శాసనసభ చరిత్రలోనే 1994 ఎన్నికలకు ఎంతో ప్రత్యేకత ఉంది. ఈ ఎన్నికల్లో అఖండ మెజారిటీతో గెలుపొందాక పట్టుమని పదినెలలు కూడా సీఎం పదవిలో కొనసాగకుండానే టీడీపీ అధినేత ఎన్టీఆర్ రాజీనామా చేయాల్సి వచ్చింది. మూడో అల్లుడు చంద్రబాబునాయుడు పన్నిన రాజకీయ కుట్రకు ఎన్టీరామారావు బలయ్యారు. స్వపక్షం నుంచి అదీకూడా అత్యంత నమ్మకస్థుడైన వ్యక్తి నుంచే అనూహ్యమైన పద్థతుల్లో ఎదురైన రాజకీయ ఎత్తుగడలు, వ్యూహాలకు ఆయన చిత్తయ్యారు.
రాజకీయాల్లో హత్యలుండవు ఆత్మహత్యలే ఉంటాయన్న నానుడిని నిజం చేస్తూ సొంత అల్లుడు రచించిన వెన్నుపోటు రాజకీయాన్ని ఏమాత్రం గ్రహించలేకపోయారు. ఆ ఎన్నికల్లో ఎన్టీఆర్ ప్రజాకర్షకశక్తితో టీడీపీ మొత్తం 216 స్థానాల్లో తిరుగులేని అధిక్యతను సాధించింది. అయితే అల్లుడు పొడిచిన వెన్నుపోటుతో అధికారాన్ని కోల్పోయారు. తీవ్రమైన మనోవేదన మధ్య సీఎం పీఠం చంద్రబాబు వశమయ్యాక నాలుగున్నర నెలల్లోనే 1996 జనవరి 18న ఎన్టీఆర్ మరణించారు. 1996, 1998 లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రంలో వామపక్షాలతో పోత్తుపెట్టుకున్న చంద్రబాబు 1999 లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలకల్లా యూటర్న్ తీసుకుని బీజేపీతో పొత్తు కుదుర్చుకున్నారు.
రెండో ఆగస్టు సంక్షోభం...
1993లో ఎన్టీరామారావు లక్ష్మీ పార్వతిని రెండో వివాహం చేసుకున్న సమయంలో టీడీపీ ప్రతిపక్షంలో ఉండడంతో చంద్రబాబు అణిగిమణిగి ఉన్నట్టుగా కనిపించారు. టీడీపీ అధికారానికి వచ్చాక చంద్రబాబును విశ్వసించి ఆర్థిక, రెవెన్యూ వంటి కీలకశాఖలను ఎన్టీఆర్ అప్పగించారు. పరిపాలనలో లక్ష్మీపార్వతి జోక్యం ఆరోపణలతో పాటు 1995 ప్రథమార్థంలో జరిగిన మున్సిపల్, పంచాయతీరాజ్, సహకార ఎన్నికల్లో లక్ష్మీపార్వతి సూచించిన అభ్యర్థులు ఎక్కువ మందికి టికెట్లు కేటాయించడం వంటి పరిణామాలు చంద్రబాబు ఆగ్రహానికి కారణమైంది.
పదకొండేళ్ల తర్వాత 1995లో ఎన్టీఆర్ రెండో ఆగస్టు సంక్షోభాన్ని ఎదుర్కొన్నారు. టీడీపీలో మెజారిటీ ఎమ్మెల్యేల మద్దతుతో పాటు వామపక్షాల అండదండలు కూడా చంద్రబాబుకు లభించాయి. టీడీఎల్పీలో చీలిక కారణంగా అసెంబ్లీలో బలం నిరూపించుకోవాలని ఎన్టీఆర్‌కు గవర్నర్ కృష్ణకాంత్ కోరారు. బలపరీక్షకు ముందే ఎన్టీఆర్ రాజీనామా చేయడంతో 1995 సెప్టెంబర్ 1న చంద్రబాబు సీఎంగా ప్రమాణం చేశారు.
కుమ్ములాటలే కొంప ముంచాయి
ముఠా కుమ్ములాటలు తీవ్రస్థాయికి చేరుకున్న నేపథ్యంలో 1994 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ తీవ్ర పరాభవం ఎదుర్కొంది. టీడీపీ అత్యధిక సీట్లు కైవసం చేసుకుంది. టీడీపీ 216 స్థానాల్లో విజయం సాధించింది. రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ చరిత్రలోనే గతంలో ఎన్నడూ లేని విధంగా కేవలం 26 ఎమ్మెల్యే సీట్లకే పరిమితమైంది.
ఎంఐఎం నాయకత్వంతో విభేదించిన అమానుల్లాఖాన్ ఎంబీటీని స్థాపించి తొలిసారిగా ఆ పార్టీకి సవాల్ విసిరారు. ఈ ఎన్నికల్లో ఎన్టీఆర్ హిందూపురం, టెక్కలి స్థానాల నుంచి గెలిచారు. కాంగ్రెస్ శాసనసభాపక్షానికి పి.జనార్దనరెడ్డి నేతగా ఉన్నారు. జహీరాబాద్ నుంచి ఎం.బాగారెడ్డి , చలకర్తి నుంచి కుందూరు జానారెడ్డి (కాంగ్రెస్) ఓటమి చవిచూశారు.
- సాక్షి, నాలెడ్జ్ సెంటర్
Comments
Please login to add a commentAdd a comment