kinjarapu rammohan naidu
-
గడువులోపు పనులు పూర్తి చేయకుంటే కఠిన చర్యలు
విమానాశ్రయం (గన్నవరం): విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం (గన్నవరం)లో నూతనంగా చేపట్టిన ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ నిర్మాణ పనులను గడువులోపు పూర్తి చేయకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని సదరు కాంట్రాక్ట్ సంస్థను కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్నాయుడు హెచ్చరించారు. విమానాశ్రయంలో నిర్మించిన అప్రోచ్ రోడ్డును శనివారం ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన ప్రారంభించారు. ఎయిర్పోర్ట్ ఆవరణలో రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర, ఎంపీ వల్లభనేని బాలశౌరి, ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావుతో కలసి మొక్కలు నాటారు.అనంతరం నూతన ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ నిర్మాణ పనులపై కేంద్ర మంత్రి సమీక్ష జరిపారు. ఇప్పటి వరకు జరిగిన పనుల పురోగతిపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అధికారులు వివరించారు. కోవిడ్ పరిస్థితులు, వర్షాల కారణంగా నిర్మాణ పనుల్లో జాప్యం జరిగిందని తెలిపారు. టెర్మినల్ పనులు ప్రారంభించి ఐదేళ్లు గడుస్తున్నా 52 శాతం పనులనే పూర్తి చేయడంపై కేంద్ర మంత్రి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ 2025 జూన్ 30 నాటికి టెర్మినల్ నిర్మాణ పనులను పూర్తి చేయాలని ఆదేశించారు. పనుల పురోగతిపై అవసరమైతే ప్రతి వారం సమీక్ష నిర్వహించనున్నట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రటరీ సురేష్‌కుమార్, కృష్ణా జిల్లా జాయింట్ కలెక్టర్ గీతాంజలిశర్మ, అనకాపల్లి ఎంపీ రమేష్, ఎయిర్పోర్ట్ డైరెక్టర్ ఎం.లక్ష్మీకాంతరెడ్డి, సివిల్ విభాగం జనరల్ మేనేజర్ రామాచారి, పలు శాఖల అధికారులు పాల్గొన్నారు.ఇండిగో–ఢిల్లీ సర్వీస్ ప్రారంభంతొలుత న్యూఢిల్లీ–విజయవాడ మధ్య ఇండిగో ఎయిర్‌లైన్స్ నడపనున్న విమాన సర్వీస్ ప్రారంభ వేడుకలను కేంద్ర మంత్రి రామ్మోహన్నాయుడు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. -
కేంద్ర మంత్రివర్గంలో అబ్బాయి, రాష్ట్ర మంత్రివర్గంలో బాబాయి..
-
కేంద్ర మంత్రిగా ఎర్రన్న తనయుడు
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: దివంగత కింజరాపు ఎర్రన్నాయుడు తనయుడు, ఎంపీ కింజరాపు రామ్మోహన్నాయుడు చిన్న వయసులో పెద్ద బాధ్యతలు అందుకున్నారు. టీడీపీ నాయకులు ప్రేమగా రాము అని పిలుచుకునే రామ్మోహన్ నాయుడిని 36 ఏళ్ల వయసులోనే కేంద్ర మంత్రి పదవి వరించింది. నరేంద్ర మోదీ మూడోసారి ఏర్పాటు చేసిన ప్రభుత్వంలో ఆదివారం రాత్రి క్యాబినెట్ మంత్రిగా ఆయన ప్రమాణ స్వీకారం చేశారు. తండ్రికి తగ్గ తనయుడిగా గుర్తింపు దక్కించుకున్న రామ్మోహన్నాయుడు.. జిల్లాలో ఎంపీగా హ్యాట్రిక్ కొట్టారు. చంద్రబాబుతో అత్యంత సన్నిహిత సంబంధాలు ఉండటంతో ఎన్డీఏ ప్రభుత్వంలో ఆయనకు క్యాబినెట్ ర్యాంకు మంత్రి పదవి దక్కింది. 36 ఏళ్ల వయస్సులో.. ఎంపీ రామ్మోహన్నాయుడు తండ్రి ఎర్రన్నాయుడు 37 ఏళ్ల వయస్సులో కేంద్రమంత్రిగా పనిచేశారు. ఇప్పుడు తనయుడు 36 ఏళ్ల వయస్సులోనే కేంద్ర మంత్రి పదవిని అలంకరించారు. దీంతో జిల్లా నుంచి కేంద్ర మంత్రి బాధ్యతలు నిర్వర్తించిన వారి సంఖ్య మూడుకు చేరింది. 1996లో యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వంలో ఎర్రన్నాయుడు కేంద్ర గ్రామీణాభివృద్ధి, ఉపాధి కల్పనా శాఖ మంత్రిగా పనిచేశారు. 2011లో కిల్లి కృపారాణి ఐటీ, కమ్యూనికేషన్ శాఖ సహాయ మంత్రిగా పనిచేశారు. అలాగే, ఉమ్మడి శ్రీ కాకుళం జిల్లాలోని పాలకొండ, ఉణుకూరు నియోజకవర్గాలు కలిసి ఉన్న పార్వతీపురం ఎంపీగా ఎన్నికైన వైరిచర్ల కిషోర్ చంద్రదేవ్ కూడా చరణ్‌సింగ్(1979–80), మన్మోహన్ సింగ్ ప్రభుత్వం(2011–2014)లో కేంద్ర ఉక్కు, గనుల, బొగ్గు శా ఖా మంత్రిగా, గిరిజన శాఖ మంత్రిగా, పంచాయతీరాజ్ శాఖా మంత్రిగా పనిచేశారు. ఆంధ్రరాష్ట్రం ఏర్పడక ముందు పాతపట్నం లోకసభ నుంచి గెలిచిన వీవీ గిరి కూడా ఆ తర్వాత ఎన్నికైన సందర్భంలో కేంద్రమంత్రిగా పనిచేశారు.కుటుంబ నేపథ్యం.. కేంద్ర మాజీ మంత్రి, దివంగత నేత కింజరాపు ఎర్రన్నాయుడు, విజయకుమారి దంపతులకు శ్రీకాకుళం జిల్లా నిమ్మాడలో 1987 డిసెంబర్ 18న రామ్మోహన్నాయుడు జని్మంచారు. ఈయనకు సోదరి భవానీ ఉన్నారు. ఈమె 2019 ఎన్నికల్లో రాజమహేంద్రవరం ఎమ్మెల్యేగా గెలిచారు. ఈయన బాబాయ్ అచ్చెన్నాయుడు గతంలో మంత్రిగా పనిచేశారు. ఎర్రన్నాయుడు టీడీపీలో కీలక నేతగా కొనసాగుతున్న సమయంలో రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో రామ్మోహన్నాయుడు రాజకీయ అరంగేట్రం చేశారు. మాజీ మంత్రి, విశాఖ జిల్లా టీడీపీ నేత బండారు సత్యనారాయణమూర్తి కుమార్తె శ్రావ్యను 2017లో వివాహమాడారు. వీరికి నిహిర అన్వి, శివాంకృతి అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. విద్యాభ్యాసం రామ్మోహన్నాయుడు ఒకటో తరగతి నుంచి మూడో తరగతి వరకు శ్రీకాకుళంలోని గురజాడ ఎడ్యుకేషన్ సొసైటీ హాస్టల్లో చదువుకున్నారు. 1994లో ఎర్రన్నాయుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం పార్టీ చీఫ్ విప్‌గా ఎన్నికవ్వడంతో హైదరాబాద్‌కు మకాం మార్చారు. దీంతో 4,5వ తరగతులు హైదరాబాద్‌లోని భారతీయ విద్యా భవన్లో చదువుకున్నారు. 1996 లో ఎర్రన్నాయుడు లోకసభకు ఎన్నికవ్వడంతో హైదరాబాద్ నుంచి ఢిల్లీకి కుటుంబమంతా షిఫ్ట్ అయ్యింది. దీంతో రామ్మోహన్నాయుడు ఆరో తరగతి నుంచి ఇంటర్ వరకు ఢిల్లీలోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో చదివారు. ఆ తర్వాత ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లి అక్కడ ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ పూర్తి చేసి, ఆ తర్వాత అక్కడే ఉన్న లాంగ్ ఐలాండ్ విశ్వవిద్యాలయంలో ఎంబీఏ కూడా చేశారు. సింగపూర్‌లో ఏడాది పాటు ఉద్యోగం చేసి తర్వాత ఢిల్లీకి వచ్చేశారు. ఢిల్లీలో ఒక ఇంటీరియర్ డెవలప్మెంట్ కంపెనీ మా ర్కెటింగ్ వ్యవహారాలు చూసేవారు. ఎర్రన్నాయుడు 2012లో రోడ్డు ప్రమాదంలో మరణించడంతో ఉద్యోగం మానేసి శ్రీకాకుళం వచ్చేశారు. 2014 ఎన్నికల్లో ఎర్రన్నాయుడు వారసుడిగా రాజకీయాల్లోకి ప్రవేశించి తొలిసారి శ్రీకాకుళం ఎంపీగా పోటీ చేశారు. 26 ఏళ్లకే ఎంపీగా గెలిచి చరిత్ర సృష్టించారు. అక్కడి నుంచి వరుసగా మూడు సార్లు ఎంపీగా గెలిచారు. ఇప్పుడు 36 ఏళ్ల వయస్సులో కేంద్ర మంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. -
కేంద్ర కేబినెట్లోకి రామ్మోహన్నాయుడు?
సాక్షి, అమరావతి: శ్రీకాకుళం ఎంపీ కింజరపు రామ్మోహన్నాయుడుకి కేంద్ర మంత్రివర్గంలో చోటు దక్కినట్లు తెలిసింది. ప్రధాని మోదీ మంత్రివర్గంలో ఆయనను కేబినెట్ హోదాలో తీసుకోనున్నట్లు సమాచారం. ఎన్డీయే మంత్రివర్గంలో టీడీపీకి మూడు కేంద్ర మంత్రి పదవులు ఇవ్వడానికి బీజేపీ అంగీకరించినట్లు ప్రచారం జరుగుతోంది. వాటిలో ఒకటి కేబినెట్ మంత్రి హోదాతో కాగా మరో రెండు సహాయ మంత్రి పదవులను ఇస్తామని చెప్పగా అందుకు చంద్రబాబు అంగీకరించినట్లు టీడీపీ వర్గాలు తెలిపాయి. కేబినెట్ హోదా మంత్రి పదవికి రామ్మోహన్ నాయుడు పేరును చంద్రబాబు ఖరారు చేసినట్లు చెబుతున్నారు. అలాగే, సహాయ మంత్రి పదవులకు గుంటూరు, నెల్లూరు ఎంపీలు పెమ్మసాని చంద్రశేఖర్, వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డిల పేర్లను ఆయన ఖరారు చేసినట్లు సమాచారం. ప్రధానమంత్రితో పాటు వీరు ముగ్గురూ ఆదివారం మంత్రులుగా ప్రమాణం చేస్తారని టీడీపీ నేతలు చెబుతున్నారు. చంద్రబాబు కుటుంబానికి అత్యంత సన్నిహితుడుగా, మూడుసార్లు ఎంపీగా గెలిచిన రామ్మోహన్నాయుడుకి ఈసారి కేంద్రమంత్రి పదవి ఖాయమని ముందు నుంచి ప్రచారం జరుగుతోంది. జనసేన–బీజేపీకి ఒకటి..జనసేన, బీజేపీల నుంచి కూడా ఒకరికి కేంద్ర సహాయ మంత్రి పదవి దక్కే అవకాశమున్నట్లు తెలుస్తోంది. జనసేనకు మంత్రి పదవి ఇస్తే మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరికి అవకాశం ఉండవచ్చని చెబుతున్నారు. అలాగే, బీజేపీ తరఫున అయితే సీఎం రమేష్ లేదా పురందేశ్వరిలో ఒకరికి ఛాన్స్ ఉండవచ్చని చెబుతున్నారు. -
గ్రాఫ్ పెరిగిందా? తగ్గిందా?.. నమ్ముకుంటే అంతేనా?
తెలంగాణ ఎన్నికల పర్వం ముగియడంతో ఇక ఏపీలో ఎన్నికల వేడి రాజుకుంటోంది. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జోష్ మీదుంటే..ప్రతిపక్ష టీడీపీ మాత్రం దిక్కులు చూస్తోంది. ముఖ్యంగా ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో కింజరాపు కుటుంబం చరిష్మా చెదిరిపోవడంతో ఆ ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. గడిచిన ఐదేళ్ళుగా జిల్లాలో టీడీపీ ప్రాభవం నానాటికి తీసికట్టుగా తయారవుతోంది. ఇక కింజరాపు కుటుంబాన్ని నమ్ముకుంటే లాభం లేదని టీడీపీ శ్రేణులు భావిస్తున్నాయి. శ్రీకాకుళం జిల్లాలో తాజా రాజకీయాలు ఎలా ఉన్నాయంటే.. శ్రీకాకుళం జిల్లా తెలుగుదేశం పార్టీ రాజకీయాలు ఎప్పుడూ కింజరాపు కుటుంబం చుట్టూనే తిరుగుతాయి. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడుగా కింజరాపు అచ్చెన్నాయుడు, శ్రీకాకుళం ఎంపీగా కింజరాపు రామ్మోహన్ నాయుడు, రాజమండ్రి ఎమ్మెల్యేగా ఎర్రన్నాయుడు కుమార్తె భవాని తెలుగుదేశం పార్టీలో కీలక కుటుంబంగా వ్యవహరిస్తున్నారు. యర్రంనాయుడు మరణం తరువాత ఆయన వారసులుగా రాజకీయ ప్రవేశం చేసిన ఆయన తమ్ముడు, కొడుకు, కూతురు టీడీపీలో పదవులు అనుభవిస్తున్నారు. రాష్ట్రంలో మారిన రాజకీయ పరిస్థితుల్లో ఇప్పుడు కింజరాపు కుటుంబానికి వైభవం గతంగా మిగిలిపోయింది. రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడుకు.. పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మధ్య పొసగడం లేదు. అచ్చెన్నాయుడు ఎంత రాసుకుపూసుకు తిరుగుతున్నా లోకేష్ మాత్రం టచ్ మీ నాట్ అన్నట్టే వ్యవహరిస్తున్నారు. రాష్ట్ర పార్టీ అధ్యక్షుడి హాదాలో ఉన్న అచ్చెన్నాయుడు లోకేష్ వల్లే తెలుగుదేశంకు నష్టం జరుగుతోందంటూ చేసిన కామెంట్.. పార్టీ లేదూ బొక్కా లేదు అని పలు సందర్బాల్లో అన్న వ్యాఖ్యలు లోకేష్ టీంలో నాటుకుపోయాయి. ఈ వీడియోలు వైరల్ అవ్వడంతో పార్టీ శ్రేణుల్లో కూడా చులకన భావం ఏర్పడింది. అచ్చెన్నాయుడుని రాష్ట్ర నాయుకుడుగా గుర్తించడం లేదు. మరో పక్క శ్రీకాకుళం ఎంపీగా రామ్మోహన్ నాయుడు ఒక ఫెయిల్యూర్ ఎంపీ అని జిల్లా ప్రజల్లో అసంతృప్తి ఉంది. ఢిల్లీలోని కేంద్ర పెద్దలతో ఫోటోలు దిగడం, ట్విట్టర్ లో పోస్ట్ చేయడం మినహా ఆయన జిల్లాలో కనిపించింది చాలా అరుదు అని పార్టీ కేడరే పెదవి విరుస్తున్నారు. శ్రీకాకుళంలో ఇల్లు ఉన్నా, ఎప్పుడు ఇంట్లో ఉండరని కార్యకర్తలు బహిరంగ వేదికల మీదే ప్రశ్నించిన సందర్బాలు కూడా ఉన్నాయి. అప్పుడప్పుడు స్థానికంగా ఉంటున్నప్పటికీ ఇంట్లో లైట్లు వేసి ఉంటే కార్యకర్తలు ఇంటికి వచ్చేస్తారని, లైట్లు ఆర్పేస్తారని చెప్పుకుంటున్నారు. జిల్లా ప్రజల కంటే చంద్రబాబు, లోకేష్ ల చుట్టూ తిరగడానికి, ఢిల్లీలో గడపడానికే ఎక్కువ సమయం కేటాయిస్తుండటంతో ఈయన మీద అసెంబ్లీ నియోజకవర్గాల్లో తీవ్ర అసంతృప్తి రాజుకుంది. ఒకవైపు అచ్చెన్నాయుడుకి అధిష్టానం వద్ద విలువలేకపోవడం, మరోవైపు రామ్మోహన్ నాయుడు తీరుపై జిల్లా ప్రజలు, పార్టీలో నమ్మకం లేకపోవడంతో ఈ ఎన్నికల్లో కింజరాపు కుటుంబాన్ని నమ్ముకుంటే నట్టేట మునిగిపోతాం అనే భయం జిల్లా నాయకులను వెంటాడుతోంది. వీరిద్దరి గ్రాఫ్ తగ్గిందని చంద్రబాబు సర్వే రిపోర్ట్లు కూడా తేల్చడంతో ఈ ప్రభావం అసెంబ్లీ నియోజవర్గాలపై కూడా ఉందని టికెట్ ఆశిస్తున్నవారు ఆందోళన చెందుతున్నారు. వి సంతబొమ్మాళి మండలంలో మూలపేట పోర్టు నిర్మాణం, ఉద్దానం తాగునీటి ప్రోజెక్ట్, కిడ్నీ రీసెర్చ్ సెంటర్ నిర్మాణాల వలన టెక్కలిలో ఈసారి వై.యస్.ఆర్ కాంగ్రెస్ కు బ్రహ్మరధం పడుతున్నారు. దశాబ్దాలుగా ఈ ప్రాంత ప్రజలు కోరుకున్న పనులు వై.యస్.ఆర్ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాకే చేసింది. దీంతో టెక్కలిలో ఈసారి అచ్చెన్నాయుడు గెలుపు ప్రశ్నార్దకం అయింది. మొత్తం మీద కింజారపు కుటుంబం నుంచి ఎన్నికైన ప్రజా ప్రతినిధుల గ్రాఫ్ పడిపోవడంతో.. వీరివల్ల జిల్లాలో పార్టీ పరిస్థితి కూడా దయనీయంగా తయారైందనే చర్చ సాగుతోంది. ఇదీ చదవండి: AP: కాంగ్రెస్‌తో టీడీపీ పొత్తు పెట్టుకుంటే.. జరిగేది ఇదేనా? -
వాడుకుని వదిలేయడమే తప్ప టిక్కెట్ ఇచ్చే ప్రసక్తే లేదు...
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం : టీడీపీ బస్సు యాత్రకు మొదటి రోజే గ్రూపు రాజకీయాలు స్వాగతం పలికాయి. పాతపట్నంలో మాజీ ఎమ్మెల్యే కలమట వెంకటరమణ తీరుకు నిరసనగా మామిడి గోవిందరావు వర్గమంతా యాత్రకు దూరంగా ఉండిపోయింది. పిలవని పేరంటానికి వెళ్లి తన్నుకోవడం తప్ప మరో ప్రయోజనం ఉండదని మామిడి వర్గీయులంతా తమ ఇళ్లకే పరిమితమమయ్యారు. దీంతో వచ్చిన కొద్ది మందితోనే యాత్రను మమ అనిపించేశారు. రెండుగా చీలిపోయి.. పాతపట్నం టీడీపీలో విభేదాలు అందరికీ తెలిసిందే. గత ఎన్నికల్లో గెలిపించుకున్న ప్రజల్ని మోసగించి, టీడీపీ ఇచ్చిన ప్యాకేజీ తీసుకుని, పార్టీ ఫిరాయించిన కలమట వెంకటరమణ వర్గం ఒకటైతే, కొత్త నాయకత్వం వహిస్తున్న మామిడి గోవిందరావు వర్గం మరొకటి. వీరిద్దరి గ్రూపు రాజకీయాలతో అక్కడి టీడీపీ కేడర్ రెండుగా చీలిపోయింది. కలమట వెంకటరమణను ఎంపీ కింజరాపు రామ్మోహన్నాయుడు, ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు ప్రోత్సహిస్తుండగా, మామిడి గోవిందరావును కళా వెంకటరావు ద్వారా నేరుగా నారా లోకేష్ నడిపిస్తున్నారు. గతంలో కింజరాపు అచ్చెన్నాయుడు అనుసరించిన తీరు సంచలనం కూడా అయింది. మామిడి గోవిందరావు బాగా ఖర్చు పెడతారని, పార్టీకి కూడా ఎప్పటికప్పుడు ఫండింగ్ ఇస్తున్నాడని, వాడిని వాడుకుని నిన్ను బలపరుస్తామని నిమ్మాడలో బాహాటంగానే కలమట వెంకటరమణ వద్ద కింజరాపు అచ్చెన్నాయుడు చెప్పుకొచ్చిన విషయం తెలిసిందే. వాడుకుని వదిలేయడమే తప్ప టిక్కెట్ ఇచ్చే ప్రసక్తే లేదని తెగేసి చెప్పేశారు. అప్పుడే విషయం తెలుసుకున్న మామిడి గోవిందరావు నేరుగా లోకేష్‌ను నమ్ముకుని రాజకీయాలు చేస్తున్నారు. కింజరాపు ఫ్యామిలీ ఆడుతున్న డబుల్ గేమ్‌ను తన అనుయాయుల వద్ద పంచుకున్నారు. రానున్న ఎన్నికల్లో ఎంపీగా పోటీచేయనున్న రామ్మోహన్ నాయుడుకు తన సత్తా ఏంటో చూపిస్తానని కేడర్ వద్ద చెప్పినట్లు సమాచారం. ముందస్తు సమాచారంతోనే.. తాజాగా టీడీపీ బస్సు యాత్ర శనివారం ఆ నియోజకవర్గంలో ప్రారంభమైంది. నియోజకవర్గంలో ప్రవేశించిన బస్సు యాత్రకు రెండు గ్రూపులు వచ్చి స్వా గతం పలుకుతాయని జిల్లా టీడీపీ శ్రేణులు భావించాయి. కానీ మామిడి గోవిందరావు వర్గానికి ముందుగా ఆహ్వానం రాలేదు. మాజీ ఎమ్మెల్యే కలమట వెంకటరమణ అంతా తానై వ్యవహరించారు. ఈ నేపథ్యంలో యాత్రలో పాల్గొని అవమానం పాలవ్వడం కంటే వెళ్లకపోవడమే మంచిదని బాయ్‌కాట్ చేశారు. పార్వతీపురం మన్యం జిల్లాలో టీడీపీ బస్సు యాత్ర చేసినప్పుడు అక్కడ నియోజకవర్గ ఇన్చార్జి నిమ్మక జయకృష్ణ తనకు ప్రత్యర్థిగా ఉన్న వర్గమంతటినీ బస్సులోకి రానీయకుండా అడ్డుకున్నారు. ఈ సందర్భంగా పెద్ద తోపు లాటే జరిగింది. ఈ సందర్భంగా తన పోటీదారులను నిమ్మక జయకృష్ణ అడ్డు కుని విజయం సాధించారు. పాతపట్నంలో కూడా అదే ట్రీట్మెంట్ ఇవ్వాలని కలమట వెంకటరమణ ముందుగానే సంకేతాలు పంపించినట్టు తెలిసింది. అందులో భాగంగానే యాత్రకు ముందు రోజు అప్పటికే దారి పొడవునా ఉన్న మామిడి గోవిందరావు ఫ్లెక్సీలు, కటౌట్లను తొలగించారు. ఆ మధ్య జరిగిన పార్టీ మినీ మహానాడులో ఎలాగైతే వేదికపైకి రానీవ్వకుండా మామిడి గోవిందరావును అడ్డుకున్నారో అదే రకంగా బస్సు యాత్రలో కూడా చేద్దామ ని కలమట భావించినట్టుగా మామిడి వర్గానికి తెలిసింది. అసలే ఆహ్వానం లేని కార్యక్రమం, ఆపై పిల వని పేరంటానికి వెళ్తే కలమట హడావుడి చేస్తారు. వెళ్లి అవమాన పడటం, మాటామాటా పెరిగి తన్నుకోవడం కంటే వెళ్లకపోవడమే మంచిదని మామిడి గోవిందరావు వర్గమంతా బస్సు యాత్రకు గైర్హాజరై నిరసన తెలిపింది. దీంతో వ్యయప్రయాసలతో సమకూర్చిన మనుషులతో కలమట తమ బస్సు యాత్రను ముందుకు తీసుకెళ్లారు. బస్సు యాత్రలో ప్రజల కష్టాలు మెళియాపుట్టి: మండలంలోని చాపర గ్రామంలో టీడీపీ బస్సు యాత్రను నిర్వహించారు. పలాస వెళ్లే ముఖ్య రహదారిలో సభ నిర్వహించడంతో జనం ఇబ్బంది పడ్డారు. అచ్చెన్న మాట్లాడుతున్న సమయంలో ఒక అంబులెన్స్ అరగంట పాటు నిలిచిపోయింది. ఎంపీ రామ్మోహన్నాయుడు కలమటను ఎమ్మెల్యే అభ్యర్థిగా చెప్పారు. దీంతో మామిడి వర్గంలో నిరాశ మొదలైంది. -
టీడీపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షుడిగా యువనేత!
సాక్షి, అమరావతి: తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడిగా శ్రీకాకుళం ఎంపీ కింజరపు రామ్మోహన్నాయుడిని నియమించనున్నారు. కొద్దిరోజుల్లో ఈ నియామకాన్ని అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. ప్రస్తుతం రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా కిమిడి కళా వెంకట్రావు కొనసాగుతున్నారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల నుంచి పోటీ చేసిన ఆయన ఓటమి పాలయ్యారు. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు ఆయన కుమారుడు నారా లోకేష్ అన్నీ తామై వ్యవహరించడంతో రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న వెంకట్రావు ప్రేక్షక పాత్ర పోషించాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో బీసీ వర్గానికి చెందిన రామ్మోహన్నాయుడిని అధ్యక్షుడిగా నియమిస్తే బాగుంటుందని చంద్రబాబు భావిస్తున్నారు. కాగా, ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో శ్రీకాకుళం నియోజకవర్గం నుంచి రామ్మోహన్నాయుడు 6,653 ఓట్ల మెజారిటీతో గెలిచిన సంగతి తెలిసిందే. టీడీపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా ఎల్ రమణ కొనసాగుతున్నారు. -
కేంద్ర మంత్రి దృష్టికి బీఎస్ఎన్ఎల్ సమస్యలు
శ్రీకాకుళం: శ్రీకాకుళం ఎంపీ కింజరాపు రామ్మోహన్నాయుడు మంగళవారం దేశ రాజధానిలో కేంద్ర ప్రచారశాఖ సహాయ మంత్రి మనోజ్‌సిన్హాను కలుసుకున్నారు. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు. జిల్లాలో బీఎస్ఎన్ఎల్ నెట్వర్క్ వీక్‌గా ఉందని, దాన్ని మెరుగుపరచేందుకు పరిచేందుకు చర్య తీసుకోవాలని కోరారు. జిల్లాలో సుమారు 24 ప్రాంతాల్లో సెల్‌ఫోన్ టవర్లు అవసరం ఉందని వివరించారు. వాటిని కచ్చితంగా ఏర్పాటు చేయాలని విన్నవించారు. అలాగే బీఎస్ఎన్ఎల్ శాఖా పరమైన నిర్ణయాలతో శ్రీకాకుళం జిల్లాలోని బీఎస్ఎన్ఎల్ ఆఫీస్‌ను విజయనగరం జిల్లాలోని కార్యాలయంలో విలీనం చేసేందుకు నిర్ణయించినట్టు తెలియవచ్చిందని, ఇలా జరిగితే శ్రీకాకుళం జిల్లాపరంగా చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయని, దీనిని విరమించుకోవాలని విన్నవించారు. ప్రస్తుతం జిల్లా వాణిజ్యపరంగా చాలా వేగంగా విస్తరిస్తుందని, కావున జిల్లా అభివృద్ధికి 4జీ నెట్వర్క్ చాలా అవసరమని, సాధ్యమైనంత త్వరగా అందుబాటులోకి తేవాలని, సిబ్బంది కొరతను పరిష్కరించాలని కోరారు. -
శత్రుచర్లకు చెక్ !
ఎంపీ పర్యటనకు దూరంగా విజయరామరాజు ఆహ్వానం లేదా? హాజరు కాలేదా? ఎల్.ఎన్.పేట: మాజీ మంత్రి, పాతపట్నం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్చార్జి శత్రుచర్ల విజయరామరాజు పెత్తనానికి ఆ పార్టీ నాయకత్వం చెక్ పెట్టేసినట్లు ప్రచారం జరుగుతోంది. తాజాగా చోటుచేసుకున్న పరిస్థితులు దీనికి బలాన్ని ఇస్తున్నాయి. శ్రీకాకుళం ఎంపీ కింజరాపు రామ్మోహననాయుడు పాతపట్నం నియోజకవర్గంలోని ఎల్.ఎన్.పేట, హిరమండలం, కొత్తూరు మండలాల్లో శనివారం పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. అనంతరం బహిరంగ సభలు నిర్వహించారు. ఈ కార్యక్రమాల్లో ఆయనతో పాటు స్థానిక ఎమ్మెల్యే కలమట వెంకటరమణ పాల్గొన్నప్పటికీ.. నియోజకవర్గ ఇన్చార్జి అయిన శత్రుచర్ల మాత్రం రాలేదు. ఇతన్ని ఆహ్వానించలేదా? లేక కావాలనే రాలేదా అని స్థానికులు చర్చించుకున్నారు. 2014 సాధారణ ఎన్నికల ముందు కింజరాపు కుటుంబీకులే శత్రుచర్లను టీడీపీలోకి తీసుకురావడంతో పాటు ఎమ్మెల్యే టికెట్ కూడా ఇప్పించారని, ఇప్పుడేమో అతనికి చెక్ పెట్టేస్తున్నారని తెలుగు తమ్ముళ్లు గుసగుసలాడుకుంటున్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డితో ఎంతో సన్నిహితుడుగా ఉండడంతోపాటు, తన రాజకీయ చరిత్రలో ఎలాంటి మచ్చలేకుండా, మకుటంలేని మహా‘రాజు’గా వెలిగిన శత్రుచర్లకు పాతపట్నం నియోజకవర్గంలో ఇలాంటి పరిస్థితులు ఎదురు కావడంతో ఆయన అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ఇతన్ని ఎందుకు పట్టించుకోవడం లేదో జిల్లా మంత్రి అచ్చెన్నాయుడు దగ్గర తేల్చుకోవడానికి కొత్తూరు, పాతపట్నం మండలాలకు చెందిన పలువురు నాయకులు సిద్ధపడుతున్నట్లు ప్రచారం జరుగుతుంది. -
చదువుతోనే విజ్ఞానం
గ్రంథాలయ వారోత్సవాల ప్రారంభ సభలో ఎంపీ రామ్మోహన్నాయుడు శ్రీకాకుళం కల్చరల్ : చదువుతోనే విజ్ఞానం సాధ్యమని శ్రీకాకుళం ఎంపీ కింజరాపు రామ్మోహన్నాయుడు అన్నారు. గ్రంథాలయూలు అందుకు ఎంతో దోహదం చేస్తాయన్నారు. 47వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలను జిల్లా కేంద్ర గ్రంథాలయంలో శుక్రవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో మాట్లాడుతూ గ్రంథాలయాలు ఆకర్షణీయమైన విజ్ఞాన కేంద్రాలుగా రూపొందాలన్నారు. విద్య ఔన్నత్యాన్ని చాటి చెప్పేందుకు, నిరక్షరాస్యత నిర్మూలనకు గ్రంథాలయాలను నెలకొల్పడం జరిగిందన్నారు. పోటీ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు అనుగుణంగా వీటిని తీర్చిదిద్దాల్సి ఉందన్నారు. ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి మాట్లాడుతూ గ్రంథాలయ అభివృద్ధికి తనవంతు సహకరిస్తానన్నారు. జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి జె.కోటేశ్వరరావు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఇంటాక్ ఆధ్వర్యంలో రూపొందిన ‘హిస్టర్ అండ్ కల్చర్ ఆఫ్ కళింగ ఆంధ్రా’ పుస్తకాన్ని ఎంపీ రామమ్మోహన్‌నాయుడు ఆవిష్కరించారు. శ్రీకాకుళం ఎస్టోన్ ఆన్ స్టోరీ పుస్తకాన్ని విద్యార్థులకు పరిచయం చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులకు డ్రాయింగ్ పోటీలు నిర్వహించారు. కార్యక్రమంలో రీడర్స్ ఫోరం అధ్యక్షుడు డాక్టర్ ఇ.యస్.సంపత్‌కుమార్, టీడీపీ నాయకులు బోయిన గోవిందరాజులు, కేవీజే రాధాప్రసాద్, ఇప్పిలి గోవిందరావు పాల్గొన్నారు. -
ఎర్రన్నాయుడి కుమారుడికి కేంద్ర మంత్రి పదవి?
న్యూఢిల్లీ: కేంద్రమంత్రివర్గ విస్తరణ, పునర్వ్యస్థీకరణలో కొత్త ముఖాలకు స్థానం దక్కనుంది. ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలు టీడీపీ, శివసేన పార్టీలకు కూడా విస్తరణలో చోటు కల్పించనున్నారని ప్రచారం జరుగుతోంది. టీడీపీ నుంచి దివంగత నేత ఎర్రన్నాయుడు కుమారుడు, శ్రీకాకుళం ఎంపీ కింజరపు రామ్మోహన నాయుడు పేరు పైకి వచ్చింది. ఇప్పటివరకు సుజనా చౌదరి ఒక్కరి పేరే వినబడింది. వీరిద్దరిలో ఒకరికి పదవి ఖాయమని ఢిల్లీ వర్గాల సమాచారం. శివసేన పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యుడు అనిల్ దేశాయ్ కూడా పదవి దక్కనుందని వార్తలు వస్తున్నాయి. మహారాష్ట్రలో బీజేపీ, శివసేన మధ్య పొత్తు కుదిరికపై ఆయన పదవి ఆధారపడివుంది. పంజాబ్ లోని హోషియపూర్ నుంచి బీజేపీ తరపున తొలిసారి ఎన్నికైన విజయ్ సంప్లాకు కేబినెట్ బెర్త్ ఖాయమంటున్నారు.