అశోక్ + కళా
Published Mon, Mar 10 2014 2:40 AM | Last Updated on Mon, Aug 20 2018 5:08 PM
సాక్షి ప్రతినిధి, విజయనగరం: మాజీ మంత్రి శత్రుచర్ల విజయరామరాజు టీడీపీలో చేరిక కోసం..ఆ పార్టీ సీనియర్ నేతలు పూసపాటి అశోక్ గజపతిరాజు, కిమిడి కళా వెంకటరావు మధ్య చిచ్చు రేగుతోంది. ఈ విషయంలో పంతానికి పోయిన ఆ ఇద్దరు నేతలూ అంతర్గతంగా కత్తులు నూరుకుంటున్నారు. ఈ జిల్లాలో ఆయన పెత్తనమేంటని అశోక్, సిక్కోలులో కింజరాపు వర్గం ఆధిపత్యానికి చెక్ పెట్టేందుకు కళా వెంకటరావు ఎత్తుకుపై ఎత్తులు వేస్తుండడంతో టీడీపీలో పక్కపక్క జిల్లాల నేతల మధ్య అంతర్గతపోరు ము దురుతోంది. శత్రుచర్లను పార్టీలోకి తీసుకోవద్దని అశోక్ అంటుంటే.. శత్రుచర్లను చేర్చుకుంటే పార్టీకి మంచిదని కళా వెంకటరావు అధినేతకు నూరిపోస్తున్నారు.
రాష్ట్ర విభజన నేపథ్యంలో కాంగ్రెస్ ప్రతిష్ట దిగజారడంతో మాజీ మంత్రి శత్రుచర్ల విజయరామరాజు పక్క చూపులు చూస్తున్న విషయం తెలిసిందే. వైఎస్‌ఆర్‌సీపీలో బెర్త్ ఖాళీ లేకపోవడంతో కొంతకాలంగా ఆయన టీడీపీతో మంతనాలు జరుపుతున్నారు. శ్రీకాకుళం జిల్లా పాతపట్నం శాసనసభ నియోజకవర్గం టిక్కెట్ తనకు, జిల్లాలోని కురుపాం టిక్కెట్ తన మేనల్లుడు వీటీ.జనార్దన్ థాట్రాజ్‌కు ఇవ్వాలంటూ అయన బేరసారాలు ఆడుతున్నారు. ఈ క్రమంలో లోపాయికారీ వ్యూహంతో శత్రు చర్ల విజయరామరాజుకు కిమిడి కళా వెంకటరావు అండగా నిలిచారు. శత్రుచర్లను తన వైపు తిప్పుకుంటే శ్రీకాకుళం జిల్లాలో దివంగత నేత కింజరాపు ఎర్రంనాయుడు వర్గం ఆధిపత్యానికి చెక్ పెట్టొచ్చన్న ఎత్తుగడతో అధినేతతో కళా వెంకటరావు రాయబారాలు నెరిపారు.
దీన్ని పసిగట్టిన కింజరాపు వర్గం ఊరుకుంటారా..? వెంటనే అప్రమత్తమై ముల్లును ముల్లుతోనే తీయాలన్న సిద్ధాంతంతో రెండు జిల్లాల్లో చక్రం తిప్పేందుకు కళా అనుసరిస్తున్న వ్యహాన్ని మొగ్గలో తెంచేయాలని పథక రచన చేశారు. ఈమేరకు పూసపాటి అశోక్ గజపతిరాజును కింజరాపు వర్గం కలిసినట్టు తెలిసింది. కురుపాంలో తన అనుచరునిగా జనార్థన్ థాట్రాజ్‌ను, శ్రీకాకుళం జిల్లాలో శత్రుచర్ల విజయరామరాజును చేతిలో పెట్టుకుని చక్రం తిప్పాలన్న దుర్నీతితో వ్యవహరిస్తున్నారని కళా వెంకటరావుపై అశోక్‌కు ఫిర్యాదు చేసినట్టు కూడా తెలిసింది. దీంతో అశోక్ మేల్కొని, అన్నీ ఆలోచించి శత్రుచర్లను తీసుకోవద్దని చంద్రబాబుకు బాహాటంగానే చెప్పేసినట్టు తెలిసింది.
వాస్తవానికైతే పార్టీలోకి శత్రుచర్ల రాకపై అశోక్‌కు అంత ఆసక్తి లేదు. తన బంధువైన వైరిచర్ల కిషోర్ చంద్రదేవ్ కుటుంబానికి శత్రుచర్ల చిరకాల ప్రత్యర్థి కావడం, పార్టీ చెప్పినట్టు వినే నిమ్మక జయరాజుకు అన్యాయం జరుగుతుందన్న ఉద్దేశంతో ఆయన రాకపై ఆదిలోనే అభ్యంతరం తెలిపినట్టు తెలిసింది. అంతేకాకుండా శత్రుచర్ల చేరిక విషయమై చంద్రబాబుతో సంప్రదింపులు చేసేందుకు వెళ్లిన జిల్లా అధ్యక్షుడు ద్వారపురెడ్డి జగదీష్‌తో కరాఖండిగా కొన్ని విషయాలు చెప్పేశారు. గతంలో మన పార్టీ తరఫున ఎంపీగా గెలిచి కాంగ్రెస్ ప్రధానమంత్రి పీవీ నర్సింహారావుకు అనుకూలంగా పార్లమెంట్‌లో ఓటేసి మచ్చ తెచ్చారని, అలాంటి వ్యక్తిని ఎలా తీసుకువస్తారని నిర్మొహమాటంగా చెప్పడమే కాకుండా చంద్రబాబుకు ఇదే విషయాన్ని తెలియజేయాలని గట్టిగా చెప్పినట్టు సమాచారం. దీంతో జగదీష్ వెనక్కి తగ్గినట్లు సమాచారం. వాస్తవానికైతే శత్రుచర్లతో జగదీష్‌కు మంచి సంబంధాలు ఉన్నాయి.
పార్టీలు వేరైనా రాజకీయంగా అవసరమొచ్చినప్పుడు చేతులు కలుపుతారన్న ఆరోపణలు ఉన్నాయి. దూరంగా ఉండడం కన్నా ఒకే గూటిలో ఉంటే బాగుంటుందని, అందుకు కళా వెంకటరావు లోపాయికారీగా మద్దతు ఇవ్వడంతో పని సులువైపోతుందని జగదీష్ భావించారన్న వాదనలు ఉన్నాయి. కానీ భవిష్యత్ ఆధిపత్యం కోసం జగదీష్ ఆలోచనకు భిన్నంగా అశోక్ నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. దీంతో అశోక్ ఆదేశాన్ని తు.చ తప్పకుండా అధినేత చెవిలో జగదీష్ వేసినట్టు తెలిసింది. శ్రీకాకుళం జిల్లాలో ఆయనకు ప్రాముఖ్యం ఇచ్చినా ఫరవాలేదు కానీ ఈ జిల్లాలో మాత్రం ఆయనకు అవకాశం ఇవ్వకూడదని స్పష్టం చేసినట్లు తెలిసింది. ఈ క్రమంలోనే శత్రుచర్ల చేరికకు బ్రేక్ పడింది. దీనికంతటికీ కిమిడి కళా వెంకటరావే కారణమని అశోక్ గుర్రుగా ఉన్నట్టు సమాచారం. అంతేకాకుండా ఆయన దూకుడుకు కళ్లెం వేయాలన్న ఆలోచనలో ఉన్నట్లు తెలిసింది.
Advertisement
Advertisement