Mahanadu Special: Recall the Words Spoken by NTR About Chandrababu - Sakshi
Sakshi News home page

మేకవన్నె పులి బాబూ!

Published Fri, May 27 2022 8:29 AM | Last Updated on Fri, May 27 2022 12:50 PM

Mahanadu Special: Recall The Words Spoken By NTR About Chandrababu - Sakshi

నందమూరి తారక రామారావు (ఫైల్‌)

దుర్మార్గుడు... మేకవన్నె పులి... ప్రజాస్వామ్య హంతకుడు... గుండెల్లో చిచ్చు పెట్టిన వాడు...  గూడుపుఠాణీకి గురువు... మోసానికి మూలస్తంభం... ఇవన్నీ దివంగత నందమూరి తారక రామారావు నోటి నుంచి వెలువడ్డ శిలాక్షరాలు. చంద్రబాబునాయుడు ‘విశ్వరూపాన్ని’ కళ్లారా చూసి ఆయనే స్వయంగా అనుగ్రహించిన బిరుదరాజాలు. అల్లుడని నమ్మినవాని చేతిలోనే అడ్డంగా వెన్నుపోటుకు గురైన ఆక్రోశం నుంచి పుట్టుకొచ్చిన శాపనార్థాలు. ఎన్టీఆర్‌ తన చివరి దశలో కనీసం చంద్రబాబు పేరును ఉచ్చరించేందుకు కూడా ఇష్టపడలేదు. కానీ మళ్లీ అధికారంలోకి రావడం కోసం ఎన్టీఆర్‌ నామభజన చేస్తున్నారు చంద్రబాబు. రేపటి నుంచి ఎన్టీఆర్‌ శత జయంతి సంవత్సరం ప్రారంభం కానుంది. టీడీపీ వాళ్లు మహానాడు జరుపుకొంటున్నారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్‌ వివిధ సందర్భాల్లో తమ పార్టీ కార్యకర్తలతో చంద్రబాబు గురించి మాట్లాడిన మాటలు గుర్తు చేస్తున్నాం.

తమ్ముళ్లారా! చెల్లెళ్లారా! ఇదిగో మీ అన్నను మాట్లాడుతున్నాను. శ్రద్ధగా వినండి. మీ బుద్ధితో ఆలోచించండి. మీ నిర్ణయంతో నన్ను ఆదేశించండి. మీరు చెప్పేదే న్యాయం. చేసేదే ధర్మం. నాటి నుంచి నేటి వరకూ జరిగిన చరిత్రను మీ ముందు, అంటే ప్రజాన్యాయస్థానం ముందుంచుతున్నాను. మంచేదో చెడేదో; నిజమేదో అబద్ధమేదో; ఆశయ మేదో ఆశేదో మీకు తెలియాలనే ఈ ప్రయత్నం. నీతికీ అవినీతికీ మధ్య జరుగుతున్న ఈ పోరా టంలో న్యాయనిర్ణేతలు మీరే. ఎవరు విజేతలో తేల్చాల్సింది కూడా మీరే.

బాబు ఒక చిన్న మిడత
224 సీట్లతో అధికారం చేపట్టిన తెలుగుదేశం ప్రాభవాన్ని ప్రతిఘటించడం చేతకాని వ్యతిరేక శక్తులు కొంతమంది, (1995లో) లోలోన గూడు పుఠాణీ ఆరంభించారు. దీనికి గురువు, ఈ కుట్రకు కొలువు, మోసానికి మూలస్తంభం, ఈ పద్మవ్యూహానికి కేంద్రబిందువు చంద్రబాబు నాయుడు! నా అల్లుడనబడుతున్నవాడే నా గుండెల్లో చిచ్చు పెట్టాడు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించడానికి ముందు అతనేమిటో మీ అందరికీ తెలుసు. కాంగ్రెస్‌లో ఉంటూ, మంత్రులపై కూడా పోటీ చేస్తానంటూ ప్రగల్భాలు పలికి, చివరకు తెలుగు దేశం మహా ప్రభంజనంలో కొట్టుకుపోయిన ఓ చిన్నమిడత. తెలుగుదేశం అధికారంలోకి వచ్చాక, అతను పార్టీలో చేరతానని వస్తే, చేర్చుకోవద్దని కొందరు హితవు చెప్పారు. అయినప్పటికీ పశ్చా త్తాపాన్ని ప్రకటించాడు కదా అని ఔదార్యంతో చేర్చుకున్నాను. 

తర్వాత పార్టీలో ముఖ్యమైన పదవులన్నీ ఇచ్చాను. అయితే అతడు ప్రజాసేవ కోసం కాక పదవి కోసమే పార్టీలో చేరాడన్న దుర్మార్గాన్ని నేను కనిపెట్టలేకపోయాను. అతడు కడుతున్న ముఠాల గురించీ, చేరదీస్తున్న గ్రూపుల గురించీ పట్టించుకోలేదు. అతడిలో పదవీ కాంక్ష ఇంతగా గూడుకట్టుకుంటుందనీ, అతడి వల్ల ప్రజలచేత ఎన్నుకున్న ప్రభుత్వం తప్పుకోవాల్సి వస్తుందనీ, అతని వల్ల ప్రజాభీష్టమే వ్యర్థమై పోతుందనీ, ప్రజాస్వామ్యం పట్టపగలే హత్యకు గురౌతుందనీ, అధికారం కోసం ఆ పెద్దమనిషి ఇంతటి అల్పమైన నీచమైన దారుణమైన వెన్ను పోటుకు కూడా సిద్ధపడతాడనీ నేనూహించలేక పోయాను. నామీద ఒక అభియోగం సృష్టించాడు. కార్యకర్తలకేదో అన్యాయం జరిగిందట. ఏమిటా అన్యాయం? ఎవరికా అన్యాయం? పార్టీపట్ల శ్రద్ధా భక్తులతో, అంకితభావంతో పనిచేసి ప్రజల విశ్వాసం చూరగొన్న ఏ నా కార్యకర్తలకూ ఏ నా తెలుగు తమ్ముళ్లకూ అన్యాయం జరగలేదు. ఒకవేళ ఏదైనా లోటు జరిగితే అది అవకాశవాదులకు మాత్రమే జరిగింది! చంద్రబాబు... ఆ పెద్ద మనిషి.... ఆ మేకవన్నె పులి... ఆ తేనెపూసిన కత్తి తయారుచేసిన కుట్రదారులకే జరిగింది! అతడి పక్కన చేరి, కుహనా కార్యకర్తలుగా చలామణై, దళారీలుగా ఉన్నవారికే జరిగింది!

పేరు చెప్పేందుకూ అనర్హుడే
ఇవాళ నేను మాట్లాడుతున్న వ్యక్తి ఓడిపోయి తెలుగుదేశంలోకి వచ్చాడు. నా విధానాలకు పూర్తిగా అంకితమవుతానని మాటిచ్చాడు. కానీ అతని మనసులో ఉన్న దురాశ మాత్రం పోలేదు. నేనిన్ని పదవులిచ్చాను. కానీ ఆయన మాత్రం తన కంటూ ఓ గుంపును తయారు చేసుకున్నాడు. అది నేను గమనించలేదు. ఎవరూ ఊహించని విధంగా (1994 ఎన్నికల్లో) మాకు 214 సీట్లు వచ్చాయి. ఆ తర్వాత పార్టీలో చేరిన వారితో చూసుకుంటే 224 సీట్లు! కాబట్టి వాళ్లేం చేయలేకపోయారు. అదే ఏ 130, 140 సీట్లో వచ్చుంటే వాళ్లేమైనా చేసి ఉండే వాళ్లు. 

మాకిది కావాలి, అది కావాలంటూ కోరే వారు. ఎందుకంటే అంతకు ముందే రంగం ఏర్పాటై ఉంది. అందరికీ డబ్బిచ్చాడు ఈయన. ఆయన పేరు చెçప్పడం కూడా నాకిష్టంలేదు. పేరు చెప్పేందుకు కూడా ఆయన అర్హుడు కాదు. అంద రికీ 5లక్షలు, 10 లక్షలు డబ్బులిచ్చి ‘ఇదిగో ఎన్ని కల కోసం మీ అందరికీ డబ్బిస్తున్నాను. మీరంతా నా మనుషులుగా ఉండాలి’ అంటూ ఏర్పాటు చేసుకున్నాడు. ఇక ఎప్పుడైతే 224 సీట్లు టీడీపీకి వచ్చాయో ఆయన ఆటలు సాగలేదు. తప్పనిసరిగా ఎన్టీఆర్‌నే నాయకుడిగా ఎన్నుకోవాల్సి వచ్చింది. కానీ ఎలాగైనా ముఖ్యమంత్రి కావాలన్న ఆశ మాత్రం ఆయన మనసులో చావలేదు. ఆ ఆశతోనే తన గ్రూపును తయారు చేశాడు. ఇట్స్‌ ఏ ప్లాన్‌డ్‌ ట్రెచెరీ!

తెలుగు జాతి దురదృష్టం
చరిత్రను చూస్తే... తండ్రిని జైల్లో పెట్టిన సమ్రాట్లు న్నారు. రాజ్యాధికారం కోసం అన్నల్ని చంపిన సోదరుడున్నాడు... ఔరంగజేబు. అలాంటి దుర దృష్టకరమైన విధానం మళ్లీ ఇన్ని వందల ఏళ్ల తర్వాత తెలుగు జాతి చరిత్రలో మన రాష్ట్రంలో ఈనాడు తిరిగి జరిగింది. అది మన దురదృష్టం. అలాంటి చిన్నబుచ్చేతనాన్ని మన జాతి అనుభ వించడం అనేది కేవలం నేను చేసుకున్న పాపం. ఎందుకంటే నా వాళ్లుగా ఉంటూ ఈనాడు జాతికే ద్రోహం చేసి మాయని మచ్చను తెచ్చారు. ప్రజా స్వామ్యానికిది చిన్నతనం. (1995 ఆగస్టు 23 నాటి వెన్నుపోటుకు కొద్ది రోజుల ముందు) నేను శ్రీకాకుళం, విశాఖపట్నం, విజయనగరం వెళ్లిన ప్పుడు అక్కడ కూడా ఈ మహానుభావుడే, ఎవరైతే ఈనాడు జాతికే చిన్నతనం తెచ్చారో... అవమానకరంగా వ్యవహరించారో... తెలుగు జాతిని కించపరిచారో... ఆ మహానుభావుడే, ‘రామారావు గారు లేకపోతే మా పార్టీ (తెలుగు దేశం) లేదు. ఆయన వల్లే పార్టీ నడుస్తోంది. మేమాయన వెనకాల ఉంటున్నాం. ఈ ఖ్యాతి, గౌరవం అంతా ఆయనదే. రామారావే మా నాయ కుడు’ అన్నాడు. అలా చెప్పినవాడే 23వ తేదీ సాయంత్రానికల్లా ఎందుకు మారారంటారు?

ఆదర్శాలకు వెన్నుపోటు
ఈ వెన్నుపోటు జరిగింది నాకొక్కడికి మాత్రమే కాదు. ప్రజలకు, మీకు, మీరు వేసిన ఓటుకు. మీరు నమ్మిన ప్రజాస్వామ్యానికి, మీరు విశ్వసించిన ఆశయాలకు, ఆదర్శాలకు ఇది వెన్నుపోటు! ఇంత నీచానికి ఒడిగట్టిన చంద్రబాబు... ఎన్టీఆర్‌ లాగే ఆయన విధానాలే కొనసాగిస్తామని చెబుతుంటే ఎలా ఉందో తెలుసా? చేతులు జోడించి, నమ స్కారం చేసి, తుపాకీ పేల్చి గాంధీ మహాత్ముడ్ని పొట్టనబెట్టుకున్న గాడ్సేనే మించిపోయాడు అనిపిస్తోంది. ఇది సిగ్గుచేటు. క్షమించరాని నేరం. వీళ్లంతా ఇలా ఎందుకు చేశారు? ఎందుకు వెన్నుపోటు పొడి చారు? ఏమిటి, ఏమిటి ఎన్టీఆర్‌ చేసిన తప్పు? ఏమిటి, ఏమిటి ఎన్టీఆర్‌ చేసిన నేరం?

బాబును చరిత్ర క్షమించదు
అయామ్‌ ద లయన్‌. నేనే సింహాన్ని. ఎందుకంటే సింహం మృగరాజు. ఏ అవమానాన్నీ సహించదు. కాబట్టి నాకెలా అవమానం జరిగింది, నా వాళు,్ల నా అన్నవాళ్లు నన్నే విధంగా మోసం చేశారో ప్రజలకు తెలుసు. అయినా నేను చెప్పడం నా ధర్మం. నా కర్తవ్యం. ప్రజల ప్రతినిధిని నేను. నాకేం జరిగినా ప్రజలకు తెలియజెప్పడం నా బాధ్యత. దేవుడు సహా ఎవరూ క్షమించలేని ఘాతుకానికి బాబు ఒడి గట్టాడు. దీన్ని జాతి, చరిత్ర ఎప్పటికీ  క్షమించదు. మీకు ఏ విధమైన రాజకీయం కావాలి? ఏ విధంగా ప్రజాస్వామ్యం ఉండాలి? అది నిర్ణయించుకోవా ల్సింది మీరే. అదే ప్రజాస్వామ్యం. కాబట్టి ఏ పార్టీ అయితే ప్రజాస్వామ్యాన్ని ఉద్ధరిస్తుందో, ఏ పార్టీ అయితే మనం తెచ్చుకున్న స్వాతంత్య్రానికి ఓ చక్కని రూపం దిద్దగలుగుతుందో, అలాంటి పార్టీకే మీరు నిర్భయంగా ఓటేయండి. ఓటు మీ జన్మ హక్కు. దాన్ని నిరుపయోగం చేయకండి. పిరికి తనంతో దాన్ని మరోరకంగా ఉపయోగించకండి... ఇది ‘అన్న’ మాట.       

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement