తమ్ముడు తమ్ముడే..పేకాట పేకాటే. ఉత్తరాంధ్రలో నాటు సామెత ఇది. అక్కడి రాజకీయాల్లో కూడా ఇదే వర్తిస్తుంది. పదవుల కోసం, ఆధిపత్యం కోసం బంధుత్వాలను కూడా లెక్కచేయకుండా పోటీపడుతుంటారు. శ్రీకాకుళం జిల్లాలో బాబాయ్.. అబ్బాయ్ ల మద్య ఇదే తరహా పొలిటికల్ వార్ నడుస్తోంది. టిడిపిలో టాప్ 2 లీడర్స్ గా ఎదిగినా వెన్నుపోటు రాజకీయాలు మాత్రం మానడం లేదు. ఇంతకీ బాబాయ్ అబ్బాయ్ లు ఎవరో తెలుసా?
శ్రీకాకుళం జిల్లాలో కింజరాపు యర్రంనాయుడు పొలిటికల్ హిస్టరీ అందరికీ తెలిసిందే. ఎన్టీఆర్ టైంలో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చి, వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న నాయకుడు యర్రంనాయుడు. అనుకోకుండా పార్లమెంట్ స్థానానికి పోటీ చేసి కేంద్ర మంత్రి అయ్యాక టిడిపి లో టాప్ 2 పొజిషన్ లో నిలిచిపోయారు. యర్రంనాయుడు పార్లమెంట్ సీటుకి ఫిక్స్ అయిపోయాక అసెంబ్లీ స్థానంలోకి అచ్చెన్నాయుడు వచ్చి చేరారు.
ఈలోగా యర్రంనాయుడు మృతి చెందడంతో అనూహ్యంగా 2014 ఎన్నికల్లో యర్రంనాయుడు కుమారుడు కింజరాపు రామ్మోహన్ నాయుడు లోక్ సభకు పోటీ చేసి గెలిచారు. 2019లో కూడా రామ్మోహన్ నాయుడు గెలిచి ఎంపీగా కొనసాగుతున్నారు. ఇదే సమయంలో అచ్చెన్నాయుడు టీడీపీ ప్రభుత్వంలో మంత్రిగా, ఆ తరువాత రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. దీంతో జిల్లా టీడీపీ రాజకీయాల్లో అచ్చెన్నాయుడు హవా కొనసాగుతున్నట్టే చెప్పొచ్చు.
రామ్మెహన్ రావు టీంకు గుబులు..
తన భర్త యర్రంనాయుడు తమ్ముడిగా ఎంట్రీ ఇచ్చిన మరిది అచ్చెన్నాయుడి రాజకీయ ఎదుగదల, తన కొడుకు రామ్మోహన్ను పక్కనపెట్టే ప్రయత్నాలను వదిన విజయలక్ష్మి జీర్ణించుకోలేకపోతున్నారట. ఇదే తరహా రాజకీయాలు కొనసాగితే అచ్చెన్నాయుడు చాటున ఎదుగు బొదుగు లేకుండా ఎన్నాళ్లు ఉంటామన్న గుబులు కింజరాపు రామ్మోహన్ నాయుడు టీంకి పట్టుకుంది. ఈ విషయమై చంద్రబాబు వద్ద పలు మార్లు పంచాయితీ కూడా నడిచింది.
ఇదిలా ఉండగా తాజాగా సంక్రాంతికి సొంతూరు నిమ్మాడలో బాబాయ్.. అబ్బాయ్ కుటుంబాల మద్య ఆదిపత్య పోరు బయటపడిందట. ఆ ఇంటి కాకి ఈ ఇంటిపై వాలడం లేదంట. పండక్కి ఇరు కుటుంబాలు ఒక చోట చేరలేదు సరికదా, అచ్చెన్నాయుడు ఇంటికి వెళ్లినవారిని యర్రంనాయుడు కుటుంబం టార్గెట్ చేసి మాట్లాడిందట. అలాగే రామ్మోహన్ నాయుడు దగ్గరకు వెళ్లిన వారిపై అచ్చెన్నాయుడు సెటైర్లు వేశారట.
బాబాయ్ తప్పుకోవాలని..
రానున్న ఎన్నికల్లో అసెంబ్లీకి వెళ్తాను, బాబాయ్‌ను తప్పుకోమనండి అని అబ్బాయ్ పలువురు తో అచ్చెన్నాయుడు దగ్గరకి రాయబారం పంపిన్నట్టు సమాచారం. అయితే టెక్కలి అసెంబ్లీ స్థానం నుండి తప్పుకునేది లేదని అచ్చెన్నాయుడు ఫిక్స్ అయిపోవడంతో అబ్బాయ్ చూపు నరసన్నపేట మీద పడిందట. చంద్రబాబుకు కూడా ఇదే ఫిక్స్ చేయమని తన తల్లి విజయలక్ష్మి, పిల్లనిచ్చిన మామ బండారు సత్యన్నారాయణ, అక్క రాజమండ్రి ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానిలతో గట్టిగా చెప్పించారు.
అయితే చంద్రబాబు ఏ విషయం తేల్చకపోయినప్పటికీ కింజరాపు కుటుంబం మరో ప్రతిపాదన తీసుకొచ్చిందట. అవసరమైతే శ్రీకాకుళం ఎం.పి స్థానానికి యర్రంనాయుడు కుమార్తె ఆదిరెడ్డి భవానిని బరిలో దింపుతామని, రామ్మోహన్ నాయుడు మాత్రం అసెంబ్లీ స్థానానికే పోటీచేస్తాడని తేల్చి చెప్పారు. ఒకే కుటుంబం నుండి ఒక జిల్లాలో ముగ్గురికి టికెట్ లు ఇస్తే ఎలా అన్నది కింజరాపు కుటుంబం అంటే గిట్టని టిడిపి సీనియర్ బ్యాచ్ లాజికల్ పాయింట్ తీస్తోంది. టిడిపి రాజకీయాలంటే కింజరాపు కుటుంబానిది మాత్రమే కాదు అన్నది వీరి వాదన. దీంతో చంద్రబాబు ఏమీ తేల్చకుండా అలా వదిలేశారు.
అయితే అబ్బాయి గట్టిగా పేచీకి దిగితే బాబాయ్ అచ్చెన్నాయుడుని ఎం.పి స్థానానికి ఫిక్స్ చేసి, అబ్బాయిని టెక్కలి అసెంబ్లీ స్థానంలోకి తీసుకువచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయని శ్రీకాకుళం తెలుగుదేశం వర్గాల్లో చర్చ సాగుతోంది.
చదవండి: ‘నారా లోకేశ్ ఏ ఎన్నికల్లోనైనా గెలిచాడా?’
Comments
Please login to add a commentAdd a comment