ప్రహసనంగా టీడీపీ సభ్యత్వ నమోదు
రూ.5 లక్షల బీమా వస్తుందని నమ్మబలికి సభ్యత్వాలు.. సభ్యత్వం ఉంటేనే ప్రభుత్వ పథకాలు వస్తాయని బెదిరింపులు
నియోజకవర్గాలు, నేతల వారీగా టార్గెట్లు
టార్గెట్లు పూర్తయితేనే పార్టీలో అవకాశాలుంటాయని హెచ్చరిక
టీడీపీ సభ్యత్వాల కోసం వైఎస్సార్ బీమా బలి
సాక్షి, అమరావతి: అడుగడుగునా ప్రలోభాలు, బలవంతాలు, మాయమాటలు, బెదిరింపులు.. అధికార తెలుగుదేశం పార్టీ కోటి సభ్యత్వాల వెనుక తతంగమిది. ప్రజల్ని మాయ చేయడంలో ఆరితేరిన తెలుగుదేశం పార్టీ అధినేత, సీఎం చంద్రబాబు ఆడిన మరో మాయ నాటకమిది. ఈ కోటి సభ్యత్వాల వెనుక అధికారాన్ని అడ్డుపెట్టుకొని మూడు నెలలుగా టీడీపీ నేతలు ఒక పథకం ప్రకారం సాగించిన దందా దాగి ఉంది. ఓ పక్క బీమా ఆశ చూపించడం, మరోపక్క పథకాలు ఆగిపోతాయన్న బెదిరింపులు, ఇంకోపక్క మాయమాటలు.. ఇలా సభ్యత్వాలన్నీ ప్రజలకు ఇష్టం లేకపోయినా బలవంతంగా చేయించినవేనని టీడీపీ నేతలే చెబుతున్నారు.
టీడీపీ సభ్యత్వం తీసుకున్న వారికి రూ.5 లక్షల బీమా ఉంటుందని ఆ పార్టీ నేతలు విస్తృతంగా ప్రచారం చేశారు. సభ్యత్వాల నమోదు ప్రారంభానికి ముందే చంద్రబాబు గతంలో రూ.2 లక్షలుగా ఉన్న ఈ బీమాను రూ.5 లక్షలకు పెంచుతున్నట్లు ప్రకటించారు. దాని గురించి ప్రచారం చేయడంతోపాటు ప్రతి గ్రామంలోని ఓటర్లలో 80 శాతం మందిని సభ్యులుగా చేర్చాలని నేతలపై ఒత్తిడి చేశారు. సభ్యత్వాలు చేయించిన వారికే పార్టీలో అవకాశాలు ఉంటాయని చెప్పారు. దీంతో నేతలు, కార్యకర్తలు ఇంటింటికీ తిరిగి టీడీపీ సభ్యత్వం తీసుకుంటే ఉచితంగా రూ.5 లక్షల బీమా వస్తుందని ప్రజల్ని నమ్మించారు.
సభ్యత్వం ఉంటేనే పథకాలని బెదిరింపులు
మరోపక్క టీడీపీ సభ్యత్వం ఉంటేనే ప్రభుత్వ సంక్షేమ పథకాలు వస్తాయని, లేకుంటే రావని ఇంటింటికీ తిరిగి బెదిరింపులకు దిగారు. ప్రజల నుంచి ఆధార్ కార్డులు తీసుకుని పేర్లు రాసేసి, సభ్యత్వ రుసుము రూ.100 కూడా నాయకులే కట్టేశారు. ఈ కార్యక్రమాన్ని మంగళగిరి టీడీపీ కార్యాలయం నుంచి నిరంతరం పర్యవేక్షించారు. ఏ నియోజకవర్గంలో ఎంత శాతం సభ్యత్వాలు అయ్యాయో విశ్లేషిస్తూ తగ్గిన నియోజకవర్గాల నాయకులను హెచ్చరించారు. చంద్రబాబు పలుసార్లు టెలీ కాన్ఫరెన్స్‌లు నిర్వహించి తక్కువ సభ్యత్వాలు నమోదైన నియోజకవర్గాల నేతలకు చీవాట్లు పెట్టారు. దీంతో వారు గ్రామాలు, వార్డుల్లో తిష్టవేసి బలవంతంగా సభ్యత్వాలు చేయించారు. కొన్ని గ్రామాల్లో ఏకంగా 80, 90 శాతం ఓటర్లను తమ సభ్యులుగా చేరి్పంచేశారు.
ముచ్చర్లలో బయటపడిన బాగోతం
విశాఖ జిల్లా ఆనందపురం మండలం ముచ్చర్ల గ్రామంలో ఏకంగా గ్రామంలోని వంద శాతం ఓటర్లను సభ్యులుగా నమోదు చేశారు. వంద శాతం సభ్యత్వ నమోదు జరిగిన గ్రామంగా ముచ్చర్లను ప్రకటించి సీఎం తనయుడు లోకేశ్‌తో అక్కడ ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. అయితే అక్కడి సభ్యత్వాల లోగుట్టును వైఎస్సార్‌సీపీ నేత గుడివాడ అమర్‌నాథ్ బయటపెట్టడంతో లోకేశ్ పర్యటనను రద్దు చేసుకున్నారు. ముచ్చర్ల ఈనాం అన్ సెటిల్డ్ గ్రామం కావడంతో అక్కడున్న 600 ఎకరాలు వివాదంలో ఉన్నాయి. ఆ భూములకు పట్టాలు ఇప్పిస్తామని నమ్మబలికి, గ్రామస్తుల ఆధార్ కార్డులు తీసుకుని టీడీపీ సభ్యత్వాలు నమోదు చేయించినట్లు బయటపడింది.
నిజానికి ఆ గ్రామ సర్పంచ్, వార్డు సభ్యులంతా వైఎస్సార్‌సీపీకి చెందినవారు. ఆ గ్రామంలో సుమారు 1,350 ఓట్లు ఉంటే గత ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీకి 600కిపైగా ఓట్లు వచ్చాయి. జనసేన, బీజేపీ, వామపక్ష పార్టీల నేతలు కూడా ఆ గ్రామంలో ఉన్నారు. అలాంటి గ్రామంలో నూటికి నూరు శాతం టీడీపీ సభ్యత్వాల నమోదు ఎలా సాధ్యమైందనే ప్రశ్నకు సమాధానం కరువైంది. అందుకే ఆ గ్రామానికి రాకుండా లోకేశ్ జారుకున్నారు. దాదాపు అన్ని గ్రామాల్లోనూ ఇదే రీతిలో టీడీపీ శ్రేణులు బోగస్ సభ్యత్వాలు చేయించారు.
వైఎస్సార్ బీమాను పణంగా పెట్టి..
మరోవైపు టీడీపీ సభ్యత్వాల కోసం రాజకీయాలకు అతీతంగా అందరికీ అమలైన వైఎస్సార్ బీమా పథకాన్ని కూటమి ప్రభుత్వం నిలిపి వేసింది. ప్రతి గ్రామ, వార్డు సచివాలయం పరిధిలోని ప్రతి ఒక్కరితో వలంటీర్లు ఈ బీమాకు దరఖాస్తు చేయించారు. ఎవరైనా రోడ్డు ప్రమాదంలోనో, అనారోగ్యంతోనే చనిపోతే నేరుగా వారి ఖాతాల్లో రూ.5 లక్షల బీమా సొమ్ము జమ అయ్యేది. మృతుని కుటుంబానికి తక్షణం రూ.10 వేలు ఇచ్చేవారు. కూటమి ప్రభుత్వం రాగానే ఈ పథకాన్ని నిలిపివేసి, టీడీపీ సభ్యత్వాల నమోదు ప్రారంభించారు. టీడీపీ సభ్యత్వం తీసుకుంటే రూ.5 లక్షల బీమా వస్తుందని చెప్పారు.
వైఎస్సార్ బీమా లేదు కాబట్టి ఇదైనా వస్తుందనే ఆశతో చాలామంది తప్పనిసరై సభ్యత్వం తీసుకున్నారు. కానీ, ఎవరికీ బీమా వర్తించడంలేదు. కృష్ణా జిల్లా మంటాడకు చెందిన ఆరేపల్లి సత్యనరేంద్ర వరప్రసాద్ (37) ఇటీవల రోడ్డు ప్రమాదంలో చనిపోతే అతని కుటుంబానికి ఒక్క రూపాయి పరిహారం రాలేదు. వైఎస్సార్ బీమా ఉంటే అతనికి రూ.5 లక్షలు వచ్చేది. ఇప్పుడు ఎలాంటి పరిహారం అందక ఆ కుటుంబం ఇబ్బందులు పడుతోంది. ప్రతి గ్రామంలోనూ ఇలాంటి కేసులు పదుల సంఖ్యలో ఉన్నాయి. బీమా పేరుతో టీడీపీ చేస్తున్న మోసపూరిత సభ్యత్వ నమోదుకు ఇదో నిదర్శనం.
Comments
Please login to add a commentAdd a comment