చంద్ర నీతి.!
► గంటా రాకతో జిల్లాపై పట్టు కోల్పోతున్న అశోక్
► అధినేత వద్దా తగ్గుతున్న ఆయన పరపతి
► చివరకు దగ్గరగానే ఉన్నానని చెప్పుకునే ప్రయత్నం
► ఒకే రోజు సీఎంతో సన్మానం, మంత్రి గంటా నుంచి వివరణ
► ఉద్దేశపూర్వకంగానే జరుగుతున్న పరిణామాలు
రాజకీయం అంటేనే ఇలా ఉంటుందా... అందునా తెలుగుదేశం పార్టీలో అయితే మరీ విచిత్రంగా ఉంటుందా... అంతర్గతంగా ఎన్నో జరుగుతున్నాయి. ఆ విషయాలన్నీ బహిర్గమవుతూనే ఉన్నాయి. కానీ అవేవీ జరగలేదన్నట్టు... ఆ పరిస్థితులకు తావులేదన్నట్టు... చిత్ర విచిత్రాలకు పోతున్నారు. జనాన్ని నమ్మించేందుకు తెగ పాట్లుపడుతున్నారు. జిల్లాలో ఆదినుంచీ తెలుగుదేశం పార్టీకి పెద్దదిక్కుగా నిలిచిన అశోక్‌గజపతి వ్యవహారంలో జరుగుతున్న పరిణామాలు పార్టీ అధినేత మార్కు రాజకీయానికి అద్దం పడుతున్నాయి.
సాక్షిప్రతినిధి విజయనగరం: కేంద్ర మంత్రి పూసపాటి అశోక్‌గజపతిరాజు కుమార్తె అదితి రాజకీయ వారసత్వంపై టీడీపీ అధినేత వైఖరిపై వస్తున్న వార్తలు జిల్లాలో పెనుదుమారం రేపాయి. పార్టీలకు అతీతంగా నాయకులు, కార్యకర్తలు ఇదే అంశంపై చర్చిస్తున్నారు. పూసపాటి అభిమానులైతే ఈ వార్తను జీర్ణించుకోలేకపోతున్నారు. కానీ అశోక్ మాత్రం పెదవి విప్పకుండా మౌనంగా వున్నారు. అంతేనా... ఉండవల్లిలోని సీఎం చంద్రబాబు నివాసానికి వెళ్లి మరోసారి ఆయన్ను గురువారం ఉదయం కలిశారు. విమానయాన శాఖ అధికారులను వెంటబెట్టుకు వెళ్లిన ఆయన సీఎం చేత సన్మానం కూడా చేయించుకున్నారు. మధ్యాహ్నం జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి గంటా శ్రీనివాసరావు విజయనగరంలో విలేకరుల సమావేశం నిర్వహించి అశోక్ గజపతితో తనకు ఎలాంటి విభేదాలు లేవని చెప్పుకొచ్చారు. అంతేకాదు 2019 ఎన్నికల్లో తాను విజయనగరం నుంచి పోటీ చేయబోనని వివరణ ఇచ్చారు.
అదితి ఆగమనం ఎవరికి చేటు?
నిజానికి అదితి రాజకీయ రంగ ప్రవేశం చేస్తే విజయనగరం సిట్టింగ్ ఎమ్మెల్యే మీసాల గీతకు చెక్‌పెట్టినట్లే. ప్రజారాజ్యం పార్టీ నుంచి టీడీపీలో చేరి గత ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచిన గీత వచ్చే ఎన్నికల్లోనూ ఇదే స్థానం నుంచి పోటీచేయాలని కృతనిశ్చయంతో ఉన్నారు. మరోవైపు గత ఎన్నికల్లో ప్రసాదుల రామకృష్ణ కూడా ఎమ్మెల్యే టిక్కెట్టు ఆశించి భంగపడ్డా.... ఆయనకు మున్సిపల్ చైర్మన్ పదవి కట్టబెట్టి బుజ్జగించారు. అలాగే జిల్లా తెలుగు యువత జిల్లా అధ్యక్షుడు కర్రోతు నర్శింగరావుకు కూడా ఇదే నియోజకవర్గం నుంచి సీటు ఆశించారు. వచ్చే ఎన్నికల్లో గీతకు వీరిద్దరి నుంచి మళ్లీ తలనొప్పి తప్పకుండా వచ్చే అవకాశం ఉంది. అది చాలదన్నట్లు అదితిని రంగంలోకి దించి పార్టీ కార్యక్రమాల్లో భాగస్వామ్యం చేయడం గీతకు ఇటీవల కాలంలో కష్టంగా మారింది.
గంటా ఎంటరయ్యాకే...
అశోక్‌తో విభేదాలు లేవని, ఆయనంటే తనకెంతో గౌరవమని పైకి చెబుతున్నప్పటికీ జిల్లా ఇన్‌చార్జ్ మంత్రిగా గంటా శ్రీనివాసరావును చంద్రబాబు నియమించిన నాటి నుంచి జిల్లా టీడీపీలో రాజకీయ పరిస్థితులు వేగంగా మారిపోయాయి. జిల్లా టీడీపీ అధ్యక్ష పదవి విషయంలో అశోక్ గజపతిరాజుకు గంటా శ్రీనివాసరావుకు మధ్య తలెత్తిన ఆధిపత్యపోరులో గంటాదే పైచేయి అయ్యింది. అధిష్టానం కూడా గంటా మాటకే విలువనిచ్చి ఆయన సూచించిన మహంతి చిన్నంనాయుడిని జిల్లా అధ్యక్షుడిగా నియమించింది. ఈ పరిణామాల నేపధ్యంలో మీసాల గీత, కె.ఎ.నాయుడు వంటి కొందరు ఎమ్మెల్యేలు కూడా గంటాకు అనుకూలంగా మారుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ మొత్తం పరిణామాలను బట్టి చూస్తే టీడీపీ అధిష్టానం వద్ద తన మాటలు నెగ్గించుకోలేక అశోక్ గజపతిరాజు తన పరపతి కోల్పోతున్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది.
ఆయన తీరే అంత...
సొంత కుమార్తెను కూడా వెంట తిప్పుకునే స్వేచ్ఛను ఆశోక్‌కు చంద్రబాబు ఇవ్వకపోవడం ఆలోచనలు రేకెత్తిస్తోంది. టీడీపీ అధినేతకు సహజంగా ఓ లక్షణం ఉంది. తనతో సమానంగా ఎదుగుతున్నారనుకుంటే ఎంత గొప్ప నాయకుడినైనా పక్కన బెట్టేయడం, పొగబెట్టడం ఆయనకు అలవాటు. రాష్ట్రంలో చంద్రబాబు వద్ద నిస్సంకోచంగా మాట్లాడగల అతి తక్కువమందిలో అశోక్ ప్రథమ స్థానంలో ఉంటారనడంలో సందేహం లేదు. అదే ఇప్పుడు ఆయనకు, ఆయన కుమార్తె భవిష్యత్‌కు అవరోధంగా మారుతోందేమోనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.