ఇండియన్ ఆర్మీ కాలింగ్ సెంటర్ ముసుగులో వెలుగు చూస్తున్న మోసాలు
కేంద్రమంత్రి కింజరాపు రామ్మోహన్‌నాయుడు సహకారంతోనే ఎదిగానని ఇండియన్ ఆర్మీ కాలింగ్ నిర్వాహకుడు బసవ రమణ ప్రచారం చేసుకున్నాడు. ఆయనతో తీసుకున్న ఫొటోలు, వీడియోలను ఫేస్‌బుక్‌లు, వాట్సాప్‌లోనూ పెట్టి తనకున్న అనుబంధాన్ని, సంబంధాలను అందరికీ తెలియజేశాడు. ఆర్మీ కాలింగ్ సెంటర్‌లో చేరిన విద్యార్థులను రామ్మోహన్‌నాయుడు హాజరయ్యే కార్యక్రమాల్లో భాగస్వామ్యం చేసేవాడు.
సెంట్రల్ ఇండ్రస్టియల్ సెక్యూరిటీ ఫోర్స్ అసిస్టెంట్ కమాండెంట్ కంచరాన అవినాష్ వంటి అధికారులను ఇండియన్ ఆర్మీ కాలింగ్ సెంటర్‌కు తీసుకొచ్చి వారితో విద్యార్థులకు అవగాహన కల్పించాడు. తనకు ఎంతో పలుకుబడి ఉందని చెప్పుకునే ప్రయత్నం చేశాడు. దానికోసం ముందస్తుగా పోస్టర్లు, ఫ్లెక్సీల ద్వారా విస్తృత ప్రచారం చేశాడు.
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: ఇండియన్ ఆర్మీ కాలింగ్ రమణ మోసాలు తిలాపాపం..తలా పిడికెడు అన్నట్టుగా కనిపిస్తున్నాయి. పెద్దలతో ఏ మాత్రం పరిచయం ఏర్పడినా దాన్ని తన వ్యాపారాన్ని పెంచుకునే అస్త్రంగా రమణ వాడుకున్నాడు. కేంద్రమంత్రిని.. ‘అన్నా’ అని సంబోధిస్తూ, ఆయన అండతోనే ఎదిగానని చెబుతూ, ఆయన ఆశీస్సులుంటే మరింత ఎదుగుతానని ఫొటోలు, వీడియోలతో సహా చూ పించిన దృశాలు, రక్షణ రంగంలోని అధికారులతో నిర్వహించిన సమావేశాలు, కలెక్టర్లు, జేసీలతో చేపట్టిన కార్యక్రమాలు, ఎమ్మెల్యే, వారి కుటుంబీకులతో నిర్వహించిన ప్రైవేటు కార్యక్రమాలు, నగరంలో జరిపిన పలు ఈవెంట్లతో రమణను పలుకుబడి గల వ్యక్తిగా నమ్మించాయి. ఇదే విద్యార్థుల కొంప ముంచింది.
అసలు నిజం ఇదీ..
రాజకీయ ప్రముఖులు, ఆర్మీ అధికారులు, ఉన్నతాధికారులతో పరిచయాలను చూపించి విద్యార్థులను నిలువునా ముంచేశాడు. మాజీ మేజర్ జనర ల్ తన సంస్థకు ప్రెసిడెంట్‌గా ఉన్నారని నమ్మబలికి నిరుద్యోగ యువతను ట్రాప్ చేశాడు. ఈ ప్రచారం చూసే విద్యార్థులు ఆకర్షితులై ఉద్యోగాల కోసం రూ.3లక్షల నుంచి రూ.10లక్షల వరకు ముట్ట చెప్పేశారు. అంతటితో ఆగకుండా శిక్షణ, వసతి అని చెప్పి రూ.లక్షల్లో గుంజేశాడు. మోసం బట్టబయలు కావడంతో వారంతా లబోదిబోమంటున్నారు. శ్రీకాకుళం కేంద్రంగానే కాదు జులుమూరు కేంద్రంగా కూడా మోసం చేశాడు. రోజూ ఆయన చేతిలో మోసపోయిన వారు బయటకి వస్తూనే ఉన్నారు. ఎంత మొత్తంలో వసూలు చేశాడో లెక్క కట్టడం కూడా కష్టమవుతోంది.
జిల్లాకు వచ్చే కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు, ఐఎఫ్‌ఎస్ అధికారులు, సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ తదితరులను మర్యాద పూర్వకంగా కలిసి, వారిని మచ్చిక చేసుకుని, పలు కార్యక్రమాలకు ఆహా్వనించేవాడు. ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్‌ఎస్ అధికారులతో మోటివేషన్ కార్యక్రమాలను నిర్వహించాడు.
అధికారికంగా జరిగే ఈవెంట్లకు, ప్రైవేటు కార్యక్రమాలకు తన దగ్గర శిక్షణ పొందుతున్న విద్యార్థులను తన సైన్యంగా తీసుకెళ్లి బల నిరూపణ చేసేవాడు. ఈవెంట్ల పేరుతో పెద్ద ఎత్తున శాఖల వారీగా, ప్రైవేటు సంస్థల నుంచి నిధుల సమీకరణ కూడా చేసేవాడు.
⇒ పలువురు జర్నలిస్టులతో కూడా వెంకటరమణ చేతులు కలిపారు. వారికున్న పత్రికల్లో స్పాన్సర్ కథనాలు వండి వార్చారు. అవసరం వచ్చినప్పుడల్లా అండగా నిలిచారు. ఉన్నత స్థాయి వ్యక్తులను కలిసేందుకు ఓ జర్నలిస్టును రిఫరెన్స్‌గా వాడుకునే వాడు. పోలీసు శాఖలో పనిచేసిన కొందరు అధికారులు కూడా ఆయనకు అండగా నిలిచారన్న ఆరోపణలు ఉన్నాయి. గతంలో ఫిర్యాదులొస్తే పట్టించుకోకుండా వెంకటరమణకే వత్తాసు పలికిన ఉదంతాలున్నాయి.
భారత రక్షణ వ్యవస్థ మేజర్‌గా ఇంజనీరింగ్ విభాగంలో విధులు నిర్వర్తిస్తున్న మేజర్ పెంటకోట రవికుమార్‌ను కలిసిన ఫొటోలను చూపించి, తనకు అధికారిక పలుకుబడి ఉందని నమ్మించాడు. ఐఏఎఫ్ గ్రూప్ కెపె్టన్ పి.ఈశ్వరరావు వంటి వారితో మోటివేషన్ క్లాసులు ఇప్పించాడు.
జిల్లా కేంద్రంలో జరిగే కార్యక్రమాలకు ఎమ్మెల్యే సతీమణి జీ.స్వాతిని ఆహా్వనించి హడావిడి చేశాడు.
అకృత్యాలు.. వికృత చేష్టలు..
⇒ శిక్షణ, ఉద్యోగాల పేరుతో మోసం చేయడమే కాకుండా తన ఆర్మీ కాలింగ్ సెంటర్‌లో చేరిన విద్యార్థులను హింసించాడు.
⇒ ఏకంగా కాళ్లతో తన్ని, డేటా కేబుల్ వైర్‌తో కొడుతూ చాలామందికి నరకం చూపించాడు.
⇒ శిక్షణలో చేరిన అమ్మాయిల పట్ల అనుచితంగా ప్రవర్తించేవాడు.
⇒ రకరకాల మెసెజ్‌లు, మాటలతో ట్రాప్ చేసే ప్రయత్నం చేశాడు.
⇒ అంతటితో ఆగకుండా అమ్మాయిలున్న వసతి గృహంలో, వాష్ రూమ్‌ల్లో, పరుపులు ఉన్న రూమ్‌ల్లో సీసీ కెమెరాలు పెట్టాడు.
⇒ ఒకసారి దొరికిపోయాక అది విద్యార్థులు, వారి తల్లిదండ్రుల అనుమతితోనే పెట్టానని నమ్మించే ప్రయత్నం చేశాడు.
⇒ ∙సీసీ కెమెరాల గుట్టు బయటకు రాకుండా ఉండటానికి అమ్మాయిలను కూడా భయపెట్టాడు.
⇒ బయటకు చెబితే వీడియోలు బయటకు వస్తాయని, అసభ్యకర ఫొటోలు వెలుగు చూస్తాయని బెదిరించినట్టు ఆరోపణలు కూడా ఉన్నాయి.
⇒ రమణ కోసం ఒక్క మాటలో చెప్పాలంటే రక్షణ రంగంలో ఉద్యోగాల పేరుతో ఓ నియంతలా.. సైకోలా వ్యవహరించాడనే విషయం బాధితుల మాటల్లో స్పష్టమవుతోంది.
Comments
Please login to add a commentAdd a comment