‘రాజు’తున్న కుంపటి, సుజయ్‌ది తొందరపాటేనా?
► తెలుగుదేశం పార్టీలో వర్గవిభేదాలు
► అశోక్ గజపతికి తెలియకుండానే జిల్లాలో కార్యక్రమాలు
► ఇన్‌చార్జ్ మంత్రి గంటాతో అంటకాగుతున్న నేతలు
► గిరిజన వర్శిటీ ప్రహరీ సాక్షిగా బయటపడ్డ గ్రూపులు
► జిల్లా మంత్రి సుజయ్ కృష్ణకు కొత్త చిక్కులు
సాక్షిప్రతినిధి, విజయనగరం: ‘ముందొచ్చిన చెవుల కంటే వెనకొచ్చిన కొమ్ములు వాడి’..అన్నట్టుంది తెలుగుదేశం పార్టీ నేతల తీరు. జిల్లాకు చెందిన మంత్రిని కాదని పక్క జిల్లా మంత్రితో అంటకాగుతుండటం దీనిని రుజువు చేస్తోంది. ఏమైతేనేం ఈ ప్రభావంతో జిల్లా తెలుగుదేశం పార్టీలో మరో కుంపటి రాజుకుంది.
ఇన్‌చార్జి మంత్రి గంటా శ్రీని వాసరావు మెప్పు కోసం జిల్లాకు చెందిన కేంద్ర మంత్రి అశోక్‌గజపతిరాజు లేని సమయంలో గిరిజన యూనివర్సిటీ ప్రహరీ నిర్మాణానికి శంకుస్థాపన చేయడం ఇప్పుడు వివాదాస్పదమవుతోంది. ఇప్పటికే ఇంటా బయట చులకనైపోతున్న జిల్లా మంత్రి సుజయకృష్ణ రంగారావుకు ఇది కొత్త చిక్కులు తెస్తోంది. కొత్తవలస మండలంలోని అప్పన్నదొరపాలెంపంచాయతీ తమ్మన్నమెరకల వద్ద గిరిజన యూనివర్శిటీ ప్రహరీ నిర్మాణానికి ఈ నెల 18న మంత్రి సుజయకృష్ణ రంగారావు అధికారులు అంచనాలు తయారుచేశారు.
అందులో 33,963 గుంతలకు రూ 34,40,33,000 నిధులను శంకుస్థాపన చేశారు. ఎస్ కోట ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి హడావుడిగా ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి టీడీపీ ప్రజాప్రతినిధులు గాని, ప్రతిపక్షంలోని గిరిజన ప్రజాప్రతినిధులుగాని, గిరిజన సంఘాల నేతలు గాని హాజరు కాలేదు. నిజానికి వారెవరికీ సరైన సమాచారం కూడా ఇవ్వకుండా ఎమ్మెల్యే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసేశారు. దీనికి కారణమేంటా అన్నదే ఇప్పుడు జిల్లాలో చర్చ.
గంటా మెప్పుకోసం...
గిరిజన యూనివర్శిటీని జిల్లాకు తీసుకురావడానికి అధికార, ప్రతిపక్ష పార్టీలనే భేదం లేకుండా ప్రతి ఒక్కరూ కృషి చేశారు. గిరిజనులకు ఇవ్వాల్సిన పరిహారంలో ఇంకా వివాదాలు పరిష్కారం కాకుండానే, హామీలు నెరవేర్చకుండానే ప్రహరీ నిర్మాణానికి శంకుస్థాపన చేస్తుండటంతో ఆ రోజు కార్యక్రమాన్ని గిరిజనులు అడ్డుకుని ఆందోళన చేపట్టారు. వారికి మంత్రి సుజయకృష్ణ రంగారావు సమాధానం చెప్పుకోవాల్సి వచ్చింది. వాస్తవానికి ఈ కార్యక్రమం అంత హడావుడిగా నిర్వహించడం వెనుక అసలు కారణం మంత్రి గంటా శ్రీనివాసరావు మెప్పు కోసమేననే వాదనలు వినిపిస్తున్నాయి.
యూనివర్శిటీ పనుల కాంట్రాక్టును మంత్రి బంధువుకు అప్పగించడంతో ఎలాగైనా పనులు మొదలుపెట్టించాలనే ఉద్దేశంతోనే అప్పటికప్పుడు నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. మరునాడే అశోక్‌గజపతిరాజు జిల్లాకు వస్తున్నప్పటికీ ఆయనకోసం వేచి చూడకపోవడం అనుమానాలు బలపరుస్తున్నాయి. ఆయన జిల్లాలో ఉంటే ఆహ్వానించాల్సి వస్తుందనే ఈ హడావుడి ఏర్పాట్లని తెలుస్తోంది.
సుజయ్‌ది తొందరపాటేనా?
ఇవేవీ పట్టించుకోకుండా ఎమ్మెల్యే పిలుపునందుకుని వెళ్లిన మంత్రి సుజయకృష్ణ రంగారావు తీరా అక్కడికి వెళ్లిన తర్వాత ఇతర నాయకులెవరూ లేకపోవడం, గిరిజనులు ప్రతిఘటించడం చూసి ఇరకాటంలో పడ్డారు. ఎలాగో కార్యక్రమాన్ని పూర్తి చేసి బయటపడినప్పటికీ వర్గపోరులో ఆయనో పావుగా మారారనే విమర్శలు ఎదుర్కొంటున్నారు. జిల్లా టీడీపీ అధ్యక్ష పదవి దగ్గర్నుంచి అనేక విషయాల్లో అశోక్ గజపతిరాజు, గంటా శ్రీనివాసరావుల మధ్య విభేదాలు తార స్థాయికి చేరగా టీడీపీలోని కొందరు ఎమ్మెల్యేలు ఇరువురి పక్షాన చేరి వర్గాలుగా విడిపోయారు. తాజా సంఘటనతో మరోసారి వీరి మధ్య విభేదాలు పొడసూపాయి.