పార్వతీపురం: పార్వతీపురంలో శుక్రవారం రాత్రి భారీ చోరీ జరిగింది, టీడీపీ జిల్లా అధ్యక్షుడు ద్వారపురెడ్డి జగదీష్ సమీప బంధువు, స్థానిక కెఎంహెచ్ రోడ్డులో నివాసముంటున్న కాపారపు జనార్దననాయుడు ఇంట్లో భారీ చోరీకి పాల్పడ్డారు. దీనికి సంబంధించి బాధితుడు అందించిన వివరాలిలా ఉన్నాయి. శుక్రవారం రాత్రి సుమారు 3 గంటల ప్రాం తంలో మెట్ల వద్ద గల కిటికీ ఇనుప చట్రా న్ని తొలగించి రెండో బెడ్ రూమ్‌లోకి దొంగలు ప్రవేశించారు. బీరువాలతో పాటు అల్మారాలను తీసి అందులో ఉన్న సుమారు 10 కిలోల వెండి వస్తువులు, 30 తులాల బంగారు ఆభరణాలు, సుమారు రూ.50వేలు నగదు అపహరించారని జనార్దననాయుడు తెలిపారు. ఆ సమయంలో శబ్దాలు వస్తున్నట్లు అనిపించినా మేడపై నుంచి వస్తున్నాయనుకున్నామన్నారు. ఎవరైనా మేల్కొం టే దాడిచేయడానికి వీలుగా కిటికీ పక్కనే రోకలి బండ, మెట్ల వద్ద రాయిని దొంగలు ఉంచారు. అలాగే ఇంటిమెట్ల పక్కనే ఉన్న పెరటి తోటలో తొలగించిన కిటికీ ఐరన్ గ్రిల్‌ను ఉంచారు. బైక్ ప్లగ్‌ను కూడా కట్ చేశారు. ఈ విషయాన్ని తెలుసుకున్న పట్టణ సీఐ వి.చంద్రశేఖర్, ఎస్సైలు వి.అశోక్ కుమార్, బి.సురేంద్రనాయుడు తదితరులు సంఘటన స్థలాన్ని పరిశీలించి, విజయనగరం నుంచి క్లూస్ టీమ్‌ను రప్పించి తనిఖీలు చేపట్టారు.
సంఘటన స్థలాన్ని పరిశీలించిన ఏఎస్పీ సిద్దార్థ్ కౌశల్...
దొంగతనం విషయాన్ని తెలుసుకున్న పార్వతీపురం ఏఎస్పీ సిద్దార్థ్ కౌశల్ సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. సీఐ చంద్రశేఖర్‌తోపాటు క్లూస్ టీమ్‌తో చర్చించారు. బాధితుడు జనార్దననాయుడుని అడిగి దొంగతనం వివరాలు అడిగి తెలుసుకున్నారు.
రెండు రోజులుగా హల్‌చల్...
రెండు రోజులుగా పట్టణంలో దొంగలు హల్‌చల్ చేస్తున్నట్లు సమాచారం. స్థానిక సౌందర్య సినిమాహాలు పక్కనే ఉన్న శత్రుచర్ల రియల్ ఎస్టేట్‌లోని ఓ వీధిలోని ఓఇంట్లో గురువారం రాత్రి సుమారు రూ.50వేలు చోరీ చేసినట్టు తెలిసింది. అలాగే శుక్రవారం రాత్రి అదే వీధిలోని చిన్నారి శ్రీరామమూర్తి అనే టీచర్ ఇంట్లో కొళాయి ట్యాప్‌లు, షవర్ ట్యాప్‌లు, సింక్‌లు విప్పికెళ్లినట్లు సమాచారం. బీహార్‌తో పాటు ఒడిశా తదితర ప్రాంతాలకు చెందిన దొంగలు పట్టణంలో హల్‌చల్ చేస్తున్నట్లు తెలుస్తున్నా...పోలీసులు తగిన జాగ్రత్తలు తీసుకోలేదని స్థానికులు విమర్శిస్తున్నారు.
ఫిర్యాదు అందింది.... పట్టణ ఎస్‌ఐ వి. అశోక్‌కుమార్
స్థానిక కేఎంహెచ్ రోడ్డులో జరిగిన దొంగతనంనకు సంబంధించి బాధితులు కాపారపు జనార్దననాయుడు నుంచి ఫిర్యాదు అందింది. మూడు కిలోల వెండి, 20 తులాల బంగారం పోయినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాము.
పార్వతీపురంలో భారీ చోరీ
Published Sun, Jun 14 2015 12:56 AM | Last Updated on Fri, Aug 10 2018 8:13 PM
Advertisement
Advertisement