తెలంగాణ ఎన్నికల పర్వం ముగియడంతో ఇక ఏపీలో ఎన్నికల వేడి రాజుకుంటోంది. అధికార వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ జోష్ మీదుంటే..ప్రతిపక్ష టీడీపీ మాత్రం దిక్కులు చూస్తోంది. ముఖ్యంగా ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో కింజరాపు కుటుంబం చరిష్మా చెదిరిపోవడంతో ఆ ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. గడిచిన ఐదేళ్ళుగా జిల్లాలో టీడీపీ ప్రాభవం నానాటికి తీసికట్టుగా తయారవుతోంది. ఇక కింజరాపు కుటుంబాన్ని నమ్ముకుంటే లాభం లేదని టీడీపీ శ్రేణులు భావిస్తున్నాయి. శ్రీకాకుళం జిల్లాలో తాజా రాజకీయాలు ఎలా ఉన్నాయంటే..
శ్రీకాకుళం జిల్లా తెలుగుదేశం పార్టీ రాజకీయాలు ఎప్పుడూ కింజరాపు కుటుంబం చుట్టూనే తిరుగుతాయి. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడుగా కింజరాపు అచ్చెన్నాయుడు, శ్రీకాకుళం ఎంపీగా కింజరాపు రామ్మోహన్ నాయుడు, రాజమండ్రి ఎమ్మెల్యేగా ఎర్రన్నాయుడు కుమార్తె భవాని తెలుగుదేశం పార్టీలో కీలక కుటుంబంగా వ్యవహరిస్తున్నారు. యర్రంనాయుడు మరణం తరువాత ఆయన వారసులుగా రాజకీయ ప్రవేశం చేసిన ఆయన తమ్ముడు, కొడుకు, కూతురు టీడీపీలో పదవులు అనుభవిస్తున్నారు.
రాష్ట్రంలో మారిన రాజకీయ పరిస్థితుల్లో ఇప్పుడు కింజరాపు కుటుంబానికి వైభవం గతంగా మిగిలిపోయింది. రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడుకు.. పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మధ్య పొసగడం లేదు. అచ్చెన్నాయుడు ఎంత రాసుకుపూసుకు తిరుగుతున్నా లోకేష్ మాత్రం టచ్ మీ నాట్ అన్నట్టే వ్యవహరిస్తున్నారు.
రాష్ట్ర పార్టీ అధ్యక్షుడి హాదాలో ఉన్న అచ్చెన్నాయుడు లోకేష్ వల్లే తెలుగుదేశంకు నష్టం జరుగుతోందంటూ చేసిన కామెంట్.. పార్టీ లేదూ బొక్కా లేదు అని పలు సందర్బాల్లో అన్న వ్యాఖ్యలు లోకేష్ టీంలో నాటుకుపోయాయి. ఈ వీడియోలు వైరల్ అవ్వడంతో పార్టీ శ్రేణుల్లో కూడా చులకన భావం ఏర్పడింది. అచ్చెన్నాయుడుని రాష్ట్ర నాయుకుడుగా గుర్తించడం లేదు.
మరో పక్క శ్రీకాకుళం ఎంపీగా రామ్మోహన్ నాయుడు ఒక ఫెయిల్యూర్ ఎంపీ అని జిల్లా ప్రజల్లో అసంతృప్తి ఉంది. ఢిల్లీలోని కేంద్ర పెద్దలతో ఫోటోలు దిగడం, ట్విట్టర్ లో పోస్ట్ చేయడం మినహా ఆయన జిల్లాలో కనిపించింది చాలా అరుదు అని పార్టీ కేడరే పెదవి విరుస్తున్నారు. శ్రీకాకుళంలో ఇల్లు ఉన్నా, ఎప్పుడు ఇంట్లో ఉండరని కార్యకర్తలు బహిరంగ వేదికల మీదే ప్రశ్నించిన సందర్బాలు కూడా ఉన్నాయి. అప్పుడప్పుడు స్థానికంగా ఉంటున్నప్పటికీ ఇంట్లో లైట్లు వేసి ఉంటే కార్యకర్తలు ఇంటికి వచ్చేస్తారని, లైట్లు ఆర్పేస్తారని చెప్పుకుంటున్నారు. జిల్లా ప్రజల కంటే చంద్రబాబు, లోకేష్ ల చుట్టూ తిరగడానికి, ఢిల్లీలో గడపడానికే ఎక్కువ సమయం కేటాయిస్తుండటంతో ఈయన మీద అసెంబ్లీ నియోజకవర్గాల్లో తీవ్ర అసంతృప్తి రాజుకుంది.
ఒకవైపు అచ్చెన్నాయుడుకి అధిష్టానం వద్ద విలువలేకపోవడం, మరోవైపు రామ్మోహన్ నాయుడు తీరుపై జిల్లా ప్రజలు, పార్టీలో నమ్మకం లేకపోవడంతో ఈ ఎన్నికల్లో కింజరాపు కుటుంబాన్ని నమ్ముకుంటే నట్టేట మునిగిపోతాం అనే భయం జిల్లా నాయకులను వెంటాడుతోంది. వీరిద్దరి గ్రాఫ్ తగ్గిందని చంద్రబాబు సర్వే రిపోర్ట్‌లు కూడా తేల్చడంతో ఈ ప్రభావం అసెంబ్లీ నియోజవర్గాలపై కూడా ఉందని టికెట్ ఆశిస్తున్నవారు ఆందోళన చెందుతున్నారు.
వి సంతబొమ్మాళి మండలంలో మూలపేట పోర్టు నిర్మాణం, ఉద్దానం తాగునీటి ప్రోజెక్ట్, కిడ్నీ రీసెర్చ్ సెంటర్ నిర్మాణాల వలన టెక్కలిలో ఈసారి వై.యస్.ఆర్ కాంగ్రెస్ కు బ్రహ్మరధం పడుతున్నారు. దశాబ్దాలుగా ఈ ప్రాంత ప్రజలు కోరుకున్న పనులు వై.యస్.ఆర్ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాకే చేసింది. దీంతో టెక్కలిలో ఈసారి అచ్చెన్నాయుడు గెలుపు ప్రశ్నార్దకం అయింది. మొత్తం మీద కింజారపు కుటుంబం నుంచి ఎన్నికైన ప్రజా ప్రతినిధుల గ్రాఫ్ పడిపోవడంతో.. వీరివల్ల జిల్లాలో పార్టీ పరిస్థితి కూడా దయనీయంగా తయారైందనే చర్చ సాగుతోంది.
ఇదీ చదవండి: AP: కాంగ్రెస్‌తో టీడీపీ పొత్తు పెట్టుకుంటే.. జరిగేది ఇదేనా?
Comments
Please login to add a commentAdd a comment