క్యాబినెట్ మంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన ఎంపీ కింజరాపు రామ్మోహన్‌నాయుడు
తండ్రికి తగ్గ తనయుడిగా గుర్తింపు
36 ఏళ్ల వయస్సులోనే కేంద్ర మంత్రి బాధ్యతలు
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: దివంగత కింజరాపు ఎర్రన్నాయుడు తనయుడు, ఎంపీ కింజరాపు రామ్మోహన్‌నాయుడు చిన్న వయసులో పెద్ద బాధ్యతలు అందుకున్నారు. టీడీపీ నాయకులు ప్రేమగా రాము అని పిలుచుకునే రామ్మోహన్ నాయుడిని 36 ఏళ్ల వయసులోనే కేంద్ర మంత్రి పదవి వరించింది. నరేంద్ర మోదీ మూడోసారి ఏర్పాటు చేసిన ప్రభుత్వంలో ఆదివారం రాత్రి క్యాబినెట్ మంత్రిగా ఆయన ప్రమాణ స్వీకారం చేశారు. తండ్రికి తగ్గ తనయుడిగా గుర్తింపు దక్కించుకున్న రామ్మోహన్‌నాయుడు.. జిల్లాలో ఎంపీగా హ్యాట్రిక్ కొట్టారు. చంద్రబాబుతో అత్యంత సన్నిహిత సంబంధాలు ఉండటంతో ఎన్‌డీఏ ప్రభుత్వంలో ఆయనకు క్యాబినెట్ ర్యాంకు మంత్రి పదవి దక్కింది.
36 ఏళ్ల వయస్సులో..
ఎంపీ రామ్మోహన్‌నాయుడు తండ్రి ఎర్రన్నాయుడు 37 ఏళ్ల వయస్సులో కేంద్రమంత్రిగా పనిచేశారు. ఇప్పుడు తనయుడు 36 ఏళ్ల వయస్సులోనే కేంద్ర మంత్రి పదవిని అలంకరించారు. దీంతో జిల్లా నుంచి కేంద్ర మంత్రి బాధ్యతలు నిర్వర్తించిన వారి సంఖ్య మూడుకు చేరింది. 1996లో యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వంలో ఎర్రన్నాయుడు కేంద్ర గ్రామీణాభివృద్ధి, ఉపాధి కల్పనా శాఖ మంత్రిగా పనిచేశారు. 2011లో కిల్లి కృపారాణి ఐటీ, కమ్యూనికేషన్ శాఖ సహాయ మంత్రిగా పనిచేశారు. అలాగే, ఉమ్మడి శ్రీ కాకుళం జిల్లాలోని పాలకొండ, ఉణుకూరు నియోజకవర్గాలు కలిసి ఉన్న పార్వతీపురం ఎంపీగా ఎన్నికైన వైరిచర్ల కిషోర్ చంద్రదేవ్ కూడా చరణ్‌సింగ్(1979–80), మన్మోహన్ సింగ్ ప్రభుత్వం(2011–2014)లో కేంద్ర ఉక్కు, గనుల, బొగ్గు శా ఖా మంత్రిగా, గిరిజన శాఖ మంత్రిగా, పంచాయతీరాజ్ శాఖా మంత్రిగా పనిచేశారు. ఆంధ్రరాష్ట్రం ఏర్పడక ముందు పాతపట్నం లోకసభ నుంచి గెలిచిన వీవీ గిరి కూడా ఆ తర్వాత ఎన్నికైన సందర్భంలో కేంద్రమంత్రిగా పనిచేశారు.
కుటుంబ నేపథ్యం..
కేంద్ర మాజీ మంత్రి, దివంగత నేత కింజరాపు ఎర్రన్నాయుడు, విజయకుమారి దంపతులకు శ్రీకాకుళం జిల్లా నిమ్మాడలో 1987 డిసెంబర్ 18న రామ్మోహన్‌నాయుడు జని్మంచారు. ఈయనకు సోదరి భవానీ ఉన్నారు. ఈమె 2019 ఎన్నికల్లో రాజమహేంద్రవరం ఎమ్మెల్యేగా గెలిచారు. ఈయన బాబాయ్ అచ్చెన్నాయుడు గతంలో మంత్రిగా పనిచేశారు. ఎర్రన్నాయుడు టీడీపీలో కీలక నేతగా కొనసాగుతున్న సమయంలో రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో రామ్మోహన్‌నాయుడు రాజకీయ అరంగేట్రం చేశారు. మాజీ మంత్రి, విశాఖ జిల్లా టీడీపీ నేత బండారు సత్యనారాయణమూర్తి కుమార్తె శ్రావ్యను 2017లో వివాహమాడారు. వీరికి నిహిర అన్వి, శివాంకృతి అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.
విద్యాభ్యాసం
రామ్మోహన్‌నాయుడు ఒకటో తరగతి నుంచి మూడో తరగతి వరకు శ్రీకాకుళంలోని గురజాడ ఎడ్యుకేషన్ సొసైటీ హాస్టల్‌లో చదువుకున్నారు. 1994లో ఎర్రన్నాయుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం పార్టీ చీఫ్ విప్‌గా ఎన్నికవ్వడంతో హైదరాబాద్‌కు మకాం మార్చారు. దీంతో 4,5వ తరగతులు హైదరాబాద్‌లోని భారతీయ విద్యా భవన్‌లో చదువుకున్నారు. 1996 లో ఎర్రన్నాయుడు లోకసభకు ఎన్నికవ్వడంతో హైదరాబాద్ నుంచి ఢిల్లీకి కుటుంబమంతా షిఫ్ట్ అయ్యింది. దీంతో రామ్మోహన్‌నాయుడు ఆరో తరగతి నుంచి ఇంటర్ వరకు ఢిల్లీలోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్‌లో చదివారు. ఆ తర్వాత ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లి అక్కడ ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ పూర్తి చేసి, ఆ తర్వాత అక్కడే ఉన్న లాంగ్ ఐలాండ్ విశ్వవిద్యాలయంలో ఎంబీఏ కూడా చేశారు. సింగపూర్‌లో ఏడాది పాటు ఉద్యోగం చేసి తర్వాత ఢిల్లీకి వచ్చేశారు. ఢిల్లీలో ఒక ఇంటీరియర్ డెవలప్‌మెంట్ కంపెనీ మా ర్కెటింగ్ వ్యవహారాలు చూసేవారు. ఎర్రన్నాయుడు 2012లో రోడ్డు ప్రమాదంలో మరణించడంతో ఉద్యోగం మానేసి శ్రీకాకుళం వచ్చేశారు. 2014 ఎన్నికల్లో ఎర్రన్నాయుడు వారసుడిగా రాజకీయాల్లోకి ప్రవేశించి తొలిసారి శ్రీకాకుళం ఎంపీగా పోటీ చేశారు. 26 ఏళ్లకే ఎంపీగా గెలిచి చరిత్ర సృష్టించారు. అక్కడి నుంచి వరుసగా మూడు సార్లు ఎంపీగా గెలిచారు. ఇప్పుడు 36 ఏళ్ల వయస్సులో కేంద్ర మంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment