ఒకప్పుడు భద్రాచలం ఐటీడీఏ పరిధిలో ఇప్పపూల సేకరణ జోరుగా సాగేది. ఏటా వందల క్వింటాళ్లు... ఒక్కో ఏడాది అంతకు మించి ఇప్పపూవు సేకరించే గిరిజనులు జీసీసీకి అమ్మి ఆర్థికంగా ఎంతోకొంత లబ్ధి పొందేవారు. తద్వారా వారికి ఉపాధి లభించడమే కాక ఆ పూవును మరింత శుద్ధి చేసి అమ్ముతూ జీసీసీ సైతం ఆదాయం గడించేది. కానీ రానురాను రకరకాల కారణాలతో ఇప్ప పూల సేకరణ తగ్గిపోయి అటు గిరిజనులు, ఇటు జీసీసీ ఆదాయానికి గండి పడుతోంది. ఈ నేపథ్యంలో మళ్లీ సేకరణను గాడిలో పడేసేలా రాష్ట్రంలోనే ప్రత్యేకంగా భద్రాచలం ఐటీడీఏ ప్రాజెక్టు ఆఫీసర్ చొరవ తీసుకుని అడుగులు వేస్తున్నారు. – సాక్షి, ఖమ్మం డెస్క్
అడవి లేక.. చెట్లు కానరాక
పునర్విభజనతో భద్రాచలానికి సమీపాన ఉన్న చిక్కని అటవీ ప్రాంతం ఏపీ పరిధిలోకి వెళ్లింది. దీంతో అక్కడి గిరిజనులు ఇప్పపూవు సేకరించి పాడేరు ఐటీడీఏ పరిధి జీసీసీకి అమ్ముతున్నారు. ఇదేకాక పోడు సాగుతో ఇప్ప చెట్ల సంఖ్య నానాటికీ తగ్గుతోంది. అదేవిధంగా భద్రాచలం జీసీసీకి గిరిజనులు ఇస్తున్న ఇప్పపూవు పరిమాణమూ తగ్గుతోంది.
ఇక ఇప్పపూవు సేకరణ, శుద్ధి, అమ్మితే సమకూరే ఆదాయంపై ఆదివాసీ, గిరిజనులకు అవగాహన కల్పించే వారు కరువయ్యారు. ఏడాది క్రితం భద్రాచలం ఏటీడీఏ పీఓగా బాధ్యతలు స్వీకరించిన ప్రతీక్‌జైన్ గిరిజనుల ఉపాధి అవకాశాలు మెరుగపడేలా చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా జీసీసీ ఆధ్వర్యాన సేకరిస్తున్న అటవీ ఉత్పత్తులపై ఆరా తీయగా ఇప్పపూవు విషయంలో హెచ్చుతగ్గులు గుర్తించి మళ్లీ గాడిన పడేయాలని రంగంలోకి దిగారు.
గత ఏడాది 327 క్వింటాళ్లు
భద్రాచలం జీసీసీ పరిధిలో ఆరు సబ్ బ్రాంచ్‌లు ఉన్నాయి. వీటి ద్వారా గడిచిన ఆర్థిక సంవత్సరం(2022–23)లో 327 క్వింటాళ్ల ఇప్ప పూవు సేకరించారు. అయితే, పదేళ్ల క్రితం వందలు దాటి వేల క్వింటాళ్లు సేకరించిన దాఖలాలూ ఉన్నాయి. ఇప్పపూవు నాణ్యత ఆధారంగా కేజీకి రూ.30 నుంచి రూ.35 చొప్పున జీసీసీ నుంచి గిరిజనులకు చెల్లిస్తారు. ప్రస్తుతం భద్రాచలం ఐటీడీఏ పరిధిలోని ఇల్లెందు, కరకగూడెం నుంచి ఎక్కువగా ఇప్పపూవు తీసుకొ స్తున్నారని జీసీసీ అధికారులు చెబుతున్నారు.
ఏం చేస్తారంటే?
జీసీసీ ద్వారా సేకరించిన ఇప్పపూవును మరింత శుద్ధి చేస్తారు. దీన్ని ఎక్కువగా ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్ వ్యాపారులు లేదా అక్కడి ప్రజలు నేరుగా కొనుగోలు చేస్తారు. వీరు ఇప్పపూలతో గారెలు, లడ్డూలు, ఇతర వంటకాలు చేసుకుంటారు. మరోపక్క అనధికారికంగా ఇప్పపూలతో సారా కాచి తాగడం ఆదివాసీల్లో ఏళ్ల నుంచి ఆచారంగా కొనసాగుతోంది.
పర్ణశాలలో అమ్మకం
శ్రీసీతారామచంద్రస్వామి వన వాసానికి వచ్చినప్పుడు భద్రాచలం సమీపాన దుమ్ముగూడెం మండలం పర్ణశాలకు వచ్చినట్లు పురాణాల్లో ఉంది. సీతారాములు వనవాసానికి వచ్చినప్పుడు అన్ని అటవీ ఫలాలతో పాటు ఇప్పపూవు తీసుకున్నారని భక్తులకు నమ్మకంగా చెప్పే చిరువ్యాపారులు పర్ణశాల వద్ద ఇప్పపూలను కుప్పలుగా పోసి అమ్మడం కనిపిస్తుంది. కానీ దీనికి ఎలాంటి చారిత్రక, పురాణ ఆధారాలు లేవని అర్చకులు చెబుతారు. అయినప్పటికీ పర్ణశాల, భద్రాచలం వచ్చిన భక్తులు ఎంతో కొంత ఇప్పపూవు కొనుగోలు చేసి తీసుకెళ్లడం ఆనవాయితీగా కొనసాగుతోంది.
25వేలకు పైగా మొక్కలు
ఇప్పపూవు సేకరణ పెరగాలంటే అదే సంఖ్యలో మొక్కలు ఉండాలి. అందుకోసం అటవీ శాఖ నుంచి 25వేలకు పైగా మొక్కలు సేకరించిన పీఓ.. ప్రతీ గిరిజన కుటుంబానికి ఒక్కో మొక్క పంపిణీ చేయడం ప్రారంభించారు. అయితే, ఈ మొక్కలు ఉచితంగానే ఇవ్వాలని తొలుత భావించినా.. అలా చేస్తే నాటడం, సంరక్షణపై శ్రద్ధ చూపరనే ఆలోచనతో నామమాత్రపు ధర నిర్ణయించారు. ‘ఇంటికో ఇప్పమొక్క’పేరిట ఆరంభించిన ఈ కార్యక్రమంతో మంచి ఫలితాలు వచ్చేలా స్వయంగా పీఓ సైతం ఐటీడీఏ కార్యాలయంలో మొక్క నాటారు. ఈ కార్యక్రమం సత్ఫలితాలను ఇచ్చి ఇప్పమొక్కలు వనాలైతే పూల సేకరణ ద్వారా గిరిజనులు ఆర్థికాభివృద్ధి సాధించడమే కాక జీసీసీకి సైతం ఆదాయం పెరగనుందని చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment