దివ్యలోకపు ప్రేమధార | Special Story On Christmas Celebration | Sakshi
Sakshi News home page

దివ్యలోకపు ప్రేమధార

Published Wed, Dec 25 2019 12:58 AM | Last Updated on Wed, Dec 25 2019 4:19 AM

Special Story On Christmas Celebration - Sakshi

మనుషుల్ని చూడండి. మీద ఏదో ఒక బరువు. చదువుల బరువు. ఉద్యోగాల బరువు. ఇంటి పోషణ బరువు. బంధువుల మాటపట్టింపు బరువు. స్నేహితుల ముఖంచాటు బరువు. దగ్గరివాళ్లెవరి మనసునో నొప్పించిన బరువు. అంత బరువులోనూ సాటి మనిషి తల మీది బరువును రెండు చేతులతో చేపల గంపను కిందికి దింపినట్లుగా.. ‘కష్టాన్ని పంచుకునే బరువు’నూ పైకెత్తుకుంటారు! మనిషి ఎంత బరువును మోస్తున్నా.. మనిషి లోపల పంచుకోవడం అనే ఆ ‘ప్రేమ నక్షత్రం’ వెలుగుతున్నంత కాలం లోకం ప్రేమమయమే. కాంతిమయమే.

మాధవ్‌ శింగరాజు
మంచిని మోసుకొచ్చేవాళ్లు కనిపిస్తే మనసుకు భారం దిగినట్లుగా అనిపిస్తుంది. భుజాన అరటి గెలతో వచ్చేవాళ్లు, వడ్ల బస్తాల బండితో దిగేవాళ్లు, అమ్మాయికి పెళ్లి సంబంధం తెచ్చేవాళ్లు.. ఇవనే కాదు, ఊరికే చూసిపోదామని ఎంతోదూరం నుంచి ఒక పలకరింపునైనా మూట కట్టుకుని వచ్చేవాళ్లు.. వాళ్లు ఎండన పడి వచ్చినా.. మనకు నీడనిచ్చేందుకు వేర్లు పెకిలించుకుని కదలి వచ్చిన మనిషంత మహావృక్షంలా కనిపిస్తారు. మన నీరసాన్ని, నిస్సత్తువను పోగొడతారు. వాళ్లు తెచ్చిన చక్కెరకేళీలు, వాళ్లు దించిన ధాన్యం గింజలు, వాళ్లు చెప్పిన వరుడి విశేషాలు.. ఇవి కాదు మనసుకు సంతోషం. ఆ మోసుకురావడం.. అదీ!
మనిషంటే అలానే ఉండాలి. నక్షత్రంలా! క్రీస్తు జన్మించారన్న కబురును ఇలాగే ఒక నక్షత్రం భూమి మీదకు మోసుకొచ్చింది.  ఆ నక్షత్రం ప్రసవించిన వెలుగులో క్రీస్తు జనన ఘడియలు కాంతిపుంజాలై ప్రసరించి లోకమంతటా మంచిని విత్తనాల్లా విరజిమ్మాయి. ఆ విత్తన సంతతే కావచ్చు ఈ మంచిని ప్రయాసపడి మోసుకొచ్చే మనుషులు! విరజిమ్మినప్పుడు మంచి అక్కడక్కడా పడింది కనుకనేనా మంచి మనుషులు అక్కడక్కడ మాత్రమే కనిపిస్తుంటారు?! కాదు. కనిపించకపోవడానికి కారణం మనం చూడకపోవడం, చూడాలని మనకు లేకపోవడం! ప్రకృతిని చూసి పరవశిస్తాం.

ప్రకృతిలో భాగమైన మూగజీవుల్ని చేరదీసి సేదతీరుతాం. పక్షులు పాడుతుంటే  వింటాం. మరి సాటి మనిషినెందుకు దగ్గరకు రానివ్వం? ఎన్ని యుగాల పరిచయం ఉన్నా  మనిషికి దగ్గరగా ఎందుకు వెళ్లలేం? చూడదలచుకుంటే దిగ్మండలంలోనే కాదు, ఈ భూమండలంలోనూ నక్షత్రాల్లాంటి మనుషులు ప్రత్యక్షమవుతారు. క్రీస్తు జననం వంటి ఒక మంచిని వాళ్లు సాక్షాత్కరింపజేస్తారు. మనలో ప్రతి ఒక్కరం చూడగలం. అయితే చూడదలచుకోం! చూసేందుకు లోకంలో మంచే లేదనుకుంటాం. నిజంగానే లోకంలో మంచికి చోటు లేదా, మంచిని చూసేందుకు మనలో చోటు లేదా? ఉంటుంది. మంచిని చూడాలన్న ఆలోచన.. అది రాదు. వచ్చిందా.. మరుక్షణమే మన పక్కనే ఉన్న మనిషిలోనూ ఒక నక్షత్రం కనిపిస్తుంది! మనిషిలో నక్షత్రం కాదు, మనిషే నక్షత్రంలా కనిపిస్తారు. ఆ నక్షత్రపు వెలుగులో లోకంలోని మంచి కనిపిస్తుంది. వెలుగులో మంచొక్కటే కనిపిస్తుందా! వెలుగులో కనిపించేది మంచైనా, కానిదైనా.. మనసులోని వెలుగు మంచిని మాత్రమే చూస్తుంది. ఆ చూపును కాపాడుకోవాలి మనం. అప్పుడు లోకం దివ్యమైన నక్షత్ర కూటమిలా వెలుగుతూ కనిపిస్తుంది.

శోకమయపు సముద్రాల ఈతకు నీటిపై సురక్షితంగా తేలియాడే ఆకులాంటి ఒక మంచి చూపు చాలదా.. సముద్రాన్ని, సుడిగుండాల్ని, తిమింగలాలను లక్ష్యపెట్టక ప్రశాంతంగా జీవనయానం సాగించడానికి! కొన్ని సంగతులు విన్నప్పుడు భూమి మీద ఉన్నదంతా ప్రేమ సందేశాలను మోసుకొచ్చే నక్షత్రాలే కానీ మానవమాత్రులు కారేమో అనిపిస్తుంది. కాకపోతే కొన్ని వెలిగే నక్షత్రాలు. కొన్ని వెలుగులో మాత్రమే కనిపించే నక్షత్రాలు. వెలుగులో నక్షత్రాలు కనిపించడం ఏమిటి! నక్షత్రమంటేనే వెలుగు కదా?! మనిషెంత వెలిగినా మంచితో వెలగడం ఒకటి ఉంటుందిగా. అలాంటిదే. ఒక యువకుడు ఉన్నాడు. హోటల్‌లో వెయిటర్‌. రూపాయి రూపాయి కూడ»ñ ట్టుకుని సైకిల్‌ కొనుక్కోవడం కోసం రోజూ పదకొండు కిలోమీటర్లు కాలి నడకన పనికి వచ్చి పోతున్నాడు.ఆ హోటల్‌కు  వస్తుండే దంపతులొకరికి ఈ సంగతి తెలిసింది.

మర్నాడే ఒక సైకిల్‌ని కొని అతడికి కానుకగా ఇచ్చారు! కష్టపడటం అతడి వెలుగైతే, అతడి కష్టాన్ని ఆ దంపతులు గమనించడం అతడిపై ప్రసరించిన వెలుగు. ఒక పోలీస్‌ అధికారి బంద్‌ డ్యూటీలో ఉన్నాడు. మధ్యాహ్నం అయింది. డ్యూటీలో ఉన్న చోటే ఒక అరుగు మీద భోజనానికి కూర్చోబోతుండగా ఒక వ్యక్తి దగ్గరగా వచ్చి నిలుచున్నాడు. అతడికి ఆకలిగా ఉన్నట్లు గ్రహించాడు ఆ పోలీస్‌ అధికారి. ‘తింటావా?’ అని అడిగాడు. ‘తింటాను’ అన్నట్లు తలూపాడు ఇల్లూ వాకిలీ లేని ఆ వ్యక్తి. పోలీస్‌ అధికారి తెప్పించుకున్న అన్నం పొట్లంలోనే ఇద్దరూ కలిసి చేతులు పెట్టి భోజనం చేశారు! పంచే బుద్ధి పోలీస్‌ ఆఫీసర్‌లోని వెలుగైతే, దాన్ని బయటికి కనిపించేలా చేసిన వెలుగు ఆ ఆకలిగొన్న వ్యక్తి. ఇలాంటివి జరక్కపోతే పోలీసు చొక్కాపై నక్షత్రాలను తప్ప పోలీసు మనసు లోపలి నక్షత్రాలను చూడగలమా?! మనుషుల్లోపల్లోపల సాటి మనుషులంటే ఇంతింత ప్రేమ ఉంటుందే.. మరి అదంతా కనిపించకుండా ఎక్కడికి పోతుంది? ఎక్కడీ పోదు.

ఎక్కడి నుంచో, ఏ రూపంలోనో ఓ కాంతి ధార వచ్చి పడితేనే కానీ ఆ మానవ నక్షత్రాల్లోని ప్రేమ వెలుగు పైకి కనిపించదు. మనుషులు ధరించే నిర్దయ, నిరాదరణ అనే కవచాలు మనుషుల మీద అనుమానంతోనే కానీ అవేవీ సహజ కవచాలు, కుండలాలు కావు. సాటి మనిషి అవసరానికి అవి తునాతునకలైపోయి హృదయకాంతి బయపడినప్పుడు గానీ అప్పటి వరకు వారు పండ్ల గెలలు, ధాన్యపు బస్తాలు, పెళ్లి సంబంధాలు మోస్తున్నట్లు తెలియదు. జ్ఞానులు సైతం క్రీస్తు జననాన్ని నక్షత్రం ద్వారానే గుర్తించగలిగారు. మనిషిలోని దైవత్వాన్ని గుర్తించడానికి ప్రతి మనిషీ అంతటి నక్షత్రం అయి ఆ కాంతిని లోకానికి బాటగా వేయాలి.  

తాతకు తోడుగా..!

క్రిస్మస్‌ తాత నివాసం దక్షిణధ్రువంలో ఉంటుందని ప్రపంచం అంతా భావిస్తుంటే.. నెదర్లాండ్స్‌ ప్రజలు మాత్రం ఆయన స్పెయిన్‌ దేశంలో ఉంటాడని నమ్ముతారు. క్రిస్మస్‌ తాతను ఇంగ్లిషులో శాంటాక్లాస్‌ అంటాం కదా. శాంటాక్లాస్‌ అన్నది నెదర్లాండ్స్‌ వాళ్లు మాట్లాడే డచ్‌ భాషా పదం. వాళ్ల దేశం నుంచి శాంటాక్లాస్‌ అనే మాట వచ్చింది కాబట్టి, శాంటాక్లాస్‌ది స్పెయిన్‌ అని చెబుతున్న డచ్‌వాళ్ల మాటను మనం పూర్తిగా కాదనేందుకు లేదు. డచ్‌వాళ్లకు ఇంకో నమ్మకం కూడా ఉంది. క్రిస్మస్‌ గిఫ్టులు ఇవ్వడానికి శాంటాక్లాజ్‌ ఒక్కడే వస్తాడని మనం అనుకుంటాం. కానీ కాదట. ఆయన పక్కన ఆయనకు సహాయకులుగా కొన్ని ‘పిల్ల శాంటాలు’ ఉంటారట. వాళ్లేం చేస్తారంటే.. గిఫ్టులు ఇవ్వడానికి క్రిస్మస్‌తాతతో పాటు ఇళ్లకు వెళ్లినప్పుడు అక్కడ పిల్లలెవరైనా తుంటరి పనులు చేస్తే వాళ్లను అమాంతం ఎత్తుకుని తెచ్చేసి స్పెయిన్‌లో వదిలేస్తారట! అంతకుమించిన శిక్ష ఉండదని నెదర్లాండ్స్‌ వాళ్లు అంటారు!

బాల యేసుకు దుప్పటి

రాత్రి పెట్టిన క్రిస్మస్‌ చెట్టు మీద తెల్లారే సాలెగూడు కనిపిస్తే ఏదో అదృష్టం వరించబోతోందని జర్మనీ, పోలండ్, ఉక్రెయిన్‌ దేశాలలో ఒక విశ్వాసం ఉంది. బేబీ జీసెస్‌ కోసం ఆ సాలె పురుగు దుప్పటి నేస్తూ ఉంటుందని కొందరి నమ్మకం. ఆ సాలెగూడు ఉదయాన్నే సూర్య కిరణాలు సోకి బంగారు, వెండి సాలెగూడుగా మారిపోతుందని మరికొందరి నమ్మకం. మన దగ్గర మార్కెట్‌ నుంచి కొని తెచ్చుకున్న రెడీమేడ్‌ క్రిస్మస్‌ ట్రీలో ఏ మూలో సాలెగూడు కూడా ఉండటానికి ఇదే కారణం అయి ఉండొచ్చు. ఈ నమ్మకం గురించి తెలిసినవాళ్లు క్రిస్మస్‌ చెట్టుకు తప్పని సరిగా ఒక ప్లాస్టిక్‌ సాలెగూడును సంపాదించి తగిలిస్తారు. అలా కూడా అదృష్టం కలసి వస్తుందని కొందరు విశ్వసిస్తారు.

పసి మనసులు

కొన్ని పాశ్చాత్య దేశాలలో.. ముఖ్యంగా జర్మనీలో ఒక అందమైన విశ్వాసం ఉంది. క్రిస్మస్‌కు కొద్ది గంటల ముందు.. కల్లాకపటం తెలియని స్వచ్ఛమైన పసి హృదయాలు జంతువుల మాటల్ని వినగలుగుతాయట! అంతేకాదు, నదులు ద్రాక్ష సారాయిగా మారడాన్ని ఆ పసివాళ్ల కళ్లు చూడగలుగుతాయి. క్రిస్మస్‌ ట్రీకి వాళ్ల కళ్లముందే తియ్యటి బేరీ పండ్లు కాస్తాయి. పర్వతాలు తెరుచుకుని వాటి గర్భంలోని మణులు మాణిక్యాలు బయటపడతాయి. సముద్రపు అడుగునుంచి దేవుని గంటలు ధ్వనిస్తాయి. నిజంగా ఇలా జరిగితే ఎంతమందిమి చూడగలుగుతాం? మనలో ఎన్ని పవిత్రమైన హృదయాలు ఉంటాయి అని ప్రశ్న?!

గంటకు 60 లక్షల మైళ్లు!

క్రిస్మస్‌తాత తెచ్చే గిఫ్టుల కోసం ఎదురు చూసే పిల్లలు ప్రపంచవ్యాప్తంగా 70 కోట్ల మంది వరకు ఉంటారని అంచనా. మరి వారందరికీ గిఫ్టులు చేరవెయ్యాలంటే క్రిస్మస్‌ తాతకు టైమ్‌ సరిపోతుందా? సరిపోతుంది. గంటకు అరవై లక్షల మైళ్ల వేగంతో ప్రయాణిస్తే చాలు. అన్ని దేశాల్లోని అందరి పిల్లలకు గిఫ్టులు అందినట్లే. యు.ఎస్‌.లోని యూనివర్శిటీ ప్రొఫెసర్‌ ఒకరు వేసిన లెక్క ఇది.

ఎక్స్‌మస్‌

క్రిస్మస్‌ని ఎక్స్‌మస్‌ అని కూడా అంటుంటాం. ఎందుకిలా? ఎప్పుడైనా మీకు డౌట్‌ వచ్చిందా? మీకు వచ్చినా రాకున్నా ఎక్స్‌మస్‌ అన్నది మాత్రం క్రిస్మస్‌ నుంచే వచ్చింది. అబ్రివేషన్‌గా వాడుతున్నాం. ఇలా ఇష్టమొచ్చినట్లు వాడితే సరిపోయిందా? లాజిక్‌ ఉండొద్దా? ఉంది! గ్రీకు భాషలో ఛిజిజీ ని గీ తో సంకేతపరుస్తారు. అందుకే క్రైస్ట్, క్రిస్టోస్‌ అనే మాటలకు ముందు వాళ్లు గీ అని రాస్తారు. అలా క్రిస్మస్‌.. ఎక్స్‌మస్‌ అయింది.

బాతు చెట్లు

మొదట్లో క్రిస్మస్‌ చెట్టును బాతు ఈకలతో చేసేవాళ్లు. ఆ ఈకలకు పచ్చరంగు వేసేవారు. 19వ శతాబ్దంలో జర్మనీలో ఇలా చేయడం మొదలైంది. అప్పట్లో అక్కడ అడవుల నరికివేత విపరీతంగా ఉండటంతో చెట్లకు కరువొచ్చింది. దాంతో బాతు ఈకల ఆలోచన వచ్చింది వాళ్లకు. తర్వాత్తర్వాత బాతు ఈకలతో క్రిస్మస్‌ చెట్లను తయారు చేయడమన్నది అమెరికాకు, ఇతర దేశాలకూ వ్యాపించింది.

కెంటకీ ఫర్‌ క్రిస్మస్‌

జపాన్‌లో క్రిస్మస్‌ రోజు కె.ఎఫ్‌.సి.లు కిటకిటలాడిపోతుంటాయి. అక్కడ క్రైస్తవుల సంఖ్య పెద్దగా ఉండదు కానీ, క్రిస్మస్‌ రోజు అంతా కె.ఎఫ్‌.సి.ల దారి పడతారు. కె.ఎఫ్‌.సి. అంటే కెంటకీ ఫ్రైడ్‌ చికెన్‌. అయితే 1947లో కె.ఎఫ్‌.సి. తన సేల్స్‌ పెంచుకోవడం కోసం ‘కెంటకీ ఫర్‌ క్రిస్మస్‌’ అనే మార్కెటింగ్‌ వ్యూహం పన్ని  సక్సెస్‌ అయ్యింది. అప్పట్నుంచీ క్రిస్మస్‌ సీజన్‌లో జపాన్‌వారికి పండగే పండుగ. కె.ఎఫ్‌.సి. వారి నోరూరించే ఆఫర్లు కడుపునిండా ఉంటాయి.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement