వలంటీర్ల వ్యవస్థకు రూపకల్పన చేసిన నాటి సీఎం వైఎస్ జగన్
వైఎస్సార్‌సీపీ హయాంలో విశేష సేవలు అందించిన వలంటీర్లు
ఎన్నికలకు ముందు రూ. 10 వేలు ఇస్తానని మాట ఇచ్చిన బాబు
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎటూ తేల్చని వైనం
విజయవాడలో వరద దుర్ఘటన నేపథ్యంలో వలంటీర్ల సేవలను గుర్తు చేసుకుంటున్న ప్రజలు
సాక్షి రాయచోటి: ఎన్నికలకు ముందు ఒక మాట..తర్వాత మరోమాట చెప్పడం టీడీపీ అధినేత, ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబుకు పరిపాటిగా మారింది. గతంలోనూ 2014లో ఇలాంటి మాటలతోనే ప్రజలను బురిడీ కొట్టించి అధికారంలోకి రాగా మరొక మారు అనేక వర్గాల వారికి మాయా బాబు మహా శఠగోపం పెడుతున్నారు. ఈసారి కూడా కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే సూపర్ సిక్స్ పథకాలు అమలు చేస్తామంటూనే ఇప్పటికీ అమలు చేయని తీరును ప్రజలు చర్చించుకుంటున్నారు.
మరోవైపు వైఎస్ జగన్ సర్కార్ 2019 నుంచి వలంటీర్ల వ్యవస్థను అందుబాటులోకి తేగా...అందులో వలంటీర్లకు సంబంధించి రూ. 5 వేలు కాదు..రూ. 10 వేలు గౌరవ వేతనం పెంచి ఇస్తామని చెప్పి ఏకంగా వ్యవస్థకే మంగళం పాడేలా కనిపిస్తున్నారు. రూ. 10 వేలు పెంపు లేకపోగా చివరికి వారిని పట్టించుకునే పరిస్థితి లేకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రతి ఇంటికి సంక్షేమం అందించడంలో కీలకపాత్ర పోషించిన వలంటీర్ల కొనసాగింపే ప్రస్తుతం ప్రశ్నార్థకంగా మారింది.
అధికారంలోకి వచ్చినా ఎదురు చూపులే
గత సార్వత్రిక ఎన్నికల అనంతరం కూటమి సర్కార్ రాష్ట్రంలో అధికార పగ్గాలు చేపట్టింది. చంద్రబాబు ప్రభుత్వంలో వలంటీర్లు కూడా రూ. 10 వేలు గౌరవంగా తీసుకుంటామని ఆశపడ్డ వారికి భంగపాటు తప్పలేదు. కూటమి ప్రభుత్వం ఏర్పడి మూడు నెలలు దాటుతున్నా ఇప్పటివరకు అతీగతీ లేదు. అందులోనూ రెండు దఫాలుగా పింఛన్ల పంపిణీలోనూ వలంటీర్లను పక్కన పెట్టి సచివాలయాల సిబ్బంది ద్వారా పంపిణీకి శ్రీకారం చుట్టారు. దీనిని బట్టి వలంటీర్లను కొనసాగించడం దాదాపు అనుమానమే. మూడు నెలలుగా వలంటీర్లను మళ్లీ తీసుకుంటారేమోనన్న ఆశతో ఎదురు చూస్తూనే ఉన్నారు.
ప్రతి ఇంటికి సంక్షేమాన్ని పంచిన వలంటీర్లు
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 2019లో అధికారంలోకి రాగానే సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వలంటీర్ల వ్యవస్థకు శ్రీకారం చుట్టారు. అప్పటి నుంచి 2024 ఎన్నికల వరకు ప్రజలకు విశేష సేవలు అందించారు. ప్రతి ఇంటికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించడం మొదలుకొని ఎప్పటికప్పుడు ప్రజలకు నీటిని అందించే విషయం, ఆధార్ అప్‌డేట్లు, సర్టిఫికెట్లు, ఆరోగ్య శిబిరాలు, చిన్నపిల్లలకు వేసే వ్యాక్సిన్లు ఇలా ప్రతి ఒక్కటీ వారి ద్వారానే జరుగుతూ వచ్చింది. ప్రజలు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగకుండా ఎప్పటికప్పుడు సమాచారాన్ని సైతం ప్రజలకు చేరవేస్తూ వచ్చారు. వలంటీర్ల ద్వారా ఇళ్ల వద్దకే పథకాలతోపాటు పాలన కొనసాగేది. వైఎస్ జగన్ హయాంలో ప్రజలతో అనునిత్యం మమేకం అవుతూ ఒక వెలుగు వెలిగిన వలంటీర్లకు ప్రస్తుతం కష్టకాలం వెంటాడుతోంది.
వలంటీర్ వ్యవస్థను కొనసాగించాలి
ఎన్నికల ముందు ఓట్లు, సీట్ల కోసం చంద్రబాబు వలంటీర్లకు గౌరవ వేతనం పెంపు పేరుతో వల వేశారు. వలంటీర్ల గౌరవ వేతనం సంగతి దేవుడెరుగు...అధికారంలోకి రాగానే వారి గురించే మరిచిపోయారు. అయితే విజయవాడలో వరదలు పోటెత్తడంతోపాటు బుడమేరుకు గండ్లు పడి జలప్రళయం విజయవాడను ముంచెత్తింది. దీంతో వలంటీర్ల వ్యవస్థ కొనసాగి ఉంటే ఎప్పటికప్పుడు అప్రమత్తం కావడంతోపాటు అన్ని విషయాలు తెలిసేవని, పరిస్థితి మరోలా ఉండేదని వలంటీర్ల గురించి చర్చ మొదలైంది. ఈ నేపథ్యంలో ప్రతి 50 ఇళ్లకు ఒక వలంటీర్ ఉండడం ద్వారా ఉపద్రవాలు, ఉప్పెనలు, ఇతర అతలాకుతలం పరిస్థితులు, ఇంకా ఎలాంటి సమాచారం ఉన్నా ముందే ప్రజలకు తెలియజేసే అవకాశం ఉంటుందని.. వలంటీర్లను కొనసాగించాలని ప్రజల నుంచి కూడా డిమాండ్ వినవస్తోంది. ప్రజల అవసరాల నిమిత్తం వలంటీర్లను కొనసాగిస్తారో...లేక పక్షపాత ధోరణితో కూటమి సర్కార్ అణచి వేస్తుందో వేచి చూడాల్సిందే. ఏది ఏమైనా వలంటీర్లు చేసిన సేవలను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ మేరకు గౌరవ వేతనాన్ని పెంచి అందరినీ కొనసాగించాలని వలంటీర్ల సంఘం డిమాండ్ చేస్తోంది.
తగిన నిర్ణయం తీసుకోవాలి
గ్రామ,వార్డు వలంటీర్లను తిరిగి వెంటనే విధుల్లోకి తీసుకుని న్యాయం చేయాలి. వలంటీర్లుగా ప్రజలకు అందుబాటులో ఉంటూ అనేక రకాలుగా చేసిన సేవలను ప్రభుత్వం గుర్తించాలి. గత ఆరు నెలలుగా జీతభత్యాలు లేక, విధులు లేక సందిగ్ధావçస్థలో ఉన్న వలంటీర్లపై ప్రభుత్వం తగిన నిర్ణయం తీసుకోవాలి.
– రెడ్డి శివకృష్ణ, కొండయ్యగారి పల్లె, నిమ్మనపల్లె మండలం
సీఎం హామీని నిలబెట్టుకోవాలి
వలంటీర్ల వ్యవస్థను కొనసాగించి సీఎం చంద్రబాబునాయుడు తన ఎన్నికల వాగ్దానాన్ని నిలబెట్టుకోవాలి. ఇచ్చిన మాట ప్రకారం వలంటీర్లకు గౌరవ వేతనం రూ.10వేలు అందించేలా ప్రభుత్వం చర్యలు చేపట్టాలి. గ్రామ, వార్డు వలంటీర్ల అవస్థలు గుర్తించి వెంటనే వలంటీర్ల వ్యవస్థ కొనసాగింపుపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుని వలంటీర్లకు న్యాయం చేయాలి.
– వెంకటేష్, గ్రామ వలంటీర్, నిమ్మనపల్లె.
విధుల్లోకి తీసుకోండి
ప్రజలకు ఎన్నో సేవలందించిన వలంటీర్లను విధుల్లోకి తీసుకోవాలి. ఎన్నికల సమయంలో కూటమి ప్రభు త్వం ఇచ్చిన హామీలను నిలబెట్టుకొని వలంటీర్లకు న్యాయం చేయాలి. గతంలో ప్రజలకు ఎన్నో సేవలందించాం. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి వలంటీర్ల సేవలను వినియోగించుకోవాలి.
– శివరామ్, సంబేపల్లె వలంటీర్
ఎన్నో సేవలందించాం
గత ప్రభుత్వంలో ప్రజలకు ఎన్నో సేవలు అందించాము. కరోనా సమయంలో ప్రాణాలు ఫణంగా పెట్టి ప్రజలకు అందుబాటులో ఉండి మందులను అందజేశాము. సుదూర ప్రాంతాలలోని ఆసుపత్రిలో ఆరోగ్యం బాగాలేక చికిత్స పొందుతున్న వారికి పింఛన్, వివిధ పథకాలు అందజేశాము. మా సేవలను గుర్తించాలి.
– సుబ్బరాయుడు, వలంటీర్, శెట్టిపల్లె పాళెంగడ్డ, సంబేపల్లె
Comments
Please login to add a commentAdd a comment