రాష్ట్రంలోనే రెండో పెద్దది సీఎస్‌ఐ
కొత్తగూడెంటౌన్: కొత్తగూడెం పట్టణంలోని సెయింట్ ఆండ్రూస్ సీఎస్‌ఐ చర్చి రాష్ట్రంలోనే రెండో పెద్ద చర్చిగా గుర్తింపు పొందింది. డోర్నకల్ డయాసిస్‌లో అతిపెద్దది. 1943లో బ్రిటిష్ కాలంలో కొత్తగూడెంలో 15 కుటుంబాలతో ఏర్పడిన సంఘం ఆధ్వర్యంలో పోస్టాఫీస్ సెంటర్‌లో నిర్మించారు. 2005లో రూ.1.60కోట్ల విరాళాలతో ఆధునిక పద్ధతిలో తిరిగి నిర్మించి పునఃప్రారంభించారు. జిల్లా కేంద్రంలో ప్రధానమైన కట్టడంగా గుర్తింపును సంతరించుకుంది. ఒకేసారి మూడువేల మంది ప్రార్థనలు చేయొచ్చు. ప్రతి ఆదివారం జన సందోహంగా మారుతుంది. రాష్ట్రంలోని వివిధ జిల్లాలు, విదేశాల నుంచి కూడా వచ్చి సందర్శిస్తుంటారు.
వేడుకలకు సిద్ధం చేశాం..
ప్రతి ఏడాది ఇక్కడ క్రిస్మస్ పండుగను ఎంతో ఘనంగా జరుపుకుంటాం. ఏసు జీవిత చరిత్రను భక్తులకు వివరించేందకు ప్రత్యేకంగా ఏర్పాట్లను చేశాం. ఈ చర్చికి ప్రతి ఆదివారం రాష్ట్ర నలుమూలల నుంచి క్రైస్తవ భక్తులు వస్తుంటారు.
– టి.జాన్సన్, సీఎస్‌ఐ చర్చి చైర్మన్
కరుణగిరి..
ఖమ్మంరూరల్: మండలంలోని నాయుడపేట నుంచి మొదలై..అటు బైపాస్ రోడ్డుకు ఆనుకుని ఉన్న కరుణగిరి చర్చి ఎంతో ప్రఖ్యాతిగాంచింది. ఇక్కడ గత 20 ఏళ్ల నుంచి క్రైస్తవులు విశేష ప్రార్థనలు చేస్తున్నారు. ఆధునిక నిర్మాణ పద్ధతి ఆకట్టుకుంటుంది. ప్రతి ఆదివారం వందలాదిగా క్రైస్తవులు ఇక్కడికి వస్తుంటారు. విశాల ఆహ్లాద ప్రాంగణం దీని మరో ప్రత్యేకత. ఖమ్మంనగరంతో పాటు కూసుమంచి, తిరుమలాయపాలెం, ఖమ్మంరూరల్, మరిపెడ మండలాల నుంచి ఇక్కడికి తరలివస్తుండడం విశేషం.
లివింగ్ గాస్పెల్ చర్చి..
పాల్వంచ: పట్టణంలోని కాంట్రాక్టర్స్ కాలనీలో ఉన్న లివింగ్ గాస్పెల్ చర్చ్ (ఎల్‌జీఎం) ఇండిపెండెంట్ చర్చిల్లోనే అతి పెద్దదిగా గుర్తింపుపొందింది. 1984లో సింగరేణి సంస్థలో ఉద్యోగాన్ని వదిలి పాస్టర్ లిటిల్ దేవసహాయం నలుగురైదుగురు భక్తులతో లివింగ్ గాస్పెల్ చర్చిని బాపూజీ నగర్‌లో ప్రారంభించారు. నేడు వేలాది మంది భక్తులు ఇక్కడికి వస్తున్నారు. లిటిల్ దేవసహాయం కుమారుడు సాధు టైటస్ లివింగ్ వాటర్ వివాహం చేసుకోకుండా దైవ సేవ చేయాలనే తలంపుతో పాస్టర్‌గా మారారు. ఆయన కాంట్రాక్టర్స్ కాలనీలో అధునిక పద్ధతుల్లో చర్చిని నిర్మింపజేసి 2016 జనవరి7వ తేదీన ప్రారంభించారు. ఉభయ జిల్లాల నుంచి ఇక్కడికి వేలాదిమంది వస్తుంటారు. ప్రతి మంగళ, శుక్ర, ఆదివారాల్లో ప్రత్యేక ప్రార్థనలు జరుగుతుంటాయి. టైటస్ లివింగ్ వాటర్ పేదలు, అనారోగ్యంతో ఉన్న వారికి, అనాథలకు తన వంతు సహకారం అందిస్తున్నారు.
యేసు ప్రేమను చాటడమే లక్ష్యం
యేసు క్రీస్తు చూపిన ప్రేమను చాటడమే నా లక్ష్యంగా భావిస్తున్నా. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా తమ వంతు కృషి చేస్తున్నాం. అనుబంధంగా జిల్లాలో ఐదు చర్చిలు, చత్తీస్‌గఢ్ రాష్ట్రంలో నాలుగు చర్చిలు ఉన్నాయి. మాకు ఇతర ఏ సంస్థల నుంచి ఎలాంటి ప్రొత్సాహం లేదు. స్వతహాగా ఇక్కడి భక్తుల సహకారంతో ముందుకు సాగుతున్నాం.
– సాధు టైటస్ లివింగ్ వాటర్, పాస్టర్
అద్భుతం..లూర్థుమాత ఆలయం
తల్లాడ: రాష్ట్రీయ రహదారి పక్కనే తల్లాడలో ఉన్న జిల్లాలోనే అతి పెద్ద చర్చిల్లో ఒకటిగా లూర్థుమాత ఆలయం పేరెన్నికగన్నది. 21 సంవత్సరాల క్రితం రోమన్ కేథలిక్ మిషన్ ఆధ్వర్యంలో నిర్మించారు. ఒకేసారి మూడువేల మంది ప్రార్థనలు చేయొచ్చు. అద్భుతమైన కల్వరి కొండలు, ఏసుక్రీస్తు జీవితానికి సంబంధించిన విశేషాలు, లూర్థమాతా చిత్రపటాలు ఎంతో ఆకర్షణీయంగా ఉంటాయి. చర్చిగోపురం 150 అడుగుల ఎత్తులో ఉంటుంది. ఆలయం గంట మోగినప్పుడు కిలోమీటరుకుపైగా వినిపిస్తుంది. ప్రాంగణం ప్రశాంతంగా ఉంటుంది.
క్రిస్మస్ అంటే క్రీస్తు ఆరాధనే..
బాల యేసు పశువుల పాకలో జన్మించడం ఒక అద్భుత కార్యం. అలాంటి రోజును అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకోవడమే కిస్మస్. క్రైస్తవులకు ఇదే పెద్ద పండుగ. కులమత బేధాలకు తావులేకుండా ఎంతో ఆనందంగా, సంతోషంగా జరుపుకోవాలి.
– పుట్టి రాజేంద్రప్రసాద్, లూర్థుమాత ఆలయం విచారణ గురువు, తల్లాడ
ఆకట్టుకునే ఆర్‌సీఎం
పాల్వంచ: స్థానిక ఆర్‌సీఎం చర్చిని కేరళకు చెందిన గోర్తిక్ ఆర్ట్ విధానంలో కట్టారు. కేరళ రాష్ట్రానికి చెదిన ఆగస్టీన్ అనే ఆర్కిటెక్ట్ దీనికి రూపకల్పన చేయగా అప్పటి ఫాదర్ బెనడిక్ట్ ఆధ్వర్యంలో 2013 జూన్ 8న చర్చిని పునఃప్రారంభించారు. దేవ దూతల విగ్రహాలు, ఏసు ప్రతిమలు, ఆయన శిష్యుల విగ్రహాలు ఎంతో ఆకట్టుకుంటాయి.
తెల్లవారేదాకా ప్రార్థనలు
24వ తేదీ రాత్రి 11 గంటల నుంచి 25వ తేదీ తె ల్లవారుజాముదాకా..క్రిస్మస్ ప్రార్థనలు ఉంటాయి. మళ్లీ 31వ తేదీ రాత్రి నుంచి ప్రేయర్ చేయిస్తాం. భక్తులకు సౌకర్యాలు ఏర్పాటు చేశాం. ఇంకా ప్రత్యేక సందర్భాలను కూడా నిర్వహిస్తుంటాం.
– ఆంథోని కడే పరంబిల్, చర్చి ఓసీడీ
Comments
Please login to add a commentAdd a comment