వలస నేత మా కొద్దు..! | TDP Seniors Fired on Ashok gajapathi Raju | Sakshi
Sakshi News home page

వలస నేత మా కొద్దు..!

Published Mon, Nov 20 2017 12:49 PM | Last Updated on Mon, Aug 20 2018 5:08 PM

TDP Seniors Fired on Ashok gajapathi Raju - Sakshi

సాక్షిప్రతినిధి, విజయనగరం: టీడీపీలో వలస నేతలకు పెద్దపీట వేస్తుండడంపై ఆ పార్టీ జిల్లా నేతలు భగ్గుమంటున్నారు. అధిష్టానం, మంత్రుల తీరును తప్పుబడుతున్నారు. కాంగ్రెస్‌ పార్టీ నుంచి టీడీపీలోకి వచ్చిన ఇతర జిల్లాకు చెందిన వ్యక్తిని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌గా చేయడానికి ఏర్పాట్లు పూర్తికావడం, స్వయంగా కేంద్ర మంత్రి ఆయన పేరును ప్రతిపాదించడంపై టీడీపీ సీనియర్లు మండిపడుతున్నా రు. బహిరంగంగానే విమర్శిస్తున్నా రు.  జిల్లాలోని తాజా రాజకీయ పరి ణామాలు ఆ పార్టీలోనే కాకుండా జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి.

వలసనేతలకే తాయిలాలు..
వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా గెలిచిన సుజయకృష్ణ రంగారావు టీడీపీలో చేరగానే సీఎం చంద్రబాబు నాయుడు ఏకంగా మంత్రి పదవి కట్టబెట్టారు. మంత్రి పదవి రాగానే జిల్లా టీడీపీని భుజాన వేసుకుంటారని తెగ సంబరపడ్డారు. పదవి వచ్చిన దగ్గరనుంచి జిల్లాను పట్టించుకోకుండా, పార్టీకి ప్రయోజనకరంగా కార్యక్రమాలు చేయకుండా తన సొంత ఆస్తులను కాపాడుకునే పనిలో నిమగ్నమయ్యారనే అపవాదును సుజయ్‌ మూటగట్టుకున్నారు. కోరి తెచ్చుకుని మంత్రి పదవి ఇచ్చిన చంద్రబాబే ఇటీవల ఇదేంటయ్యా సుజయ్‌.. పార్టీని, జిల్లాను పట్టించుకోకపోతే ఎలా అనే పరిస్థితి వచ్చింది. వలస నేతలను నెత్తిన పెట్టుకుని సీనియర్లను పక్కనబెడితే ఎలా ఉంటుందో సుజయ్‌ ఉదంతం వల్ల పార్టీకి, నాయకులకు తెలిసివచ్చింది. ఇప్పుడు కేంద్ర మంత్రి అశోక్‌ అదే పని మళ్లీ చేయాలనుకోవడాన్ని పార్టీ సీనియర్లు ఖండిస్తున్నారు.

మూడేళ్లుగా పోస్టు ఖాళీగానే...
జిల్లా వ్యాప్తంగా 41 శాఖా గ్రంధాలయాలు ఉన్నాయి. వీటిలో పక్కా భవనాలు 13 గ్రంథాలయాలకు ఉండగా, 10 భవానాలు నిర్మాణంలో ఉన్నాయి. మిగిలవన్నీ అద్డె భవనాల్లో నడుస్తున్నాయి. స్థానిక సంస్థల నుంచి ఆస్తి పన్నులలోని 8 శాతం సెస్‌ రూపంలో గ్రంధాలయ సంస్థకు వస్తుంది. మున్సిపాలిటీల నుంచి మీ సేవాకేంద్రాల ద్వారా చెల్లిస్తున్న పన్నుల్లో వాటా నేరుగా గ్రంథాలయ సంస్థకు చేరుతోంది. అయితే, మూడేళ్లుగా చైర్మన్‌ లేకపోవడంతో పంచాయతీల నుంచి రావాల్సిన రూ.6 కోట్ల బకాయిలు అలానే ఉండిపోయాయి. తెలుగుదేశం పార్టీ వచ్చినప్పటి నుంచి గ్రంథాలయ చైర్మన్‌ పదవిని భర్తీ చేయలేదు. కాంగ్రెస్‌ హయాంలో రొంగలి పోతన్న తర్వాత రఘురాజు కొంతకాలం పనిచేశారు. ఆ తర్వాత నుంచి ఎవరికీ ఆ పదవి ఇవ్వలేదు.

ఇప్పుడు జిల్లా వ్యక్తిని కాదని...
గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ పదవికి టీడీపీ సీనియర్‌ నేత ఆనంద్‌ పేరును జిల్లా పార్టీ అధ్యక్షుడితో పాటు ఎమ్మెల్యేలు ప్రతిపాదిస్తూ అధిష్టానానికి లేఖలు ఇచ్చారు. పార్టీ సమావేశంలో రావిశ్రీధర్, జోగినాయుడు పేర్లు కూడా చర్చకు వచ్చాయి. ఎలాంటి నేర చరిత్ర, మద్యం వ్యాపారాలు లేని వారికి, విద్యాధికులకు ఈ పదవి ఇద్దామని ఆ సమయంలో అశోక్‌ గజపతిరాజు చెప్పుకొచ్చారు. అప్పటి నుంచీ ఎవరినీ ఎంపిక చేయకుండా నెట్టుకొస్తున్నారు. ఇదిలా ఉండగా ఆరునెలల కిందట బంగ్లా మరమ్మతు పనులను ద్వారపూడికి చెందిన బొద్దల నర్సింగరావుకు అప్పగించారు. ఆయన కాంగ్రెస్‌ నుంచి మూడేళ్ల కిందటే టీడీపీలో చేరారు. ఆయనకు మద్యం వ్యాపారాలున్నాయి. ఎన్నో ఏళ్లుగా పార్టీలో ఉన్నవారిని కాదని నర్సింగరావుకు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ పదవి కట్టబెట్టాలని మంత్రి అశోక్‌ ప్రయత్నిస్తున్నారనే అంశం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. అదే జరిగితే తాము ఒప్పుకునేది లేదని టీడీపీ నేతలు బల్లగుద్ది చెబుతున్నారు.

కేవలం ఇంటి పనులతో దగ్గరయ్యాడనే కారణంగా నామినేటెడ్‌ పదవిని అందించాలనుకోవడం సమంజసం కాదంటున్నారు. ఈ విషయాలను చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లేందుకు సిద్ధమవుతున్నట్టు సమాచారం. ఇప్పటికే పక్క జిల్లా మంత్రికి ఇన్‌చార్జి పేరుతో పెత్తనం ఇచ్చి జిల్లా నేతలకు ప్రాధాన్యం లేకుండా చేస్తున్నారని, ఇకపై నామినేటెడ్‌ పోస్టులను కూడా ఇలానే వలస నేతలకు ఇస్తూ పోతే పార్టీలో ఇన్నేళ్లుగా అంటిపెట్టుకున్నవారి పరిస్థితి ఏమిటని వారు ప్రశ్నిస్తున్నారు. అయితే... తూర్పుగోదావరి జిల్లాలోని రాజోలును అశోక్‌ దత్తతగా తీసుకున్నారు. అక్కడ ఎలాంటి అభివృద్ధి పనులు చేయలేదు. ఇప్పుడు ఆ ప్రాంతానికి చెందిన వ్యక్తికి గ్రంథాలయ సంస్థ చైర్మన్‌పదవి కట్టబెట్టి ఆ అప్రతిష్టను తొలగించుకునేందుకు మంత్రి చూస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఏదైనా.. తాజా పరిణామాలు జిల్లా మంత్రులను ఇబ్బందులకు గురిచేయడమేగాక, అధిష్టానానికి కొత్త తలనొప్పి తెచ్చిపెట్టనున్నాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement