ముంబై, సాక్షి: గతేడాది(2019) క్రిస్మస్ నుంచి ఈ క్రిస్మస్ వరకూ మార్కెట్లు పలు ఎత్తుపల్లాలను చవిచూశాయి. అంతక్రితం ఏడాది మార్కెట్లు పెద్దగా ర్యాలీ చేయకపోవడంతో నెమ్మదిగా బలపడుతూ వచ్చాయి. అయితే 2020 మార్చికల్లా కోవిడ్-19 దెబ్బకు ఉన్నట్టుండి పతనమయ్యాయి. తిరిగి వెనువెంటనే కోలుకుని బుల్ ధోరణిలో సాగిపోయాయి. ఫలితంగా మార్కెట్లు సరికొత్త రికార్డులను సాధిస్తూ వచ్చాయి. తాజాగా సెన్సెక్స్ మార్కెట్ చరిత్రలో తొలిసారి 47,000 పాయింట్ల మైలురానికి అధిగమించగా.. నిఫ్టీ 14,000 పాయింట్లవైపు సాగుతోంది. వెరసి సెన్సెక్స్, నిఫ్టీ ఏడాది కాలంలో 13 శాతం చొప్పున బలపడగా.. మధ్య, చిన్నతరహా కౌంటర్లకు డిమాండ్ పెరగడంతో బీఎస్‌ఈలో మిడ్, స్మాల్ క్యాప్ ఇండెక్సులు 19 శాతం, 32 శాతం చొప్పున ఎగశాయి. ఇతర వివరాలు చూద్దాం.. (14,000 పాయింట్లవైపు నిఫ్టీ పరుగు!)
కారణాలేవిటంటే?
ప్రపంచవ్యాప్తంగా కోవిడ్-19 పడగ విప్పడంతో పలు దేశాల ప్రభుత్వాలు, కేంద్ర బ్యాంకులు సహాయక ప్యాకేజీలకు తెరతీశాయి. తద్వారా భారీ స్థాయిలో నిధులను వ్యవస్థలోకి విడుదల చేయడంతో అటు బంగారం, ఇటు స్టాక్ మార్కెట్లు ర్యాలీ బాటలో సాగాయి. సంక్షోభ పరిస్థితుల భయాలతో పసిడి జోరందుకోగా.. లిక్విడిటీ కారణంగా మార్కెట్లు బలపడినట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. దీనికితోడు ఫైజర్, మోడర్నా, ఆస్ట్రాజెనెకా తదితర దిగ్గజాలు వేగంగా వ్యాక్సిన్లను రూపొందించడంతో సెంటిమెంటు పుంజుకున్నట్లు తెలియజేశారు. దేశీయంగా విదేశీ ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) రూ. 1.5 లక్షల కోట్లను ఇన్వెస్ట్ చేయడం ప్రభావం చూపింది. (మార్కెట్లు భళా- ఈ మూడు కంపెనీలూ స్పీడ్)
షేర్లు మరింత స్పీడ్
బీఎస్‌ఈ-500 ఇండెక్సులో 65 శాతం షేర్లు లాభాలతో నిలిచాయి. వీటిలో 50 శాతం రెండంకెల వృద్ధిని చూపాయి. ప్రధానంగా 36 స్టాక్స్ 100-900 శాతం మధ్య దూసుకెళ్లడం ద్వారా మల్టీబ్యాగర్లుగా నిలిచాయి. వీటిలో మిడ్, స్మాల్ క్యాప్స్ అధికంగా చోటు సాధించడం విశేషం! ప్రధాన కంపెనీలలో అదానీ గ్రీన్, ఆర్తి డ్రగ్స్, లారస్ లేబ్స్, ఐవోఎల్ కెమికల్స్, ఆల్కిల్ అమైన్స్, బిర్లాసాఫ్ట్, డిక్సన్ టెక్నాలజీస్, ఇండియామార్ట్ ఇంటర్‌మెష్, గ్రాన్యూల్స్, వైభవ్ గ్లోబల్, టాటా కమ్యూనికేషన్స్, నవీన్ ఫ్లోరిన్, పాలీ మెడిక్యూర్, దీపక్ నైట్రైట్, అఫ్లే ఇండియా, సీక్వెంట్ సైంటిఫిక్, జేబీ కెమికల్స్, అదానీ గ్యాస్, స్ట్రైడ్స్ ఫార్మా, ఫస్ట్‌సోర్స్, అదానీ ఎంటర్, యాంబర్ ఎంటర్, ఏపీఎల్ అపోలో, పెర్సిస్టెంట్ సిస్టమ్స్, జిందాల్ స్టెయిన్, టాటా ఎలక్సీ, దివీస్ లేబ్స్, మైండ్‌ట్రీ, ఇండియా సిమెంట్స్, ఎల్‌అండ్‌టీ ఇన్ఫోటెక్, ఎస్కార్ట్స్, రెస్సాన్సివ్, వొకార్డ్ 600-100 శాతం మధ్య జంప్ చేయడం విశేషం! ఇతర కౌంటర్లలో తాన్లా సొల్యూషన్స్ 900 శాతం పురోగమించింది.
నేలచూపులో
గతేడాది కాలంలో ప్రభుత్వ రంగ కంపెనీలు కొన్ని నేలచూపులకే పరిమితమయ్యాయి. ఈ జాబితాలో బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీలు, హోటళ్లు, రిటైల్ రంగ కౌంటర్లు సైతం చోటు చేసుకున్నాయి. ఫ్యూచర్ రిటైల్, జీఈ పవర్, పీఎన్‌బీ, యూనియన్ బ్యాంక్, రేమండ్, కెనరా బ్యాంక్, చాలెట్ హోటల్స్, ఇండస్‌ఇండ్, బీవోబీ, లెమన్ ట్రీ, షాపర్స్‌స్టాప్, ఎడిల్‌వీజ్ ఫైనాన్స్, ఆర్‌బీఎల్ బ్యాంక్, ఐబీ హౌసింగ్, జాగరణ్ ప్రకాశన్, డీసీబీ బ్యాంక్, కోల్ ఇండియా, ఉజ్జీవన్ స్మాల్ బ్యాంక్ తదితరాలు 30 శాతం స్థాయిలో నీరసించినట్లు మార్కెట్ విశ్లేషకులు పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment