innovative experiment
-
ఒట్టేసి..బంధంతో కట్టేసి..
ఉప్పల్ : అది ఉప్పల్ నల్ల చెరువు సెంటర్.. ఆదివారం రాత్రి ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు.. అదే సమయంలో ఓ వ్యక్తి తన ఫ్యామిలీతో కలిసి అటుగా బైక్‌పై వెళ్తున్నాడు.. ఇంకేముంది డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడ్డాడు. పక్కనే ఫ్యామిలీ ఉండటంతో పరుపోతుందన్న భయంతో బైక్ పక్కగా ఆపి ఇన్స్పెక్టర్తో కాళ్లబేరానికి వచ్చాడు.. అంత వరకూ బాగానే నడిచినా..ఇందులో వింతేముంది? ఎప్పుడూ జరిగే తంతేగా అనుకోవద్దు.. ఇక్కడే ఉంది అసలైన కిక్కు.. కాస్తా భిన్నంగా ఆలోచించిన ఇన్స్పెక్టర్ లక్ష్మి మాధవి.. కొద్దిసేపు అతడి భార్య, కుమారుడితో మాట్లాడారు. అనంతరం తండ్రికి కొడుకుతో కౌన్సెలింగ్ ఇప్పించారు. ‘నాన్నా నువ్వు నాకు కావాలి.. నువ్వు ఇలా తాగి బైక్ నడపడం ఎంతో ప్రమాదం.. నీకేమైనా అయితే మేమేం కావాలి? అంటూ.. చెప్పడమే కాకుండా.. మరోసారి తాగి డ్రైవింగ్ చేయనని తనపై ఒట్టు వేయమని అడిగించారు..వచ్చీ రాని మాటలతో కొడుకు చెప్పినదానికి భావోద్వేగానికి గురైన తండ్రి కొడుకుకు ప్రామిస్ చేశాడు.. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. -
ఇంటికో ఇప్పమొక్క!
ఒకప్పుడు భద్రాచలం ఐటీడీఏ పరిధిలో ఇప్పపూల సేకరణ జోరుగా సాగేది. ఏటా వందల క్వింటాళ్లు... ఒక్కో ఏడాది అంతకు మించి ఇప్పపూవు సేకరించే గిరిజనులు జీసీసీకి అమ్మి ఆర్థికంగా ఎంతోకొంత లబ్ధి పొందేవారు. తద్వారా వారికి ఉపాధి లభించడమే కాక ఆ పూవును మరింత శుద్ధి చేసి అమ్ముతూ జీసీసీ సైతం ఆదాయం గడించేది. కానీ రానురాను రకరకాల కారణాలతో ఇప్ప పూల సేకరణ తగ్గిపోయి అటు గిరిజనులు, ఇటు జీసీసీ ఆదాయానికి గండి పడుతోంది. ఈ నేపథ్యంలో మళ్లీ సేకరణను గాడిలో పడేసేలా రాష్ట్రంలోనే ప్రత్యేకంగా భద్రాచలం ఐటీడీఏ ప్రాజెక్టు ఆఫీసర్ చొరవ తీసుకుని అడుగులు వేస్తున్నారు. – సాక్షి, ఖమ్మం డెస్క్ అడవి లేక.. చెట్లు కానరాక పునర్విభజనతో భద్రాచలానికి సమీపాన ఉన్న చిక్కని అటవీ ప్రాంతం ఏపీ పరిధిలోకి వెళ్లింది. దీంతో అక్కడి గిరిజనులు ఇప్పపూవు సేకరించి పాడేరు ఐటీడీఏ పరిధి జీసీసీకి అమ్ముతున్నారు. ఇదేకాక పోడు సాగుతో ఇప్ప చెట్ల సంఖ్య నానాటికీ తగ్గుతోంది. అదేవిధంగా భద్రాచలం జీసీసీకి గిరిజనులు ఇస్తున్న ఇప్పపూవు పరిమాణమూ తగ్గుతోంది. ఇక ఇప్పపూవు సేకరణ, శుద్ధి, అమ్మితే సమకూరే ఆదాయంపై ఆదివాసీ, గిరిజనులకు అవగాహన కల్పించే వారు కరువయ్యారు. ఏడాది క్రితం భద్రాచలం ఏటీడీఏ పీఓగా బాధ్యతలు స్వీకరించిన ప్రతీక్‌జైన్ గిరిజనుల ఉపాధి అవకాశాలు మెరుగపడేలా చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా జీసీసీ ఆధ్వర్యాన సేకరిస్తున్న అటవీ ఉత్పత్తులపై ఆరా తీయగా ఇప్పపూవు విషయంలో హెచ్చుతగ్గులు గుర్తించి మళ్లీ గాడిన పడేయాలని రంగంలోకి దిగారు. గత ఏడాది 327 క్వింటాళ్లు భద్రాచలం జీసీసీ పరిధిలో ఆరు సబ్ బ్రాంచ్‌లు ఉన్నాయి. వీటి ద్వారా గడిచిన ఆర్థిక సంవత్సరం(2022–23)లో 327 క్వింటాళ్ల ఇప్ప పూవు సేకరించారు. అయితే, పదేళ్ల క్రితం వందలు దాటి వేల క్వింటాళ్లు సేకరించిన దాఖలాలూ ఉన్నాయి. ఇప్పపూవు నాణ్యత ఆధారంగా కేజీకి రూ.30 నుంచి రూ.35 చొప్పున జీసీసీ నుంచి గిరిజనులకు చెల్లిస్తారు. ప్రస్తుతం భద్రాచలం ఐటీడీఏ పరిధిలోని ఇల్లెందు, కరకగూడెం నుంచి ఎక్కువగా ఇప్పపూవు తీసుకొ స్తున్నారని జీసీసీ అధికారులు చెబుతున్నారు. ఏం చేస్తారంటే? జీసీసీ ద్వారా సేకరించిన ఇప్పపూవును మరింత శుద్ధి చేస్తారు. దీన్ని ఎక్కువగా ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్ వ్యాపారులు లేదా అక్కడి ప్రజలు నేరుగా కొనుగోలు చేస్తారు. వీరు ఇప్పపూలతో గారెలు, లడ్డూలు, ఇతర వంటకాలు చేసుకుంటారు. మరోపక్క అనధికారికంగా ఇప్పపూలతో సారా కాచి తాగడం ఆదివాసీల్లో ఏళ్ల నుంచి ఆచారంగా కొనసాగుతోంది. పర్ణశాలలో అమ్మకం శ్రీసీతారామచంద్రస్వామి వన వాసానికి వచ్చినప్పుడు భద్రాచలం సమీపాన దుమ్ముగూడెం మండలం పర్ణశాలకు వచ్చినట్లు పురాణాల్లో ఉంది. సీతారాములు వనవాసానికి వచ్చినప్పుడు అన్ని అటవీ ఫలాలతో పాటు ఇప్పపూవు తీసుకున్నారని భక్తులకు నమ్మకంగా చెప్పే చిరువ్యాపారులు పర్ణశాల వద్ద ఇప్పపూలను కుప్పలుగా పోసి అమ్మడం కనిపిస్తుంది. కానీ దీనికి ఎలాంటి చారిత్రక, పురాణ ఆధారాలు లేవని అర్చకులు చెబుతారు. అయినప్పటికీ పర్ణశాల, భద్రాచలం వచ్చిన భక్తులు ఎంతో కొంత ఇప్పపూవు కొనుగోలు చేసి తీసుకెళ్లడం ఆనవాయితీగా కొనసాగుతోంది. 25వేలకు పైగా మొక్కలు ఇప్పపూవు సేకరణ పెరగాలంటే అదే సంఖ్యలో మొక్కలు ఉండాలి. అందుకోసం అటవీ శాఖ నుంచి 25వేలకు పైగా మొక్కలు సేకరించిన పీఓ.. ప్రతీ గిరిజన కుటుంబానికి ఒక్కో మొక్క పంపిణీ చేయడం ప్రారంభించారు. అయితే, ఈ మొక్కలు ఉచితంగానే ఇవ్వాలని తొలుత భావించినా.. అలా చేస్తే నాటడం, సంరక్షణపై శ్రద్ధ చూపరనే ఆలోచనతో నామమాత్రపు ధర నిర్ణయించారు. ‘ఇంటికో ఇప్పమొక్క’పేరిట ఆరంభించిన ఈ కార్యక్రమంతో మంచి ఫలితాలు వచ్చేలా స్వయంగా పీఓ సైతం ఐటీడీఏ కార్యాలయంలో మొక్క నాటారు. ఈ కార్యక్రమం సత్ఫలితాలను ఇచ్చి ఇప్పమొక్కలు వనాలైతే పూల సేకరణ ద్వారా గిరిజనులు ఆర్థికాభివృద్ధి సాధించడమే కాక జీసీసీకి సైతం ఆదాయం పెరగనుందని చెబుతున్నారు. -
ట్రాఫిక్ రూల్స్ పాటించలేదో.. నేరుగా మీ కంపెనీకే నోటీసులు
బెంగళూరు: రోడ్లపై ట్రాఫిక్ సిగ్నళ్లు, స్పీడ్ లిమిట్లను పట్టించుకోకుండా వాహనంపై ముందుకు దూసుకెళ్లే టెకీలకు కళ్లెం వేసేందుకు బెంగళూరు ట్రాఫిక్ పోలీసులు వినూత్న ప్రయోగం చేపట్టారు. దీని ప్రకారం..రహదారి నిబంధనలను బేఖాతరు చేసే టెకీలకు కాకుండా వారు పనిచేసే సంస్థలకు నేరుగా ట్రాఫిక్ పోలీసులు ఇకపై నోటీసులు అందజేస్తారు. అవుటర్ రింగ్ రోడ్, వైట్‌ఫీల్డ్ ప్రాంతంలో ఉన్న ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కారిడార్‌లో ఈ వారంలో ఇది ప్రయోగాత్మకంగా మొదలైంది. ట్రాఫిక్ ఉల్లంఘనల సంఖ్యలో భారీ తగ్గుదల నమోదైనట్లు గుర్తిస్తే ఈ పద్ధతినే మిగతా ప్రాంతాలకు సైతం క్రమేపీ విస్తరిస్తామని బెంగళూరు ట్రాఫిక్ ఉన్నతాధికారులు అంటున్నారు. రహదారి భద్రత, ట్రాఫిక్ నియమాలపై అవగాహన పెంచడమే తమ లక్ష్యమంటున్నారు. ఈస్ట్ డివిజన్ పరిధిలోని ట్రాఫిక్ ఉల్లంఘనుల్లో ఇక్కడి టెక్నాలజీ సంస్థల్లో పనిచేసే వారే అత్యధికులు ఉండటంతో వారినే లక్ష్యంగా చేసుకుని ఈ కార్యక్రమం తీసుకువచ్చామన్నారు. -
వ్యర్థం.. ప్రయోజనమే
సిద్దిపేట జోన్: జాతీయ, రాష్ట్ర స్థాయిలో స్వచ్ఛతలో గుర్తింపు పొందిన సిద్దిపేట మున్సిపాలిటీలో చేపట్టిన వినూత్న ప్రయోగం విజయమవంతమైంది. ఆరు నెలల క్రితం ప్రారంభమైన మానవ విసర్జితాల యూనిట్ నుంచి తొలి ఫలితం వచ్చింది. పట్టణంలో నివాస గృహాల సెప్టిక్ ట్యాంక్‌ల నుంచి సేకరించిన మానవ విసర్జితాలను శుద్ధీకరణ చేసి ఎరువు తయారు చేశారు. స్వచ్ఛ సిద్దిపేటలో భాగంగా గత ఫిబ్రవరిలో సుమారు రూ.2 కోట్లతో ఆర్థికమంత్రి హరీశ్‌రావు పట్టణ శివారులో ఎకరం స్థలంలో మానవ విసర్జితాల శుద్ధీకరణ యూనిట్ ఏర్పాటు చేశారు. పట్టణంలోని 35 వేల నివాస గృహాల నుంచి సెప్టిక్ ట్యాంక్‌లోని మానవ విసర్జితాల ఎఫ్ఎస్టీపీ (ఫికెల్ స్లడ్జ్ ట్రీట్మెంట్ ప్లాంట్)కు తరలిస్తారు. అక్కడ అనారోబిక్ సేఫ్టీలైజేషన్ రియాక్టర్లో విసర్జితాలను మెథనైజేషన్ పద్ధతిలో శుద్ధి చేసి విసర్జితం, నీటిని వేరు చేస్తారు. నీటిని పాలిషింగ్ ఫండ్‌లో పాస్పరేట్, సల్ఫర్ ద్వారా శుద్ధిచేసి ప్యూరిఫైడ్ వాటర్‌గా మార్చుతారు. 18 రోజుల తర్వాత మలం ఎరువుగా మారుతుంది. ఈ ప్రక్రియ మొత్తం సాంకేతికతతో జరుగుతుంది. తొలి ఫలితం సిద్ధం: ఆరు నెలల క్రితం మొదలైన యూనిట్ తొలి ఫలితం నేడు సిద్ధమైంది. లక్షా 20 వేల లీటర్ల సామర్ధ్యం గల శుద్ధీకరణ ప్లాంట్‌లో ప్రతిరోజూ 20 వేల లీటర్ల విసర్జితాలు శుద్ధిచేసే అవకాశం ఉంది. గత ఆరు నెలల్లో 100కు పైగా వాహనాల ద్వారా లక్షా 60 వేల లీటర్ల మానవ విసర్జితాలను సేకరించారు. దాని నుంచి 4వేల కిలోల ఎరు వు, 16 వేల లీటర్ల శుద్ధిచేసిన నీటిని తయారు చేశా రు. నీటిని మున్సిపాలిటీ ఆధ్వర్యంలో జరుగుతున్న హరితహారం మొక్కలకు వినియోగిస్తున్నారు. రూ.5కు కిలో చొప్పున.. సిద్దిపేట పట్టణంలో సెప్టిక్ ట్యాంక్‌ల నుంచి సేకరించిన విసర్జితాలను శుద్ధీకరణ చేసి 4 వేల కిలోల ఎరువు తయారు చేశాం. దాన్ని మున్సిపాలిటీకి రూ. 5కు కిలో చొప్పున విక్రయించే ఆలోచనలో ఉన్నాం. భవిష్యత్‌లో శుద్ధీకరణ లక్ష్యం మరింతగా పెంచుతాం. – రవికుమార్, యూనిట్ ఇన్చార్జ్ -
విష్ణు సహస్రనామావళితో పరివర్తన
సాక్షి, హైదరాబాద్: ఎంఎస్ సుబ్బులక్ష్మి ఆలపించిన విష్ణు సహస్రనామ స్తోత్రం వింటుంటే మనసులోని అలజడులు అదృశ్యమై ప్రశాంతత చేకూరుతుందనే వారి సంఖ్య ఎక్కువే. అందుకే ఉదయం వేళ చాలామంది ఇళ్లలో విష్ణు సహస్ర నామావళి వినిపిస్తూ ఉంటుంది. కానీ, వాటి పఠనం వినసొంపుగానే ఉన్నా, చాలామందికి దాని తాత్పర్యం మాత్రం తెలియదు. తాత్పర్యం తెలిస్తే, ప్రస్తుత సామాజిక పరిస్థితుల్లో ఎదురయ్యే సమస్యల నుంచి బయటపడేలా మనసు కొత్తగా మారిపోతుందంటున్నారు గట్టు వేణుగోపాలా చార్య. అమెరికాలోని ఆర్కన్సాస్ రాష్ట్రం బెంటన్విల్లె సిటీలో శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయంలో అర్చకులుగా పనిచేస్తున్న తెలంగాణకు చెందిన ఆయన.. విష్ణు సహస్ర నామావళి తాత్పర్యంతో సహా జనంలోకి చేరాలని కొత్త ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. విష్ణు సహస్ర నామాల్లోంచి నిత్యం ఓ నామాన్ని దాని తాత్పర్యంతో వివరిస్తూ ప్రస్తుత సామాజిక పరిస్థితుల్లో దాన్ని అన్వయించుకునే విధానాన్ని వివరిస్తూ ఒక నిమిషం పాటు ఉన్న వీడియోను ఆయన వాట్సాప్ గ్రూపులో పోస్ట్ చేస్తారు. ఆ గ్రూపు సభ్యులు ఆ వీడియోను చూసి నామాన్ని పఠించి, దాని తాత్పర్యాన్ని మననం చేసుకోవాలి. దీన్ని ఓ తపస్సులాగా భావించాలని, అలా విష్ణు సహస్ర నామాలను రోజుకు ఒకటి చొప్పున వేయి రోజుల పాటు జనంలోకి తీసుకెళ్తానని చెబుతున్నారు. దీనికి ఇప్పటికే అమెరికా, భారత్ సహా ఇతర దేశాలకు చెందిన వేల మంది భక్తులతో వాట్సాప్ గ్రూపులు ఏర్పడ్డాయని ఆయన పేర్కొన్నారు. భీష్ముడే పాండవులకు ఉపదేశించినట్లుగా ఆ నామాలను వేదవ్యాసుడు అందించాడని పురాణాలు చెబుతున్నాయి. భీష్మ ఏకాదశి నాడు విష్ణు సహస్ర నామావళి అందుబాటులోకి వచ్చాయని చెబుతున్నందున ఈనెల 5న భీష్మ ఏకాదశి నుంచి ఈ ప్రక్రియ ప్రారంభిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. -
సిద్దిపేటలో ‘షాడో’ బ్యూరోక్రాట్స్
సిద్దిపేట జోన్: సిద్దిపేట ప్రజా సమస్యల పరిష్కారానికి మార్గం సుగమం అయ్యేలా మంత్రి హరీష్‌రావు సోమవారం వినూత్న ప్రయోగానికి నాంది పలికారు. తెలంగాణ లోనే తొలి ప్రక్రియగా సిద్దిపేట స్పెషల్ గ్రేడ్ మున్సిపాల్టీలో ఆయా వార్డుల్లో అధికార వికేంద్రీకరణ ప్రక్రియకు తెరలేపారు. డివిజన్ కేంద్రమైన సిద్దిపేటలోని 45 ప్రభుత్వ శాఖాధికారులతో సోమవారం రాత్రి మున్సిపల్ సమావేశ మందిరంలో ప్రత్యేకంగా సమీక్ష నిర్వహించారు. పది లక్ష్యాలతో కూడిన ప్రణాళికను రూపొందించి ఇష్టంతో పని చేయాలని.. కష్టమని భావించిన అధికారులు నిర్భయంగా బాధ్యతల నుంచి తప్పుకోవాలన్నారు. సిద్దిపేటలో షాడో వ్యవస్థ రూపకల్పనను మంత్రి స్పష్టీకరించారు. సిద్దిపేట స్పెషల్ గ్రేడ్ మున్సిపాల్టీలో 34 వార్డులున్నాయి. సుమారు35 వేల కుటుంబాల్లో 1.50 లక్షల జనాభా ఉన్నట్లు తేలింది. ఆయా శాఖల అధికారులతో ముందు సమగ్ర వివరాలను సేకరించాలన్నారు. ప్రజలకు ప్రభుత్వ పక్షాన అందించాల్సిన సేవలు, మున్సిపల్ అధికారుల పని తీరును ఎప్పటికప్పుడు వివిధ శాఖల అధికారులు పర్యవేక్షించి, పరిశీలించి తన దృష్టికి తీసుకురావాలని కోరారు. పట్టణ ప్రజలకు మున్సిపల్ పక్షాన మెరుగైన సేవలను అందించాలన్నారు. ప్రతి వార్డుకు మున్సిపల్ అధికారులకు చేయూతగా ప్రత్యేకాధికారులుగా 34 మంది స్పెషల్ ఆఫీసర్ల నియామకం వారి బాధ్యతలను గురించి వివరించారు. ప్రతి 15 రోజులకోసారి సిద్దిపేట ఆర్డీఓ నేతృత్వంలో ప్రత్యేక సమావేశం ఉంటుందని, ప్రతి నెలకోసారి ప్రత్యేకాధికారులతో తానే స్వయంగా మాట్లాడతానని క్షేత్రస్థాయిలో ఎదురయ్యే సమస్యల్ని, పరిష్కరిస్తున్న విషయాలను ఎప్పటికప్పుడు నివేదిక రూపొందిస్తానని మంత్రి హరీష్‌రావు స్పష్టం చేశారు. ప్రతి అధికారి ఒక వార్డును దత్తత తీసుకొని వారంలో మూడు రోజులు వార్డుల్లో పర్యటించాలని స్పష్టం చేశారు. ప్రధానంగా తాగునీటి సరఫరా, వీధి దీపాల సమస్యలు, చెత్త సేకరణ, పట్టణంలోని ఆయా వార్డుల్లో చేపడుతున్న అభివృద్ధి పనులపై నిఘా, ప్రతి ఇంటికి మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఆయా వార్డులకు బాధ్యులుగా నియమింపబడిన ప్రభుత్వ అధికారులు స్వీకరించాలని కోరారు. ఈ సమీక్షలో ఎమ్మెల్సీ సుధాకర్‌రెడ్డి, మున్సిపల్ ప్రత్యేకాధికారి ముత్యంరెడ్డి, మున్సిపల్ కమిషనర్ రమణాచారితో పాటు ముఖ్య అధికారులు, సిబ్బంది, మున్సిపల్ యంత్రాంగం పాల్గొంది. -
ఇంజిన్లకు కిక్!
- ఆల్కహాల్‌తో ప్రత్యామ్నాయ ఇంధనం - ‘విశాఖ’ విద్యార్థుల వినూత్న ప్రయోగం విశాఖపట్నం, న్యూస్‌లైన్: ఆల్కహాల్‌తో వాహనాలను నడపవచ్చంటున్నారు విశాఖ జిల్లా నరవలోని విశాఖ టెక్నికల్ క్యాంపస్ విద్యార్థులు. ఇటీవల కోర్సు పూర్తిచేసిన బీటెక్ మెకానికల్ విద్యార్థులు ప్రాజెక్టు వర్క్‌లో భాగంగా ఒక ద్విచక్ర వాహనం ఇంజిన్‌ను తీసుకుని దానిని పనిచేయించేందుకు ఇథనాల్ (ఈథైల్ ఆల్కహాల్)ను ఉపయోగించి విజయం సాధించారు. ప్రస్తు తం ఉపయోగిస్తున్న పెట్రోల్‌కు బదులుగా ఇథనాల్‌ను ఉపయోగించవచ్చని చెబుతున్నారు. మెకానికల్ విభాగాధిపతి జి.శివకరుణ, ప్రిన్సిపాల్ సరోజ్‌కుమార్ పాఢి సారథ్యంలో విద్యార్థులు లోకేష్, బాలకృష్ణ, విశ్వాస్, శివకృష్ణ, గంగాధర్ ఈ ప్రయోగాన్ని నిర్వహించారు. పెట్రోల్‌తో 69 కిలోమీటర్లు నడిచే ఒక ద్విచక్ర వాహనం ఇంజిన్‌ను తీసుకుని ఇథనాల్ ఆల్కహాల్‌ను ప్రయోగించారు. దీని ద్వారా మైలేజి 90 కిలోమీటర్లకు పెరిగింది. కాలుష్యం 50 శాతానికి తగ్గింది. ఇథనాల్‌ను ఉపయోగించడంవల్ల ఇంజిన్ పనితీరులో ఎలాంటి మార్పు రాకపోవడం గమనార్హం.