దేవుడు దిగి వచ్చిన వేళ | Christmas 2019 Srikakulam Churches Special Story | Sakshi
Sakshi News home page

దేవుడు దిగి వచ్చిన వేళ

Published Wed, Dec 25 2019 9:40 AM | Last Updated on Wed, Dec 25 2019 9:40 AM

Christmas 2019 Srikakulam Churches Special Story - Sakshi

శ్రీకాకుళం తెలుగు బాప్టిస్టు చర్చిలో..

ఒక ధ్రువతార నింగిలో నిండుగా ప్రకాశించింది. చీకట్లు నిండిన బతుకుల్లో వెలుగులు నింపుతూ, కన్నీరు నిండిన కళ్లకు ఆనందాన్ని పంచుతూ, ద్వేషం నిండిన లోకానికి శాంతి సందేశాన్ని అందిస్తూ ఇలకు చేరింది. ఆ తార రాకతో కాలంతో పాటు లోకం కూడా మారింది. శాంతి కోసం ఆ మహా పురుషుడు ఇచ్చిన పిలుపు శతాబ్దాలుగా అందరి గుండెల్లో ప్రతిధ్వనిస్తూనే ఉంది. ప్రేమ కోసం క్రీస్తు చిందించిన రుధిరం వెచ్చటి అశ్రువుల రూపాల్లో ప్రతి చెంపను తడుముతూనే ఉంది. సిక్కోలులోనూ క్రైస్తవం అంతర్వాహినిగా నిశ్శబ్దంగా ప్రవహిస్తోంది. అందుకు ఈ మందిరాలే సాక్ష్యం. వందేళ్లకు పైబడి ఈ మందిరాల్లో ప్రార్థనలు జరుగుతున్నాయి. క్రిస్మస్‌ పర్వదినానికి ఈ ప్రార్థనాలయాలు సర్వాంగసుందరంగా ముస్తాబవుతున్నాయి.
123 ఏళ్లుగా.. 
టెక్కలి: టెక్కలిలో అంబేడ్కర్‌ కూడలిలో ఉన్న ఆంధ్రా బాప్టిస్టు చర్చిలో 123 ఏళ్లుగా ఏటా క్రిస్మస్‌ వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది క్రిస్మస్‌ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. 1905లో కెనడాకు చెందిన క్రిష్టియన్‌ మిషనరీష్‌ ఆధ్వర్యంలో సంఘ ప్రతినిధి ఆర్చి బాలుడు ఆధ్వర్యంలో ఫాస్టర్‌ డబ్ల్యూ.హేగెన్స్‌ పర్యవేక్షణలో ఈ చర్చిని నిర్మించారు. అప్పటి నుంచి ఏటా క్రిస్మస్‌ వేడుకలు నిర్వహిస్తున్నారు. 2015 సంవత్సరానికి 120 ఏళ్లు పూర్తి కావడంతో ఈ చర్చిని పునర్నిర్మించారు. చర్చి సంఘం ప్రతినిధులు సుభాష్, సురేష్, వినోద్, జయకుమార్, నాగరాజు, భక్త విజయం ఆధ్వర్యంలో పునర్నిర్మాణం పనులు చేపట్టారు.

విద్యుత్‌ కాంతులతో మెరిసిపోతున్న టెక్కలిలోని ఆంధ్రా బాప్టిస్టు చర్చి  
క్రైస్తవులకు ఆరాధ్య కేంద్రంగా.. 
గార: బ్రిటిష్‌ పరిపాలన సమయంలో కళింగపట్నంలో పోర్టు నిర్వహణ జరుగుతున్న సమయంలో పోర్టు కళింగపట్నంలో తెలుగు బాప్టిస్టు చర్చిని నిర్మించారు. 1934 సంవత్సరంలో అప్పటి మతపెద్దలు మైలపల్లి రామన్న, మీసాల సుమన్‌ మిషన్‌ ఆధ్వర్యంలో పులిపాక జగన్, గోర్డన్‌ దంపతులు ఈ ప్రార్థనా మందిరాన్ని స్థాపించారు. స్వాతంత్య్రం రావడానికి కొద్ది సంవత్సరాలు ముందు ఈ చర్చిలో సీబీఎం గర్ల్స్‌ స్కూల్‌ పేరుతో పాఠశాలను నడిపేవారు. వారానికి ఐదు రోజులు తరగతులు, ఆదివారం ప్రత్యేక ప్రార్థనలు జరిగేవని చర్చి ఫాస్టర్‌ రామారావు తెలిపారు. ప్రస్తుతం చర్చిలో నిర్వహణ కమిటీ పేరిట ప్రత్యేక ఆరాధనలు, అనాథలకు సేవా కార్యక్రమాలు జరుగుతున్నాయని చర్చి ప్రతినిధి దేవదాసు మాస్టారు తెలిపారు. 

ఈస్ట్‌ ఇండియా కంపెనీ ఆనవాలు 
శ్రీకాకుళం కల్చరల్‌: జిల్లా కేంద్రంలో చిన్నబజారులో ఉన్న తెలుగు బాప్టిస్టు చర్చి క్రిస్మస్‌ వేడుకలకు సిద్ధమవుతోంది. ఈ మందిర నిర్మాణం 1846 సెప్టెంబర్‌ 12వ తేదీన జరిగింది. 1996వ సంవత్సరంలో 150 ఏళ్ల వేడుక ఘనంగా జరిగింది. 2003లో నూతన భవనాన్ని నిర్మించారు. 17వ శతాబ్దంలో జరిగిన కర్నాటక యుద్ధ సంధి ప్రకారం ఈ ప్రాంతం నార్తరన్‌ సర్కారు (ఇంగ్లీషు)వారికి అప్పగించినట్లు చరిత్ర చెబుతోంది. ఈస్ట్‌ ఇండియా కంపెనీ ఆధ్వర్యంలో 41వ బెటాలియన్‌ ఇక్కడ ఉండేది. సైనికుల్లో చాలా మంది లండన్‌ మిషన్‌కు చెందిన భక్తి గల క్రైస్తవులు ఉండటం వల్ల మేజర్‌ బ్రెట్, కెప్టెన్‌ హెలెన్‌నాట్‌ అనేవారు జెమ్స్‌ డాసన్‌ వారి సహకారంతో ఈ ప్రాంతంలో సంఘాన్ని ప్రారంభించారు.  

ప్రార్థనల వేదిక 
రాజాం: రాజాంలో బొబ్బిలి రోడ్డులోని 90 ఏళ్ల చరిత్ర కలిగిన ఆర్‌సీఎం చర్చి క్రిస్మస్‌ వేడుకలకు సిద్ధమైంది. ఈ చర్చిని 1925–30 మధ్య కాలంలో ఇక్కడ ఏర్పాటు చేసినట్లు రాజాం ప్రాంత ప్రజలు చెబుతున్నారు. ఏటా క్రిస్మస్‌కు ఇక్కడకు 1500 మందికిపైగా భక్తులు వస్తుంటారు. రెవరెండ్‌ పాధర్‌ నున్నం ప్రసాద్, రెవరెండ్‌ పాధర్‌ జాన్‌ పీటర్‌లు ఇక్కడ ప్రార్థనలు నిర్వహిస్తున్నారు. ఇక్కడ నిత్యం విద్యుత్‌ దీపాలంకరణ ఉంటుంది. ఈ చర్చి ఆధ్వర్యంలో స్కూల్‌ కూడా నడుస్తోంది.  

వేడుకలకు వేదిక సిద్ధం 
పాలకొండ రూరల్‌: నూట యాభై రెండేళ్లకు పైబడి చరి త్ర కలిగిన పాలకొండ లూర్దుమాత ఆలయం క్రిస్మస్‌ వేడుకలకు సిద్ధమవుతోంది. బ్రిటిష్‌ కాలం నాటి రాతి కట్టడంతో ఉన్న ఈ ఆలయం కాలక్రమేణా కొత్త సొబ గులు సంతరించుకుని ఈ ఏడాది క్రిస్మస్‌ వేడుకలకు సన్నద్ధమవుతోంది. బ్రిటిష్‌ పాలనలో అప్పట్లో విచారణకర్తలు పాలకొండ ప్రాంతంలో ఉన్న సైనికులకు సేవలందించే క్రమంలో ఇక్కడ లూర్దుమాత ఆలయం స్థాపించినట్టు చరిత్ర చెబుతోంది. నాడు వచ్చిన సేవకులు గుర్రాలపై పార్వతీపురం, బొబ్బిలి, సాలూరు, బత్తిలి ప్రాంతాల్లో సంచరిస్తూ సువార్త విస్తరింపజేసినట్టు విచారణకర్తలు పేర్కొంటున్నారు.

పురాతన చర్చి
సీతంపేట: సీతంపేట ఏజెన్సీలోని పత్తికగూడ సమిపంలో కొండపైన ఉన్న ఫాతిమా మాత పుణ్యక్షేత్రంగా పిలిచే చర్చి నిర్మించి 120 ఏళ్లు కావస్తోంది. 1900వ సంవత్సరంలో నిర్మించిన చర్చిని అగస్టన్, వర్గీస్, బాలస్వామి వంటి ఫాదర్లు అభివృద్ధి చేశారు. వారి తర్వాత దీన్ని ప్రస్తుతం అమర్‌రావు ఫాదర్‌ నిర్వహిస్తున్నారు.     పురాతన చర్చి వేడుకకు సిద్ధం సోంపేట: సోంపేట పట్టణంలోని 109 ఏళ్ల చర్చి క్రిస్మస్‌కు సిద్ధమైంది. 1910వ సంవత్సరంలో కెనడా బా ప్టిస్టు చర్చి  ఆధ్వర్యంలో ఈ చర్చిని ప్రారంభించారు. ఈ చర్చికి మొట్ట మొదటి పాస్టర్‌గా కర్మికోటి అబ్రహం వ్యవహరించారు. ప్రస్తుతం 18వ పాస్టర్‌గా కొత్తపల్లి అబ్రహం విధులు నిర్వహిస్తున్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement