చంద్రబాబు వెన్నుపోటుకు 29 ఏళ్లు | 29 years of Chandrababu Vennupotu: andhra pradesh | Sakshi
Sakshi News home page

చంద్రబాబు వెన్నుపోటుకు 29 ఏళ్లు

Published Sun, Sep 1 2024 6:09 AM | Last Updated on Sun, Sep 1 2024 6:09 AM

29 years of Chandrababu Vennupotu: andhra pradesh

1995 సెప్టెంబర్‌ 1.. మామ ఎన్టీఆర్‌ను పదవీచ్యుతుడిని చేసి సీఎం పీఠం ఎక్కిన చంద్రబాబు

ఎన్టీఆర్‌ని కుటుంబానికి దూరం చేసి, ఏకాకిని చేసి పార్టీని లాక్కున్న చరిత్ర 

అల్లుడు చేసిన ద్రోహం, అవమానాలు తట్టుకోలేక ఆత్మ క్షోభతో చనిపోయిన ఎన్టీఆర్‌ 

40 ఏళ్ల రాజకీయ జీవితంలో తన ఎదుగుదలలో అన్నీ కుట్రలు, కుతంత్రాలే 

వెన్నుపోటు, నయవంచన, కల్లబొల్లి కబుర్లే చంద్రబాబు విజయ సోపానాలు 

పైకి మాత్రమే విజనరీ, లోపల రాజకీయ బేహారి 

తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాలను భ్రష్టు పట్టించిన వ్యక్తి బాబు 

వంగవీటి రంగా హత్యలోనూ కీలక పాత్ర 

బషీర్‌బాగ్‌ కాల్పుల ఘటన బాబు పైశాచికత్వానికి పరాకాష్ట 

రాష్ట్ర విభజన తర్వాత అమరావతిలో అంతర్జాతీయ స్థాయి కుంభకోణం

సాక్షి, అమరావతి: వెన్నుపోటుకు చంద్రబాబే ప్రపంచ బ్రాండ్‌. ఆయనకు ఈ ఘనత వచ్చి నేటితో సరిగ్గా 29 ఏళ్లు నిండింది. 30వ సంవత్సరంలోకి అడుగిడుతోంది. పిల్లనిచ్చిన సొంత మామ ఎన్టీఆర్‌నే అధికార దాహంతో వెన్నుపోటు పొడిచి, ఆయనపై చెప్పు­లేయించి, 1995 సెప్టెంబర్‌ 1న చంద్రబాబు సీఎం పీఠాన్ని ఎక్కారు. అప్పటి నుంచి తన అస్థిత్వాన్ని కాపాడుకోవడానికి రాజకీయాలను భ్రష్టు పట్టించారు. రాజకీయాలను డబ్బు మయం చేసి, కుట్రలు, కుతంత్రాలతో 3 దశాబ్దాలుగా నా­య­­కుడిగా చలామణి అవుతున్నారు. అప్పటి వెన్నుపోటుకు మూడు దశాబ్దాలు పూర్తవుతున్న సందర్భంగా తనను గొప్పగా కీర్తిస్తూ ఆదివారం రాష్ట్రవ్యాప్తంగా సంబరాలు జరపాలని టీడీపీ శ్రేణులకు పిలుపునిచ్చారు. 

చంద్రబాబును దశమ గ్రహంతో పోలి్చన ఎన్టీఆర్‌ 
చంద్రబాబుకు ఎన్టీఆర్‌ తన కుమార్తెను ఇచ్చి పెళ్లి చేస్తే.. ఆయన మామ ఎన్టీఆర్‌కే వెన్నుపోటు పొడిచి రిటర్న్‌ గిఫ్ట్‌ ఇచ్చారు. ఎన్టీఆర్‌ కుటుంబ సభ్యులను ట్రాప్‌లో పడేసి వెన్నుపోటు ప్రహసనంలో పావులుగా వాడుకున్నారు. ఎన్టీఆర్‌కు ద్రోహం చేసి పదవి నుండి తప్పించారు. ఎన్టీఆర్‌ స్థాపించిన తెలుగుదేశం పార్టీని, గుర్తును సొంతం చేసుకున్నారు. ఈ తిరుగుబాటులో ఎమ్మెల్యేలంతా చంద్రబాబు మా­య­లో పడ్డారని గ్రహించిన ఎన్టీఆర్‌.. పార్టీ ఎమ్మెల్యేలను ఒప్పించడానికి వైస్రాయ్‌ హోటల్‌కు వెళ్తే చంద్రబాబు దగ్గరుండి ఎన్టీఆర్‌పై చెప్పులు వేయించి దాడి చేశారు.

