అన్నదాతకు మరో వెన్నుపోటు!
స్వామినాథన్ సిఫారసుల అమలుపై కేంద్రం దొంగాట
సాక్షి, హైదరాబాద్: ఓసారి అనావృష్టి.. మరోసారి అతివృష్టి.. వీటికితోడు పాలకుల నిర్లక్ష్యం! ఆరుగాలం కష్టపడ్డా అప్పుల కుప్పలు.. వెరసి వ్యవసాయంలో సంక్షోభం.. పంటచేనులో మరణ మృదంగం! ఏళ్లుగా కొనసాగుతున్న ఈ దుస్థితిని మార్చేందుకు రైతు సమస్యలన్నిటినీ సమగ్రంగా పరిశీలించి పరిష్కారాలను ప్రతిపాదించిన డాక్టర్ స్వామినాథన్ కమిషన్ నివేదికను గత యూపీఏ ప్రభుత్వం ఆమోదించినా అమలు చేయలేదు. ఇప్పుడు ఎన్డీఏ సర్కారు దాన్ని పూర్తిగా అటకెక్కించింది. స్వామినాథన్ నాయకత్వంలోని జాతీయ రైతు కమిషన్ (ఎన్‌సీఎఫ్) సిఫార్సులను ఆమోదించలేదని కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర హైకోర్టుకు నివేదించడం రైతులను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది.
ఎన్‌సీఎఫ్ నివేదికను మొత్తంగా తిరస్కరించారా లేక ఒక్క కనీస మద్దతు ధరల (ఎంఎస్‌పీ) విధానాన్ని మాత్రమే పక్కన బెట్టారా అనేది తెలపాలని రైతు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. నివేదిక అమలు కోరుతూ పోరుబాట పట్టేందుకు సన్నాహాలు చేస్తున్నాయి. ప్రభుత్వాల తీరుపై దుమ్మెత్తి పోస్తున్నాయి. ఎంఎస్‌పీ నిర్ణయించే అధికారం రాష్ట్రాలకే ఉండాలని నినదిస్తున్నాయి. రైతుకు మార్కెట్ ధర రానప్పుడు రక్షణగా ఉండాల్సిన ఎంఎస్‌పీ విధానం అన్నదాతల్ని మోసం చేసే లా ఉందని మండిపడుతున్నాయి.
కమిషన్ ఏం చెప్పిందంటే
నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సహా దేశవ్యాప్తంగా వ్యవసాయ సంక్షోభంతో దిక్కుతోచక రైతులు ఉరికొయ్యలకు వేలాడుతున్న సమయంలో యూపీఏ ప్రభుత్వం 2004 నవంబర్ 1న వ్యవసాయ శాస్త్రవేత్త ప్రొఫెసర్ ఎంఎస్ స్వామినాథన్ అధ్యక్షతన రైతు జాతీయ కమిషన్ (ఎన్‌సీఎఫ్) ఏర్పాటు చేసింది. ప్రభుత్వం సూచించిన అనేక అంశాలపై అది అధ్యయనం చేసింది. రైతు క్షోభకు కారణాలను విశ్లేషించింది. భూ సంస్కరణల ఆవశ్యకతను, బంజరు భూముల పంపిణీని నొక్కిచెప్పింది. జాతీయ భూ వినియోగ సలహా సర్వీసును ఏర్పాటు చేయాలని కోరింది. వ్యవసాయ దిగుబడులు, ఆహార భద్రత, రుణ పరపతి విధానం, బీమా సౌకర్యం, రైతు ఆత్మహత్యల నివారణ చర్యలు సూచిస్తూ సమగ్ర నివేదికను రూపొందించింది. చిన్నచిన్న కమతాలున్న వ్యవసాయదారుల్లో సమర్థతను పెంచి దిగుబడులను పెంచేందుకు సూచనలు చేసింది. వాటిల్లో ప్రధానమైంది కనీస మద్దతు ధర (ఎంఎస్‌పీ) విధానం. వరి, గోధుమలే కాకుండా ఇతర ధాన్యాలనూ ఎంఎస్‌పీ పరిధిలోకి తీసుకురావాలని, పోషక విలువలున్న చిరు, తృణ ధాన్యాలను ప్రజా పంపిణీ వ్యవస్థలోకి శాశ్వతంగా తీసుకురావాలని సిఫార్సు చేసింది. పంటలకు అయ్యే సగటు ఉత్పత్తి వ్యయంతో పాటు అదనంగా కనీసం 50 శాతాన్ని కలిపి ఎంఎస్‌పీని నిర్ణయించాలని పేర్కొంది. ఈ కమిషన్ నివేదికను కొన్ని సవరణలతో యూపీఏ ప్రభుత్వం 2007లో ఆమోదించినా అమలు చేయలేదు.
ఎన్డీఏ ప్రభుత్వం ఏం చెబుతోంది?: స్వామినాథన్ కమిషన్ సిఫార్సులు అమలు చేయాలంటూ సుప్రీంకోర్టు, హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యాలు దాఖలయ్యాయి. హైకోర్టులో దాఖలైన ఓ వ్యాజ్యానికి సంబంధించి కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ తరఫున రాహుల్ శర్మ అనే అధికారి గతనెల 31న ఓ అఫిడవిట్ దాఖలు చేశారు. ‘ఎంఎస్‌పీ నిర్ణయించే విషయంలో స్వామినాథన్ సిఫార్సులను ప్రభుత్వం ఆమోదించలేదు. వ్యవసాయ ఖర్చులు, ధరల నిర్ణాయక సంఘం (సీఏసీపీ) ఎంఎస్‌పీని సిఫార్సు చేస్తున్నందున స్వామినాథన్ కమిషన్ సిఫార్సులను ప్రభుత్వం ఆమోదించడం లేదు. స్వామినాథన్ కమిషన్ చెప్పినట్టు ఎంఎస్‌పీ, ఉత్పత్తి వ్యయాన్ని ఆటోమేటిక్‌గా అనుసంధానం చేస్తే మార్కెట్ దెబ్బతింటుంది. వ్యవసాయ రంగ దీర్ఘకాలిక సమతుల్యాభివృద్ధికి ఇది దోహదపడకపోవచ్చు’ అని కోర్టుకు నివేదించడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది.
ఇప్పటిదాకా ఎందుకు చెప్పలేదు?
యూపీఏ ప్రభుత్వం ఆమోదించిన నివేదికను తిరస్కరిస్తున్నట్టు ఇంతవరకు కేంద్రం ఎక్కడా చెప్పలేదు. న్యాయస్థానాలకు మాత్రమే తెలిపింది. అధికారంలోకి రావడానికి ముందు బీజేపీ, టీడీపీ స్వామినాథన్ కమిషన్ నివేదిక అమలు చేస్తామని చెప్పాయి. ఇప్పుడు ప్లేట్ ఫిరాయించడంతో రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆందోళనలకు సమాయత్తమవుతున్నారు. రైతు ఆత్మహత్యలపై స్పందించినప్పుడు సైతం సుప్రీంకోర్టు.. స్వామినాథన్ కమిషన్ సిఫార్సులను మరోసారి పరిశీలించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది.
సీఏసీపీ విధానమే లోపభూయిష్టం
ధర నిర్ణయానికి సీఏసీపీ పరిగణనలోకి తీసుకునే 12 అంశాలలో 8 రైతులకు వ్యతిరేకం. మూడేళ్ల కిందటి నాటి ధరలు, ఖర్చుల ఆధారంగా ఒక హెక్టారు సాగు ఖర్చును లెక్కిస్తారు. దేశవ్యాప్తంగా 9,84,485 చోట్ల దిగుబడి నమూనాలు సేకరించాల్సి ఉండగా 5,800 కేంద్రాలలో సేకరించిన దిగుబడుల ఆధారంగా 20 శాతం అధిక దిగుబడి నమోదు చేస్తున్నారు. సీఏసీపీ పెద్ద బోగస్ సంస్థ. దీనిపై వచ్చే పార్లమెంటు సమావేశాల్లో ప్రభుత్వాన్ని నిలదీస్తాం.
- అతుల్ కుమార్ అంజన్, స్వామినాథన్ కమిషన్ తాత్కాలిక సభ్యులు
ఎంఎస్‌పీ నిర్ణయాధికారం రాష్ట్రాలకు ఉండాలి
ఎంఎస్‌పీని నిర్ణయించే సీఏసీపీ పాత్ర అనుమానాస్పదం. రైతులపై లేని శ్రద్ధ మార్కెట్ శక్తులపై చూపుతోంది. ఉత్పత్తి ఖర్చు కంటే ఎంఎస్‌పీ తక్కువగా ఉంది. ఈ మాత్రానికి ఎంఎస్‌పీ ఎందుకు? రాష్ట్రాలే ఎంఎస్‌పీని నిర్ణయించుకునే అధికారం ఉండాలి. కేంద్రం వాదన, పనితీరు రైతులను దగా చేసేలా ఉంది.
- డాక్టర్ డి.నరసింహారెడ్డి, చేతన ఎన్జీవో
రైతును భూమి నుంచి దూరం చేసే కుట్ర
స్వామినాథన్ కమిషన్ నివేదిక అటకెక్కినట్టే. వాస్తవ వ్యయం ఆధారంగా నిర్ణయించాల్సిన ఎంఎస్‌పీని డిమాండ్-సప్లై ఆధారంగా నిర్ణయించడం రైతును దగా చేయడమే. రైతులు వ్యవసాయాన్ని వదిలేలా చేసి ఆ భూముల్ని కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టాలన్నదే మోదీ, చంద్రబాబు ధ్యేయం. అందుకే లక్షలాది ఎకరాలతో భూ బ్యాంకులు ఏర్పాటు చేసి కార్పొరేట్ సంస్థలను ఆహ్వానిస్తున్నారు.
- వంగల సుబ్బారావు, ఏపీ రైతు సంఘం