Backstabbing
-
టీడీపీలో వెన్నుపోటు రాజకీయాలు.. బాబాయ్, అబ్బాయ్ వార్..
తమ్ముడు తమ్ముడే..పేకాట పేకాటే. ఉత్తరాంధ్రలో నాటు సామెత ఇది. అక్కడి రాజకీయాల్లో కూడా ఇదే వర్తిస్తుంది. పదవుల కోసం, ఆధిపత్యం కోసం బంధుత్వాలను కూడా లెక్కచేయకుండా పోటీపడుతుంటారు. శ్రీకాకుళం జిల్లాలో బాబాయ్.. అబ్బాయ్ ల మద్య ఇదే తరహా పొలిటికల్ వార్ నడుస్తోంది. టిడిపిలో టాప్ 2 లీడర్స్ గా ఎదిగినా వెన్నుపోటు రాజకీయాలు మాత్రం మానడం లేదు. ఇంతకీ బాబాయ్ అబ్బాయ్ లు ఎవరో తెలుసా? శ్రీకాకుళం జిల్లాలో కింజరాపు యర్రంనాయుడు పొలిటికల్ హిస్టరీ అందరికీ తెలిసిందే. ఎన్టీఆర్ టైంలో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చి, వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న నాయకుడు యర్రంనాయుడు. అనుకోకుండా పార్లమెంట్ స్థానానికి పోటీ చేసి కేంద్ర మంత్రి అయ్యాక టిడిపి లో టాప్ 2 పొజిషన్ లో నిలిచిపోయారు. యర్రంనాయుడు పార్లమెంట్ సీటుకి ఫిక్స్ అయిపోయాక అసెంబ్లీ స్థానంలోకి అచ్చెన్నాయుడు వచ్చి చేరారు. ఈలోగా యర్రంనాయుడు మృతి చెందడంతో అనూహ్యంగా 2014 ఎన్నికల్లో యర్రంనాయుడు కుమారుడు కింజరాపు రామ్మోహన్ నాయుడు లోక్ సభకు పోటీ చేసి గెలిచారు. 2019లో కూడా రామ్మోహన్ నాయుడు గెలిచి ఎంపీగా కొనసాగుతున్నారు. ఇదే సమయంలో అచ్చెన్నాయుడు టీడీపీ ప్రభుత్వంలో మంత్రిగా, ఆ తరువాత రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. దీంతో జిల్లా టీడీపీ రాజకీయాల్లో అచ్చెన్నాయుడు హవా కొనసాగుతున్నట్టే చెప్పొచ్చు. రామ్మెహన్ రావు టీంకు గుబులు.. తన భర్త యర్రంనాయుడు తమ్ముడిగా ఎంట్రీ ఇచ్చిన మరిది అచ్చెన్నాయుడి రాజకీయ ఎదుగదల, తన కొడుకు రామ్మోహన్‌ను పక్కనపెట్టే ప్రయత్నాలను వదిన విజయలక్ష్మి జీర్ణించుకోలేకపోతున్నారట. ఇదే తరహా రాజకీయాలు కొనసాగితే అచ్చెన్నాయుడు చాటున ఎదుగు బొదుగు లేకుండా ఎన్నాళ్లు ఉంటామన్న గుబులు కింజరాపు రామ్మోహన్ నాయుడు టీంకి పట్టుకుంది. ఈ విషయమై చంద్రబాబు వద్ద పలు మార్లు పంచాయితీ కూడా నడిచింది. ఇదిలా ఉండగా తాజాగా సంక్రాంతికి సొంతూరు నిమ్మాడలో బాబాయ్.. అబ్బాయ్ కుటుంబాల మద్య ఆదిపత్య పోరు బయటపడిందట. ఆ ఇంటి కాకి ఈ ఇంటిపై వాలడం లేదంట. పండక్కి ఇరు కుటుంబాలు ఒక చోట చేరలేదు సరికదా, అచ్చెన్నాయుడు ఇంటికి వెళ్లినవారిని యర్రంనాయుడు కుటుంబం టార్గెట్ చేసి మాట్లాడిందట. అలాగే రామ్మోహన్ నాయుడు దగ్గరకు వెళ్లిన వారిపై అచ్చెన్నాయుడు సెటైర్లు వేశారట. బాబాయ్ తప్పుకోవాలని.. రానున్న ఎన్నికల్లో అసెంబ్లీకి వెళ్తాను, బాబాయ్‌ను తప్పుకోమనండి అని అబ్బాయ్ పలువురు తో అచ్చెన్నాయుడు దగ్గరకి రాయబారం పంపిన్నట్టు సమాచారం. అయితే టెక్కలి అసెంబ్లీ స్థానం నుండి తప్పుకునేది లేదని అచ్చెన్నాయుడు ఫిక్స్ అయిపోవడంతో అబ్బాయ్ చూపు నరసన్నపేట మీద పడిందట. చంద్రబాబుకు కూడా ఇదే ఫిక్స్ చేయమని తన తల్లి విజయలక్ష్మి, పిల్లనిచ్చిన మామ బండారు సత్యన్నారాయణ, అక్క రాజమండ్రి ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానిలతో గట్టిగా చెప్పించారు. అయితే చంద్రబాబు ఏ విషయం తేల్చకపోయినప్పటికీ కింజరాపు కుటుంబం మరో ప్రతిపాదన తీసుకొచ్చిందట. అవసరమైతే శ్రీకాకుళం ఎం.పి స్థానానికి యర్రంనాయుడు కుమార్తె ఆదిరెడ్డి భవానిని బరిలో దింపుతామని, రామ్మోహన్ నాయుడు మాత్రం అసెంబ్లీ స్థానానికే పోటీచేస్తాడని తేల్చి చెప్పారు. ఒకే కుటుంబం నుండి ఒక జిల్లాలో ముగ్గురికి టికెట్ లు ఇస్తే ఎలా అన్నది కింజరాపు కుటుంబం అంటే గిట్టని టిడిపి సీనియర్ బ్యాచ్ లాజికల్ పాయింట్ తీస్తోంది. టిడిపి రాజకీయాలంటే కింజరాపు కుటుంబానిది మాత్రమే కాదు అన్నది వీరి వాదన. దీంతో చంద్రబాబు ఏమీ తేల్చకుండా అలా వదిలేశారు. అయితే అబ్బాయి గట్టిగా పేచీకి దిగితే బాబాయ్ అచ్చెన్నాయుడుని ఎం.పి స్థానానికి ఫిక్స్ చేసి, అబ్బాయిని టెక్కలి అసెంబ్లీ స్థానంలోకి తీసుకువచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయని శ్రీకాకుళం తెలుగుదేశం వర్గాల్లో చర్చ సాగుతోంది. చదవండి: ‘నారా లోకేశ్ ఏ ఎన్నికల్లోనైనా గెలిచాడా?’ -
ఎన్టీఆర్ కు వెన్నుపోటు ఎపిసోడ్ పై వెంకయ్యనాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు
-
మ్యాగజైన్ స్టోరీ : వెన్నుపోటు తప్పా బావా...?
-
మేకవన్నె పులి బాబూ!
దుర్మార్గుడు... మేకవన్నె పులి... ప్రజాస్వామ్య హంతకుడు... గుండెల్లో చిచ్చు పెట్టిన వాడు... గూడుపుఠాణీకి గురువు... మోసానికి మూలస్తంభం... ఇవన్నీ దివంగత నందమూరి తారక రామారావు నోటి నుంచి వెలువడ్డ శిలాక్షరాలు. చంద్రబాబునాయుడు ‘విశ్వరూపాన్ని’ కళ్లారా చూసి ఆయనే స్వయంగా అనుగ్రహించిన బిరుదరాజాలు. అల్లుడని నమ్మినవాని చేతిలోనే అడ్డంగా వెన్నుపోటుకు గురైన ఆక్రోశం నుంచి పుట్టుకొచ్చిన శాపనార్థాలు. ఎన్టీఆర్ తన చివరి దశలో కనీసం చంద్రబాబు పేరును ఉచ్చరించేందుకు కూడా ఇష్టపడలేదు. కానీ మళ్లీ అధికారంలోకి రావడం కోసం ఎన్టీఆర్ నామభజన చేస్తున్నారు చంద్రబాబు. రేపటి నుంచి ఎన్టీఆర్ శత జయంతి సంవత్సరం ప్రారంభం కానుంది. టీడీపీ వాళ్లు మహానాడు జరుపుకొంటున్నారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ వివిధ సందర్భాల్లో తమ పార్టీ కార్యకర్తలతో చంద్రబాబు గురించి మాట్లాడిన మాటలు గుర్తు చేస్తున్నాం. తమ్ముళ్లారా! చెల్లెళ్లారా! ఇదిగో మీ అన్నను మాట్లాడుతున్నాను. శ్రద్ధగా వినండి. మీ బుద్ధితో ఆలోచించండి. మీ నిర్ణయంతో నన్ను ఆదేశించండి. మీరు చెప్పేదే న్యాయం. చేసేదే ధర్మం. నాటి నుంచి నేటి వరకూ జరిగిన చరిత్రను మీ ముందు, అంటే ప్రజాన్యాయస్థానం ముందుంచుతున్నాను. మంచేదో చెడేదో; నిజమేదో అబద్ధమేదో; ఆశయ మేదో ఆశేదో మీకు తెలియాలనే ఈ ప్రయత్నం. నీతికీ అవినీతికీ మధ్య జరుగుతున్న ఈ పోరా టంలో న్యాయనిర్ణేతలు మీరే. ఎవరు విజేతలో తేల్చాల్సింది కూడా మీరే. బాబు ఒక చిన్న మిడత 224 సీట్లతో అధికారం చేపట్టిన తెలుగుదేశం ప్రాభవాన్ని ప్రతిఘటించడం చేతకాని వ్యతిరేక శక్తులు కొంతమంది, (1995లో) లోలోన గూడు పుఠాణీ ఆరంభించారు. దీనికి గురువు, ఈ కుట్రకు కొలువు, మోసానికి మూలస్తంభం, ఈ పద్మవ్యూహానికి కేంద్రబిందువు చంద్రబాబు నాయుడు! నా అల్లుడనబడుతున్నవాడే నా గుండెల్లో చిచ్చు పెట్టాడు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించడానికి ముందు అతనేమిటో మీ అందరికీ తెలుసు. కాంగ్రెస్‌లో ఉంటూ, మంత్రులపై కూడా పోటీ చేస్తానంటూ ప్రగల్భాలు పలికి, చివరకు తెలుగు దేశం మహా ప్రభంజనంలో కొట్టుకుపోయిన ఓ చిన్నమిడత. తెలుగుదేశం అధికారంలోకి వచ్చాక, అతను పార్టీలో చేరతానని వస్తే, చేర్చుకోవద్దని కొందరు హితవు చెప్పారు. అయినప్పటికీ పశ్చా త్తాపాన్ని ప్రకటించాడు కదా అని ఔదార్యంతో చేర్చుకున్నాను. తర్వాత పార్టీలో ముఖ్యమైన పదవులన్నీ ఇచ్చాను. అయితే అతడు ప్రజాసేవ కోసం కాక పదవి కోసమే పార్టీలో చేరాడన్న దుర్మార్గాన్ని నేను కనిపెట్టలేకపోయాను. అతడు కడుతున్న ముఠాల గురించీ, చేరదీస్తున్న గ్రూపుల గురించీ పట్టించుకోలేదు. అతడిలో పదవీ కాంక్ష ఇంతగా గూడుకట్టుకుంటుందనీ, అతడి వల్ల ప్రజలచేత ఎన్నుకున్న ప్రభుత్వం తప్పుకోవాల్సి వస్తుందనీ, అతని వల్ల ప్రజాభీష్టమే వ్యర్థమై పోతుందనీ, ప్రజాస్వామ్యం పట్టపగలే హత్యకు గురౌతుందనీ, అధికారం కోసం ఆ పెద్దమనిషి ఇంతటి అల్పమైన నీచమైన దారుణమైన వెన్ను పోటుకు కూడా సిద్ధపడతాడనీ నేనూహించలేక పోయాను. నామీద ఒక అభియోగం సృష్టించాడు. కార్యకర్తలకేదో అన్యాయం జరిగిందట. ఏమిటా అన్యాయం? ఎవరికా అన్యాయం? పార్టీపట్ల శ్రద్ధా భక్తులతో, అంకితభావంతో పనిచేసి ప్రజల విశ్వాసం చూరగొన్న ఏ నా కార్యకర్తలకూ ఏ నా తెలుగు తమ్ముళ్లకూ అన్యాయం జరగలేదు. ఒకవేళ ఏదైనా లోటు జరిగితే అది అవకాశవాదులకు మాత్రమే జరిగింది! చంద్రబాబు... ఆ పెద్ద మనిషి.... ఆ మేకవన్నె పులి... ఆ తేనెపూసిన కత్తి తయారుచేసిన కుట్రదారులకే జరిగింది! అతడి పక్కన చేరి, కుహనా కార్యకర్తలుగా చలామణై, దళారీలుగా ఉన్నవారికే జరిగింది! పేరు చెప్పేందుకూ అనర్హుడే ఇవాళ నేను మాట్లాడుతున్న వ్యక్తి ఓడిపోయి తెలుగుదేశంలోకి వచ్చాడు. నా విధానాలకు పూర్తిగా అంకితమవుతానని మాటిచ్చాడు. కానీ అతని మనసులో ఉన్న దురాశ మాత్రం పోలేదు. నేనిన్ని పదవులిచ్చాను. కానీ ఆయన మాత్రం తన కంటూ ఓ గుంపును తయారు చేసుకున్నాడు. అది నేను గమనించలేదు. ఎవరూ ఊహించని విధంగా (1994 ఎన్నికల్లో) మాకు 214 సీట్లు వచ్చాయి. ఆ తర్వాత పార్టీలో చేరిన వారితో చూసుకుంటే 224 సీట్లు! కాబట్టి వాళ్లేం చేయలేకపోయారు. అదే ఏ 130, 140 సీట్లో వచ్చుంటే వాళ్లేమైనా చేసి ఉండే వాళ్లు. మాకిది కావాలి, అది కావాలంటూ కోరే వారు. ఎందుకంటే అంతకు ముందే రంగం ఏర్పాటై ఉంది. అందరికీ డబ్బిచ్చాడు ఈయన. ఆయన పేరు చెçప్పడం కూడా నాకిష్టంలేదు. పేరు చెప్పేందుకు కూడా ఆయన అర్హుడు కాదు. అంద రికీ 5లక్షలు, 10 లక్షలు డబ్బులిచ్చి ‘ఇదిగో ఎన్ని కల కోసం మీ అందరికీ డబ్బిస్తున్నాను. మీరంతా నా మనుషులుగా ఉండాలి’ అంటూ ఏర్పాటు చేసుకున్నాడు. ఇక ఎప్పుడైతే 224 సీట్లు టీడీపీకి వచ్చాయో ఆయన ఆటలు సాగలేదు. తప్పనిసరిగా ఎన్టీఆర్‌నే నాయకుడిగా ఎన్నుకోవాల్సి వచ్చింది. కానీ ఎలాగైనా ముఖ్యమంత్రి కావాలన్న ఆశ మాత్రం ఆయన మనసులో చావలేదు. ఆ ఆశతోనే తన గ్రూపును తయారు చేశాడు. ఇట్స్ ఏ ప్లాన్డ్ ట్రెచెరీ! తెలుగు జాతి దురదృష్టం చరిత్రను చూస్తే... తండ్రిని జైల్లో పెట్టిన సమ్రాట్లు న్నారు. రాజ్యాధికారం కోసం అన్నల్ని చంపిన సోదరుడున్నాడు... ఔరంగజేబు. అలాంటి దుర దృష్టకరమైన విధానం మళ్లీ ఇన్ని వందల ఏళ్ల తర్వాత తెలుగు జాతి చరిత్రలో మన రాష్ట్రంలో ఈనాడు తిరిగి జరిగింది. అది మన దురదృష్టం. అలాంటి చిన్నబుచ్చేతనాన్ని మన జాతి అనుభ వించడం అనేది కేవలం నేను చేసుకున్న పాపం. ఎందుకంటే నా వాళ్లుగా ఉంటూ ఈనాడు జాతికే ద్రోహం చేసి మాయని మచ్చను తెచ్చారు. ప్రజా స్వామ్యానికిది చిన్నతనం. (1995 ఆగస్టు 23 నాటి వెన్నుపోటుకు కొద్ది రోజుల ముందు) నేను శ్రీకాకుళం, విశాఖపట్నం, విజయనగరం వెళ్లిన ప్పుడు అక్కడ కూడా ఈ మహానుభావుడే, ఎవరైతే ఈనాడు జాతికే చిన్నతనం తెచ్చారో... అవమానకరంగా వ్యవహరించారో... తెలుగు జాతిని కించపరిచారో... ఆ మహానుభావుడే, ‘రామారావు గారు లేకపోతే మా పార్టీ (తెలుగు దేశం) లేదు. ఆయన వల్లే పార్టీ నడుస్తోంది. మేమాయన వెనకాల ఉంటున్నాం. ఈ ఖ్యాతి, గౌరవం అంతా ఆయనదే. రామారావే మా నాయ కుడు’ అన్నాడు. అలా చెప్పినవాడే 23వ తేదీ సాయంత్రానికల్లా ఎందుకు మారారంటారు? ఆదర్శాలకు వెన్నుపోటు ఈ వెన్నుపోటు జరిగింది నాకొక్కడికి మాత్రమే కాదు. ప్రజలకు, మీకు, మీరు వేసిన ఓటుకు. మీరు నమ్మిన ప్రజాస్వామ్యానికి, మీరు విశ్వసించిన ఆశయాలకు, ఆదర్శాలకు ఇది వెన్నుపోటు! ఇంత నీచానికి ఒడిగట్టిన చంద్రబాబు... ఎన్టీఆర్ లాగే ఆయన విధానాలే కొనసాగిస్తామని చెబుతుంటే ఎలా ఉందో తెలుసా? చేతులు జోడించి, నమ స్కారం చేసి, తుపాకీ పేల్చి గాంధీ మహాత్ముడ్ని పొట్టనబెట్టుకున్న గాడ్సేనే మించిపోయాడు అనిపిస్తోంది. ఇది సిగ్గుచేటు. క్షమించరాని నేరం. వీళ్లంతా ఇలా ఎందుకు చేశారు? ఎందుకు వెన్నుపోటు పొడి చారు? ఏమిటి, ఏమిటి ఎన్టీఆర్ చేసిన తప్పు? ఏమిటి, ఏమిటి ఎన్టీఆర్ చేసిన నేరం? బాబును చరిత్ర క్షమించదు అయామ్ ద లయన్. నేనే సింహాన్ని. ఎందుకంటే సింహం మృగరాజు. ఏ అవమానాన్నీ సహించదు. కాబట్టి నాకెలా అవమానం జరిగింది, నా వాళు,్ల నా అన్నవాళ్లు నన్నే విధంగా మోసం చేశారో ప్రజలకు తెలుసు. అయినా నేను చెప్పడం నా ధర్మం. నా కర్తవ్యం. ప్రజల ప్రతినిధిని నేను. నాకేం జరిగినా ప్రజలకు తెలియజెప్పడం నా బాధ్యత. దేవుడు సహా ఎవరూ క్షమించలేని ఘాతుకానికి బాబు ఒడి గట్టాడు. దీన్ని జాతి, చరిత్ర ఎప్పటికీ క్షమించదు. మీకు ఏ విధమైన రాజకీయం కావాలి? ఏ విధంగా ప్రజాస్వామ్యం ఉండాలి? అది నిర్ణయించుకోవా ల్సింది మీరే. అదే ప్రజాస్వామ్యం. కాబట్టి ఏ పార్టీ అయితే ప్రజాస్వామ్యాన్ని ఉద్ధరిస్తుందో, ఏ పార్టీ అయితే మనం తెచ్చుకున్న స్వాతంత్య్రానికి ఓ చక్కని రూపం దిద్దగలుగుతుందో, అలాంటి పార్టీకే మీరు నిర్భయంగా ఓటేయండి. ఓటు మీ జన్మ హక్కు. దాన్ని నిరుపయోగం చేయకండి. పిరికి తనంతో దాన్ని మరోరకంగా ఉపయోగించకండి... ఇది ‘అన్న’ మాట. -
జనం ఓటు..అల్లుడి పోటు
శాసనసభ చరిత్రలోనే 1994 ఎన్నికలకు ఎంతో ప్రత్యేకత ఉంది. ఈ ఎన్నికల్లో అఖండ మెజారిటీతో గెలుపొందాక పట్టుమని పదినెలలు కూడా సీఎం పదవిలో కొనసాగకుండానే టీడీపీ అధినేత ఎన్టీఆర్ రాజీనామా చేయాల్సి వచ్చింది. మూడో అల్లుడు చంద్రబాబునాయుడు పన్నిన రాజకీయ కుట్రకు ఎన్టీరామారావు బలయ్యారు. స్వపక్షం నుంచి అదీకూడా అత్యంత నమ్మకస్థుడైన వ్యక్తి నుంచే అనూహ్యమైన పద్థతుల్లో ఎదురైన రాజకీయ ఎత్తుగడలు, వ్యూహాలకు ఆయన చిత్తయ్యారు. రాజకీయాల్లో హత్యలుండవు ఆత్మహత్యలే ఉంటాయన్న నానుడిని నిజం చేస్తూ సొంత అల్లుడు రచించిన వెన్నుపోటు రాజకీయాన్ని ఏమాత్రం గ్రహించలేకపోయారు. ఆ ఎన్నికల్లో ఎన్టీఆర్ ప్రజాకర్షకశక్తితో టీడీపీ మొత్తం 216 స్థానాల్లో తిరుగులేని అధిక్యతను సాధించింది. అయితే అల్లుడు పొడిచిన వెన్నుపోటుతో అధికారాన్ని కోల్పోయారు. తీవ్రమైన మనోవేదన మధ్య సీఎం పీఠం చంద్రబాబు వశమయ్యాక నాలుగున్నర నెలల్లోనే 1996 జనవరి 18న ఎన్టీఆర్ మరణించారు. 1996, 1998 లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రంలో వామపక్షాలతో పోత్తుపెట్టుకున్న చంద్రబాబు 1999 లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలకల్లా యూటర్న్ తీసుకుని బీజేపీతో పొత్తు కుదుర్చుకున్నారు. రెండో ఆగస్టు సంక్షోభం... 1993లో ఎన్టీరామారావు లక్ష్మీ పార్వతిని రెండో వివాహం చేసుకున్న సమయంలో టీడీపీ ప్రతిపక్షంలో ఉండడంతో చంద్రబాబు అణిగిమణిగి ఉన్నట్టుగా కనిపించారు. టీడీపీ అధికారానికి వచ్చాక చంద్రబాబును విశ్వసించి ఆర్థిక, రెవెన్యూ వంటి కీలకశాఖలను ఎన్టీఆర్ అప్పగించారు. పరిపాలనలో లక్ష్మీపార్వతి జోక్యం ఆరోపణలతో పాటు 1995 ప్రథమార్థంలో జరిగిన మున్సిపల్, పంచాయతీరాజ్, సహకార ఎన్నికల్లో లక్ష్మీపార్వతి సూచించిన అభ్యర్థులు ఎక్కువ మందికి టికెట్లు కేటాయించడం వంటి పరిణామాలు చంద్రబాబు ఆగ్రహానికి కారణమైంది. పదకొండేళ్ల తర్వాత 1995లో ఎన్టీఆర్ రెండో ఆగస్టు సంక్షోభాన్ని ఎదుర్కొన్నారు. టీడీపీలో మెజారిటీ ఎమ్మెల్యేల మద్దతుతో పాటు వామపక్షాల అండదండలు కూడా చంద్రబాబుకు లభించాయి. టీడీఎల్పీలో చీలిక కారణంగా అసెంబ్లీలో బలం నిరూపించుకోవాలని ఎన్టీఆర్‌కు గవర్నర్ కృష్ణకాంత్ కోరారు. బలపరీక్షకు ముందే ఎన్టీఆర్ రాజీనామా చేయడంతో 1995 సెప్టెంబర్ 1న చంద్రబాబు సీఎంగా ప్రమాణం చేశారు. కుమ్ములాటలే కొంప ముంచాయి ముఠా కుమ్ములాటలు తీవ్రస్థాయికి చేరుకున్న నేపథ్యంలో 1994 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ తీవ్ర పరాభవం ఎదుర్కొంది. టీడీపీ అత్యధిక సీట్లు కైవసం చేసుకుంది. టీడీపీ 216 స్థానాల్లో విజయం సాధించింది. రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ చరిత్రలోనే గతంలో ఎన్నడూ లేని విధంగా కేవలం 26 ఎమ్మెల్యే సీట్లకే పరిమితమైంది. ఎంఐఎం నాయకత్వంతో విభేదించిన అమానుల్లాఖాన్ ఎంబీటీని స్థాపించి తొలిసారిగా ఆ పార్టీకి సవాల్ విసిరారు. ఈ ఎన్నికల్లో ఎన్టీఆర్ హిందూపురం, టెక్కలి స్థానాల నుంచి గెలిచారు. కాంగ్రెస్ శాసనసభాపక్షానికి పి.జనార్దనరెడ్డి నేతగా ఉన్నారు. జహీరాబాద్ నుంచి ఎం.బాగారెడ్డి , చలకర్తి నుంచి కుందూరు జానారెడ్డి (కాంగ్రెస్) ఓటమి చవిచూశారు. - సాక్షి, నాలెడ్జ్ సెంటర్ -
అన్నదాతకు మరో వెన్నుపోటు!
స్వామినాథన్ సిఫారసుల అమలుపై కేంద్రం దొంగాట సాక్షి, హైదరాబాద్: ఓసారి అనావృష్టి.. మరోసారి అతివృష్టి.. వీటికితోడు పాలకుల నిర్లక్ష్యం! ఆరుగాలం కష్టపడ్డా అప్పుల కుప్పలు.. వెరసి వ్యవసాయంలో సంక్షోభం.. పంటచేనులో మరణ మృదంగం! ఏళ్లుగా కొనసాగుతున్న ఈ దుస్థితిని మార్చేందుకు రైతు సమస్యలన్నిటినీ సమగ్రంగా పరిశీలించి పరిష్కారాలను ప్రతిపాదించిన డాక్టర్ స్వామినాథన్ కమిషన్ నివేదికను గత యూపీఏ ప్రభుత్వం ఆమోదించినా అమలు చేయలేదు. ఇప్పుడు ఎన్డీఏ సర్కారు దాన్ని పూర్తిగా అటకెక్కించింది. స్వామినాథన్ నాయకత్వంలోని జాతీయ రైతు కమిషన్ (ఎన్సీఎఫ్) సిఫార్సులను ఆమోదించలేదని కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర హైకోర్టుకు నివేదించడం రైతులను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. ఎన్సీఎఫ్ నివేదికను మొత్తంగా తిరస్కరించారా లేక ఒక్క కనీస మద్దతు ధరల (ఎంఎస్పీ) విధానాన్ని మాత్రమే పక్కన బెట్టారా అనేది తెలపాలని రైతు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. నివేదిక అమలు కోరుతూ పోరుబాట పట్టేందుకు సన్నాహాలు చేస్తున్నాయి. ప్రభుత్వాల తీరుపై దుమ్మెత్తి పోస్తున్నాయి. ఎంఎస్పీ నిర్ణయించే అధికారం రాష్ట్రాలకే ఉండాలని నినదిస్తున్నాయి. రైతుకు మార్కెట్ ధర రానప్పుడు రక్షణగా ఉండాల్సిన ఎంఎస్పీ విధానం అన్నదాతల్ని మోసం చేసే లా ఉందని మండిపడుతున్నాయి. కమిషన్ ఏం చెప్పిందంటే నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సహా దేశవ్యాప్తంగా వ్యవసాయ సంక్షోభంతో దిక్కుతోచక రైతులు ఉరికొయ్యలకు వేలాడుతున్న సమయంలో యూపీఏ ప్రభుత్వం 2004 నవంబర్ 1న వ్యవసాయ శాస్త్రవేత్త ప్రొఫెసర్ ఎంఎస్ స్వామినాథన్ అధ్యక్షతన రైతు జాతీయ కమిషన్ (ఎన్సీఎఫ్) ఏర్పాటు చేసింది. ప్రభుత్వం సూచించిన అనేక అంశాలపై అది అధ్యయనం చేసింది. రైతు క్షోభకు కారణాలను విశ్లేషించింది. భూ సంస్కరణల ఆవశ్యకతను, బంజరు భూముల పంపిణీని నొక్కిచెప్పింది. జాతీయ భూ వినియోగ సలహా సర్వీసును ఏర్పాటు చేయాలని కోరింది. వ్యవసాయ దిగుబడులు, ఆహార భద్రత, రుణ పరపతి విధానం, బీమా సౌకర్యం, రైతు ఆత్మహత్యల నివారణ చర్యలు సూచిస్తూ సమగ్ర నివేదికను రూపొందించింది. చిన్నచిన్న కమతాలున్న వ్యవసాయదారుల్లో సమర్థతను పెంచి దిగుబడులను పెంచేందుకు సూచనలు చేసింది. వాటిల్లో ప్రధానమైంది కనీస మద్దతు ధర (ఎంఎస్పీ) విధానం. వరి, గోధుమలే కాకుండా ఇతర ధాన్యాలనూ ఎంఎస్పీ పరిధిలోకి తీసుకురావాలని, పోషక విలువలున్న చిరు, తృణ ధాన్యాలను ప్రజా పంపిణీ వ్యవస్థలోకి శాశ్వతంగా తీసుకురావాలని సిఫార్సు చేసింది. పంటలకు అయ్యే సగటు ఉత్పత్తి వ్యయంతో పాటు అదనంగా కనీసం 50 శాతాన్ని కలిపి ఎంఎస్పీని నిర్ణయించాలని పేర్కొంది. ఈ కమిషన్ నివేదికను కొన్ని సవరణలతో యూపీఏ ప్రభుత్వం 2007లో ఆమోదించినా అమలు చేయలేదు. ఎన్డీఏ ప్రభుత్వం ఏం చెబుతోంది?: స్వామినాథన్ కమిషన్ సిఫార్సులు అమలు చేయాలంటూ సుప్రీంకోర్టు, హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యాలు దాఖలయ్యాయి. హైకోర్టులో దాఖలైన ఓ వ్యాజ్యానికి సంబంధించి కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ తరఫున రాహుల్ శర్మ అనే అధికారి గతనెల 31న ఓ అఫిడవిట్ దాఖలు చేశారు. ‘ఎంఎస్పీ నిర్ణయించే విషయంలో స్వామినాథన్ సిఫార్సులను ప్రభుత్వం ఆమోదించలేదు. వ్యవసాయ ఖర్చులు, ధరల నిర్ణాయక సంఘం (సీఏసీపీ) ఎంఎస్పీని సిఫార్సు చేస్తున్నందున స్వామినాథన్ కమిషన్ సిఫార్సులను ప్రభుత్వం ఆమోదించడం లేదు. స్వామినాథన్ కమిషన్ చెప్పినట్టు ఎంఎస్పీ, ఉత్పత్తి వ్యయాన్ని ఆటోమేటిక్‌గా అనుసంధానం చేస్తే మార్కెట్ దెబ్బతింటుంది. వ్యవసాయ రంగ దీర్ఘకాలిక సమతుల్యాభివృద్ధికి ఇది దోహదపడకపోవచ్చు’ అని కోర్టుకు నివేదించడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఇప్పటిదాకా ఎందుకు చెప్పలేదు? యూపీఏ ప్రభుత్వం ఆమోదించిన నివేదికను తిరస్కరిస్తున్నట్టు ఇంతవరకు కేంద్రం ఎక్కడా చెప్పలేదు. న్యాయస్థానాలకు మాత్రమే తెలిపింది. అధికారంలోకి రావడానికి ముందు బీజేపీ, టీడీపీ స్వామినాథన్ కమిషన్ నివేదిక అమలు చేస్తామని చెప్పాయి. ఇప్పుడు ప్లేట్ ఫిరాయించడంతో రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆందోళనలకు సమాయత్తమవుతున్నారు. రైతు ఆత్మహత్యలపై స్పందించినప్పుడు సైతం సుప్రీంకోర్టు.. స్వామినాథన్ కమిషన్ సిఫార్సులను మరోసారి పరిశీలించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. సీఏసీపీ విధానమే లోపభూయిష్టం ధర నిర్ణయానికి సీఏసీపీ పరిగణనలోకి తీసుకునే 12 అంశాలలో 8 రైతులకు వ్యతిరేకం. మూడేళ్ల కిందటి నాటి ధరలు, ఖర్చుల ఆధారంగా ఒక హెక్టారు సాగు ఖర్చును లెక్కిస్తారు. దేశవ్యాప్తంగా 9,84,485 చోట్ల దిగుబడి నమూనాలు సేకరించాల్సి ఉండగా 5,800 కేంద్రాలలో సేకరించిన దిగుబడుల ఆధారంగా 20 శాతం అధిక దిగుబడి నమోదు చేస్తున్నారు. సీఏసీపీ పెద్ద బోగస్ సంస్థ. దీనిపై వచ్చే పార్లమెంటు సమావేశాల్లో ప్రభుత్వాన్ని నిలదీస్తాం. - అతుల్ కుమార్ అంజన్, స్వామినాథన్ కమిషన్ తాత్కాలిక సభ్యులు ఎంఎస్పీ నిర్ణయాధికారం రాష్ట్రాలకు ఉండాలి ఎంఎస్పీని నిర్ణయించే సీఏసీపీ పాత్ర అనుమానాస్పదం. రైతులపై లేని శ్రద్ధ మార్కెట్ శక్తులపై చూపుతోంది. ఉత్పత్తి ఖర్చు కంటే ఎంఎస్పీ తక్కువగా ఉంది. ఈ మాత్రానికి ఎంఎస్పీ ఎందుకు? రాష్ట్రాలే ఎంఎస్పీని నిర్ణయించుకునే అధికారం ఉండాలి. కేంద్రం వాదన, పనితీరు రైతులను దగా చేసేలా ఉంది. - డాక్టర్ డి.నరసింహారెడ్డి, చేతన ఎన్జీవో రైతును భూమి నుంచి దూరం చేసే కుట్ర స్వామినాథన్ కమిషన్ నివేదిక అటకెక్కినట్టే. వాస్తవ వ్యయం ఆధారంగా నిర్ణయించాల్సిన ఎంఎస్పీని డిమాండ్-సప్లై ఆధారంగా నిర్ణయించడం రైతును దగా చేయడమే. రైతులు వ్యవసాయాన్ని వదిలేలా చేసి ఆ భూముల్ని కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టాలన్నదే మోదీ, చంద్రబాబు ధ్యేయం. అందుకే లక్షలాది ఎకరాలతో భూ బ్యాంకులు ఏర్పాటు చేసి కార్పొరేట్ సంస్థలను ఆహ్వానిస్తున్నారు. - వంగల సుబ్బారావు, ఏపీ రైతు సంఘం -
ఒక్క బీసీ.. వంద కుట్రలు!
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: ‘జిల్లాలో ఏకైక బీసీ ఎమ్మెల్యేను.. ఈ ఎన్నికల్లో నాకు టికెట్ రాకుండా కుట్రలు చేస్తున్నారు. ఓ వర్గం నన్ను పార్టీకి దూరం చేసే ప్రయత్నం చేస్తోంది...’ ఇది టికెట్ల కేటాయింపునకు ముందు నందీశ్వర్‌గౌడ్ వ్యక్తం చేసిన ఆవేదన. ఎట్టకేలకు కాంగ్రెస్ పార్టీ అధిష్టానమే వచ్చి నందీశ్వర్‌కు టికెట్ ఇచ్చింది. అయినా అదే వర్గం ‘శల్యసారథ్యం’ చేస్తూ సొంత పార్టీ అభ్యర్థికే ‘చెయ్యి’చ్చి ‘కారు’ గేర్లు మారుస్తున్నారు. గెలిచే సీటును కుట్రలు కుతంత్రాలతో ఓడించే ప్రయత్నం చేస్తున్నారని పార్టీ కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో కాంగ్రెస్ పార్టీ నుంచి ఒకే ఒక్క బీసీకి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు. సిట్టింగ్ ఎమ్మెల్యే నందీశ్వర్‌గౌడ్ పటాన్చెరు సెగ్మెంట్ బరిలో ఉన్నారు. పార్టీ కేడర్‌తో ఎన్నికల్లో దూసుకె ళ్లేందుకు ఆయన ప్రయత్నిస్తుంటే సొంత పార్టీ ముఖ్యులే ఆయనను కుట్రపూరితంగా వెనక్కినెట్టే ప్రయత్నం చేస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పార్టీ సిద్ధాంతాలను పక్కనపెట్టి పోటీదారులతో కలిసి సొంత పార్టీ అభ్యర్థిని ఓడించే కుట్రలు పన్నుతున్నట్లు సమాచారం. పార్టీ టికెట్ కేటాయించే సమయం నుంచి తెరవెనక ఆయనకు వ్యతిరేకంగా ఓ వర్గం నాయకులు అడుగడుగునా అడ్డుకునే ప్రయత్నాలు చేశారు. అయితే అధిష్టానం ముందు వారి ఆటలు సాగలేదు. సిట్టింగ్ ఎమ్మెల్యే అయిన నందీశ్వర్‌గౌడ్‌కు టికెట్ కేటాయించారు. ఇది మింగుడుపడని పటాన్చెరు నియోజకవర్గంలోని కాంగ్రెస్ ముఖ్యనేతలు నందీశ్వర్‌గౌడ్‌ను ఎన్నికల్లో ఎలాగైనా దెబ్బతీయాలనే తలంపుతో కుట్రలకు తెరలేపారని కాంగ్రెస్ పార్టీ ద్వితీయ శ్రేణి నాయకత్వం ఆవేదన వ్యక్తం చేస్తోంది. భూపాల్‌రెడ్డి ప్రచారానికి దూరం కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ భూపాల్‌రెడ్డి తన సొంత నియోజకవర్గంలో ప్రచారానికి దూరంగా ఉంటూ వస్తున్నారు. ఎమ్మెల్యే అభ్యర్థి నందీశ్వర్‌గౌడ్‌కు మద్దతుగా ఇంతవరకు ఆయన ప్రచారంలో పాల్గొనలేదు. దీన్ని సొంత పార్టీ నేతలే బహిరంగంగా తప్పుబడుతున్నారు. భూపాల్‌రెడ్డి దూరంగా ఉండటంతో ఆయన అనుచరులు, మద్దతుదారులు సైతం ఆయన దారిలోనే పయనిస్తున్నట్టు సమాచారం. ముఖ్యంగా రామచంద్రాపురం మండలానికి చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి నందీశ్వర్‌గౌడ్‌కు మద్దతుగా పనిచేయటంలేదన్న ఆరోపణలు ఉన్నాయి. ఇదిలా ఉంటే ఎమ్మెల్యే అభ్యర్థి నందీశ్వర్‌గౌడ్.. భూపాల్‌రెడ్డితో సహా అందరినీ కలుపుకునే ప్రయత్నాలు చేసినా సొంత పార్టీ నేతల నుంచి సానుకూల స్పందన లభించటంలేదని తెలుస్తోంది. ఏఐసీసీ ఎస్సీ సెల్ కన్వీనర్ కొప్పుల రాజు స్వయంగా కలగజేసుకుని భూపాల్‌రెడ్డికి ఫోన్‌చేసి నందీశ్వర్‌గౌడ్‌కు సహకరించాలని సూచించిన విషయం విదితమే. అయినా పరిస్థితిలో మార్పు రాకపోవడంతో క్యాడర్ ఆందోళన వ్యక్తం చేస్తోంది.