శ్రీకాకుళం అసెంబ్లీ నియోజకవర్గంలో పొలిటికల్ హీట్ పెరుగుతోంది. ఎన్నికలకు చాలా కాలం ఉన్నా పచ్చ పార్టీలో ఈ సీటు కోసం పోటీ పెరుగుతోంది. దశాబ్దాలుగా ఇక్కడ చక్రం తిప్పుతున్న సీనియర్ నేత కుటుంబానికి ఈ సారి చెక్ పెట్టాలని టీడీపీ అధినేత నిర్ణయించారట. అయితే తమ కుటుంబానికే శ్రీకాకుళం ఇవ్వాలని వారు గట్టిగా అడుగుతున్నారట. మరి పచ్చ పార్టీ బాస్ ఏం నిర్ణయం తీసుకుంటారో? అసలు అక్కడ ఏం జరుగుతోంది?
37 ఏళ్లుగా శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో చక్రం తిప్పుతున్న గుండ అప్పల సూర్యనారాయణ కుటుంబానికి వచ్చే సారి సీటు ఇవ్వరాదని టీడీపీ నాయకత్వం నిర్ణయం తీసుకుందట. నాలుగుసార్లు సూర్యనారాయణ, ఒకసారి ఆయన భార్య లక్ష్మీదేవి ఇక్కడి నుంచి విజయం సాధించారు. 2019లో మరోసారి ఆమెకే టికెట్ ఇవ్వగా ధర్మాన ప్రసాదరావు చేతిలో పరాజయం పొందారు. వచ్చే 2024 ఎన్నికల్లో కూడా తమలోనే ఎవరికో ఒకరికి టికెట్ ఇవ్వాలని కోరుతున్నారు.
కాని ఈసారి వీరిద్దరికి ఛాన్స్ లేదని జిల్లా టీడీపీ వర్గాల్లో వినిపిస్తోంది. ఇదిలా ఉంటే.. శ్రీకాకుళం ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు ఇక్కడ నుండి అసెంబ్లీకి పోటీ చేయడానికి పావులు కదుపుతున్నారు. తన బాబాయ్ అచ్చెన్నాయుడు ఆధిపత్యానికి చెక్ పెట్టాలంటే తాను కూడా అసెంబ్లీకి వెళ్లాల్సిందేనన్నది రామ్మోహన్ నాయుడు ఆలోచనగా ఉంది. ఇందు కోసం ఈయన నరసన్నపేట లేదా శ్రీకాకుళం అనే ఆప్షన్ తీసుకోనున్నారని ఎంపీ సన్నిహితులు చెబుతున్నారు.
బాబు నిర్వాకం బట్టబయలు
మరోవైపు గుండ అప్పల సూర్యనారాయణకు ముఖ్య అనుచరుడుగా ఉన్న గొండు శంకర్ కూడా శ్రీకాకుళం నుండి అసెంబ్లీకి పోటీ చేయాలని ఉత్సాహం చూపిస్తున్నారు. 2019 ఎన్నికల్లో గొండు శంకర్ ద్రోహం చేయడం వల్లే తమకు ఓటమి సంభవించిందని గుండ దంపతుల అనుమానం. అప్పటి జిల్లా పార్టీ అధ్యక్షుడు చౌదరి బాబ్జీతో పిచ్చాపాటిగా మాట్లాడుతూ చంద్రబాబు, యర్రంనాయుడుల వైఖరిని విమర్శించారు గుండ అప్పలసూర్యానారాయణ.
చంద్రబాబు వైఖరి వలన పార్టీ తీవ్రంగా నష్టపోనున్నదని, పార్టీలో తనకు అవమానాలు ఎదురయ్యాయంటూ.. తన బాధను చెప్పుకుంటున్న సందర్బంలో వీరిద్దరి మధ్య జరిగిన చర్చ ఆడియో రికార్డు సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆ సందర్బంలో గొండు శంకర్ అక్కడే ఉన్నాడని, ఆయనే ఈ ఆడియో లీక్ చేసారని గుండ దంపతుల అనుమానం. అప్పటి నుండి గొండు శంకర్ ను వీరిద్దరూ దూరం పెట్టారు. దీంతో గొండు శంకర్ వీరిద్దరికి వ్యతిరేకంగా కొత్త శిబిరం పెట్టి వచ్చే ఎన్నికల్లో పోటీకి సిద్దపడుతున్నారు.
అచ్చెన్న మాటకు విలువుందా?
మరో వైపు 2009 ఎన్నికల్లో ప్రజారాజ్యం తరపున పోటీ చేసి ఓడిపోయిన కొర్ను ప్రతాప్ ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో క్రియాశీలంగా ఉన్నారు. ఎం.పి రామ్మోహన్ నాయుడు పోటీ చేయకపోతే శ్రీకాకుళంలో తనకు అవకాశం ఇస్తారని ఆయన ఆశిస్తున్నారు.
ఈయనకు రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు మద్దతు కూడా ఉందంటూ ప్రచారం చేసుకుంటున్నారు. మొత్తం మీద గుండ దంపతులు అవుట్ డేటెడ్ కావడంతో కొత్తవారు ఈ స్థానం నుండి పోటీకి ఉవ్విళ్లూరుతున్నారు. ఎం.పి రామ్మోహన్ నాయుడు, గొండు శంకర్, కొర్ను ప్రతాప్ లలో ఎవరు ఈ టికెట్ ను ఎగరేసుకుపోతారో కొద్ది రోజుల్లో తేలిపోతోంది. కొత్తతరం హడావుడితో ప్రస్తుతానికి గుండ దంపతుల శిబిరం మాత్రం బోసి పోయి కనిపిస్తోంది.
పొలిటికల్ ఎడిటర్, సాక్షి డిజిటల్
feedback@sakshi.com
Comments
Please login to add a commentAdd a comment