దీపం అమలులో టీడీపీ విఫలం
► కేంద్రమంత్రి అశోక్ గజపతిరాజు
భీమవరం : గతంలో అధికారంలో ఉన్నప్పుడు దీపం పథకంపై తెలుగుదేశం పార్టీ విస్తృతంగా ప్రచారం చేసినా.. అమలులో విజయం సాధించలేకపోయిందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి పి.అశోక్‌గజపతిరాజు వ్యాఖ్యానించారు. ఈ పథకాన్ని దేశవ్యాప్తంగా అమలు చేయడం ద్వారా కేంద్ర ప్రభుత్వం విజయం సాధించిందని చెప్పారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం వచ్చిన ఆయన సోమవారం స్థానిక విలేకరులతో మాట్లాడారు. ప్రతి జిల్లాలో ఎయిర్ పోర్టు ఏర్పాటు చేయాలనే ప్రత్యేక ప్రతిపాదన ఏదీ లేదని అవసరం, అవకాశాలను బట్టి ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు.
గతంలో రైతులు ఎరువుల కోసం షాపుల వద్దకు ఎగబడితే పోలీసులు లాఠీచార్జీలు చేసిన ఘటనలు అనేకం ఉండేవన్నారు. నేడు ఆ పరిస్థితి లేదని, ఎరువుల సరఫరా విషయంలో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ప్రత్యేక చర్యలే దీనికి కారణమని అన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, రాష్ట్ర ప్రతిపక్షనేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రధాని నరేంద్రమోదీని కలవడం వల్ల టీడీపీ భయపడుతోందనే వాదన సరైంది కాదని వ్యాఖ్యానించారు. ఆయన వెంట రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి పితాని సత్యనారాయణ, నరసాపురం ఎంపీ గోకరాజు గంగరాజు, మాజీ ఎంపీ కావూరి సాంబశివరావు, ఎమ్మెల్యే వేటుకూరి వెంకటశివరామరాజు, ఎమ్మెల్సీ కంతేటి సత్యనారాయణరాజు, బీజేపీ జిల్లా అధ్యక్షుడు భూపతిరాజు శ్రీనివాసవర్మ ఉన్నారు.
కాంగ్రెస్ మాటలు విడ్డూరం
అశాస్త్రీయంగా రాష్ట్ర విభజన చేసిన కాంగ్రెస్ పార్టీ నేడు ప్రత్యేక హోదా కోసం మాట్లాడడం విడ్డూరంగా ఉందని కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజు అన్నారు. కేంద్ర ప్రభుత్వం మూడేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా సోమవారం భీమవరంలో నిర్వహించిన అందరితో కలసి అందరి అభివృద్ధి సమ్మేళన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. పోలవరం నిర్మాణం మోదీ ప్రభుత్వం వల్లనే సాధ్యమవుతోందన్నారు. రాష్ట్ర దేవదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు, ఎంపీ గోకరాజు గంగరాజు, బీజేపీ జిల్లా అధ్యక్షుడు భూపతిరాజు శ్రీనివాసవర్మ, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.