అటు ఇటు కాని హృదయంతో...!
అటు ఇటు కాని హృదయంతో...!
Published Sun, Mar 9 2014 3:06 AM | Last Updated on Sat, Sep 2 2017 4:29 AM
పార్వతీపురం, న్యూస్‌లైన్: పార్టీ మారే విషయంలో మాజీ మంత్రి శత్రుచర్ల విజయరామరాజు నిర్ణయం కోసం ఆయన అనుచరులు ఎదురుచూస్తున్నారు. అయితే ఏం చేయాలో అర్ధంకాక ఆయన సందిగ్ధంలో కొట్టుమిట్టాడుతున్నట్టు సమాచారం. ఇటీవల ఆయన తెలుగుదేశం పార్టీలో చేరుతున్నట్టు జోరుగా ప్రచారం జరిగింది. కాగా తమ నేత ఇంకా నిర్ణయం తీసుకోలేదని, రెండు మూడు రోజుల్లో ప్రకటిస్తారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ శత్రుచర్ల ఏ పార్టీలో చేరుతున్నారో అన్న విషయం స్పష్టం కాకపోవడంతో ఆయన అనుచరుల్లో ఉత్కంఠ నెలకొంది. ఏం చేయాలన్నదానిపై ఆయన కూడా స్పష్టమైన నిర్ణయం తీసుకోలేకపోతున్నారని తెలిసింది. శ్రీకాకుళం జిల్లా పాతపట్నం నియోజకవర్గం నుంచి గెలుపొంది, మంత్రి పదవి చేపట్టినప్పటికీ ఈ ప్రాంతంలో ఆయనకు మంచి పట్టు ఉంది. ఈయన రాజకీయ నేపథ్యమంతా పార్వతీపురం, కురుపాం నియోజకవర్గాలతోనే ముడిపడివుంది. 2009 ఎన్నికల్లో రిజర్వేషన్ అనుకూలించకపోవడంతో శత్రుచర్లకు దివంగత నేత రాజశేఖరరెడ్డికి ఉన్న అనుబంధం వల్ల శ్రీకాకుళం జిల్లా పాతపట్నంలో పోటీ చేసేందుకు టికెట్ కేటాయించారు. అనంతరం ఆయనకు మంత్రివర్గంలో స్థానం కల్పించారు.
సుదీర్ఘ రాజకీయ అనుభవం వున్న శత్రుచర్ల పార్వతీపురం, కురుపాం మండలాల్లో మంచి పట్టు ఉన్న నాయకుడు. అయితే ప్రస్తుతం కాంగ్రెస్‌పార్టీ పరిస్థితి దయనీయంగా ఉండడంతో ఆ పార్టీ శ్రేణులంతా వేరే పార్టీలోకి వెళ్లేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. శత్రుచర్ల, ఆయన మేనళ్లుడు కురుపాం ఎమ్మెల్యే జనార్దన్ థాట్రాజ్‌లు....అందరం కలిసి వేరే పార్టీలోకి వెళదామని నచ్చచెప్పడంతో ఇప్పటివరకు శ్రేణులంతా వేచిచూశారు. ఎన్నికలు సమీపిస్తున్నా విజయరామరాజు వైఖరి బహిర్గతం కాకపోవడంతో అనుచరులంతా వైఎస్‌ఆర్‌సీపీలోకి వెళ్లేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారని తెలిసింది. మూడురోజుల క్రితం కురుపాం, పార్వతీపురం నియోజకవర్గాలకు చెందిన ముఖ్యమైన కార్యకర్తలంతా హైదరాబాద్‌లో శత్రుచర్ల నివాసానికి వెళ్లినట్లు సమాచారం. మరికొద్ది రోజుల్లో ఏ పార్టీలోకి వెళ్లేది నిర్ణయం తీసుకుందామని తమ అనుచరులకు శత్రుచర్ల చెప్పినట్లు బోగట్టా. దీంతో వారంతా రెండురోజులపాటు వేచి చూస్తున్నారు. ఇదిలావుండగా పార్వతీపురం పట్టణంలో తెలుగుదేశం పార్టీ శ్రేణులు శత్రుచర్ల తమ పార్టీలో చేరుతున్నట్లు ప్రచారం చేస్తున్నారు. అయితే శత్రుచర్ల సన్నిహితులు మాత్రం అదేమీ కాదని రెండు, మూడు రోజుల్లో తమ నాయకుడు నిర్ణయం వెల్లడిస్తారని చెబుతున్నారు. ఏది ఏమైనా ఈ ప్రాంతంలో రాజకీయ చతురుడిగా పేరు పొందిన శత్రుచర్ల రానున్న ఎన్నికల్లో ఏ పార్టీ నుంచి పోటీచేయాలో నిర్ణయించుకోలేక ఊగిసలాడుతున్నారు.
Advertisement