యూపీఏ సర్కారుపై జై శంకర్ విసుర్లు
ఇప్పుడైతే గట్టిగా బదులిస్తామన్న మంత్రి
ముంబై: 2008లో ముంబైలో జరిగిన ఉగ్ర దాడికి సంబంధించి నాటి కాంగ్రెస్ సారథ్యంలోని యూపీఏ ప్రభుత్వంపై విదేశాంగ మంత్రి జై శంకర్ పరోక్ష విమర్శలు చేశారు. ఆ దాడికి భారత్ వైపు నుంచి స్పందనే లేకపోయిందంటూ ఆక్షేపించారు. ముంబైలో ఆదివారం మంత్రి మీడియాతో మాట్లాడారు. ‘‘ముంబై దాడి జరిగినప్పుడు భారత్ నుంచి దానిపై స్పందనే లేదు. ఆ సమయంలో ఐరాస భద్రతా మండలిలో భారత్ సభ్య దేశం. ఉగ్రవాద వ్యతిరేక కమిటీ అధ్యక్ష స్థానంలో ఉంది.
ఆ కమిటీ బేటీ కూడా ఉగ్ర దాడికి లక్ష్యంగా మారిన ముంబై తాజ్ హోటల్లోనే జరిగింది’’ అని గుర్తు చేశారు. ‘‘ఇప్పుడు పరిస్థితి మారింది. నేడున్నది నాటి భారత్ కాదు. ఉగ్ర ఘటనలపై గట్టిగా స్పందిస్తున్నాం. దుస్సాహసం చేస్తే మన సమాధానమే వేరుగా ఉంటుంది’’ అని స్పష్టం చేశారు. మనతో పగలు వ్యాపారం చేస్తాం, రాత్రిళ్లు మనపైనే ఉగ్ర దాడులు చేస్తామంటే కుదరదన్నారు. తూర్పు లద్దాఖ్‌లో 2020 నాటి పరిస్థితి నెలకొనాలంటే చైనా సేనలను పూర్తిగా ఉపసంహరించుకోవాల్సి ఉంటుందని జైశంకర్ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment