పెమ్మసాని, వేమిరెడ్డిలకు సహాయ మంత్రి పదవులు
జనసేన–బీజేపీ ఎంపీల్లో ఒకరికి కూడా..!
సాక్షి, అమరావతి: శ్రీకాకుళం ఎంపీ కింజరపు రామ్మోహన్నాయుడుకి కేంద్ర మంత్రివర్గంలో చోటు దక్కినట్లు తెలిసింది. ప్రధాని మోదీ మంత్రివర్గంలో ఆయనను కేబినెట్ హోదాలో తీసుకోనున్నట్లు సమాచారం. ఎన్డీయే మంత్రివర్గంలో టీడీపీకి మూడు కేంద్ర మంత్రి పదవులు ఇవ్వడానికి బీజేపీ అంగీకరించినట్లు ప్రచారం జరుగుతోంది.
వాటిలో ఒకటి కేబినెట్ మంత్రి హోదాతో కాగా మరో రెండు సహాయ మంత్రి పదవులను ఇస్తామని చెప్పగా అందుకు చంద్రబాబు అంగీకరించినట్లు టీడీపీ వర్గాలు తెలిపాయి. కేబినెట్ హోదా మంత్రి పదవికి రామ్మోహన్ నాయుడు పేరును చంద్రబాబు ఖరారు చేసినట్లు చెబుతున్నారు.
అలాగే, సహాయ మంత్రి పదవులకు గుంటూరు, నెల్లూరు ఎంపీలు పెమ్మసాని చంద్రశేఖర్, వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డిల పేర్లను ఆయన ఖరారు చేసినట్లు సమాచారం. ప్రధానమంత్రితో పాటు వీరు ముగ్గురూ ఆదివారం మంత్రులుగా ప్రమాణం చేస్తారని టీడీపీ నేతలు చెబుతున్నారు. చంద్రబాబు కుటుంబానికి అత్యంత సన్నిహితుడుగా, మూడుసార్లు ఎంపీగా గెలిచిన రామ్మోహన్నాయుడుకి ఈసారి కేంద్రమంత్రి పదవి ఖాయమని ముందు నుంచి ప్రచారం జరుగుతోంది.
జనసేన–బీజేపీకి ఒకటి..
జనసేన, బీజేపీల నుంచి కూడా ఒకరికి కేంద్ర సహాయ మంత్రి పదవి దక్కే అవకాశమున్నట్లు తెలుస్తోంది. జనసేనకు మంత్రి పదవి ఇస్తే మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరికి అవకాశం ఉండవచ్చని చెబుతున్నారు. అలాగే, బీజేపీ తరఫున అయితే సీఎం రమేష్ లేదా పురందేశ్వరిలో ఒకరికి ఛాన్స్ ఉండవచ్చని చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment