ఓట్లేసినందుకు.. బాగానే బుద్ధి చెప్పారు | chandrababu naidu cheating Dorka on loan waiver | Sakshi
Sakshi News home page

ఓట్లేసినందుకు.. బాగానే బుద్ధి చెప్పారు

Published Tue, Jul 8 2014 1:29 AM | Last Updated on Fri, Aug 10 2018 8:08 PM

ఓట్లేసినందుకు.. బాగానే బుద్ధి చెప్పారు - Sakshi

ఓట్లేసినందుకు.. బాగానే బుద్ధి చెప్పారు

పార్వతీపురం టౌన్ : టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు మాటలను నమ్మి పార్టీని గెలిపించినందుకు బాగానే బుద్ధి చెప్పారంటూ పట్టణానికి చెందిన పలువురు మహిళలు స్థానిక టీడీపీ నాయకులను నిలదీశారు. డ్వాక్రా రుణాలు రద్దు చేయాలంటూ మున్సిపల్ కార్యాలయం వద్ద ధర్నా చేపట్టారు. వివరాల్లోకి వెళితే... టీడీపీ అధికారం చేపట్టి నెల రోజులు దాటుతున్నా డ్వాక్రా రుణాలు రద్దు చేయకపోవడంతో పట్టణానికి చెందిన డ్వాక్రా మహిళలు ఆందోళన చేపట్టారు. ఈ మేరకు ఐద్వా నాయకులు రెడ్డి శ్రీదేవి, బి. లక్ష్మి, సీఐటీయూ నాయకుడు జీవీ సన్యాసి, పట్టణ పౌర సంఘం నాయకుడు పాకల సన్యాసిరావు ఆధ్వర్యంలో వందలాది డ్వాక్రా సంఘాల మహిళలు సోమవారం స్థానిక మున్సిపల్ కార్యాలయాన్ని ముట్టడించారు.
 
 ఈ సందర్భంగా మహిళలు మాట్లాడుతూ, ఎన్నికల ముందు చంద్రబాబునాయుడు డ్వాక్రా రుణాలు రద్దు చేస్తామని హామీ ఇవ్వడంతో, రుణాలు చెల్లించలేదన్నారు. ప్రభుత్వం ఇంతవరకు రుణాలపై ఎటువంటి ప్రకటన చేయకపోవడం అన్యాయమన్నారు. రుణాలు కట్టకపోవడంతో నాన్ పెర్‌ఫార్మన్స్ ఎస్సెట్ కింద బ్యాంకు అధికారులు పొదుపు సొమ్ము నుంచి తమకు తెలియకుండా డబ్బులు తీసుకుని రుణాలు రికవరీ చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సమయంలో మున్సిపల్ కార్యాలయాలనికి వచ్చిన టీడీపీ జిల్లా అధ్యక్షుడు ద్వారపురెడ్డి జగదీష్, మున్సిపల్ చైర్‌పర్సన్ ద్వారపురెడ్డి శ్రీదేవిలను మహిళలు నిలదీశారు.
 
 టీడీపీని గెలిపించినందుకు మంచి బహుమతే ఇచ్చారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే రుణాలు రద్దు చేయాలని డిమాండ్ చేయడంతో పాటు టీడీపీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. చైర్‌పర్సన్ శ్రీదేవి మాట్లాడుతూ, ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని చెప్పినప్పటికీ మహిళలు శాంతించలేదు. అనంతరం మున్సిపల్ కమిషనర్‌కు వినతిపత్రం సమర్పించారు. కార్యక్రమంలో మహిళా సంఘాల నాయకులు  వై.సింహాచలం, వి.విజయ, వీకే కుమారి మహరాణా, పి.భవాని, బి.గౌరి, జి.తులసి, తదితరులు పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement