ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు (పాత ఫొటో)
సాక్షి, హైదరాబాద్ : ఎన్డీయే కేబినేట్‌కు తెలుగుదేశం మంత్రులు రాజీనామా చేస్తారని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వలేమని ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ తేల్చిచెప్పడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. గురువారం పౌర విమానయాన శాఖ మంత్రి అశోక్ గజపతి రాజు, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎర్త్ సైన్స్ సహాయ మంత్రి సుజనా చౌదరిలు రాజీనామా చేస్తారని తెలిపారు.
ఈ విషయాన్ని ముందుగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి చెప్పేందుకు ఫోన్ చేసినట్లు వెల్లడించారు. అయితే, ఆయన అందుబాటులోకి రాలేదని చెప్పారు. తెలుగు ప్రజల మనోభావాలను దృష్టిలో ఉంచుకుని ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వలేమని చెప్పి ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ అవమానించారని అన్నారు.
ఎన్డీయే నుంచి పూర్తిగా ఇప్పుడే తప్పుకోవట్లేదని చెప్పారు. మొదటిగా కేంద్ర మంత్రులతో రాజీనామా చేయించి ఆంధ్ర ప్రజల ప్రతిఘటనను వారికి చెప్తామని అన్నారు. భవిష్యత్తులో జరగబోయే పరిణామాలను బట్టి తర్వాతి నిర్ణయాలు తీసుకుంటామని చెప్పారు. రాష్ట్రంలో బీజేపీ మంత్రులు కొనసాగుతారా? అనే ప్రశ్నకు సమాధానంగా ఆ విషయం తనకు తెలియదన్నారు.
కేంద్ర ప్రభుత్వాన్ని తామేమి గొంతెమ్మ కోర్కెలు కోరలేదని చెప్పారు. ఆర్థిక లోటుతో సతమతమవుతున్న రాష్ట్రానికి న్యాయం చేయమని కోరితే దేశ రక్షణకు వాడే డబ్బులు ఇమ్మన్నట్లు మాట్లాడారని వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment