Srikakulam District Latest News
-
కిక్కిరిసిన ఆర్టీసీ కాంప్లెక్స్
శ్రీకాకుళం అర్బన్: జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ కాంప్లెక్స్ కిక్కిరిసింది. సంక్రాంతి పండగ ముగించుకుని స్వస్థలాలకు, గమ్యస్థానాలకు చేరుకునే క్రమంలో ప్రయాణికులతో కాంప్లెక్స్ కిటకిటలాడింది. వీరితో పాటు విద్యార్థులు పాఠశాలలు, కళాశాలలు, వసతి కేంద్రాలకు చేరుకునేందుకు లగేజీతో చేరుకోవడంతో సందడి వాతావరణం నెలకొంది. టికెట్లు సకాలంలో దొరక్క ఆపసోపాలు పడ్డారు. ప్రయాణికులకు సరిపడా బస్సులను సమకూర్చడంలో భాగంగా పల్లెవెలుగు బస్సులను సైతం నాన్‌స్టాప్ బస్సులుగా బోర్డులు తగిలించి నడిపించేశారు. -
భారీ నగదుతో పట్టుబడిన పేకాటరాయుళ్లు
శ్రీకాకుళం క్రైమ్ : జిల్లాకేంద్రంలోని హయాతినగరంలో పేకాటరాయుళ్లు పట్టుబడ్డారు. జూదమాడుతున్న 12 మంది వ్యాపారులను పోలీసులు పట్టుకున్నారు. వీరి వద్ద నుంచి రూ.11,13,440 నగదు స్వాధీనం చేసుకున్నట్లు ఒకటో పట్టణ సీఐ సీహెచ్ పైడపునాయుడు తెలిపారు. కాగా, ఇటీవలికాలంలో శ్రీకాకుళం రూర ల్, గార, ఆమదాలవలస, ఎచ్చెర్ల పీఎస్‌ల పరిఽ దిలో పేకాట శిబిరాలు జోరుగా నడుస్తున్నాయి. అధికార పార్టీ అండదండలతో అడ్డూఅదుపు లేకుండా శిబిరాలు జరుగుతున్నాయన్న విమర్శ లు వినిపిస్తున్నాయి. ఇప్పుడు అది నగరానికి సైతం పాకింది. ఆదివారం హయాతినగరంలో పట్టుబడిన వ్యాపారులు, దొరకని కొంతమంది ఎప్పటినుంచో నగరంలో సైతం రహస్యంగా పేకాట ఆడుతున్నారని, వీరి వెనుక అధికార పార్టీ నాయకుల ప్రమేయం ఉందన్న ప్రచారం గట్టిగా వినిపిస్తోంది. కొందరు పోలీసు సిబ్బంది సహకారంతో వీరికి ఉందన్న విషయం ఇప్పటికే జిల్లా ఉన్నతాధికారి దృష్టికి వెళ్లడం.. ఇప్పటికే ఇలాంటి కార్యకలాపాల్లో ఆరితేరిన సిబ్బంది పోస్టింగ్‌లను వేరే చోటుకు వేయడం జరుగుతోంది.ఎచ్చెర్ల క్యాంపస్: జాతీయ రహదారికి ఆనుకొని కేశవరావుపేట పంచాయతీ కింతలిమిల్లు సమీపంలో జరుగుతున్న పేకాట శిబిరంపై ఎచ్చెర్ల ఎస్సై వి.సందీప్‌కుమార్ ఆధ్వర్యంలో పోలీసులు ఆదివారం దాడులు నిర్వహించారు. ఏడుగురిని పట్టుకుని 7 సెల్ఫోన్లు, రూ.11000 నగదు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. జి.సిగడాం: మండలంలోని మెట్టవలస రెవెన్యూ పరిధిలో పేకాట శిబిరంపై జి.సిగడాం ఎస్ఐ వై.మధుసూదనరావు ఆధ్వర్యంలో పోలీసులు దాడులు నిర్వహించారు. ఆరుగురిని పట్టుకుని వారి వద్ద నుంచి రూ.5640 స్వాధీనం చేసుకున్నారు. దాడుల్లో ఏఎస్ఐలు పొగిరి శంకరరావు, కొరుకొండ రామకృష్ణ, సిబ్బంది ఉన్నారు. కానరాని యువకుడి ఆచూకీ వజ్రపుకొత్తూరు రూరల్: మండల కేంద్రం వజ్రపుకొత్తూరుకు చెందిన యువకుడు జంగం తరుణ్ (16) శుక్రవారం తోటి స్నేహితులతో కలిసి సముద్ర స్నానానికి దిగి గల్లంతైన విషయం తెలిసిందే. యువకుడి అచూకీ కోసం కుటుంబ సభ్యులు, గ్రామస్తులు, మైరెన్ పోలీసులు తీవ్రంగా గాలిస్తున్న లభ్యం కాలేదు. తరుణ్ గల్లంతై మూడు రోజులు గడుస్తున్నా నేటికి ఆచూకీ లేకపోవడంతో కుటుంబ సభ్యులు విషాదంలో మునిగిపోయారు. తీరంలో గాలింపు చర్యలు ముమ్మరంగా చేపట్టి కుమారుడి ఆచూకీ కనిపెట్టాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు. జంగం తరుణ్(ఫైల్) -
కోర్టు కానిస్టేబుల్ విధులు కీలకం
శ్రీకాకుళం క్రైమ్: ప్రతి పోలీస్‌స్టేషన్‌లో కోర్టు విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ విధులు చాలా కీలకమని ఎస్పీ కె.వి.మహేశ్వరరెడ్డి అన్నారు. కోర్టులు, న్యాయస్థానాల మధ్య అనుసంధానంగా వ్యవహరించి నేరుస్తుల శిక్షల శాతం పెంచేలా శ్రమించడం కోర్టు కానిస్టేబుల్‌కే సాధ్యమని పేర్కొన్నారు. ఆదివారం జిల్లా పోలీసు కార్యాలయంలో పోలీస్ స్టేషన్ల కోర్టు సిబ్బంది, కోర్టు లైజన్ సిబ్బందితో కేసుల విచారణ విధానం, వివిధ దశల్లో ఎదురవుతున్న సమస్యలు, సమన్లు, వారెంట్లు అమలు, సాక్షులను కోర్టులో హాజరుపర్చడం, కేసు అభియోగపత్రాల దాఖలు, ఇతరత్రా విధివిధానాలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేసు నమోదు నుంచి తుది తీర్పు వరకు ప్రతి అంశాన్ని పూర్తి వివరాలతో సీసీటీఎన్ఎస్ అప్లికేషన్లో అప్లోడ్ చేయాలని సూచించారు. ప్రాసెస్‌ని ప్రతీరోజూ కేసు డైరీ రూపంలో జత చేయాలని, పబ్లిక్ ప్రాసిక్యూటర్ల సలహాలు, సూచనలు పాటించాలని చెప్పారు. సమావేశంలో డీసీఆర్బీ సీఐ శ్రీనివాస్, ఎస్ఐ కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. -
యువకుడు ఆత్మహత్య
నందిగాం: మండలంలోని పెద్దతామరాపల్లికు చెందిన గోరు ఖగేశ్వరరావు(22) ఆదివారం సాయంత్రం ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. నందిగాం పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పెద్దతామరాపల్లికి చెందిన చేనేత కార్మికుడు గోరు వెంకటరమణ, కుమారి దంపతులకు కుమారుడు ఖగేశ్వరరావు, కుమార్తె ఉన్నారు. ఖగేశ్వరరావు డిగ్రీ వరకు చదివాడు. మూర్ఛ వ్యాధితో బాధపడుతున్నాడు. డిగ్రీ చదివినా ఏ పనీ చేయలేకపోతున్నానని ఆవేదన చెందేవాడు. ఈ క్రమంలో ఆదివారం తండ్రి పని కోసం బయటకు వెళ్లగా.. తల్లి కన్నవారింటికి కంట్రగడ వెళ్లింది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఖగేశ్వరరావు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. వీధిలో అటుగా వెళ్తున్నవారు గమనించి కుటుంబసభ్యులకు, పోలీసులకు సమాచారం అందించారు. తండ్రి వెంకటరమణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు నందిగాం హెచ్‌సీ జీవీ రమణ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బైక్ ఢీకొని బాలుడికి గాయాలు రణస్థలం: మండల కేంద్రం రణస్థలంలో ఆరేళ్ల బాలుడు జిడ్డు కుమార్‌నాయుడు ఆడుతుండగా రోడ్డుపైకి రావడంతో ద్విచక్రవాహనంపై వస్తున్న ఇద్దరు వ్యక్తులు అదుపు తప్పి ఢీకొట్టారు. ఈ ఘటనలో బాలుడికి తీవ్ర గాయాలు కావడంతో శ్రీకాకుళంలోని ఓ ప్రయివేటు ఆస్పత్రిలో చేర్పించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు జె.ఆర్.పురం ఎస్సై ఎస్.చిరంజీవి తెలిపారు. -
వేమన శతకాలు ఆచరణీయం
శ్రీకాకుళం (పీఎన్‌కాలనీ): ప్రజాకవి యోగి వేమన అని, ఆయన శతకాలు ఆచరణీయమని రెడ్డిక సంక్షేమ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి దుక్క రాజశేఖరరెడ్డి అన్నారు. వేమన జయంతి సందర్భంగా ఆదివారం శ్రీకాకుళంలోని రెడ్డిక సంక్షేమ సంఘ కార్యాలయంలో వేమన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజాకవిగా, సంఘ సంస్కర్తగా ‘విశ్వదాభిరామ వినురవేమ’ అనే మకుటంతో పద్యాలు రాసిన మహనీయుడు వేమన అని పేర్కొన్నారు. వేమన పద్యం తెలియని తెలుగు విద్యార్థి లేనడంలో అతిశయోక్తి లేదన్నారు. కప్పు మాధవరెడ్డి మాట్లాడుతూ జీవనసారాన్ని తత్వాలుగా బోధించిన వేమన ఆరాధ్య కవిగానే కాదు ఆరాధ్య దైవంగానూ గుర్తించవచ్చన్నారు. కార్యక్రమంలో అలపాన త్రినాథరెడ్డి, విశ్రాంత ఉపాధ్యాయులు నీలపు రామబాబురెడ్డి, ప్రొఫెసర్ దూడ విష్ణుమూర్తి రెడ్డి, బాకి వేణుగోపాలరెడ్డి, సూర్యరెడ్డి, పడపాన సుగుణారెడ్డి, రత్నకుమారి పాల్గొన్నారు. -
మృత్యువులోనూ వీడని స్నేహబంధం
ఇచ్ఛాపురం: అతివేగం ఇద్దరు ప్రాణస్నేహితులను ప్రాణాలను బలిగొంది. ఇచ్ఛాపురం పట్టణంలోని సంతపేట వద్ద ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు దుర్మరణం చెందగా.. మరో ముగ్గురు గాయపడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఒడిశా రాష్ట్రం గంజాం జిల్లా పాత్రపూర్ బ్లాక్ బొరివాడా గ్రామానికి చెందిన కాసులదేవి కార్తీక్(23), బొనసోలా గ్రామానికి చెందిన ఇసురు వినోద్(22) స్నేహితులు. కార్తీక్ హైదరాబాద్‌లో వెల్డర్‌గా, వినోద్ స్వగ్రామంలోనే మెకానిక్‌గా పని చేస్తున్నారు. సంక్రాంతి పండగ కోసం సొంతూరికి వచ్చిన కార్తీక్ ఒడిశాలో కొత్త బైక్‌ని కొనుగోలు చేశాడు. నంబర్‌ప్లేట్ కోసం ఆదివారం స్నేహితుడు వినోద్‌తో కలిసి బరంపురం వెళ్లాడు. అక్కడ పనులు ముగించుకొని తిరిగి ఇంటికి వస్తుండగా ఇచ్ఛాపురం పట్టణంలో సంతపేట వద్దకు చేరేసరికి అతివేగంతో బైక్‌ని నడపడంతో అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టారు. అవతలవైపు రోడ్డులోకి సైతం దూసుకుపోయి మరో ద్విచక్రవాహనంపై వస్తున్న సోంపేట మండలం మాకన్నపురం గ్రామానికి చెందిన చిత్రాడ రమేష్, సిద్దార్ధ, పలాస మండలం తాలబద్రకు హనుమంత్ కార్తీక్‌లను ఢీకొట్టారు. ఈ ఘటనలో ఒడిశాకు చెందిన ఇద్దరు స్నేహితులు అక్కడికక్కడే మృతిచెందగా రమేష్, హనుమంతు కార్తీక్‌లకు తీవ్ర గాయాలయ్యాయి. సిద్దార్థకు స్వల్ప గాయాలయ్యాయి. స్థానికులు స్పందించి క్షతగాత్రులను 108 అంబులెన్సులో ప్రభుత్వ సామాజికి ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పట్టణ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. హెచ్‌సీ అప్పారావు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను స్థానిక ప్రభుత్వ సామాజికి ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న మృతులు కుటుంబ సభ్యులు, బంధువులు ఆసుపత్రి వద్దకు చేరుకొని బోరున విలపించారు. రోడ్డు ప్రమాదంలో ఇద్దరు ఒడిశా యువకులు మృతి మరో ముగ్గురికి గాయాలు అతివేగమే ప్రమాదానికి కారణం -
ఉంటాయో.. ఊడుతాయో!
● నేటి నుంచే ధ్రువపత్రాల పరిశీలన ● ప్రత్యేక వైద్య బృందాలు సిద్ధం ● ఇంటింటి వెళ్లి క్షుణ్ణంగా పరిశీలన ● ఐదు నెలల పాటు కొనసాగనున్న ప్రక్రియ ● ఆస్పత్రిలో సేవలకు అంతరాయం! శ్రీకాకుళం: జిల్లాలో భరోసా పింఛన్లు పొందుతున్న దివ్యాంగుల సంఖ్యను తగ్గించేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. దివ్యాంగుల పింఛన్లు రూ.3వేలు నుంచి రూ.6వేలకు పెంచిన కూటమి ప్రభుత్వం ఆ భారం తగ్గించుకునే ప్రయత్నం చేపట్టింది. పింఛన్లు పొందుతున్న దివ్యాంగుల అంగవైకల్య ధ్రువీకరణ పత్రాలను పునఃపరిశీలించాలని వైద్యులకు మౌఖిక ఆదేశాలు జారీ చేసింది. జోన్–2 పరిధిలోని శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాల్లో సోమవారం నుంచి వైద్య బృందాలు మండల స్థాయిలో పర్యటించి ధ్రువపత్రాలను పునఃపరిశీలన చేయనున్నారు. యాప్‌లో నమోదు.. గతంలో సదరం ప్రక్రియను పక్కాగా నిర్వహించి ధ్రువపత్రాలు జారీ చేసినప్పటికీ కూటమి ప్రభుత్వం దానిని కాదని అనర్హుల పేరిట ఏరివేతకే కొత్త ప్రయత్నాలను ప్రారంభించిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇందుకోసం ఓ యాప్‌ను సైతం రూపొందించింది. డాక్టర్లు పునఃపరిశీలన చేసిన తర్వాత ప్రత్యేక యాప్‌లో ప్రభుత్వం అడిగిన వివరాలను నమోదు చేయాల్సి ఉంటుంది. ఈ యాప్‌లో వివరాలను నమోదు చేస్తే ఇప్పటికే ఉన్న దివ్యాంగ పింఛన్ లబ్ధిదారుల్లో 40 నుంచి 50 శాతం వరకు అనర్హులు అవుతారని వైద్యులే చెబుతుండటం గమనార్హం. మూడు జిల్లాల్లో 12 బృందాలను ఏర్పాటు చేయగా ఆయా వైద్యులు ప్రక్రియను పూర్తి చేసేందుకు సుమారు ఐదు నెలలు పడుతుందని సమాచారం. శ్రీకాకుళం జిల్లాలో సుమారు 31584 మంది దివ్యాంగ లబ్ధిదారులు పింఛన్లు పొందుతుండగా వీరిలో 8వేల మంది మంచానికే పరిమితమైన వారు ఉన్నారు. మొదటి విడతలో మంచానికే పరిమితమైన వారి వివరాలను సేకరిస్తారు. తర్వాత మిగిలిన వారి దివ్యాంగత్వాన్ని గుర్తించే ప్రక్రియ చేపట్టనున్నారు. -
ఘనంగా త్యాగరాజస్వామి ఆరాధనోత్సవం
శ్రీకాకళమ కల్చరల్ : తరిణీ కృష్ణ స్మారక ధార్మిక సేవా ట్రస్టు ఆధ్వర్యంలో శాంతాకల్యాణ్ అనురాగ నిలయంలో సద్గురు త్యాగరాజస్వామి 178వ ఆరాధనోత్సవం ఆదివారం వైభవంగా నిర్వహించారు. శృతిలయ సంగీత శిక్షణాలయం విద్యార్థులతో ఘన రాగ పంచరత్న కీర్తనలైన జగదానంద కారక (నాట రాగం), దుడుకుగల నన్నే దొర (గౌళ రాగం), సాధించెనే (ఆరభి రాగం), కనకన రుచిరా (వరాళీ రాగం), ఎందరో మహానుభావులు (శ్రీరాగం) చక్కగా గానం చేశారు. ముందుగా సి.వి.నాగజ్యోతి చారిటబుల్ ట్రస్టు అధినేత సి.వి.ఎన్.మూర్తి దంపతులు, వరసిద్ధి వినాయక పంచాయతన దేవస్థానం వ్యవస్థాపకులు జగన్మోహనరావు, రమాదేవి దంపతులు తిరువీధి ప్రారంభించారు. అనురాగనిలయం చిన్నారులు త్యాగయ్య వేషధారణలో తిరువీధి నిర్వహించారు. కార్యక్రమంలో వాయులీనంపై దూసి రమేష్, బ్రహ్మాజీ, మృదంగంపై మండ శ్రీనివాసరావులు వాద్య సహకారం అందించారు. కార్య క్రమంలో రెడ్డి సత్యనారాయణ, నిక్కు అప్పన్న, కనుగుల దుర్గా శ్రీనివాస్, ఎం.వి.కామేశ్వరరావు, బండారు రమణమూర్తి, తదితరులు పాల్గొన్నారు. -
జీవన్‌రావుకు ప్రతిష్టాత్మక అవార్డు
మెళియాపుట్టి: మండలంలోని మర్రిపాడు సి పంచాయతీ పరిధిలోని బంజీరు గ్రామానికి చెందిన ఇంజినీర్ హనుమంతు జీవన్‌రావుకు అరుదైన గౌరవం దక్కింది. ఆదివారం జార్ఖండ్ రాష్ట్రం రాంచీలో జరుగుతున్న బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ 37వ జాతీయ కన్జెవేషన్ ఆఫ్ ఏరోస్పేస్ ఇంజినీరింగ్ సదస్సులో జీవన్‌రావును యువ ఇంజనీర్ అవార్డుతో సత్కరించారు. జీవన్‌రావు ఇక్కడే ఏరోస్పేస్ సైంటిస్ట్‌గా విధులు నిర్వహిస్తున్నారు. రైతు కుటుంబానికి చెందిన యువకుడికి అవార్డు దక్కడం పట్ల గ్రామస్తులు, తల్లిదండ్రులు హనుమంతు సాంబయ్య, సంజీవమ్మ సంతోషం వ్యక్తం చేశారు. బుడుమూరులో మురుగునీటిపై ఆరా ఎచ్చెర్ల: లావేరు మండలం బుడుమూరులో పారిశుద్ధ్య పనులు నిర్వహించాలని డీఎల్పీవో ఇప్పిలి వెంకటరమణ సిబ్బందిని ఆదేశించారు. మురుగునీరు పేరుకుపోవడంతో ఇబ్బందులు పడుతున్నామంటూ బీసీ కాలనీవాసులు శనివారం కాలువలో దిగి ధర్నా చేసిన విషయం తెలిసిందే. దీనిపై స్పందించిన అధికారులు ఆదివారం గ్రామానికి వెళ్లి పారిశుద్ధ్య పరిస్థితిపై ఆరా తీశారు. ఈ సందర్భంగా డీఎల్పీవో మాట్లాడుతూ ఇక్కడ కాలువనీరు బయటకు పోయేందుకు ఇబ్బందులు ఉంటే వెంటనే పరిష్కరించాలన్నారు. మురుగునీరు లేకుండా పారిశుద్ధ్య పనులు కొనసాగించాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి అప్పలనాయుడు, స్థానిక నాయకులు చిట్టిబాబు తదితరులు పాల్గొన్నారు. జీడిపిక్కలకు గిట్టుబాటు ధర కల్పించాలి పలాస: ఉద్దానం ప్రాంత జీడి రైతులకు ఇచ్చిన ఎన్నికల హామీని పూర్తిస్థాయిలో అమలు చేయాలని జీడి రైతాంగ పోరాట ప్రతినిధులు డిమాండ్ చేశారు. బైపల్లి గ్రామంలో కోనేరు కామేశ్వరరావు అధ్యక్షతన ఆదివారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జీడి మద్దతు ధర విషయంలో ఈ ప్రాంత ప్రజాప్రతినిధులు తక్షణమే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి కార్యరూపం దాల్చేలా చొరవ తీసుకోవాలని కోరారు. వ్యవసాయ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడుతో జీడి పిక్కల గిట్టుబాటు ధర విషయంలో చర్చలు జరపడానికి స్థానిక ఎమ్మెల్యే గౌతు శిరీషా తగిన చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో జీడి రైతు సంఘం కన్వీనర్ తెప్పల అజయ్‌కుమార్, కోనేరు రమేష్, బత్తిన లక్ష్మీనారాయణ, అంబటి రామకృష్ణ, కొర్ల హేమారావు చౌదరి, వాసుపల్లి సాంబమూర్తి, జోగి అప్పారావు, తెప్పల చాణుక్య, బొంపెల్లి శివకుమార్, గుల్ల ఈశ్వరరావు, సానా కృష్ణారావు, తామాడ పోలయ్య తదితరులు పాల్గొన్నారు. సవరణ జీఓ 117లో లోపాలు సరిదిద్దాలి శ్రీకాకుళం న్యూకాలనీ: జీఓ 117 సవరణలో లోపాలను సరిదిద్ది విద్యావ్యవస్థను కాపాడాలని, ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించాలని ఎస్టీయూ ఉపాధ్యాయ సంఘ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఎస్.వి.రమణమూర్తి, జి.రమణమూర్తి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆదివారం శ్రీకాకుళంలో ఆమదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మోడల్ ప్రైమరీ స్కూల్ పంచాయతీ కేంద్రంగా ఏర్పాటు చేయడం శుభపరిణామమే అయినా సమీప పాఠశాలల నుంచి మూడు, నాలుగు, ఐదు తరగతులను మోడల్ ప్రైమరీ స్కూల్లో కలపకుండా వాటిని పాతపద్ధతిలో ప్రైమరీ స్కూల్‌గానే కొనసాగించాలని కోరారు. మోడల్ ప్రైమరీ స్కూలు పంచాయతీ కేంద్రంగా ఉండాలని, అప్‌గ్రేడ్ కాకుండా మిగిలిన యూపీ స్కూలును యథావిధిగా కొనసాగించాలన్నారు. అన్ని ఉన్నత పాఠశాలలో హెడ్మాస్టర్, పీఈటీ పోస్టులు ఉండాలని, ఎంటీఎస్ ఉపాధ్యాయులకు పదవీ విరమణ వయసు 62 ఏళ్లకు పెంచాలని కోరారు. విద్యాశాఖామంత్రి దృష్టికి సమస్య తీసుకెళ్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చినట్టు వారు పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎస్టీయూ జిల్లా కార్యవర్గ సభ్యులు కె.శ్రీనివాసరావు, జి.శ్రీనివాసరావు, కె.తేజేశ్వరరావు, ఎ.జగన్, ఎం.తేజేశ్వరరావు, డీవీఎన్ పట్నాయక్, జె.శ్యాంసుందర్ తదితరులు పాల్గొన్నారు. -
రూ.లక్ష ఆర్థిక సాయం అందజేత
గార: మండలంలోని బూరవిల్లి గ్రామానికి చెందిన డిక్కల పద్మలోచన, వినీత దంపతుల చిన్న కుమారుడు చేతన్ గుండె వ్యాధితో, పెద్ద కుమారుడు శశాంక్ పేగు సంబంధిత వ్యాధితో బాధపడుతుండటంతో సాయం చేసేందుకు దాతలు ముందుకొచ్చారు. గ్రామస్తులు, యువత, స్నేహితులు సేకరించిన లక్ష రూపాయలను ఆదివారం కుటుంబ సభ్యులకు అందజేశారు. చిన్నారులకు దీర్ఘకాలిక వ్యాధులు సోకడంతో తల్లిదండ్రులు పడుతున్న ఇబ్బందులపై ‘హృదయ వేదన’ పేరిట సాక్షిలో ఈ నెల 11న కథనం ప్రచురితమైంది. సంక్రాంతి సమయాల్లో కూడా విశాఖపట్నం ఆసుపత్రిలో ఉండటంతో ఆదివారం బూరవిల్లి వచ్చిన తల్లి వినీతకు సేకరించిన నగదును అందజేశారు. ఇప్పటివరకు రూ.10 లక్షల మేర ఖర్చు చేయడం, ఇంకా రూ.20 లక్షలు వరకు అవుతుందని వైద్యులు చెబుతుండటంతో ఆందోళన చెందుతున్నారు. బోరవానిపేట సత్యసాయి భజనమండలి సభ్యులు రూ.50వేలు అందజేశారు. కార్యక్రమంలో ఎం.జనార్దన్, జి.ధర్మారావు, మల్ల రామారావు, ఎం.గోపి, మాధవనాయుడు, అయ్యప్పలనాయుడు తదితరులు పాల్గొన్నారు. -
వైద్యసేవలు అంతేనా?
ఆస్పత్రుల్లోని వైద్యులు గ్రామాల్లో పరిశీలనకు వెళ్లడం వల్ల ఈ ప్రక్రియ పూర్తయ్యేంత వరకు హాస్పిటల్స్‌లో వైద్య సేవలు అంతంత మాత్రంగా అందుతాయని రోగులు ఆందోళన చెందుతున్నారు. రిమ్స్ ఆస్పత్రిలో 60 మంది డాక్టర్లు ఉండగా వీరిలో 11 మంది పరిశీలనకు వెళుతున్నారు. దీంతో ఆస్పత్రికి వచ్చే రోగులకు ప్రభుత్వ వైద్యం అందని ద్రాక్షగా మిగిలిపోనుంది. ప్రజారోగ్యాన్ని పక్కన పెట్టి లబ్ధిదారుల ఏరివేత లక్ష్యంగా ప్రభుత్వం భావిస్తోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. మరోవైపు పునఃపరిశీలన ప్రక్రియ పూర్తయ్యే వరకు సదరం ధ్రువపత్రాల జారీ ప్రక్రియ నిలుపుదల చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం ఆన్లైన్ నమోదు ప్రక్రియ సైతం నిలిచిపోయింది. దీంతో సదరం ద్వారా ధ్రువపత్రాలు పొంది పింఛన్ అందుకోవాలని ఆశగా ఎదురు చూస్తున్న ఎంతోమంది దివ్యాంగుల ఆశలపై కూటమి ప్రభుత్వం నీల్లు చల్లింది. కొత్తగా పింఛన్లు పొందే ఆవకాశం లేకుండాపోయింది. మరో వైపు ఏరివేత ప్రక్రియ ప్రారంభం కావటంతో సర్వత్రా ఆందోళన నెలకొంది. -
ఇంటర్ ప్రీ–ఫైనల్
●జిల్లాలో జరిగే ప్రీ పబ్లిక్ పరీక్షలు ఏర్పాట్లు పూర్తిచేశాం. ఐపీఈ–2024 ఇంటర్‌బోర్డు ప్రశ్న పత్రాల సెట్‌ను వినియోగిస్తున్నాం. ఇందుకు సంబంధించి ప్రిన్సిపాళ్లకు తగు మార్గదర్శకాలను జారీ చేయడం జరిగింది. జవాబుపత్రాలను వెంటనే దిద్దుబాటు చేసి మార్కులను బీఐఈఏపీ వెబ్‌పోర్టల్‌లో నమోదుచేయాలి. ఫలితాలపై సమీక్ష జరుగుతుంది. – శివ్వాల తవిటినాయుడు, జిల్లా డీవీఈఓ, ఇంటర్మీడియెట్ విద్య బోర్డు ప్రశ్న పత్రాలను వినియోగిస్తున్నాం -
3.90 లక్షల మెట్రిక్ టన్నులే కొనుగోళ్లు..
● ఆగిపోయిన ధాన్యం కొనుగోళ్లు ● టార్గెట్లు అయిపోయాయంటున్న కొనుగోలు కేంద్రాల సిబ్బంది ● పొలాల్లో, ఇళ్ల లోగిళ్లలో వందలాది బస్తాలు ● లబోదిబోమంటున్న రైతులు పొలాల్లో ఉంచలేకపోతున్నాం.. కోతలు చేసిన వెంటనే నూర్పులు చేయడానికి వీలు కాలేదు. పండగ ముందు నూర్పులు చేశాం. ధాన్యం అమ్మకాలకు కొనుగోలు కేంద్రాలకు వెళ్తే టార్గెట్లు అయిపోయాయని అంటున్నారు. రోజూ వెళ్తున్నాం. అయినా ప్రయోజనం లేదు. నా వద్దే 350 బస్తాలు ఉన్నాయి. ఇంట్లో నిల్వకు సదుపాయాలు లేవు. పొలాల్లో ఉంచుదామంటే రబీ వరికి రైతులు నీరు పెడుతున్నారు. ఈ నీరు సమీప పొలాల్లోనికి రావడంతో పొలాల్లో ఉన్న ధాన్యం తడిచి పోతున్నాయి. నానా అవస్థలు పడుతున్నాం. – డోల గోవిందరావు, బాడాం పది రోజులుగా కొనుగోళ్లు లేవు ధాన్యం కొనుగోలు చేసి పది రోజులు దాటుతోంది. ఇంకెన్నాళ్లు ఓపిక పట్టాలి. టార్గెట్ల పేరుతో రైతులను వేధించడం ఎంత వరకూ న్యాయం. ఇప్పటికే బస్తాకు రూ. 300 తక్కువకు చాలా వరకూ అమ్ముకున్నాం. ఉన్న ధాన్యం మద్దతు ధరకు అమ్ముకొని కొంత లాభ పడుదామంటే ఈ విధంగా టార్గెట్ల నేరుతో కాలక్షేపం చేస్తున్నారు. వెంటనే అధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలి. – కింతలి చలపతిరావు, దాసరివానిపేట నరసన్నపేట: అన్నదాతల అవస్థలు కొనసాగుతూ నే ఉన్నాయి. ఇస్తామన్న సాయం ఇవ్వక ప్రభుత్వం మోసం చేయడంతో అప్పు చేసి మరీ చాలా మంది సాగు ప్రారంభించారు. అనేక కష్టనష్టాలకు ఓర్చి పంట పండించారు. పండిన పంటను అమ్ముకుందామంటే ఇప్పటికీ ఇబ్బంది తప్పడం లేదు. మొదట్లో కొనుగోలు కేంద్రాలు సకాలంలో ప్రారంభం కాక చాలా మంది రైతులు తక్కువ ధరలకు ఇతర జిల్లాల మిల్లర్లకు పంటను విక్రయించారు. కొనుగోలు కేంద్రాలు ప్రారంభించిన తర్వాత కొంత వరకూ ఇబ్బందులు తొలగినా తర్వాత వాతావర ణం అనుకూలించక పోవడంతో సకాలంలో నూర్పులు చేయలేక పోయారు. ఇప్పుడు వాతావరణం అనుకూలంగా ఉంది. ధాన్యంలో తేమ శాతం నిబంధనలకు వీలుగా ఉంది. పొలాల్లో తోవలు ఏర్పడటంతో రైతులు నూర్పులు చేశారు. అయితే ధాన్యం మాత్రం కళ్లాల్లో, రైతుల ఇళ్లల్లో, పొలాల్లోనే ఉండిపోతోంది. ధాన్యం కొనుగోలు చేయాలని రైతులు కొనుగోలు కేంద్రాల చుట్టూ తిరుగుతున్నా ప్రయోజనం ఉండడం లేదు. ‘టార్గెట్లు అయిపోయాయి’ మరి కొనలేం అని సిబ్బంది చేతులెత్తేస్తున్నారు. దీంతో రైతన్నలు లబోదిబోమంటున్నారు. పొలాల్లో ఉంచితే నీరు వచ్చి తడిచి పోతున్నాయి, ఎలుకలు తినేస్తున్నాయని రైతులు ఆవేదన చెందుతున్నారు. నరసన్నపేట మండలంలో ఉర్లాం రైల్వే ట్రాక్ దాటి ఏ గ్రామం వెళ్లినా ధాన్యం నిల్వలు కనిపిస్తున్నాయి. రైతులు కంటతడి పెడుతున్నారు. ఇదే పరిస్థితి జలుమూరు, సారవకోట, పోలాకి మండ లాల్లో ఉంది. 10 రోజులుగా ధాన్యం కొనుగోళ్లు నిలిచి పోయాయి. దీనికి ప్రధాన కారణం టార్గెట్లు అయిపోవడమే. ముందుగానే ఈ పరిస్థితి ఊహించి టార్గెట్లు పెంచితే రైతులకు ఈ ఇబ్బంది ఉండేది కాదు. ఇప్పుడు టార్గెట్ల పేరుతో రైతులను వేధిస్తున్నారు. వ్యవసాయ మంత్రి సొంత జిల్లాలోనే అధికారులు పట్టించుకోకుంటే ఎలా అని రైతులు ప్రశ్నిస్తున్నారు. టార్గెట్లు పెంచాలని మండల స్థాయి అధికారులు జిల్లా అధికారులకు తెలియజేస్తున్నా పట్టించుకోవడంలేదు. జీపీఎస్‌తో కొత్త సమస్యలు ప్రస్తుతం రైతులు మిల్లులకు ధాన్యం పంపే వాహనాలకు జీపీఎస్ అమలు చేస్తున్నారు. జనవరి ముందు వారం వరకూ జీపీఎస్ లేదు. ఇప్పుడు అమలు చేయడంతో రైతులు ఇబ్బంది పడుతున్నారు. ధాన్యంతో వెళ్లిన వాహనాలు మిల్లరు లాగిన్‌లో చూపడం లేదు. దీంతో టార్గెట్లు ఉన్న మండలాల్లో కూడా ధాన్యం కొనుగోళ్లు ఆశాజనకంగా లేవు. మి ల్లులకు ధాన్యం పంపినా డబ్బులు రావడం లేదు. దీంతో రైతులు అవస్థలు పడుతున్నారు. ఈ సీజన్‌కు జీపీఎస్ విధానం రద్దు చేయాలని రైతులు కోరుతున్నారు. అలాగే జీపీఎస్ పెట్టేందుకు అయ్యే ఖర్చును వాహనదారులే పెట్టుకోవాలని అధికారులు అంటుడంతో వాహనదారులు వ్యతిరేకిస్తున్నారు. గతంలో వాహనాలకు ఉచితంగానే జీపీఎస్‌ను అధికారులు బిగించే వారు. ప్రస్తుతం సమస్యలు దృష్ట్యా జీపీఎస్ విధానం రద్దు చేయాలని రైతులు కోరుతున్నారు. గ్రామాల్లోనే ధాన్యం నరసన్నపేట, పోలాకి, జలుమూరు మండలాల్లో ధాన్యం నిల్వలు గుట్టలుగుట్టలుగా ఉన్నాయి. నరసన్నపేట మండలం బాడాంలో 1180 వరకూ ధాన్యం బస్తాలు ఉన్నాయి. అలాగే ముద్దాడపేటలో వెయ్యికి పైగా ఉన్నాయి. ఇలా సుందరాపురం, దాసరివానిపే ట, రావులవలస, పోతయ్యవలస, చెన్నాపురం, బడ్డ వానిపేట,నడగాం, లుకలాం, కామేశ్వరిపేట, యార బాడు, నర్శింగపల్లి, కంబకాయ తదితర గ్రామాల్లో ధాన్యం నిల్వలు అధికంగా ఉన్నాయి. జిల్లాలో 3,60,225 ఎకరాల్లో వరి పండించారు. ఎకరాకు 33 బస్తాలు చొప్పున కొనుగోళ్లు చేస్తున్నారు. ఇప్పటి వరకూ 3,90,273 మెట్రిక్ టన్నులే కొనుగోలు చేశారు. వాస్తవానికి జిల్లాకు 4.90 లక్షల మెట్రిక్ టన్నులు టార్గెట్‌గా నిర్ధారించారు. శనివారం సరికి 3,90,273 మెట్రిక్ టన్నులు కొనుగోళ్లు చేశారు. సుమారుగా మరో లక్ష టన్నులు కొనుగోళ్లు చేయాల్సి ఉండగా సిబ్బంది చేయడం లేదు. మండలాలకు, సచివాలయాలకు ఇచ్చిన టార్గెట్లు అయిపోయాయి.. మేమేమీ చేయలేం అని సిబ్బంది చేతులెత్తేస్తున్నారు. దీంతో రైతులు కంట తడి పెడుతున్నారు. జిల్లాలో 8.17 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని అధికారులు అంచనా వేశారు. దీని ప్రకారం టార్గెట్లు పెంచి ధాన్యం కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. -
21న విశ్రాంత వ్యవసాయ విస్తరణ అధికారుల ఆత్మీయ సమావేశం
శ్రీకాకుళం పాతబస్టాండ్: జిల్లా విశ్రాంత వ్యవసాయ విస్తరణాధికారుల ఆత్మీయ సమావేశం ఈ నెల 21న 11 గంటలకు ఇల్లీసుపురంలోని ప్రభుత్వ పింఛన్‌దారుల సంఘ భవనంలో నిర్వహించేందుకు నిర్ణయించినట్లు సంఘం అధ్యక్షుడు కుంచాల ఆదినారాయణ తెలిపారు. ఈ సందర్భంగా సంఘ సమావేశం ఆదివారం జరిగింది. ఈ ఆత్మీయ సమావేశానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ విస్తరణాధికారుల సంఘ పూర్వ ప్రధాన కార్యదర్శి ఎస్.పాపినాయుడు వస్తున్నట్లు తెలిపారు. మరిన్ని వివరాల కోసం 9542023405, 8179966304 నంబర్లను సంప్రదించాలని కోరారు. సమావేశంలో నిర్వా హక సభ్యులు కె.తవిటయ్య, డి.నారాయణరావు తదితరులు పాల్గొన్నారు. బ్యూటీపార్లర్ నిర్వహణపై 30 రోజుల శిక్షణ ఎచ్చెర్ల క్యాంపస్: ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలోని 19 నుంచి 45 ఏళ్లు గల 10వ తరగతి విద్యార్హత గల మహిళలకు ఎచ్చెర్లలోని యూనియన్ బ్యాంక్ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థలో ఉచిత బ్యూటీపార్లర్ నిర్వహణపై 30 రోజుల శిక్షణ నిర్వహించనున్నట్లు డైరెక్టర్ కె.శ్రీనివాసరావు అదివారం ప్రకటనలో తెలిపారు. 20వ తేదీ నుంచి శిక్షణ ప్రారంభమవుతుందని, ఆసక్తి ఉన్న వారు 7993340407, 95534 10809 నంబర్లను సంప్రదించాలని అన్నారు. శిక్షణ కాలంలో వసతి, భోజనం సౌకర్యాలు ఉచితంగా కల్పించనున్నట్లు చెప్పారు. ‘తిరుమల ఘటనలకు ప్రభుత్వానిదే బాధ్యత’ ఇచ్ఛాపురం రూరల్: కూటమి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమలలో వరుసగా అపచారాలు జరుగుతున్నాయని ఎమ్మెల్సీ నర్తు రామారావు విమర్శించారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ వైకుంఠ ద్వార దర్శనాల దుర్ఘటన, ఇటీవల యాత్రిక సదన్ పైనుంచి పడి మూడేళ్ల బాలుడు మృతి, తర్వాత లడ్డూ కౌంటర్లో షా ర్ట్ సర్క్యూట్‌తో అగ్ని ప్రమాదం, రెండో ఘాట్‌లో జరిగిన రోడ్డు ప్రమాదం, ఇప్పుడు ఎగ్ బిర్యానీ వంటి వరుస ఘటనలు తిరుమలలో జరగడం అపవిత్రమని, అందుకు రాష్ట్ర ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాలని అన్నారు. తిరుమల పవిత్రతను కాపాడుదామంటూ చెప్పిన కూటమి నాయకులు ఇప్పుడు భక్తులకు ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. పద్మావతి పార్కులో జరిగిన ప్రమాదంలో ఆరుగురు మృతి చెందితే ఆ కుటుంబాలకు కోటి రూపాయలు ఇవ్వాల్సిన టీటీడీ రూ.25లక్షలు చొప్పున ఇచ్చి చేతులు దులుపుకుందని అసహనం వ్యక్తం చేశారు. ఇప్పటికై నా కూటమి ప్రభుత్వం, టీడీడీ తిరుమల పవిత్రతను కాపాడాలని కోరారు. ఉపాధ్యాయ పండితుల సమస్యల పరిష్కారానికి కృషి శ్రీకాకుళం న్యూకాలనీ: రాష్ట్రంలో ఉపాధ్యాయ పండితుల సమస్యలు పరిష్కారానికి అన్ని చర్యలు తీసుకుంటామని ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ శాసనమండలి నియోజకవర్గ అభ్యర్థి, మాజీ ఎమ్మెల్సీ డాక్టర్ గాదె శ్రీనివాసులనాయుడు అన్నారు. రాష్ట్రీయ ఉపాధ్యాయ పండిత పరిషత్(రుప్ప్) ఉమ్మడి శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల సంయుక్త సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఉపాధ్యాయ పండిత పరిషత్ ప్రతినిధులు తమ ఆకాంక్షలు, అభిప్రాయాలను వెల్లడించారు. గాదెకు సంపూర్ణ మద్దతును ప్రకటిస్తున్నట్టు రుప్ప్ సంఘ ప్రతినిధులు స్పష్టంచేశారు. కార్యక్రమంలో శ్రీకాకుళం జిల్లా రుప్ప్ అధ్యక్షలు పి.రంగన్న, ప్రధాన కార్యదర్శి సోయ నాగేశ్వరరావు, గండేపల్లి మల్లేశు, కె.పద్మావతి, సూర్యారావు, వి.రమణమూర్తి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. నీటి కోసం నిరసన హిరమండలం: మేజర్ పంచాయతీ హిరమండలం చిన్నకోరాడలో తాగునీటికి స్థానికులు ఇబ్బంది పడుతున్నారు. దీంతో వీధిలోని పలు వురు మహిళలు ఆదివారం నిరసన వ్యక్తం చేశా రు. జలజీవన్ మిషన్ ద్వారా ఇంటింటికి కుళాయిల ద్వారా తాగునీటి సరఫరా చేసేందుకు నవంబర్‌లో పనులు చేపట్టారని, అప్పటి నుంచి తమకు తాగునీటి సరఫరా ఆపేశారని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై పలుమార్లు అధికారులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేదన్నారు. -
చేతివాటం
పంచాయతీ ఉద్యోగి● సొంత జేబులోకి ట్రేడ్ లైసెన్స్ ఫీజు డబ్బులు ● మరి కొంత మంది నుంచి ఇంటి పన్ను పేరు మార్పుల కోసం డబ్బులు వసూళ్లు ● నాలుగు నెలలుగా విధులకు డుమ్మా టెక్కలి: టెక్కలి మేజర్ పంచాయతీకి చెందిన ఉద్యోగి ఒకరు తన చేతివాటాన్ని ప్రదర్శించి ట్రేడ్ లైసెన్స్‌కు వసూలు చేసిన ఫీజు డబ్బులను సొంత జేబులోకి వేసుకున్నాడు. ఈ వ్యవహారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అయితే ప్రస్తుతం నిందితుడు నాలుగు నెలలుగా విధులకు డుమ్మా కొట్టడం మరింత చర్చనీయాంశమైంది. వివరాల్లోకి వెళితే...టెక్కలి మేజర్ పంచాయతీలో కారుణ్య నియామకంలో భాగంగా హేమంత్ అనే యువకుడు స్వీపర్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు. ఆ యువకుడు కాస్త చదువుకోవడంతో, పంచాయతీకి సంబందించి ట్రేడ్ లైసెన్స్ వసూళ్ల బాధ్యతలను అప్పగించారు. దీంతో అతడు ట్రేడ్ లైసె న్స్ ఫీజులను వసూలు చేసి సొంత అవసరాలకు వినియోగించుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న పంచాయతీ అధికారులు మందలించి రికార్డులను స్వాధీనం చేసుకున్నారు. సొంత అవసరాలకు వినియోగించుకున్న సొమ్మును తక్షణమే పంచాయతీకి చెల్లించాలని అధికారులు ఆదేశించి కొంత గడువును ఇచ్చారు. అయినప్పటికీ పంచాయతీకి చెల్లించాల్సిన డబ్బులు చెల్లించకపోగా అక్టోబర్ నెల నుంచి నేటి వరకు విధులకు హాజరు కాకపోవడం ప్రస్తుతం పంచాయ తీ కార్యాలయంలో చర్చనీయాంశంగా మారింది. ఇదిలా ఉండగా ట్రేడ్ లైసెన్స్ వసూలు చేస్తున్న హేమంత్‌కు తమ ఇంటి పన్ను పేరు మార్పుల కోసం డబ్బులు ఇచ్చా మని ఆయన ఆచూకీ లేదంటూ కొంత మంది పంచాయతీకి చెందిన ప్రజలు తరచూ అధికారు లకు ఫిర్యాదులు చేస్తున్నారు. పంచాయతీ సిబ్బంది హేమంత్ వ్యవహారంపై ఇప్పటికే జిల్లా స్థాయి పంచాయతీ అధికారులతో పాటు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు ఈఓ జగన్నాథం వెల్లడించారు. ఇదిలా ఉండగా గతంలో పంచాయతీ ఇంటి పన్నుల వసూళ్లు విషయంలో కొంత మంది సిబ్బంది ఇదే మాదిరిగా లక్షల రూపాయలు గోల్ మాల్ చేశారు. మళ్లీ ఇప్పుడు అదే సీన్ రిపీట్‌గా మారింది. తాజాగా జరిగిన వ్యవహారంపై కొంత మంది వార్డు సభ్యులు జిల్లా అధికారులకు ఫిర్యాదు చేయడానికి సిద్ధమవుతున్నారు. -
ఆసక్తి తగ్గిందా..?
