చదువుతోనే విజ్ఞానం
గ్రంథాలయ వారోత్సవాల ప్రారంభ సభలో ఎంపీ రామ్మోహన్‌నాయుడు
శ్రీకాకుళం కల్చరల్ : చదువుతోనే విజ్ఞానం సాధ్యమని శ్రీకాకుళం ఎంపీ కింజరాపు రామ్మోహన్‌నాయుడు అన్నారు. గ్రంథాలయూలు అందుకు ఎంతో దోహదం చేస్తాయన్నారు. 47వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలను జిల్లా కేంద్ర గ్రంథాలయంలో శుక్రవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో మాట్లాడుతూ గ్రంథాలయాలు ఆకర్షణీయమైన విజ్ఞాన కేంద్రాలుగా రూపొందాలన్నారు. విద్య ఔన్నత్యాన్ని చాటి చెప్పేందుకు, నిరక్షరాస్యత నిర్మూలనకు గ్రంథాలయాలను నెలకొల్పడం జరిగిందన్నారు.
పోటీ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు అనుగుణంగా వీటిని తీర్చిదిద్దాల్సి ఉందన్నారు. ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి మాట్లాడుతూ గ్రంథాలయ అభివృద్ధికి తనవంతు సహకరిస్తానన్నారు. జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి జె.కోటేశ్వరరావు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఇంటాక్ ఆధ్వర్యంలో రూపొందిన ‘హిస్టర్ అండ్ కల్చర్ ఆఫ్ కళింగ ఆంధ్రా’ పుస్తకాన్ని ఎంపీ రామమ్మోహన్‌నాయుడు ఆవిష్కరించారు.
శ్రీకాకుళం ఎస్టోన్ ఆన్ స్టోరీ పుస్తకాన్ని విద్యార్థులకు పరిచయం చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులకు డ్రాయింగ్ పోటీలు నిర్వహించారు. కార్యక్రమంలో రీడర్స్ ఫోరం అధ్యక్షుడు డాక్టర్ ఇ.యస్.సంపత్‌కుమార్, టీడీపీ నాయకులు బోయిన గోవిందరాజులు, కేవీజే రాధాప్రసాద్, ఇప్పిలి గోవిందరావు పాల్గొన్నారు.