satrucharla vijaya rama raju
-
ద్వారపురెడ్డిపై శత్రుచర్ల ఫిర్యాదు
30మందితో కలిసి నేరుగా సీఎంతో భేటీ అక్రమాలకు పాల్పడుతున్నారని జగదీష్‌పై అభియోగం పనిలో పనిగా ఎమ్మెల్సీ పదవిని కోరిన శత్రుచర్ల టీడీపీ రాజకీయం రసకందాయంలో పడింది. కురుపాం నియోజకవర్గంలో ద్వారపురెడ్డి, శత్రుచర్ల వర్గాలు కత్తులు దూసుకుంటున్నాయి. నువ్వానేనా అన్నట్టుగా పోటీ పడుతున్నాయి. తన రాజకీయ గురువుకు జగదీష్ సవాల్ విసురుతుండగా, శిష్యుడికి చెక్ పెట్టాలని శత్రుచర్ల పావులు కదుపుతున్నారు. అమరావతిలోని సీఎం క్యాంప్ ఆఫీసుకు 30మందితో వెళ్లి చంద్రబాబునాయుడికి నేరుగా ఫిర్యాదు చేశారు. పనిలో పనిగా తనకు ఎమ్మెల్సీ పదవి ఇవ్వాలని కూడా శత్రుచర్ల కోరారు. సాక్షి ప్రతినిధి, విజయనగరం : కురుపాం నియోజకవర్గంలో ఆధిపత్యం కోసం ఎమ్మెల్సీ ద్వారపురెడ్డి జగదీష్ తొలినుంచి ప్రయత్నిస్తూనే ఉన్నారు. అదే రకంగా అవకాశాలు కలిసొచ్చాయి. తిరుగులేని నేతగా చక్రం తిప్పారు. కానీ, కొన్నాళ్లు స్తబ్దుగా ఉన్న మాజీ మంత్రి శత్రుచర్ల విజయరామరాజు దూకుడు పెంచారు. పార్టీలో పట్టు కోసం తనదైన శైలిలో పావులు కదిపారు. టీడీపీలో బలమైన వర్గంగా తయారయ్యారు. ఇది ద్వారపురెడ్డికి రుచించలేదు. శత్రుచర్ల పెత్తనానికి చెక్ పెట్టాలని వ్యూహం పన్నినా... శత్రుచర్ల సీనియారిటీ ముందు అవి పారలేదు. అనుకున్నట్టుగానే నియోజకవర్గ ఇన్చార్జ్ పోçస్టును శత్రుచర్ల దక్కించుకున్నారు. అప్పటి నుంచి నియోజకవర్గంలో తన పట్టు పెంచుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. మరి ద్వారపురెడ్డి సైతం జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ దత్తి లక్ష్మణరావు, జెడ్పీటీసీ దత్తి కామేశ్వరి, మరికొంతమంది గరుగుబిల్లి నాయకులతో శత్రుచర్లను ఢీకొడుతున్నారు. కత్తులు దూసుకుంటున్న వైరీ వర్గాలు రోజురోజుకు వీరి మధ్య అంతర్గత పోరు ఎక్కువవుతోంది. నియోజకవర్గంలో ప్రస్తుతం ఇళ్లు, పింఛన్లు ఇతరత్రా సంక్షేమ పథకాలన్నీ శత్రుచర్ల చెప్పినట్టే జరుగుతున్నాయి. జగదీష్ వర్గం దీన్ని జీర్ణించుకోలేకపోయింది. లబ్ధిదారుల ఎంపికలో శత్రుచర్ల వర్గం చేసిన అక్రమాలను బయటపెట్టే పనిలో నిమగ్నమయ్యింది. ఆధారాలతో సహా అక్రమాలను బయటపెట్టారు. దానికి కౌంటర్‌గా శత్రుచర్ల వర్గీయులు కూడా గతంలో జగదీష్ వర్గం చేసిన అక్రమాలను వెలికి తీశారు. మొత్తానికి వీరి మధ్య విభేదాలు అక్రమాల గుట్టు రట్టు చేసింది. సీఎంకు శత్రుచర్ల ఫిర్యాదు శత్రుచర్ల ఒక అడుగు ముందుకేసి ద్వారపురెడ్డిపై నేరుగా సీఎం చంద్రబాబునాయుడికి ఫిర్యాదు చేశారు. మంగళవారం అమరావతిలోని సీఎం క్యాంప్ ఆఫీస్‌కు 30మందితో కలిసి వెళ్లి జగదీష్ తీరు బాగోలేదని... అక్రమాలకు పాల్పడుతున్నారని... నియోజకవర్గంలో పార్టీని బ్రష్టు పట్టిస్తున్నారని... ఫిర్యాదులో పేర్కొన్నట్టు తెలిసింది. తనతోపాటు వచ్చిన వారందరి చేత సీఎం సమక్షంలో జగదీష్‌పై విమర్శలు, ఆరోపణలు చేసినట్టు సమాచారం. అయితే జగదీష్ దీనిపై ఎలా స్పందిస్తారో వేచి చూడాలి. ఎమ్మెల్సీ కోరిన శత్రుచర్ల ఎస్టీ రిజర్వుడు నియోజకవర్గంలో తనకు పోటీ చేసే అవకాశం ఉండదని, ఎమ్మెల్సీ తప్ప మరో ప్రత్యామ్నాయం లేదని, పార్టీ పట్టు సాధించాలంటే ఎమ్మెల్సీ పదవి తనకివ్వాలని సీఎం చంద్రబాబునాయుడ్ని శత్రుచర్ల విజయరామరాజు కోరినట్టు తెలిసింది. దీనికి సీఎం చంద్రబాబు ఎలా స్పందించారో తెలియదు గాని శత్రుచర్ల వర్గీయుల్లో మాత్రం ఆ ధీమా కన్పించలేదని పార్టీ వర్గాల ద్వారా తెలిసింది. -
మావోయిస్టులూ మనుషులే...!
మాజీ మంత్రి శత్రుచర్ల విజయరామరాజు... పార్వతీపురం: మావోయిస్టులూ మనుషులేనని.. వారైనా... తామైనా.. పేదలకోసం పనిచేసేవారేననీ మాజీ మంత్రి శత్రుచర్ల విజయరామరాజు వ్యాఖ్యానించారు. పార్వతీపురంలోని ఆయన నివాసంలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఇటీవల జరిగిన ఎన్కౌంటర్ విషయంలో ఆయన స్పందిస్తూ మావోయిస్టులూ పేదలకోసమే పనిచేస్తున్నారనీ, తామూ పేదలకోసమే పనిచేస్తామని చెప్పారు. కొమరాడ మండలంలోని తొడుము, మాదలంగి గ్రామాల మధ్య గల గుమ్మిడిగెడ్డ వద్ద రూ.7.70కోట్లతో వంతెన నిర్మాణానికి నిధులు మంజూరయ్యాయని తెలిపారు. కురుపాం నియోజకవర్గంలో 1200 వరకు ఎమ్మెల్సీ ఓట్లు నమోదు చేశామన్నారు. ఆయనతోపాటు రాష్ట్ర నీటిపారుదల అభివృద్ధి బోర్డు డెరైక్టర్ మజ్జి కృష్ణమోహన్, మున్సిపల్ వైస్ చైర్మన్ బెలగాం జయబాబు, మజ్జి వెంకటేష్, మజ్జి రాజా, పొట్నూరు వెంకటనాయుడు, డీసీఎంఎస్ జిల్లా ఉపాధ్యక్షుడు కళింగ మళ్లిబాబు తదితరులు పాల్గొన్నారు. -
శత్రుచర్లకు చెక్ !
ఎంపీ పర్యటనకు దూరంగా విజయరామరాజు ఆహ్వానం లేదా? హాజరు కాలేదా? ఎల్.ఎన్.పేట: మాజీ మంత్రి, పాతపట్నం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్చార్జి శత్రుచర్ల విజయరామరాజు పెత్తనానికి ఆ పార్టీ నాయకత్వం చెక్ పెట్టేసినట్లు ప్రచారం జరుగుతోంది. తాజాగా చోటుచేసుకున్న పరిస్థితులు దీనికి బలాన్ని ఇస్తున్నాయి. శ్రీకాకుళం ఎంపీ కింజరాపు రామ్మోహననాయుడు పాతపట్నం నియోజకవర్గంలోని ఎల్.ఎన్.పేట, హిరమండలం, కొత్తూరు మండలాల్లో శనివారం పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. అనంతరం బహిరంగ సభలు నిర్వహించారు. ఈ కార్యక్రమాల్లో ఆయనతో పాటు స్థానిక ఎమ్మెల్యే కలమట వెంకటరమణ పాల్గొన్నప్పటికీ.. నియోజకవర్గ ఇన్చార్జి అయిన శత్రుచర్ల మాత్రం రాలేదు. ఇతన్ని ఆహ్వానించలేదా? లేక కావాలనే రాలేదా అని స్థానికులు చర్చించుకున్నారు. 2014 సాధారణ ఎన్నికల ముందు కింజరాపు కుటుంబీకులే శత్రుచర్లను టీడీపీలోకి తీసుకురావడంతో పాటు ఎమ్మెల్యే టికెట్ కూడా ఇప్పించారని, ఇప్పుడేమో అతనికి చెక్ పెట్టేస్తున్నారని తెలుగు తమ్ముళ్లు గుసగుసలాడుకుంటున్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డితో ఎంతో సన్నిహితుడుగా ఉండడంతోపాటు, తన రాజకీయ చరిత్రలో ఎలాంటి మచ్చలేకుండా, మకుటంలేని మహా‘రాజు’గా వెలిగిన శత్రుచర్లకు పాతపట్నం నియోజకవర్గంలో ఇలాంటి పరిస్థితులు ఎదురు కావడంతో ఆయన అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ఇతన్ని ఎందుకు పట్టించుకోవడం లేదో జిల్లా మంత్రి అచ్చెన్నాయుడు దగ్గర తేల్చుకోవడానికి కొత్తూరు, పాతపట్నం మండలాలకు చెందిన పలువురు నాయకులు సిద్ధపడుతున్నట్లు ప్రచారం జరుగుతుంది. -
విజయరామరాజుకు చెక్ పడినట్టేనా?
►టీడీపీకి మద్దతు ప్రకటించిన ఎమ్మెల్యే కలమట ►జిల్లా పార్టీలో అప్పుడే లుకలుకలు ►మమేకం కాలేమంటున్న క్యాడర్ ►ఆగ్రహం చెందుతున్న నేతలు సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం : పాతపట్నం ఎమ్మెల్యే కలమట వెంకటరమణ తెలుగుదేశం ప్రభుత్వానికి సహకరించనున్నట్టు మంగళవారం ప్రకటించడంపై టీడీపీ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని నియోజకవర్గ ప్రజల కోరడంతోనే చంద్రబాబుకు మద్ధతు ప్రకటిస్తున్నట్టు కలమట చెప్పిన మరుక్షణం నుంచే జిల్లా టీడీపీలో లుకలుకలు మొదలయ్యాయి. తొలినుంచీ పార్టీని నమ్ముకున్న వారిని కాదని, ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండేళ్ల తరువాత కలమటను పార్టీలోకి ఎలా ఆహ్వానిస్తారంటూ ప్రశ్నించడం మొదలెట్టారు. 10యేళ్ల నుంచి ప్రతిపక్షంలో ఉండడం, వంశధార నిర్వాసితుల ఇబ్బందులు, కరకట్టల నిర్మాణం, తాగు, సాగు నీటిసమస్యలపై తనను నమ్మిన ప్రజలకు న్యాయం చేయలేకపోయానని, పార్టీ వీడుతున్నట్టు సంకేతాలు ఇచ్చిన కలమట భవిష్యత్తులో తమకు ఏ విధంగా సహకరించగలరని మెళియాపుట్టి వాసులు అటు టీడీపీ ఇటు కలమట వర్గీయుల్నీ ప్రశ్నించినట్టు తెలిసింది. నమ్మి ఓటేసిన ప్రజలు ఇప్పుడు పార్టీని వీడితే అంగీకరిస్తారా అని కూడా అడుగుతున్నారు. నియోజకవర్గ అభివృద్ధి కోసమే తాను టీడీపీకి మద్ధతిస్తున్నట్టు చెబుతున్న కలమట..ఇప్పుడు జిల్లాలో తెలుగుదేశం పార్టీ ఏం అభివృద్ధి చేసిందని, రైల్వే, కేంద్ర బడ్జెట్లో ఏం కేటాయింపులు తెప్పించారని, రాష్ట్రాభివృద్ధి కాంక్షతో ప్రత్యేక హోదా కూడా తెప్పించలేని చంద్రబాబుతో భవిష్యత్తులో ఎలా అంటకాగుతారని కలమటను ప్రశ్నించేందుకు ఆ ప్రాంత ప్రజలు సిద్ధమైనట్టు తెలుస్తోంది. శత్రుచర్లకు చెక్ చెప్పినట్టేనా? టీడీపీ పాతపట్నం నియోజకవర్గ ఇన్చార్జిగా ఉన్న శత్రుచర్ల విజయరామరాజుకు చెక్ పెట్టేందుకే కలమటను పార్టీలోకి ఆహ్వానించినట్టు టీడీపీలో ప్రచారం జరుగుతోంది. రాజు రాకను తొలినుంచీ అడ్డుకుంటున్న జిల్లా మంత్రి అచ్చెన్నాయుడు ఇటీవల అక్కడి పరిణామాలపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారని గుర్తుచేస్తున్నారు. కొత్తూరు, హిరమండలం, మెళియాపుట్టి ప్రాంతాల్లో జరుగుతున్న పనులకు సైతం రాజుకు ఆహ్వానం పంపించకపోవడం, ఎంపీ, మంత్రి కూడా అంతా తామై వ్యవహరించడం తెలిసిందే. ఇప్పుడు కలమటను పార్టీలోకి ఆహ్వానించడం ద్వారా పార్టీ ఇన్చార్జిగా ఉన్న విజయరామరాజుకు పూర్తిస్థాయిలో చెక్ పడిందనే టీడీపీలోని మరో వర్గం చెబుతోంది. చాన్నాళ్ల నుంచి తాము పార్టీలో ఉంటే..పార్టీని వీడి వెళ్లిన వ్యక్తిని ఎలా దగ్గరకు చేర్చుకుంటారని జిల్లా మంత్రికి కార్యకర్తలు అప్పుడే ఫోన్లు చేస్తున్నట్టు తెలిసింది. పాతపట్నం నియోజకవర్గంలో తాము కొత్తవ్యక్తితో మమేకం కాలేమని తెగేసి చెబుతున్నారు. ఇప్పటికే మెళియాపుట్టి మండల నేతలు పూర్తిస్థాయిలో కలమటను వ్యతిరేకిస్తున్నారు. భవిష్యత్తులో కూడా ఆయన తమ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తారనే నమ్మకం తమకు లేదని చెప్పేస్తున్నారు. ఒత్తిడి తెచ్చారా? ఒప్పుకున్నారా? తమ ప్రాంతం కొన్నాళ్లుగా అభివృద్ధికి దూరంగా ఉందని, 10గ్రామాల్లో భూములన్నీ ఇసుక మేటలు వేసి వ్యవసాయానికి పనికి రాకుండా పోయాయని చెబుతున్న కలమటకు ఆ విషయం ఇప్పుడే గుర్తుకు వచ్చిందా అని స్థానిక టీడీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. ఎవరి ఒత్తిళ్లకు లోనై పార్టీకి దగ్గరవుతున్నారంటున్నారు. నియోజకవర్గ ఇన్చార్జిల్ని కూడా పరిగణలోకి తీసుకుని టీడీపీ అధిష్టానం నిధులు మంజూరు చేస్తుండడంతో భవిష్యత్తులో ఏదో ఆశించే పార్టీలోకి వస్తున్నట్టు కలమట సంకేతాలు పంపిస్తున్నారని ధ్వజమెత్తుతున్నారు. భూములు, నగదు, అభివృద్ధి పనుల్లో వాటాలు, రానున్న కాలంలో హోదా ఆశించే ఆయన వస్తున్నారన్న విషయాన్ని అంగీకరించకుండా పార్టీ బలోపేతం అవుతుందని జిల్లా మంత్రి చెబుతుండడాన్ని తప్పుబడుతున్నారు. టీడీపీకి సహకరిస్తానని కలమట చెబుతుండడం వెనుక ఎవరి ఒత్తిళ్లు పనిచేశాయో అందరికీ తెలుసునని, కలమట స్వయంగా పార్టీకి ఆకర్షితులు కానట్టేనని చెబుతున్నారు. రాష్ట్రం రెండు ముక్కలైన తరువాత లోటు బడ్జెట్లో ఉన్న ప్రభుత్వం, నిలువనీడ లేనప్పటికీ రాష్ట్రాభివృద్ధి కోసం చంద్రబాబు ఎంతో శ్రమిస్తున్నారని కలమట చెప్పడం వెనుక ఆయన ఎలాంటి ప్రలోభాలకు గురై పార్టీకి మద్ధతివ్వాల్సి వచ్చిందో చెప్పాలని ప్రాంత వాసులు డిమాండ్ చేస్తున్నారు. -
రాజుగారింటికి వెళ్లిన మంత్రి..!
► హిరమండలం ఏఎంసీ పోస్టుపై రగడ ► ఇన్చార్జిని కాదని మంత్రి ఒత్తిళ్లు ► సీఎం వద్ద ఇతరుల గోడు ► శత్రుచర్లకే సీఎం మద్దతు సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: పొరుగూళ్లలో జిల్లా మంత్రి అచ్చెన్నాయుడు చేస్తున్న పంచాయితీలకు చెక్‌పడింది. తనకు అనుకూలురుకే పదవులు కట్టబెట్టాలని పట్టుబట్టడం... ఇతర ప్రజాప్రతినిధులను తూలనాలడం తదితర అంశాలు సీఎం దృషికి వెళ్లాయి. అన్ని విషయాల్లోనూ తలదూర్చవద్దంటూ సీఎం నేరుగా మంత్రికి మందలించినట్టు సమాచారం. హిరమండలం వ్యవసాయ మార్కెట్ కమిటీ (ఏఎంసీ) చైర్మన్ పోస్టు పదవిపై నేతల మధ్యనలుగుతున్న విభేదాలకు సీఎం ముగింపు పలికినట్టు తెలిసింది. ఇదీ కథ కొత్తూరు, హిరమండలం, ఎల్‌ఎన్‌పేట మండలాలకు సంబంధించి హిరమండలంలో మార్కెట్ చైర్మన్ పోస్టు ఖాళీగా ఉంది. ఈ పోస్టు భర్తీకి పాతపట్నం నియోజకవర్గ ఇన్చార్జి, మాజీ మంత్రి శత్రుచర్ల విజయరామరాజు కె.మన్మథరావు అనే వ్యక్తికి మద్దతిస్తూ వస్తున్నారు. ఇదే విషయాన్ని బలపరుస్తూ హైదరాబాద్‌లోని చినాబబు లోకేష్, సీఎం కార్యాలయానికీ జాబితా పంపించారు. కొన్నాళ్ల తరువాత ఈ విషయమై మళ్లీ రగడ ప్రారంభమైంది. టీడీపీ మండలాధ్యక్షుడు యాళ్ల నాగేశ్వరరావును ఏఎంసీ చైర్మన్‌గా నియమించాలంటూ ఎంపీ రామ్మోహన్నాయుడు, జిల్లా మంత్రి అచ్చెన్నాయుడు ప్రతిపాదించారు. అంతే కాకుండా దివంగత ఎర్రన్నాయుడి మనిషిగా నాగేశ్వరరావే సరైన అభ్యర్థి అంటూ ప్రచారం చేసేసి దాదాపు పోస్టును ఖరారు చేసేశారు. దీంతో విజయరామరాజు, మంత్రి అచ్చెన్నల మధ్య మాటల యుద్ధం నడిచింది. తాను చెప్పిందే వేదం అంటూ అచ్చెన్న వ్యవహరించడంపై పంచాయితీ సీఎం వద్దకు చేరింది. శత్రుచర్ల కూడా తానేమీ తక్కువ కాదంటూ మన్మథరావు పేరును ఖరారు చేస్తూ తనకు మద్ధతివ్వాల్సిందిగా పలాస ఎమ్మెల్యే శివాజీ, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంక ట్రావు, ప్రభుత్వ విప్ కూనరవి కుమార్‌లను ఆశ్రయించారు. వీరంతా కలిసి శత్రుచర్లను వెంటబెట్టుకుని సీఎం వద్దకు తీసుకువెళ్లడంతో రాజకీయాలు వేడెక్కాయి. ఇన్చార్జిదే బాధ్యత మార్కెట్ కమిటీ చైర్మన్ల నియామకాల విషయంలో స్థానిక ఇన్చార్జి/ఎమ్మెల్యేలదే బాధ్యత అంటూ సీఎం సున్నితంగా చెప్పినట్టు తెలిసింది. అంతే కాకుండా జిల్లా వ్యవహారాల్లో తలదూర్చొద్దంటూ అచ్చెన్నకు హితవు పలికినట్టు సమాచారం. రాజాం, పాలకొండ ప్రాంతాల్లో పర్యటించే సమయాల్లో అక్కడి ఇన్చార్జిల మాట వింటున్నప్పుడు పాతపట్నం విషయానికొచ్చేసరికి ఎందుకలా చేస్తున్నారంటూ అచ్చెన్నపై సీఎం చిందులేసినట్టు భోగట్టా. తక్షణం రాజుగారింటికి వెళ్లి సమస్య పరిష్కరించాలని కూడా సూచించారని సమాచారం. దీంతో ఇటీవల మంత్రి అచ్చెన్న పాతపట్నం నియోజకవర్గ ఇన్చార్జి శత్రుచర్ల ఇంటికి పరామర్శ పేరిట వెళ్లి హిరమండలం మార్కెట్ కమిటీ చైర్మన్ విషయంలో తాను తలదూర్చానని వివరణ ఇచ్చుకున్నట్టు తెలిసింది. ప్రభుత్వ విప్ సహా ఇద్దరు ఎమ్మెల్యేలు, పార్టీ జిల్లా అధ్యక్షురాలు శత్రుచర్లవైపే మొగ్గుచూపడం కూడా మంత్రి అచ్చెన్నకు కాస్త ఇబ్బందిగానే మారింది. మన్మథరావు కూడా మంచి వ్యక్తేనని, గతంలో ఎల్‌ఎన్‌పేట పీఏసీఎస్ అధ్యక్షుడిగా పనిచేసిన అనుభవం ఉందని అంతా తేల్చిచెప్పడంతో హిరమండలం ఏఎంసీ పోస్టు దాదాపు ఖరారైనట్టేనని, సమస్య కూడా ముగిసిపోయినట్టేనని టీడీపీ నేతలు ఊపిరిపీల్చుకుంటున్నారు. -
ఆందోళనలో టీడీపీ మాజీ మంత్రి వర్గం
►వాడుకుని వదిలేస్తున్నారని ► టీడీపీపై అసంతృప్తి ►జెడ్పీ చైర్‌పర్సన్‌తో ►ముప్పు తప్పదన్న భావన ► వ్యూహాత్మకంగా ► దెబ్బతీస్తున్నారన్న అనుమానం జిల్లా టీడీపీలో అసంతృప్తి సెగలు రాజుకుంటున్నాయి. ఎమ్మెల్సీ ఇవ్వలేదని కొందరు, చెప్పిన పనులు చేయడం లేదని మరికొందరు, తమకు ప్రాధాన్యం కల్పించడం లేదని ఇంకొంతమంది నేతలు ఆవేదనలో ఉన్నారు. మాజీ మంత్రి శత్రుచర్ల విజయరామరాజు వర్గీయుల పరిస్థితి ఇప్పుడిలాగే ఉంది. తమ ఉనికికే ప్రమాదం వాటిల్లుతుందేమోనని వారు ఆందోళనకు గురవుతున్నారు. వ్యూహాత్మకంగా తమను దెబ్బ తీస్తున్నారని ఆసంతృప్తి చెందుతున్నారు. సాక్షి ప్రతినిధి, విజయనగరం: అటు శ్రీకాకుళం జిల్లాలో పాతపట్నం, ఇటు జిల్లాలో కురుపాం నియోజకవర్గాలకు తమకంటూ ఒప్పందం చేసుకుని కాంగ్రెస్ నుంచి టీడీపీలోకి వచ్చిన శత్రుచర్ల విజయరామరాజు వర్గీయులు ప్రస్తుతం ఇబ్బందికర పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. గత ఎన్నికల్లో శత్రుచర్ల విజయరామరాజు, వి.టి.జనార్దన్ థాట్రాజ్ ఓటమి పాలైనప్పటికీ పార్వతీపురం నియోజకవర్గంలో టీడీపీ విజయం సాధించడానికి తమ బలమే కారణమని చెబుతున్నారు. అయితే తమకు గుర్తింపు ఉండటం లేదని బాధపడుతున్నారు. బాహాటంగా చెప్పకపోయినా.... తమకు జరుగుతున్న అన్యాయాన్ని సన్నిహితుల వద్ద చెప్పుకుని బాధపడుతున్నారు. పొరుగు జిల్లాలోని పాతపట్నం సంగతి పక్కనపెడితే కురుపాం నియోజకవర్గంలోనూ శత్రుచర్ల వర్గీయులు ఉనికి చాటుకోలేకపోతున్నారు. తమ నేతకు వస్తుందనుకున్న ఎమ్మెల్సీ రాకపోగా... జిల్లా పార్టీ అధ్యక్షుడు ద్వారపురెడ్డి జగదీష్, జెడ్పీ చైర్పర్సన్ శోభా స్వాతిరాణి నియోజకవర్గంలో పెత్తనం చేస్తుండడం వల్లే తమను ఎవరూ పట్టించుకోవడం లేదని విజయరామరాజు వర్గీయులు భావిస్తున్నారు. పార్టీ పరంగా జగదీష్ పెత్తనం చేస్తుండగా, అభివృద్ధి పనుల విషయంలో జెడ్పీ చైర్పర్సన్ హవా సాగుతోందని అభిప్రాయపడుతున్నారు. రిజర్వేషన్ పరంగా జగదీష్‌తో ఇబ్బంది ఉండకపోయినా జెడ్పీ చైర్‌పర్సన్‌తో మాత్రం తప్పనిసరిగా ముప్పు ఉంటుందని, పరిస్థితి ఇలాగే కొనసాగితే భవిష్యత్‌లో తమ పరిస్థితి ఏంటని వారు అంతర్మధనం చెందుతున్నారు. ఎస్టీ రిజర్వుడు కోటాలో కురుపాం నుంచి వచ్చే ఎన్నికల్లో పోటీ చేద్దామన్న వ్యూహాత్మక ఎత్తుగడతోనే జెడ్పీ చైర్పర్సన్ పావులు కదుపుతున్నారన్న చర్చ పార్టీ వర్గాల్లో ప్రారంభమైంది. క్రమేపి ఎదిగేందుకు, నియోజకవర్గంలో పట్టు సాధించేందుకు జెడ్పీ చైర్పర్సన్ వ్యూహాత్మక అడుగులు వేస్తున్నట్టు సమాచారం. ఆ క్రమంలో తమ వర్గాన్ని దెబ్బతీస్తున్నారన్న అనుమానంతో శత్రుచర్ల వర్గీయులు ఉన్నట్టు తెలుస్తోంది. ఇందులో భాగంగా చెప్పిన పనులు చేయడం లేదని, నియోజకవర్గ ఇన్ఛార్జ్ను సైతం ఖరారు చేయడం లేదని భావిస్తున్నారు.ఈ నేపథ్యంలో శత్రుచర్ల కేడర్ దిక్కుతోచని పరిస్థితిని ఎదుర్కొంటోంది. -
ద్వారపురెడ్డి జగదీష్‌ను టార్గెట్ చేసిన శత్రుచర్ల వర్గం
సాక్షి ప్రతినిధి, విజయనగరం : టీడీపీలో ఓ వర్గం ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు ద్వారపురెడ్డి జగదీష్‌ను టార్గెట్ చేసింది. ఎన్నికల సమయంలో జరిగిన అక్రమాలను బయటపెట్టడమే కాకుండా అధినేత చంద్రబాబునాయుడు దృష్టికి తీసుకెళ్తోంది. దీంతో జగదీష్ అంటకాగుతున్న శత్రుచర్ల వర్గం కూడా ఇరుకున పడింది. లోపాయికారీగా నడిపిన కుమ్మక్కు రాజకీయాలకు బలైన టీడీపీ నాయకులంతా జగదీష్‌పై తిరుగుబావుటా ఎగురవేశారు. అటు జగదీష్‌ను, ఇటు థాట్రాజ్‌ను లక్ష్యంగా చేసుకుని ఫిర్యాదుల పరంపర కొనసాగిస్తున్నారు. దీనికి జిల్లా కేంద్రంలో ఉన్న ఓ నేత పూర్తి సహాయ సహకారాలు అందిస్తున్నారని సమాచారం. ఎంపీటీసీ, జెడ్పీటీసీ, కౌన్సిలర్ల టిక్కెట్ల కేటాయింపులో టీడీపీ జిల్లా అధ్యక్షుడు ద్వారపురెడ్డి జగదీష్ చేతివాటం ప్రదర్శించారని అప్పట్లో పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి. పార్టీలో పెద్ద చర్చే సాగింది. కానీ, ఎన్నికలప్పుడు రచ్చకెక్కితే పార్టీకి నష్టమనే భావనతో అధిష్టానం చూసీ చూడనట్టు వదిలేసింది. మొత్తానికి ఎన్నికల్లో ఆ పార్టీ గెలవడంతో జగదీష్‌పై వచ్చిన ఆరోపణలన్నీ మరుగున పడిపోయా యి. అయితే, కొమరాడ, జియ్యమ్మవలస ఎంపీపీలతో పాటు, పార్వతీపురం వైస్ చైర్మన ఎన్నిక వ్యవహారంతో జగదీష్ వ్యవహారం మళ్లీ రచ్చకెక్కింది. ఎంపీపీ ఎన్నికలప్పుడు కూడా జగదీష్ లోపాయికారీగా వ్యవహారం నడిపించారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కొమరాడ ఎంపీపీ ఎన్నికలో టీడీపీ తరఫున గెలుపొందిన ఎంపీటీసీల అభిప్రాయం తెలుసుకోకుండా ఎమ్మెల్యే ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన వి.టి.జనార్దన్ థాట్రాజ్ చెప్పినట్టు నడుచుకున్నారని, దీనివెనుక పెద్ద ఎత్తున సొమ్ము చేతులు మారాయని ఆ పార్టీ నేతలే ఆరోపిస్తున్నారు. దీంతో ఈ ఎన్నికల్లో పార్టీ తరఫున బిఫారం ఇచ్చిన వ్యక్తిని కాకుండా టీడీపీ ఎంపీటీసీలంతా మరో వ్యక్తిని ఎంపీపీగా ఎన్నుకున్నారు. తన మాట కాదని వేరొక వ్యక్తిని ఎన్నుకుంటారా అని విప్ ధిక్కారం కింద ఎనిమిది మంది ఎంపీటీసీలపై ఫిర్యాదు చేయించారు. దీంతో వారంతా సభ్యత్వాన్ని కోల్పోయారు. జగదీష్, థాట్రాజ్ అనుసరించిన దుర్నీతికి తామంతా బలి పశువు అయ్యామని, అవతలి వ్యక్తితో ఒప్పందాలు చేసుకుని తమకు అన్యాయం చేశారని వారందరూ తిరుగుబాటు చేస్తున్నారు. చంద్రబాబునాయుడు దృష్టికి కూడా తీసుకెళ్లారు. జగదీష్‌ను టార్గెట్ చేసి ఫిర్యాదు చేశారు. జియ్యమ్మవలస ఎంపీపీ ఎన్నికల్లో కూడా జగదీష్ అదే తరహాలో వ్యవహరించారని ప్రస్తుతం పెద్ద దుమారమే రేగుతోంది. ఈ మండలంలో 15 ఎంపీటీసీ స్థానాలకు గాను టీడీపీ నుంచి ఎనిమిది మంది, ఇండిపెండెంట్లు ఆరుగురు, వైఎస్సార్సీపీ తరఫున ఒకరు గెలిచారు. టీడీపీ తరఫున గెలిచిన వాళ్లంతా మాజీ ఎమ్మెల్యే నిమ్మక జయరాజ్ వర్గీయులుగా, ఇండిపెండెంట్‌గా గెలిచిన వారంతా థాట్రాజ్ వర్గీయులుగా కొనసాగారు. ఎంపీపీ ఎన్నికల్లో థాట్రాజ్ వర్గం వ్యూహాత్మకంగా వ్యవహరించి జయరాజ్ వర్గం నుంచి ఒకర్ని లాగి ఆ వ్యక్తికే పార్టీ తరఫున బీ ఫారం తీసుకొచ్చి ఎంపీపీగా పోటీ చేయించారు. జగదీష్ తెరవెనుక పావులు కదపడం వల్లే ఇదంతా జరిగిందని టీడీపీ తరఫున గెలిచిన వాళ్లంతా భావించారు. దీంతో వారంతా పార్టీ తరపున బీ ఫారం ఇచ్చిన వారికి కాకుండా తమలో ఒకర్ని ఎంపీపీగా ఎన్నుకున్నారు. దీంతో థాట్రాజ్, జగదీష్ వ్యూహం బెడిసికొట్టింది. పార్టీ సూచించిన వారికి కాకుండా వేరొకరికి ఓటు వేస్తారా అని వారిపై విప్ ధిక్కారం కింద ఫిర్యాదు చేశారు. దీంతో వారి సభ్యత్వం రద్దయింది. దీనికంతటికీ జగదీషే కారణమని ధ్వజమెత్తుతున్నారు. లోపాయికారీగా చేసుకున్న ఒప్పందాలకు తామంతా బలి పశువులమయ్యామని వాపోతున్నారు. అంతటితో ఆగకుండా చంద్రబాబుకు ఫిర్యాదు చేశారు. దీనిపై పార్టీ దూతలు ఆరా తీస్తున్నాయి. పార్వతీపురం వైస్ చైర్మన్ ఎన్నికలో కూడా జగదీష్ అడ్డగోలుగా వ్యవహరించారని ఆ పార్టీ వర్గాలు భగ్గుమంటున్నాయి. పార్టీ జెండాను మోసిన నాయకులకు కాకుండా ఎన్నికల ముందు కాంగ్రెస్ నుంచి టీడీపీలోకి వచ్చిన నాయకుడికి వైస్ చైర్మన్ పోస్టు ఇచ్చారని మండి పడుతున్నాయి. దీని వెనుక పెద్ద కథే నడిచిందని ఆరోపణలు ఉన్నాయి. దీంతో పార్టీని నమ్ముకుని ఎన్నాళ్లగానో పనిచేసిన నాయకులంతా ఆవేదన చెందుతున్నారు. వారంతా ఓ మాజీ ఎమ్మెల్యే ద్వారా అధిష్టానానికి ఫిర్యాదు చేసేందుకు సిద్ధమవుతున్నారు. అయితే, జగదీష్‌పై ఒకేసారి అసంతృప్తి వర్గాలన్నీ రచ్చకెక్కడానికి జిల్లా కేంద్రంలో ఉన్న ఓ నేత కారణమని తెలుస్తోంది. ఎమ్మెల్సీ పదవి విషయంలో తనకు పోటీగా నిలిచారన్న ఆవేదనతో ఉన్న ఆ నేత, అదను చూసుకుని వారిని రెచ్చగొట్టారని సమాచారం. జగదీష్ వ్యవహారమంతా ఎప్పటికప్పుడు అధిష్టానానికి ఫిర్యాదు చేయించేలా తనవంతు సహాయ సహకారాలు అందిస్తున్నట్టు పార్టీ వర్గాల ద్వారా తెలిసింది. ఈయన వ్యూహం ఫలిస్తే జగదీష్‌కు ఉన్నత పదవులు దక్కడం కష్టమే. ఇక జగదీష్‌తో కలిసి కొమరాడ, జియ్యమ్మవలస మండలాల్లో లోపాయికారీ రాజకీయాలు నెరిపారన్న విమర్శలతో శత్రుచర్ల వర్గం కూడా ఇబ్బందుల్లో పడేలా ఉంది. -
అడ్డంగా దొరికిపోయిన మాజీ మంత్రి శత్రుచర్ల
హైదరాబాద్: గెలుపే లక్ష్యంగా టీడీపీ బెరితెగిస్తోంది. ఓటుకు నోటు సూత్రాన్ని ఆ పార్టీ పక్కా ఫాలో అవుతోంది. టిడిపి నేత, తాజా మాజీ మంత్రి శత్రుచర్ల విజయరామరాజు అడ్డంగా దొరికిపోయారు. విజయరామరాజు శ్రీకాకుళం జిల్లాలో స్వయంగా డబ్బు పంపకాలకు దిగారు. పాతపట్నం, ఎల్లంపేట మండలాల్లో ఒక్కొ గ్రామానికి 15 లక్షల రూపాయల చొప్పున కేటాయించారు. ఇప్పటికే ఒక్కో కుటుంబానికి రెండు వేల రూపాయల చొప్పున 40 కుటుంబాలకు డబ్బు పంపించానని విజయరామరాజు స్వయంగా చెబుతూ దొరికిపోయారు. అంతేకాదు, డబ్బును అందజేయడంలో అనుచరులు విఫలమవుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన పాతపట్నం శాసనసభ స్థానానికి టిడిపి తరపున పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. శత్రుచర్ల ప్రలోభాలకు పాల్పడుతున్నట్లు చూపే వీడియోని కూడా చూడవచ్చు. శత్రుచర్ల నిర్వాకంపై జిల్లా వాసులు మండిపడుతున్నారు. ప్రజలకు ఆదర్శంగా ఉండాల్సిన రాజకీయనేతలు చేయాల్సినది ఇదేనా అని ప్రశ్నిస్తున్నారు. చిత్తూరు జిల్లాలో చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి మండలం అల్లిమడుగు గ్రామంలో టీడీపీ వాళ్లు ఓటర్లను ప్రలోభపెడుతున్నారు. గ్రామంలోని ఎస్టీల దగ్గరికి వెళ్లి మీరు కరెంటు బిల్లులు చెల్లించాల్సిన అవసరం లేదని, వాళ్ల దగ్గర ఓ బాండు, మరో వైట్ పేపర్ మీద సంతకాలు తీసుకుంటున్నారు. సుమారు 50 మంది దగ్గర ఇలా సంతకాలు తీసుకున్నట్లు సమాచారం అందింది. మీడియా వాళ్లు అక్కడి రావడంతో టీడీపీ కార్యకర్తలు అక్కడి నుంచి జారుకున్నారు. స్థానిక టీడీపీ అభ్యర్థే ఇలా సంతకాలు సేకరించారని తెలిసింది. దీనిపై ఆయన్ను సంప్రదించగా, ఎస్టీలు కాబట్టి మీరు కరెంటు బిల్లులు కట్టక్కర్లేదని, అసలు మీటర్లు లేని వాళ్లు తీసుకోవాలని చెప్పినట్లు బుకాయించారు. ఎన్నికల సమయం దగ్గరపడుతున్న కొద్దీ టీడీపీ నేతల్లో ఓటమి భయం పెరిగిపోతున్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది. గెలుపుకి ఆఖరి అస్త్రంగా మద్యం, డబ్బులు ఎరవేస్తూ ఓటర్లను ప్రలోభాలకు గురిచేస్తున్నారు. చిత్తూరు జిల్లా సత్యవేడు నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్ధి తలారి ఆదిత్య ప్రచారంలో మద్యం ఏరులై పారుతోంది. ప్రచారానికి వచ్చిన వారికి ఫుల్లుగా మద్యం , డబ్బులు పంపిణీ చేశారు. శ్రీకాళహస్తి మాజీ ఎమ్మెల్యే ఎన్.సి.వి.నాయుడు మద్యం పంపిణీలో ప్రముఖ పాత్ర పోషిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. పశ్చిమ గోదావరి జిల్లాలో టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు పర్యటనలో తెలుగు తమ్ముళ్ళు మందుబాబులయ్యారు. పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట నియోజకవర్గంలో చంద్రబాబు ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా టిడిపి, బిజెపి కార్యకర్తలు యథేచ్ఛగా మద్యపానం చేశారు. వైన్ షాపును చుట్టుముట్టిన కార్యకర్తలు ఎగబడి మరీ మద్యం తీసుకున్నారు. ఆ తర్వాత రోడ్లపైనే సేవించారు. ఇంకొందరైతే ఓ మేడపైకి ఎక్కి చక్కగా పార్టీ చేసుకున్నారు. బాబు ప్రచారానికి రాక ముందే మందులో తూగిన తెలుగు తమ్ముళ్ళకు కొందరు కమలం సోదరులు కూడా తోడయ్యారు. అంతా కలిసి విచ్చలవిడిగా మద్యం సేవించారు. ఆలస్యంగా ఆచంట వచ్చిన బాబు అక్కడి పరిస్థితి చూసి ఏమీ ప్రసంగించకుండానే జై తెలుగుదేశం అంటూ ముందుకు సాగారు. క్రమశిక్షణకు మారుపేరుగా తమకు తాము చెప్పుకునే తెలుగుదేశం కార్యకర్తలు ఇలా తమ నిజ స్వరూపం చూపడం స్థానికులను ఆశ్చర్యానికి గురి చేసింది. -
స్వయంగా డబ్బును పంచుతున్న శత్రుచర్ల
-
గజరాజును మరిచారు !
కనికరించని శత్రుచర్ల :అటవీశాఖ మంత్రిగా పని చేసిన శత్రుచర్ల విజయరామరాజు గిరిజనుల కష్టాన్ని హరిస్తున్న ఏనుగుల విషయాన్ని కనీసం పట్టించుకోలేదు. ఆపరేషన్ గజా విఫలం కావడంతో ఇతర రాష్ట్రాల నుంచి కుంకీ ఏనుగులను తెప్పించి ఇక్కడ ఉన్న గజరాజులను వాటి ద్వారా వేరే ప్రాంతానికి తరలిస్తామని గతంలో సీతంపేటకు వచ్చిన సందర్భంగా బాలికల ఆశ్రమపాఠశాలలో విలేకరులతో మాట్లాడుతూ గిరిజనులకు హామీ ఇచ్చారు. అయితే అది అతను మాజీగా మారినా కార్యరూపం దాల్చలేదు. ఇక్కడే ఏనుగులను ఉంచి అవిసంచరిస్తున్న ప్రదేశంలో కంచె వేసేస్తామని ప్రకటించడంతో గిరిజనుల నుంచి వ్యతిరేకత రావడంతో దాన్ని విరమించుకున్నారు.అటు తర్వాత ఏమిచేయలేమని చేతులెత్తేసారు. చివరకు వచ్చిన దారిన అవే వెళ్లిపోతాయని, అవి అడవిజంతువులని, వాటిని మనం ఏమీ చేయలేమని శత్రుచర్ల సెలవిచ్చేశారు. ఉద్యానవన పంటలకు భారీ నష్టం ఏనుగుల దాడితో గిరిజనులు సాగు చేస్తున్న ఉద్యానవన పంటలకు భారీ నష్టం వాటిల్లుతోంది. ఏనుగులు వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు సుమారు మూడు వేల ఎకరాల్లో పంటలకు నష్టం ఏర్పడింది. జీడి, మామిడి, పైనాపిల్, పసుపు, అల్లం, అరటి, కొబ్బరి ఇలా అన్ని రకాల పంటపై గజరాజులు తమ ప్రతాపాన్ని చూపిస్తున్నాయి. గిరిజనులకు అందిన నష్టపరిహారం మాత్రం నామమాత్రమే. కేవలం సర్వేలు, అంచనాల పేరుతో అటవీ శాఖ కాలం గడుపుతోంది. ప్రభుత్వం కూడా ఈ విషయమై కిమ్మనడం లేదు. రెండేళ్లుగా చూస్తే సీతంపేట మండలంలోని పులిపుట్టి, చిన్నబగ్గ, హడ్డుబంగి, కొండాడ పంచాయితీల్లోనే ఎక్కువగా ఏనుగుల వల్ల నష్టం జరిగింది. గిరిజనులు ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి ఉద్యానవన పంటలను ఐటీడీఏ అభివృద్ధి చేసినప్పటీకీ ఏనుగుల పుణ్యమాని అవి నాశనమౌతున్నాయి. వీటితో పాటు చెరుకు, వరి,రాగులు వంటి పంటలను కూడా ఏనుగులు విడిచి పెట్టడం లేదు. ప్రస్తుతం నాలుగు ఏనుగుల గుంపు పులిపుట్ట పంచాయతీ పరిధిలోనే సంచరిస్తున్నాయి. మైదాన ప్రాంతాల్లో తిష్ఠ అడవుల్లో ఉండాల్సిన ఏనుగులు ప్రస్తుతం మైదాన ప్రాంతాల్లోనే సంచరిస్తున్నాయి. కొండదిగువన సంచరించడంతో గిరిజనులు ఆందోళన చెందుతున్నారు. కొండపోడు పనులకు వెళ్లే సమయంలో ఎప్పుడైనా దాడిచేస్తాయేమోనని బయాందోళన చెందుతున్నారు. కొంతమంది గిరిజనులైతే ఏకంగా పనులు మానేసి ఇంటివద్దే ఉంటుండడంతో ఉపాధి కోల్పోతున్నారు. కె.గుమ్మడ, సుందరయ్యగూడ, ఇప్పగూడ,ఆనపకాయలగూడ, మోహనకాలనీ, బిల్లుమడ, వెంపలగూడ తదితర గ్రామాలు ప్రస్తుతం ఏనుగుల ప్రభావంతో వణికిపోతున్నాయి. టేకు తోటల్లోనే పగలు ఉండి, సాయంత్రం ఐదుగంటలు దాటితే బయటకు వచ్చేసి ఆహార సేకరణలో నిమగ్నమౌతున్నాయి. స్తంభిస్తున్న జనజీవనం ఏనుగుల సంచారంతో జనజీవనం స్తంభిస్తోంది. వర్షాకాలంలో కొండలపైకి వెళ్తున్న ఏనుగులు వేసవి ప్రారంభంతోనే కిందకు వచ్చి ఆరేడు నెలలు ఉండిపోతున్నాయి. కొండల్లో చెలమల నీరు ఎండిపోవడం, సాధారణ గెడ్డలు సైతం అడుగంటడంతో ఊటగెడ్డల కోసం ఏనుగులు వెతుకుతుంటాయి. ఈ క్రమంలోనే నీటి కోసం అవి మైదాన ప్రాంతాలకు వచ్చేస్తున్నాయి. ఒకప్పుడు అడవులు దట్టంగా ఉండేవి నీటికి కొరత ఉండేది కాదు. ఇప్పుడా పరిస్థితి లేదు. కొండపోడు వ్యవసాయం పేరుతో చదును చేయడంతో చలమలు ఎండిపోయాయి. మంత్రిగా ఉన్న సమయంలో శత్రుచర్ల విజయరామరాజు ఎన్నో హామీలను గిరిజనలకు ఇచ్చేశారు. అయితే ఒక్కటికూడా కార్యరూపం దాల్చలేదు. వాటిలో కొన్ని ఇలా ఉన్నాయి. ఇతర రాష్ట్రాల నుంచి కుంకీ ఏనుగులను తెప్పించి ఇక్కడ ఏనుగులను ఒడిశాకు పంపిస్తాం. ఏనుగుల వల్ల పంటలు నష్టపోయిన గిరిజనులందరికీ పరిహారం అందజేసి ఆదుకుంటాం. అవసరమైతే ఏనుగులను జంతు ప్రదర్శనశాలకు పంపించే ఏర్పాట్లు చేస్తాం. ఏనుగులు సంచరించే ప్రాం తంలో పంటలు పోకుండా రక్షణ కంచె ఏర్పాటు చేస్తాం. ట్రాకర్ల ద్వారా ఏనుగులను వచ్చిన తోవనే ఒడిశాకు పంపించే ఏర్పాట్లు చేస్తాం. వలసలే శరణ్యం ఏనుగుల వలన తీవ్రంగా నష్టపోతున్నాం. ఎన్నో ఏళ్లుగా పంటలను నాశనం చేస్తున్నాయి. దీంతో గిరిజనులు వలసలు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. పొలానికి వెళ్లాలంటే భయంగా ఉంది. గిరిజనులకు ఎన్నాళ్లీ కష్టాలు. - సవర సుక్కమ్మ, సర్పంచ్, పులిపుట్టి నిరంతర పోరాటం ఏనుగుల సమస్యపరిష్కరించాలంటూ ఎప్పటి నుంచో గిరిజనులమంతా పోరా టం చేస్తునే ఉన్నాం. అధికారులకు వినతి పత్రాలు సమర్పించాం. ప్రభుత్వం పట్టిం చుకోలేదు. పంటలు నష్టపోతున్నా పరి హారం కూడా ఇవ్వడం లేదు. దీంతో గిరి జనులు అన్నివిధాల చితికిపోతున్నారు. ఎ.భాస్కరరావు, గిరిజన నాయకుడు -
రాజుకుంటున్న అగ్గి
సాక్షి ప్రతినిధి, విజయనగరం : మాజీ మంత్రి శత్రుచర్ల విజయరామరాజుపై టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు పూసపాటి అశోక్ గజపతిరాజు కసి తీర్చుకుంటున్నారు. జాగ్రత్తగా ఉండమని పరోక్షంగా హెచ్చరించారు. తనకిష్టం లేకపోయినా పార్టీలోకి వచ్చినందుకు పొమ్మనకుం డా పొగ పెడుతున్నారు. ప్రాదేశిక అభ్యర్థుల బీ-ఫారాలను ఆయన వర్గీయులకు ఇవ్వకుండా ఝలక్ ఇచ్చారు. దీంతో శత్రుచర్లతో పాటు ఆయన వర్గీయులంతా కంగుతి న్నారు. తీవ్ర అవమానానికి గురయ్యామని పార్టీ పెద్దల వద్ద వాపోతున్నారు. తాడో పేడో తేల్చుకోవాలని అనుచరులంతా శత్రుచర్లను డిమాండ్ చేస్తున్నారు. పార్టీలోకి రాకుండా శత్రుచర్లను నిలువరించకపోయినా తనతో పెట్టుకుంటే ఇంతేసంగతులని హెచ్చరిస్తూ అవమానాలను రుచిచూపిస్తున్నారు. మిగతా విషయాల్లో అడుగడుగునా అడ్డు తగులుతున్నారు. తనతో పాటు థాట్రాజ్‌కు ఎమ్మెల్యే టిక్కెట్ ఇవ్వాలని, లేదంటే జెడ్పీ చైర్మన్ అభ్యర్థిగా నిలబెట్టాలన్న డిమాండ్‌తో పార్టీలోకి వచ్చిన శత్రుచర్లకు అడుగడుగునా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ‘ఏరు దాటే వరకు ఏరు మల్లన్న ఒడ్డు దాటక బోడి మల్లన్న’ అన్న చందంగా పార్టీలో చేరేవరకు పాజిటివ్‌గా స్పందించిన టీడీపీ అధినేత చంద్రబాబు ఆ తర్వాత పట్టించుకోవడం మానేశారు. దీంతో శత్రుచర్ల రాకపట్ల అయిష్టంగా ఉన్న అశోక్ ఆయనకు చుక్కలు చూపిస్తున్నారు. తొలుత జెడ్పీ చైర్పర్సన్ అభ్యర్థిగా శోభా హైమావతి కుమార్తె స్వాతిరాణిని ప్రకటించి శత్రుచర్లకు ఝలక్ ఇచ్చారు. ఆ తర్వాత కురుపాం ఎమ్మెల్యే టిక్కెట్ నిమ్మక జయరాజ్‌కే ఇస్తున్నట్టు అధినేతతో భరోసా ఇప్పించి ‘రాజు’కుంటున్న అగ్గి పరోక్షంగా దెబ్బకొట్టారు. దీంతో జనార్దన్ థాట్రాజ్ పరిస్థితి రెంటికీ చెడ్డ రేవడిలా తయారైంది. ప్రాదేశిక ఎన్నికల్లో తమ బలం చూపించి, ఎమ్మెల్యే టిక్కెట్ తనకిచ్చేలా సత్తా చూపించాలన్న ఉద్దేశంతో శత్రుచర్ల ఆశీస్సులతో కురుపాం నియోజకవర్గం పరిధిలోని గరుగుబిల్లి, కొమరాడ, గుమ్మలక్ష్మీపురం, కురుపాం, జియ్యమ్మవలస మండలాల్లో తమ వర్గీయులతో థాట్రాజ్ నామినేషన్ వేయించారు. బీ-ఫారాలు తమకే వస్తాయన్న విశ్వాసంతో అభ్యర్థుల్ని బరిలోకి దించారు. అయితే నిమ్మక జయరాజ్ బరిలోకి దించిన అభ్యర్థులకే పార్టీ బీ-ఫారాలను జిల్లా నాయకత్వం అందజేసింది. దీని వెనుక అశోక్ హస్తం ఉందని స్పష్టంగా తెలుస్తోంది. పక్కా ప్లాన్‌తో శత్రుచర్లను దెబ్బకొట్టడమే కాకుండా అవమానానికి గురి చేస్తున్నట్టు స్పష్టమవుతోంది. దీంతో శత్రుచర్ల వర్గీయులు ‘దేశం’ నాయకత్వంపై మండి పడుతున్నారు. ముందుగా జిల్లా అధ్యక్షుడు ద్వారపురెడ్డి జగదీష్‌ను కలిసి తమ గోడు వినిపించారు. తమకెవరికీ బీ-ఫారాలు ఇవ్వలేదని, పార్టీలోకి వస్తే ఇచ్చే గౌరవమిదేనా అని ప్రశ్నించినట్టు తెలిసింది. అంతా విన్న జగదీష్ ఇందులో తన ప్రమేయం ఏమీలేదని, జయరాజ్‌తో మాట్లాడుతానని చెప్పడంతో వారంతా వెనుదిరిగారు. అంతటితో ఆగకుండా ఏదో ఒకటి తేల్చాలని కోరుతూ శత్రుచర్లపై ఒత్తిడి చేస్తున్నారు. పాతపట్నంలో ఉన్న శత్రుచర్ల వద్దకెళ్లి జరిగిన పరిణామాలు వివరించి, తాడోపేడో తేల్చుకోవాలన్న యోచనకొచ్చారు. ఈ నేపథ్యంలో శత్రుచర్ల ఏ రకంగా పావులు కదుపుతారన్న దానిపై ఆసక్తి నెలకొంది. అధినేత దృష్టికి తీసుకెళ్లి తమ అనుచరులకు బీ-ఫారాలను సాధిస్తారో లేదంటే బరిలో ఉన్న అభ్యర్థుల్ని రెబెల్‌గా ఉసిగొల్పుతారో చూడాలి. -
రెంటికీ చెడ్డారా?!
ఎల్.ఎన్.పేట, న్యూస్‌లైన్: కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చిన తనతోపాటే క్యాడర్ కూడా వెన్నంటి వస్తుంది.. ఇటు టీడీపీ శ్రేణులు కూడా మూకుమ్మడిగా తనకే జయజయధ్వనాలు పలుకుతారని భావించిన రాజావారికి ఆశాభంగమైంది. టీడీపీలో చేరిన తర్వాత తొలి సారి మంగళవారం పాతపట్నం నియోజకవర్గానికి వచ్చిన మాజీమంత్రి శత్రుచర్ల విజయరామరాజుకు తనవారనుకున్న కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు మొహం చాటేశారు.. మరోవైపు టీడీపీ శ్రేణుల నుంచీ పూర్తిస్థాయిలో స్వాగత సత్కారాలు లభించలేదు. మండలంలోని బొర్రంపేట నుంచి నిర్వహించిన స్వాగత ర్యాలీ చప్పగా సాగింది. టీడీపీలో తన అధిపత్యం నిరూపించేందుకు శత్రుచర్ల చేసిన ప్రయత్నాలు బెడిసికొట్టాయి. నియోజకవర్గంలోని పాతపట్నం, కొత్తూరు, ఎల్.ఎన్.పేట, హిరమండలం, మెళియాపుట్టి మండలాల నుంచి కాంగ్రెస్, టీడీపీల నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివస్తారనుకుంటే కాంగ్రెస్ శ్రేణుల జాడే కనిపించలేదు. ఎల్.ఎన్.పేట మండలానికి చెందిన ఒక్క నాయకుడైనా శత్రుచర్లకు మొహం చూపలేదు. హిరమండలం, పాతపట్నం మండలాల నుంచి కొంతమంది రాగా, కొత్తూరు, మెళియాపుట్టి మండలాల నుంచి పట్టుమని పది మంది మాత్రమే వచ్చి ఇలా మొహం చూపించి.. అలా జారుకున్నారు. ఇక మాజీమంత్రి తమ పార్టీలో చేరినా టీడీపీ క్యాడర్ ఖాతరు చేయలేదు. ఈ పార్టీలో ఇప్పటికే రెండు వర్గాలు ఉండగా.. ఒక వర్గానికి చెందినవారే ఈ కార్యక్రమంలో ప్రధాన పాత్ర పోషించారు. పాతపట్నం, మెళియాపుట్టి మండలాల నుంచి వీరి హాజరు ఒక మాదిరిగానే ఉంది. లక్ష్మీనర్సుపేట పీఏసీఎస్ అధ్యక్షుడు కాగాన మన్మధరావు, తేదేపా జిల్లా అధికార ప్రతినిధి కలిశెట్టి అప్పలనాయుడు తదితరులు మాత్రమే శత్రుచర్లకు కండువాలు, పూలమాలలు వేసి స్వాగతం పలికారు. రెండు పార్టీల నాయకులు, కార్యకర్తలు కలసి తమ నేతను గెలిపిస్తారని శత్రుచర్ల అనుచరగణం చేసిన ప్రచారం అంతా వట్టిదేనని దీనితో తేలిపోయిందన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా కాంగ్రెస్ క్యాడరంతా తన వెంటే వచ్చేస్తుందనుకున్న మాజీమంత్రి ఇది మింగుడు పడని పరిణామమే. -
చంద్రబాబుతోనే సీమాంధ్ర అభివృద్ధి: శత్రుచర్ల
హైదరాబాద్ నగరాన్ని అభివృద్ధి చేసి అంతర్జాతీయ ఖ్యాతి తెచ్చిన ఘనత తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడేదే అని తాజా మాజీ మంత్రి, పాతపట్నం ఎమ్మెల్యే శత్రుచర్ల విజయరామ రాజు తెలిపారు. సీమాంధ్రలో కొత్త రాజధాని నిర్మాణం, అభివృద్ధి అంతా చంద్రబాబు వల్లే సాథ్యమని ఆయన స్సష్టం చేశారు. ఆదివారం హైదరాబాద్‌లో శుత్రచర్ల విజయరామరాజు,ఆయన మేనల్లుడు, కురుపాం ఎమ్మెల్యే జనార్దన్ థాట్రాజ్‌లు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు సమక్షంలో టీడీపీలో చేరారు.అనంతరం శత్రుచర్ల విలేకర్లతోపై విధంగా మాట్లాడారు.అయితే చంద్రబాబు నాయుడు ఎక్కడి నుంచి పోటీ చేయమంటే అక్కడి నుంచి పోటీ చేస్తానని జనార్దన్ థాట్రాజ్ స్పష్టం చేశారు.ఎటువంటి షరతులు లేకుండా తెలుగుదేశంలో చేరుతున్నట్లు వారు ఈ సందర్బంగా తెలిపారు. -
టీడీపీలో చేరిన శత్రుచర్ల, జనార్దన్
కాంగ్రెస్ పార్టీకి ఉత్తరాంధ్రలో ఆ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి శత్రుచర్ల విజయరామ రాజు, ఆయన మేనల్లుడు, ఎమ్మెల్యే జనార్దన్ దాట్రాజ్లు గుడ్ బై చెప్పారు. ఆదివారం హైదరాబాద్ ఎన్టీఆర్ భవన్లో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు సమక్షంలో ఆ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనపై కాంగ్రెస్ పార్టీ అనుసరించిన వైఖరిపై సీమాంధ్రలో ప్రజలు తీవ్ర ఆగ్రహ జ్వాలలతో రగిలిపోతున్నారు. రానున్నఎన్నికలలో ఆ ప్రాంతంలో కాంగ్రెస్‌కు డిపాజిట్లు కూడా రాని పరిస్థితి నెలకొంది. దాంతో సీమాంధ్రలోని అన్ని జిల్లాలలో నిన్న మొన్నటి నేతల నుంచి సీనియర్ నేతలు వరకు అంతా కాంగ్రెస్ వీడాలని ఆలోచిస్తున్నారు. అందులోభాగంగా సీమాంధ్ర జిల్లాల నుంచి ఏరాసు ప్రతాప్ రెడ్డి, టి.జి.వెంకటేష్,గంటా శ్రీనివాస్ రావు, గల్లా అరుణకుమారిలు ఇప్పటికే కాంగ్రెస్ పార్టీని వదిలి టీడీపీలో చేరిన సంగతి తెలిసిందే. కాంగ్రెస్ పార్టీలో ఉంటే ఉత్తరాంధ్ర రాజకీయ చిత్రంలో తాము కనుమరుగు కాక తప్పదని శత్రుచర్ల, జనార్దన్ నిర్ణయానికి వచ్చారు. ఈ నేపథ్యంలో వారి స్వగ్రామమైన చిన్న మేరంగిలో కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. భవిష్యత్తు కార్యాచరణపై ఈ సందర్భంగా చర్చించారు. తెలుగుదేశంలో చేరితే కనీసం భవిష్యత్తు అయినా ఉంటుందని కార్యకర్తలు సూచించడంతో శత్రుచర్ల, జనార్దన్ థాట్రాజ్లో ఆదివారం టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. -
చంద్రబాబు ఝలక్!
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం : జిల్లా టీడీపీపై ఆధిపత్యం తమదేనని భావిస్తున్న కింజరాపు కుటుంబానికి చంద్రబాబు ఝలక్ ఇచ్చారు. కింజరాపు శిబిరం ఎంతగా వద్దని చెబుతున్నా మాజీ మంత్రి శత్రుచర్ల విజయరామరాజును పార్టీలో చేర్చుకోవాలని నిర్ణయించేశారు. అదీ కింజరాపు కుటుంబానికి కనీస సమాచారం ఇవ్వకుండానే.! ఎన్నికల ప్రచారంలో దూసుకుపోవాలని భావిస్తున్న రామ్మోహన్నాయుడు, అచ్చెన్నాయుడులకు ఈ పరిణామం షాకిచ్చిం ది. తాజా పరిస్థితి వారికి ఏమాత్రం మింగుడు పడటం లేదు. జిల్లా టీడీపీపై కింజరాపు వర్గం కోల్పోతున్న పట్టుకు.. కళా వెంకట్రావుకు పెరుగుతున్న ప్రాధాన్యానికి నిదర్శనంగా నిలుస్తున్న తాజా పరిణామం కథా కమామిషు ఇలా ఉంది.. అమ్మో.. శత్రుచర్లా!.. వద్దే వద్దు పాతపట్నం ఎమ్మెల్యే టిక్కెట్టును ఆశిస్తున్న శత్రుచర్లను పార్టీలో చేర్చుకోవాలన్న ప్రతిపాదనను కింజరాపు రామ్మోహన్నాయుడు, అచ్చెన్నలు ఆది నుంచి తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. సామాజికవర్గ సమీకరణల దృష్ట్యా శ్రీకాకుళం లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో పాతపట్నానికి ఎంతో ప్రాధాన్యం ఉంది. శత్రుచర్ల రాకవల్ల పాతపట్నం అసెంబ్లీ నియోజకవర్గంలో సామాజిక సమీకరణలు తమకు వ్యతిరేకమవుతాయని కింజరాపు కుటుంబం ఆందోళన చెందుతోంది. ప్రధానంగా కాపు సామాజికవర్గాన్ని దాదాపు దూరం చేసుకోవాల్సి వస్తుంది. అందుకే రామ్మోహన్, అచ్చెన్నలు శత్రుచర్ల రాకను ఏమాత్రం అంగీకరించడం లేదు. మరోవైపు తమ రాజకీయ ప్రత్యర్థి కళా వెంకట్రావుతో శత్రుచర్ల సన్నిహిత సంబంధాలు నెరుపుతుండటం వారి ఆందోళనను తీవ్రం చేస్తోంది. దీనిపై తమ వ్యతిరేకతను అధినేత చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్లారు కూడా. కానీ వారి ప్రయత్నాలు ఫలించలేదు. కింజరాపు శిబిరానికి సమాచారం లేకుండానే.. చివరికి.. కింజరాపు కుటుంబం భయపడినంతా అయింది. శత్రుచర్ల చేరికకు చంద్రబాబు పచ్చజెండా ఊపారు. ఆయన శనివారం హైదరాబాద్‌లో టీడీపీలో చేరనున్నారు. కానీ ఈ విషయమై కింజరాపు శిబిరానికి కనీస సమాచారం కూడా లేకపోవడం గమనార్హం. అచ్చెన్నాయుడు, రామ్మోహన్లకు పార్టీ ఈ విషయాన్ని చెప్పనే లేదు. అంతేకాదు జిల్లా పార్టీ అధ్యక్షుడు చౌదరి బాబ్జీకి కూడా కనీసం సమాచారం అందించకపోవడం చర్చనీయాం శంగా మారింది. కింజరాపు కుటుంబానికి బాబ్జీ సన్నిహితుడు కావడం గమనార్హం. అంటే కింజరాపు వర్గాన్ని ఏమాత్రం పట్టించుకోకుండా శత్రుచర్లను చేర్చుకోవాలని చంద్రబాబు నిర్ణయించినట్లు స్పష్టమవుతోంది. ఈ పరిణామంతో కింజరాపు శిబిరం పూర్తిగా నిసృ్పహకు గురైంది. జిల్లా పార్టీపై తమ ఆధిపత్యం కొనసాగదని స్పష్టం కావడంతో ఏం చేయాలో వారికి పాలుపోవడం లేదు. పాతపట్నం అసెంబ్లీ నియోజకవర్గంతోపాటు శ్రీకాకుళం లోక్‌సభ స్థానంపై కూడా ఆశలు వదులు కోవాల్సిందేనా అని కలవరపడుతోంది. -
శత్రు‘చెర’ వీడి..!
తాను ఏం చేసినా.. ఏం చెప్పినా.. అనుచరగణం జీ హుజూర్.. అంటారన్న బోల్డంత నమ్మకంతో రాజుగారు తెరవెనుక ఏర్పాట్లు చేసేసుకున్నారు. టీడీపీ నాయకత్వంతో ఒప్పందం కుదుర్చుకొని.. తన వర్గాన్నంతటినీ అందులో కలిపేయాలని నిర్ణయించేసుకున్నారు. ఆనక తీరిగ్గా.. కార్యకర్తల నిర్ణయం కోసమంటూ సమావేశం ఏర్పాటు చేశారు. అయితే మూడు దశాబ్దాలుగా టీడీపీతో పోరాడుతున్న తమను ఆ పార్టీకే తాకట్టు పెట్టడాన్ని సహించలే కపోయిన నేతలు ఎదురుతిరిగారు. పచ్చ చొక్క వేసుకోలేమని.. తమ నిర్ణయాన్ని తెగేసి చెప్పారు. మూకుమ్మడిగా సమావేశాన్ని బహిష్కరించి శత్రుచర్లకు ఊహించని రీతిలో షాక్ ఇచ్చారు. పాతపట్నం, న్యూస్‌లైన్: ‘టీడీపీలో చేరాలన్న మీ నిర్ణయం మాకు సమ్మతం కాదు.. అలా అయితే మా దారి మేం చేసుకుం టాం’.. అని మాజీ మంత్రి శత్రుచర్ల విజయరామరాజుకు ఆయన ప్రధాన అనుచరగణం తేల్చిచెప్పింది. దీంతో భారీ అనుచరగణంతో టీడీపీలో చేరాలన్న శత్రుచర్లకు శృంగభంగం ఎదురైంది. పాతపట్నం నియోజకవర్గంలో ఐదేళ్లుగా తనతో కలసి పనిచేసిన నేతలు, కార్యకర్తలతో ఆయన ఒడిశాలోని పర్లాకిమిడిలో మం గళవారం సమావేశం నిర్వహించారు. సమావేశం ప్రారంభమైన కాసేపటికే శత్రుచర్ల తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కోవాల్సి వచ్చింది. ఆయన ప్రధాన అనుచరుడు, మెళియాపుట్టి మాజీ ఎంపీపీ సలాన మోహనరావు తన అభిప్రాయాన్ని కుండబద్దలు కొట్టారు. ఆరు నూరైనా తాము టీడీపీలో చేరేదిలేదని తేల్చిచెప్పారు. టీడీపీకి తామంతా వ్యతిరేకమని తేల్చిచెబుతూ సలాన మోహనరావుతోపాటు మెళియాపుట్టి మండలానికి చెందిన 24 మంది సర్పంచులు, ఇతర ముఖ్యనేతలు, పెద్దసంఖ్యలో కార్యకర్తలు సమావేశాన్ని బహిష్కరించారు. వారంతా ‘జైజగన్... జై వైఎస్సార్ కాంగ్రెస్’ అని నినాదాలు చేసుకుంటూ సమావేశం నుంచి వెళ్లిపోవడం ప్రాధాన్యం సంతరించుకుంది. టీడీపీలో చేరాలన్న శత్రుచర్ల నిర్ణయాన్ని తాము వ్యతిరేకిస్తున్నామని సలాన మోహనరావు తనయుడు వినోద్ కుమార్ ఆ తర్వాత విలేకరులకు వెల్లడించారు. ముగిసిన తంతు సలాన వర్గం దెబ్బతో శత్రుచర్ల కంగుతిన్నారు. దాంతో సమావేశాన్ని తూతూ మంత్రంగా ముగించేశారు. కేవలం కొంతమందితో మాట్లాడించేసి మమ.. అనిపించారు. కొందరు సర్పంచులు మాట్లాడుతూ తాము రెండు రోజుల తరువాత నిర్ణయాన్ని చెబుతామని చెప్పి జారుకున్నారు. కేవలం వేళ్ల మీద లెక్కపెట్టగలిగే సంఖ్యలో నేతలు మాత్రమే శత్రుచర్ల వెన్నంటి ఉంటామన్నారు. పాతపట్నం పీఏసీఎస్ అధ్యక్షుడు మిర్యబెల్లి శ్యాం సుందరరావు మాట్లాడుతూ తనకు రెండేళ్ల తరువాత లభించే అవకాశమున్న డీసీసీబీ చైర్మన్ పదవినైనా వదులుకుంటాను గానీ శత్రుచర్లను మాత్రం వదులుకోలేనన్నారు. వీలైతే టీడీపీలోకి..లేదా రాజకీయ సన్యాసం: శత్రుచర్ల చివరగా శత్రుచర్ల మాట్లాడుతూ వీలైతే టీడీపీలో చేరుతానని తన నిర్ణయాన్ని ప్రకటించారు. లేకుంటే రాజకీయ సన్యాసం తీసుకుంటానన్నారు. సోనియా గాంధీ చేసిన రాష్ట్ర విభజన వల్ల సీమాంధ్రలో కాంగ్రెస్ మరో 20 ఏళ్లు కోలుకోలేదన్నారు. సోనియా చుట్టూ ఉన్న భజనపరులైన నాయకులే ఈ దుస్థితికి కారణమన్నారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ చంద్రబాబు వల్లే రాష్ట్రంలో అభివృద్ధి జరిగిందన్నారు. టీడీపీలో చేరాలని కొందరు తనకు సూచించారన్నారు. రాజకీయాల్లో కొనసాగితే టీడీపీలో చేరుతానన్నారు. లేకపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటానని చెప్పారు. ఈ సమావేశంలో పాతపట్నం పీఏసీఎస్ అధ్యక్షుడు మిర్యబెల్లి శ్యాంసుందరరావు, పాతపట్నం ఏఎమ్‌సీ చైర్మన్ లింగాల జనార్ధన, కొత్తూరు ఏఎమ్‌సీ చైర్మన్ గోగుల చల్లంనాయు డు, ఎల్‌ఎన్‌పేట జెడ్పీటీసీ మాజీ సభ్యుడు శివాల తేజేశ్వరరావు, కొత్తూరు మండల పరిషత్ మాజీ అధ్యక్షుడు అగతముడి బైరాగి నాయుడు, హిరమండ లం ముఖ్య నాయకులు అందవరపు రమేష్, సురేష్, పాతపట్నం ఎంపీపీ మాజీ అధ్యక్షుడు నూర్తి దాల య్య, ఇతర నాయకులు, సర్పంచులు పాల్గొన్నారు. -
నాయుడు బాబు నిమ్మక ద్రోహం!
సాక్షి ప్రతినిధి, విజయనగరం: టీడీపీలో శత్రుచర్ల చేరిక విషయంలో జరుగుతున్న హైడ్రామాకు తెరపడే సమయం ఆసన్నమయ్యింది.చంద్రబాబు కోటరీ నాయకుడైన కంభంపాటి రామ్మోహనరావు ద్వారా శత్రుచర్ల చేసిన ప్రయత్నాలు ఫలిస్తున్నట్లు కనిపిస్తున్నాయి. తనకు శ్రీకాకుళం జిల్లా పాతపట్నం అసెంబ్లీ, మేనల్లుడు జనార్దన్ థాట్రాజ్‌కు కురుపాం అసెంబ్లీ టిక్కెట్ వచ్చేలా దాదాపుగా ఆయనకు ఆమోదం దొరికినట్లు తెలిసింది. పాతపట్నం నియోజకవర్గానికి సరైన అభ్యర్థి లేరన్న కారణంతో శత్రుచర్లను తీసుకోవడమే కాకుండా ఆయన కోరిన మేరకు కురుపాం టిక్కెట్ కేటాయించేందుకు బాబు సిద్ధమైనట్టు సమాచారం. ఈమేరకు మంగళవారం రాత్రి వరకు సంప్రదింపులు జరిగినట్టు తెలిసింది. ఒకటి రెండు రోజుల్లో నిర్ణయం వెలువడే అవకాశం ఉంది. అదే జరిగితే పాపం నిమ్మక జయరాజ్ పరిస్థితి ఏమి టంటూ పార్టీ కేడర్ అగమ్యగోచరంగా ఉన్నారు. చెల్లుబాటు కాని అశోక్ మాటలు పార్టీ సీనియర్ నేత అశోక్ గజపతిరాజు మాట చెల్లుబాటు కావడం లేదు. ఆయనకు ఇష్టం లేకపోయినా ఎంపీగా పోటీ చేయిస్తున్నారు. పార్టీ అవసరాల దృష్ట్యా పోటీ చేయాల్సిందేనన్న అధినేత ఆదేశాలు కాదనలేని పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. అశోక్ అంతగా ఆసక్తి చూపని మీసాల గీతను పార్టీలోకి ఆహ్వానించారు. ఇలా ఎప్పటికప్పుడు చంద్రబాబు తీసుకుంటున్న మింగుడు పడని నిర్ణయాలతో అశోక్ కాస్త ఆవేదనకు లోనవుతున్నా అధికారమే లక్ష్యంగా ఉండడంతో బయటపడలేకపోతున్నారని పార్టీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. శ్రీకాకుళం జిల్లా పాతపట్నం టిక్కెట్ ఇచ్చినా శత్రుచర్లకు ఇచ్చినా అభ్యంతర లేదని, కురుపాం టిక్కెట్‌ను ఎట్టి పరిస్థితుల్లో థాట్రాజ్‌కు ఇవ్వొద్దని అశోక్ వ్యతిరేకించినా చంద్రబాబు వినిపించుకోవడం లేదని తెలిసింది. ఎవరెన్ని చెప్పినా అనవసరమని, పాతపట్నం కోసం కురుపాం టిక్కెట్‌ను త్యాగం చేయాల్సిందేనని చంద్రబాబు నిర్ణయించుకున్నట్టు సమాచారం. ఒకే దెబ్బకు రెండు పిట్టలు అన్నట్టుగా కురుపాం టిక్కెట్‌పైనే కాకుండా పార్వతీపురం మున్సిపాల్టీపై కూడా శత్రుచర్ల కన్నేసినట్టు తెలిసింది. ఇప్పటికే ఆ పదవిపై ఎన్నో ఆశలు పెట్టుకున్న ద్వారపురెడ్డి జగదీష్‌కు షాక్ ఇచ్చే యత్నం జరుగుతోంది. పార్వతీపురంలో ఓ కౌన్సిలర్ స్థానం నుంచి మాజీ మున్సిపల్ చైర్పర్సన్ నర్సింహా ప్రియ థాట్రాజ్‌ను బరిలో దించాలని యోచిస్తున్నారు. అదే జరిగితే అటు కురుపాం నియోజకవర్గంలోనూ, ఇటు పార్వతీపురం మున్సిపాల్టీలో టీడీపీ రాజకీయం రసకందాయంలో పడనుంది. ఈ నేపథ్యంలో పౌరుషానికి పోయి అశోక్ తన ఉద్వేగాన్ని బయట పెడితే ఎలాంటి పరిస్థితులకు దారితీస్తుందో చూడాలి. -
శత్రుచర్లకు థా‘ట్రాజ్డీ’!
శత్రుచర్లకు ఎప్పుడూ లేని అత్యంత అవమానకర పరిస్థితులు ఎదురవుతున్నాయి. కురుపాం నియోజకవర్గంలో మంచి పట్టు ఉండి, పార్వతీపురం నియోజకవర్గంలో ప్రభావం చూపగల నేత, సుదీర్ఘరాజకీయ అనుభవం ఉన్న విజయరామరాజు ఇప్పుడు మూడురోడ్ల కూడలిలో నిలబడి ఎవరు పిలుస్తారా అని ఎదురుచూడవలసిన పరిస్థితి దాపురించింది. మేనల్లుడు వి.టి.జనార్దన్ థాట్రాజ్‌కు టిక్కెట్ ఇవ్వాలన్న షరతు ఆయనకు హర్డిల్గా మారింది. మరో వైపు చంద్రబాబు ఆహ్వానించినా ‘దేశం’లోకి ప్రవేశించకుండా ఆయన శత్రువులు ఎక్కడికక్కడ కందకాలు తవ్వుతున్నారు. సాక్షి ప్రతినిధి, విజయనగరం: వైఎస్సార్ సీపీలో బెర్త్ ఖాళీ లేకపోవడంతో రాజకీయ భవిష్యత్ కోసం మాజీ మంత్రి శత్రుచర్ల విజయరామరాజు పడరాని పాట్లు పడుతున్నారు. మరో ప్రత్యామ్నాయం లేకపోవడంతో రకరకాల ఆలోచనలతో టీడీపీలోకి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. కానీ అక్కడ కూడా మేనల్లుడి రూపం లో ఆయనకు అడ్డంకులు ఎదురవుతున్నాయి. నిన్నటి వరకు అశోక్ వ్యతిరేకించగా, ఇప్పుడు శోభా హైమావతి మోకాలడ్డుతున్నారు. దీంతో పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు జుట్టు పీక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. తనకు పాతపట్నం టిక్కెట్, తన మేనల్లుడు వి.టి.జనార్దన్ థాట్రాజ్‌కు కురుపాం టిక్కెట్ ఇవ్వాలన్న డిమాండ్‌కు మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు అడ్డుకట్ట వేసిన విషయం తెలిసిందే. పాతపట్నం టిక్కెట్ ఇస్తే అభ్యంతరం లేదు గానీ కురుపాం టిక్కెట్ ఇస్తే బాగుండదని అశోక్ కరాఖండిగా చెప్పేయడంతో శత్రుచర్ల రూటు మార్చారు. సార్వత్రిక ఎన్నికలకు ముందే జిల్లా పరిషత్ ఎన్నికలు రానుండటంతో చైర్పర్సన్ పదవిపై కన్నేసి, పార్టీ గెలిస్తే ఆ పోస్టును థాట్రాజ్ కుటుంబీకులకు ఇవ్వాలని ఆప్షన్ పెట్టారు. ఆ మేరకు చంద్రబాబుతో సంప్రదింపులు చేస్తున్నారు. అయితే, ఇప్పుడా పోస్టుపై శోభా హైమావతి కన్ను పడింది. ‘ఎస్.కోట అసెంబ్లీ టిక్కెట్ అక్కర్లేదు. అరకు పార్లమెంట్ టిక్కెట్ కూడా నా కుమార్తెకు ఇవ్వొద్దు. జెడ్పీ చైర్పర్సన్ రేసులో నిలబెడితే చాలు’ అంటూ కొత్త పల్లవి ఎత్తుకున్నారు. గతమంతా తూచ్ అనేసి, చైర్పర్సన్ రేసులో ఉంచితే అది పదివేలు అనే పరిస్థితికి శోభా హైమావతి వచ్చారు. ఆ మేరకు అధిష్టానంపై ఒత్తిడి పెంచారు. తన కుమార్తెకు చైర్పర్సన్ పదవి ఇస్తే డీవీజీ శంకరరావుకు న్యాయం జరుగుతుందని, అరకు పార్లమెంట్‌కు పోటీ చేయడానికి అడ్డంకులు తొలగిపోతాయని వల్లమాలిన ప్రేమ ఒలకబోస్తున్నారు. ఈ క్రమంలో ఎస్.కోట ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారితో సంప్రదింపులు చేసి, జిల్లాలోని మిగతా నాయకుల మద్దతు కూడగడుతున్నారు. రహస్య సమావేశాలు ఏర్పాటు చేసుకుంటున్నారు. అవసరమైతే చంద్రబాబును కలిసేందుకు హైదరాబాద్ వెళ్లాలని భావిస్తున్నారు. శత్రుచర్లపై ఇప్పటికే అసంతృప్తితో ఉన్న అశోక్ కూడా శోభా హైమావతి డిమాండ్‌కు మద్దతు పలుకుతున్నట్టు తెలిసింది. పార్టీ కేడర్ కూడా అసంతృప్తిని వ్యక్తం చేస్తోంది. ఇన్నాళ్లూ పార్టీ కోసం కష్టపడ్డ వారిని కాకుండా రాత్రికి రాత్రి వచ్చే నాయకుల డిమాండ్లకు ఎలా తలొగ్గుతారని నినదిస్తున్నారు. దీంతో చంద్రబాబు ఇరకాటంలో పడ్డారు. ఏదో ఒక రకంగా శత్రుచర్లను చేర్చుకుందామనని సంప్రదింపులు చేస్తుంటే ఆటంకాలు ఎదురవుతున్నాయని అంతర్మధనం చెందుతున్నట్టు తెలిసింది. శత్రుచర్ల చేరికపై ఆ పార్టీలో రోజుకో డ్రామా నడుస్తోంది. చంద్రబాబు ఆలోచనకు భిన్నంగా కేడర్ వ్యవహరిస్తోంది. మరి అధినేత ఏ నిర్ణయం తీసుకుంటారో, కేడర్ ఏ విధంగా స్వీకరిస్తుందో చూడాలి. ఏదైనా శత్రుచర్ల వ్యవహారం టీడీపీలో తలనొప్పిగా మారింది. -
అశోక్ + కళా
సాక్షి ప్రతినిధి, విజయనగరం: మాజీ మంత్రి శత్రుచర్ల విజయరామరాజు టీడీపీలో చేరిక కోసం..ఆ పార్టీ సీనియర్ నేతలు పూసపాటి అశోక్ గజపతిరాజు, కిమిడి కళా వెంకటరావు మధ్య చిచ్చు రేగుతోంది. ఈ విషయంలో పంతానికి పోయిన ఆ ఇద్దరు నేతలూ అంతర్గతంగా కత్తులు నూరుకుంటున్నారు. ఈ జిల్లాలో ఆయన పెత్తనమేంటని అశోక్, సిక్కోలులో కింజరాపు వర్గం ఆధిపత్యానికి చెక్ పెట్టేందుకు కళా వెంకటరావు ఎత్తుకుపై ఎత్తులు వేస్తుండడంతో టీడీపీలో పక్కపక్క జిల్లాల నేతల మధ్య అంతర్గతపోరు ము దురుతోంది. శత్రుచర్లను పార్టీలోకి తీసుకోవద్దని అశోక్ అంటుంటే.. శత్రుచర్లను చేర్చుకుంటే పార్టీకి మంచిదని కళా వెంకటరావు అధినేతకు నూరిపోస్తున్నారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో కాంగ్రెస్ ప్రతిష్ట దిగజారడంతో మాజీ మంత్రి శత్రుచర్ల విజయరామరాజు పక్క చూపులు చూస్తున్న విషయం తెలిసిందే. వైఎస్ఆర్సీపీలో బెర్త్ ఖాళీ లేకపోవడంతో కొంతకాలంగా ఆయన టీడీపీతో మంతనాలు జరుపుతున్నారు. శ్రీకాకుళం జిల్లా పాతపట్నం శాసనసభ నియోజకవర్గం టిక్కెట్ తనకు, జిల్లాలోని కురుపాం టిక్కెట్ తన మేనల్లుడు వీటీ.జనార్దన్ థాట్రాజ్‌కు ఇవ్వాలంటూ అయన బేరసారాలు ఆడుతున్నారు. ఈ క్రమంలో లోపాయికారీ వ్యూహంతో శత్రు చర్ల విజయరామరాజుకు కిమిడి కళా వెంకటరావు అండగా నిలిచారు. శత్రుచర్లను తన వైపు తిప్పుకుంటే శ్రీకాకుళం జిల్లాలో దివంగత నేత కింజరాపు ఎర్రంనాయుడు వర్గం ఆధిపత్యానికి చెక్ పెట్టొచ్చన్న ఎత్తుగడతో అధినేతతో కళా వెంకటరావు రాయబారాలు నెరిపారు. దీన్ని పసిగట్టిన కింజరాపు వర్గం ఊరుకుంటారా..? వెంటనే అప్రమత్తమై ముల్లును ముల్లుతోనే తీయాలన్న సిద్ధాంతంతో రెండు జిల్లాల్లో చక్రం తిప్పేందుకు కళా అనుసరిస్తున్న వ్యహాన్ని మొగ్గలో తెంచేయాలని పథక రచన చేశారు. ఈమేరకు పూసపాటి అశోక్ గజపతిరాజును కింజరాపు వర్గం కలిసినట్టు తెలిసింది. కురుపాంలో తన అనుచరునిగా జనార్థన్ థాట్రాజ్‌ను, శ్రీకాకుళం జిల్లాలో శత్రుచర్ల విజయరామరాజును చేతిలో పెట్టుకుని చక్రం తిప్పాలన్న దుర్నీతితో వ్యవహరిస్తున్నారని కళా వెంకటరావుపై అశోక్‌కు ఫిర్యాదు చేసినట్టు కూడా తెలిసింది. దీంతో అశోక్ మేల్కొని, అన్నీ ఆలోచించి శత్రుచర్లను తీసుకోవద్దని చంద్రబాబుకు బాహాటంగానే చెప్పేసినట్టు తెలిసింది. వాస్తవానికైతే పార్టీలోకి శత్రుచర్ల రాకపై అశోక్‌కు అంత ఆసక్తి లేదు. తన బంధువైన వైరిచర్ల కిషోర్ చంద్రదేవ్ కుటుంబానికి శత్రుచర్ల చిరకాల ప్రత్యర్థి కావడం, పార్టీ చెప్పినట్టు వినే నిమ్మక జయరాజుకు అన్యాయం జరుగుతుందన్న ఉద్దేశంతో ఆయన రాకపై ఆదిలోనే అభ్యంతరం తెలిపినట్టు తెలిసింది. అంతేకాకుండా శత్రుచర్ల చేరిక విషయమై చంద్రబాబుతో సంప్రదింపులు చేసేందుకు వెళ్లిన జిల్లా అధ్యక్షుడు ద్వారపురెడ్డి జగదీష్‌తో కరాఖండిగా కొన్ని విషయాలు చెప్పేశారు. గతంలో మన పార్టీ తరఫున ఎంపీగా గెలిచి కాంగ్రెస్ ప్రధానమంత్రి పీవీ నర్సింహారావుకు అనుకూలంగా పార్లమెంట్లో ఓటేసి మచ్చ తెచ్చారని, అలాంటి వ్యక్తిని ఎలా తీసుకువస్తారని నిర్మొహమాటంగా చెప్పడమే కాకుండా చంద్రబాబుకు ఇదే విషయాన్ని తెలియజేయాలని గట్టిగా చెప్పినట్టు సమాచారం. దీంతో జగదీష్ వెనక్కి తగ్గినట్లు సమాచారం. వాస్తవానికైతే శత్రుచర్లతో జగదీష్‌కు మంచి సంబంధాలు ఉన్నాయి. పార్టీలు వేరైనా రాజకీయంగా అవసరమొచ్చినప్పుడు చేతులు కలుపుతారన్న ఆరోపణలు ఉన్నాయి. దూరంగా ఉండడం కన్నా ఒకే గూటిలో ఉంటే బాగుంటుందని, అందుకు కళా వెంకటరావు లోపాయికారీగా మద్దతు ఇవ్వడంతో పని సులువైపోతుందని జగదీష్ భావించారన్న వాదనలు ఉన్నాయి. కానీ భవిష్యత్ ఆధిపత్యం కోసం జగదీష్ ఆలోచనకు భిన్నంగా అశోక్ నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. దీంతో అశోక్ ఆదేశాన్ని తు.చ తప్పకుండా అధినేత చెవిలో జగదీష్ వేసినట్టు తెలిసింది. శ్రీకాకుళం జిల్లాలో ఆయనకు ప్రాముఖ్యం ఇచ్చినా ఫరవాలేదు కానీ ఈ జిల్లాలో మాత్రం ఆయనకు అవకాశం ఇవ్వకూడదని స్పష్టం చేసినట్లు తెలిసింది. ఈ క్రమంలోనే శత్రుచర్ల చేరికకు బ్రేక్ పడింది. దీనికంతటికీ కిమిడి కళా వెంకటరావే కారణమని అశోక్ గుర్రుగా ఉన్నట్టు సమాచారం. అంతేకాకుండా ఆయన దూకుడుకు కళ్లెం వేయాలన్న ఆలోచనలో ఉన్నట్లు తెలిసింది. -
పక్క జిల్లాకూ పాకిన టీడీపీ జగడం
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం :జిల్లాలో కింజరాపు, కళా వర్గాల ఆధిపత్య పోరు మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత శత్రుచర్ల విజయరామరాజుకు కలసివచ్చింది. తన రాజకీయ పూర్వవైభవానికి అడ్డంకిగా మారిన కింజరాపు కుటుంబానికి చెక్ పెట్టాలని భావిస్తున్న కళా వెంకట్రావు కన్ను శత్రుచర్ల మీద పడింది. పాతపట్నం టీడీపీ టిక్కెట్టును ఆశిస్తున్న శత్రుచర్లకు ఆయన తెరవెనుక మద్దతు అందించారు. దీనికి కారణం తన మద్దతుతో నియోజకవర్గ ఇన్చార్జిగా నియమితుడైన సుధాకర్ అంతగా రాణించలేకపోవటమే. ఈ వైఫల్యం సాకుతో సుధాకర్‌ను తప్పించేందుకు కింజరాపు వర్గం గట్టిగా ప్రయత్నిస్తోంది. ఈ నేపథ్యంలో కళా వెంకట్రావు శత్రుచర్లను తెరపైకి తెచ్చారు. వీరిద్దరి మధ్య గతంలో కూడా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. 1998లో అప్పటి పార్వతీపురం లోక్‌సభ నియోజకవర్గం నుంచి టీడీపీ తరపున ఎంపీగా శత్రుచర్ల గెలవడానికి కళానే సహకరించారు. ప్రస్తుతం కూడా శత్రుచర్ల ద్వారా పాతపట్నంలో ఆధిపత్యం సాధించి.. ఏకంగా శ్రీకాకుళం లోక్‌సభ నియోజకవర్గంలో కింజరాపు వర్గానికి చెక్ పెట్టాలని వ్యూహం పన్నారు. అందుకే పార్టీ అధినేత చంద్రబాబు వద్ద శత్రుచర్లకు మద్దతుగా పావులు కదిపారు. అసలే పాతపట్నంలో సరైన అభ్యర్థి లేక సతమతమవుతున్న చంద్రబాబు కూడా వెంటనే కళా ప్రతిపాదనకు సమ్మతించేశారు. కింజరాపు స్థానిక నినాదం పాతపట్నంలో శత్రుచర్ల రాకను అడ్డుకోవడానికి కింజరాపు వర్గం వెం టనే రంగంలోకి దిగింది. స్థానిక నినాదాన్ని లేవనెత్తి శత్రుచర్లకు వ్యతిరేకంగా సంతకాల సేకరణకు చేపట్టింది. గత ఐదేళ్లుగా శత్రుచర్ల తమ కార్యకర్తలను ఎంతగా వేధించిందీ కింజరాపు రామ్మోహన్నాయుడు పార్టీ అధినేతకు సోదాహరణంగా వివరించారు. కానీ చంద్రబాబు పెద్దగా పట్టించుకోలేదు. శత్రుచర్లే పాతపట్నం అభ్యర్థని తేల్చేశారు. దాంతో నీరుగారిపోయిన కింజరాపు కుటుంబానికి పొరుగు జిల్లా టీడీపీ కీలక నేత అశోక్‌గజపతి అనూహ్యంగా సహాయ హస్తం అందించారు. శత్రుచర్ల వద్దే..వద్దు శత్రుచర్ల విజయరామరాజును పార్టీలో చేర్చుకోవాలన్న ప్రతిపాదనను అశోక్‌గజపతిరాజు తీవ్రంగా వ్యతిరేకించారు. ఇందుకు శత్రుచర్ల స్వస్థలమైన విజయనగరం జిల్లా కురుపాం నియోజకవర్గ రాజకీయాలే ప్రధాన కారణం. శత్రుచర్ల తనకు పాతపట్నం టిక్కెట్టు ఇవ్వమని చెప్పడంతోపాటు తన మేనల్లుడు, కురుపాం సిట్టింగ్ ఎమ్మెల్యే జనార్ధన్ థాట్రాజ్‌ను అక్కడి అభ్యర్థిగా ఖరారు చేయాలని పట్టుబడుతున్నారు. కానీ కురుపాంకు చెందిన కేంద్రమంత్రి, అరకు ఎంపీ వైరిచర్ల కిశోర్ చంద్రదేవ్‌తో అశోక్‌గజపతి కుటుంబానికి సమీప బంధుత్వం ఉంది. శత్రుచర్ల టీడీపీలో చేరితే కిశోర్ చంద్రదేవ్‌కు రాజకీయంగా ఇబ్బంది. అక్కడ ప్రస్తుతం టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జిగా ఉన్న నిమ్మక జయరాజ్ కేంద్రమంత్రి కిశోర్‌తో మ్యాచ్‌ఫిక్సింగ్ రాజకీయాలు చేస్తున్నారు. ఎమ్మెల్యే ఓటు జయరాజ్‌కు, ఎంపీ ఓటు కిశోర్‌కు అన్న ఒప్పందం ప్రకారం టీడీపీ, కాంగ్రెస్ రాజకీయాలు సాగుతున్నాయి. ఈ తరుణంలో శత్రుచర్ల మేనల్లుడు జనార్దన్ థాట్రాజ్ కురుపాం టీడీపీ అభ్యర్థి అయితే ఈ తెరచాటు రాజకీయాలకు కాలం చెల్లుతుంది. దీంతో కేంద్ర మంత్రి కిశోర్ రాజకీయంగా ఇబ్బందులు ఎదుర్కొంటారు. అందుకే ఆదిలోనే శత్రుచర్లను టీడీపీలోకి రాకుండా అడ్డుకోవాలని అశోక్‌గజపతి అడ్డుచక్రం వేస్తున్నారు. అశోక్ ఉద్దేశం ఏమైనప్పటికీ ఆయన వ్యూహం మాత్రం జిల్లాలో కింజరాపు శిబిరానికి కలసివచ్చింది. అశోక్ అండతో పాతపట్నం టిక్కెట్లు శత్రుచర్లకు దక్కకుండా చేయాలని, అనూహ్యంగా అందివచ్చిన అవకాశాన్ని అనుకూలంగా మలచుకోవాలని రామ్మోహన్నాయుడు, అచ్చెన్నాయుడు భావిస్తున్నారు. దీనిపై కళా, శత్రుచర్ల వర్గాలు మండిపడుతున్నాయి. ఈ పరిణామాలతో శత్రుచర్ల చేరిక వ్యవహారం ఏకంగా రెండు జిల్లాల టీడీపీ కీలక నేతల మధ్య ఆధిపత్య పోరుగా మారింది. దాంతో పార్టీలో విభేదాల పీటముడి మరింతగా బిగుసుకుంటోంది. -
అటు ఇటు కాని హృదయంతో...!
పార్వతీపురం, న్యూస్‌లైన్: పార్టీ మారే విషయంలో మాజీ మంత్రి శత్రుచర్ల విజయరామరాజు నిర్ణయం కోసం ఆయన అనుచరులు ఎదురుచూస్తున్నారు. అయితే ఏం చేయాలో అర్ధంకాక ఆయన సందిగ్ధంలో కొట్టుమిట్టాడుతున్నట్టు సమాచారం. ఇటీవల ఆయన తెలుగుదేశం పార్టీలో చేరుతున్నట్టు జోరుగా ప్రచారం జరిగింది. కాగా తమ నేత ఇంకా నిర్ణయం తీసుకోలేదని, రెండు మూడు రోజుల్లో ప్రకటిస్తారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ శత్రుచర్ల ఏ పార్టీలో చేరుతున్నారో అన్న విషయం స్పష్టం కాకపోవడంతో ఆయన అనుచరుల్లో ఉత్కంఠ నెలకొంది. ఏం చేయాలన్నదానిపై ఆయన కూడా స్పష్టమైన నిర్ణయం తీసుకోలేకపోతున్నారని తెలిసింది. శ్రీకాకుళం జిల్లా పాతపట్నం నియోజకవర్గం నుంచి గెలుపొంది, మంత్రి పదవి చేపట్టినప్పటికీ ఈ ప్రాంతంలో ఆయనకు మంచి పట్టు ఉంది. ఈయన రాజకీయ నేపథ్యమంతా పార్వతీపురం, కురుపాం నియోజకవర్గాలతోనే ముడిపడివుంది. 2009 ఎన్నికల్లో రిజర్వేషన్ అనుకూలించకపోవడంతో శత్రుచర్లకు దివంగత నేత రాజశేఖరరెడ్డికి ఉన్న అనుబంధం వల్ల శ్రీకాకుళం జిల్లా పాతపట్నంలో పోటీ చేసేందుకు టికెట్ కేటాయించారు. అనంతరం ఆయనకు మంత్రివర్గంలో స్థానం కల్పించారు. సుదీర్ఘ రాజకీయ అనుభవం వున్న శత్రుచర్ల పార్వతీపురం, కురుపాం మండలాల్లో మంచి పట్టు ఉన్న నాయకుడు. అయితే ప్రస్తుతం కాంగ్రెస్‌పార్టీ పరిస్థితి దయనీయంగా ఉండడంతో ఆ పార్టీ శ్రేణులంతా వేరే పార్టీలోకి వెళ్లేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. శత్రుచర్ల, ఆయన మేనళ్లుడు కురుపాం ఎమ్మెల్యే జనార్దన్ థాట్రాజ్‌లు....అందరం కలిసి వేరే పార్టీలోకి వెళదామని నచ్చచెప్పడంతో ఇప్పటివరకు శ్రేణులంతా వేచిచూశారు. ఎన్నికలు సమీపిస్తున్నా విజయరామరాజు వైఖరి బహిర్గతం కాకపోవడంతో అనుచరులంతా వైఎస్ఆర్సీపీలోకి వెళ్లేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారని తెలిసింది. మూడురోజుల క్రితం కురుపాం, పార్వతీపురం నియోజకవర్గాలకు చెందిన ముఖ్యమైన కార్యకర్తలంతా హైదరాబాద్‌లో శత్రుచర్ల నివాసానికి వెళ్లినట్లు సమాచారం. మరికొద్ది రోజుల్లో ఏ పార్టీలోకి వెళ్లేది నిర్ణయం తీసుకుందామని తమ అనుచరులకు శత్రుచర్ల చెప్పినట్లు బోగట్టా. దీంతో వారంతా రెండురోజులపాటు వేచి చూస్తున్నారు. ఇదిలావుండగా పార్వతీపురం పట్టణంలో తెలుగుదేశం పార్టీ శ్రేణులు శత్రుచర్ల తమ పార్టీలో చేరుతున్నట్లు ప్రచారం చేస్తున్నారు. అయితే శత్రుచర్ల సన్నిహితులు మాత్రం అదేమీ కాదని రెండు, మూడు రోజుల్లో తమ నాయకుడు నిర్ణయం వెల్లడిస్తారని చెబుతున్నారు. ఏది ఏమైనా ఈ ప్రాంతంలో రాజకీయ చతురుడిగా పేరు పొందిన శత్రుచర్ల రానున్న ఎన్నికల్లో ఏ పార్టీ నుంచి పోటీచేయాలో నిర్ణయించుకోలేక ఊగిసలాడుతున్నారు. -
కిరణ్ పార్టీలో చేరతా: మంత్రి శత్రుచర్ల
హైదరాబాద్: కాంగ్రెస్‌లో కొనసాగితే వచ్చే ఎన్నికల్లో ఓటమి తప్పదు మంత్రి శత్రుచర్ల విజయరామరాజు అన్నారు. అలాగని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, టీడీపీలో చేరలేనని చెప్పారు. సీఎం కిరణ్ కొత్త పార్టీ పెడితే అందులో చేరుతానని లేదా ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తాని వెల్లడించారు. ఇవేమీ కాకుంటే రాజకీయాలనుంచి వైదొలుగుతానని శత్రుచర్ల అన్నారు. విభజన నిర్ణయంతో సీమాంధ్రలో కాంగ్రెస్ కనుమరుగు కావడం ఖాయమని భావిస్తున్నారు. దీంతో మంత్రులు తమ దారి తాము వెతుక్కుంటున్నారు. గంటా శ్రీనివాసరావు టీడీపీలో చేరతారని ప్రచారం జరుగుతోంది. మాజీ మంత్రి జేసీ దివాకర్ రెడ్డి కూడా ఇదే బాటలో పయనిస్తున్నారు. -
మంత్రి శత్రుచర్ల కాన్వాయ్‌పై చెప్పుల దాడి
శ్రీకాకుళం : మంత్రి శత్రుచర్ల విజయ రామరాజుకు సమైక్య సెగ తగిలింది. పై-లిన్ తుపాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తున్న ఆయనను మంగళవారం సమైక్య వాదులు అడ్డుకున్నారు. సమైక్యవాదులు ఈ సందర్భంగా శత్రుచర్ల కాన్వాయ్‌పై చెప్పులు విసిరారు. సమైక్యాంధ్రకు మద్దతుగా మంత్రి శత్రుచర్ల రాజీనామా చేయాలని వారు డిమాండ్ చేశారు. మరోవైపు కేంద్రమంత్రి కిల్లి కృపారాణికి కూడా సమైక్య సెగ తగిలింది. అయితే తన రాజీనామాతో రాష్ట్ర విభజన ఆగిపోదని ఆమె వ్యాఖ్యానించారు. -
బొత్స ఇంటి వద్ద భారీగా పోలీసులు మోహరింపు
రాష్ట్ర విభజన నిర్ణయాన్ని కేంద్రం ప్రభుత్వం ఆమోదించడంపై ఉత్తరాంధ్రలోని సమైక్యవాదులు శుక్రవారం మండిపట్టారు. ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా ఉత్తరాంధ్రలోని మూడు జిల్లాలైన విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళంలో సమైక్యవాదులు జాతీయ రహదారులపై రాస్తారోకో నిర్వహించారు. అలాగే విశాఖపట్నంలోని కేజీహెచ్ ఆసుపత్రిలో వైద్యులు ఔట్ పేషెంట్ విభాగంలో సేవలను బంద్ చేశారు. అనారోగ్యం పాలై రోగులు ఎవరైన మరణిస్తే ప్రభుత్వానిదే బాధ్యత అని వైద్యులు హెచ్చరించారు. నగరంలోని ప్రజలు స్వచ్చందంగా బంద్ పాటిస్తున్నారు. దాంతో నగరంలోని రోడ్డులన్ని నిర్మానుష్యంగా మారాయి. గాజువాక ప్రాంతంలో సమైక్యవాదులు రోడ్డును దిగ్బంధించారు. దాంతో కొల్కత్తా - చెన్నై జాతీయ రహాదారిపై వాహనాలు బారులు తీరాయి. అలాగే కేంద్ర నిర్ణయంపై సమైక్యవాదులు తీవ్ర ఆగ్రహాంగా ఉన్న నేపథ్యంలో విజయనగరంలోని పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ నివాసం వద్ద పోలీసులు భారీగా మోహరించారు. విజయనగరం లోక్‌సభ సభ్యురాలు బొత్స ఝాన్సీ తన పదవికి రాజీనామా చేయాలని నిన్న ఉదయం సమైక్యవాదులు, ఉపాధ్యాయులు ఆమె నివాసం ముందు నిన్న ఉదయం ఆందోళనకు దిగారు. ఆ సమయంలో పోలీసులకు, ఉపాధ్యాయులకు తీవ్ర వాగ్వివాదం చోటు చేసుకుంది. ఆ క్రమంలో తోపులాట జరిగింది. ఆ సమయంలో ఉపాధ్యాయుడు తీవ్ర గాయాలపాలై, ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ నేపథ్యంలో బొత్స ఇంటి వద్ద భద్రతను పెంచారు. అంతేకాకుండా చీపురపల్లి - శ్రీకాకుళంతోపాటు ఆంధ్ర - ఒరిస్సా సరిహద్దుల్లోని జాతీయ రహాదారిపై వాహనాలు భారీగా నిలిచిపోయాయి. ఆరబిందో ఫార్మసీకి చెందిన బస్సుపై ఈ రోజు ఉదయం సమైక్యవాదులు రాళ్లతో దాడి చేసి అద్దాలు పగలకొట్టారు. అలాగే శ్రీకాకుళం జిల్లాలో రణస్థలంలో సమైక్యవాదులు జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. దాంతో రాకపోకలు పూర్తిగా స్తంభించాయి. శ్రీకాకుళంలోని పాతపట్నంలో అటవీ శాఖ మంత్రి శత్రుచర్ల విజయరామరాజు కార్యాలయాన్ని సమైక్యవాదులు శుక్రవారం ఉదయం ముట్టడించారు. శత్రుచర్ల తన పదవికి రాజీనామా చేసి సమైక్య ఉద్యమంలో పాల్గొనాలని వారు డిమాండ్ చేశారు. అనంతరం శత్రుచర్ల కార్యాలయానికి తాళాలు వేసి సమైక్యవాదులు పరారయ్యారు. -
సమైక్యాంధ్ర ఉద్యమానికి పూర్తి మద్దతు: శత్రుచర్ల
కాంగ్రెస్ పార్టీ నిర్ణయం కంటే నా ప్రజల మనోభావాలే నాకు ముఖ్యమని రాష్ట్ర మంత్రి శత్రుచర్ల విజయరామరాజు గురువారం విజయనగరంలో స్పష్టం చేశారు. రాష్ట్ర విభజనపై కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తనను బాధించిందని ఆయన పేర్కొన్నారు. సమైక్యాంధ్ర ఉద్యమానికి తన సంపూర్ణ మద్దతు ఉంటుందని తెలిపారు. వయస్సు సహకరించపోవడం వల్లే సమైక్యాంధ్ర ఉద్యమంలో పాల్గొనడం లేదని శత్రుచర్ల విజయరామరాజు ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనపై కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయానికి నిరసనగా అటవీశాఖ మంత్రి శత్రుచర్ల విజయరామరాజు, వైద్య విద్య మంత్రి కొండ్రు మురళిలు మంగళవారం తమ పదవులకు రాజీనామా చేశారు. అనంతరం రాజీనామా లేఖలను సీఎం కిరణ్‌కు క్యాంప్ కార్యాలయంలో అందజేసిన సంగతి తెలిసిందే.