డిసెంబర్ నెల ముదలైందంటే చాలు నగరం అంతా క్రిస్మస్, న్యూయర్ వేడుకల సెలబ్రేషన్స్‌తో హడావుడిగా ఉంటుంది. హిందూ, ముస్లిం పండుగలు, ప్రముఖుల పుట్టినరోజు వేడుకలతో గడిచే ఏడాది.. చివరగా క్రిస్మస్ పండుగతో పూర్తవుతుంది. అందుకే ఈ పండగకు పట్టణప్రజలు అత్యంత ప్రాముఖ్యత నిస్తారు. ఏసుక్రిస్తు జన్మదినం సందర్భంగా జరుపుకునే ఈ పండుగను ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్రైస్తవులు ఎంతో ఉత్సాహంతో జరుపుకుంటారు. ఇక మన హైదరాబాద్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. డిసెంబర్ నెల మొదలైందంటే చాలు నగరాల్లో ఎక్కడా చూసినా క్రిస్మస్ ట్రీ, స్టార్స్, క్రిస్మస్ తాతలు దర్శనమిస్తాయి.
క్రైస్తవులు తమ ఇంటి ముందు, పైన స్టార్స్‌ను వ్రేలాడిస్తారు. ఇంటి లోపల క్రిస్మస్ ట్రీని రంగు రంగు లైట్లతో అలంకరించి పెట్టుకుంటారు. క్రిస్మస్ అంటే ముందుగా గుర్తుకు వచ్చేది కేకు. ఈ కేకును ప్రత్యేకంగా తయారు చేసి క్రిస్మస్ పండుగ రోజున విక్రయిస్తారు. అలాగే ఈ పండుగలో బహుమతులు ఒక భాగమే. మరి ఇంతటి ప్రాముఖ్యత ఉన్న క్రిస్మస్ పండగను మన హైదరాబాద్‌లో ఏలా జరుపుకుంటారో, నగరంలో ఉండే హడావుడి గురించి బహుమతులు, కేకుల తయారి గురించి తెలుసుకుందాం రండి.
క్రిస్మస్‌కి నగరం ఇలా ముస్తాబవుతుంది:
డిసెంబర్ రాగానే నగరంలో క్రిస్మస్ సంబరాలు అంబరాన్ని అంటుతాయి. ఎక్కడ చూసిన స్టార్స్, వివిధ రంగుల లైట్లతో హైదరాబాద్ నగరమంతా తారలే కిందకు వచ్చేయేమో అనేలా విరజిల్లుతుంది. క్రైస్తవులు తమ ఇంటినంతా రంగుల రంగుల లైట్లతో, ఓ పెద్ద స్టార్, క్రిస్మస్ ట్రీలతో అలంకరించుకుంటారు. ఇక షాపింగ్ మాల్స్ గురించి పెద్దగా చెప్పనక్కేర్లేదు. హైదరాబాద్ నగరంలోని ప్రముఖ ఏరియాలలో ఉండే ఏ షాపింగ్ మాల్‌కు వెళ్లినా అక్కడ క్రిస్మస్ ట్రీ, క్రిస్మస్ తాత దర్శనమిస్తారు. బిల్డింగ్ అంత ఎత్తు ఉండే.. ఆకాశాన్ని తాకుతుందేమో అనేంత ఎత్తుగా క్రిస్మస్ ట్రీని పెట్టి దానికి బహుమతుల బొమ్మలు, చాక్లేట్స్ బొమ్మలు, క్రిస్మస్ తాత బొమ్మలు వంటి వివిధ రకాల మెరిసే బొమ్మలతో ఆకర్షణీయంగా అలంకరిస్తారు. కోన్ ఆకారంలో ఉండే క్రిస్మస్ ట్రీకి చివరి అంచున పెద్ద స్టార్‌ను బొమ్మను ఉంచుతారు. ఇది ఏసుక్రిస్తు జననానికి సూచిక. ఈ క్రిస్మస్ ట్రీ అలంకరణకను సంబంధించిన డేకరేషన్ వస్తువులు అన్ని చోట్ల దొరకవు. వాటికి సంబంధించి హైదరాబాద్‌లో ప్రత్యేకమైన బజార్లు ఉంటాయి. కోఠి, సికింద్రాబాద్ బజార్, ఒల్డ్ సీటి బేగం బజారు వంటి ప్రత్యేకంగా వాటి కోసం బజార్లు ఉన్నాయి. అక్కడ క్రిస్మస్ సంబంధించిన వస్తువులు, బహుమతులు అన్ని కూడా దొరుకుతాయి.
క్రిస్మస్ కేకు ప్రాముఖ్యత:
క్రిస్మస్ అంటే ముఖ్యంగా గుర్తుకు వచ్చేది ప్లమ్ కేకు. అన్ని కేకుల్లా కాకుండా క్రిస్మస్ కేకు ప్రత్యేకంగా తయారు చేస్తారు. ఇందుకోసం కేకు తయారీని రెండు నెలల ముందు నుంచే మొదలు పెడతారు. కేకు కోసం ఏ ఒక్క డ్రై ఫ్రూట్స్ వదలరు అన్నీరకాల డ్రై ఫ్రూట్స్‌ను వాడుతారు. డ్రై ఫ్రూట్స్‌తో తయారు చేసే ఈ కేకును ‘ప్లమ్ కేక్’ అంటారు. దీని కోసం రెండు నెలల ముందే వివిధ రకాల డ్రై ఫ్రూట్స్ అన్నింటిని వైన్‌తో బాగా కలిపి నానబెట్టి తయారు చేస్తారు. వైన్‌లో డ్రై ఫ్రూట్స్‌ను కలిపేందుకు తాజా ద్రాక్ష పండ్ల రసాన్ని వాడతారు. ఇందుకోసం గ్రేప్ వైన్ ప్రక్రియ విధానాన్ని వాడతారు. అంటే తాజా ద్రాక్ష పండ్లను తొక్కుతూ రసాన్ని తీస్తారు. ఈ క్రమంలో దేవుడి పాటలు పాడుతూ.. డ్రమ్స్ వాయిస్తూ.. క్రైస్తవులు ఉల్లసంగా డ్యాన్స్ చేస్తూ ప్రతిఒక్కరు ఈ ‘గ్రేప్ స్టంపింగ్’లో పాల్గొంటారు.
ఈ కేకు మిక్సింగ్ వేడుకతోనే సెమీ క్రిస్మస్ సెలబ్రేషన్స్ మొదలవుతాయి. ఓ వేడుకలా జరుపుకునే కేకు మిక్సింగ్ ప్రక్రియ విదేశాలల్లో క్రిస్మస్ పండుగలో ఆచారంగా ఉంది. అలాగే క్రిస్మస్ సంబరాలలో ఇది ఒక భాగం కూడా. ఈ ఆచారం మొదట విదేశాలలో మాత్రమే ఉండేది. ఆ తరువాత క్రమ క్రమంగా మన భారతదేశంలో కూడా జరుపుతున్నారు. మన హైదరాబాద్‌లో కూడా పెద్ద పెద్ద స్టార్ హోటల్స్ రెండు నెలల ముందే సెమీ క్రిస్మస్ సెలబ్రేషన్స్ జరుపుతున్నారు. శంషాబాద్ నోవాటేల్ స్టార్ హోటల్స్, హైదరాబాద్ గోల్కొండ హోటల్, తాజ్ బంజారా, తాజ్ క్రిష్ణా హోటల్స్‌తో పాటు పలు ప్రముఖ హోటల్స్ సెమీ క్రిస్మస్ సెలబ్రేషన్స్‌లో భాగంగా కేకు మిక్సింగ్ వేడుకను జరుపుతున్నాయి. దీని కోసం సినీ ప్రముఖులను, ప్రముఖలను ప్రత్యేక అతిథులుగా ఆహ్వానిస్తారు. కేకు తయారీ కోసం చేసే డ్రై ఫ్రూట్స్ మిక్సింగ్‌లో వారు పాల్గొని అక్కడి వారిలో ఉత్సాహాన్ని నింపుతారు. ఇలా తయారు చేసే క్రిస్మస్ కేకు రుచికరంగా ఉండటమే కాదు.. దాని ధర కూడా ఎక్కువగానే. అరకిలో కేకు రూ.500 నుంచి రూ.800 వరకు ఉంటుంది.
