అశోక్ గజపతిరాజు
సాక్షిప్రతినిధి, విజయనగరం: ఆంధ్ర రాష్ట్ర ప్రజల అభిమతానికి విరుద్ధంగా రాష్ట్రాన్ని విడగొట్టారు. విభజన సమయంలో కొన్ని హామీలు ఇచ్చారు. వాటిని అమలు చేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉంది. ఒకవేళ కేంద్రం వాటిని విస్మరిస్తే గుర్తు చేయాల్సిన అవసరం కేంద్ర ప్రభుత్వంలో ఉన్న మన రాష్ట్ర ఎంపీలు, కేంద్ర మంత్రులపై ఉంది. టీడీపీ మంత్రులు, ఎంపీలు ఈ విషయంలో ఇన్నాళ్లూ మౌనం వహించారు. దాని ఫలితంగా కేంద్ర బడ్జెట్‌లో ఏపీకి నిరాశే ఎదురైంది. దీంతో ప్రజల్లో వ్యతిరేకత ఉవ్వెత్తున లేచింది. దాని నుంచి తప్పించుకోవడానికి టీడీపీ ఎంపీలు ఢిల్లీలో ఆందోళన మొదలుపెట్టారు. కేంద్ర మంత్రి స్థానంలో ఉన్న జిల్లాకు చెందిన అశోక్ గజపతిరాజు అయితే టీడీపీ అధినేత చంద్రబాబును సైతం లెక్కచేయడం లేదు. బీజేపీని ఇరకాటంలో పెట్టే పనులకు దూరంగా ఉంటున్నారు. తాజా పరిణామాలు, టీడీపీతో కేంద్ర మంత్రి అశోక్‌గజపతిరాజు నడుచుకుంటున్న తీరు పలు అనుమానాలకు తావిస్తోంది.
ఏమీ ఇవ్వకపోయినా..
కేంద్ర బడ్జెట్ తర్వాత జనంలో వచ్చిన వ్యతిరేకత చూసి ఎంపీలతో సీఎం అమరావతిలో పెట్టిన సమావేశానికి అశోక్ హాజరు కాకపోగా ఢిల్లీలో టీడీపీ ఎంపీలు చేసిన ఆందోళనలోనూ పాల్గొనలేదు. తర్వాత ఇతర మంత్రులతో కలి సి కేంద్రంలోని పెద్దలను కలిసి వినతిపత్రం ఇచ్చి సరిపెట్టారు. కేంద్ర బడ్జెట్ కేటాయింపులు చూసి టీడీపీ నేతలు బీజేపీపై విమర్శలు చేస్తు న్నా అశోక్ మాత్రం ఒక్కమాట కూడా కేంద్రాన్ని అనడం లేదు. పోనీ సొంత జిల్లాకేమైనా తెచ్చుకోగలిగారా అంటే అదీ లేదు. బడ్జెట్‌లో భోగాపురం విమానాశ్రయానికి నిధులు లేవు. వైద్య కళాశాల ఊసెత్తలేదు. గిరిజన యూనివర్సిటీకి పిడికెడు నిధులతో సరిపెట్టారు. అయినా అశోక్ బీజేపీపై ఒక్క విమర్శ కూడా చేయడం లేదు.
జిల్లాపైనా పట్టువదిలేసి..
కేంద్రంలో ఉన్న బీజేపీని పల్లెత్తు మాట అనని అశోక్ గజపతిరాజు జిల్లాపైనా పట్టు వదిలేస్తున్నారు. జిల్లా ఇన్‌చార్జి మంత్రి గంటా శ్రీనివాసరావు.. విజయనగరం జిల్లాకు చెందిన మరో మంత్రి సుజయకృష్ణ రంగారావు, కొందరు ఎ మ్మెల్యేలతో విశాఖ జిల్లాలో సమీక్షలు నిర్వహిస్తున్నారు. అశోక్ తీరును పట్టించుకోకుండా త నే అన్నీయై జిల్లా పార్టీ వ్యవహారాలు నడిపిస్తూ వర్గాలుగా విడగొడుతున్నారు. ఇంకోవైపు టీడీ పీ రాష్ట్ర అధ్యక్షుడు, మంత్రి కిమిడి కళావెంకటరావు కూడా జిల్లాపై పెత్తనం చేస్తున్నారు. తన కు ప్రాభవం ఉన్న పార్వతీపురం ప్రాంతంపై పట్టు సాధిస్తూ జన్మభూమి సభల్లోనూ పాల్గొం టున్నారు. ఈ పరిణామాలు అశోక్‌కు, టీడీపీకి మధ్య ఏర్పడుతున్న దూరానికి నిదర్శనమనే వాదనలు జిల్లాలో బలంగా వినిపిస్తున్నాయి.
అంతా తెలిసే: నిజానికి కేంద్ర మంత్రి అశోక్‌గజపతిరాజు ఇదంతా కావాలనే చేస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. టీడీపీని వీడే అవకాశాలున్నాయని గతంలోనే వార్తలు వచ్చినప్పటికీ కనీసం వాటిని ఖండించని అశోక్ జిల్లాకు, టీడీపీకి దూరంగానే ఉంటున్నారు. జిల్లా మంత్రులతో ఎలాంటి సమీక్షలు నిర్వహించడం లేదు. గంటాను తన నెత్తిన తెచ్చిపెట్టారన్న కోపంతో సీఎం చంద్రబాబును ఖాతరు చేయడం లేదు. పైగా వచ్చే ఎన్నికల్లో బీజేపీ పంచన చేరే ఆలోచన ఉందని ఊహాగానాలు వినిపిస్తున్నాయంటే వాటిలో ఎంతోకొంత నిజం లేకపోదు. ఈ నేపథ్యంలోనే బీజేపీపై విమర్శలు చేయకపోవడం, బడ్జెట్‌నపై నోరు విప్పకపోవడం, సీఎం సమావేశాలకు సైతం వ్యక్తిగత కారణాలు చూపి డుమ్మా కొట్టడం వంటి చర్యలు తెలిసే.. కావాలని అశోక్ చేస్తున్నారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మొత్తానికి ఎన్నో ఏళ్లుగా టీడీపీలో పెద్దగా మెలుగుతున్న అశోక్‌గజపతిరాజుకు ఇప్పుడు ఆ పార్టీపైనా, జిల్లా ప్రజలపైన కూడా పెద్దగా ప్రేమ కనిపించడం లేదు.
Comments
Please login to add a commentAdd a comment