సిద్దిపేట జోన్: సిద్దిపేట ప్రజా సమస్యల పరిష్కారానికి మార్గం సుగమం అయ్యేలా మంత్రి హరీష్‌రావు సోమవారం వినూత్న ప్రయోగానికి నాంది పలికారు. తెలంగాణ లోనే తొలి ప్రక్రియగా సిద్దిపేట స్పెషల్ గ్రేడ్ మున్సిపాల్టీలో ఆయా వార్డుల్లో అధికార వికేంద్రీకరణ ప్రక్రియకు తెరలేపారు. డివిజన్ కేంద్రమైన సిద్దిపేటలోని 45 ప్రభుత్వ శాఖాధికారులతో సోమవారం రాత్రి మున్సిపల్ సమావేశ మందిరంలో ప్రత్యేకంగా సమీక్ష నిర్వహించారు.
పది లక్ష్యాలతో కూడిన ప్రణాళికను రూపొందించి ఇష్టంతో పని చేయాలని.. కష్టమని భావించిన అధికారులు నిర్భయంగా బాధ్యతల నుంచి తప్పుకోవాలన్నారు. సిద్దిపేటలో షాడో వ్యవస్థ రూపకల్పనను మంత్రి స్పష్టీకరించారు. సిద్దిపేట స్పెషల్ గ్రేడ్ మున్సిపాల్టీలో 34 వార్డులున్నాయి. సుమారు35 వేల కుటుంబాల్లో 1.50 లక్షల జనాభా ఉన్నట్లు తేలింది. ఆయా శాఖల అధికారులతో ముందు సమగ్ర వివరాలను సేకరించాలన్నారు.
ప్రజలకు ప్రభుత్వ పక్షాన అందించాల్సిన సేవలు, మున్సిపల్ అధికారుల పని తీరును ఎప్పటికప్పుడు వివిధ శాఖల అధికారులు పర్యవేక్షించి, పరిశీలించి తన దృష్టికి తీసుకురావాలని కోరారు. పట్టణ ప్రజలకు మున్సిపల్ పక్షాన మెరుగైన సేవలను అందించాలన్నారు. ప్రతి వార్డుకు మున్సిపల్ అధికారులకు చేయూతగా ప్రత్యేకాధికారులుగా 34 మంది స్పెషల్ ఆఫీసర్ల నియామకం వారి బాధ్యతలను గురించి వివరించారు.
ప్రతి 15 రోజులకోసారి సిద్దిపేట ఆర్డీఓ నేతృత్వంలో ప్రత్యేక సమావేశం ఉంటుందని, ప్రతి నెలకోసారి ప్రత్యేకాధికారులతో తానే స్వయంగా మాట్లాడతానని క్షేత్రస్థాయిలో ఎదురయ్యే సమస్యల్ని, పరిష్కరిస్తున్న విషయాలను ఎప్పటికప్పుడు నివేదిక రూపొందిస్తానని మంత్రి హరీష్‌రావు స్పష్టం చేశారు. ప్రతి అధికారి ఒక వార్డును దత్తత తీసుకొని వారంలో మూడు రోజులు వార్డుల్లో పర్యటించాలని స్పష్టం చేశారు.
ప్రధానంగా తాగునీటి సరఫరా, వీధి దీపాల సమస్యలు, చెత్త సేకరణ, పట్టణంలోని ఆయా వార్డుల్లో చేపడుతున్న అభివృద్ధి పనులపై నిఘా, ప్రతి ఇంటికి మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఆయా వార్డులకు బాధ్యులుగా నియమింపబడిన ప్రభుత్వ అధికారులు స్వీకరించాలని కోరారు. ఈ సమీక్షలో ఎమ్మెల్సీ సుధాకర్‌రెడ్డి, మున్సిపల్ ప్రత్యేకాధికారి ముత్యంరెడ్డి, మున్సిపల్ కమిషనర్ రమణాచారితో పాటు ముఖ్య అధికారులు, సిబ్బంది, మున్సిపల్ యంత్రాంగం పాల్గొంది.
సిద్దిపేటలో ‘షాడో’ బ్యూరోక్రాట్స్
Published Tue, Feb 24 2015 12:31 AM | Last Updated on Sat, Sep 2 2017 9:47 PM
Advertisement
Advertisement