హైదరాబాద్‌లో క్రైస్తవులు ఇలా క్రిస్మస్ సంబరాలను జరుపుకుంటారు:
మతబేధం చూపకుండా ఈ పండుగను ప్రతి ఒక్కరు ఉత్సాహంగా జరుపుకుంటారు. అంతటి ప్రాముఖ్యత ఉన్న క్రిస్మస్ సీజన్ మొత్తం క్రైస్తవులంతా ఆనందోత్సాహాలతో ఉంటారు. డిసెంబర్ నెల మొదలైనప్పటి నుంచే ఆయా చర్చి సంఘ పెద్దలు, చర్చి సభ్యుల ఇళ్లకు వెళ్లి పాటలు పాడుతూ ఏసుక్రీస్తు జన్మదిన వేడుకలకు ఆహ్వానం ఇస్తారు. దీనినే ‘క్యారెల్స్’ అని పిలుస్తారు. ఈ క్యారెల్స్‌ను ప్రతి రోజు సాయంత్రం నుంచి రాత్రంతా నిర్వహిస్తారు. చర్చి సంఘ పెద్దలు, చర్చి సభ్యులతో కలసి గుంపులుగా చేరి.. ఎవరెవరి ఇళ్లకు వెళ్లాలో ముందుగానే ప్రణాళిక వేసుకుంటారు. ఆ విధంగా సాయంత్రం నుంచి రాత్రివరకు ప్రతి సంఘ సభ్యుడి ఇంటికి వెళ్లి వారిని క్రిస్మస్ పండుగ వేడుకలో భాగస్వాములను చేస్తూ పండుగ వేడుకలకు ఆహ్వానిస్తారు. ఈ క్రమంలో వారంతా గిటారు, డ్రమ్స్ వాయిస్తూ ఆనందోత్సాహాలతో డ్యాన్స్‌లు వేస్తూ ఆ ఇంట్లో కాసేపు సందడి చేసి క్రిస్మస్ పండుగకు వారికి ఆహ్వానం తెలుపుతారు. ఇలా ప్రతిరోజు క్రిస్మస్ వరకు చర్చి పెద్దలు, ఇతర సంఘ సభ్యులంతా బీజీగా ఉంటారు. ఈ క్యారెల్స్‌లో ప్రతి సంఘ సభ్యులు పాల్గొనాల్సిందే.
అలాగే క్రిస్మస్ డిసెంబర్ 25 తేదికి 10 రోజుల ముందు చర్చిలో సేమీ క్రిస్మస్ వేడుకలను నిర్వహిస్తారు. ఈ సందర్భంగా చర్చిలోని సభ్యులందరికి విందు భోజనాలు ఏర్పాటు చేస్తారు. ఈ విందులో స్వీట్స్, కేకు, వివిధ రకాలు భోజన పదార్థాలు ఉంటాయి. ఈ కార్యక్రమంలో అందరూ డ్యాన్స్ ప్రోగ్రామ్స్, పాటలు పాడటం, ఆటల పోటీలను నిర్వహిస్తారు. పోటీల్లో గెలిచిన వారికి, పాటలు బాగా పాడిన వారికి, డ్యాన్స్ బాగా చేసే వారికి బహుమతులు ఇస్తారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు జరుపుకునే ఈ ప్రీ క్రిస్మస్ వేడుకలు ఆట, పాటలతో చిందలేస్తూ రోజంతా ఆనందోత్సహాలతో సందడిగా గడుపుతారు. ఇలా సందడి చేస్తూ గ్రాండ్ క్రిస్మస్ పండుగకు స్వాగతం పలుకుతారు. ఇలా హైదరాబాద్‌లో కొన్ని చర్చిలలో ప్రీ క్రిస్మస్ ఈవేంట్స్‌ను ఘనంగా క్రిస్మస్ నిర్వహిస్తారు. అవి సికింద్రాబాద్ వెస్టీ చర్చి, సెయింట్ మార్టిన్స్, కల్వరి టెంపుల్, ది కింగ్స్ టెంపుల్, బాప్తిస్ట్ చర్చిలు మొదలైనవి.
క్రిస్మస్ బహుమతులు:
క్రిస్మస్ అనగానే ముఖ్యంగా గుర్తొచ్చేది కేకు ఆ తరువాత బహుమతులు. అవును క్రిస్మస్ అంటేనే బహుమతులు ఇవ్వడం. ఈ బహుమతులను ఇచ్చేది శాంటా క్లాజ్(క్రిస్మస్ తాత). ప్రతి ఒక్కరు సంతోషంగా ఉండటం, ఇతరులను ఆనందపరచడమే ఈ క్రిస్మస్ ముఖ్య ఉద్దేశం. అందుకే కుటుంబ పెద్దలు తమ పిల్లలకు ఏమి ఇష్టమో వాటిని ఈ పండుగ రోజున బహుమతిగా ఇస్తారు. ఇందుకోసం వారు బహుమతిని కొని సీక్రేట్‌గా ఓ ప్లేస్ ఉంచి వారు చూసేలా చేసి సర్‌ప్రైజ్ చేస్తారు. నిజంగానే క్రిస్మస్ తాత వచ్చి తనకు నచ్చిన వస్తువు ఇచ్చి వెళ్లాడనుకుని పిల్లలు నమ్ముతారు. ఈ పండుగకు కానుకలను ఇవ్వడం అనేది విదేశాల్లో ఓ ఆచారంగా ఉంది. క్రిస్మస్ వస్తే చాలు విదేశాల్లో పిల్లలకు తమకు కావాలసిన బహుమతుల జాబితా తయారు చేసి వారి తల్లిదండ్రులకు ఇస్తారు. అందులో పేర్కొన్న కానుకలను వారు తప్పక ఇవ్వాల్సిందే మరి. చోట్ల, విదేశాలలో లేనివారికి ఏదో ఒక విధంగా సాయం చేసి వారి అవసరాలను తీరుస్తారు కూడా. అలా ఇదే పద్దతిని క్రమ క్రమంగా మన ఇండియాకి కూడ వచ్చేసింది.
బహుమతులు తెచ్చే క్రిస్మస్ తాత ఇలా వచ్చాడు..
అసలు క్రిస్మస్‌కి ఈ బహుమతుల ఆచారం ఎలా వచ్చిందో తెలుసుకుందాం. ఓ ధనికుడైన వృద్దుడు ఒంటరిగా జీవించేవాడు. అతడు కాలక్షేపం కోసం రోజూ సాయంత్రం అలా బయట నడుస్తూ ఉండేవాడు. రోజూలాగే ఓ రోజు సాయంత్రం బయటకు వెళ్లిన అతనికి వీధిలో ఓ పేద కుటుంబం రోడ్డు పక్కన నివసిస్తున్నట్లు గమనించాడు. అది క్రిస్మస్ సీజన్ కాబట్టి చలి కూడా ఎక్కువగా ఉంటుంది వారు దుప్పట్లు లేక చలికి వణుకుతూ ఉండేవారు. పిల్లలకు సరైన బట్టలు లేకుండా ఇబ్బందులు పడుతున్న వారిని రోజు చూస్తుండేవాడు. అలా రోజు వారిని చూసి వారికి ఏ విధంగానైనా సాయం చేయాలని అనుకున్నాడు. ఓ రాత్రి పూట సిక్రేట్‌గా వెళ్లి వారికి దుప్పట్లు, దుస్తులు, ఆట బొమ్మలు, కొన్ని డబ్బులు వారి ఇంటి ముందు పెట్టి వెళ్లాడు.
అప్పుడు ఆయన తలకు చలి చోపి, కోటును ధరించి చేతి కర్రతో ఉన్న ఆయనను వారు గమనించారు. అయితే తెల్లవారు జామున అది చూసి వారు. దేవుడే శాంటాక్లాస్(క్రిస్మస్ తాత)ను పంపించాడని. అతడే వారికి సాయం చేశాడని అనుకుంటారు. అలా ఈ క్రిస్మస్ తాత పుట్టుకొచ్చాడు. దీంతో ప్రజలు సీక్రేట్ శాంటా క్లాజా అంటూ పిలుచుకుంటారు. ఇలా క్రిస్మస్ తాత కథలను ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా చెప్పుకుంటారు. అయితే దీనికి సంబంధించిన అసలు కథ బైబిల్‌లో కూడా ఉంది. దీనిని చర్చిలోని సండే స్కూల్స్‌లో పిల్లలకు కథగా చెబుతారు.
Comments
Please login to add a commentAdd a comment