ఈ ఘోరమైన అవమానాన్ని ఎన్టీఆర్‌ తట్టుకోలేకపోయారు. ఆత్మ గౌరవానికి అత్యధిక ప్రాధాన్యతనిచ్చే ఎన్టీఆర్‌ తనకు జరిగిన అవమానంతో కుంగిపోయారు. ఆ క్షణమే తాను చచ్చిపోయినట్లు లెక్క అని కంటతడి పెట్టి ఆక్రోశించారు. అక్కడితో ఆగకుండా ఎన్టీఆర్‌ బ్యాంకు ఖాతాను చంద్రబాబు ఫ్రీజ్‌ చేయించారు. ఎన్టీఆర్‌ కురీ్చని కబ్జా చేసిన చంద్రబాబు అసెంబ్లీలోనూ ఆయన్ని అవమానించారు. సినిమాల్లో,  రాజకీయాల్లోనూ తనదైన శైలితో ఒక వెలుగు వెలిగిన ఎన్టీఆర్‌ తన జీవిత చరమాంకంలో సొంత మనుషుల చేతుల్లోనే ఘోరమైన అవమానాలు పొంది కంట తడి పెట్టుకున్నారు. చంద్రబాబుని ఎన్టీఆర్‌ దశమ గ్రహంగా, ఔరంగజేబుగానూ పోల్చారు. చంద్రబాబు పరివారం పెట్టిన మానసిక క్షోభతోనే ఎన్టీఆర్‌ కన్ను మూశారన్నది చరిత్ర చెప్పే విషయం. ఎన్టీఆర్‌ మరణానంతరం ఆయన ఆనవాళ్లు లేకుండా చేసేందుకు చంద్రబాబు అనేక నిర్ణయాలు తీసుకున్నారు.

ఎన్టీఆర్‌ తెచ్చిన మద్య నిషేధం, రెండు రూపాయల బియ్యం పథకాలను ఎత్తివేశారు. రైతులకు నీటి రాయితీని తొలగించారు. అటు పార్టీలోనూ ఎన్టీఆర్‌ జ్ఞాపకాలు లేకుండా చెరిపేశారు. ఇలా అనేక చర్యలతో ఎన్టీఆర్‌ను ప్రజలకు దూరం చేసేందుకు ప్రయతి్నంచారు. ఎన్టీఆర్‌ను అడుగడుగునా అవమానాలకు గురి చేస్తూ అనుక్షణం క్షోభ పెట్టిన చంద్రబాబు.. రాజకీయ అవసరాలకు మాత్రం ఎన్టీఆర్‌ పేరు, బొమ్మ వాడేసుకుంటారు. ఎన్టీఆర్‌ గురించి గొప్పగా చెబుతూ నిజ జీవితంలో ఎన్టీఆర్‌ను మించిన మహానటుడి పాత్ర పోషిస్తున్నారు. అప్పట్లో ఎన్టీఆర్‌కు వ్యతిరేకంగా అన్ని దారుణాలు చేసిన చంద్రబాబు ఇప్పుడు అదే ఎన్టీఆర్‌ను ఆకాశానికి ఎత్తేలా పొగడడం రాజకీయ వైచిత్రేనంటారు రాజకీయ విశ్లేషకులు.

బాబు హయాంలో అనేక నేరాలు, ఘోరాలు
995లో ఎన్టీఆర్‌ను ద్రోహపూరితంగా గద్దె దించి, తాను పీఠమెక్కింది మొదలు చంద్రబాబు రాజకీయం, పరిపాలన మొత్తం కుట్రలు, కుతంత్రాలు, స్వార్థ ప్రయోజనాలే. 1995 – 2004 మధ్య కాలంలో ఉమ్మడి ఏపీని ప్రపంచ బ్యాంకుకు తాకట్టు పెట్టారనే విమర్శలున్నాయి. “ప్రపంచ బ్యాంకు జీతగాడు, చంద్రబాబు మాయగాడు’ అంటూ అప్పట్లో కమ్యూనిస్టులు ప్రత్యేక పాటలు రచించి ప్రచారం చేశాయంటే ఆయన ఏ స్థాయిలో ప్రజలను వంచించారో అర్థం చేసుకోవచ్చు. హైటెక్‌ సిటీ నిర్మాణం పేరుతో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేసి కోట్లు కూడగట్టారు. ఏలేరు స్కాం, తెల్గీ స్టాంపులు, మద్యం ముడుపులు, పనికి ఆహార పథకం వంటి కుంభకోణాలు అనేకం వెలుగు చూశాయి.

అప్పట్లోనే ‘చంద్రబాబు జమానా–అవినీతి ఖజానా’ అని సీపీఎం పార్టీ ఒక పుస్తకాన్ని విడుదల చేసి రాష్ట్రవ్యాప్తంగా ప్రచారం చేసింది. రాజకీయాల్లో ప్రత్యర్థులను వర్గ శత్రువులుగా పరిగణించి రాయలసీమలో ఫ్యాక్షన్‌ ను రాజేశారు. అనంతపురం జిల్లాలో ప్రత్యర్థి రాజకీయ పార్టీకి చెందిన వందలాది మందిని వెంటాడి వేటాడి చంపేయడంలో కీలక భూమిక పోషించారనే విమర్శలు అప్పట్లో బలంగా వినిపించాయి. విద్యుత్‌ ఛార్జీలను అడ్డగోలుగా పెంచడంతో ప్రజలు ఉద్యమించి శాంతియుతంగా నిరసన తెలుపుతుంటే 2000 సంవత్సరంలో వారిపై కాల్పులు జరిపించిన చరిత్ర చంద్రబాబుది.

ఈ ఘటనలో ముగ్గురు చనిపోవడం అప్పట్లో తీవ్ర సంచలనంగా మారి చంద్రబాబు రాక్షసత్వాన్ని బయటపెట్టింది. అంతకు ముందు తణుకు సమీపంలోని కాల్దరి రైల్వేస్టేషన్‌ వద్ద ఆందోళన చేస్తున్న రైతులపై కాల్పులు జరిపించి ఒక రైతు మృతికి కారకుడయ్యారు. వీటన్నింటిపైనా వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి అలుపెరగని పోరాటం చేశారు. దాని పర్యవసానమే 2004 ఎన్నికల్లో చంద్రబాబు చిత్తుగా ఓడిపోయి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి అధికారంలోకి వచ్చారు.

రంగా హత్యలోనూ తెరవెనుక పాత్ర! 
రాష్ట్రంలో 1985 ఎన్నికల్లో విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి భారీ మెజార్టీతో గెలుపొందిన వంగవీటి మోహన రంగా తిరుగులేని నాయకుడిగా ఆవిర్భవించారు. రంగాను అడ్డు తొలగించుకోకపోతే కోస్తాలో రాజకీయ మనుగడ ఉండదని చంద్రబాబు భావించారని చెబుతారు. అందుకే అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్‌కు తెలియకుండా కుట్ర చేసి.. 1988 డిసెంబర్‌ 26న ప్రజా సమస్యల పరిష్కారం, వ్యక్తిగత భద్రత కోసం ఆమరణ దీక్ష చేస్తున్న రంగాను అతి దారుణంగా హత్య చేయించడంలో చంద్రబాబు కీలక పాత్ర పోషించారని సీనియర్‌ నేత చేగొండి హరిరామజోగయ్య తన ఆత్మకథలో రాశారు.

రాష్ట్ర విభజన తర్వాత మళ్లీ కుంభకోణాలు  
రాష్ట్ర విభజన తర్వాత ప్రజలను ఏమార్చి దొంగ హామీలతో 2014లో మళ్లీ అధికారంలోకి వచ్చిన చంద్రబాబు రాష్ట్రాన్ని అవినీతిమయం చేశారు. జన్మభూమి కమిటీల పేరుతో ప్రజలను పీక్కు తిన్నారు. అమరావతి రాజధాని పేరుతో చేసిన అంతర్జాతీయ కుంభకోణంతో ప్రపంచమే ఆశ్చర్యపోయింది. రాజధాని కోసం రైతులపై దౌర్జన్యాలకు పాల్పడి బలవంతపు భూసమీకరణ చేశారు. అసైన్డ్‌ భూములను లాక్కోవడం, ఇన్‌సైడర్‌ ట్రేడింగ్, ఇన్నర్‌ రింగు రోడ్డు అలైన్‌మెంట్‌ మార్పు, స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కుంభకోణం, విశాఖలో లక్ష ఎకరాల భూ కుంభకోణం, నీరు–చెట్టు కార్యక్రమంలో అవినీతి వంటి లెక్కలేనని వ్యవహారాలు బయటకు వచ్చాయి.

ఈ నేపథ్యంలో 2019 ఎన్నికల్లో ప్రజలు చంద్రబాబుని మరోసారి చిత్తుగా ఓడించారు. ఆ తర్వాత స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కుంభకోణంలో ఏకంగా అరెస్టయి జైలుకు వెళ్లారు. ప్రజలను మాయ చేసి కనీవినీ ఎరుగని అబద్ధాలు, దొంగ హామీలతో ఇటీవల జరిగిన ఎన్నికల్లో చంద్రబాబు మళ్లీ అధికారంలోకి వచ్చారు. వెన్నుపోట్లు, మోసం, నయవంచనతో రాజకీయ జీవితాన్ని నిరి్మంచుకున్న చంద్రబాబు తనను ఒక విజనరీగా చూపించేందుకు ఎల్లో మీడియాను ఉపయోగించుకున్నారు.

చంద్రబాబు చెప్పుచేతల్లో ఉండే ఈ మీడియా ఆయన్ని అవతార పురుషుడిగా, అభివృద్ధి ప్రదాతగా కీర్తిస్తూ నిత్యం ప్రజలను ఏమారుస్తూనే ఉంటుంది. మీడియా హైప్, సొంత డబ్బా కొట్టుకోవడంలోనే ఆయన విజన్‌ కనిపిస్తుంది తప్ప నిజానికి చంద్రబాబు ఒక దారి తప్పిన, మోసపూరిత నాయకుడు.  అలవికాని హామీలు ఇచ్చి అధికారంలోకి రావడం, ఆ తర్వాత వంచించడం ఆయన నైజం. వీటన్నింటినీ దాచి చంద్రబాబును గొప్ప నేతగా టీడీపీ శ్రేణులు, ఎల్లో మీడియా కీర్తించడంపై రాజకీయ విశ్లేషకులు పెదవి విరుస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement