
సాక్షి, న్యూఢిల్లీ : ఆంధ్రప్రదేశ్‌లో చోటు చేసుకుంటున్న అంశాలు, ప్రత్యేక హోదా విషయంపై అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటుండటం, బీజేపీ మంత్రుల రాజీనామాల నేపథ్యంలో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి, టీడీపీ సీనియర్ నేత అశోక్ గజపతి రాజు చాలా భిన్నంగా స్పందించారు. ప్రత్యేకహోదా విషయంలో జరుగుతున్న పరిణామాల దృష్ట్యా మీరు కేంద్ర మంత్రి పదవి నుంచి తప్పుకుంటారా అని ప్రశ్నించగా.. ఆయన ఫక్కున నవ్వారు. వాట్ సిల్లీ క్వశ్చన్ అంటూ సమాధానం దాట వేస్తూ వెళ్లిపోయారు. పార్లమెంటు వెలుపల ఈ సంఘటన చోటు చేసుకుంది.
మోదీకి రాజీనామా లేఖలు ఇస్తాం
మరోపక్క, ప్రత్యేక హోదా విషయంలో కేంద్ర మాట తప్పినందున తాము రాజీనామాలు చేస్తామని, ప్రధానిని కలిసి తమ రాజీనామా లేఖలు ఇస్తామని టీడీపీ సుజనా చౌదరి అన్నారు. రాష్ట్రాభివృద్ధి విషయంలో బీజేపీ వెనుకడగువేయలేదని, కాస్త ఆలస్యం మాత్రమే జరిగిందని చెప్పారు. ప్యాకేజీ అమలులో జాప్యం వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందని, విభజన హామీలను కేంద్రం చాలా వరకు నెరవేర్చిందంటూ కేంద్రాన్ని వెనుకేసుకొచ్చారు.