనాలోని మౌంట్‌జ్యూక్ పర్వతం కంటే ఒక మీటర్ తక్కువగా ఉంటుంది. ఈ మౌంట్‌జ్యూక్ పర్వతం స్పెయిన్‌లో ఎత్తైనా పర్వతం. ఇప్పటికీ అసంపూర్ణంగా ఉండిపోయిన ఈ చర్చిని పర్యటించడానికి కనీసం వారం రోజులైన పడుతుంది. అయితే దీనికి ఇప్పటికీ మర్మత్తులు చేస్తూనే ఉన్నారు. అక్కడికి వచ్చే పర్యాటకులు ఈ చర్చి నిర్మాణం కోసం విరాళాలు కూడా ఇస్తుంటారు. ఎప్పుడు మరమ్మత్తులు చేస్తూ ఉన్న ఈ మందిరం 2026 నాటికి పూర్తికావచ్చు. సెయింట్ బాసిల్ కేథడ్రల్ చర్చి అత్యంత ప్రసిద్ధ చర్చిలలో ఒకటైనా ఈ సెయింట్ బాసిల్ కేథడ్రల్ చర్చిని ఒకే పునాదిపై తొమ్మిది ప్రార్థనా మందిరాలుగా నిర్మించారు. రష్యా రాజధాని మాస్కో నగరంలో ఉన్న ఈ చర్చి నిర్మాణం క్రీ.శ. 1561లో ఇవాన్ ది టెర్రిబుల్ పాలనలో పూర్తయింది. ఈ చర్చి అసాధారణమైన వివిధ రంగుల నిర్మాణాన్ని కలిగి ఉంటుంది. సాగ్రడా ఫ్యామిలియా మాదిరిగా, ఇది యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశం. ఇది పలు సినిమాల్లో కూడా కనిపిస్తుండం విశేషం. దీని లోపలి భాగంలో చాపెల్ నుంచి ఇరుకైన మెట్లు ఉండి, తక్కువ తోరణాలు, గజిబీజీ చాపెల్లతో నిర్మించబడిన ఉండటమే ఈ మందిరం ప్రత్యేకత. ఒకదానిని ఒకటి అనుకుని ఉండే ఈ చాపెల్లలోని ఒక్కోదానికి ఒక్కో ప్రత్యేకత ఉంది. అవి.. పైకప్పు మధ్యలో ఉన్న టవర్ ఏసుక్రీస్తు తల్లి మేరిమాతకు చిహ్నంగా నిర్మించి.. దీనికి చర్చి ఆప్ ది ఇంటర్సేషన్ అని పేరు పట్టారు. ఇక కనిపించే నాలుగు పెద్ద గోపురాలు అష్టభుజి ప్రార్థన మందిరాలు(చర్చ్ ఆఫ్ ది హోలీ ట్రినిటీ, చర్చ్ ఆఫ్ స్టీస్ సిప్రీయన్& జస్టీనా, చర్చ్ ఆఫ్ ది ఐకాన్ ఆఫ్ సెయింట్ నికోలాస్ ది మిరాకిల్ వర్కర్, చర్చ్ ఆఫ్ ది ఎంట్రీ ఆఫ్ ది లార్డ్ జెరుసలేం) అనే బైబిల్లోని కొన్ని పవిత్ర స్థలాలకు ప్రతికగా ఈ పేర్లన పెట్టారు. బయటి నుంచి చూస్తే చిక్కుముడిగా కనింపిచే ఈ టవర్ల మధ్యలో నాలుగు చిన్నప్రార్థన మందిరాలు ఉన్నాయి. ప్రతి ప్రార్థనా మందిరం కజాన్‌కు వ్యతిరేకంగా చేసిన పోరాటంలోని సంఘటనకు, యుద్ధానికి గౌరవసూచికగా నిర్మించారు. ఈ సెయింట్ బాసిల్ కేథడ్రల్ రంగుల నిర్మాణం నిజంగా ఓ అద్బుతంలా ఉంటుంది. ఈ చర్చి రూపకర్త సెయింట్ బాసిల్ బ్లెస్డ్ను చర్చి లోపలి ప్రార్థనా మందిరంలో సందర్శించవచ్చు. అక్కడ ఆయన విగ్రాహన్ని వెండి పేటికలో ఉంచారు. అయితే ఇలాంటి అద్బుత కట్టడం మరెక్కడా ఉండకూడదనే ఉద్దేశంతో కూలీల కళ్లు తీయించి వారిని అంధులుగా మార్చాడట. నోట్రే డామ్ డి పారిస్- ఫ్రాన్స్: నోట్రే-డామ్ డి పారిస్ అనగా ‘అవర్ లేడీ ఆఫ్ పారిస్. దీనిని సింపుల్‌గా నోట్రే-డామ్ అని కూడా పిలుస్తారు. పారిస్‌లోని అరోండిస్మెంట్లో ఓలే డి లా సిటిలో తూర్పు చివరలో ఈ చర్చిని నిర్మించారు. కన్య మరియ మేరి మాతకు పవిత్రమైన పత్రికగా దీన్ని ప్రకటించారు. ఈ కేథడ్రల్ చర్చి లోపలి విస్తీర్ణం 427-157 అడుగులు(130 నుంచి 48మీటర్లు) దీని పైకప్పు 115 అడుగుల(35 మీటర్ల) ఎత్తులో ఉంటుంది. రెండు పెద్ద గోతిక్ టవర్లు 50 అడుగు వెడల్పు, 1210 పొడవును కలిగి ఈ మందిరానికి పశ్చిమ ముఖానికి కిరీటంగా ఉంటాయి. ఇక చర్చి ముఖ ద్వారం ప్రవేశ ద్వారం తలుపులు గోతిక్ శిల్పాలతో చెక్కబడిన రాజుల విగ్రహాలు వరుసగా ఉంటాయి. ముందు భాగంలో ఉన్న రెండు పెద్ద టవర్లు 68 మీటర్ల ఎత్తులో కలిగి 223 అడుగులు పొడవు ఉంటాయి. రంగులతో మెరిసేటి అద్దాల కిటికిలు 1235-70 పొడవు- వెడల్పులో ఉంటాయి. ముందు భాగంలో ఉండే పొడవైన రెండు స్తంభాలు లేక్కలేనన్ని గంటలను కలిగి ఉంటాయి. ఫ్రెంచ్ గోతిక్ రూపశైలిలో ఉండే నోట్రే-డామ్ చర్చి ప్రపంచ ప్రముఖ చర్చిలలో ఒకటిగా ప్రసిద్ది పొందింది. 