ఇదేం కల్చర్..? | ITDA Harti Culture Allegations | Sakshi
Sakshi News home page

ఇదేం కల్చర్..?

Published Sun, Jul 12 2015 12:56 AM | Last Updated on Sun, Sep 3 2017 5:19 AM

ITDA Harti Culture Allegations

పార్వతీపురం:ఐటీడీఏలో హార్టికల్చర్‌సాగుపై వచ్చిన ఆరోపణలను అధికారులు గాలికి వదిలేస్తున్నారా...? బాధ్యులు ఎవరో తేలకుండానే విచారణను ముగించేస్తున్నారా..? పరిస్థితులు చూస్తే అవుననే సమాధానం వినిపిస్తోంది. గత ఐటీడీఏ పాలక వర్గ సమావేశంలో సాక్షాత్తూ కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజు సమక్షంలో ప్రజా ప్రతినిధులు ఐటీడీఏ హార్టీ కల్చర్ సాగులో అవకతవకలు జరిగాయని ఆరోపించారు. దీనిపై విచారణ కమిటీ వేయాలని అశోక్ గజపతిరాజు సమక్షంలోనే పాలక వర్గం తమ ఆమోదాన్ని తెలిపింది. అయితే ఇప్పటి వరకు ఆ విచారణ కమిటీ జాడ లేకపోగా, ఆయా తీపి జొన్న, టిష్యూ బనానా, కూరగాయల పందిరి పెండాల్స్‌పై లబ్ధిదారుల ఎంపిక నుంచి ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారి పలుకుబడితో ఇటీవల బదిలీ చేయించుకున్నారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారిని బదిలీ, రిలీవ్ చేయడంపై సంబంధిత అధికారులపై గిరిజనులు, గిరిజన సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
 
 ఈ నేపథ్యంలో   తీపి జొన్న, టిష్యూ బనానా తదితర సాగులో జరిగిన అవకతవకలు, ఆయా పంటల వల్ల జరిగిన నష్టాలకు ఎవరు బాధ్యులంటూ గిరిజన సంఘాల నాయకులు, గిరిజనులు ప్రశ్నిస్తున్నారు. ఐటీడీఏ పరిధిలో తీపిజొన్న 500 ప్యాకెట్లు, ఒక్కో ప్యాకెట్ సుమారు రూ.2,300ల చొప్పున కొనుగోలు చేయగా, అందులో అవి పూర్తి స్థాయిలో పంపిణీ జరగలేదనే ఆరోపణలున్నాయి. అధికారులు మాత్రం 479 ప్యాకెట్లు రైతులకు పంపిణీ జరిగినట్లు వీటికి రూ.11.5 లక్షలు వ్యయం చూపించారు. అయితే వీటి పంపిణీలో అవకతవకలు జరగ్గా, కంపెనీ నుంచి పూర్తి స్థాయిలో ప్యాకెట్లు రాలేదనే ఆరోపణలు కూడా లేకపోలేదు. దాదాపు 100 ప్యాకెట్లు వరకు నష్టపోయినట్లు సమాచారం. అంతే కాకుండా పంపిణీ జరిగిన వెంటనే ఇవి బ్లాక్ మార్కెట్‌కు వెళ్లినట్లు ఆరోపణలొచ్చాయి. అలాగే టిష్యూ బనానాకు సంబంధించి కూడా పలు ఆరోపణలు చోటు చేసుకున్నాయి.
 
 దీనిలో భాగంగా ఒక్కో మొక్క రూ.12లు చొప్పున 1,53,000 అధికారులు వచ్చినట్లు చెప్తున్నా...ఇందులో బతికినవి మాత్రం 42,990 మొక్కలేనని తేలింది. దీనిలో భాగంగా చనిపోయిన 1,10,010 మొక్కల్లో పార్వతీపురం, కొమరాడ, మక్కువలో నూటికి నూరు శాతం కానరాకుండా పోయాయి. వీటికి కారణం కొమరాడ, గుమ్మలక్ష్మీపురం తదితర ప్రాంతాలలో డ్రిప్ వేయకపోవడం వల్లే ఇది జరిగినట్లు తెలుస్తోంది. ఇక  పెండాల్స్‌కు సంబంధించి సిమ్మెంట్ పోల్స్ నాసిరకంగా ఉన్నాయనే ఆరోపణలున్నాయి. ఇదిలా ఉండగా కూరగాయలు వేయకుండానే కూరగాయల రవాణాకు వాహనాలు కూడా పంపిణీ చేయడం కొసమెరుపు. వీటన్నింటిలో తెర వెనుక భాగస్వామ్యం ఉన్నాయనే ఆరోపణలున్న ఓ అనర్హత ఉద్యోగికి అందలమెక్కించారనే ఆరోపణలూ ఉన్నాయి.  ఆ ఉద్యోగికి  వాటర్ షెడ్ పథకంలో కీలక ఉద్యోగం కట్టబెట్టినట్లు సమాచారం.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement