సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం : టీడీపీ బస్సు యాత్రకు మొదటి రోజే గ్రూపు రాజకీయాలు స్వాగతం పలికాయి. పాతపట్నంలో మాజీ ఎమ్మెల్యే కలమట వెంకటరమణ తీరుకు నిరసనగా మామిడి గోవిందరావు వర్గమంతా యాత్రకు దూరంగా ఉండిపోయింది. పిలవని పేరంటానికి వెళ్లి తన్నుకోవడం తప్ప మరో ప్రయోజనం ఉండదని మామిడి వర్గీయులంతా తమ ఇళ్లకే పరిమితమమయ్యారు. దీంతో వచ్చిన కొద్ది మందితోనే యాత్రను మమ అనిపించేశారు.
రెండుగా చీలిపోయి..
పాతపట్నం టీడీపీలో విభేదాలు అందరికీ తెలిసిందే. గత ఎన్నికల్లో గెలిపించుకున్న ప్రజల్ని మోసగించి, టీడీపీ ఇచ్చిన ప్యాకేజీ తీసుకుని, పార్టీ ఫిరాయించిన కలమట వెంకటరమణ వర్గం ఒకటైతే, కొత్త నాయకత్వం వహిస్తున్న మామిడి గోవిందరావు వర్గం మరొకటి. వీరిద్దరి గ్రూపు రాజకీయాలతో అక్కడి టీడీపీ కేడర్ రెండుగా చీలిపోయింది. కలమట వెంకటరమణను ఎంపీ కింజరాపు రామ్మోహన్‌నాయుడు, ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు ప్రోత్సహిస్తుండగా, మామిడి గోవిందరావును కళా వెంకటరావు ద్వారా నేరుగా నారా లోకేష్ నడిపిస్తున్నారు. గతంలో కింజరాపు అచ్చెన్నాయుడు అనుసరించిన తీరు సంచలనం కూడా అయింది.
మామిడి గోవిందరావు బాగా ఖర్చు పెడతారని, పార్టీకి కూడా ఎప్పటికప్పుడు ఫండింగ్ ఇస్తున్నాడని, వాడిని వాడుకుని నిన్ను బలపరుస్తామని నిమ్మాడలో బాహాటంగానే కలమట వెంకటరమణ వద్ద కింజరాపు అచ్చెన్నాయుడు చెప్పుకొచ్చిన విషయం తెలిసిందే. వాడుకుని వదిలేయడమే తప్ప టిక్కెట్ ఇచ్చే ప్రసక్తే లేదని తెగేసి చెప్పేశారు. అప్పుడే విషయం తెలుసుకున్న మామిడి గోవిందరావు నేరుగా లోకేష్‌ను నమ్ముకుని రాజకీయాలు చేస్తున్నారు. కింజరాపు ఫ్యామిలీ ఆడుతున్న డబుల్ గేమ్‌ను తన అనుయాయుల వద్ద పంచుకున్నారు. రానున్న ఎన్నికల్లో ఎంపీగా పోటీచేయనున్న రామ్మోహన్ నాయుడుకు తన సత్తా ఏంటో చూపిస్తానని కేడర్ వద్ద చెప్పినట్లు సమాచారం.
ముందస్తు సమాచారంతోనే..
తాజాగా టీడీపీ బస్సు యాత్ర శనివారం ఆ నియోజకవర్గంలో ప్రారంభమైంది. నియోజకవర్గంలో ప్రవేశించిన బస్సు యాత్రకు రెండు గ్రూపులు వచ్చి స్వా గతం పలుకుతాయని జిల్లా టీడీపీ శ్రేణులు భావించాయి. కానీ మామిడి గోవిందరావు వర్గానికి ముందుగా ఆహ్వానం రాలేదు. మాజీ ఎమ్మెల్యే కలమట వెంకటరమణ అంతా తానై వ్యవహరించారు. ఈ నేపథ్యంలో యాత్రలో పాల్గొని అవమానం పాలవ్వడం కంటే వెళ్లకపోవడమే మంచిదని బాయ్‌కాట్ చేశారు. పార్వతీపురం మన్యం జిల్లాలో టీడీపీ బస్సు యాత్ర చేసినప్పుడు అక్కడ నియోజకవర్గ ఇన్‌చార్జి నిమ్మక జయకృష్ణ తనకు ప్రత్యర్థిగా ఉన్న వర్గమంతటినీ బస్సులోకి రానీయకుండా అడ్డుకున్నారు.
ఈ సందర్భంగా పెద్ద తోపు లాటే జరిగింది. ఈ సందర్భంగా తన పోటీదారులను నిమ్మక జయకృష్ణ అడ్డు కుని విజయం సాధించారు. పాతపట్నంలో కూడా అదే ట్రీట్‌మెంట్ ఇవ్వాలని కలమట వెంకటరమణ ముందుగానే సంకేతాలు పంపించినట్టు తెలిసింది. అందులో భాగంగానే యాత్రకు ముందు రోజు అప్పటికే దారి పొడవునా ఉన్న మామిడి గోవిందరావు ఫ్లెక్సీలు, కటౌట్‌లను తొలగించారు. ఆ మధ్య జరిగిన పార్టీ మినీ మహానాడులో ఎలాగైతే వేదికపైకి రానీవ్వకుండా మామిడి గోవిందరావును అడ్డుకున్నారో అదే రకంగా బస్సు యాత్రలో కూడా చేద్దామ ని కలమట భావించినట్టుగా మామిడి వర్గానికి తెలిసింది.
అసలే ఆహ్వానం లేని కార్యక్రమం, ఆపై పిల వని పేరంటానికి వెళ్తే కలమట హడావుడి చేస్తారు. వెళ్లి అవమాన పడటం, మాటామాటా పెరిగి తన్నుకోవడం కంటే వెళ్లకపోవడమే మంచిదని మామిడి గోవిందరావు వర్గమంతా బస్సు యాత్రకు గైర్హాజరై నిరసన తెలిపింది. దీంతో వ్యయప్రయాసలతో సమకూర్చిన మనుషులతో కలమట తమ బస్సు యాత్రను ముందుకు తీసుకెళ్లారు.
బస్సు యాత్రలో ప్రజల కష్టాలు
మెళియాపుట్టి: మండలంలోని చాపర గ్రామంలో టీడీపీ బస్సు యాత్రను నిర్వహించారు. పలాస వెళ్లే ముఖ్య రహదారిలో సభ నిర్వహించడంతో జనం ఇబ్బంది పడ్డారు. అచ్చెన్న మాట్లాడుతున్న సమయంలో ఒక అంబులెన్స్ అరగంట పాటు నిలిచిపోయింది. ఎంపీ రామ్మోహన్‌నాయుడు కలమటను ఎమ్మెల్యే అభ్యర్థిగా చెప్పారు. దీంతో మామిడి వర్గంలో నిరాశ మొదలైంది.
Comments
Please login to add a commentAdd a comment