
సాక్షి, విజయనగరం: విభజన చట్టంలో ఉత్తరాంధ్రాకి ఇచ్చిన హామీల అమలులో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని వైఎస్‌ఆర్ సీపీ జిల్లా సమన్వయ కర్త మజ్జి శ్రీనివాస్ రావు అన్నారు. కేంద్రమంత్రి అశోక్ గజపతి రాజు, సీఎం చంద్రబాబు నాయుడుపై ఆయన నిప్పులు చెరిగారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉత్తరాంధ్రాకి అన్యాయం జరుగుతున్న జిల్లా మంత్రి అశోక్ గజపతి నోరు మెదపడం లేదని విమర్శించారు.
అంతర్జాతీయ స్థాయి విమానాశ్రయాలను నిర్వహించగలిగే సత్తా తన శాఖలోని ఏఏఐకి లేదనడం హస్యాస్పదమన్నారు. దేశంలోని ముఖ్యమైన చెన్నై, కోల్‌కత్తా ఎయిర్‌పోర్టులను ఏఏఐనే అద్భుతంగా నిర్వహిస్తోందని శ్రీనివాస్ గుర్తు చేశారు. బోగాపురం విమానాశ్రయం విషయంలో చంద్రబాబు, అశోక్‌లు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. సీఎం చంద్రబాబు, మంత్రి అశోక్‌లు ముడుపులు అందుకునే విమానాశ్రయం ప్రైవేట్ సంస్థకు కట్టబెటాలని చూస్తున్నారని వైఎస్‌ఆర్‌సీపీ నేత శ్రీనివాస్ మండిపడ్డారు.