minister ashok gajapathi raju
-
‘సీఎం, మంత్రికి ముడుపులు ముట్టాయి..’
సాక్షి, విజయనగరం: విభజన చట్టంలో ఉత్తరాంధ్రాకి ఇచ్చిన హామీల అమలులో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని వైఎస్ఆర్ సీపీ జిల్లా సమన్వయ కర్త మజ్జి శ్రీనివాస్ రావు అన్నారు. కేంద్రమంత్రి అశోక్ గజపతి రాజు, సీఎం చంద్రబాబు నాయుడుపై ఆయన నిప్పులు చెరిగారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉత్తరాంధ్రాకి అన్యాయం జరుగుతున్న జిల్లా మంత్రి అశోక్ గజపతి నోరు మెదపడం లేదని విమర్శించారు. అంతర్జాతీయ స్థాయి విమానాశ్రయాలను నిర్వహించగలిగే సత్తా తన శాఖలోని ఏఏఐకి లేదనడం హస్యాస్పదమన్నారు. దేశంలోని ముఖ్యమైన చెన్నై, కోల్కత్తా ఎయిర్‌పోర్టులను ఏఏఐనే అద్భుతంగా నిర్వహిస్తోందని శ్రీనివాస్ గుర్తు చేశారు. బోగాపురం విమానాశ్రయం విషయంలో చంద్రబాబు, అశోక్‌లు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. సీఎం చంద్రబాబు, మంత్రి అశోక్‌లు ముడుపులు అందుకునే విమానాశ్రయం ప్రైవేట్ సంస్థకు కట్టబెటాలని చూస్తున్నారని వైఎస్ఆర్సీపీ నేత శ్రీనివాస్ మండిపడ్డారు. -
చంద్ర నీతి.!
► గంటా రాకతో జిల్లాపై పట్టు కోల్పోతున్న అశోక్ ► అధినేత వద్దా తగ్గుతున్న ఆయన పరపతి ► చివరకు దగ్గరగానే ఉన్నానని చెప్పుకునే ప్రయత్నం ► ఒకే రోజు సీఎంతో సన్మానం, మంత్రి గంటా నుంచి వివరణ ► ఉద్దేశపూర్వకంగానే జరుగుతున్న పరిణామాలు రాజకీయం అంటేనే ఇలా ఉంటుందా... అందునా తెలుగుదేశం పార్టీలో అయితే మరీ విచిత్రంగా ఉంటుందా... అంతర్గతంగా ఎన్నో జరుగుతున్నాయి. ఆ విషయాలన్నీ బహిర్గమవుతూనే ఉన్నాయి. కానీ అవేవీ జరగలేదన్నట్టు... ఆ పరిస్థితులకు తావులేదన్నట్టు... చిత్ర విచిత్రాలకు పోతున్నారు. జనాన్ని నమ్మించేందుకు తెగ పాట్లుపడుతున్నారు. జిల్లాలో ఆదినుంచీ తెలుగుదేశం పార్టీకి పెద్దదిక్కుగా నిలిచిన అశోక్‌గజపతి వ్యవహారంలో జరుగుతున్న పరిణామాలు పార్టీ అధినేత మార్కు రాజకీయానికి అద్దం పడుతున్నాయి. సాక్షిప్రతినిధి విజయనగరం: కేంద్ర మంత్రి పూసపాటి అశోక్‌గజపతిరాజు కుమార్తె అదితి రాజకీయ వారసత్వంపై టీడీపీ అధినేత వైఖరిపై వస్తున్న వార్తలు జిల్లాలో పెనుదుమారం రేపాయి. పార్టీలకు అతీతంగా నాయకులు, కార్యకర్తలు ఇదే అంశంపై చర్చిస్తున్నారు. పూసపాటి అభిమానులైతే ఈ వార్తను జీర్ణించుకోలేకపోతున్నారు. కానీ అశోక్ మాత్రం పెదవి విప్పకుండా మౌనంగా వున్నారు. అంతేనా... ఉండవల్లిలోని సీఎం చంద్రబాబు నివాసానికి వెళ్లి మరోసారి ఆయన్ను గురువారం ఉదయం కలిశారు. విమానయాన శాఖ అధికారులను వెంటబెట్టుకు వెళ్లిన ఆయన సీఎం చేత సన్మానం కూడా చేయించుకున్నారు. మధ్యాహ్నం జిల్లా ఇన్చార్జ్ మంత్రి గంటా శ్రీనివాసరావు విజయనగరంలో విలేకరుల సమావేశం నిర్వహించి అశోక్ గజపతితో తనకు ఎలాంటి విభేదాలు లేవని చెప్పుకొచ్చారు. అంతేకాదు 2019 ఎన్నికల్లో తాను విజయనగరం నుంచి పోటీ చేయబోనని వివరణ ఇచ్చారు. అదితి ఆగమనం ఎవరికి చేటు? నిజానికి అదితి రాజకీయ రంగ ప్రవేశం చేస్తే విజయనగరం సిట్టింగ్ ఎమ్మెల్యే మీసాల గీతకు చెక్‌పెట్టినట్లే. ప్రజారాజ్యం పార్టీ నుంచి టీడీపీలో చేరి గత ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచిన గీత వచ్చే ఎన్నికల్లోనూ ఇదే స్థానం నుంచి పోటీచేయాలని కృతనిశ్చయంతో ఉన్నారు. మరోవైపు గత ఎన్నికల్లో ప్రసాదుల రామకృష్ణ కూడా ఎమ్మెల్యే టిక్కెట్టు ఆశించి భంగపడ్డా.... ఆయనకు మున్సిపల్ చైర్మన్ పదవి కట్టబెట్టి బుజ్జగించారు. అలాగే జిల్లా తెలుగు యువత జిల్లా అధ్యక్షుడు కర్రోతు నర్శింగరావుకు కూడా ఇదే నియోజకవర్గం నుంచి సీటు ఆశించారు. వచ్చే ఎన్నికల్లో గీతకు వీరిద్దరి నుంచి మళ్లీ తలనొప్పి తప్పకుండా వచ్చే అవకాశం ఉంది. అది చాలదన్నట్లు అదితిని రంగంలోకి దించి పార్టీ కార్యక్రమాల్లో భాగస్వామ్యం చేయడం గీతకు ఇటీవల కాలంలో కష్టంగా మారింది. గంటా ఎంటరయ్యాకే... అశోక్‌తో విభేదాలు లేవని, ఆయనంటే తనకెంతో గౌరవమని పైకి చెబుతున్నప్పటికీ జిల్లా ఇన్చార్జ్ మంత్రిగా గంటా శ్రీనివాసరావును చంద్రబాబు నియమించిన నాటి నుంచి జిల్లా టీడీపీలో రాజకీయ పరిస్థితులు వేగంగా మారిపోయాయి. జిల్లా టీడీపీ అధ్యక్ష పదవి విషయంలో అశోక్ గజపతిరాజుకు గంటా శ్రీనివాసరావుకు మధ్య తలెత్తిన ఆధిపత్యపోరులో గంటాదే పైచేయి అయ్యింది. అధిష్టానం కూడా గంటా మాటకే విలువనిచ్చి ఆయన సూచించిన మహంతి చిన్నంనాయుడిని జిల్లా అధ్యక్షుడిగా నియమించింది. ఈ పరిణామాల నేపధ్యంలో మీసాల గీత, కె.ఎ.నాయుడు వంటి కొందరు ఎమ్మెల్యేలు కూడా గంటాకు అనుకూలంగా మారుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ మొత్తం పరిణామాలను బట్టి చూస్తే టీడీపీ అధిష్టానం వద్ద తన మాటలు నెగ్గించుకోలేక అశోక్ గజపతిరాజు తన పరపతి కోల్పోతున్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది. ఆయన తీరే అంత... సొంత కుమార్తెను కూడా వెంట తిప్పుకునే స్వేచ్ఛను ఆశోక్‌కు చంద్రబాబు ఇవ్వకపోవడం ఆలోచనలు రేకెత్తిస్తోంది. టీడీపీ అధినేతకు సహజంగా ఓ లక్షణం ఉంది. తనతో సమానంగా ఎదుగుతున్నారనుకుంటే ఎంత గొప్ప నాయకుడినైనా పక్కన బెట్టేయడం, పొగబెట్టడం ఆయనకు అలవాటు. రాష్ట్రంలో చంద్రబాబు వద్ద నిస్సంకోచంగా మాట్లాడగల అతి తక్కువమందిలో అశోక్ ప్రథమ స్థానంలో ఉంటారనడంలో సందేహం లేదు. అదే ఇప్పుడు ఆయనకు, ఆయన కుమార్తె భవిష్యత్‌కు అవరోధంగా మారుతోందేమోనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. -
దీపం అమలులో టీడీపీ విఫలం
► కేంద్రమంత్రి అశోక్ గజపతిరాజు భీమవరం : గతంలో అధికారంలో ఉన్నప్పుడు దీపం పథకంపై తెలుగుదేశం పార్టీ విస్తృతంగా ప్రచారం చేసినా.. అమలులో విజయం సాధించలేకపోయిందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి పి.అశోక్‌గజపతిరాజు వ్యాఖ్యానించారు. ఈ పథకాన్ని దేశవ్యాప్తంగా అమలు చేయడం ద్వారా కేంద్ర ప్రభుత్వం విజయం సాధించిందని చెప్పారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం వచ్చిన ఆయన సోమవారం స్థానిక విలేకరులతో మాట్లాడారు. ప్రతి జిల్లాలో ఎయిర్ పోర్టు ఏర్పాటు చేయాలనే ప్రత్యేక ప్రతిపాదన ఏదీ లేదని అవసరం, అవకాశాలను బట్టి ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. గతంలో రైతులు ఎరువుల కోసం షాపుల వద్దకు ఎగబడితే పోలీసులు లాఠీచార్జీలు చేసిన ఘటనలు అనేకం ఉండేవన్నారు. నేడు ఆ పరిస్థితి లేదని, ఎరువుల సరఫరా విషయంలో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ప్రత్యేక చర్యలే దీనికి కారణమని అన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, రాష్ట్ర ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రధాని నరేంద్రమోదీని కలవడం వల్ల టీడీపీ భయపడుతోందనే వాదన సరైంది కాదని వ్యాఖ్యానించారు. ఆయన వెంట రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి పితాని సత్యనారాయణ, నరసాపురం ఎంపీ గోకరాజు గంగరాజు, మాజీ ఎంపీ కావూరి సాంబశివరావు, ఎమ్మెల్యే వేటుకూరి వెంకటశివరామరాజు, ఎమ్మెల్సీ కంతేటి సత్యనారాయణరాజు, బీజేపీ జిల్లా అధ్యక్షుడు భూపతిరాజు శ్రీనివాసవర్మ ఉన్నారు. కాంగ్రెస్ మాటలు విడ్డూరం అశాస్త్రీయంగా రాష్ట్ర విభజన చేసిన కాంగ్రెస్ పార్టీ నేడు ప్రత్యేక హోదా కోసం మాట్లాడడం విడ్డూరంగా ఉందని కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజు అన్నారు. కేంద్ర ప్రభుత్వం మూడేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా సోమవారం భీమవరంలో నిర్వహించిన అందరితో కలసి అందరి అభివృద్ధి సమ్మేళన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. పోలవరం నిర్మాణం మోదీ ప్రభుత్వం వల్లనే సాధ్యమవుతోందన్నారు. రాష్ట్ర దేవదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు, ఎంపీ గోకరాజు గంగరాజు, బీజేపీ జిల్లా అధ్యక్షుడు భూపతిరాజు శ్రీనివాసవర్మ, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. -
ఇదేం కల్చర్..?
పార్వతీపురం:ఐటీడీఏలో హార్టికల్చర్‌సాగుపై వచ్చిన ఆరోపణలను అధికారులు గాలికి వదిలేస్తున్నారా...? బాధ్యులు ఎవరో తేలకుండానే విచారణను ముగించేస్తున్నారా..? పరిస్థితులు చూస్తే అవుననే సమాధానం వినిపిస్తోంది. గత ఐటీడీఏ పాలక వర్గ సమావేశంలో సాక్షాత్తూ కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజు సమక్షంలో ప్రజా ప్రతినిధులు ఐటీడీఏ హార్టీ కల్చర్ సాగులో అవకతవకలు జరిగాయని ఆరోపించారు. దీనిపై విచారణ కమిటీ వేయాలని అశోక్ గజపతిరాజు సమక్షంలోనే పాలక వర్గం తమ ఆమోదాన్ని తెలిపింది. అయితే ఇప్పటి వరకు ఆ విచారణ కమిటీ జాడ లేకపోగా, ఆయా తీపి జొన్న, టిష్యూ బనానా, కూరగాయల పందిరి పెండాల్స్పై లబ్ధిదారుల ఎంపిక నుంచి ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారి పలుకుబడితో ఇటీవల బదిలీ చేయించుకున్నారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారిని బదిలీ, రిలీవ్ చేయడంపై సంబంధిత అధికారులపై గిరిజనులు, గిరిజన సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తీపి జొన్న, టిష్యూ బనానా తదితర సాగులో జరిగిన అవకతవకలు, ఆయా పంటల వల్ల జరిగిన నష్టాలకు ఎవరు బాధ్యులంటూ గిరిజన సంఘాల నాయకులు, గిరిజనులు ప్రశ్నిస్తున్నారు. ఐటీడీఏ పరిధిలో తీపిజొన్న 500 ప్యాకెట్లు, ఒక్కో ప్యాకెట్ సుమారు రూ.2,300ల చొప్పున కొనుగోలు చేయగా, అందులో అవి పూర్తి స్థాయిలో పంపిణీ జరగలేదనే ఆరోపణలున్నాయి. అధికారులు మాత్రం 479 ప్యాకెట్లు రైతులకు పంపిణీ జరిగినట్లు వీటికి రూ.11.5 లక్షలు వ్యయం చూపించారు. అయితే వీటి పంపిణీలో అవకతవకలు జరగ్గా, కంపెనీ నుంచి పూర్తి స్థాయిలో ప్యాకెట్లు రాలేదనే ఆరోపణలు కూడా లేకపోలేదు. దాదాపు 100 ప్యాకెట్లు వరకు నష్టపోయినట్లు సమాచారం. అంతే కాకుండా పంపిణీ జరిగిన వెంటనే ఇవి బ్లాక్ మార్కెట్‌కు వెళ్లినట్లు ఆరోపణలొచ్చాయి. అలాగే టిష్యూ బనానాకు సంబంధించి కూడా పలు ఆరోపణలు చోటు చేసుకున్నాయి. దీనిలో భాగంగా ఒక్కో మొక్క రూ.12లు చొప్పున 1,53,000 అధికారులు వచ్చినట్లు చెప్తున్నా...ఇందులో బతికినవి మాత్రం 42,990 మొక్కలేనని తేలింది. దీనిలో భాగంగా చనిపోయిన 1,10,010 మొక్కల్లో పార్వతీపురం, కొమరాడ, మక్కువలో నూటికి నూరు శాతం కానరాకుండా పోయాయి. వీటికి కారణం కొమరాడ, గుమ్మలక్ష్మీపురం తదితర ప్రాంతాలలో డ్రిప్ వేయకపోవడం వల్లే ఇది జరిగినట్లు తెలుస్తోంది. ఇక పెండాల్స్కు సంబంధించి సిమ్మెంట్ పోల్స్ నాసిరకంగా ఉన్నాయనే ఆరోపణలున్నాయి. ఇదిలా ఉండగా కూరగాయలు వేయకుండానే కూరగాయల రవాణాకు వాహనాలు కూడా పంపిణీ చేయడం కొసమెరుపు. వీటన్నింటిలో తెర వెనుక భాగస్వామ్యం ఉన్నాయనే ఆరోపణలున్న ఓ అనర్హత ఉద్యోగికి అందలమెక్కించారనే ఆరోపణలూ ఉన్నాయి. ఆ ఉద్యోగికి వాటర్ షెడ్ పథకంలో కీలక ఉద్యోగం కట్టబెట్టినట్లు సమాచారం.