శత్రుచర్లకు చెక్ !
ఎంపీ పర్యటనకు దూరంగా విజయరామరాజు
ఆహ్వానం లేదా? హాజరు కాలేదా?
ఎల్.ఎన్.పేట: మాజీ మంత్రి, పాతపట్నం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్‌చార్జి శత్రుచర్ల విజయరామరాజు పెత్తనానికి ఆ పార్టీ నాయకత్వం చెక్ పెట్టేసినట్లు ప్రచారం జరుగుతోంది. తాజాగా చోటుచేసుకున్న పరిస్థితులు దీనికి బలాన్ని ఇస్తున్నాయి. శ్రీకాకుళం ఎంపీ కింజరాపు రామ్మోహననాయుడు పాతపట్నం నియోజకవర్గంలోని ఎల్.ఎన్.పేట, హిరమండలం, కొత్తూరు మండలాల్లో శనివారం పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు.
అనంతరం బహిరంగ సభలు నిర్వహించారు. ఈ కార్యక్రమాల్లో ఆయనతో పాటు స్థానిక ఎమ్మెల్యే కలమట వెంకటరమణ పాల్గొన్నప్పటికీ.. నియోజకవర్గ ఇన్‌చార్జి అయిన శత్రుచర్ల మాత్రం రాలేదు. ఇతన్ని ఆహ్వానించలేదా? లేక కావాలనే రాలేదా అని స్థానికులు చర్చించుకున్నారు. 2014 సాధారణ ఎన్నికల ముందు కింజరాపు కుటుంబీకులే శత్రుచర్లను టీడీపీలోకి తీసుకురావడంతో పాటు ఎమ్మెల్యే టికెట్ కూడా ఇప్పించారని, ఇప్పుడేమో అతనికి చెక్ పెట్టేస్తున్నారని తెలుగు తమ్ముళ్లు గుసగుసలాడుకుంటున్నారు.
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డితో ఎంతో సన్నిహితుడుగా ఉండడంతోపాటు, తన రాజకీయ చరిత్రలో ఎలాంటి మచ్చలేకుండా, మకుటంలేని మహా‘రాజు’గా వెలిగిన శత్రుచర్లకు పాతపట్నం నియోజకవర్గంలో ఇలాంటి పరిస్థితులు ఎదురు కావడంతో ఆయన అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ఇతన్ని ఎందుకు పట్టించుకోవడం లేదో జిల్లా మంత్రి అచ్చెన్నాయుడు దగ్గర తేల్చుకోవడానికి కొత్తూరు, పాతపట్నం మండలాలకు చెందిన పలువురు నాయకులు సిద్ధపడుతున్నట్లు ప్రచారం జరుగుతుంది.