ఎచ్చెర్ల క్యాంపస్: పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగం అంటే చాలా మంది యువతకు ఇదివరకు దీర్ఘకాలిక స్వ ప్నంలా ఉండేది. ఏపీ పోలీస్ రిక్రూట్మెంట్ నిర్వహిస్తున్న ఈ ఎంపిక ప్రక్రియ ప్రస్తుతానికి రెండు దశలు దాటింది. ప్రిలిమినరీ పరీక్ష, దేహ దారుఢ్య పరీక్ష, ఇక చివరి రాత పరీక్ష మాత్రమే ఉంది. ప్రిలిమినరీ పరీక్ష అర్హత సాధించిన వారు చాలా మంది ఫిజికల్ టెస్టులకు హాజరు కాలేదు. తుది పరీక్షకు ఎంపికైన వారి సంఖ్య కూడా తక్కువగా ఉంది. ఎక్కువ మందికి ఆసక్తి లేకపోవడం వల్లే గైర్హాజరైన వారి సంఖ్య అధికంగా ఉందని చాలా మంది భావిస్తున్నారు. వాస్తవంగా కానిస్టేబుల్ పోస్టులకు ఇంటర్మీడియెట్ అర్హత కాగా, ఇంజినీరింగ్, పీజీ, డిగ్రీ చేసిన వారు సైతం దరఖాస్తు చేసుకున్నారు. చాలా మంది ఎంపిక ప్రక్రియకు హాజరయ్యారు. దేహ దారుఢ్య పరీక్షలు ఎచ్చెర్ల ఆర్మ్డ్ రిజర్వ్ మైదానంలో డిసెంబర్ నెల 30 నుంచి ఈ నెల 18వ తేదీ వరకు సెలవు రోజుల్లో మినహా నిర్వహించారు. జిల్లా నుంచి ప్రిలిమినరీ పరీక్షల్లో పురుష, మహిళా అభ్యర్థులు 7390 మంది అర్హత సాధించారు. వీరిలో దేహ దారుఢ్య పరీక్షలకు 4952 మంది మాత్రమే హాజరయ్యారు. 2951 మంది తుది రాత పరీక్షకు ఎంపికయ్యారు. ప్రిలిమినరీ పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన 2438 మంది దేహ దారుఢ్య పరీక్షలకు ఎంపిక కాలే దు. గతంలో అభ్యర్థులను స్క్రూట్నీ చేయటం కోసం ఐదు కిలో మీటర్లు అర్హతగా పరీక్ష నిర్వహించే వారు. 25 నిమిషాల్లో ఐదు కిలోమీటర్ల పరుగు పందెంలో విజేతలకు ఇతర దేహ దారుఢ్య పరీక్షలు నిర్వహించి రాత పరీక్ష ద్వారా ఎంపిక చేసేవారు. ప్రస్తుతం ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహణ ద్వారా స్క్రూట్నీ చేశారు. వీరికి ఎత్తు, ఛాతీ కొలత, 1600 మీటర్లు, 100 మీటర్లు, లాంగ్ జంప్ నిర్వహించి అర్హత సాధించిన వారికి తుది పరీక్ష నిర్వహించి, ఉద్యోలకు రిజర్వేషన్ రోస్టర్, కొన్ని పోస్టులకు స్పోర్ట్సు మెరిట్, రాత పరీక్ష ప్రతిభ ఆధారంగా ఎంపిక చేస్తున్నారు. ప్రధానంగా ఎక్కువ మంది అభ్యర్థులు ఎత్తు, ఛాతీ కొలత, 1600 మీటర్లు పరుగు పందేంలో అర్హత సాధించ లేకపోయారు. పోలీస్ కానిస్టేబుల్ ఎంపిక ప్రక్రియలో నిర్వహించిన ఎంపిక ప్రక్రి య అన్ని దశలు దాటి వెళ్లాలి. ఎంపికపై స్పష్టమైన నమ్మకం లేని వారు హాజరు కాలేదు. మరోపక్క కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన పలు ఆర్మ్డ్ ఫోర్స్ ఉద్యోగాలకు వెళ్లిపోయారు. దీంతో గైర్హాజరు సంఖ్య ఎక్కువగా ఉందని నియామక ప్రక్రియలో పాల్గొన్న అధికారులు బావిస్తున్నారు. మరో పక్క ఎంపికై న అభ్యర్థులు కోచింగ్ సెంటర్లలో శిక్షణ, ఆన్లైన్ శిక్షణ, బయట ప్రాంతాల్లో గదులు అద్దెకు తీసుకొని ప్రిపరేషన్ ప్రారంభించారు. ఉద్యోగం సాధించాలంటే ఇప్పటికీ తీవ్ర పోటీ ఎదుర్కోవాల్సి ఉంటుంది. -
పేదల చదువులు ప్రభుత్వానికి పట్టవా
● వైఎస్సార్సీపీ కాళింగ కుల రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణరావు శ్రీకాకుళం (పీఎన్‌కాలనీ): రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వానికి పేద పిల్లల చదువులంటే లెక్కలేదని వైఎస్సార్సీపీ కాళింగ కుల రాష్ట్ర అధ్యక్షుడు, కాళింగ కుల కార్పొరేషన్ మాజీ చైర్మన్ దుంపల రామారావు (లక్ష్మణరావు) అన్నారు. పట్టణంలో శనివారం ఆయన మాట్లాడుతూ.. ధనిక వర్గాలతో సమానంగా పేదవాడికి నాణ్యమైన విద్యనందించాలనే ఉద్దేశంతో గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఇంగ్లిష్ మీడియం తీసుకొచ్చిందన్నారు. అయితే దానికి కూటమి ప్రభుత్వం తూట్లు పొడవడం సరికాదన్నారు. విద్యార్థులకు విద్యను మరింత చేరువ చేయాలనే ఉద్దేశంతో మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అమ్మఒడి పథకానికి శ్రీకారం చుడితే, ఈ పథకానికి బాబు సర్కార్ మంగళం పాడడం సరికాదన్నారు. విద్యా సంవత్సరం పూర్తవుతున్నా సర్కార్ లబ్ధిదారులకు తల్లికి వందనం నిధులు విడుదల చేయకపోవడంపై మండిపడ్డారు. యూపీ పాఠశాలలు విలీనం చేసే నిర్ణయాన్ని ప్రభుత్వం తక్షణమే ఉపసంహరించుకోవాలన్నారు. విలీనం చేయడమంటే బాల కార్మికులను తయారు చేయడమేనని పేర్కొన్నారు. డిగ్రీ, పీజీ, ఎంసీఏ, ఎంబీఏ కోర్సులు చదువుకున్న విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ ఎప్పుడు చెల్లిస్తారని ప్రశ్నించారు. నిరుద్యోగ భృతి చెల్లిస్తామని ఇచ్చిన హామీ అమలు చేయకుండా మరింత తాత్సారం చేస్తున్నారన్నారు. ఇచ్చిన హామీలన్నీ తక్షణమే అమలుచేసి పేదల విద్యకు సహకరించాలన్నారు. -
● ఎట్టకేలకు పోలీసులకు చిక్కారు ● 32 చోరీలకు పాల్పడిన ఇద్దరు నిందితులను అరెస్టు చేసిన పోలీసులు ● 104 తులాల బంగారు ఆభరణాలు రికవరీ
శ్రీకాకుళం క్రైమ్: దొంగలొచ్చారన్న విషయం ఇంటి తలుపులకే తెలియదు.. తాళాలకు సుత్తిదెబ్బలూ ఉండవు.. రాళ్ల దెబ్బలూ పడవు.. కిటికీలు, గ్రిల్స్ తొలగించిన దాఖలాలు కనబడవు.. దర్జాగా ఇంటి తాళం ఎక్కడుందో ముందే తెలుసుకుని లోపలికి వెళ్తారు.. బీరువాలో వస్తువులు చిందరవందరగా పడేయకుండా ఎన్ని బంగారు వస్తువులున్నా ఒకట్రెండే తమ లక్ష్యమన్నట్లు.. మూడో కంటికి తెలియకుండా ఏడాది వ్యవధిలో 32 చోరీలకు పాల్పడ్డారు ఇద్దరు యువకులు. మొత్తం 112 తులాల బంగారాన్ని కాజేశారు. ఈ చోరీల ప్రణాళికలో విజయనగరం జిల్లా చీపురుపల్లికి చెందిన పున్నాన రాంబాబు (30)ది మాస్టర్ మైండ్ కాగా, మన జిల్లాలోని జి.సిగడాం మండలం గెడ్డ కంచరాం గ్రామానికి చెందిన గిడిజాల కోటేశ్వరరావు (33) భాగస్వామిగా ఉన్నాడు. జైలు గోడల మధ్య పరిచయమైన వీరి బంధం మళ్లీ అక్కడికే తీసుకెళ్లేలా చేసింది. రూ. 84.44 లక్షల విలువైన 104 తులాల బంగారాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు నిందితులను రిమాండ్‌కు తరలించారు. శనివారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ కె.వి.మహేశ్వరరెడ్డి మీడియాకు వివరాలు వెల్లడించారు. రంజీ జట్టు ఎంపికలో మోసపోవడంతో.. పున్నాన రాంబాబు ఆరో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు విజయవాడలోని తన అత్తగారింటి వద్ద చదువుకున్నాడు. మొబైల్ అప్లికేషన్లు, హార్డ్‌వేర్ వంటి సాంకేతిక పరిజ్ఞానంలో ప్రావీణ్యాన్ని సంపాదించుకున్నాడు. చిన్నప్పటినుంచి క్రికెట్‌పైన మక్కువ ఉండటంతో అక్కడే ఓ కోచ్ వద్ద మెలకువలు సాధించాడు. అయితే రంజీ జట్టుకు ఎంపిక విషయంలో కోచ్ తనను మోసం చేయడం తట్టుకోలేని రాంబాబు వ్యసనాల బాట పట్డాడు. క్రికెట్ బెట్టింగ్ కోసం డబ్బులు దుబారాగా ఖర్చుపెట్టడం.. అది కాస్తా ఆస్తి నేరాలు చేసేలా దారి తీసింది. ఈ క్రమంలో ఎస్.కోట, విజయనగరం, చీపురుపల్లి, రణస్థలం, లావేరు తదితర పోలీస్ స్టేషన్లలో గతంలో నమోదైన 30 కేసుల్లో అరెస్టయి జ్యుడీషియల్ రిమాండ్‌కు కూడా వెళ్లాడు. జైలులో కోటేశ్వరరావుతో పరిచయం.. రెండో నిందితుడైన గిడిజాల కోటేశ్వరరావు స్వగ్రామం జి.సిగడాం మండలం గెడ్డ కంచరాం. శ్రీకాకుళంలో ఉండేవాడు. భార్య భరణం కేసులో 2021లో అరెస్టయి శ్రీకాకుళం జైలుకు వెళ్లినప్పుడు అక్కడే ఉన్న రాంబాబుతో పరిచయం ఏర్పడింది. జైలు నుంచి విడుదలయ్యాక తనతో పాటు నేరాల్లో పాలుపంచుకోవడానికి ప్రణాళిక వేసుకున్నాడు. రాంబాబు దొంగిలించిన సొత్తును ముత్తూట్ ఫిన్‌కార్ప్, ముత్తూట్ మినీ ఫైనాన్స్ కంపెనీల్లో తాకట్టు పెట్టడానికి కోటేశ్వరరావుకు ఇచ్చేవాడు. దానికి కమీషన్‌గా వచ్చే డబ్బుల్లో పదిశాతం వాటా ఇచ్చేవాడు. కొన్ని నేరాల్లో కోటేశ్వరరావు కూడా పాల్గొనేవాడు. ఏడాది వ్యవధిలో 32 చోరీలు.. ఈ క్రమంలో 2024 నుంచి 2025 వరకు శ్రీకాకుళం, విశాఖ జిల్లాల్లో 32 చోరీలు చేశారు. ఎచ్చెర్ల పీఎస్ పరిధిలో 11 చోరీలు, లావేరు పీఎస్ మూడు, శ్రీకాకుళం ఒకటో పట్టణ పీఎస్ నాలుగు, శ్రీకాకుళం రూరల్ పీఎస్ రెండు, గార పీఎస్ రెండు, శ్రీకాకుళం రెండో పట్టణ పీఎస్ నాలుగు, పొందూరు పీఎస్ మూడు, పోలాకి పీఎస్ ఒకటి, విశాఖజిల్లా పీఎంపాలెం పీఎస్ ఒకటి, వీఎస్పీ సిటీ ఒకటి చేశారు. వీరు చేసిన చోరీలన్నీ బంగారు వస్తువులే కావడం గమనార్హం. ఎచ్చెర్ల కేసులో తీగ లాగితే.. 2024 డిసెంబరులో ఎచ్చెర్లలో ఫంక్షన్ కోసం వెళ్తున్న కుమార్తెకు తన తల్లి బీరువాలో భద్రపర్చిన ఐదున్నర తులాల బంగారు కాసుల పేరు, చైన్ ఇచ్చింది. తిరిగొచ్చాక మళ్లీ పెట్టేసింది. పండగ సందర్భంగా ఇల్లు శుభ్రం చేద్దామని ఈ నెల 7న బీరువా తెరవగా రెండు నగలూ కనిపించలేదు. అదే రోజు పోలీసులకు ఫిర్యాదు చేయగా ఎస్ఐ సందీప్ దర్యాప్తు ప్రారంభించారు. విచారణలో అనేక విషయాలు బయటపడుతుండటంతో డీఎస్పీ సిహెచ్ వివేకానంద పర్యవేక్షణలో జె.ఆర్.పురం సీఐ ఎం.అవతారం, ఒకటో పట్టణ సీఐ సీహెచ్ పైడపునాయుడులతో కూడిన బృందాలు దర్యాప్తు ముమ్మ రం చేయడంతో మరిన్ని విషయాలు బయటపడ్డాయి. 2022లో అరెస్టయి విశాఖపట్నం సెంట్రల్ జైల్‌కు వెళ్లిన రాంబాబు మళ్లీ 2024 జనవరి 10న విడుదలైన మరొకరి సాయంతో ఈ నేరాలకు పాల్పడినట్లు గుర్తించారు. పట్టుబడ్డారిలా.. ఈ నెల 17న సాయంత్రం తమకొచ్చిన సమాచారంతో ఎచ్చెర్ల, లావేరు ఎస్ఐలు సందీప్‌కుమార్, చిరంజీవిలు సిబ్బందితో కలిసి అరిణం అక్కివలస కూడలిలోని ప్రకృతి లేఅవుట్ వద్ద అనుమానాస్పదంగా తిరుగుతున్న ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ప్రతిభకు ప్రశంసలు.. భారీ కేసును డీఎస్పీ వివేకానంద పర్యవేక్షణలో ఛేదించిన సీఐలు ఎం. అవతారం, సీహెచ్ పైడపునాయుడు, ఎస్ఐలు సందీప్‌కుమార్, చిరంజీవి, జి.లక్ష్మణరావు, సిహెచ్ మధుసూదనరావు, మిగతా సిబ్బందిని ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు. బ్యాంకులు, ఫైనాన్స్ సంస్థల్లో మిగిలిన ఎనిమిది తులాల బంగారాన్ని రికవరీ చేసే పనిలో ఉన్నట్లు చెప్పారు. వీరి చోరగుణం.. ఆసక్తికరం..పోలీసుల విచారణలో ఆసక్తికర అంశాలు వెలుగులోకి వచ్చాయి. ఇంటి భద్రత విషయంలో మనం మరింత అప్రమత్తమవ్వాల్సిన అవసరం ఉందని తేల్చిచెప్పాయి. పోలీసులు వచ్చి చెప్పేవరకు తమ ఇంట్లో దొంగతనం జరిగిందని బాధితులకే తెలియకపోవడం గమనార్హం. ఎక్కడా వేలిముద్రలు పడకుండా జాగ్రత్తపడేవారు. ఒకటి రెండు వస్తువులే తీయడంతో కుటుంబంలోని వారు ఇంటిదొంగ పని అని భావించేలా..సీన్ క్రియేట్ చేయడంతో పలు ఇళ్లల్లో కొట్లాటలు కూడా జరిగినట్లు సమాచారం. ప్రజలు కూడా నిర్లక్ష్యం వహించకుండా తాళాలను తమ వెంటే తీసుకెళ్లాలని, బయట ఉంచకూడదని పోలీసులు సూచించారు. ఇంట్లో చోరీ జరిగిందని గ్రహించిన వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలన్నారు.ఇంట్లో వారికి అనుమానం రాకుండా ఎదురుగా ఎంత బంగారం ఉన్నప్పటికీ నాలుగైదు తులాలకు మించి ఎప్పుడూ చోరీ చేయకపోవడం విశేషం.ఇంటి ఆవరణలోని షూర్యాక్, ఎలక్ట్రికల్ మీట ర్ రీడింగ్బోర్డు, పూల కుండీలు, కిటికీలోపల తదితర చోట్ల తాళాలు పెట్టే వారి ఇళ్లే వీరి లక్ష్యం -
ఆమె నేత్రాలు సజీవం
శ్రీకాకుళమ కల్చరల్ : నగరంలోని పీఎన్ కాలనీలో 7వ లైన్లో నివాసముంటున్న తిర్లంగి అన్నపూర్ణమ్మ(73) గుండెపోటుతో శనివారం మృతిచెందారు. మరణాంతరం ఆమె నేత్రాలు ఇతరులకు ఉపయోగపడాలనే ఉద్దేశంతో కుటుంబసభ్యులు రమేష్, రోహిణికుమారి, రవిప్రసాద్, రోజాకుమారిలు రెడ్‌క్రాస్‌కు తెలియజేయగా.. నేత్ర సేకరణ కేంద్రం టెక్నికల్ ఇన్చార్జి పి.సుజాత, సహాయకులు పి.సుమతి స్పందించారు. అన్నపూర్ణమ్మ కార్నియాలను సేకరించి విశాఖలోని ఎల్వీప్రసాద్ నేత్ర సేకరణ కేంద్రానికి తరలించారు. ఈ సందర్భంగా దాత కుటుంబ సభ్యులను రెడ్‌క్రాస్ చైర్మన్ జగన్మోహనరావు, హర్షవర్దన్, దుర్గాశ్రీనివాస్‌లు అభినందించారు. నేత్రదానం చేయాలనుకునేవారు 7842 699321 నంబరును సంప్రదించాలని కోరారు. పరిసరాల శుభ్రతతోనే ఆరోగ్యం నరసన్నపేట: మన చుట్టూ ఉన్న పరిసరాలను శుభ్రంగా ఉంచుకుంటేనే ఆరోగ్యంగా ఉండగలమని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అన్నారు. స్వచ్చ ఆంధ్ర–స్వచ్ఛ దివాస్ కార్యక్రమంలో ప్రతిఒక్కరూ భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. నరసన్నపేట తహసీల్దార్ కార్యాలయం వద్ద శనివారం స్వచ్ఛ ఆంధ్ర–స్వచ దివాస్ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి మూడో శనివారం కార్యక్రమం విధిగా చేపటా లని ఆదేశించారు. నరసన్నపేటలో ఎక్కడికక్క డ చెత్త కనిపించిందని, భవిష్యత్తులో ఈ పరిస్థి తి ఉండకూడదన్నారు. కార్యక్రమంలో డీపీఓ భారతి సౌజన్య, డీపీఆర్సీ నిశ్చల, ఎంపీడీఓ మధుసూదనరావు, తహసీల్దార్ సత్యనారాయ ణ, ఈఓ ద్రాక్షాయిని, ఈఓపీఆర్డీ రేణుక, ఉప సర్పంచ్ ఎస్.కృష్ణబాబు పాల్గొన్నారు. గడ్డి కుప్పలు దగ్ధం రణస్థలం: రణస్థలం పంచాయతీ నగరప్పాలెం గ్రామంలో గంట్యాడ దాలినాయుడుకు చెందిన గడ్డి కుప్పలు శనివారం మధ్యాహ్నం అగ్నికి అహుతైనట్లు అగ్నిమాపక అధికారి పైల అశోక్ తెలిపారు. వెంటనే రణస్థలం అగ్నిమాపక శకటం వచ్చి గడ్డి కుప్పలకు అంటుకున్న మంటలను ఆర్పివేశారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. -
శ్రీకాకుళం
ఆదివారం శ్రీ 19 శ్రీ జనవరి శ్రీ 2025పల్లె నుంచి పట్నానికి..! సంక్రాంతి పూర్తవ్వడంతో తిరుగు ప్రయాణాలు మొదలయ్యాయి. ఆర్టీసీ కాంప్లెక్స్‌లో బస్సులు కిటకిటలాడాయి. –8లో●దర్జాగా చెరువు కబ్జా ●కోటబొమ్మాళిలో టీడీపీ నేత బరితెగింపు ప్రస్తుతం జోరుగా సాగుతున్న నిర్మాణం చిత్రం చూడండి. కోటబొమ్మాళి మండల కేంద్రంలో చెరువును ఏకంగా ఆక్రమించి చేస్తున్న నిర్మాణమిది. మంత్రి అనుచరుడు, టీడీపీ మండల నాయకుడు చేస్తున్న నిర్వాకమిది. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ప్రతీసారి ఈయన ఆక్రమణ దందా సాగుతూనే ఉంది. సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: అధికారం ఇచ్చింది అక్రమాలకు పాల్పడటానికే అన్నట్టుగా కొందరు టీడీపీ నాయకులు వ్యవహరిస్తున్నారు. దాడులు, దౌర్జన్యాలు, కబ్జాలు, ప్రభుత్వ స్థలాలు ఆక్రమించేయడమే పనిగా రెచ్చిపోతున్నారు. అధికార పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రుల సహకారంతో దర్జాగా ఆక్రమణలకు పాల్పడుతున్నారు. కొన్ని సందర్భాల్లో కోర్టులో స్థల వివాదాలు ఉన్నప్పటికీ తీర్పులతో తమకు సంబంధం లేదన్నట్లుగా దౌర్జన్యాలకు దిగుతున్నారు. టెక్కలి నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రిగా కొనసాగుతున్న కింజరాపు అచ్చెన్నాయుడు సొంత మండల కేంద్రంలో టీడీపీ మండల పార్టీ నాయకుడు దర్జాగా చెరువు గర్భాన్ని ఆక్రమించి మరీ అక్రమ కట్టడాలు నిర్మిస్తుండడంతో అంతా విస్తుపోతున్నారు. తన వెనుక మంత్రి ఉన్నారని.. ఎవరైనా అడ్డు వస్తే సహించేది లేదన్నట్లుగా మంత్రి పేరు చెప్పకుని దౌర్జన్యంగా అక్రమ కట్టడాలు నిర్మిస్తున్నారు. బరితెగింపు.. కోటబొమ్మాళి మండల కేంద్రంలో మార్కెట్‌కు ఎదురుగా సర్వే నెంబర్ 91/2లో సుమారు 28 ఎకరాల 34 సెంట్లు మేర పెద్ద చెరువు ఉంది. రెవెన్యూ రికార్డుల్లో సైతం చెరువు గర్భంగానే నమోదై ఉంది. ఇదే స్థలంలో దశాబ్ద కాలం క్రితం టీడీపీ నాయకుడు కొంత మేరకు రైస్ మిల్లు నిర్మాణం చేపట్టారు. అప్పట్లో అధికారులు పట్టించుకోలేదు. 2014లో టీడీపీ అధికారంలో వచ్చాక మరికొంత స్థలాన్ని ఆక్రమించే ప్రయత్నం చేశారు. అప్పట్లో వైఎస్సార్సీపీ నాయకులు అడ్డుకుని రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేశారు. కలెక్టర్ ఆదేశాల మేరకు సర్వేలు చేసి ఆ స్థలం చెరువు గర్భంగా తేల్చారు. అంతేకాకుండా మండల రెవెన్యూ అధికారులు కోర్టును ఆశ్రయించారు. ఫలితంగా ఆక్రమణలకు కొంత మేరకు ఫుల్స్టాప్ పడింది. ఆ తర్వాత వైఎస్సార్సీపీ అధికారంలోకి రావడంతో ఆక్రమించే సాహసానికి పోలేదు. ఇదే స్థలంలో కొంతమంది పేదలు రేకులు షెడ్లు వేసుకోగా అప్పట్లో రెవెన్యూ అధికారులు ఖాళీ చేయించారు. దీంతో స్థలం ఖాళీగా ఉండిపోయింది. ప్రస్తుతం కోటబొమ్మాళి జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో స్థలానికి సంబంధించిన కేసు పెండింగ్‌లో ఉంది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే.. ఆ స్థలంపై కన్నేసిన మండల టీడీపీ నేత అక్రమ కట్టడాలకు ఉపక్రమించారు. ఇటీవల జోరుగా నిర్మాణ పనులు చేస్తున్నారు. అంతేకాక మరికొంత స్థలంలో రేకుల షెడ్లు వేసుకుని అద్దెలకు కూడా ఇచ్చుకోవడం గమనార్హం. న్యూస్‌రీల్ చెరువు గర్భంలో అక్రమ నిర్మాణాలు గతంలోనూ ఆక్రమణకు ప్రయత్నాలు అప్పట్లో అడ్డుకున్న వైఎస్సార్సీపీ నాయకులు కోర్టులో కొనసాగుతున్న స్థల వివాదం కూటమి ప్రభుత్వం రావడంతో మళ్లీ అక్రమ నిర్మాణాలు స్థలాన్ని పరిరక్షించాలి.. కోటబొమ్మాళిలో సర్వే నంబరు 91/2లో చెరువు గర్భంలో ఎటువంటి ఆక్రమణలు లేకుండా గతంలో రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేశాం. దీంతో రెవెన్యూ అధికారులే కోర్టును ఆశ్రయించారు. ప్రస్తుతం స్థలం సమస్య కోర్టు పెండింగ్‌లో ఉంది. ఇటీవల కాలంలో అదే స్థలంలో కట్టడాలు జరుగుతున్నాయి. ప్రజోపకారమైన పనుల కోసం వినియోగించాల్సిన స్థలంలో ఇలా ఆక్రమణలు జరుగుతున్నాయి. ఇప్పటికై నా జిల్లా అధికారులు స్పందించి స్థలాన్ని పరిరక్షించాలి. – కె.సంజీవరావు, సర్పంచ్, కోటబొమ్మాళిఆపమని ఆదేశించాం... చెరువు గర్భంలో అక్రమ కట్టడాలు జరుగుతున్నట్లు మాకు సమాచారం వచ్చిన వెంటనే అక్కడకు వెళ్లి పరిశీలన చేశాం. అప్పటికే జరుగుతు న్న పనులను ఆపివేశాం. పూర్తి స్థాయిలో సామాన్లు తొలగించేందుకు రెండు రోజులు గడువు ఇచ్చాం. ఎటువంటి అక్రమ కట్టడాలు లేకుండా చర్యలు చేపడుతున్నాం. – ఆర్.అప్పలరాజు, తహసీల్దార్, కోటబొమ్మాళి. -
రోడ్డు ప్రమాదంలో యువకుడు దుర్మరణం
సరుబుజ్జిలి: మండలంలోని కొత్తకోట సమీపంలో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో హిరమండలం మండలం కొండరాగోలు గ్రామానికి చెందిన సన్నబోయిన చంద్రశేఖర్(25) మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. మృతుడు చంద్రశేఖర్ దుబాయ్‌లో వెల్డింగ్ పనులు చేస్తూ ఇటీవల సంక్రాంతి పండగకు తన స్వగ్రామం వచ్చాడు. ఆమదాలవలసలో ఉన్న తన స్నేహితుడిని కలిసేందుకు ద్విచక్ర వాహనంపై బయల్దేరాడు. ఆ సమయంలో ఆమదాలవలస నుంచి సరుబుజ్జిలి వైపు వెళ్తున్న మరో ద్విచక్ర వాహనం ఢీకొనడంతో ఘటన స్థలంలోనే మృతి చెందాడు. మృతుడి తండ్రి తిరుపతిరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, మృతదేహాన్ని సర్వజన ఆస్పత్రికి పోస్టుమార్టం కోసం తరలించినట్లు ఎస్ఐ బి.హైమావతి తెలిపారు. -
●ఆకుల్లేని అరటి గెల
ఆ అరటి గెలను చూసిన ప్రతిఒక్కరూ ముక్కున వేలేసుకుంటున్నారు. ఆకులు లేకుండానే గెల వేసిందా అని? ఆశ్చర్యపోతున్నారు. ఇచ్ఛాపురం మండలం ఆంధ్రా–ఒడిశా సరిహద్దు గ్రామం సదాలపుట్టి గ్రామంలోని రైతు వీరాస్వామి పెరట్లో ఈ చెట్టు ఉంది. రెండు నెలల క్రితం వీచిన గాలులకు చెట్టులో కొంతభాగం విరిగిపోయింది. దీంతో చెట్టు మధ్య నుంచి కొత్తగా అరటి గెల ఏర్పడింది. – ఇచ్ఛాపురం రూరల్ ●కమిషనర్‌పై కలెక్టర్ ఆగ్రహం! ● విధుల్లోకి చేరవద్దని ఆదేశం ● అనుమతి లేకుండా సెలవులే కారణం! ●హెల్మెట్ ధారణ తప్పనిసరి ●ప్రశాంతంగా జవహర్ నవోదయ పరీక్ష శ్రీకాకుళం పాతబస్టాండ్: శ్రీకాకుళం నగరపాలక సంస్థ కమిషనర్ పి.పి.వి.డి.ప్రసాదరావుపై కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ చర్యలు చేపట్టినట్లు సమాచారం. కమిషనర్ ఎటువంటి ముందుస్తు సమాచారాన్ని మున్సిపల్ ప్రత్యేకాధికారి, జిల్లా కలెక్టర్‌కు ఇవ్వకుండా సెలవులోకి వెళ్లినందుకు ఈ చర్యలు తీసుకున్నట్లు తెలిసింది. సంక్రాంతి సెలవులు అనంతరం విధుల్లోకి చేరవద్దని, ప్రభుత్వం కేటాయించిన వాహనాన్ని వారం పాటు నిలుపుదల చేయాలని ఆదేశించినట్లు సమాచారం. ఈ మేరకు కలెక్టర్ టేబుల్‌పై ఫైల్ ఉందని తెలుస్తోంది. కమిషనర్ ముందుగా కలెక్టర్, ప్రత్యేకాధికారికి తెలియజేయకుండా సెలవుపై వెల్లడం ఇది మూడో సారి కావడంతో ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. గతేడాది నవంబర్‌లో కూడా సమాచారం ఇవ్వకుండా సెలవుపై వెళ్లినప్పుడు కలెక్టర్ హెచ్చరించారు. అయినా ఖాతరు చేయకుండా సంక్రాంతి సెలవులు తీసుకోవడం, కార్పొరేషన్ కార్యాలయంలో ఫైల్స్ పెండింగ్‌లో ఉండటం, స్పందన ఫిర్యాదులు సైతం పరిష్కారం చేయకపోవడంపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారని కార్యాలయ వర్గాలు చెబుతున్నాయి. చేతనైతే పనిచేయాలని, లేకుంటే దీర్ఘకాలిక సెలవుపై వెళ్లిపోవాలని ఆగ్రహం వ్యక్తం చేశారని తెలుస్తోంది. ఓ పక్క రాజకీయ ఒత్తిళ్లు, మరోవైపు అధికారులు ఒత్తిడి మేరకు కమిషనర్ విధులు నిర్వహించలేక ఇబ్బందిపడుతున్నారని కార్పొరేషన్లో పలువురు అధికారులు చెబుతున్నారు. శ్రీకాకుళం పాతబస్టాండ్: ద్విచక్ర వాహనాలు నడిపే వారంతా విధిగా హెల్మెట్లు ధరించాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి జునైద్ అహ్మద్ మౌలానా అన్నారు. శనివారం జిల్లా కోర్టు సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ మైనర్లకు ఎట్టి పరిస్థితుల్లోనూ వాహనాలు ఇవ్వకూడదన్నారు. హెల్మెట్‌తో ద్విచక్ర వాహనాలపై ప్రయాణం అత్యంత సురక్షితమని, అనుకోని పరిస్థితుల్లో రోడ్డు ప్రమాదాలకు గురైనప్పుడు ప్రాణాలతో బయటపడేందుకు హెల్మెట్ రక్షణగా నిలుస్తుందని చెప్పారు. అనంతరం ఆంధ్రా ఆర్గానిక్ లిమిటెడ్(పైడి భీమవరం), పంజాబ్ నేషనల్ బ్యాంక్(సూర్యమహల్ బ్రాంచ్), ఇండియన్ బ్యాంక్(మహిళా కళాశాల బ్రాంచ్, అరసవిల్లి) సౌజన్యంతో పలువురు కోర్టు ఉద్యోగులకు హెల్మెట్లు అందజేశారు. కార్యక్రమంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఆర్.సన్యాసినాయుడు, 1వ అదనపు జిల్లా జడ్జి పి.భాస్కరరావు, 3వ అదనపు జిల్లా జడ్జి సి.హెచ్.వివేక్ ఆనంద్ శ్రీనివాస్, 4వ అదనపు జిల్లా జడ్జి ఎస్ఎం ఫణికుమార్, 6వ అదనపు జిల్లా జడ్జి(సోంపేట) కె.కిషోర్‌బాబు, సీనియర్ సివిల్ జడ్జి(రాజాం) కె.శారదాంబ, ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి కె.వి.ఎల్.హిమబిందు, అడిషనల్ సీనియర్ సివిల్ జడ్జి సీహెచ్ యుగంధర్, సీనియర్ సివిల్ జడ్జి(సోంపేట) జె.శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. శ్రీకాకుళం న్యూకాలనీ: జవహర్ నవోదయ ప్రవేశ పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. నవోదయ విద్యాలయాల్లో 6వ తరగతిలో ప్రవేశాలకుగాను శనివారం జిల్లా వ్యాప్తంగా 32 కేంద్రాల్లో పరీక్ష నిర్వహించగా 8290 మంది విద్యార్థులకు గాను 7281 మంది హాజరయ్యారు. 1009 మంది గైర్హాజరయ్యారు. డీఈఓ డాక్టర్ ఎస్.తిరుమల చైతన్య, జవహర్ నవోదయ విద్యాలయం వెన్నెలవలస ప్రిన్సిపాల్ దాసరి పరశురామయ్య, ఎగ్జామినేషన్స్ అసిస్టెంట్ కమిషనర్ లియాకత్ ఆలీఖాన్ పలు కేంద్రాలను తనిఖీ చేశారు. ●రేపటి నుంచి పశువైద్య శిబిరాలు శ్రీకాకుళం (పీఎన్‌కాలనీ): జిల్లా వ్యాప్తంగా ఈ నెల 20 నుంచి 31 వరకు పశుసంవర్థక శాఖ ఆధ్వర్యంలో ఉచిత పశు వైద్య శిబిరాలు నిర్వహించనున్నట్లు పశుసంవర్థకశాఖ సంయుక్త సంచాలకుడు రాజగోపాలరావు తెలిపారు. ఈ మేరకు శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. పశు వైద్యచికిత్సలు, వ్యాధి నిరోధక టీకాలు, నట్టల నివారణ మందు, పశువ్యాధి నిర్ధారణ, పరీక్షలు, శాసీ్త్రయ యాజమాన్యంపై అవగాహన కల్పిస్తామని పేర్కొన్నారు. ప్రతి మండలానికి రెండు బృందాలు కేటాయించామని, అందులో పశువైద్యాధికారి, పారా వెటర్నరీ సిబ్బంది, గోపాలమిత్ర, పశు సంవర్థక సహాయకులు, అటెండర్ ఉంటారని వివరించారు. -
22న న్యాయ సత్యాగ్రహ దీక్ష
శ్రీకాకుళం న్యూకాలనీ: ప్రభుత్వ జూనియర్ కళాశాలల లెక్చరర్ల సమస్యల పరిష్కారం కోరుతూ ఈ నెల 22న ‘చలో విజయవాడ’ పేరిట చేపడుతున్న ‘న్యాయ సత్యాగ్రహ దీక్షను విజయవంతం చేయా లని డిపార్ట్మెంటల్ ప్రమోషన్ కమిటీ (డీపీసీ), ప్రభుత్వ జూనియర్ కళాశాలల లెక్చరర్ల అసోసియేషన్ రాష్ట్ర నాయకులు డాక్టర్ కె.గురవయ్య, బి.రవికుమార్, డి.మురళీధర్, ఒ.నాగసురేష్, జిల్లా ము ఖ్య ప్రతినిధులు దన్నాన ఫల్గుణరావు, గణపతి వెంకటేశ్వరరావు, ఎస్.అన్నపూర్ణారావు, బర్రి గోవిందరావు కోరారు. ఈ మేరకు శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. 1998లో ప్రభుత్వ, జిల్లా పరిషత్ పాఠశాలల్లో పనిచేస్తున్న అనుభవజ్ఞులైన టీచర్లకు ప్రమోషన్ ద్వారా ఉద్యోగోన్నతి కల్పించి జూనియర్ లెక్చరర్లుగా నియమించారని, అప్పటి నుంచి జీవో 302 ప్రకారం ఉమ్మడి సీనియారిటీ ప్రాతిపదికన ప్రిన్సిపాల్స్‌గా, డిగ్రీ కళాశాలల అధ్యాపకులుగా ఉద్యోగోన్నతి కల్పించారని చెప్పారు. 2024 మార్చి 16న డీపీసీ అధ్యాపకులను పక్కనపెట్టి సర్వీస్ రూల్స్‌కు వ్యతిరేకంగా అనర్హులకు ఉద్యోగోన్నతులు కల్పించారని పేర్కొన్నారు. అన్యాయాన్ని సరిదిద్ది అక్రమ ఉద్యోగోన్నతులను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం దృష్టికి సమస్య తీసుకెళ్లేందుకు ఈ నెల 22న విజయవాడలోని ఇంటర్మీడియెట్ ఎడ్యుకేషన్ కమిషనరేట్ కార్యాలయం ఎదటు న్యాయ సత్యాగ్రహ దీక్ష చేపడుతున్నట్టు తెలిపారు. శాంతియుత మార్గంలో పెద్ద ఎత్తున నిర్వహిస్తున్న ఈ చలో విజయవాడ కార్యక్రమానికి జూనియర్ లెక్చరర్లు పెద్ద సంఖ్యలో తరలిరావాలని పిలుపునిచ్చారు. -
జెడ్పీ చైర్పర్సన్ విజయ పరామర్శ
అరసవల్లి: జిల్లా ప్రజా పరిషత్ మాజీ చైర్మన్ దివంగత పాలవలస రాజశేఖరం కుటుంబాన్ని శ్రీకాకుళం జెడ్పీ చైర్పర్సన్ పిరియా విజయ శనివారం పరామర్శించారు. పాలకొండలోని ఆయన నివాసంలో రాజశేఖరం చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయన కుమారుడు, ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్, అతని సతీమణి ఇందుమతి రాజశేఖరం, కుమార్తె, మాజీ ఎమ్మెల్యే రెడ్డి శాంతిలకు సానుభూతి తెలిపారు. ఆమెతో పాటు మాజీ ఎమ్మెల్యే కంబాల జోగులు ఉన్నారు. 21న మెగా ఉద్యోగ మేళా శ్రీకాకుళం పాతబస్టాండ్: జిల్లాలో నిరుద్యోగులకు తీపికబురు. జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ (డీఆర్డీఏ), సీడాప్ సంయుక్తంగా ఈ నెల 21న భారీ ఉద్యోగ మేళా నిర్వహించనున్నాయి. అపోలో ఫార్మసీ, అవంతి ఫ్రోజెన్ ఫుడ్, సినర్జీస్ కాస్టింగ్ లిమిటెడ్ వంటి ప్రముఖ సంస్థలు పాల్గొని 340 ఉద్యోగాలు భర్తీ చేయనున్నట్లు డీఆర్డీఏ పథక సంచాలకుడు పి.కిరణ్‌కుమార్ శనివారం తెలిపారు. శ్రీకాకుళం ప్రభుత్వ ఐటీఐ, పాతపట్నం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఒకేరోజు ఇంటర్వ్యూలు జరుగుతాయని పేర్కొన్నారు. సినర్జీస్ కాస్టింగ్ లిమిటెడ్ కంపెనీలో ట్రైనీ టెక్నీషియన్, ఫోర్క్ లిఫ్ట్ ఆపరేటర్ పోస్టులకు 18 నుంచి 35 ఏళ్ల అభ్యర్థులు అర్హులని, ఏడాదికి రూ.1,70,000 జీతం లభిస్తుందని తెలిపారు. అపోలో ఫార్మసీలో 240 ఫార్మసిస్ట్, ఫార్మా ట్రైనర్ పోస్టులకు ఫార్మసీ, ఎస్ఎస్సీ నుంచి డిగ్రీ వరకు చదివిన అభ్యర్థులు అర్హులని, నెలకు రూ.10,500 నుంచి రూ.14,000 వరకు జీతం లభిస్తుందని వివరించారు. అవంతి ఫ్రోజెన్ ఫుడ్ కంపెనీలో ప్యాకర్స్ పోస్టులకు టెన్త్ ఉత్తీర్ణత గల మహిళా అభ్యర్థులు అర్హులని, నెలకు గరిష్టంగా రూ.13,500 జీతం లభిస్తుందని తెలిపారు. అడవి పందుల స్వైర విహారం వజ్రపుకొత్తూరు రూరల్: మండలంలోని బెండి, సీతాపురం, పెద్దబొడ్డపాడు, కొండవూరు తదితర గ్రామాల్లో అడవి పందులు స్వైర విహా రం చేస్తున్నాయి. ప్రధానంగా రాత్రి వేళల్లో ఆహారం కోసం తోటల్లో సంచరిస్తూ కొబ్బరి చెట్లను ధ్వంసం చేస్తున్నాయి. ప్రస్తుతం పంట పొలాల్లో అడవి పందులకు సరైన ఆహారం దొరకకపోవడంతో కొబ్బరి చెట్టుకున్న కందను తినేందుకు అలవాటుపడ్డాయని, దీంతో కొబ్బ రి చెట్లను ధ్వంసం చేస్తున్నాయని బాధిత రైతు లు వాపోతున్నారు. తిత్లీ తుఫాన్ ప్రభావంతో కొబ్బరి చెట్లు కూలిపోవడంతో వాటి స్థానంలో నాటిన కొబ్బరి చెట్లను నాశనం చేస్తున్నాయన్నారు. సంబంధిత అధికారులు స్పందించి నివారణ చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. పనస సీజన్ ప్రారంభం పలాస: పలాస నియోజకవర్గంలోని ఉద్దానం ప్రాంతంలో జీడి కొబ్బరి తోటల్లో అంతర పంటగా సాగవుతున్న పనసకు పలాస మార్కెట్లో మంచి గిరాకీ ఉంది. సంక్రాంతి తర్వాత ప్రతి ఏడాది ఈ పంటను రైతులు పలాస పట్టణంలో ఉన్న షావుకార్లకు ఆటోల్లో తీసుకొచ్చి కిలోల చొప్పున విక్రయిస్తుంటారు. ప్రస్తుతానికి పంట లాభసాటిగా ఉందని మాకన్నపల్లి గ్రామానికి చెందిన రైతు తెప్పల అజయ్‌కుమార్ చెప్పారు. కిలో లేత పనసకాయలు రూ.25 చొప్పున అమ్మకాలు చేస్తున్నారు. రోజుకు రెంటు టన్నులు చొప్పున ఉత్తరాది రాష్ట్రాలకు ఎగుమతి చేస్తున్నామని కాశీబుగ్గకు చెందిన పనసకాయల వ్యాపారి పాత్రో చెప్పారు. ప్రస్తుతం పలాస,మందస, వజ్రపుకొత్తూరు మండలాల నుంచి రైతులు తీసుకొని వచ్చి అమ్ముతున్నారన్నారు. ఈ సమయంలో కొనుగోలు చేసిన పనసకాయలను కూరలు, పచ్చళ్లు, ఇతర అవసరాలకు ఉత్తరాది ప్రజలు వినియోగిస్తున్నారని, మార్కెట్లో మంచి గిరాఖీ ఉంటుందని చెప్పారు. జీడి పంట సీజన్‌కు ముందు పనస, మునగ పంటలు రైతులకు ఆర్థికంగా ఆసరాగా నిలుస్తున్నాయి. ఈ డబ్బులనే జీడి పంటలో సస్య రక్షణ చర్యలకు పెట్టుబడిగా వాడుకుంటారు. ఇంటి అవసరాలకు కూడా ఉపయోగపడతాయని అమ్మకానికి వచ్చిన రైతు తెప్పల బీమయ్య చెప్పారు. -
చికిత్స పొందుతూ మహిళ మృతి
బూర్జ: మండలంలోని బూర్జ పంచాయతీ చిన్నకురింపేట గ్రామానికి చెందిన బొడ్డు యశోదమ్మ(59) శ్రీకాకుళంలోని ఒక ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం మృతి చెందింది. గ్రామస్తులు తెలిపిన వివరాల మేరకు.. ఆమెతో కలిసి 9 మంది కనుమ రోజు బుధవారం సీతంపేట మండలానికి పర్యటనకు వెళ్లారు. అక్కడ ఆడలి వ్యూ పాయింట్ సమీపంలో ఆటో అదుపు తప్పి బోల్తాపడి దెబ్బలు తగిలాయి. దీంతో 9 మందిని పాలకొండ ఏరియా ఆస్పత్రికి వైద్యం నిమిత్తం తరలించారు. వీరిలో బొడ్డు యశోదమ్మ తలకు బలమైన దెబ్బలు తగలడంతో చెవి నుంచి రక్తస్రావం జరిగింది. దీంతో మెరుగైన చికిత్స కోసం శ్రీకాకుళంలోని ఒక ప్రైవేటు ఆస్పత్రికి ఆమెను తరలించారు. కాగా అక్కడ చికిత్స పొందుతూ ఆమె మృతి చెందారు. ఆమెకు భర్త లచ్చుము, ఇద్దరు వివాహమైన ఆడపిల్లలు, ఒక కొడుకు ఉన్నారు.