1163లో పోప్ అలెగ్జాండర్-3 ఈ చర్చికి పునాది రాళ్లు వేయగా 1250 నాటికి ఈ చర్చి పురైంది. చర్చి నిర్మించిన 100 సంవత్సరాలకు మందిరం ముందు భాగంలోని రెండు ఎత్తైనా చాపెల్‌లను, ఇతర స్థంభాలను, విగ్రహాలను నిర్మించి ఈ ప్రార్థన మందిరాన్ని పూర్తి చేశారు. అయితే ఈ మందిరాన్ని 19వ శతాబ్థంలో పూర్వపు రెండు పవిత్ర ప్రార్థన మందిరాల నిర్మించినట్లు సమాచారం. సెయింట్ పీటర్స్ బసిలికా: వాటికన్ సిటి ఇది వాటికన్ సిటిలో ఉంది. దీనిని న్యూ సెయింట్ పీటర్స్ బసిలికా అని కూడా పిలుస్తారు. ఇటలీలో రోమ్‌లోని వాటికన్ నగరంలోనే ఇది పెద్దది. దీన్ని క్రైస్తవుల మతపరమైన చర్చిలన్నింటీ కంటే గొప్ప మందిరం. వాటికన్ నగరంలో సెయింట్ పీటర్ ప్రస్తుత బాసిలికా నగరంలో(రోమ్‌లోని ఒక ఎన్క్లేవ్), 2వ జూలియస్1506 లో ఈ మందిరం నిర్మాణాన్ని ప్రారంభించాడు. అయితే అది 1615 పాల్.వీ రాజు కాలంలో పూర్తైంది. సెయింట్ పీటర్ అపొస్తల రాజు నిర్మించిన మూడు ఎత్తైన బలిపీఠాలపై నుంచి నేరుగా క్రాసింగ్ వద్ద ఉన్న పెద్ద గోపురాన్ని కలుపుతూ నిర్మించారు. ఈ మందిరం అక్కడి పోప్‌ల చర్చే కాకుండా వారి ప్రధాన తీర్థయాత్ర కూడా. కాథలిక్ సంప్రదాయంలో, యేసు పన్నెండు అపొస్తలులలో ఒకడైన సెయింట్ పీటర్ శ్మశానవాటికగా భావిస్తారు. ఆయన సెయింట్ పీటర్ రోమ్ యొక్క మొదటి బిషప్ అని, బైబిల్ ప్రకారం.. క్రీ.శ. 1వ శతాబ్దంలోని రోమన్ క్రైస్తవులు అపొస్తలుడైన పేతురు(సెయింట్ పీటర్) రోమ్కు వెళ్లాడని బైబిల్లో పేర్కొన్నారు. పీటర్ చనిపోయిన తరువాత ఆయన మృతదేహాన్ని బాసిలికాలోని స్మశానవాటికలో ఖననం చేశారని అక్కడి వారి నమ్మకం. వెస్ట్ మినిస్టర్ అబ్బే యూరప్ దేశాలలోని అత్యంత ప్రసిద్ద మత భవనాలలో ఇది ప్రముఖమైనది. ప్రపంచంలోనే అత్యంత ప్రాముఖ్యత కలిగిన ప్రార్థన మందిరంగా దీన్ని పిలుస్తారు. లండన్ బరలిలోని పార్లమెంటు భవనానికి పశ్చిమాన ఈ మందిరాన్ని నిర్మించారు. మాజీ బెనెడక్టిన్ ఆశ్రమంగా ఉన్న ఈ మందిరాన్ని క్వీన్ ఎలిబెత్2, 1560లో సెయింట్ పీటర్ కాలేజీయేట్ చర్చిగా మార్చారు. ఆ తర్వాత 1987లో దీనిని సెయింట్ మార్గరేట్ చర్చి, పార్లమెంటు గృహాల సమిష్టి యునెస్కోగా నియమించారు. ఇది కూడా ప్రపంచ వారసత్వ స్థలం. ఈ ప్రార్థన మందిరాన్ని 1300 లో హెన్రీ యెవెల్ అనే రాజు ఆధ్వర్యంలో నార్మన్-శైలిలో నిర్మించారు. ఇంగ్లీష్ గోతిక్ డిజైన్ శైలిలో దీనిని నిర్మించారు. ఈ మందిరానికి పశ్చిమాన ఉన్న రెండు పెద్ద టవర్లు ప్రత్యేక ఆకర్షణగా ఉంటాయి. వీటిని సర్ క్రిస్టోఫర్ రెన్ రూపొందించినట్లు చెబుతారు. కాని అవి వాస్తవానికి నికోలస్ హాక్స్మూర్, జాన్ జేమ్స్‌లు నిర్మించినట్లుగా సమాచారం. ఈ చాపెల్‌లను వారు 1745 లో పూర్తిచేశారు. 1847 లోపలి గాయక స్టాల్స్, ఎత్తైన బలిపీఠం, రేడోలను పునర్నిర్మించి 1867లో సర్ జార్జ్ గిల్బర్ట్ స్కాట్ పూర్తిచేశారంటా. స్కాట్, జెఎల్ పియర్సన్ కూడా 1880 లలో ఉత్తర ట్రాన్సప్ట్ ముఖభాగాన్ని పుననిర్మించారు. అయితే రెండవ ప్రపంచ యుద్ధంలో బాంబు దాడుల్లో అబ్బే భారీగా దెబ్బతింది, యుద్దం అనంతరం ఈ మందిరాన్ని వెంటనే పునర్మించారు. లండన్‌లోని సెయింట్ పాల్స్ కేథడ్రాల్ ప్రపంచ ప్రముఖ చర్చిలలో ఒకటి. దీన్ని లండన్ బిషప్, డయోసెస్ తల్లి చర్చిగా పిలుస్తుంటారు. ఈ ప్రార్థనా మందిరాన్ని లండన్‌లోని ఎత్తైన లుడ్గేట్ కోండపై నిర్మించారు. అత్యంత ప్రముఖ, చరిత్రాత్మకంగా పేరున్న మందిరం ఇది. దీనిని పాల్ అపోస్తులు రాజు క్రీ.శ. 604లో దీన్ని నిర్మించడం జరిగింది. ఈ కేథడ్రల్‌ను 17వ శతాబ్ధపు రాజైన సర్ క్రిస్టోఫర్ రెన్ చేత ఇంగ్లీష్ బరోక్ శైలిలో నిర్మించారు. సర్ రెన్ కాలంలోనే ఈ చర్చి నిర్మాణం పూర్తిగా జరిగింది. ఈ చర్చిలో పాల్ అపోస్తుల రాజు గుర్తులు ఉండటం వల్ల దీనిని ఒల్డ్ సెయింట్ పాల్ చర్చి అని కూడా పిలుస్తుంటారు. ఈ మందిరంలో విక్టోరియా రాణి జూబ్లీ వేడుకలను, రెండవ ప్రపంచ యుద్ధాల ముగింపును సూచించే శాంతి సేవలు ప్రిన్స్ చార్లెస్, లేడీ డయానా స్పెన్సర్ వివాహం ఫెస్టివల్ ఆఫ్ బ్రిటన్ ప్రారంభంతో పాటు సిల్వర్, గోల్డెన్, డైమండ్ జూబ్లీలకు క్వీన్ ఎలిజబెత్-2 80, 90వ పుట్టినరోజు వేడుకలు, థాంక్స్ గివింగ్ సేవలు ఈ చర్చిలోనే జరిపారు. సెయింట్ పాల్స్ కేథడ్రల్‌కు సంబంధించిన గుర్తులు ఈ చర్చిలోనే భద్రపరిచారు. చర్చ్ ఆఫ్ ది నేటివిటీ: బెత్లెహాం బసిలికా ఆఫ్ ది నేటివిటీ ఇది బెత్లెహాంలోని వెస్ట్ బ్యాంక్‌లో ఉన్న బాసిలికా. యేసు జన్మస్థలంగా చెప్పుకునే ప్రదేశంలోనే ఈ చర్చిని నిర్మించారు. ఈ ప్రదేశం క్రైస్తవులకు పవిత్రమైన స్థలం, పవిత్ర ప్రార్థనా మందిరం. ఏసుక్రీస్తు ఇక్కడే నిరంతరం ప్రార్థనలు చేసుకునేవారని, అది గ్రోట్టో స్థలమని బైబిల్లో పేర్కొన్నారు. దీంతో క్రైస్తవులు ఈ స్థలాన్ని పవిత్రం స్థలంగా భావిస్తారు. 325-326లో బసిలికా అతని తల్లి హెలెనా జెరూసలేం, బెత్లెహాములను సందర్శించిన కొద్దిరోజులకే ఈ చర్చిని కాన్స్టాంటైన్ ది గ్రేట్‌గా నిర్మించారు. సాంప్రదాయకంగా ఏసు జన్మస్థలం అని భావించి ఇక్కడ బాసిలికా 330-333 కాలంలో నిర్మించినట్లు చెప్పుకుంటారు. 6వ శతాబ్ధంలో సమారిటన్ తిరుగుబాటు సమయంలో 529లో ఈ చర్చిని చాలా భాగాన్ని మంటలతో కాల్చేశారు. అయితే చాలా ఏళ్లకు మళ్లీ దీనిని బైజాంటైన్ చక్రవర్తి క్రీ.శ. 527-565 కాలంలో బాసిలికాను పునర్మించారు. 12వ శతాబ్దంలో క్రూసేడర్స్ చిత్రీకరించిన సెయింట్స్, ఫ్రెస్కోలతో అలంకరించారు. చర్చిలోకి చిన్న ఒట్టోమన్ యుగం నాటి తలుపు ద్వారం ఉంటుంది. దీనికి డోర్ ఆఫ్ రెస్పెక్ట్ అని పేరు పిలుస్తారు. అయితే వాస్తవానికి ఈ ప్రవేశ ద్వారం చాలా పెద్దది, కాని క్రూసేడర్లు దాని పరిమాణాన్ని తగ్గించి గుర్రంపై దాడి చేసేందుకు లోనికి ప్రవేశించకుండా చేశారు. ఆ తరువాత క్రమంగా దానిని అతిచిన్న ముఖ ద్వారంగా మార్చేశారు. 6వ శతాబ్దం నాటి అసలైన ద్వారానికి సంబంధించిన గుర్తులు ఇప్పటికీ అక్కడ కనిపిస్తాయి. క్రూసేడర్ల యుగంనాటి నిర్మాణ శైలిలో ఈ మందిరాన్ని నిర్మించారు. కాగా ఈ మందిరంలోని ఓ రహష్య చికటి గది లాంతర్లు వెలిగించి, 14 వెండి లైట్లతో అలంకరించి ఉంటుంది. ఏసుక్రీస్తు జన్మించిన స్థలం అదే అని చెప్పడానికి గుర్తుగా దానిని వెండి దీపాలతో అలంకరించారు. గ్రోట్టోలోని ఈ మందిరానికి పై మధ్య భాగంలో ఒక చాపెల్‌ను నిర్మించారు. దానిని ‘చాపెల్ ఆఫ్ ది మాంగెర్ (ది క్రిబ్) అని కూడా పిలుస్తారు. ఈ మందిరానికి, అదే ప్రత్యేక ఆకర్షణ. చర్చ్ ఆఫ్ ది హోలీ సెపల్చర్ దీనిని హోలీ సెపల్చర్ అని కూడా పిలుస్తారు, ఇది ఏసుక్రీస్తు సిలువ, ఖననం చేసిన పవిత్ర స్థలంలో నిర్మించిన ప్రార్థనా మందిరం. బైబిల్ ప్రకారం, ఏసుక్రీస్తు సమాధికి, సిలువ వేయబడిన ప్రదేశానికి దగ్గరగా ఉంది (జాన్ 19: 41:42). సిలువ, సమాధులను రెండింటి చూట్టు ఈ ప్రార్థన మందిరాన్నినిర్మించారు. ఓల్డ్ సిటీ ఆఫ్ జెరూసలేలోని వాయువ్యంలో హోలీ సెపల్చర్ చర్చి ఉంది. చక్రవర్తి కాన్స్టాంటైన్ ది గ్రేట్ అనే రాజు క్రీ.శ. 336లో సైట్లో అనే ప్రదేశంలో మొదటగా నిర్మించాడు. ఆ తరువాత 614లో పర్షియన్లు దీనిని కుల్చివేసి మోడెస్టస్ (థియోడోసియస్ ఆశ్రమ మఠాధిపతి, 616-626) పునరుద్ధరించారు. ఖలీఫ్ అల్-అకిమ్ బా-అమర్ అల్లాహ్ 1009లో దీనిని కుల్చివేయడంతో మళ్లీ 12వ శతాబ్దంలో క్రూసేడర్లు పునర్నిర్మాణాన్ని చేపట్టి ప్రార్థనలు చేసుకునేవారు. అలా తరుచూ మరమ్మత్తులు చేపడుతూ 1810 నాటికి పూర్తి చేశారు.. సెయింట్ మార్క్స్ బసిలికా వాస్తవానికి ఇది డోగే ప్రార్థనా మందిరం. సెయింట్ మార్క్స్ బసిలికా (బసిలికా డి శాన్ మార్కో) 829లో ముఖ్యమైన చర్చి. సెయింట్ మార్క్ యొక్క అవశేషాలు అలెగ్జాండ్రియా నుంచి వెనిస్కు వచ్చి ఇక్కడ ఖననం చేసినట్లుగా చెబుతారు. 1063 నాటి కాన్స్టాంట్ నోబెల్ చర్చ్ ఆఫ్ అపోస్టల్స్ చర్చి నమునాలను తీసుకుని ఇప్పటి గౌడే-ప్లాన్ శైలిలో నిర్మించారు. ఈ చర్చి నిర్మాణానికి 1075లో, డోజ్ ఒక చట్టాన్ని ఆమోదించి మరియు టింటోరెట్టితో సహా కళాకారులు రూపొందించిన ‘ఆధునిక’ మొజాయిక్లతో భర్తీ చేశారు. మొజాయిక్లు, బంగారు బలిపీఠం, అందమైన ప్రార్థనా మందిరాలు మరియు ఖజానా ఇటలీకి బాగా నచ్చిన పర్యాటక ఆకర్షణలలో ఒకటిగా నిలిచాయి. క్రీ.శ.1075 లోడోజ్ ఒక చట్టాన్ని ఆమోదించాడు, ఈ చర్చిని బాసిలికాను అలంకరించడానికి విలువైన వస్తువులను, తూర్పు నుంచి అరుదైన పాలరాయి, పోర్ఫిరీ, అలబాస్టర్ మరియు జాస్పర్ 500లకు పైగా స్తంభాలను తెప్పించి నిర్మించాడు. దీని లోపలి భాగాన్ని 12, 13 శతాబ్ధాల కాలం నాటి 4,240 చదరపు మీటర్ల బంగారు మొజాయికులతో నిర్మించాడు. 1500, 1750 మధ్య,కొన్ని పాత విభాగాలను టిటియన్, టింటోరెట్టోతో సహా కళాకారులు రూపొందించిన ఆధునిక మొజాయికన్లతో నిర్మించారు. అలాగే దీని ముఖభాగం ముందు రెండు పాలరాయి పైలాస్టర్లు, పిలాస్త్రీ అక్రితాని, ఆరవ శతాబ్దపు అద్భుతమైన శిల్పాలతో కప్పబడి ఉంటాయి. సెయింట్ మార్క్ మాదిరిగానే, ఈజిప్టు 4వ శతాబ్దంలోని మూలలోని టెట్రార్చ్స్ శిల్పం పోర్ఫిరీ నుంచి తీసుకుని ఈ శిల్పాలను రూపొందించారు. మొజాయిన్ల, బంగారు బలిపీఠం, అందమైన ప్రార్థనా మందిరాలు, ఖజానాలు ఉండటంతో ఇది ఇటలీలో అందమైన పర్యాటక ఆకర్షణలలో ఒకటిగా నిలిచింది. హగియా సోఫియా, ఇస్తాంబుల్, టర్కీ.. హగియా సోఫియా అనగా ‘పవిత్ర జ్ఞానం’ అని అర్ధం. ఇది మాజీ గ్రీకు ఆర్థోడాక్స్ పితృస్వామ్య ప్రార్థన మందరం. క్రీ.శ. 537లో నిర్మిచిన ఈ మందిరం క్రీ.శ.1453 వరకు మ్యుజియంగా ఉండేది. లాటిన్ సామ్రాజ్యంలో ఈ మందిరాన్ని రోమన్ కాథలిక్ కేథడ్రాల్ మందిరంగా మార్చారు. రెండు అంతస్తులుగా నిర్మించిన ఈ మందిరాన్ని క్రీ.శ. 537లో పూర్తిచేశారు. దీనిని 6 సంత్సరాలలో పూర్తి చేశారు. 6వ శతాబ్దంలో కాన్స్టాంటినోపుల్ (ఇప్పుడు ఇస్తాంబుల్, టర్కీ)లోని కేథడ్రల్ స్మారక చిహ్నంగా నిర్మించారు. దీనిపై నిర్మించిన గోపురం కేథడ్రల్‌కు చిహ్నం. హెలెన్ గార్డనర్, ఫ్రెడ్ క్లీనర్లు రూపొందించిన ఈ కట్టడాడంలో అసలు ఉక్కు పరికరాలను వాడకపోవడం ఈ మందిరానికి ఉన్న ప్రత్యేకత. ఈ మందిరాన్ని 270 అడుగుల (82 మీటర్లు) పొడవు మరియు 240 అడుగుల (73 మీటర్లు) వెడల్పులో నిర్మించారు. అలాగే దీనిపైన నిర్మించిన ప్రధాన గోపురం 108 అడుగుల (33 మీటర్లు) చర్చికి కిరీటంగా వ్యవహరిస్తుంది. ఈ గోపురం 180 అడుగుల (55 మీటర్లు) పెండెంటివ్స్ రెండు సెమిడోమ్లకు ప్రాతినిధ్యం వహిస్తుంది. మందిరంపైన నిలువుగా నిర్మించిన గ్యాలరీలతో వేరు చేసి ఉంటుంది. అలాగే మూడు అంతస్తుల మేట్లకు, గోపురానికి మద్దుతుగా ఓ పాలరాయి పైర్లను నిర్మించారు. గ్యాలరీలకు పైన ఉన్న గోడలు,గోపురం బేస్‌లు వివిధ డిజైన్ల కిటికీలచే అమర్చబడి ఉంటుంది. ఈ కిటికీల నుంచి వచ్చే గాలికి ఆకాశంలో తేలుతున్నట్లుగా అనిపిస్తుందని అక్కడ పర్యటించినవారు అంటుంటారు. 1,400 సంవత్సరాల కేథడ్రల్, మసీదుగా ఉండేది ఆ తర్వాత దీనిని ఈ చర్చిగా మార్చారు. ప్రస్తుతం ఇది పర్యటకానికి వీలుగా పురాతన వస్తువులను ఉంచే మ్యూజియంగా మార్చారు. దీనిని మొదటిసారి నిర్మించినప్పుడు, కాన్స్టాంట్నోబుల్లో ఇని బైజాంటైన్ సామ్రాజ్యానికి రాజధానిగా ఉండేది. ఇది అధికారికంగా క్రిస్టియన్, రోమన్ సామ్రాజ్యం తూర్పు భాగంలో ఉంది. - స్నేహలత (వెబ్ డెస్క్) -
హైదరాబాద్‌లో క్రిస్మస్ వేడుకలు..
డిసెంబర్ నెల ముదలైందంటే చాలు నగరం అంతా క్రిస్మస్, న్యూయర్ వేడుకల సెలబ్రేషన్స్‌తో హడావుడిగా ఉంటుంది. హిందూ, ముస్లిం పండుగలు, ప్రముఖుల పుట్టినరోజు వేడుకలతో గడిచే ఏడాది.. చివరగా క్రిస్మస్ పండుగతో పూర్తవుతుంది. అందుకే ఈ పండగకు పట్టణప్రజలు అత్యంత ప్రాముఖ్యత నిస్తారు. ఏసుక్రిస్తు జన్మదినం సందర్భంగా జరుపుకునే ఈ పండుగను ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్రైస్తవులు ఎంతో ఉత్సాహంతో జరుపుకుంటారు. ఇక మన హైదరాబాద్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. డిసెంబర్ నెల మొదలైందంటే చాలు నగరాల్లో ఎక్కడా చూసినా క్రిస్మస్ ట్రీ, స్టార్స్, క్రిస్మస్ తాతలు దర్శనమిస్తాయి. క్రైస్తవులు తమ ఇంటి ముందు, పైన స్టార్స్‌ను వ్రేలాడిస్తారు. ఇంటి లోపల క్రిస్మస్ ట్రీని రంగు రంగు లైట్లతో అలంకరించి పెట్టుకుంటారు. క్రిస్మస్ అంటే ముందుగా గుర్తుకు వచ్చేది కేకు. ఈ కేకును ప్రత్యేకంగా తయారు చేసి క్రిస్మస్ పండుగ రోజున విక్రయిస్తారు. అలాగే ఈ పండుగలో బహుమతులు ఒక భాగమే. మరి ఇంతటి ప్రాముఖ్యత ఉన్న క్రిస్మస్ పండగను మన హైదరాబాద్‌లో ఏలా జరుపుకుంటారో, నగరంలో ఉండే హడావుడి గురించి బహుమతులు, కేకుల తయారి గురించి తెలుసుకుందాం రండి. క్రిస్మస్కి నగరం ఇలా ముస్తాబవుతుంది: డిసెంబర్ రాగానే నగరంలో క్రిస్మస్ సంబరాలు అంబరాన్ని అంటుతాయి. ఎక్కడ చూసిన స్టార్స్, వివిధ రంగుల లైట్లతో హైదరాబాద్ నగరమంతా తారలే కిందకు వచ్చేయేమో అనేలా విరజిల్లుతుంది. క్రైస్తవులు తమ ఇంటినంతా రంగుల రంగుల లైట్లతో, ఓ పెద్ద స్టార్, క్రిస్మస్ ట్రీలతో అలంకరించుకుంటారు. ఇక షాపింగ్ మాల్స్ గురించి పెద్దగా చెప్పనక్కేర్లేదు. హైదరాబాద్ నగరంలోని ప్రముఖ ఏరియాలలో ఉండే ఏ షాపింగ్ మాల్‌కు వెళ్లినా అక్కడ క్రిస్మస్ ట్రీ, క్రిస్మస్ తాత దర్శనమిస్తారు. బిల్డింగ్ అంత ఎత్తు ఉండే.. ఆకాశాన్ని తాకుతుందేమో అనేంత ఎత్తుగా క్రిస్మస్ ట్రీని పెట్టి దానికి బహుమతుల బొమ్మలు, చాక్లేట్స్ బొమ్మలు, క్రిస్మస్ తాత బొమ్మలు వంటి వివిధ రకాల మెరిసే బొమ్మలతో ఆకర్షణీయంగా అలంకరిస్తారు. కోన్ ఆకారంలో ఉండే క్రిస్మస్ ట్రీకి చివరి అంచున పెద్ద స్టార్‌ను బొమ్మను ఉంచుతారు. ఇది ఏసుక్రిస్తు జననానికి సూచిక. ఈ క్రిస్మస్ ట్రీ అలంకరణకను సంబంధించిన డేకరేషన్ వస్తువులు అన్ని చోట్ల దొరకవు. వాటికి సంబంధించి హైదరాబాద్‌లో ప్రత్యేకమైన బజార్లు ఉంటాయి. కోఠి, సికింద్రాబాద్ బజార్, ఒల్డ్ సీటి బేగం బజారు వంటి ప్రత్యేకంగా వాటి కోసం బజార్లు ఉన్నాయి. అక్కడ క్రిస్మస్ సంబంధించిన వస్తువులు, బహుమతులు అన్ని కూడా దొరుకుతాయి. క్రిస్మస్ కేకు ప్రాముఖ్యత: క్రిస్మస్ అంటే ముఖ్యంగా గుర్తుకు వచ్చేది ప్లమ్ కేకు. అన్ని కేకుల్లా కాకుండా క్రిస్మస్ కేకు ప్రత్యేకంగా తయారు చేస్తారు. ఇందుకోసం కేకు తయారీని రెండు నెలల ముందు నుంచే మొదలు పెడతారు. కేకు కోసం ఏ ఒక్క డ్రై ఫ్రూట్స్ వదలరు అన్నీరకాల డ్రై ఫ్రూట్స్‌ను వాడుతారు. డ్రై ఫ్రూట్స్‌తో తయారు చేసే ఈ కేకును ‘ప్లమ్ కేక్’ అంటారు. దీని కోసం రెండు నెలల ముందే వివిధ రకాల డ్రై ఫ్రూట్స్ అన్నింటిని వైన్‌తో బాగా కలిపి నానబెట్టి తయారు చేస్తారు. వైన్‌లో డ్రై ఫ్రూట్స్‌ను కలిపేందుకు తాజా ద్రాక్ష పండ్ల రసాన్ని వాడతారు. ఇందుకోసం గ్రేప్ వైన్ ప్రక్రియ విధానాన్ని వాడతారు. అంటే తాజా ద్రాక్ష పండ్లను తొక్కుతూ రసాన్ని తీస్తారు. ఈ క్రమంలో దేవుడి పాటలు పాడుతూ.. డ్రమ్స్ వాయిస్తూ.. క్రైస్తవులు ఉల్లసంగా డ్యాన్స్ చేస్తూ ప్రతిఒక్కరు ఈ ‘గ్రేప్ స్టంపింగ్’లో పాల్గొంటారు. ఈ కేకు మిక్సింగ్ వేడుకతోనే సెమీ క్రిస్మస్ సెలబ్రేషన్స్ మొదలవుతాయి. ఓ వేడుకలా జరుపుకునే కేకు మిక్సింగ్ ప్రక్రియ విదేశాలల్లో క్రిస్మస్ పండుగలో ఆచారంగా ఉంది. అలాగే క్రిస్మస్ సంబరాలలో ఇది ఒక భాగం కూడా. ఈ ఆచారం మొదట విదేశాలలో మాత్రమే ఉండేది. ఆ తరువాత క్రమ క్రమంగా మన భారతదేశంలో కూడా జరుపుతున్నారు. మన హైదరాబాద్‌లో కూడా పెద్ద పెద్ద స్టార్ హోటల్స్ రెండు నెలల ముందే సెమీ క్రిస్మస్ సెలబ్రేషన్స్ జరుపుతున్నారు. శంషాబాద్ నోవాటేల్ స్టార్ హోటల్స్, హైదరాబాద్ గోల్కొండ హోటల్, తాజ్ బంజారా, తాజ్ క్రిష్ణా హోటల్స్‌తో పాటు పలు ప్రముఖ హోటల్స్ సెమీ క్రిస్మస్ సెలబ్రేషన్స్‌లో భాగంగా కేకు మిక్సింగ్ వేడుకను జరుపుతున్నాయి. దీని కోసం సినీ ప్రముఖులను, ప్రముఖలను ప్రత్యేక అతిథులుగా ఆహ్వానిస్తారు. కేకు తయారీ కోసం చేసే డ్రై ఫ్రూట్స్ మిక్సింగ్‌లో వారు పాల్గొని అక్కడి వారిలో ఉత్సాహాన్ని నింపుతారు. ఇలా తయారు చేసే క్రిస్మస్ కేకు రుచికరంగా ఉండటమే కాదు.. దాని ధర కూడా ఎక్కువగానే. అరకిలో కేకు రూ.500 నుంచి రూ.800 వరకు ఉంటుంది. హైదరాబాద్‌లో క్రైస్తవులు ఇలా క్రిస్మస్ సంబరాలను జరుపుకుంటారు: మతబేధం చూపకుండా ఈ పండుగను ప్రతి ఒక్కరు ఉత్సాహంగా జరుపుకుంటారు. అంతటి ప్రాముఖ్యత ఉన్న క్రిస్మస్ సీజన్ మొత్తం క్రైస్తవులంతా ఆనందోత్సాహాలతో ఉంటారు. డిసెంబర్ నెల మొదలైనప్పటి నుంచే ఆయా చర్చి సంఘ పెద్దలు, చర్చి సభ్యుల ఇళ్లకు వెళ్లి పాటలు పాడుతూ ఏసుక్రీస్తు జన్మదిన వేడుకలకు ఆహ్వానం ఇస్తారు. దీనినే ‘క్యారెల్స్’ అని పిలుస్తారు. ఈ క్యారెల్స్ను ప్రతి రోజు సాయంత్రం నుంచి రాత్రంతా నిర్వహిస్తారు. చర్చి సంఘ పెద్దలు, చర్చి సభ్యులతో కలసి గుంపులుగా చేరి.. ఎవరెవరి ఇళ్లకు వెళ్లాలో ముందుగానే ప్రణాళిక వేసుకుంటారు. ఆ విధంగా సాయంత్రం నుంచి రాత్రివరకు ప్రతి సంఘ సభ్యుడి ఇంటికి వెళ్లి వారిని క్రిస్మస్ పండుగ వేడుకలో భాగస్వాములను చేస్తూ పండుగ వేడుకలకు ఆహ్వానిస్తారు. ఈ క్రమంలో వారంతా గిటారు, డ్రమ్స్ వాయిస్తూ ఆనందోత్సాహాలతో డ్యాన్స్‌లు వేస్తూ ఆ ఇంట్లో కాసేపు సందడి చేసి క్రిస్మస్ పండుగకు వారికి ఆహ్వానం తెలుపుతారు. ఇలా ప్రతిరోజు క్రిస్మస్ వరకు చర్చి పెద్దలు, ఇతర సంఘ సభ్యులంతా బీజీగా ఉంటారు. ఈ క్యారెల్స్లో ప్రతి సంఘ సభ్యులు పాల్గొనాల్సిందే. అలాగే క్రిస్మస్ డిసెంబర్ 25 తేదికి 10 రోజుల ముందు చర్చిలో సేమీ క్రిస్మస్ వేడుకలను నిర్వహిస్తారు. ఈ సందర్భంగా చర్చిలోని సభ్యులందరికి విందు భోజనాలు ఏర్పాటు చేస్తారు. ఈ విందులో స్వీట్స్, కేకు, వివిధ రకాలు భోజన పదార్థాలు ఉంటాయి. ఈ కార్యక్రమంలో అందరూ డ్యాన్స్ ప్రోగ్రామ్స్, పాటలు పాడటం, ఆటల పోటీలను నిర్వహిస్తారు. పోటీల్లో గెలిచిన వారికి, పాటలు బాగా పాడిన వారికి, డ్యాన్స్ బాగా చేసే వారికి బహుమతులు ఇస్తారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు జరుపుకునే ఈ ప్రీ క్రిస్మస్ వేడుకలు ఆట, పాటలతో చిందలేస్తూ రోజంతా ఆనందోత్సహాలతో సందడిగా గడుపుతారు. ఇలా సందడి చేస్తూ గ్రాండ్ క్రిస్మస్ పండుగకు స్వాగతం పలుకుతారు. ఇలా హైదరాబాద్‌లో కొన్ని చర్చిలలో ప్రీ క్రిస్మస్ ఈవేంట్స్ను ఘనంగా క్రిస్మస్ నిర్వహిస్తారు. అవి సికింద్రాబాద్ వెస్టీ చర్చి, సెయింట్ మార్టిన్స్, కల్వరి టెంపుల్, ది కింగ్స్ టెంపుల్, బాప్తిస్ట్ చర్చిలు మొదలైనవి. క్రిస్మస్ బహుమతులు: క్రిస్మస్ అనగానే ముఖ్యంగా గుర్తొచ్చేది కేకు ఆ తరువాత బహుమతులు. అవును క్రిస్మస్ అంటేనే బహుమతులు ఇవ్వడం. ఈ బహుమతులను ఇచ్చేది శాంటా క్లాజ్(క్రిస్మస్ తాత). ప్రతి ఒక్కరు సంతోషంగా ఉండటం, ఇతరులను ఆనందపరచడమే ఈ క్రిస్మస్ ముఖ్య ఉద్దేశం. అందుకే కుటుంబ పెద్దలు తమ పిల్లలకు ఏమి ఇష్టమో వాటిని ఈ పండుగ రోజున బహుమతిగా ఇస్తారు. ఇందుకోసం వారు బహుమతిని కొని సీక్రేట్‌గా ఓ ప్లేస్ ఉంచి వారు చూసేలా చేసి సర్ప్రైజ్ చేస్తారు. నిజంగానే క్రిస్మస్ తాత వచ్చి తనకు నచ్చిన వస్తువు ఇచ్చి వెళ్లాడనుకుని పిల్లలు నమ్ముతారు. ఈ పండుగకు కానుకలను ఇవ్వడం అనేది విదేశాల్లో ఓ ఆచారంగా ఉంది. క్రిస్మస్ వస్తే చాలు విదేశాల్లో పిల్లలకు తమకు కావాలసిన బహుమతుల జాబితా తయారు చేసి వారి తల్లిదండ్రులకు ఇస్తారు. అందులో పేర్కొన్న కానుకలను వారు తప్పక ఇవ్వాల్సిందే మరి. చోట్ల, విదేశాలలో లేనివారికి ఏదో ఒక విధంగా సాయం చేసి వారి అవసరాలను తీరుస్తారు కూడా. అలా ఇదే పద్దతిని క్రమ క్రమంగా మన ఇండియాకి కూడ వచ్చేసింది. బహుమతులు తెచ్చే క్రిస్మస్ తాత ఇలా వచ్చాడు.. అసలు క్రిస్మస్కి ఈ బహుమతుల ఆచారం ఎలా వచ్చిందో తెలుసుకుందాం. ఓ ధనికుడైన వృద్దుడు ఒంటరిగా జీవించేవాడు. అతడు కాలక్షేపం కోసం రోజూ సాయంత్రం అలా బయట నడుస్తూ ఉండేవాడు. రోజూలాగే ఓ రోజు సాయంత్రం బయటకు వెళ్లిన అతనికి వీధిలో ఓ పేద కుటుంబం రోడ్డు పక్కన నివసిస్తున్నట్లు గమనించాడు. అది క్రిస్మస్ సీజన్ కాబట్టి చలి కూడా ఎక్కువగా ఉంటుంది వారు దుప్పట్లు లేక చలికి వణుకుతూ ఉండేవారు. పిల్లలకు సరైన బట్టలు లేకుండా ఇబ్బందులు పడుతున్న వారిని రోజు చూస్తుండేవాడు. అలా రోజు వారిని చూసి వారికి ఏ విధంగానైనా సాయం చేయాలని అనుకున్నాడు. ఓ రాత్రి పూట సిక్రేట్‌గా వెళ్లి వారికి దుప్పట్లు, దుస్తులు, ఆట బొమ్మలు, కొన్ని డబ్బులు వారి ఇంటి ముందు పెట్టి వెళ్లాడు. అప్పుడు ఆయన తలకు చలి చోపి, కోటును ధరించి చేతి కర్రతో ఉన్న ఆయనను వారు గమనించారు. అయితే తెల్లవారు జామున అది చూసి వారు. దేవుడే శాంటాక్లాస్(క్రిస్మస్ తాత)ను పంపించాడని. అతడే వారికి సాయం చేశాడని అనుకుంటారు. అలా ఈ క్రిస్మస్ తాత పుట్టుకొచ్చాడు. దీంతో ప్రజలు సీక్రేట్ శాంటా క్లాజా అంటూ పిలుచుకుంటారు. ఇలా క్రిస్మస్ తాత కథలను ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా చెప్పుకుంటారు. అయితే దీనికి సంబంధించిన అసలు కథ బైబిల్లో కూడా ఉంది. దీనిని చర్చిలోని సండే స్కూల్స్‌లో పిల్లలకు కథగా చెబుతారు. -
ఈ క్రిస్మస్ మీ ప్రియమైన వారితో..
క్రిస్మస్ అంటే ముందుగా గుర్తొచ్చేవి మనసు దోచే కానుకలు.. చల్లటి సాయంత్రాలు.. రంగుల రాత్రులు. పండుగ నాడు తమకిష్టమైన వారికి ఏదైనా ప్రత్యేకమైన బహుమతి ఇవ్వాలని తహతహలాడే వారు కొందరైతే. అందరిలా మామూలుగా కాకుండా పండుగను కొంత ప్రత్యేకంగా.. మరికొంత ‘ప్రేమ’గా జరుపుకోవాలని ఆలోచించే వారు మరికొందరు. అలాంటి వారు, ముఖ్యంగా పర్యటనలంటే ఇష్టపడేవారు తమ ప్రియమైన వారికి ఏదైనా కానుక ఇవ్వాలనుకుంటే పండుగను తమదైన రీతిలో కన్నుల పండుగగా జరుపుకునే ప్రదేశాలకు తీసుకెళ్లండి. మీ మనసుకు దగ్గరైన వారితో ఈ క్రిస్మస్ పండుగ రోజును మరింత అందంగా, గుర్తుండిపోయే మధుర జ్ఞాపకంగా మార్చుకోండి. 1) గోవా ఈ క్రిస్మస్ మరింత అందంగా సెలబ్రేట్ చేసుకోవటానికి గోవా ఓ అద్భుతమైన ప్రదేశం. క్రిస్మస్ రోజున గోవాలోని దాదాపు 400 చర్చిలు సప్తవర్ణశోభితంగా వెలుగిపోతాయి. రాత్రి వేళల్లో గోవా ఓ నూతన స్వర్గంలా అనిపిస్తుంది. వయస్సుతో సంబంధంలేకుండా అన్ని వయస్సుల వారు రాత్రి వేళ పెద్ద సంఖ్యలో చర్చిల వద్దకు చేరి ప్రార్థనలు నిర్వహిస్తారు. పండుగను మరింత అందంగా జరుపుకోవటానికి ప్రపంచం నలుమూలలనుంచి పర్యాటకులు గోవా చేరుకుంటారు. ఇక ఇక్కడి బీచ్‌ల వద్ద ఉండే సందడి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. 2) పాండిచ్చేరి ‘లిటిల్ ఫ్రాన్స్’ అని పిలువబడే పాండిచ్చేరి అద్భుతమైన కట్టడాలతో, సుందరమైన సముద్ర తీరాలతో మనల్ని కట్టిపడేస్తుంది. ఫ్రాన్స్ మూలాలు ఉన్న చాలామంది క్రిస్టియన్లు క్రిస్మస్ను తమదైన సాంప్రదాయాలు పాటిస్తూ కన్నులపండువగా జరుపుకుంటారు. పండుగనాడు అక్కడి చర్చిలు, బీచ్‌లు ఓ ప్రత్యేక ఆకర్షణ నిలుస్తాయి. 3) మనాలి చల్లని శీతాకాలం నాడు తెల్లటి మంచుతో మనాలి ఓ వెండి పర్వతంలా అందంగా మెరిసిపోతుంది. అందుకే మనాలిలో జరుపుకునే క్రిస్మస్కు వైట్ క్రిస్మస్ అని పేరు కూడా ఉంది. కేవలం క్రిస్మస్తోనే కాకుండా న్యూ ఇయర్‌తో మొదలయ్యే పండుగలన్నింటికి మంచుతో కప్పబడిన మనాలి స్వాగతం పలుకుతుంది. అందంగా అలంకరించబడిన హోటళ్లు పండుగ వాతావరణాన్ని పరిమళించేలా కులు ఫోక్ మ్యూజిక్ మనల్ని మైమరిపింపజేస్తుంది. ప్రతి ఏటా వచ్చే పర్యాటకుల సంఖ్య పెరుగుతూ వస్తోందంటే మనాలి ప్రకృతి అందచందాలు వారిని ఎంతగా ఆకర్షిస్తున్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. 4) కేరళ దైవ భూమిగా పిలువబడే కేరళ పచ్చటి పకృతి అందాలతో, సముద్రపు తీరాలతో, బ్యాక్ వాటర్‌తో ఎంతో రమణీయంగా ఉంటుంది. క్రిస్మస్ రోజున కేరళ పర్యటన మీ జీవితంలో ఓ మధుర జ్ఞాపకంగా మిగిలిపోతుంది. జనాభాలో అధిక భాగం ఉన్న క్రిస్టియన్లు పండుగను అత్యంత అద్భుతంగా సెలబ్రేట్ చేస్తారు. చిన్నా పెద్దా అని తేడా లేకుండా క్రిస్మస్ రోజు రాత్రి అందరూ చర్చిల వద్దకు చేరి ప్రార్థనలు చేస్తారు. ప్రకృతి ఒడిలో క్రిస్మస్ జరుపుకోవాలనుకునే వారికి కేరళ ఓ బెస్ట్ ఛాయిస్. 5) సిమ్లా మీకిష్టమైన వారితో ఈ క్రిస్మస్ను ప్రశాంతంగా, గుర్తుండిపోయేలా జరుపుకోవాలంటే తప్పకుండా సిమ్లా వెళ్లి తీరాల్సిందే. పర్యాటకుల రద్దీ తక్కువగా ఉండే కొండ ప్రాంతాలు మనసుకు ఎంతో ప్రశాంతతనిస్తాయి. అక్కడి ఇళ్లు, వీధులు, చర్చిలు రంగురంగుల లైట్లతో అందంగా అలంకరించబడి కొత్త శోభను సంతరించుకుంటాయి. నోరూరించే సాంప్రదాయ వంటకాలు మనల్ని లొట్టలేసుకునేలా చేస్తాయి. చల్లటి సాయంత్రాలు క్రిస్మస్ వాతారణాన్ని మరింత అందంగా చేస్తూ వినసొంపైన పాటలతో మనల్ని అలరిస్తాయి. 6) లాన్స్ డౌన్ ఈ క్రిస్మస్ను కొండ ప్రాంతంలో జరుపుకోవాలనుకుంటే లాన్స్ డౌన్ అద్బుతమైన ప్రదేశం. యాంత్రికమైన జీవితంలో కొద్దిగా ప్రశాంతత లభిస్తుంది. వెండికొండల్లో.. మంచులోయల్లో.. చల్లటి సాయంత్రాలు.. వెన్నెల రాత్రులు మనకో గొప్ప అనుభూతిగా మిగిపోతాయి. భాగస్వామితో మాత్రమే కాదు, కుటుంబసభ్యులు, స్నేహితులతో గడపటానికి ఇదో అద్భుతమైన ప్రదేశం అని చెప్పొచ్చు. 7) దాద్రా నగర్ హవేలీ అన్ని క్రిస్మస్ డెస్టినేషన్లకంటే దాద్రా నగర్ హవేలీ కొంచెం ప్రత్యేకమైనది. ఎందుకంటే ఇక్కడ పండుగ మొత్తం గిరిజన పద్దతిలో జరుగుతుంది. రాత్రి వేళ చర్చిల వద్ద నిండుగా గుమిగూడే జనంతో పండుగ ఎంతో వైభవంగా జరుగుతుంది. పండుగ నాడు మీ ప్రియమైన వారితో ఇక్కడ క్రిస్మస్ జరుపుకోవటం నిజంగా ఓ మరిచిపోలేని జ్ఞాపకం అవుతుంది. 8) షిల్లాంగ్ చలికాలంలో ఇక్కడ పర్యాటకుల రద్దీ చాలా తక్కువగా ఉంటుంది. మరెక్కడా రాని అనుభూతి మనకిక్కడ దొరుకుతుంది. పర్యాటకుల్లా కాకుండా స్థానికుల్లా క్రిస్మస్ పండుగను ఆస్వాదించవచ్చు. తక్కువ సంఖ్యలో ఉన్న క్రిస్టియన్లు ఎంతో వైభవంగా క్రిస్మస్ వేడుకలను నిర్వహిస్తారు. మిరుమిట్లు గొలిపే రంగుల లైట్లతో.. వినసొంపైన గాస్పెల్ పాటలతో రేయి ఇట్టే గడిచిపోతుంది. అక్కడి ప్రజలతో పాటు కలిసి స్థానిక వంటకాలను రుచి చూడవచ్చు. 9) డామన్ అండ్ డయ్యూ గోవాకు ప్రత్యామ్నాయంగా దీనిని చెప్పుకోవచ్చు. పోర్చుగీసు వారి ప్రభావం ఎక్కువగా ఉన్న ప్రదేశం ఇది. సంప్రదాయ నృత్యాలతో పాటు కారిడినో వంటి పోర్చుగీసు నృత్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. పెద్ద సంఖ్యలో చర్చిల వద్ద గుమిగూడే జనం ఎంతో భక్తి శ్రద్ధలతో ప్రార్థనలు నిర్వహిస్తారు. 10) నార్త్ ఈస్ట్ క్రిస్మస్ పండుగను వైభవంగా నిర్వహించే ప్రదేశాల్లో నార్త్ ఈస్ట్ ఒకటి. ఇక్కడి గిరిజనులు పండుగ కోసం సంవత్సరం మొత్తం ఎదురుచూస్తూ ఉంటారు. కొండ ప్రాంతాల్లోని పట్టణాలలో క్రిస్మస్ వేడుకలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. రాత్రి వేళ వీధుల్లో ఎక్కడ చూసినా కనపించే జనంతో వాతావరణం ఎంతో సందడిగా ఉంటుంది. మన కిష్టమైన వారితో పండుగను మరింత సరదాగా జరుపుకోవటానికి ఇదో చక్కటి ప్రదేశం.